Site icon Sanchika

తోడు

[dropcap]“ఏం[/dropcap] బసవయ్యా? మీ అమ్మాయి సీతామహాలక్ష్మి పెళ్ళీడుకొస్తోంది కదా?! సంబంధాలు చూస్తున్నారా?”, అని అడిగాడు బసవయ్యను పలకరించిపోదామని అతడి ఇంటికి వచ్చిన లక్ష్మన్న.

“లేదురా! నా సీతమ్మను పై చదువులకోసం పట్నం పంపిస్తున్నా!”, చెప్పాడు బసవయ్య.

“ఏంటీ?? సీతను పట్నం పంపుతావా? జాగ్రత్తరోయ్! అక్కడ వయసులో ఉన్న ఆడపిల్లలను వేధించే మగాళ్ళుంటారు!! అసలే మన సీత అందంగా ఉంటుంది”, అన్నాడు లక్ష్మన్న బసవయ్యను హెచ్చరిస్తున్నట్లుగా.

“పట్నంలో క్షేమంగా ఉండేందుకు సీతకు కావలసినవన్నీ నేనే స్వయంగా వెళ్లి ఏర్పాటు చేసి వస్తాలే! చిన్నప్పుడు నాకు పట్నం వెళ్లి చదువుకోవాలని చాలా కోరిగ్గా ఉండేది. కానీ నా కల తీరేలోపే నా మీద సంసార బాధ్యతలు పడ్డాయి. దాంతో చదువును మధ్యలోనే ఆపేసి వ్యవసాయం చూసుకోవాల్సి వచ్చింది. నా కూతురు చక్కగా కాలేజీకి వెళ్లి బాగా చదువుకుని, నా చిన్ననాటి కల నిజం చేస్తే చూడాలని ఉందిరా!”, అని తన మనసులో మాట చెప్పాడు బసవయ్య.

బసవయ్య మాటలు విన్న సీత ముసిముసి నవ్వులు నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది.

రామచంద్రాపురమనే పల్లెటూరిలో బసవయ్య సాధారణ రైతు. తన ఒక్కగానొక్క కూతురు సీతంటే బసవయ్యకు ప్రాణం. సీత చాలా తెలివైన పిల్ల. పదవ తరగతిలో సీతకు మంచి మార్కులు రావడంతో పై చదువులకు పట్నం పంపించమని సలహా ఇచ్చాడు సీతకు చదువు నేర్పిన రాఘవయ్య. ఆర్థికంగా తమకు కష్టమైనా, సీత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీతను పట్నంలో బాగా పేరున్న ఒక పెద్ద కాలేజీలో చేర్పించాడు బసవయ్య. కాలేజీలో తరగతులు మొదలవ్వడానికి ఇంకా రెండు రోజులున్నాయనగా బసవయ్య సీతకు కావలసిన బట్టలూ, పుస్తకాలూ సంచుల్లో సద్ది, సీతనూ, తన భార్య పార్వతినీ తీసుకుని పట్నానికి బయలుదేరాడు. తన కూతురు పేరుప్రతిష్ఠలున్న మంచి కాలేజీకి వెడుతోందని బసవయ్యకు పైకి సంతోషంగానే అనిపిస్తూ ఉన్నా, యుక్త వయసులోకి వచ్చిన సీత పట్నంలో ఇబ్బందులు పడకుండా ఉండగలదో లేదోనన్న దిగులు అతడిని లోలోపల తెగ బాధిస్తోంది.

కాలేజీ ఆవరణకు చేరుకున్న బసవయ్య, సీత సామానును కాలేజీ వసతిగృహంలో సీతకు ఇచ్చిన గదిలో పెట్టి, “అమ్మా! సీతమ్మా! నా బంగారు తల్లివి నువ్వు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ఇంత పెద్ద పట్నంలో ఒక్కదానివి ఒంటరిగా ఎలా ఉంటావో ఏమిటో?! జాగ్రత్తమ్మా! మా ప్రాణాలన్నీ నీమీదే!”, అన్నాడు.

“పర్వాలేదులే నాన్నా! భయపడకండి. జాగ్రత్తగానే ఉంటాను. నీ ఆరోగ్యం, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త!”, చెప్పింది సీత.

“కానీ నిన్నెలా వదిలి వెళ్ళేదీ??”, కన్నీటిని తుడుచుకుంటూ అన్నాడు బసవయ్య.

