Site icon Sanchika

99 పదాల కథ: తొలి చూపులో ప్రేమ

[dropcap]ఉ[/dropcap]దయాన నా క్లినిక్‌లో అడుగుపెడుతూనే, దగ్గుతో మెలికలు తిరుగుతున్న ఒక వృధ్ధుని గుండెలపై రాస్తూ సాంత్వన పరుస్తున్న, ఒక అపరిచిత యువతిని చూసాను.

అలికిడికి వెనుతిరిగి చూసిన ఆమె కళ్ళలోని ఆకర్షణకూ అనిర్వచనీయమైన ప్రశాంతతకూ పరవశంతో లయ తప్పింది నా హృదయం.

గబగబా లోనికొచ్చి ఆ వృధ్ధునికి మంచినీళ్ళు అందిస్తున్న నావైపు కృతజ్ఞతగా చూసింది.

మా చూపులు కలిసిన ఆ మధురక్షణాన ‘ఆమే నా సర్వస్వం, నా ప్రపంచమనే భావన కలిగింది! తొలి చూపులో ప్రేమంటే ఇదేనేమో!’ అనిపించింది.

తన పేరు పల్లవి అనీ తాను ఒక అనాథననీ, నిరాదరణకు గురైన వృధ్ధులను చేరదీసి సేవజేస్తూ వారిలో తన తల్లిదండ్రులను చూసుకుంటానని చెప్పింది. ఆమె ఔన్నత్యానికి ముగ్ధుడనై అభినందించాను.

మా పరిచయం ప్రణయంగా పరిణమించి ఒక శుభ ముహూర్తాన వివాహబంధంలో ఒకటయ్యాము. పెళ్ళై యాభై వసంతాలు నిండినా, తొలిచూపుల తీయటి తలపులు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా, మా తనువులు పులకించుతాయి!

Exit mobile version