తోడు

0
2

[dropcap]“రా [/dropcap]విశ్వనాధం.. రా.. నీ గురించే అనుకుంటున్నాను” ఆహ్వానించాడు జగన్నాధం.

విశ్వనాధం వచ్చి కుర్చీలో కూర్చుని టీపాయి మీద ఉన్న ఫోటోలు చూసి ఏమిటన్నట్టు జగన్నాధం కేసి చూసాడు. జగన్నాధం హాలులో ఉన్న భార్య ఫోటో వైపు ఓ సారి చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు.

“వర్ధనం నన్ను విడిచి వెళ్ళిపోయి రెండేళ్ళు అయ్యిందని నీకూ తెలుసుగా. నా పెద్ద కొడుకు కంపెనీలో మేనేజర్. కోడలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఉదయం తొమ్మిది గంటలకు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకంటే ముందే మనవలు స్కూళ్ళకు వెళ్తారు. పొద్దున్న సమయంలో మాట్లాడటానికే వీలు కాదు. సాయంత్రం భార్యా, భర్త ఆఫీస్ కబుర్లు, పిల్లల చదువుల విషయం చూడడం. నా కొడుకు కనుబొమలు ఎగరేసి ‘బావున్నావా?’ అన్నట్టు తలూపుతాడు, అదీ ఫోనులో ఎవరితోనో మాట్లాడుతూ.

నేను ఓ వెర్రి నవ్వు నవ్వి తలాడిస్తాను ‘బాగున్నాను’ అన్న అర్థం వచ్చేటట్టుగా. ఆదివారం ఒక్క రోజు నా కోసం ఒక అరగంట కేటాయిస్తాడు నా కొడుకు, నా యోగక్షేమాలు కోసం. దానికే నేను మురిసి, మైమరచి పోవాలి. ఆర్నెల్లు ఉందామనుకున్నవాడిని రెండు నెలలకే ఇంటికి వచ్చేసాను, ఆ బందిఖానాలో ఉండలేక” అంటూ మరోసారి నిట్టూర్చాడు జగన్నాధం.

విశ్వనాధం చిన్నగా నవ్వాడు, ఈ రోజుల్లో పిల్లలు అందరూ అంతే అన్నట్టుగా. తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు జగన్నాధం.

“రెండో అబ్బాయి చెన్నై. రెండో కోడలు జాబు చేయదు. ఇంట్లోనే ఉంటుంది. అమ్మయ్య అనుకుని వాడి దగ్గరకు వెళ్లాను. వాడు ఓ మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజర్. ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళినవాడు రాత్రి ఎనిమిది గంటలకు వస్తాడు. కోడలుకు ‘టిక్ టాక్’ పిచ్చి అని అక్కడికి వెళ్ళాకా తెలిసింది. నాకు భోజనం టేబుల్ మీద సర్దేసి ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళిపోతుంది ‘టిక్ టాక్’ షూటింగులకి. పొద్దుపోయాకా ఎప్పుడో వస్తుంది ఇంటికి. అంత వరకూ నేను చేసే పని టి.వి. చూడడం లేదా గది గోడలకేసి చూడడం. ఈ అయోమయ వాతావరణంలో ఇమడలేక నెల రోజులకే శివపురం వచ్చేసాను” ఆవేదనగా అన్నాడు జగన్నాధం.

“అవన్నీ సరే. ఈ ఫోటోలు ఏమిటి?” అడిగాడు విశ్వనాధం.

“ఈ సమయంలో నాకో తోడు కావాలనిపించింది. అందుకే పేపర్లో ప్రకటన ఇచ్చాను. రెండో పెళ్లి చేసుకుంటానని. ఆ సందర్భంగా వచ్చిన ఫోటోలు ఇవి” అన్నాడు జగన్నాధం టీపాయి మీద ఉన్న ఫోటోలను మరోసారి చూస్తూ. అతని మాటలకు నివ్వెర పోయాడు విశ్వనాధం.

“అంటే నలభై సంవత్సరాలు నీ కష్ట సుఖాలలో పాలు పంచుకుని, నీ కుటుంబం కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి వర్ధనమ్మ జ్ఞాపకాలను తుడిచేసి, నీ సుఖం చూసుకుందామని నిర్ణయించుకున్నావా? ఇది చాలాదారుణం జగన్నాధం” నిష్టూరంగా అన్నాడు విశ్వనాధం.

“అంటే రోజూ మా ఆవిడ ఫోటో చూస్తూ, విషాద గీతాలు పాడుకుంటూ గడిపెయమంటావా?” చిరాగ్గా అన్నాడు జగన్నాధం. మిత్రుడి మాటలకు ‘మనిషి ఎంత స్వార్ధపరుడిగా మారిపోతున్నాడు’ అని బాధపడ్డాడు విశ్వనాధం.

