[dropcap]“పా[/dropcap]శ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన కళాతపస్వికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నాము. శుష్కించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము..”
వినీలాకాశంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న విశ్వనాథుని చిత్రకళా నక్షత్రాలు ఉద్విగ్నంగా ఉన్నాయి. పై విధంగా అంజలి ఘటిస్తున్నాయి గౌరవంగా, భక్తితో.
వాటిలో పురస్కార నక్షత్రాలు మరింత జ్వాజ్వల్యమానంగా ఉన్నాయి. జాతీయ పురస్కారాల నక్షత్రాలు, నంది నక్షత్రాలు, ఫిలింఫేర్ నక్షత్రాలు, జీవితకాల పురస్కార నక్షత్రాలు, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తార, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార తార, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ తార, రఘుపతి వెంకయ్య పురస్కారం తార.. అన్నీ విశ్వనాథుని కీర్తి కిరీటంలో మెరిసినవే. ఆ ఇంటిలో భౌతికంగా కొలువుతీరి ఉన్నా, కొద్ది క్షణాల ముందు విను వీధుల్లో విశ్వనాథ్‌కి దారి చూపాలా అన్నట్టు వాటి తేజో రూపాలు పైకి చేరుకొన్నాయి.
2023 ఫిబ్రవరి 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో.. ఆ కళాతపస్వి మహాభినిష్క్రమణ క్షణాలను మౌనంగా వీక్షిస్తున్నాయి.
కానీ ఆ గాంభీర్య వదనం ఆతని ఘనమైన చరిత్ర నేదో చెబుతున్నట్టు ఉంటుంది. హీరో హీరోయిన్ లకు పాటలే కాదు మాటలే లేవు. (వంట చేయవచ్చు కదా అన్న ఒక్కసారి తప్ప).
తనూ, తన సంగీతమూ గొప్పగా వెలుగుతున్న రోజుల్లో తన్మయంతో కచేరీ చేస్తుంటే, ఏదో కుర్చీ బర్రున లాగిన శబ్దానికి ఆగ్రహంతో వేదికను వదిలి వెళ్ళిన శంకరశాస్త్రి – తన ప్రభ తగ్గిపోయిన తర్వాత కూడా, కన్నకూతురు పెళ్ళిచూపుల్లో ఏదో ఊహల్లో ఉండి ఒక స్వరం తప్పుగా పలికిందని కూతుర్ని “శారదా” అని గర్జించి ఆపినప్పుడూ, ఆ పెళ్ళికొడుకు కంగారుగా ‘రిషభం’ అనబోయి ‘వృషభం’ అనేసరికి ఆగ్రహోదగృడై “బైటకు నడు” అని ఆజ్ఞాపించేటప్పుడు కూడా ఏమీ తగ్గకపోవడం సంగీతం పట్ల అతని కున్న అచంచలమైన విశ్వాసం, నిబద్ధత తెలుస్తోంది. అన్నవరం గుడి మెట్లు, గ్లాసు దొర్లిపడడం ఆ రోజుల్లో యువతకు ఒక అందమైన అనుభూతి. మౌనంగా తనను ఆరాధించిన తులసి కుమారుడికి తన సంగీత వారసత్వాన్ని అందిస్తున్నాడా అన్నట్లు తన కాలికి ఉన్న గండపెండేరాన్ని పిల్లవాడికి తొడిగి, శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదిస్తూ జీవన నాటకం నుండి నిష్క్రమిస్తాడు శంకర శాస్త్రి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలను చేర్చిన చిత్రరాజమది. అందుకే మరో ఆలోచన లేకుండా నేను వచ్చాను ఆభరణంలా అతని మెడలోకి..” అన్నది జాతీయ పురస్కారం.
“విరించినై విరచించితిని ఈ కవనం / విపంచినై వినిపించితిని ఈ గానం..
మరో నక్షత్రం పలుకుతోంది.. “ఎందరికో ఉత్తమ పురస్కారాలు అందించిన చిత్రం సిరివెన్నెల.
