Site icon Sanchika

తోసుకొస్తోంది ఆనందం

[box type=’note’ fontsize=’16’] “కన్ను తెరిచినా, మూసినా, ఎన్నలేని ఎరుకా దాంతో పాటు ఎడతెరిపి లేని వాన జల్లుల లాగా ఒక సారి, మళ్ళీ, ఇంకా, ఆపకుండా, మళ్ళీ మళ్ళీ తోసుకొస్తోంది ఆనందం” అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని ఈ కవితలో. [/box]

[dropcap]తో[/dropcap]సుకొస్తోంది ఆనందం
మనస్సు నిండి, పట్టక,

దేహమంతా నిండి
మనో బుద్ధుల నిండా
పడి పొర్లుతోంది

పొద్దున్నే లేచేటప్పుడువొచ్చి పలకరిస్తోంది
వొదలకుండా వెంటపడి
మరీ ఏమీ తోచనివ్వకుండా మీదపడిపోతోంది
నేనెవ్వరనీ, నేను ఆత్మననీ ఏవేవో భావాలూ,
వాటిమధ్య అభావాలూ, వీటన్నిటికీ స్థాయీభావం గా
తోసుకొస్తోంది ఆనందం
మనస్సు నిండి, పట్టక,

కన్ను తెరిచినా, మూసినా, ఎన్నలేని ఎరుకా దాంతో పాటు
ఎడతెరిపి లేని వాన జల్లుల లాగా ఒక సారి, మళ్ళీ, ఇంకా,
ఆపకుండా, మళ్ళీ మళ్ళీ మీదపడిపోతోంది
అంతులేని సముద్ర తరంగాల లాగా ఎదవాకిలి గడప మీద కూచుని
ఎగసి ఎగసి పడుతోంది
ఎవరికీ చెప్పరాక, చెప్పినా ఎవరికీ అర్ధం కాక , అన్నీ వొదిలి
ప్రశాంత మౌనంలో హాయిగా, కుదురుగా కూర్చున్నా వొదలక
తోసుకొస్తోంది ఆనందం
మనస్సు నిండి, పట్టక

Exit mobile version