త్రయోదశి

0
2

[dropcap]”ర[/dropcap]శ్మీ, రశ్మీ” ఆత్రంగా పిలిచింది సునంద.

“అమ్మా, వస్తున్నా” అంటూ చేతిలోని కంప్యూటర్‌ను పక్కకు పెట్టి అమ్మ దగ్గరకు వచ్చింది రశ్మి.

“ఏంటమ్మా తొందరగా చెప్పు, అవతల పది నిముషాల్లో నాకు మీటింగ్ ఉంది.”

సునంద ఉత్సాహంగా, “రశ్మీ, ఈ రోజు పని తొందరగా ముగించు… సాయంత్రం ఏడు గంటల వరకేనట.. అందులో చలికాలం, తొందరగా వెళ్ళొద్దాం.”

“అసలు సంగతేంటో చెప్పు…” పని తొందరలో ఉంది రశ్మి.

“అదేనే! మొన్న కూడా నీతో చెప్పాను…సరిగా వినిపించుకోలేదు.. రేపే ఆఖరి రోజట, ఇవాళ తప్పకుండా వెళ్దాం.”

అమ్మ చెప్పబోయే సంగతి ముందే ఊహించింది.

“చూడే! అక్కడ ఎక్కువ సమయం మనం తీసుకోవద్దు…”

“ఎగ్జిబిషన్ ఈ హోటల్లో నట.” హోటల్ పేరు చెప్పింది.

“ఇదిగో వాళ్ళు అన్ని నమూనాలు కూడా ఇక్కడ పెట్టారు. చూడు..” సునంద ఉత్సాహంగా సెల్ చూపించ బోయింది. రశ్మి ముఖంలో విసుగు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

“నీకు రవ్వల సన్న నెక్లసు, దుద్దులు కొనాలని చాలా రోజులనుంచీ అనుకుంటున్నాను… సమయానికి అనేక ఇబ్బందుల వల్ల కొనలేదు. ఇప్పుడు ఇల్లు అమ్మిన డబ్బును మార్చి ఇక్కడకు తెప్పించుకున్నాను కదా,

ఈ సారి దీపావళికి తప్పక కొని ఇస్తాను. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని అంటారు. ఇన్ని రోజులూ కొనలేక పోయాను” తన ధోరణిలో చెప్పుకుని వెళ్తోంది సునంద.

అమ్మకు తనమీద ఉన్న ప్రేమ రశ్మికి తెలుసు,

“ఇప్పుడు రవ్వల నెక్లసు ఎందుకమ్మా, బంగారాన్ని మించిన బోలెడు నగలు అలంకారానికి దొరుకుతున్నాయి, అందులో ఇప్పుడు మనం బైటకు కూడా వెళ్ళటం లేదు.”

అమ్మ మాటను మరల్చాలనుకుంది రశ్మి.

“రశ్మీ! గిల్టు నగలెన్నున్నా అసలు విలువ వాటికెలా వస్తుందే? రేపు నీ కొడుకు పెళ్ళిలో ఇలాగే ఉంటావా ఏమిటి? నామాట కాదనకు!”

అమ్మతో వాదించ దలచుకోలేదు,

కూతురు ఇంత తొందరగా ఒప్పుకున్నందుకు మురిసి పోయింది.

సాయంత్రానికి త్వరగా ఫలహారం తయారుచేసి, తను కూడా కొత్తగా చేతికొచ్చిన డెబిట్ కార్డ్ పర్సులో పెట్టుకుని సిద్ధమయింది.

రశ్మిఫోన్లో మాట్లాడుతూ, “యెస్, అయ్ విల్ బి దేర్”.. అంటూ కిందకు వచ్చింది,

నేరుగా అమ్మ గదిలోకి వెళ్ళి తన పెద్ద బేగ్‌ను సర్దుకుని “పద అమ్మా,” అంది.

***

సునంద చలికి స్వెట్టరూ, చెవుల చుట్టూ మఫ్లరూ, మాస్క్ కట్టుకుని బయలు దేరింది.

కొంత దూరం వెళ్ళగానే.. “రశ్మీ ఇది మనం ఆర్థోపిడిషన్ దగ్గరకు వెళ్ళే దారనుకుంటాను కదే!” అంది

“అమ్మా! ధన్వంతరి త్రయోదశి ఎప్పుడమ్మా!?”

రశ్మి ఏ ఉద్దేశంతో అడిగిందో గమనించకుండానే,

“అదేనే.. క్షీర సాగర మథన సమయంలో శ్రీమహా విష్ణువు అంశావతారంగా అమృత కలశాన్ని పట్టుకొని సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు.”

చెప్తూ, చెప్తూనే ఆగిపోయింది సునంద.

అంతలో హాస్పిటల్ రానే వచ్చింది.

“ఓ.. ధన్వంతరి ప్రస్తావనను ఎందుకడిగివో ఇప్పుడు అర్థమయిందే” అంది సునంద అమాయకంగా …

“అమ్మా దిగు” అంది రశ్మి ఆజ్ఞాపిస్తున్నట్లు.

“అదేమిటే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు?” తను నగలను కొనడానికి ఎగ్జిబిషన్‌కు వెళ్దామన్న ఆశ కరిగిపోతూ ఉండగా

బేలగా అడుగు తున్న అమ్మను చూస్తూ,

“అమ్మా నువ్వు కారు దిగడానికి ఎంత శ్రమ పడుతున్నావు…! నిన్ను గమనిస్తూనే ఉన్నాను కాళ్ళ నొప్పితో కదలలేవు. సరదాగా నాలుగడుగులు వేయలేవు. డాక్టరుకి చూపించుకోమంటే,ఇంక ఈవయసులో ఎందుకే,

డాక్టర్ల దేముంది, ఆపరేషను అని అంటారు. దాని తరువాత బాగవుతుందని భరోసా ఏమిటి చెప్పు.. అంటావు.

అమ్మా, ఇప్పుడు నా నగల కంటే నీ ఆరోగ్యం ముఖ్యం. రేపు వచ్చేది ధన త్రయోదశి అన్నావు కదా! అది ధన్వంతరి త్రయోదశి కూడా అని చెప్పావుకదా! నువ్వు ఆయాస పడకుండా నాలుగడుగులు వేయగలిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది. ..? అప్పుడు నేను నగలు పెట్టుకున్న దానికన్నా నా అందం ఎంతో గొప్పగా ఉంటుంది.

డాక్టర్ అనగానే ఆపరేషన్ అని భయపడకు, ముందు ఆయన చెప్పే సలహాలన్నీ పాటించు, ఇదిగో, ఇండియా నుండి ఇక్కడకు వచ్చేముందర తీసుకున్న మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా తెచ్చాను,” అంటూ తన బేగ్ నొకసారి తడిమింది.

“ఈ త్రయోదశి నుంచి డాక్టర్ ఇచ్చే సలహాలన్నీ పాటించు. పద నడు, డాక్టరు అపాయింట్‌మెంట్ దాటితే కష్టం.”

రశ్మి పట్టుదల వదలదు.

సునంద కారు తలుపు పట్టుకుని మెల్లగా దిగింది.

భారంగా నడుచుకుంటూ

రశ్మి చేయి పట్టుకుని కదిలింది. ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here