కథానాయకుడు హరిప్రసాద్ అంధుడు. నాయిక మూగ చిత్రకారిణి సు భాషిణి. వీరిద్దరి మధ్య ప్రేమ. ఎలా పరస్పరం వెల్లడించుకుంటారో అని ప్రేక్షకుడికి కుతూహలం. హరిప్రసాద్ చూడలేని ప్రపంచంలోని అందాలను గతంలో అతనికి తెలిసేలా చేసింది మిత్రురాలు జ్యోతిర్మయి. ప్రకృతి అందాలని తన శరీరభాగాల అందాలకి ‘తాకిస్తూ’ అతని మనఃచక్షువుకి ‘చూపించడం’ అద్భుతం అనిపిస్తుంది కానీ అశ్లీలంగా లేదు. ఆ అనుభూతిని మనసా అనుభవించిన హరిప్రసాద్ తన వేణు గానం ద్వారా మరో అంధురాలైన పాప ‘చందమామ రావే..’ అంటూ మురిసిపోయేలా సిరివెన్నెల సొగసుని ఆవిష్కరించాడు. జల్లులు జల్లులుగా కురిసిన సిరివెన్నెల లో ప్రేక్షకులు కూడా ఆనందంగా తడిచి ముద్దయ్యారు..” తాదాత్మ్యంతో ఆగింది.
మరో నంది పలికింది.. “కథానాయకుడు వయసు పెరిగినా బుద్ధి ఎదగని వాడు. ఒక కొడుకు ఉన్న వితంతువు కథానాయిక. అతని అమాయకత్వమో, విధి రాతో శివయ్య చేత లలిత మెడలో మూడు ముళ్ళు వేయించింది. ఎదుటి వాళ్ళు ఏం చేస్తే అదే తాను అనుకరించటం మాత్రం ఆ శివయ్యకి తెలుసు. ప్రపంచ జ్ఞానం లేని స్వాతిముత్యం లాంటి భర్తకి దాంపత్య శృంగారం లలిత ఎలా నేర్పించిందో చూస్తే ప్రేక్షకులకి గౌరవం కలుగుతుంది, కానీ ఏ మాత్రం ఏహ్య భావం రాదు. లలిత కొడుకు, లలితా శివయ్య లకి కలిగిన కొడుకు ఎంతగా శివయ్యని ప్రేమిస్తారో ప్రేక్షకుల గుండెల్లోనూ అతని పట్ల చెరగని ప్రేమ నిలిచే ఉంది”.. అంటూ ఆగింది.
“తాగి తాగి అనారోగ్యంతో ముసలివాడిలా ఉన్న బాలకృష్ణ తూలుతూ రవీంద్రభారతిలోకి వస్తాడు. కిళ్లీ నములుతూ, ఊస్తూ, వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చి, పైజమా తాడు కట్టుకుంటూ హాల్‌లో ప్రవేశిస్తాడు.
విశ్వనాథ్ విశ్వరూపం కనిపించే చిత్రరాజాలు శంకరాభరణం, సాగరసంగమం.
“హీరోయిన్ హైమ అందానికి అందమైన పుత్తడి బొమ్మ అయినా మూగది. పని పాటలు చేసుకుంటూ డప్పు కొట్టేవాడు హీరో సాంబయ్య. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడి ఊరు విడిచిన హైమకి అండదండగా నిలిచాడు సాంబయ్య. ఆమెకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు మనస్పూర్తిగా. అతని పట్ల ఆమె అభిమానం ప్రేమగా మారింది ఆమెకే తెలియకుండా. ఆ ఊగిసలాటలో – హైమ గజ్జెలు సాంబయ్య డప్పు మీద పడడం అనే సున్నితమైన ప్రతీకతో ఆమె మనసు ఆమెకీ, ప్రేక్షకులకూ తెలియజేస్తారు విశ్వనాథ్. ‘గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో’ అలా సాంబయ్య హైమని చేరుకోవడంతో ఇద్దరూ కలిసి నాట్య సంగీతాల్లా, సిరిసిరిమువ్వల్లా ‘అద్వైత సిద్ధి’ పొందారు.”