సీత సమాధానం ఇచ్చేలోపు పార్వతి బసవయ్యతో, “ఏవండీ! మీరు కాస్త ఆగుతారా? మీ మాటలతో మనమ్మాయిని కంగారు పెట్టకండి!”, అంటూ సీతతో, “సీతమ్మా! ఒంటరిగా ఉండటం గురించి బాధ పడకు. చక్కటి గుణం, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళతో స్నేహం చెయ్యి. మగవాళ్ళతో చనువుగా తిరిగితే నీ వయసునుబట్టి లోకం అనేక రకాలుగా అనుకుంటుంది. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం ఎంతైనా అవసరం. భగవంతుడు అన్నివేళలా నీకు తోడుండి సమస్యలొచ్చినప్పుడు ఆయనే సరైన మార్గం చూపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ధైర్యలక్ష్మిని మాత్రం విడిచిపెట్టకు. అప్పుడు విజయం తప్పకుండా నీదే అవుతుంది!”, అంది పార్వతి.

“అలాగే అమ్మా!”, అని చిరునవ్వుతో బదులిచ్చింది సీత.

“ఇక మా బస్సు టైమయ్యింది. వెళ్ళొస్తామమ్మా!”, అంటూ సీత నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు బసవయ్య.

పార్వతినీ, బసవయ్యనూ సాగనంపటానికి కాలేజీ గేటువద్దకు వచ్చింది సీత. అంతలో కాలేజీ ఆవరణలోకి ప్రవేశిస్తున్న ఒక ఖరీదైన కారు వారికి కనపడింది. ఆ కారు ఆగిన వెంటనే, సూటూ-బూటూ వేసుకుని తన కూతురు మోహినితో కారులోంచీ దిగాడు ప్రభాకరం. ప్రభాకరాన్ని చూస్తూనే బసవయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది!

“అరేయ్ ప్రభాకరం!!”, అంటూ పరుగు పరుగున ప్రభాకరం వద్దకు వెళ్ళాడు బసవయ్య.

“ఒరేయ్ బసవయ్యా! నువ్వా??! ఈ ఊరెప్పుడొచ్చావురా? ఎలావున్నావ్?”, అంటూ బసవయ్యను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ప్రభాకరం.

“బాగానే ఉన్నారా. ఇంతకీ నీ వ్యాపారం ఎలా ఉందీ? ఈ పాప ఎవరూ?”, అడిగాడు ప్రభాకరం మోహినిని చూస్తూ.

“ఏదో ఆ దేవుడి దయవల్ల వ్యాపారం బాగానే సాగుతోందిరా! ఈ పాప మా అమ్మాయి మోహిని. ఈ కాలేజీలో నాకు తెలిసినవాళ్లున్నారు. అందుకని నేను అడిగిన వెంటనే మా అమ్మాయికి ఇక్కడ చదువుకోవడానికి సీటిచ్చేశారు!”, గర్వంగా నవ్వుతూ చెప్పాడు ప్రభాకరం.

“ఎంత మంచి మాట చెప్పావురా! మా అమ్మాయి సీతకు కూడా ఈ కాలేజీలోనే సీటొచ్చింది. ఆడపిల్ల ఒంటరిగా ఎలా ఉంటుందో ఏమోనని కంగారు పడ్డాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే చదువుతుంది కాబట్టి, మీ అమ్మాయికి మా అమ్మాయి తోడూ.. మా అమ్మాయికి మీ అమ్మాయి తోడూనూ!”, అన్నాడు బసవయ్య ఆనందంగా.

“నిజమే! ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇబ్బందేమీలేదు!”, అన్నాడు ప్రభాకరం.

బసవయ్య సీతకు మోహినిని పరిచయం చేస్తూ, “అమ్మా సీతా! ఇక నీకు భయం లేదమ్మా! వీడు ప్రభాకరం. మన ఊరివాడే. నేనూ వీడూ కలిసి చదువుకున్నాం. వీడు వ్యాపారం చేసుకోవడానికి చిన్నప్పుడే పట్నం వచ్చేశాడు. నేను వ్యవసాయం వదులుకుని రాలేక అక్కడే ఉండిపోయాను. వీడి కూతురు కూడా ఈ కాలేజీలోనే చేరుతోంది. మా ప్రభాకరం చాలా మంచివాడు. అందరికీ సహాయపడే గుణం వాడిది. మరి వీళ్ళ పాప మోహినికి తండ్రి పోలికలు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి! కాబట్టి నీకు మోహిని మంచి స్నేహితురాలవుతుంది!”, అన్నాడు.