“చూడు జగన్నాధం. నీకు ఇప్పుడు అరవై ఆరు ఏళ్ళు. బి.పి.,షుగర్ రెండూ ఉన్నాయి నీకు. మహా అయితే పదేళ్లో, పదిహేను ఏళ్ళు బతుకుతావు. అంతవరకూ ఆ వచ్చే ఆవిడ నీకు చాకిరీ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆవిడ పరిస్థితి ఏమిటి? కన్నతండ్రివి నిన్నే చూడని వాళ్ళు, సవతి తల్లిని చూస్తారా? ఆవిడ గురించి కూడా నువ్వు ఆలోచించు” అనునయంగా అన్నాడు విశ్వనాధం.

“నేను గెజెటెడ్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఏభైవేలు పెన్షన్ వస్తోంది. నా తర్వాత ఆవిడకు నా పెన్షన్ వస్తుంది. ఈ ఇల్లు వుంది. బ్యాంకులో పదిహేను లక్షలు డిపాజిట్ ఉంది. ఆవిడకి ఏం లోటు ఉండదు” లాజిక్‌గా అన్నాడు జగన్నాధం.

“నీ తర్వాత, వయసు పైబడి చూసేవారు లేక ఆవిడ ఇబ్బంది పడుతుందిగా?”

“నా పెన్షన్, ఆ బ్యాంకులో డబ్బుతో ఆవిడ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరవచ్చు” తేలిగ్గా అన్నాడు జగన్నాధం.

“ఆ పని ఏదో నువ్వే చెయ్యవచ్చుగా. ఈ రోజుల్లో డబ్బున్నవారికి ఖరీదైన ఆశ్రమాలు ఉన్నాయి. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. కాలక్షేపానికి లోటు ఉండదు. మెడికల్ అబ్జర్వేషన్ ఉంటుంది. నీ కోసం, నీ సుఖం కోసం మరో ఆడదాని జీవితం సమస్యల పాలు చేయకు. తోడు కావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మరోసారి ఆలోచించు” అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాధం. అతను ఏ విషయమైనా సూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు. అందుకే ఆఫీసర్ కాలేక, సూపర్నెంట్ గానే రిటైర్ అయ్యాడు.

విశ్వనాధం వెళ్ళాకా చాలాసేపు ఆలోచించాడు జగన్నాధం. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు.

***

ఒక వారం రోజులు గడిచాకా జగన్నాధం ఇంటికొచ్చిన విశ్వనాధం ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. పద్నాలుగు, పదిహేను ఏళ్ళు ఉన్న అమ్మాయికి జగన్నాధం ఇంగ్లీష్ గ్రామర్ చెబుతున్నాడు.

“రా విశ్వనాధం.. రా..” అని నవ్వుతూ ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చుంటూ “ఈ అమ్మాయి..?” అని సందేహంగా అడిగాడు విశ్వనాధం.

“మా అమ్మాయే. పేరు తేజస్విని. ఆ.. తేజూ ఈయన నా బెస్ట్ ఫ్రెండ్. విశ్వనాధం” అని ఆ అమ్మాయికి పరిచయం చేసాడు జగన్నాధం. “నమస్తే అంకుల్” అని తేజస్విని నమస్కరించింది.

“దీర్ఘాయుష్మాన్ భవ” అని ఆశీర్వదించాడు విశ్వనాధం.

“తేజూ, నువ్వు లోపలకు వెళ్లి చదువుకో అమ్మా. నేను అంకుల్‌తో మాట్లాడాలి” అన్నాడు జగన్నాధం. “అలాగే నాన్నగారూ” అని పుస్తకాలు తీసుకుని లోపలకు వెళ్ళింది.

విశ్వనాధం అయోమయంగా జగన్నాధం కేసి చూసి “ఏమిటి ఇదంతా? ఆ అమ్మాయి నిన్ను నాన్నా అని పిలుస్తోంది. నాకంతా గందరగోళంగా ఉంది జగన్నాధం.. విషయం ఏమిటో చెప్పు” అన్నాడు ఆసక్తిగా.