బంగారు నంది మాట్లాడుతూ.. “స్వర్ణకమలం లాంటి హీరోయిన్ మీనాక్షికి సినిమా పిచ్చి. సినిమాలు చూస్తూ, కలల్లో తేలిపోతూ, ‘కొత్తగా రెక్కలొచ్చినా..’ అన్నట్టు ఆనందాలలోకాల్లో విహరించాలని ఆశ పడుతూంటుంది. నాట్య శాస్త్ర విశారదుడైన తండ్రి దగ్గర గత్యంతరం లేక నాట్యం నేర్చుకుంది కానీ మనసు పెట్టలేకపోయింది తండ్రి విలువ నాట్య కళ వైభవం తెలుసుకోలేక గజ్జెలు బావిలో పడేయటమే కాక బలవంతంగా వేదిక పైకి ఎక్కిస్తే కాళ్లతో గజ్జెల్ని విసిరి పారేసింది. ఆమెను అభిమానించే చంద్రశేఖర్ ఎంతగా చెప్పినా విసుక్కుంటుంది మొండిగా. అమెరికా నుండి భారతదేశం వచ్చి నాట్యం నేర్చుకున్న (నిజ జీవితంలో షారోన్ లోపెన్) ఒక నాట్య కళాకారిణి, చంద్రశేఖర్ ప్రోద్బలంతో తండ్రి గొప్పతనం, నాట్యం విలువ, తన అజ్ఞానం గుర్తించి, తాదాత్మ్యం చెందుతూ చేసిన మీనాక్షి నాట్యం లో ఈసారి ‘జీవం’ తొణికిస లాడింది.”
ఉత్సాహంగా తారలు పలుతున్నాయి,.
“రాగాల పల్లకిలో కోయిలమ్మ సుజాత, ‘నా ఉద్యోగం పోయిందండి’ అనే హోటల్ బట్లర్ మూర్తి మధ్య సున్నితమైన ప్రేమ వికసించి, శుభలేఖ వరకు చేరింది.”
“గురువుగారి ఈర్షాసూయలకు తనను తాను బలి ఇచ్చుకున్న స్వాతి కిరణం వంటి శిష్యుడు, ఆ గురువు పశ్చాత్తాపం, గురుపత్ని నిర్వేదం.. కల్పిత పాత్రలు కావు, ఎందరో ఉన్నారు అనిపిస్తుంది”.
“50 సినిమాలకు దర్శకత్వం, 31 సినిమాల్లో తెలుగు తమిళం కన్నడలో నటించడం., ఎన్నెన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు విశ్వనాథ్‌ని వరించినా ఆయన నిగర్వి. కాకీ దుస్తులు ధరించి సినిమా అనే ఒక పవిత్ర భవనానికి తానొక కార్మికుడిని అని మనసా భావించే నిరాడంబరుడు.”
“సినిమాలు సరే, అతని వ్యక్తిగత జీవితం ఏమిటో చెప్పాలిగా” అంది పద్మశ్రీ తార. దాదాసాహెబ్ ఫాల్కే తార, మిగిలిన తారలు గంభీరంగా వినసాగాయి.
“1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామంలో జన్మించిన కాశీనాథుని సుబ్రహ్మణ్యం, ‘సరస్వతీ పుత్రు’డాయన. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఏ.సి. కళాశాలలో బి.యస్సీ చదివారు. తండ్రి వాహినీ స్టూడియోలో మేనేజర్. కుమారుడు కూడా అలానే ఉద్యోగం చేయాలని ఆ తండ్రి కోరిక. ఒకవేళ అలా జరిగితే ఒక చెక్క కుర్చీలో కూర్చొని లెక్కలు రాసుకునే మామూలు వాడిగా ఉండేవాడేమో కానీ, ఈ, శ్రుతిలయలు, స్వర్ణకమలాలు, స్వాతిముత్యాలు, స్వాతికిరణాలు మనకు దక్కేవి కావు. విశ్వనాథ్ ట్రైనింగ్ తీసుకొని వాహినిలో సౌండ్ ఇంజనీర్‌గా సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. సహ దర్శకునిగా అతని శ్రద్ధ, స్క్రీన్ ప్లే లో నైపుణ్యం చూసి దర్శకుడు మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో మొదటిసారి మెగాఫోన్ పట్టుకొన్నారు. మొదటి చిత్రానికే నంది రావడంతో – ఆత్మగౌరవం ఉన్న శిల్పం లాంటి కాంచనతో పాటు ‘అందెను నేడే అందని జాబిల్లి..’ అనుకొన్నారు. ఇక వెనుదిరిగి చూడలేదాయన.
