Site icon Sanchika

అడిగోపుల మరణానికి ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం సంతాపం

[dropcap]ది[/dropcap] 19 జూలై 2024న మృతి చెందిన ప్రముఖ కవి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం గౌరవ సలహాదారులు శ్రీ అడిగోపుల వెంకటరత్నం మరణానికి ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం సంతాపం ప్రకటిస్తున్నది.

ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న అడిగోపుల వెంకటరత్నం శుక్రవారం ఉదయం తిరుపతిలో తుది శ్వాస విడిచారు. వృత్తిరీత్యా గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన, తిరుపతిలో స్థిరపడ్డారు. ప్రవృత్తిరీత్యా గత ఐదు శతాబ్దాలకు పైగా అలనాటి భారతి పత్రిక నుండి ఈనాటి అనేక పత్రికలలో వామపక్షభావజాలంతో కూడిన వందలాది అభ్యుదయ కవితలు రచించారు.

1984లో ‘సూర్యోదయం’ కవితా సంపుటి మొదలుకొని 2024లో ‘నిలువెత్తు సంతకం’ వరకు 27 కవితా సంపుటాలు, 1995లో ‘పురోగతి అంచున’ అనే పేరుతో ఒక కథా సంపుటి వెలువరించారు అడిగోపుల. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంనుండి ఉగాది పురస్కారం, గిడుగు తెలుగుభాషా పురస్కారం వంటి పలు పురస్కారాలు గతంలో పొందారు. జాతీయ కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. ఆయన రచించిన పుస్తకాలు కొన్ని విజయవాడలో పలు వేదికలపై ఆవిష్కరింపబడ్డాయి.

తెలుగు సాహిత్యరంగంలో తనదై సంతకంతో అశేష కృషి చేసి అడిగోపుల లేని లోటు పూడ్చలేనిదని ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రారంభం నుంచి గౌరవ సలహాదారులుగా తగు సలహాలు, సూచనలతో తనదైన సేవలను అందించడం మరువలేనిదని సంఘ కార్యవర్గం ప్రకటిస్తున్నది.

డా. సి. భవానీదేవి, అధ్యక్షులు

చలపాక ప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

Exit mobile version