తూరుపు గాలుల గులాబీ వనం

0
2

[box type=’note’ fontsize=’16’] “జీవితం పట్ల, చరిత్ర పట్ల అపారమైన ప్రేమే కాదు – సశాస్త్రీయ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సమాజం అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ, మానవత్వపు పరిమళాలను పంచుతూ అడుగేస్తుందని చెప్పే కథలివి” అంటున్నారు సి.ఎస్. రాంబాబు ‘తూరుపు గాలులు’ కథా సంపుటిని సమీక్షిస్తూ. [/box]

[dropcap]”చ[/dropcap]రిత్రపుటల మధ్య పేరుకుపోయిన సుదీర్ఘ నిశ్శబ్దాలు నన్ను వేధించాయి. నా చేత ఈ కథలు రాయించాయి” అంటారు కథకులు ఉణుదుర్తి సుధాకర్ తన ‘తూరుపు గాలులు’ కథా సంపుటిలో. తెలుగులో చరిత్ర ఆధారంగా కథలు రావటం తక్కువే. అయితే చరిత్రపట్ల మక్కువ పెంచుకుని చారిత్రక నేపథ్యంలో కాల్పనిక సృజన చేయటం అంత సులభమేమీ కాదు. దానికి ఆ ప్రక్రియ పట్ల అవగాహన ఉండాలి. అందులోనూ కథయితే – వ్యాసధోరణికి దారితీయకుండా జాగ్రత్త పడాలి. ఆ టెక్నిక్కేదో అందివచ్చింది ఉణుదుర్తి సుధాకర్ గారికి. ‘తూరుపు గాలులు’ సంపుటిలోని పదమూడు కథల్లో ఏడింటిని చరిత్రలోకి తొంగి చూసేలా చేస్తారు. ఈ కథల్లో ఒక పరిశోధన, ఒక సత్యశోధన దాగొని ఉంటాయి. ఇలా జరిగితే బావుండన్న రచయిత కల్పన ఉంటుంది. అది మనల్ని ఆలోచింపచేస్తుంది.

ఈ సంపుటిలోని కథలను కథాకాలం ఆధారంగా పేర్చుకుంటూ పోయారు. టైం మెషీన్‌లో లాగా అవి వర్తమానంతో మొదలుపెట్టి, గతంలోకి ప్రయాణిస్తూ వెనక్కి పోతాయి. చరిత్ర ఆధారంగా ఇన్ని కథలు ఒకే సంపుటిలో రావటం ఓ ప్రయోగమేనని చెప్పాలి. ఒక నేపథ్యాన్ని వివరించిన పాత్రల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నా రచయిత అడ్డుపడి వివరించాడు. అది మంచి పరిణామం; రచయిత పరిణితికి సంకేతం. వారు ఎంచుకున్న వస్తువును లోతుగా విశ్లేషించి ఔరా అనిపిస్తారు.

ముందుగా చరిత్ర ఆధారంగా వచ్చిన కథలను పరిశీలిద్దాం. పుస్తక మకుటంగా నిలిచి, ఆఖరున ఉన్న కథ ‘తూరుపు గాలులు’. బౌద్దం పట్ల విపరీతమైన అభిమానాన్ని ప్రకటించటంతో పాటు బౌద్ధం బలహీనపడిన కారణాలను చర్చించే కథ ఇది. నిడివి పరంగా పెద్దకథ ఇది. కథను నడిపిన తీరు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. కథ కళింగంలో మొదలై, నలందా చేరి, అక్కడినుంచి సింహళాన్ని పలకరించి, ఆ గాలులు పీల్చి అలల మీదుగా ధాన్యకటకం చేరి – అక్కడ బోధనలతో ముగుస్తుంది. ఇదొక బౌద్ధ భిక్షువు చేసిన యాత్ర. అతని అంతర్మథనం. కాలం పదమూడవ శతాబ్దపు తొలి సంవత్సరాలై ఉండొచ్చు. బౌద్ధం ఉత్థాన పతనాలను వెతుకుతూ సాగే ఒక అన్వేషణ. కాలానికి దూరంగా జరిగిపోయిన బౌద్దాన్ని సమాజం లోని కింది వర్గాల వారిని కూడా బౌద్దంవైపు ఆకర్షితులను చేయాలన్న ప్రతిపాదన ఆ కాలంలోనే వచ్చిందని రచయిత చెబుతారు. కథనంలోని బిగి సడలకుండా నడపటం రచయిత ప్రత్యేకత. బౌద్ధ ధర్మంలోని సూక్ష్మమైన అంశాలను పరిచయం చేస్తూ కథ ముందుకి సాగుతూ మనలో ఆలోచనల బీజాలను వేస్తుంది.

