Site icon Sanchika

పెరుమాళ్ మురుగన్ ONE PART WOMAN కు రాసిన రెండు సీక్వెల్లలో మొదటి నవల TRIAL BY SILENCE

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]పె[/dropcap]రుమాళ్ మురుగన్ రాసిన ONE PART WOMAN నవల తెలుగులో అర్ధనారి పేరుతో అనువాదం అయింది. అది చాలా నిరసనను ఎదుర్కొన్న నవల. కాళీ, పొన్నా అనే దంపతుల కథ అది. ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. వివాహమయి పన్నేండేళ్ళు గడిచినా వారికి సంతానం లేదు. అది ఒక్కటే వారి జీవితంలో ఉన్న లోటు. సంతానం లేదని సమాజం అనే మాటలు భరించడం కొన్ని సార్లు కష్టం అనిపిస్తుంది. మరో పెళ్ళి చేసుకోవడానికి కాళీ ఒప్పుకోడు. ఆ ఊరిలో ఉన్న ఆచారం ప్రకారం పొన్నను ఒక దేవాలయ ఉత్సవానికి పంపాలని కుటుంబం అనుకుంటుంది. ఇలా పిల్లలు లేని స్త్రీలు ఆ ఒక్క రోజు దేవుని సన్నిధిలో మరొక మగాడితో గడిపే అవకాశం ఉంది. ఆ ఊరిలో అలా పిల్లలను కన్నవారు చాలా మంది. పొన్నను ఆమె తల్లి తండ్రులు, అత్తగారు కలిసి ఆ ఉత్సవానికి పంపుతారు. అది ఆమె భర్త అనుమతితోనే జరుతుగుందని ఆమెను నమ్మిస్తారు. పొన్న ఉత్సవానికి వెళుతుంది. ఇది అర్ధనారి కథ. ఆ కథకు కొనసాగింపుగా రెండు ముగింపులు ఇస్తూ రచయిత మరో రెండు నవలలు రాసారు. అవే TRIAL BY SILENCE, A LONELY HARVEST. ఇలా ఒకే కథకు రెండు ముగింపులను రెండు విభిన్న నవలలుగా రాసిన ప్రయోగం మరెక్కడయినా జరిగిందో మరి తెలీదు. ఈ మూడు నవలలో పాత్రలు ఒక్కటే అయినా రెండు నవలలు సీక్వెల్‌గా రాయబడినా, ప్రతి నవల కూడా విడిగా చదువుకోవచ్చు. కథ సాగిస్తూనే ఎన్నో విషయాలను రచయిత చర్చకు తేవడం వలన ప్రతి నవల ఒక విడి నవలగా అనిపిస్తుంది. అది రచయిత గొప్పతనం. ఈ రోజు మనం మొదటి సీక్వెల్ TRIAL BY SILENCE గురించి తెలుసుకుందాం.

కాళీ అనుమతితోనే తాను ఉత్సవానికి వెళుతున్నానని పొన్న అనుకుంటుంది. పొన్న అన్న ముత్తు, కాళీకి బాల్య స్నేహితుడు. ఇద్దరి మధ్య చాలా స్నేహం ఉంటుంది. కాళీ పొన్నను ఉత్సవానికి పంపడానికి ఇష్టపడడని తెలిసే ముత్తు అతనితో తాగుతూ కూర్చుంటాడు. మత్తులో పడి నిద్రపోయాక అర్దరాత్రి కాళీ పొన్న కోసం లేస్తాడు. అత్తగారింటికి వస్తే అక్కడ పొన్న ఉండదు. ఆమెను ఉత్సవానికి పంపారని తెలుస్తుంది. అందరూ కలిసి తనకు ద్రోహం చేసారని భావిస్తాడు కాళీ, పొన్న కూడా ఇంట్లో వాళ్ళు వెళ్ళమనగానే ఉత్సవానికి వెళ్ళడం అతని మనసును గాయపరుస్తుంది. పొన్నను మరో మగాడి పక్కన ఊహించలేకపోతాడు. దుఖంతో తన ఇంటికి వచ్చేస్తాడు. రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటాడు. చివరకు తన ఇంటి ముందున్న పెద్ద చెట్టుకు ఉరి వేసుకోవాలని తాడు చెట్టుకి కడతాడు. అప్పుడే కాళీ తల్లి సీరయి అక్కడు వస్తుంది. కొడుకుని ఆ ప్రయత్నం నుండి విడిపించి కాపాడుకుంటుంది. ముత్తు కాళీని వెతుక్కుంటూ వస్తాడు. కోపం పట్టలేక కాళీ అతన్ని పిచ్చగా తంతాడు. తన ఇంటి నుండి వెళ్ళగొడతాడు. వాతలతో ఇల్లు చేరిన ముత్తు ఇంటిలోని ఆడవారికి కాళీ కోపం గురించి చెబుతాడు. పొన్నకు అప్పుడే తన భర్తకు తాను వెళ్ళడం ఇష్టం లేదన్న సంగతి తెలుస్తుంది. తల్లి తండ్రులను శపిస్తూ పుట్టింటితో సంబంధం శాశ్వతంగా తెంచుకుని భర్త కోసం అత్తగారింటికి వచ్చేస్తుంది.