సీత మోహినిని, “నా పేరు సీత..”, అంటూ చిరునవ్వుతో పలకరించబోయింది.

మోహిని సీతను పట్టించుకోకుండా తన చేతి గడియారంవంక చూసుకుంటూ, “అబ్బ! ఆలస్యమవుతోంది! త్వరగా వెళ్లి, నా గది ఎక్కడో చూసుకోవాలి!”, అంటూ హడావుడిగా కాలేజీలోకి వెళ్ళిపోయింది.

అది చూసిన ప్రభాకరం, “ఈ రోజుల్లో పిల్లలింతే! యవ్వనంలోకి వచ్చాక అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు! పెద్దల మాటకు విలువనివ్వరు. ఇంతకీ, నాకూ వేరే పనులున్నాయి బసవయ్యా! మన ఊరు వచ్చినప్పుడు నిన్ను కలుస్తా. వెళ్ళొస్తా!”, అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు.

సీతకు వెళ్ళొస్తామని చెప్పి తమ ఊరికి బయలుదేరారు బసవయ్య దంపతులు.

దారిలో బసవయ్య పార్వతితో, “పార్వతీ! నువ్వన్నట్లు ఆ భగవంతుడే సీతకు పట్నంలో ఒక తోడుండేటట్లు చూశాడు!”, అన్నాడు.

“కానీ ఆ మోహిని అంత కలుపుగోరుగా లేదు!”, అంది పార్వతి.

“పొనీలేవే! మనమ్మాయి అందరితో బాగానే కలుపుకుని పోతుందిగా! రేపీపాటికి మోహినితో స్నేహం చేస్తుందిలే!”, అన్నాడు బసవయ్య ధీమాగా.

సీత తనకు కేటాయించిన గదికి చేరేసరికి ఆ గదిలో మోహిని తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపించింది.

“అరె! నీ గది కూడా ఇదేనా మోహినీ? మనం హాయిగా కలిసి చదువుకోవచ్చు!”, సంతోషంగా మోహినితో అంది సీత.

అందుకు మోహిని మొహం చిట్లించి, “ఏమిటీ? నువ్వుండటానికి కూడా ఈ గదినే ఇచ్చారా? ఛ! ఛ! గదులు కేటాయించేవాళ్ళకి బుద్ధి లేదనుకుంటా. నా స్థాయేమిటీ? నీ స్థాయేమిటీ? నీలాంటి వాళ్ళతో నేనుండలేను! ఇప్పుడే వెళ్లి నా గదిని వేరే చోటికి మార్పించేసుకుంటా!”, అంటూ ఆ గదిలోంచీ విసురుగా వెళ్ళిపోయింది.

ఆ మాటలు విన్న సీత మనసు చివుక్కుమంది. బాధతో ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజలా కారాయి. కళ్ళు తుడుచుకుని మనసును కుదుటపెట్టుకునే ప్రయత్నం చేస్తూ తనతో తెచ్చుకున్న పుస్తకాలు చదువుతూ కూర్చుంది సీత.

కాసేపటి తర్వాత ధుమధుమలాడుతూ మోహిని వచ్చి, “ఛ! నాకు వేరే గది ఇవ్వరట. నేను నీతో ఇక్కడే ఉండాలట. అంతా నా ఖర్మ!”, అని తిట్టుకుంటూ తన సామానును గదిలో చిందరవందరగా విసిరేసి తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళిపోయింది.

రెండు రోజుల తర్వాత తరగతులు మొదలయ్యాయి. చూస్తూండగా మూడు వారాలు గడిచిపోయాయి. మోహిని ప్రతి క్షణం సీతను నానామాటలు అంటూ ఆమెను మానసికంగా వేధిస్తూ ఉండేది. మోహిని తండ్రికి సమాజంలో ఉన్న పరపతి కారణంగా మోహినిని ఆమె స్నేహితులెవరూ అడ్డుకునేవారు కాదు. పేరుకు తగ్గట్టు సీత సహనంతో ఉంటూ, తను చేసే అన్ని పనులలో మోహినిని కలుపుకుందామని ప్రయత్నిస్తూనే ఉండేది.

ఒక ఆదివారంనాడు సీత తన గూట్లోని దేవుడి పటానికి పూజ చేసి,”మోహినీ! ఇదిగో ప్రసాదం తీసుకో!”, అంటూ ఒక అరటిపండును మోహినికి ఇవ్వబోయింది.