ఈస్టిండియా కంపెనీ భారతదేశంపై పట్టు సాధించటానికి కారణం నౌకాయానాన్ని తమ అధీనంలో ఉంచుకోవటమే అంటారు రచయిత. దాని ద్వారా వ్యాపార వర్తకాలను నియంత్రించారంటారు. ఈ పాయింట్‌ని వివరించే కథ ‘తెగిన నూలుపోగు’; ఒకప్పుడు ఓడరేవుగా ఓ వెలుగు వెలిగిన బందరు నేపథ్యంలో సాగుతుంది. సిద్ధయ్య, గురవయ్య అనే తండ్రీ కొడుకులు నూలు వస్తాలను ఉత్పత్తిచేసే నేత పనివారు. తమ సరుకుని స్థానిక వర్తకునికి అమ్మటానికి వచ్చినప్పుడు కొడుకు గురవయ్య మనసులో చెలరేగిన ఆలోచన, అతన్ని అనుకోకుండా వెళ్ళిన న్యాయస్థానంలో బయటకి వెళ్లగక్కేలా చేస్తుంది. ‘నౌకల్ని కొనుక్కుని మనమే ఎందుకు నడుపుకోకూడదు? మనమే విదేశీ వ్యాపారం ఎందుకు చేసుకోకూడదు?’ ఇదీ అతని ఆలోచన. ఇవే మాటల్ని బిగ్గరగా అన్నందుకుగాను అనుచితంగా మాట్లాడాడని గురవయ్యకు శిక్ష విధిస్తుంది కచేరీ. కాస్త లంచమిస్తే శిక్ష తగ్గించటానికి కొత్వాల్ సిద్ధంగా ఉండటం కొసమెరుపు. లంచగొండితనం అప్పటినుంచే దేశాన్ని పట్టిపీడిస్తుండేదని ఈ కథ ఎత్తిచూపుతుంది.

ఇద్దరు తెల్లదొరల అంతరంగాన్ని ఆవిష్కరించిన కథ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’. భారతదేశంలో ముప్పై ఏళ్ల పాటు ఉండిపోయిన కెన్ అనే బ్రిటిష్ అధికారి మరో మిత్రుడు జాన్‌కు వీడ్కోలు పలికే సందర్భమది. భారతదేశంలో ICS సర్వీస్ రూపకల్పన ఓ నవోదయం కాబోతుందని భావించే జాన్, ఏదో ఒకరోజు బ్రిటిష్ భారతదేశాన్ని వదలి వెళ్లక తప్పదు అన్న మాట కెన్‌ని కలవర పరుస్తుంది. మాటల సందర్భంలో ఈ దేశానికి కీలకం నీటిపారుదల రంగమని ఒకరు – రైల్వేలు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ముఖ్యమని మరొకరు చేసే వాదనల మధ్య వీడ్కోలు పలుకుతారు. మధ్యలో కెన్, తన ప్రేమకథ వైఫల్యానికి కారణాలు కనుక్కోటమే కొసమెరుపు.

ఈ మూడు కథల్లోనూ రచయిత వాడిన భాష ముచ్చట గొలుపుతుంది. అప్పటి కాలపు పదాలను వెతికి పట్టుకుంటారు రచయిత. చారిత్రక నేపథ్యాన్ని కనులకు కట్టించడంలో రచయిత ప్రతిభ అపారం. వెలుగుల ఆకాశం, సంధ్యాక్రాంతులు, చిత్తడి నేలలు, అలల ఘోషతో కలసిన పదాల పొహళింపు పాఠకుడికి పవళింపు సేవలా ఉంటుంది.

