[14 జూన్ 2023న మృతి చెందిన గాయని శారదకి నివాళిగా కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘పాడుతా తీయగా’ పుస్తకంలోని వ్యాసాన్ని అందిస్తున్నాము.]
‘తిత్లి ఉడీ, ఉడ్ జో చలీ ఫూల్ నె కహా,
ఆజా మెరే పాస్ / తిల్లి కహే మై చలి ఆకాష్’
‘సూరజ్’ సినిమాలోని ఈ సూపర్ హిట్ గీతంతో విభిన్నమైన వర్ణాలతో అలంకృతమయిన ఓ సీతాకోకచిలుక లాంటి స్వరం హిందీ సినీ ప్రపంచంలోకి ఎగుర్తూ వచ్చింది. అయితే పాటలో సమాధానం ఇచ్చినట్లు, ఆకాశాన్ని తాకాలని ఎగిరినా, దాని లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది. దాని రెక్కలు విరిచారు. ఎగరకుండా బంధించారు. దారి మళ్లించి నేలపైకి విసిరేశారు. హిందీ సినీ ప్రపంచంలోని రాజకీయాలను ప్రత్యక్షంగా అనుభవించి, వాటికి బలైపోయి, రెక్కలు తెగి ఓ మూలబడిన గాయపడిన పక్షిలాంటి గాయని శారద!
శారద పూర్తి పేరు శారద రాజన్ అయ్యంగార్. బాల్యం నుంచీ సంగీతం పట్ల ఆమెకు ఆసక్తి. రాజ్‍కపూర్ ఓ సందర్భంలో టెహరాన్ వెళ్లినప్పుడు, అక్కడ పార్టీలో శారద పాట విని మెచ్చాడు. ఆమెని బొంబాయికి ఆహ్వానించాడు. హిందీ సినీప్రపంచంలో ఆ కాలంలో రాజ్‍కపూర్ దృష్టిలో పడటం అంటే అదృష్టం వరించినట్టే. వ్యక్తులలో ప్రతిభను గుర్తించటంలోనే కాదు, సానబెట్టి వజ్రంలా మెరిపించి ప్రపంచానికి ప్రదర్శించటంలోనూ రాజ్‍కపూర్ దిట్ట. అతని జట్టులో అత్యున్నత ప్రతిభాశాలురకే స్థానం. అందుకే రాజ్‍కపూర్ బొంబాయికి ఆహ్వానించగానే, శారద టెహరాన్ నుంచి బొంబాయి వచ్చి చేరింది. ఆమె స్వరాన్ని సానబెట్టే బాధ్యతను రాజ్‍కపూర్ ప్రఖ్యాత సంగీత దర్శకులు శంకర్ జైకిషన్‍లకు అప్పగించాడు. ఆ కాలంలో నటీనటులతో సంబంధం లేకుండా శంకర్ జైకిషన్ సంగీత దర్శకులన్న మాట వినబడితే చాలు డిస్ట్రిబ్యూటర్లు మరేమీ ఆలోచించకుండా సినిమాను కొనేసేవారు. ఎందుకంటే వారు సంగీత దర్శకత్వం వహిస్తే పాటలన్నీ ఎలాగో హిట్టే, సినిమా కూడా నాణ్యతపరంగా ఉచ్చస్థాయిలో ఉంటుందన్న నమ్మకం ప్రజలలో స్థిరపడింది. అంతేకాదు, నటీనటులను సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దటం, నిర్మాత దర్శకులు సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానం సంపాదించటంలోనూ శంకర్ జైకిషన్‍లు ప్రధాన పాత్ర వహించేవారు. రాజ్‍కపూర్, రాజేంద్రకుమార్, షమ్మీ కపూర్, శశికపూర్, ధర్మేంద్ర వంటి నటులకు ఇమేజీని తమ పాటల ద్వారా సృష్టించారు. అనేక బ్యానర్లు విజయవంతమైన సినీ నిర్మాణ బ్యానర్లుగా శంకర్ జైకిషన్‍ల వల్ల ఎదిగాయి. ‘లత’ గాయనిగా అగ్రస్థానం చేరుకోవటంలో ప్రధాన పాత్ర వహించింది శంకర్ జైకిషన్‍లే. ‘బర్సాత్’తో ఆరంభించి సినిమాల్లోని అన్ని పాటలూ ఆమెతో పాడించి, ప్రతి పాటనూ హిట్ పాటగా రూపొందించి, ఆమె ప్రతిభను ప్రదర్శించినవారు శంకర్ జైకిషన్‌లు. మన్నాడే, రఫీ, సుబీర్ సేన్, ముబారక్ బేగం వంటి గాయనీ గాయకుల వైశిష్ట్యాన్ని తమ పాటల ద్వారా ప్రపంచానికి ప్రదర్శించారు. లత రఫీతో పాడనని భీష్మించుకుని కూచున్నప్పుడు సుమన్ కళ్యాణ్‍పూర్ కు అవకాశాలిచ్చి, లతకు ధీటుగా నిలిపారు. దాంతో రఫీతో రాజీపడాల్సి వచ్చింది లతకు. అలాంటి సంగీత దర్శకుల అండ శారదకు లభించటం అంటే, ఆమె కెరీరు ఆరంభమే ఉచ్చస్థాయిలో ఆరంభమైనట్టు.
