తొలగిన తెరలు-5

0
2

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[తాగుబోతు భర్తని సింహాద్రి ఇరవై ఏళ్ళుగా ఎలా భరిస్తోందో అని ఆలోచిస్తున్న స్పందనకి ఓ సంఘటన జ్ఞాపకం వస్తుంది. చాలా రోజుల క్రితం ఆమె తన కంపెనీలో ఒక వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. సమాజంలోని విభిన్న వృత్తి – ప్రవృత్తులలో ఉన్న మహిళలందరికీ వారి అనుభవాలను పంచుకునే అవకాశంతో పాటు తాము ఈరోజు ఇంత గొప్ప స్థాయికి చేరేందుకు సహాయపడిన వ్యక్తులను గురించి లేదా ఆటంకాలు ఏర్పడితే వాటిని ఎలాగా ఎదుర్కొన్నారు? అనే విషయాలతో ప్రశ్నావళి తయారు చేసిచ్చి పదిహేను నిమిషాలలో జవాబివ్వమంటుంది. నిర్ధారిత సమయం కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా, అందరూ తమ అభిప్రాయాలు స్పష్టంగా వెళ్ళడిస్తారు. వారంతా ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకుంటుంటే మిగతావారందరి హృదయాలు బరువెక్కుతాయి. కారులో ఇంటికి వస్తూ సమావేశం ముగింపులో తన చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటుంది. ఇంటికి వచ్చిన స్పందన, సింహాద్రిని పిలిచి ఆమె భర్త వ్యసనం గురించి ప్రశ్నలు అడుగుతుది. ఎందుకు, ఎలా భరిస్తోందో అడుగుతుంది. భర్తని మార్చడానికి తాను చేసిన ప్రయత్నాలను చెప్పి, తన పిల్లలు తనని చూసినా చూడకపోయినా వాళ్ళని ప్రయోజకులను చేయడం తన ఉద్దేశమని అంటుంది. తన భర్తని మార్చే ప్రయత్నాలను ఆపనని చెబుతుంది సింహాద్రి. ఇప్పుడు సంఘటన మొత్తం గుర్తు రావడంతో, కిరణ్ విషయంలో ఆవేశం పనికిరాదని గ్రహిస్తుంది. వదిన నందిని వచ్చి స్పందనతో మాట్లాడుతుంది. తన సమస్యని వివరిస్తుంది స్పందన. నందిని సరైన సూచన చేస్తుంది. మేడ మీదకి తీసుకువెళ్ళి కిరణ్‍‍తో మాట్లాడుతుంది స్పందన. అతని జీవన విధానాన్ని గౌరవిస్తానని చెప్తూనే, అలవాటుని వ్యసనంగా మార్చుకోవద్దని చెబుతుంది. కిరణ్‍లో ఆలోచన మొదలవుతుంది. – ఇక చదవండి]

[dropcap]సాధా[/dropcap]రణంగా నందిని ఇల్లంతా నీట్‌గా ఉంచుతుంది. కార్నర్స్‌లో ఫ్లవర్ పాట్స్, కిటికీలకు మంచి కర్టెన్లు వేయడం దగ్గర నుంచి డోర్ మాట్ డిజైన్ వరకూ చూపించే శ్రద్ధ ఆ పరిసరాల్లో ప్రవేశించిన వారిని ముగ్ధులను చేస్తుంది. అలాగే అనవసరమైన వాటితో ఇల్లంతా నింపేయకుండా ఖాళీగా ఉంచడం కూడా ఆహ్లాదాన్ని అందిస్తుందనేది చాలా మంది మహిళలకు తెలియనిది. ఈ విషయంలో గదీ, మదీ ఒకటే!

అక్కడ టేబుల్ పై పడి ఉన్న బ్యాంకు వార్షిక రిపోర్ట్ క్యాజువల్‌గా చూసింది. ప్రతినెలా పదివేలు వినీల పేరు మీద.

ఆమెకు తాను చూస్తున్నదేమిటో అర్థం కాలేదు. ఎవరు ఈ వినీల? నెలకు పదివేలు ఇస్తున్నారా? ఎందుకు???