“నైపుణ్యం ఉన్న చోట శాస్త్రం లేదు. శాస్త్రం ఉన్న చోట నైపుణ్యం లేదు. ఇక్కడి చదువుల్లో శాస్త్రం, నైపుణ్యం – రెండూ లేవు” అని వ్యాఖ్యానిస్తుంది ‘మూడు కోణాలు’ అన్న కథ. నిచ్చెన మెట్ల వ్యవస్థ, నైపుణ్యం ఉన్న వ్యక్తులను సమాజానికి ఆవలే ఉంచటంతో ఆ సమాజమెంత నష్టపోతుందో చెప్పే కథ. ఒక దొరవారు తియోడలైట్ అనే సున్నితమైన పరికరం సహాయంతో సర్వే చేస్తున్న క్రమంలో అది ప్రమాదవశాత్తు లోయలో పడిపోతే, దాన్ని సునాయాసంగా మరమ్మత్తు చేసిన డుంబ్రి అనే ఓ గిరిజనుడి కథ ఇది. విచిత్రమూ విషాదమూ ఏమిటంటే తరవాతి కాలంలో అందరూ ఎదిగితే – డుంబ్రి మాత్రం అనామకంగా మిగిలి పోయాడంటాడు రచయిత.

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను ఎంత హేతుబద్దంగా సృజించారో అంతే నిబద్దత మిగిలిన కథలలోనూ కనబరుస్తారు రచయిత.

భిన్న ధ్రువాల్లాంటి ఇద్దరు సోదరుల ఆలోచనా ధోరణులలో కాలం తెచ్చిన మార్పులను పసిగడతాడు మేనల్లుడు – ‘ఇద్దరు మామయ్యల కథ’లో. ఒక ఛాందసవాది క్రమంగా హేతువాదం వైపు మళ్లితే, ఛాందసవాది మేనమామ తన స్థానాన్ని స్థానికత వైపు, చిన్న చిన్న సమస్యల వైపు మళ్లిస్తూ కమ్యూనిజంపై నమ్మకాన్ని పోగొట్టుకున్నానని వెల్లడి చేయటంతో కొత్త వెలుగులని చాటుతుంది కథ. మనిషి నిరంతర చలనశీలి అన్న నమ్మకాన్ని బలపరుస్తుంది. కాలం తెచ్చే మార్పులకు మనిషి అతీతుడు కాదన్న సూచన చేస్తుంది. రెండు ప్రభావవంతమైన వాదనలను రచయిత ఆవిష్కరించిన తీరు అపురూపం.

‘వాళ్లు-మనం, మీరు-మేము’ కథ ప్రస్తుత భారతీయ సమాజంలో అనివార్యంగా చోటుచేసుకున్న దుష్పరిణామాలను వివరిస్తూ సమీప గతంలోని వెలుగులపై టార్చ్‌లైట్ వేసి ఫోకస్ చేసే కథ. ఆదర్శవంతులున్న ఒకప్పటి సమాజం నేడు శకలాలుగా చీలిపోతోందని బాధను వ్యక్తం చేసే కథ.

రాజభరణాలను రద్దుచేసిన ప్రభుత్వ నిర్ణయం దళారీ వేటగాళ్లను కూడా సృష్టించిందని చెప్పే కథ ‘చేపకనుల రాజకుమారి’ కథ. మిగిలిన కథల్లో ‘బూడిద రంగు అద్వైతం’, ‘మాయా దర్పణం’, ‘ఏడు కానాల వంతెన’ వంటివి మనిషిలోని సున్నితమైన పొరలను గడ్డ కట్టించే గడ్డుపరిస్థితులతో రాజీపడలేక – మేటలు వేసిన అశాంతితో, చిక్కు ముడులతో, జీవన ప్రవాహానికి ఎదురీదే క్రమాన్ని సూచించేవి.

జీవితం పట్ల, చరిత్ర పట్ల అపారమైన ప్రేమే కాదు – సశాస్త్రీయ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సమాజం అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ, మానవత్వపు పరిమళాలను పంచుతూ అడుగేస్తుందని చెప్పే కథలివి. బిగువైన కథనం, ఒద్దికయిన మాటలు గులాబీల తోటలో నడిచిన అనుభూతినిస్తాయి.

ప్రతి కథను అందమైన చిత్రంతో అలంకరించిన శ్రీ తల్లావఝుల శివాజీ గారికి ప్రత్యేక అభినందనలు.

ఇక తెలుగు కథావనంలో ‘తూరుపు గాలులు’తో ప్రత్యకంగా అందరి దృష్టిని ఆకర్షించిన రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారికి అనేకానేక ధన్యవాదాలు.

***

తూరుపు గాలులు (కథలు)

రచయిత: ఉణుదుర్తి సుధాకర్‌

పేజీలు: 220 వెల: రూ.180

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here