శంకర్ జైకిషన్‍లకు శారద పరిచయమైన సమయంలో శంకర్ జైకిషన్‍ల జంటను విడగొట్టాలన్న ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి. కలిసి ఉన్నంతకాలం వారికి ఎదురులేదన్నది జగద్విదితమే. దాంతో రకరకాల వ్యాఖ్యల ద్వారా, నీలివార్తల ద్వారా వారిద్దరి నడుమ పొరపొచ్చాలు సృష్టించాలని సినీ పరిశ్రమలో ప్రయత్నాలు సాగుతూ వచ్చాయి. శంకర్ కన్నా జైకిషన్ ప్రతిభావంతుడని, జైకిషన్ పాటలే అధికంగా హిట్ అవుతున్నాయని ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానించేవారు. ‘హిట్’ అయిన ప్రతి పాటనీ జైకిషన్ పాటగా నిర్ధారించి, జైకిషన్ ఆధారంగా శంకర్ సౌఖ్యాలనుభవిస్తున్నాడని ప్రచారం చేశారు. దీనికి తోడు ‘సంగం’ సినిమాలో ‘మై క్యా కరూ రామ్’ పాట అసభ్యంగా ఉందని, దాన్ని పాడనని లత పట్టుబట్టినపుడు, శంకర్ పట్టుబట్టి ఆమెతోనే ఆ పాట పాడించాడు. పాట సూపర్ హిట్ అయింది కానీ, శంకర్‌కు కానీ, రాజ్‍కపూర్ సినిమాల్లో కానీ పాడనని లత ప్రతిజ్ఞ పూనింది. ఇదే సమయానికి అనుకోకుండా ‘సంగం’లోని ‘యే మేరా ప్రేమ్ పత్రే పఢ్ కర్’ పాట బాణీ తాను సృజించిందేనని జైకిషన్ బహిరంగం చేశాడు. దాంతో శంకర్ ‘దోస్త్ దోస్త్ నా రహా’ పాటకన్నా జైకిషన్ యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’ గొప్పగా ఉందని ప్రచారం చేస్తూ ఇద్దరినీ విడగొట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. శంకర్ జైకిషన్‍ల నడుమ విభేదాలు తీవ్రమయ్యాయి. ఇదీ శారద బొంబాయిలో శంకర్ జైకిషన్‍లకు పరిచయమైనప్పటి పరిస్థితి.