మోహిని సీతవంక హేళనగా చూస్తూ, “నాకింకా ఇరవయ్యేళ్లు కూడా నిండలేదు. అప్పుడే అరవయ్యేళ్ళ బామ్మగారిలా పూజలూ పునస్కారాలూ అంటూ నీలాగా సమయం వృథా చేసుకోలేను. ఆ ప్రసాదమేదో నువ్వే మింగు!”, అని కసిరినట్లుగా అంది.

మోహినితో ఉన్న ఆమె స్నేహితులంతా గొల్లున నవ్వారు. సీత మనసు నొచ్చుకున్నప్పటికీ మోహినిని ఏమీ అనలేక మౌనంగా ఊరుకుండిపోయింది.

ఒకరోజు మధ్యాహ్నంవేళ పరీక్షల కోసం చదువుకుంటున్న సీతకు పాఠానికి సంబంధించిన ఒక చిన్న సందేహం కలిగింది. ఆ సమయంలో మోహిని, సీతకు కాస్త దూరంలో, తన స్నేహితులతో కూర్చుని చదువుకుంటోంది. వారిలో శ్రీవాణికి ఎప్పుడూ మంచి మార్కులు వస్తూ ఉంటాయి. సీత శ్రీవాణి దగ్గరకు వెళ్లి తన సందేహమేమిటో చెప్పి ఆమెను సమాధానం అడిగింది.

సీత మాటలు విన్న మోహిని కళ్లెర్రజేస్తూ, “శ్రీవాణీ! సీతకు నువ్వు ఏమీ చెప్పద్దు. అయినా, సీతా వాళ్ళ నాన్న ఊళ్ళో మట్టి పిసుకుతాడట. ఈ పిల్లకు మాత్రం మనతో సమానంగా చదువు కావలసివచ్చింది! మన దగ్గర నేర్చుకుని పరీక్షల్లో మనకే పోటీగా మార్కులు తెచ్చుకుందామని ఎత్తు వేసింది! ఎంత ధైర్యం!!”, అంటూ ఆవేశంగా నోటికొచ్చినట్లు అరిచింది.

ఆ అరుపులకు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయి, క్షణకాలంపాటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మోహిని తనను కటువుగా అన్న మాటలు జీర్ణించుకోలేకపోయిన సీత, దుఃఖంతో తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుండిపోయింది.

కొద్దిసేపటి తర్వాత మోహిని కూడా గదిలోకి వచ్చి, “రాక్షసుల మధ్యలో ఉన్న సీతలాగా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావేం? ఛ! నీ ఏడుపుగొట్టు మొహం చూస్తూ ఇంకెంతకాలం ఉండాలో ఏమిటో?!”, అంది.

అప్పుడు అక్కడే ఉన్న శ్రీవాణి, “ఊరుకోవే మోహినీ! సీతను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటావెందుకు? వాళ్ళ నాన్నలాంటి రైతులు మట్టిని పిసుకుతూ కష్టపడకపోతే పంటలెలా పండుతాయ్? పంటలే లేకపోతే పట్నంలో ఉంటున్న మన కడుపులెలా నిండుతాయ్? కాస్త ఆలోచించు! నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది. బయటికెళ్లి ఏదైనా తిని వద్దాం రా!”, అంటూ మోహినిని బయటకు తీసుకెళ్లింది.

అంతలో, సీతకు బసవయ్యనుండీ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివిన సీత మనసు కాస్త తేరుకుంది.

‘నేను ఇక్కడ ఉంటున్నది బాగా చదివి నాన్న కలను నెరవేర్చడానికి! ఆ మోహిని అనే మాటల ప్రభావం నా చదువుపై పడనివ్వను! అమ్మ చెప్పినట్లు ధైర్యలక్ష్మిని ఎన్నటికీ విడువను!’, అని అనుకుంటూ కళ్ళు తుడుచుకుని చదువులో నిమగ్నమైపోయింది సీత.

పెద్ద పరీక్షలొచ్చాయి. సీత పరీక్షలన్నీ బాగా రాసింది. శనివారం నాడు ఆఖరి పరీక్ష జరిగింది. ఆ పరీక్ష అయిన వెంటనే మోహిని తన స్నేహితులను, “పరీక్షలు అయిపోయిన ఈ సందర్భంలో నేను మీ అందరికీ ఒక మంచి విందును ఏర్పాటు చేస్తాను. ఇవాళ ఆ విందులో అందరం కలిసి సరదాగా గడిపి, రేపు ఎవరిళ్ళకు వాళ్ళం వెళ్ళిపోదాం! సరేనా?”, అని అడిగింది.