“సంగీత సాహిత్య సమలంకృతంగా ఎన్నో సినిమాలు! దాదాపు అన్ని సినిమాలకి కథలు తనే వ్రాసుకున్నారు
చాలా చిత్రాల్లో కథానాయకుడు కానీ, నాయిక గానీ అంగవైకల్యం ఉన్నవారే. అయితే ఎక్కడా అవిటితనాన్ని చీప్ హాస్యానికి ఉపయోగించుకోలేదు. అలాంటి వారు కూడా కష్టపడి విజేతలుగా ఎదిగిన వైనాన్ని ఆశావహ దృక్పథంతో చూపారు. చెప్పులు కుట్టుకుని జీవించే సాంబయ్య ‘స్వయంకృషి’తో ఎదగడం, వ్యాపారం వృద్ధి చెంది కోటిశ్వరుడైనా, డబ్బు జబ్బు చేయకుండా, తన పాత జీవిత మూలాల్ని మర్చిపోకుండా నిరాడంబరంగా ఆదర్శవంతంగా చిరంజీవిగా నిలిచిపోతాడు.
ఒక ఇంటికి, ఇంట్లోని మనుషులకు అంకితమై పోయిన పనివాడుగా, ఆపద్భాందవుడుగా మెగాస్టార్‌ని చూపించి ఫాన్స్ మనసుల్ని టోకున కొల్లగొట్టేసారు విలక్షణ దర్శకుడు డాక్టర్ విశ్వనాథ్.
సంప్రదాయాల్ని గౌరవిస్తూనే, సంఘంలో పాతుకుపోయిన మూఢవిశ్వాసాలని, కుల వివక్షతని, వివాహ వ్యవస్థ లోని కఠినమైన చట్రాన్ని (సప్తపది) నిరసించారు. మూస ఫార్ములాతో కాకుండా, సమాజంలో ఉండే మామూలు మనుషుల్ని, మనస్తత్వాల్ని ఉట్టిపడేలా, తెలుగుదనాన్ని అణువణువునా ప్రతిబింబించేలా చిత్రాలు తీసారు. అజరామరమైన కళ అంతరించిపోరాదని, వారసత్వం తర్వాతి తరాలకు అందించాలని చెప్పారు.
అద్భుతమైన అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రేక్షకులు. ఎలా ఉంది – అని అడిగితే చప్పున చెప్పలేరు. మౌనంగా ఆ నాదామృతాన్ని, విశ్వనాథామృతాన్ని గ్రోలిన మత్తులో ఉంటారు. ఇదీ ఆయన సినిమాల ప్రత్యేకత.
“ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు” అని స్పష్టంగా ఎన్నో సినిమాల్లో సందేశమిచ్చిన ఆయనకి ఏదో బురద అంటించాలని చేస్తే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిది.
ఆధునిక యుగంలో నిద్రాణమై ఉన్న కళను తట్టి లేపారు కళా తపస్వి. హరికథలు, గంగిరెద్దుల నాడించే వారు, మత్స్యకారులు, చెప్పులు కుట్టే వారు, తప్పెట గుళ్ళు, కనుమరుగై పోతున్న ఎన్నో కళారూపాల్ని తన చిత్రాల్లో చూపారు.
ప్రాణనాడులకు స్పందనలొసగిన ఆ రసధారను ఆస్వాదిస్తూ, ‘శంకరాభరణం’ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లోను పిల్లలు సంగీతం నేర్చుకోడానికి ఉత్సుకత చూపారు. ‘సాగరసంగమం’, ‘స్వర్ణకమలం’ వచ్చినప్పుడు నాట్యం.
భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే వారి సామాన్లు, సూట్‌కేస్ లలో ఆ రోజుల్లో భద్రంగా ఇష్టంగా విశ్వనాథ్ గారి సినిమాలు విసీడిలు, సి.డి.లు వుండేవి. అదొక ఆనందం, ప్రిస్టేజ్ కూడానూ.
తనకు అత్యంత కీర్తిని తెచ్చిన ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే (43 ఏళ్ళ తర్వాత) ఫిబ్రవరి 2న విశ్వనాథ్ శివైక్యం చెందడం ఒక యాదృచ్ఛికం, విశేషం. అజరామరమైన ఖ్యాతిని ఆర్జించి, ఆ అనుభూతులను మనకందించి, భౌతికంగా దూరమైనా తెలుగు వెండితెర పరిపుష్టం చేసి, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచివుంటారు.”
తారలన్నీ కలిసి ముక్తకంఠంతో పలికాయి..
“జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః నాస్తితేషాం యశః కాయే జరా మరణజం భయం”!
🙏🙏 ఓం శాంతి 🙏🙏