తితలీ : రెక్కలు బలహీనమైనా స్వేచ్చగా యెగురుతుంది

0
2

[box type=’note’ fontsize=’16’] “వొక మంచి చిత్రం వున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు గాని, లోపాలు గాని యెంచి లాభం లేదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘తితలీ’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

ఈ సారి అమేజాన్ లో నేను చూసిన తితలీ ని ఇప్పట్లో మరిచిపోలేను. కను బెహెల్ తీసిన మొదటి చిత్రం. ఇతను ఇంతకు ముందు దిబాకర్ బనర్జీ కి అసిస్టెంటుగా ఓయ్ లకీ! లకీ ఓయ్ చిత్రానికి చేశాడు. దిబాకర్ దే లవ్ సెక్స్ ఔర్ ధోఖ చిత్రానికి స్క్రిప్టు లో భాగస్వామి. ఈ చిత్రంలో స్క్రిప్టు శరత్ కటారియా (దం లగా కె హైస్సా, సుయీ ధాగా వగైరా) తో కలిసి వ్రాశాడు. ఇక ముఖ్య పాత్రలలో రెండు పోషించింది కూడా కొత్తవారే : శశాంక్ అరోరా, శివాని రఘువంశి. అప్పటికీ సినెమా యెంత చక్కగా వచ్చిందో చెప్పలేను.

కథ క్లుప్తంగా చెప్పడం ఆనవాయితీ. సమీక్షలో కథ సాంతం చెప్పకూడదు. సినెమా చూడబోయే ప్రేక్షకుడికి కొంత చూసేదాకా తెలియకపోవడం అవసరం. అయితే సస్పెన్స్ చిత్రాలలో సస్పెన్స్ ని దాచిపెట్టి కథ చెప్పడం కొంత తేలిక. ఇలాంటి చిత్రాలలో కష్టం. సరే స్క్రిప్టు గురించి, నటన గురించి దేని గురించి మాట్లాడాలన్నా ముందు కథ గురించి మాట్లాడక తప్పదు. ఢిల్లీ లోని జమునా పార్ ప్రాంతంలో (అది కాస్త వెనుకబడిన ప్రాంతం) వుంటున్న కుటుంబం. తండ్రి (దర్శకుడి నిజ జీవితంలో తండ్రి లలిత్ బెహెల్), పెద్దకొడుకు విక్రం (రణవీర్ షోరి), నడిమివాడు బావలా (అమిత్ సియాల్), చిన్నోడు తితలీ (శశాంక్ అరోరా). వరుసగా ఇద్దరు కొడుకులను కన్న ఆ తల్లి మూడోసారి కడుపుతో వున్నప్పుడు తనకు కూతురు పుట్టాలని, ఆ పుట్టిన కూతురికి తితలీ అంటే సీతాకోకచిలుక అని పేరు పెట్టుకోవాలని సరదా పడిందట, కాని అబ్బాయి పుట్టేసరికి వాడికే ఆ పేరు పెట్టి తృప్తిపడిందట. మొదట్లోనే విక్రం కూతురు పుట్టినరోజుకి పాప ఇంట్లో తాత వొళ్ళో వుంటుంది. బయట విక్రం, అతని భార్య, అతని తమ్ముళ్ళు బండి నుంచి ఫర్నిచర్ దింపిస్తూ వుంటారు. ఆ ట్రక్కు వానితో విక్రంకి గొడవై అది కొట్టుకోవడం వరకూ వెళ్తుంది. ఇంట్లో అడుగే పెట్టని అతని భార్య బయటి నుంచి బయటికే వెళ్ళిపోతుంది. ఇదంతా ఇలా యెందుకున్నది, భార్యా భర్తలు వేరుగా యెందుకుంటున్నారు వగైరాలన్నీ సినెమా చూస్తుంటే నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ కుటుంబానికి తెలిసిన వొకే విద్య దోపిడి, గుండాగిరి. తమ్ముణ్ణి పావులా వాడుకుని హైవేలో కారు ఆపించి అన్నలిద్దరు దోచుకోవడం. ఇది వాళ్ళ వ్యాపారం. అది నచ్చకే విక్రం భార్య అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. తితలీ కి ఇదంతా వదిలి పారిపోవాలని వుంటుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాడు, విఫలమవుతుంది. ఇప్పుడిక వీణ్ణి దారికి తేవాలంటే వీడి పెళ్ళి చేసెయ్యాలని అన్నలు నిర్ణయిస్తారు. వచ్చే ఆ అమ్మాయిని కూడా తాము చేసే దోపిడీలలో పావుగా వాడుకోవచ్చని ప్లాను. అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరిగి కథ అంతమవుతుంది. ఆ పెళ్ళి చూపులప్పుడు, పెళ్ళప్పుడు కూడా ఇద్దరికీ ఇష్టం లేనట్టే కనిపిస్తారు. మొదటి రాత్రి ఆమెను లొంగదీసుకోవాల్సిన పరిస్థితి తితలీది. అతని భార్య నీలు (శివాని రఘువంశి) వాస్తవానికి వేరొకతన్ని ప్రేమిస్తుంటుంది. వొక్కో పాత్ర మెదడులో వొక్కో లాంటి ఆలోచనలు. ముఖ్యంగా తితలీ చుట్టూ తిరుగుతుంది. ఇదంతా వదిలేసి ఈ సాలెగూట్లోంచి బయట పడతాడా? ప్రిన్స్ అనే వివాహితుడిని ప్రేమిస్తున్న నీలు తను కోరుకున్నట్టు అతన్ని కలవగలుగుతుందా? ఇవన్నీ చూడాల్సిందే తప్ప చెప్పడం అంటూ చేస్తే చప్పగా వుంటుంది.