మోహిని అడిగినదానికి ఆమె స్నేహితులందరూ మహదానందంగా ఒప్పుకుని, ఇళ్లకు వెళ్లే కార్యక్రమాలను ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. బసవయ్య కూడా సీతను తమ ఊరు తీసుకుని వెళ్ళడానికి ఆదివారమే వస్తానన్నాడు. అందుకని సీత కూడా ఆ పూటకు వసతిగృహంలోనే ఉండిపోయింది.

శనివారం సాయంత్రం శ్రీవాణి సీత దగ్గరకు వచ్చి, “సీతా! మేమంతా ఈ ఊళ్లోని అతి పెద్ద హోటల్‌లో మోహిని ఇస్తున్న విందుకు వెడుతున్నాం. నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది”, అంది.

“విందుకు నాకూ రావాలనే ఉంది. కానీ ఇవాళ శనివారం కదా! గుళ్లో..”, అంటూ సీత శ్రీవాణితో ఏదో చెప్పబోతూ ఉంటే మోహిని సీతను అడ్డుకుని శ్రీవాణితో, “ఈ సీతకు ఎప్పుడూ గుళ్ళూ గోపురాలే! జీవితాన్ని సరదాగా ఎలా గడపాలనేది సీతకు తెలియని విద్య!! ఇలాంటివాళ్ళని అడగటం కూడా దండగ. నువ్వు రావే వాణీ! మనం పోదాం!”, అంది.

ఎప్పటిలాగే సీత ఏమీ మాట్లాడలేదు. శ్రీవాణి కూడా మౌనంగా మోహిని వెంట వెళ్ళిపోయింది.

మోహిని చాలా డబ్బు ఖర్చుపెట్టి తన స్నేహితురాళ్లందరికీ పెద్ద ఎత్తున విందును ఇచ్చింది. వారంతా మోహినికున్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఆమె అదృష్టాన్ని పొగుడుతూ ఉంటే, అందలమెక్కి అంబరాన్నంటినంత సంతోషం కలిగింది మోహినికి!

విందు ముగిసేసరికి రాత్రి పది గంటలయ్యింది. ఆ సమయంలో ఆటోల కోసం, క్యాబుల కోసం మోహిని ఎంత ప్రయత్నించినా అవి దొరకలేదు. దాంతో తాముంటున్న వసతిగృహానికి తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ బయలుదేరింది మోహిని. వీధిదీపాలు లేకపోవడంతో దారంతా చిమ్మ చీకటిగా ఉంది. అదే అదనుగా చూసుకుని ఇద్దరు పోకిరీ యువకులు తమ వాహనాలపై వచ్చి మోహినిని, ఆమె స్నేహితులనూ చుట్టుముట్టి, వారిని అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు. ఏం చెయ్యాలో పాలుపోక భయంతో బిగుసుకుపోయి, దిక్కులు చూస్తున్న మోహినికీ, ఆమె స్నేహితులరాళ్ళకూ కొద్దిదూరంలో తమ వైపుకు వస్తున్న సీత కనిపించింది!

“సీతా! వెళ్ళిపో!! ఇటు రాకు!”, అంటూ సైగ చేసింది శ్రీవాణి.

కానీ సీత ఆగలేదు. మెరుపు వేగంతో అక్కడకు వచ్చిన సీత, ఆ యువకులతో, “అరేయ్! ఆడపిల్లలను ఏడిపించటం గొప్ప పని అని అనుకుంటున్నారా? దమ్ముంటే నన్ను ఎదిరించండి చూద్దాం!”, అంది.

సీత అమాయకత్వంతో అలా అంటోందని భావించిన మోహిని, “సీతా! ఆగు. నువ్వొక్కదానివీ వీళ్ళను ఎదిరించలేవు!”, అంది.

అప్పుడు సీత, “మోహినీ! నీకు రాక్షసుల మధ్యలో కూర్చుని ఏడుస్తున్న సీత మాత్రమే తెలుసు! క్రూర రాక్షసుల మధ్యకు వెళ్లి , దశకంఠుడిని ధైర్యంగా ఎదిరించిన శక్తి స్వరూపిణి కూడా ఆ సీతమ్మవారే అని తెలుసుకో! ఆ మహాశక్తే ఈ సీతలో కూడా ఉంది!”, అంటూ తన వద్దకు దూసుకు వచ్చిన ఆ యువకులను సునాయాసంగా కిందపడేసి, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది.