ఎవరై ఉంటారు???

అతని చెల్లెలా? ప్రియురాలా? ఎవరు?

ఇంతలో సందీప్ ఆ గదిలోకి వచ్చాడు.

నందిని ఆ పేపర్ చూసిందని అర్థమైంది.

ఏం చెప్పాలో అర్థం కాలేదు.

“నందినీ!” పిలిచాడు.

నందిని అతని వైపు విరక్తిగా చూసింది.

ఇదేనా ప్రేమంటే?? ఇదంతా అవసరమా?? ఇలా ఎందుకు? తనకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండనీ!! అనుకుంటూ స్నేహితురాలు లాయర్ మాధవికి ఫోన్ చేసింది.

“మాధవీ! నేను వస్తున్నాను, ఒక గంట సమయం నాకోసం కేటాయించు.” అతడు వింటూనే ఉన్నాడు.

ఆమె స్కూటర్ తాళం తీసుకుని బయటికి నడిచింది.

ఆఫీస్ రూంలో కూర్చుని ఉన్న మాధవి నందినిని చూస్తూనే

“హాయ్! నందూ! సందీప్ ఏడి? రాలేదా? పద! పద! లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం.” అంటూంటే

“వద్దులేవే! నీ క్లయింట్‌గా వచ్చాను. ఇక్కడే కూర్చుందాం.” అంది.

“చెప్పు. ఏంటి ప్రాబ్లం?”

“సందీప్ నుండి విడిపోవాలని అనుకుంటున్నాను.” అతి కష్టమ్మీద అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ చెపుతున్న ఆమె మాటలు వింటూ

“ఏమిటీ?” అంది మాధవి ఆ అనడంలో నీకేమైనా మతి పోయిందా? అన్న అర్థం ధ్వనించింది నందినికి.

“ఇది తప్పదు. ఇష్టమున్నా, లేకున్నా..” అంటూ కారణాలను క్లుప్తంగా వివరించింది.

“నిజమేనా? సందీప్‌ని అడిగావా?”

“అతడు ఏం చెప్పినా వినాలని లేనప్పుడు ఏమని అడగాలి?”

“నువ్వు చెప్పిన కారణం ఎవరైనా ఓ.కే. కానీ.. సందీప్ కాబట్టి అడగాలని..”

మాధవి వైపు చురుగ్గా చూసింది నందిని.

“ఇవేమీ అక్కరలేదు అనుకుని నీ దగ్గరకు వచ్చాను. ప్రస్తుతం నాకు కావలసినది సందీప్ నుండి విడుదల. అంతే!” స్థిరంగా పలికింది ఆమె గొంతు.

“సరే! పేపర్లు తయారు చేస్తాను. నేను సందీప్‌ని కలవనా?” ఆశ ధ్వనించింది మాధవి గొంతులో.

“అవసరం లేదు. వస్తాను.” నందిని లేచింది.

సందీప్‌ని ఫోనులో అడుగుదామా? అనుకుని మళ్ళీ నందిని సంగతి తెలిసి విరమించుకుంది మాధవి.

మాధవి ఇంటి నుండి బయల్దేరిన నందినికి ఒక్క క్షణం అర్ధం కాలేదు ఎటువెళ్ళాలో?

స్కూటర్ బీచ్ రోడ్ వైపు తిప్పింది తనను అభిమానించే వ్యక్తులను కలవాలని.

స్కూటర్ బీచ్ రోడ్ లోని శాంతి ఆశ్రమం దగ్గర ఆపి, లాక్ చేసి సముద్రం వైపు నడవసాగింది.

తనకు చిన్నప్పటి నుండి సముద్రం అంటే భలే ఇష్టం.

నాయనమ్మ గ్రహణాలు, మహోదయాలు వంటి ముఖ్యమైన రోజుల్లో తమ్ముణ్ణీ, తననీ చేయిపట్టుకుని జాగ్రత్తగా తీసుకువచ్చేది.