సరే, ఇక నాకు ఈ చిత్రం యెందుకు నచ్చిందీ అంటే వొక పక్క పక్కాగా వ్రాసుకున్న స్క్రిప్టు, మరోపక్క అద్భుతమైన నటన. తన తొలి చిత్రమే అయినా కను బెహెల్ చాలా మంచి చిత్రం అందించాడు. రణవీర్ షోరి మనకున్న మంచి నటులలో వొకడు. ఈ చిత్రంలోనైతే అతను అనితర సాధ్యంగా చేశాడు. అలాగే మొదటి సారి చేస్తున్నా శశాంక్ అరోరా (తర్వాత లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా లో కూడా చేశాడు), శివాని రఘువంశిలు కూడా బాగా చేశారు. ఇక లలిత్ బెహెల్ వొక సీనియర్ నటుడు. ఇందులో మొదటి సగంలో దాదాపు అతను తచ్చాడుతూ కనబడడమే కాని సంభాషణలు వుండవు. కాని ఆ చూపులతోనే ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని మన కళ్ళ ముందు పరిచేస్తాడు. అంత బాగా చేశాడు. సిద్దార్థ్ దివాన్ చాయాగ్రహణం దర్శకుడి విజన్ కి అనుగుణంగా సాగిపోతుంది. ఇరుకు ఇంట్లో తక్కువ వెలుతురులో ఒక లాగా, బయటి షాట్లు అన్నీ కాంక్రీటు మీద ఫోకస్ చేస్తూ. ఇక ఆ కదలికలు కూడా అర్థావంతంగా. వొక నిర్మాణంలో వున్న కట్టడం దగ్గర స్నేహితునితో అక్కడి పార్కింగ్ కొనుగోలు గురించి మాట్లాడుకుని, తక్కువ పడుతున్న డబ్బుల గురించీ, తన ఆశయం గురించీ ఆలోచిస్తూ స్కూటర్ వెనక కూర్చున్న తితలీ కనుమరుగయ్యే దాకా ఆ కట్టడాన్నే చూస్తుంటాడు. ఇక ఆ ఇంటి చిన్నచిన్న గదుల మధ్య వున్న కాస్తంత వరండాలో అమర్చిన వాష్ బేసిన్ దగ్గర యెవరో వొకరు బ్రష్ చేసుకుంటూ వుంటారు. మరో పక్క మరొకరు తింటూ వుండడమో, యేదో ముఖ్యమైన సంభాషణో, మలుపో పెట్టడం వొక రకమైన విచిత్రమైన భావనలు కలిగిస్తుంది. అదంతా అంత శశక్తంగా మన ముందుకు రావడం వెనుక కరణ్ గౌర్ సంగీతం కూడా వుంది. 