లతా మంగేష్కర్ తన పాటలు పాడననటంతో శంకర్ ప్రత్యామ్నాయ గాయని కోసం వెతుకుతున్న సమయంలో శారదను రాజ్‍కపూర్ వీరికి పరిచయం చేశాడు. రాజ్‍కపూర్ పాటలు పాడనని లత అనటంతో, లతకు ప్రత్యామ్నాయంగా నిలిపేందుకు శారదను రంగంలోకి దింపాడని శంకర్ భావించటం స్వాభావికం. కానీ సినీప్రపంచంలో లతను కాదని సంగీత దర్శకులు మనగలగటం కష్టం. అప్పటికే లత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లను, శంకర్ జైకిషన్‍లకు పోటీగా ప్రోత్సహిస్తోంది. శంకర్ జైకిషన్‍ల లాంటి పాటలను, అదే స్థాయిలో సృజిస్తూ, తక్కువ ధరకే పనిచేసే లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్‌జీ ఆనంద్‍జీ, ఆర్.డి. బర్మన్‍ల వైపు నిర్మాతలు మొగ్గుచూపించటం ఆరంభించారు. దీనికి లతతో వైరం తోడయింది. అయితే, లత శంకర్ పాటలు పాడనంది కానీ జైకిషన్ పాటలు పాడతానంది. దాంతో కొత్తగాయనితో పాడించి, లతకు మరింత దూరమవటం కన్నా ఆమెతో పాటలు పాడించేందుకు మొగ్గు చూపాడు జైకిషన్. కానీ ‘లత’లాగే శారదనూ తన ప్రతిభతో అగ్రస్థానంలో నిలబెట్టగలనన్న ఆత్మవిశ్వాసంతో శంకర్ శారదను తీర్చిదిద్దాడు. గాయనిగా శారదకు అనేక పరిమితులున్నాయి. తన ప్రతిభతో వాటినన్నిటినీ అధిగమించి ఆమెను అత్యుత్తమ గాయనిగా నిలపాలని శంకర్ శ్రమించాడు. ఆమె కోసం తేలికయిన, ఆకర్షణీయమైన బాణీలను సృజించాడు. అత్యద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో శారద పాడిన ప్రతి పాటనూ ఒక శిల్పంలా తీర్చిదిద్దాడు. రఫీ, ముకేష్‌తో యుగళగీతాలు పాడించాడు. ఇలా శారద పాడిన ప్రతి పాట శ్రోతలను అలరించింది. శ్రోతలు ఆమె స్వరం పట్ల విముఖతను, విస్మయాన్ని ప్రకటించినా పాటను మెచ్చుకోకుండా, ఆదరించకుండా ఉండలేకపోయారు.
శారద పరిమితులను స్పష్టం చేసే పాట ‘గుమ్నామ్’లోని ‘ఆయెగా కౌన్ యహా’. సగం పదాలు అస్పష్టంగా పలుకుతుంది. భావం బోధపడదు. కానీ పాట హిట్ అయింది. అదే సినిమాలోని ‘జానె చమన్, షోల బదన్’ శారద,రఫీలు పాడిన అనేక శృంగారభరిత యుగళగీతాలకు నాంది. అయితే ‘సూరజ్’లోని ‘తిల్లి ఉడీ’ పాటతో శారద సూపర్ హిట్ పాటల గాయనిగా ఎదిగింది. వైజయంతిమాలపై చిత్రితమైన ఈ పాట అదే సినిమాలోని ‘బహారో ఫూల్ బర్సావో’కు ధీటుగా నిలిచిందంటేనే, ఆ పాట ఎంతగా ప్రజాదరణ పొందిందో ఊహించవచ్చు. ఈ పాట తరువాత ఫిల్మ్ ఫేర్ అవార్డుల పోటీనుంచి లతామంగేష్కర్ విరమించుకున్నది అంటేనే ఊహించవచ్చు శంకర్ జైకిషన్ ప్రతిభ. శారదలాంటి గాయనిని లతలాంటి గాయనికి పోటీగా నిలపటమన్న ఆలోచనే మూర్ఖత్వం. కానీ అలా నిలిపి, లత కలవరపడే రీతిలో పాటలు సూపర్ హిట్ చేయటం అసలైన ప్రతిభ. ఈ సినిమాలో శారద పాడిన మరోపాట ‘దేఖో మేర దిల్ మచల్‍గయా’ సినీపాటల ప్రేమికుల హృదయాలను దోచుకుంది. అయితే తన ప్రతిభపై విశ్వాసంతో ఎవరినీ లెక్కచేయని శంకర్ ఈ అహంకార ప్రదర్శనకూ పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
‘సూరజ్’ సినిమాలో ‘తిల్లి ఉడీ’ పాటకన్నా ‘బహారో ఫూల్ బర్సావో’ గొప్ప పాట అని సినీ పరిశ్రమలో పలువురు వ్యాఖ్యానిస్తూ శంకర్‍ను కించపరిచారు. పాట హిట్ అయి ఇంటింటా మారుమ్రోగుతున్నా, లత, ‘ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది కూడా’ అని వ్యాఖ్యానించి శారదను చులకన చేసింది. ఇది శంకర్, జైకిషన్‍ల నడుమ కలతలను తీవ్రం చేసింది. జైకిషన్ ‘శారద’ స్వరాన్ని ఇష్టపడలేదు. శంకర్ శారదను వదలటానికి ఇష్టపడలేదు. లతతో రాజీకి సిద్ధపడలేదు. దాంతో శంకర్ జైకిషనల జంట అదే పేరు మీద వేర్వేరుగా సంగీతం ఇవ్వటం ఆరంభించారు. సినీ పరిశ్రమలో వీరిపట్ల అసూయతో ఉన్నవారి కోరిక ఫలించింది. శంకర్, జైకిషన్‍ల సంగీతాన్ని వేరుచేసి చూపి, జైకిషన్‍ను పొగిడి, శంకరను చులకన చేసే వీలు లభించింది. ఇదే అదనుగా పలువురు నిర్మాతలు శంకర్ జైకిషన్‍లను ధర తగ్గించుకోమని ఒత్తిడి తెచ్చారు. వీరు తగ్గకపోతే యువ సంగీత దర్శకులను తీసుకున్నారు. దాంతో శంకర్ జైకిషన్‍ల డిమాండ్ తగ్గటం ఆరంభిం చింది. వేర్వేరుగా సంగీతం ఇవ్వటం వల్ల నాణ్యత దెబ్బతింది. అయినా ఇదేమీ పట్టించుకోకుండా శంకర్, శారదతో ఒక హిట్ పాట తరువాత మరొకటి సృజిస్తూ పోయాడు. తెలుగులో ‘జీవితచక్రం’ సినిమాలో ‘మధురాతి మధురం’, ‘కళ్లల్లో కళ్లు పెట్టి చూడు’, ‘కంటి చూపు చెప్తోంది’ వంటి హిట్ పాటలు శారద పాడినవే.