పర్వదినాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడేవి. జాగ్రత్తగా ఒడ్డున స్నానం చేయించి, పొడి బట్టలు వేసి, ఇసుకలో కూర్చోబెట్టి పిప్పరమెంటు బిళ్ళలు తనకూ, తమ్ముడికీ చేతులో పెట్టేది. ఇవి చేస్తున్నంతసేపూ కథలు చెప్పేది.

రాక్షసులు సముద్రంలో దాక్కుంటే దేవతలు కోరగా అగస్త్యమహాముని అపార సముద్ర జలాలను కమండలంలో పోసుకుని తాగేయడం, రాక్షసులు కనబడగానే ఇంద్రుడు వారిని చంపేయడం. అగస్త్యుడు తన మూత్రం ద్వారా నీటిని వదిలితే సముద్రం యథాస్థితికి వచ్చిందని.

ప్రతిసారి సముద్రస్నానంలోనూ ఇదే కథ చెప్పేది. తను కూడా ప్రతిసారి సముద్రపు నీటిలో కాలుపెడుతూ నాన్నమ్మను గుర్తుచేసుకుంటుంది. అంతేనా!

ఆచార్య భావనగారు రాసిన ‘అక్షరాంజలి’ పుస్తకం లోని మినీ కవిత

“కెరటం నా ఆదర్శం

పడి లేచినందుకు కాదు

పడినా లేచినందుకు”

ఎంతమంది మహనీయులు ఆ మూడు పదాలనూ సభలూ, సమావేశాల్లో ఉటంకించారో!!

అనుకుంటూ కాసేపు నీళ్ళలో అలలతో పరుగులు పెట్టి, కిలకిలా నవ్వుకుంటూ వెనుతిరిగింది నందిని.

***

త్రోవలో పళ్ళ దుకాణం దగ్గర కమలాపళ్ళు కొన్నది. డైరీ షాపు దగ్గర కొంచెం కోవా కొన్నది.

నెమ్మదిగా నడుచుకుంటూ ‘వానప్రస్థం’లో అడుగుపెట్టింది.

అందరిని చిరునవ్వులతో పలకరిస్తూ తాను తెచ్చిన కమలా ఫలాలు ఒక్కొక్కరి చేతిలో పెడుతూ

“తాతయ్య ఎక్కడ?” లోపలకు అడుగు పెట్టింది.

“వరండాలో ఉన్నారమ్మ” అంది ఆయా.

నీరెండలో వాలుకుర్చీలో పడుకుని పుస్తకం చదువుకుంటున్నారు రంగనాథం.

“తాతయ్యా! ఏం చదువుతున్నారు?” అంటూ పలకరించేసరికి ఆయన నందినిని చూసి నవ్వుతూ

“ఇదిగో! ఈ పుస్తకం ఇరవై ఎనిమిదవ సారి చదువుతున్నాను.” అన్నారు నవ్వుతూ.

“అవునా! అంత గొప్ప పుస్తకం ఏమిటబ్బా?” అంటూ అట్టమీద బొమ్మ చూసింది.

భాగవతం దశమ స్కంధం శ్రీకృష్ణ లీలలు.

“ఓహో! మీరు చిన్నికృష్ణుడు అయిపోయారు అన్నమాట!” అంటూ

“ఇదుగో! తాతయ్యా! తినండి.” అంటూ స్వీట్ ఉన్న చేతిని ముందుకు చాపింది.

“తినిపించు మరి” అంటూ ముసి ముసి నవ్వులు నవ్వారు.

కానీ అనుభవజ్ఞులైన ఆ పెద్దాయన నందిని మొహంలోని నీలినీడలను పసికట్టేసారు.

“ఏమైందిరా! అలా ఉన్నావు?” లాలనగా అడిగారు.

“ఎలా ఉన్నాను?” అంటూ నవ్వుతూ అటు తిరిగి టేబుల్ పైన గల వస్తువులను సర్దసాగింది. తాను చెప్పదలచుకోలేదని అర్థమైందతనికి.

“ఏమీ లేకపోతే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఒక మంచిపాట పాడరాదూ!” అడిగారు.

వెంటనే అందుకుంది

“శివశివయనరాదా!

శివనామము చేదా?

శివపాదము మీద నీ

శిరసునుంచరాదా?”