ఆ యువకులు తేరుకుని లేచేలోపు మోహినీ, ఆమె స్నేహితులు, ఆ దగ్గరలోని ఇళ్లవాళ్లను బయటకు పిలిచి జరిగింది చెప్పారు. వాళ్లంతా ఆ యువకులకు దేహశుద్ధి చేసి వారిని పోలీసులకు అప్పగించారు.

మోహిని తమ వసతిగృహానికి చేరుకున్నాక, “సీతా! నిన్ను నా మాటలతోనూ, ప్రవర్తనతోనూ ఎన్నోసార్లు బాధ పెట్టాను. నన్ను క్షమించు! నువ్వీరోజు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడి ఉండకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో! ఆ విషయం తలచుకుంటేనే భయం వేస్తోంది! ఇంతకీ ఆ సమయంలో నువ్వక్కడకు ఎలా వచ్చావ్?”, అని అడిగింది సీతను.

“ప్రతి శనివారం నేను గుడికి వెడతాను కదా! ఇవాళ కూడా అలాగే వెళ్ళాను. అయితే ఇవాళ హనుమజ్జయంతి, అందుకని గుళ్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి, శ్రీరామ భజనలు చేశారు. గుడిలో కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి బాగా ఆలస్యమైపోయింది. రాత్రివేళలో ఒక్కదానినే నడుచుకుంటూ ఇక్కడకు రావడం ముందు కాస్త భయమని అనిపించినా, ఆ ఆంజనేయుడే నాకు తోడు ఉంటాడని అనుకుంటూ బయలుదేరాను. అనుకోకుండా నాకు దారిలో మీరు కనపడ్డారు! ఆ ధైర్యలక్ష్మిని నమ్ముకుని మిమ్మల్ని ఏడిపించినవాళ్లను ఎదుర్కొన్నాను”, చెప్పింది సీత.

“అయితే నిన్ను మా వద్దకు ఆ భగవంతుడే పంపాడన్నమాట!”, అంటూ సీతను కౌగలించుకుంది మోహిని.

“అవును మోహినీ! ఆ భగవంతుడే మనందరికీ నిజమైన తోడు!”, అంది సీత చిరునవ్వుతో.

మరుసటిరోజు సీతా, మోహినీ, ఆమె స్నేహితులూ అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు. కొద్దిరోజుల తర్వాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. మార్కుల విషయంలో సీత ప్రథమ స్థానంలో నిలవగా మోహిని తృతీయ స్థానంలో నిలిచింది. వారిని సత్కరించడానికి కాలేజీ యాజమాన్యం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి వచ్చిన సీతా, మోహినీలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కార్యక్రమం ముగియగానే సీతా, మోహినీలు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.

అప్పుడు మోహిని, “సీతా! నాదొక సందేహం. నువ్వు ఆరోజు మమ్మల్ని ఏడిపించిన పోకిరీలను చాలా అవలీలగా కింద పడేశావ్. అదెలా సాధ్యమయ్యింది? నీకు అంత బలం ఎక్కడిదీ?”, అని సీతను ఆశ్చర్యంగా అడిగింది.

“ఓ! అదా!! మా పల్లెటూరిలో నాకు చదువుతోపాటు దైవభక్తినీ, సంప్రదాయాన్నీ, సంస్కారాన్నీ, సమర్థతతో సమస్యలను ఎదుర్కునే నేర్పునీ, అన్నిటికీ మించి – ఎలాంటి పరిస్థితులలోనైనా ధైర్యంగా బతకడాన్నీ నేర్పించారు మా పెద్దవాళ్ళు. మా నాన్న బసవయ్య జాతీయ స్థాయిలో జరిగిన అనేక కుస్తీపోటీల్లో పతకాలు సాధించిన గొప్ప వస్తాదు! నాకు ఎప్పుడైనా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మా నాన్న దగ్గర కొన్ని కుస్తీపట్లు నేర్చుకున్నా. అవి ఆరోజు సరైన సందర్భంలో అలా పనికొచ్చాయి. అంతే!”, అంటూ అసలు విషయం చెప్పి, మోహినిని ఆశ్చర్యంలో ముంచెత్తింది సీతామహాలక్ష్మి!

Exit mobile version