80లలో వచ్చిన అజిత్ వర్మన్ సంగీతం లాంటి సంగీతం. ఇందులో కొన్ని ఘట్టాలు అతని సంగీతంతో సహా గుర్తుండిపోతాయి. స్క్రిప్ట్ బలం రెండు చోట్ల కనిపిస్తుంది. రక్త మాంసాలున్న పాత్రలను తీర్చి దిద్దడం ద్వారా. విడాకులకు అనుకున్న సొమ్ము వారం రోజుల్లో ఇవ్వాల్సిందిగా ఒప్పందం అవుతుంది విక్రం కీ అతని భార్యకీ మధ్య. కాని వారంలో అంత సొమ్ము ఎలా తెచ్చేది. ఏడెనిమిది దోపిడీలు చేయాల్సి వుంటుంది. వారంలో కష్టం. అందుకని చెప్పి గడువు పెంచమని అడగడానికి తితలీ, నీలు వెళ్తారు. విక్రం భార్య ఆ వొక్క సన్నివేశంలో తన మనసులో వున్న గోడు వెళ్ళగక్కుతూ, దానితోపాటు పూర్వ కథ చాలా చెప్పేస్తుంది. ఇది ఆ పాత్రలను, ఆ కథను ఏకకాలంలో చెబుతాయి. ఇక రెండో సంగతి కథ ను చాలా నెమ్మదిగా, సహజంగా ముడులు విప్పుతూ చెప్పడం. ఒక్కో విషయం తెలుస్తున్న కొద్దీ విస్మయం కలుగుతుంది. వాళ్ళ మనస్తత్త్వాల గురించి, వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తూ విస్తుపోతాము. మానసిక వొత్తిడి తీవ్రంగా పెరిగిపోయి కడుపులో దేవినట్టు అయ్యి, వొక వాంతి (catharsis) అయిపోతే మనశ్శరీరాలు తేలికపడతాయి అన్నది మన అనుభవం. దాన్ని ప్రత్యేకంగా చెప్పకుండా చివర్లో తితలీ పాత్రకు అన్వయించి ఆ మాత్రం చెబుతుంది స్క్రిప్టు. ఇక చిట్ట చివరి సన్నివేశం నాకు కాస్త అపనమ్మకం కలిగించింది. అతను ఆ సాలెగూట్లోంచి తప్పించుకోవాలి అని మొదటి నుంచీ అనుకున్నదేగా అనుకుంటే సబబుగా అనిపిస్తుంది. కాని భార్యతో కొన్ని సన్నివేశాలలో అతని ఆలోచనా సరళి, ప్రవర్తనా చూసి ఇది సాధ్యమా అనిపిస్తుంది.

సరే వొక మంచి చిత్రం వున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు గాని, లోపాలు గాని యెంచి లాభం లేదు. అనురాగ్ కాశ్యప్ తీసిన దేవ్ డి, అగ్లీ లాంటి చిత్రాలు మీకు నచ్చి వుంటే ఇది కూడా నచ్చుతుంది. నేను కను బెహెల్ నుంచి ఇంకా ఇంకా చిత్రాలు రావాలని ఎదురు చూస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here