శ్రీరంగం గోపాలరత్నంగారి పాట నందిని గళంలో జీవం పోసుకుని అలా తేలి తేలి అందరినీ అలరిస్తూ

ఆశ్రమవాసులందరూ నిశ్శబ్దంగా ఆమె చుట్టూ చేరిపోయారు.

“అమ్మా! మరొక్క పాట.”

“ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట!”

తన మదిలో వేదన తీరే వరకూ నాలుగైదు పాటలు పాడింది. అన్ని పాటలను పాడుతున్న ఆమె గొంతులోని ఆర్ద్రతను రంగనాథంగారు గుర్తించారు.

“వెళ్ళొస్తాను తాతయ్యా!” అంటున్న ఆమె చేతులు పట్టుకుని

“భగవంతుడు నీకు మంచి చేస్తాడమ్మా! ఆయన కరుణ ఎప్పుడు ఏ రూపంలో అందుతుందో తెలియదు. నమ్మకం ఉంచుకోవడం వలన మనలో ధైర్యం పెరుగుతుంది. అదేనమ్మా కావలసినది.” అతనందించిన ధైర్యం, ఆశీస్సులు తోడుగా వారితో కొంచెంసేపు గడిపి ఇంటి ముఖం పట్టింది. ఇంటికి వెళ్లాలని లేకపోయినా..

***

ఒక వారం రోజులు అన్యమనస్కంగానే గడిపింది.

చూస్తున్న సందీప్ పరిస్థితి ఆమెకు వివరించే అవకాశం కోసం చూసాడు. జబర్దస్త్‌గా ‘విను’ అని తను అనుకున్నది చెప్పవచ్చును.

కానీ.. నందిని తన ప్రాణం. ఆత్మాభిమానం గల ఆమె ఏమాత్రం నొచ్చుకోకుండా ప్రవర్తించాలి. నేను నిరపరాధిని. అని దండోరా చేయడం కంటే ఆమె తనంతట తానే తెలుసుకునే సమయం వచ్చేవరకూ ఎదురుచూడడమే మంచిది అనుకుని ఒక పని మాత్రం తప్పనిసరిగా చేయాలని అనుకున్నాడు.

వెంటనే చేసేసాడు. దాని ఫలితమే లాయర్ మాధవికి చేరిన ఆడియో.

“మాధవిగారూ! నమస్తే! నేను సందీప్. మనిద్దరం మాట్లాడుకున్నా నందినికి కోపం వస్తుందని అందుకే మీరు మౌనం వహించారని నాకు తెలుసు.

నిజమే! మీకు నా పట్ల గల నమ్మకానికి ధన్యవాదాలు. అది ఎప్పటికీ వమ్ము కాదు. మేడమ్!

మెసేజ్ కానీ ఉత్తరంగానీ కాకుండా ఆడియో పంపించడానికి కారణము కొన్ని పదాలు చదవడం కంటే వినడంలోనే మనకు అందులోని భావం అర్థం అవుతుంది. అందువలన ఇలా చేసాను.

ఇంకా ఈ సంఘటన గురించి వివరంగా చెప్పలేని పరిస్థితిలో క్లుప్తంగా అయినా చెప్పడం నా ధర్మం. ఎందుకంటే మీకు నా మీద నమ్మకం ఉంది కనుక.

ఇది జరిగి సుమారు నాలుగైదు సంవత్సరాలు జరిగింది. అంటే నేను నందినిని కలుసుకోక ముందే మా పెళ్లి కాకముందే.

అది ఎవరికీ చెప్పనని నేను ప్రమాణం చేశాను. కనుక నందినికే కాదు మా కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదు. అంత అవసరమా! అంటే పరిస్థితి అలాంటిది.

‘అన్నా! ఎవరికీ చెప్పకు. నీ స్నేహితుడు మీద ఒట్టు వెయ్యి.’ అంది వినీల.

వినీల ఎవరంటే..

నా చిన్ననాటి స్నేహితుడు నవీన్. చాలా తెలివైనవాడు. ఎప్పుడు చదివేవాడో తెలియదు ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు ఎప్పుడూ.