కాళీ పొన్నతో మాట్లాడడు. ఆమెను తిడతాడు. పొన్న అది భరించలేకపోతుంది. కాళీ పొన్న అన్నం తీసుకువస్తే కూడా తినడానికి ఇష్టపడడు. ఒక్కడే కొష్టంలో ఉండిపోతాడు. పని చేయక, నిరాశతో తాగుడులో మునిగిపోతాడు. పొన్న వండిన అన్నం సీరయి అతనికి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటుంది. తల్లితో , భార్యతో అస్సలు మాటలు లేకుండా ఒక్కడే మత్తులో మునిగి తేలుతుంటాడు కాళీ. కొన్నాళ్లకు పనికి బైటకు వచ్చినా ఇంటితో సంబంధం పెట్టుకోడు.

ఈ పరిస్థితులలో పొన్న నెల తప్పుతుంది. సీరయి చాలా సంతోషిస్తుంది. ఆ బిడ్డ రాకతో మళ్ళీ మంచి రోజులు వస్తాయని నమ్ముతుంది. పొన్న పుట్టింటి వారు గడపపై మట్టి పోసి సంబంధం తెంచుకుంది కాబట్టి వారు ఈ ఇంటికి వచ్చే అవకాశం లేదు. అందువల్ల తానే పొన్న భాద్యత తీసుకుంటుంది. ఆ రెండు ఇళ్ళ మధ్య ఆమె వారధి అవుతుంది. సీరయి అన్న నల్లయన్ ఒకసారి వీరిని చూడడానికి వస్తాడు. అతనో విలాస పురుషుడు. ఆ వయసులో ఒక వితంతువును పెళ్ళి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి కారణం తన ఆస్తిపై కన్ను వేసి అక్రమాలు సాగిస్తున్న సోదరుల నుండి తనను తాను కాపాడుకోవడం. అతను మరో గుడి సంబరానికి కాళీని తీసుకువెళతాడు. అక్కడ జనంతో కలిసి తిరుగుతూ కాళీ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాడు. తాను సంతానం పొందుతున్నట్లే అక్కడ బిడ్డలను కన్న తండ్రులను చూస్తాడు. వారు తమ బిడ్డను దేవుడిచ్చిన వరం అనుకుని ప్రేమగా పెంచుకోవడం చూస్తాడు. అక్కడ పెద్ద వారి జానపద కథల ద్వారా పాటల ద్వారా లైంగిక క్రీడను సహజమైన అంశంగా తీసుకున్న ప్రపంచం పరిచయమవుతుంది. ఆ కథలలోని కుటుంబ సంబంధాలను విని సహజంగా లైంగిక క్రీడను స్వీకరించి స్త్రీని మరొకరితో సంతోషంగా పంచుకున్న పురుషులు గురించి దానికి కారణమైన వారి పరిస్థ్తితులను గురించి, ఆ పరిస్థితులకు లొంగి సంతోషంగా జీవిస్తున్న వారి గురించి కూడా తెలుసుకుంటాడు. ఇంటికి వచ్చాక పొన్న ఒక మగ బిడ్డను ప్రసవిస్తుంది. భర్త మౌనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోబోయే పొన్నను కాపాడి కాళీ ఆమెను స్వీకరించడం నవల ముగింపు.

ఈ నవల మానవ సంబంధాలను మరో కొత్త కోణంలో చూపిస్తుంది. సెక్స్ అన్నది ప్రేమను వ్యక్తీకరించే ఒక క్రియ మాత్రమే అని, పూర్తిగా దాని ఆధారంగానే సంబంధాలు ప్రాచీన సమాజంలో ఎంచబడలేదు అన్న కోణంలో చాలా జానపద కథలు కనిపిస్తాయి. ప్రతికూల పరిస్థితులలో స్త్రీలలో శక్తి బైటపడడం, పురుషుని సహాయం లేకుండా వారు జీవించడానికి అలవాటు పడడం ఇందులో చూస్తాం. పొన్న సీరయి ఇద్దరు అత్త కోడళ్ళుగా కాక స్నేహితులుగా సమస్యను ఎదుర్కోవడం చూస్తాం. పిల్లలను ఆస్తికి వారసులుగా కనవలసి రావడం, ఇంటి పేరు కోసం, వంశం సాగడానికి ఆస్తి పరుల పరం కాకుండా ఉండడానికి సమాజంలో పిల్లలు పెద్ద అవసరంగా కనిపిస్తారు. పిల్లలు లేని తల్లితో పాటు తండ్రి కూడా ఎన్నో ప్రతికూలాలు ఎదుర్కోవలసి వస్తుంది. అతని ఆస్థి పై అతని సంపాదనపై అతనికే హక్కు లేకుండా పోతుంది. కుటుంబ రక్షణ కోసం పిల్లల అవసరం సృష్టించిన వ్యవస్థ మనకు స్పష్టంగా కనపడుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో జానపద కథలలో సెక్స్ చాలా సాధారణమైన విషయంలా చర్చించుకోవడం, తర్కించుకోవడం చూస్తాం. నగరాలలో నివసించేవారు మాట్లాడటానికి సందేహించే ఎన్నో అంశాలు పల్లెటూరి ప్రజలు సహజంగా మాట్లాడుకోవడం చూస్తాం. అక్రమ సంబంధాలను భూతద్దాలలో చూసే వ్యక్తులు ఇక్కడ చాలా తక్కువ. పొన్న ఉత్సవానికి వెళ్ళిందని బాధపడుతున్న కాళీకి సీరయి, పెళ్ళికి ముందు ఎంతో ఉత్సాహంగా కాళీ ఆ ఉత్సవానికి వెళ్ళడం గుర్తు చేస్తుంది. నీవక్కడకు ఎందుకు వెళుతున్నావో తెలిసినా నీ ఆనందానికి అడ్డు రావడం ఎందుకని నేను మిన్నకుండిపోయాను, ఇప్పుడు పొన్నపై అంత కోపం ఎందుకని సూటిగా ప్రశ్నిస్తుంది. కొన్ని సందర్భాలలో వివాహేతర, శారీరిక సంబంధాలను సహజంగా అమోదించే సమాజం ఈ నవలలో కనిపిస్తుంది. వివాహం తరువాత తాను తన భార్యను తప్ప మరో స్త్రీని ఎరగననీ పొన్న కూడా అలాగే ఉండాలనుకున్న పట్టుదల ఒక్క కాళీ లోనే కనిపిస్తుంది.