“నువ్వు ఆ రోజు నాకు హితబోధ చేసాకా నేను చాలాసేపు ఆలోచించాను. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. ఇంకొక ఆమెని నా జీవితంలోకి ఆహ్వానించాకా నా పిల్లలు, ఆమె పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో? అని సందేహం కలిగింది. కుటుంబంలో లేని పోని గొడవలు వస్తాయేమోనని అనుమానం కలిగింది. నువ్వు చెప్పినట్టుగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఆశ్రమంలో చేరితే నాకు తోచుబడి ఉంటుంది. నలుగురితో కొత్త స్నేహాలు ఏర్పడతాయి అని కూడా భావించాను. కానీ నా జీవితానికి పరమార్థం లేకుండా పోతుందని గ్రహించాను. ఈ మలి సంధ్యాజీవితంలో నా వలన ఎవరికైనా మంచి జరిగితే పైనున్న వర్ధనం కూడా సంతోషిస్తుందన్న ఆలోచన నాకు కలిగింది. మర్నాడే అనాథ ఆశ్రమానికి వెళ్లి తేజస్వినిని దత్తత తీసుకుంటానని చెప్పాను. ఆశ్రమం వాళ్ళు నా హోదా, నా ప్రస్తుత పరిస్థితి చూసి అభ్యంతరం చెప్పలేదు. రెండు రోజులు క్రితమే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి తేజస్వినిని ఇంటికి తీసుకు వచ్చాను. తను పదవతరగతి పాస్ అయ్యింది. ఇంటర్మీడియట్‌లో చేర్చాలి. తేజస్వినిని ఒక మంచి లెక్చరర్ గా చేయాలని నా ఆకాంక్ష. ఆమె కూడా దానికి అంగీకరించింది. ఇదీ సంగతి. నువ్వు కూడా అప్పడప్పుడు వచ్చి తేజస్వినికి చక్కని సలహాలు, సూచనలు ఇస్తూ ఉండు. నాకు ఇద్దరూ మొగపిల్లలే. ఆడపిల్లలు లేని లోటు తేజస్విని వలన తీరుతుందని ప్రగాడంగా నమ్ముతున్నాను” బలంగా ఊపిరి వదిలి అన్నాడు జగన్నాధం.

విశ్వనాధం మనసు పులకించిపోయింది జగన్నాధం మాటలకు. తన కుర్చీలోంచి లేచి జగన్నాధం పక్కనే కూర్చున్నాడు. మిత్రుడు భుజాలచుట్టూ ఆప్యాయంగా చేతులు వేశాడు.

“జగన్నాధం నువ్వు చేస్తున్నపని చాలా గొప్పది. అనాథ అయిన ఆడపిల్ల కాలేజీలో చేరి చదువుకునేటప్పుడు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేజస్వినిని దత్తత తీసుకుని తండ్రిగా ఆమెకు ఒక రక్షణ కవచంగా నిలిచావు. నీకు ఆమె ‘తోడు’ కాదు. నువ్వే ఆమెకు ‘తోడు’. నువ్వు నా స్నేహితుడివైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తేజస్విని నీ కలల్నితప్పక సాకారం చేస్తుంది. ఆ నమ్మకం నాకు కూడా ఉంది”అన్నాడు ఉద్వేగంగా విశ్వనాధం.

“మిత్రమా, నిన్ను నేనొక కోరిక కోరాలని అనుకుంటున్నాను. నువ్వు కాదనకూడదు” విశ్వనాధం రెండు చేతులూ పట్టుకుని అడిగాడు జగన్నాధం. ‘అలాగే చెప్పు’ అన్నాడు విశ్వనాధం.

“తేజస్విని చదువు మధ్యలో ఆగకూడదు. ఒకవేళ నాకు అనుకోని అనర్థం జరిగి, నేను లేకపోతే నువ్వు తేజస్విని చదువు, వివాహ బాధ్యత తీసుకోవాలి. నా ఆశయం మధ్యలో ఆగిపోకూడదు. దానికి తగిన ఆర్థిక వనరులు సమకూర్చే ఉంచాను. అనాథ ఆశ్రమంలో గార్డియన్‌గా నీ పేరు కూడా రాశాను, ఎందుకైనా మంచిదని” అన్నాడు జగన్నాధం.

“నీకు ఏం కాదు. మంచి మనసుతో నువ్వు ప్రారంభించిన ఈ యజ్ఞం దిగ్విజయంగా పూర్తి అవుతుంది. నువ్వే ఆ ఫలితాల్ని నీ కళ్ళారా చూస్తావ్. అయినా నీ ధైర్యం కోసం చెబుతున్నాను. తేజస్విని నాకు కూడా కూతురే. ఆమె పూర్తి బాధ్యత నేను వహిస్తాను. అందులో సందేహం లేదు. సరేనా” భరోసా ఇచ్చాడు విశ్వనాధం.

జగన్నాధం మనసు ప్రశాంత గోదావరిలా హాయిగా ఉంది మిత్రుని మాటలకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here