ఇంజనీరింగులో ఉండగా నేను ఇంటి నుండి యూనివర్సిటీకి వచ్చేవాడిని. వాడేమో హాస్టల్‌లో ఉండేవాడు.

థర్డ్ ఇయర్‌లో ఉండగానే వాడికి వినీలతో పరిచయమైంది.

పిచ్చి ప్రేమ! అపూర్వ ప్రేమికులు! ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే! భయపడేవారు కాదు. మేము పెళ్లి చేసుకుంటాం కదా! ఎవరు ఒప్పుకున్నా మానినా! అనేవారు.

మా స్నేహితులు అందరం కూడా వాళ్ల ప్రేమని ఎంజాయ్ చేసేవాళ్ళం. కొద్దిరోజుల్లోనే క్లాస్ ఫస్ట్‌గా ఉండేవాడు మార్కులు తగ్గడంతో పాటు మూడీగా అయిపోయాడు.

కారణం కనుక్కోవాలని హాస్టల్లో ఉండే స్నేహితులను అడిగితే ఒళ్ళు జలదరించే నిజం తెలిసింది.

వాడు డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు.

ఎప్పుడు? ఎలా? ఎవరికీ తెలీదు. వాడిని బాగు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాము.

‘నేను నవీన్‌ని ప్రేమించాను. అతడినే వివాహం చేసుకుంటాను. పెళ్లి చేసుకుని మార్చడానికి ప్రయత్నం చేస్తాను.’ వినీల నిర్ణయం చూసి స్నేహితులంతా ఆశ్చర్యపోయాము.

ప్రేమ గుడ్డిది అంటారు. ఇందుకేనా?

ఒక వ్యసనపరుడుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన ఆమె మొండివైఖరి మమ్మల్ని నిరుత్తరులను చేసింది.

‘ఈ ఏడాది పరీక్ష అయిపోతే డిగ్రీ చేతికొస్తుంది. తొందరపడవద్దు.’ అని మేమంతా ఎంతో చెప్పి చూసాము అయినా వినకుండా ఇరువైపుల వాళ్లు ఒప్పుకోకపోయినా ఎవరూ రాకపోయినా గుడిలో వివాహం చేసుకుని వివాహాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నారు.

ఇలాంటి నిర్ణయాలు కొందరు ప్రేమికులు మాత్రమే చేయగలరు.

ఒక చిన్న రూమ్ తీసుకుని వాళ్ళిద్దరు చిన్న సంసారాన్ని మొదలుపెట్టారు. స్నేహితులందరమూ సహాయం చేస్తాము  అంటే ఖచ్చితంగా ‘నో’ చెప్పేసారు వాళ్ళిద్దరూ.

తరువాత సాధారణంగా యువత మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రేమికులుగా ఉన్నంత వరకూ మేమంతా ఒకటే అనుకున్నాము.

తీరా వాళ్ళు పెళ్ళి చేసుకుని ఒక ఇంటివాళ్ళై, సంసారం ప్రారంభించాక మా దృష్టి నుండి కనుమరుగై పోయారు.

ఎప్పుడో ఒకటీ, అరా మాటల మధ్యలో వారి గురించి సంభాషణలో వచ్చినా ‘వాళ్ళ రూముకి వెళ్ళాను. బాగానే ఉన్నార’నో, ‘బజారులో కనిపించారు పలకరించాను’ అనో చెప్పుకునేవారు.

ఫైనల్ ఇయర్ కదా అందరం చదువుల్లో మునిగిపోయాము. పెద్ద పెద్ద కంపెనీలు కాంపస్ ఇంటర్వ్యూల కోసం వచ్చేవారు.

సుమారొక పదిహేను మంది వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయారు. అయితే నేను రిసెర్చ్ సైడ్ వెళ్ళాలి అనుకోవడంతో ఉద్యోగంలో చేరలేదు. రెండేళ్ళ పి.జి. కోర్సు ఆఖరి సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. కాంపస్‌లో సెలెక్ట్ అయాను.

అప్పుడే జరిగింది ఆ సంఘటన!”.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here