‘స్ట్రీట్ సింగర్’లో రఫీతో పాడిన ‘జిగర్ కా దర్ద్ బఢ్‌తా జారహాహై’ మెలోడీకి పెద్ద పీట వేస్తే, ‘ఎన్ ఈవెనింగ్ ఇన్ పారిస్’ లోని ‘లేజా లేజా మేర దిల్’ క్యాబరే పాట. ‘గునాహోకి దేవతా’లోని ‘హమ్‍కోతో బర్బాద్ కియా హై’ అత్యంత మధురమైన పాట. ‘ఎరౌండ్ ది వరల్డ్’ సినిమా శారద పాటల మయం. ‘జానేభి దే సనమ్’ అత్యంత ఆకర్షణీయమైన పాట. ‘దునియాకి సైర్ కర్’, ‘యే మూ మసూర్ కి దాల్‌లు’ సూపర్ హిట్ పాటలు. ఇదే సినిమాలోని ‘చలే జానా, జరా ఠహరో’ అత్యంత మధురమైన పాట. కానీ ఈ పాట శారద పరిమితులను స్పష్టం చేస్తుంది. ఉచ్చస్థాయిలో పాడలేదు. ఊపిరి బిగబట్టలేదు. పదాలను మింగేస్తుంది. భావం పలకదు. అయినా సరే ఈ పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయంటే అది శంకర్ జైకిషన్‍ల ప్రతిభ. ఈ పాట తరువాత మళ్లీ ఆమెతో హైపిచ్ పాటలు, దీర్ఘ ఆలాపనలు, రాగాలు ఉన్న పాటలు శంకర్ జైకిషన్ పాడించలేదు.
ఇలా ‘శారద’ ఒక హిట్ పాట తరువాత మరొకటి ‘హిట్’ పాడటంతో సినీరంగంలో రాజకీయాలు తీవ్రమయ్యాయి. ‘దీవానా’ సినిమాలో రికార్డయిన ఆమె పాటలు ‘తుంకో సనమ్ పుకార్‍కే’, ‘తుమ్హారీ భి జయ్ జయ్’, ‘తారోం సే ప్యారే’ వంటి పాటలు బయట విడుదలై హిట్ అయ్యాయి. కానీ సినిమాలో కోతకు గురయ్యాయి. ఇంతలో శంకర్‍కు అధికంగా పాటలు రాసే శైలేంద్ర మరణించాడు. ఇది శంకరకు తీరని లోటు. ఆయన బాణీల సృజనలో లోటు లేకున్నా, బాణీలకు తావినద్దే సాహిత్యం లేని లోటు స్పష్టంగా కనబడటం ఆరంభమయింది. అయినా ‘సప్నోంకా సౌదాగర్’లోని ‘దూర్ ఖడా దిల్ న జలా’, ‘తుమ్ ప్యార్సే దేఖో’ (ఇది శైలేంద్ర పాట)లు సూపర్ హిట్లయ్యాయి. ‘చందా ఔర్ బిజ్లీ’ లోని ‘తెర అంగ్ కె రంగ్ అంగూరీ’ పాట అయితే అత్యంత సంచలనం సృష్టించింది. ‘జహ ప్యార్ మిలే’ లోని ‘బాత్ జరా ఆపస్ కీ’ పాటకు ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. ‘షత్రంజ్’ సినిమాలో రఫీ, మహమూద్‍లతో పాడిన ‘బతకమ్మ ఎక్కడికి పోతవురా’ ఇప్పటికీ సూపర్ హిట్టే. ‘తుమ్‌సే అచ్ఛా కౌన్ హై’లో రఫీతో పాడిన ‘ప్యార్ క లేకర్ ఉడన్ ఖటోలా’, ‘పహచాన్’లో ముఖేష్, సుమన్‍తో పాడిన ‘వో పరీ కహాసే లావూ, ‘ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి’లోని ‘ఆప్ కే పీఛే పడ్ గయి మై’, ‘ఏలాన్’లో రఫీతో పాడిన ‘ఆప్ కె రాయ్ మెరె బారేమే’, ‘జానే అన్జానే’లో ‘జానే అంజానే యహా సఖీ’, ‘నైనా’లో ‘అల్బేలే సనమ్’ వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘సీమ’లో రఫీతో పాడిన ‘జబ్ భి యే దిల్ ఉదాస్ హోతా హై’ పాట హృదయలోతులలో స్థిరనివాసం ఏర్పరచుకునేంత మధురమైన పాట.