జంతువుల సంభోగం విషయం గురించి కూడా విపులంగా రాస్తారు రచయిత. ఆవును ఆంబోతు దగ్గరకు తీసుకువెళ్ళి గర్బం వచ్చేలా చేస్తారు. ఆంబోతుతో కూడిగా ఆవు గర్బం దాల్చకపోతే ఆ ఆంబోతును మార్చడం సహజం. మరో జంతువుతో ఆ ఆవును జతపరచి అది బిడ్డను కనేలా చూస్తారు. ఇదే పద్దతిని సహజంగా మనుష్యుల మధ్య జరిగే ఏర్పాట్లను అందరు ఆమోదించినట్లు కాళీ ఆమోదించలేక మథన పడుతూ ఉంటాడు. చివరకు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి, మనుష్యులను గమనించి పొన్నతో తిరిగి కలిసిపోతాడు కాళీ. మనుష్యులు ఎంతో కలవరపడే నీతి నియమాలు సమాజం చేసే కండిషనింగ్ నుండే పుడతాయి అన్న విషయాన్ని స్పష్టపరుస్తుంది ఈ పుస్తకం. ఎన్నో సామాజిక విషయాలను చర్చించిన నవల ఇది. కొన్ని సమాజాలలో సమూహాలలో ఆమోద యోగ్యం అయిన విషయాలు మరికొన్ని సమూహాలలో తప్పులుగా కనిపిస్తాయి. ఈ రెండు సమాజ నియమాల మధ్య బ్రతుకుతున్న మానవుడిలోనే సంఘర్షణ ఉంటుంది. మానవ విలువల మీద జరిపే ప్రతి చర్చలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

కొన్ని యుగాలలో మంచి అనుకున్న విషయాలే తరాలు మారిన తరువాత తప్పులు అవుతాయి. సమాజ ఆమోదం పొందిన విషయాలే నీతి నియమాలుగా మారతాయి. అందుకే నైతికత అన్నదే పెద్ద క్లిష్టమైన విషయం అవుతుంది. మన దేశంలో తప్పు అనుకునే చాలా విషయాలు విదేశీయులకు తప్పు కావు. మనం ప్రతిబంధకాలుగా చూసే ఎన్నో విషయాలను సహజమైనవిగా కొట్టిపడేస్తాయి మరి కొన్ని సమూహాలు. మానవ సమూహం, మన చుట్టూ ఉన్న సమాజమే, నీతి నియమాలను నిర్ణయిస్తుంది. ఆమోదిస్తుంది. అందుకే చాలా సందర్భాలలో ఈ రెండు దృవాల నడుమ మనిషి నలిగిపోతూ కనిపిస్తాడు. ఎంతో మానసిక సంఘర్షణను అనుభవిస్తాడు. మనిషి ఆలోచనా విధానాన్ని కండిషనింగ్ చేసే సమాజాన్ని గమనించి అతని నైతికతను ప్రశ్నించాలనే ఆలోచనను విప్పి చెప్పిన నవల ఇది.

ఒకే కథకు రెండు సీక్వెల్లివ్వగలిగిన రచయిత శైలి కోసం ఈ నవలలను చదవాలి. Trial by Silence లో కాళీ ఆత్మహత్యా ప్రయత్నాన్ని తల్లి అడ్డుకుని అతనిలో మార్పు వచ్చేలా ప్రయత్నిస్తుంది. కాని రెండో నవల దీనికి భిన్నంగా సాగుతుంది.

రెండో సీక్వెల్ వచ్చే వారం.

Exit mobile version