తనని కాపీ చేసే సంగీత దర్శకులు ప్రాచుర్యం పొందుతుండటంతో శంకర్ జైకిషన్‍లు తమ మధ్య విభేదాలు మరచి మళ్లీ ఒకటయ్యారు. ఇంతలో జైకిషన్ అకాల మృత్యువాత పడ్డాడు. ఇది శంకర్‌ను పూర్తిగా క్రుంగదీసింది. ఇదే అదనుగా సినీపరిశ్రమ శంకర్‍ను అణచివేయటానికి సిద్ధమయింది. శంకర్‌కు హిట్ బాణీలు కట్టటం రాదని తీర్మానించింది. చివరికి రాజ్‍కపూర్ కూడా లతతో రాజీపడి (ఈయన తన సినిమాలలో శారదతో పాడించినా, సినిమాలో ఆ పాటలు తొలగించి, లత ఆగ్రహాన్ని మరీ పెంచలేదు) శంకర్ జైకిషన్‍లను విస్మరించాడు. శారదపై విపరీతమైన దుష్ప్రచారం జరిగింది. దాంతో ఆమె బొంబాయికి దూరం వెళ్లాల్సి వచ్చింది. శంకర్ మాత్రం శంకర్ జైకిషన్ పేరుతో మొండిగా సినీపరిశ్రమలో నిలిచాడు. లతతో రాజీపడి ‘సన్యాసి’, ‘దో ఝట్’ వంటి హిట్ పాటల సినిమాలను సృజించాడు. కానీ మళ్లీ శంకర్ జైకిషన్‍లు పునర్వైభవాన్ని సాధించలేకపోయారు. శంకర్ జైకిషన్‍ల ఆధారంగా ఆకాశానికి ఎగరాలన్న శారద ఆశలు అంతరించాయి. శంకర్ మరణంతో ఆమె సినీ కెరీర్ సమాప్తమైంది. ఒక వ్యక్తికో, క్యాంపుకో పరిమితమైన కళాకారుల ఎదుగుదల పరిమితమేనని శారద కెరీర్ నిరూపిస్తుంది.
గాయనిగా ఇక ఎత్తుకు ఎదగలేనని అర్థమయిన శారద తన దృష్టిని ఇతరాల వైపు మళ్లించింది. ఓ పాప్ ఆల్బమ్ విడుదల చేసింది. గజళ్ల ఆల్బమ్ తయారుచేసింది. స్వయంగా కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించింది. అయితే ఆమె పేరు మీద శంకర్ పాటలు సృజించాడని ప్రచారమవటంతో ఆమెకు అవకాశాలు రాలేదు. చివరికి ‘సింఘార్’ అనే పేరుతో ‘గరమ్ ఖూన్’ సినిమాలో పాటలు రచించింది. వాటిలో ఓ పాట ‘ఏక్ చెహరా దిల్ కే కరీబ్ ఆతాహై’ని లతో పాడించాడు శంకర్ జైకిషన్. అయితే పరిమిత ప్రతిభ ఉన్నా, అపరిమితమైన హిట్ పాటలు పాడిన శారద, సినీపాటల ప్రపంచంలో శంకర్ జైకిషన్‍ల నడుమ విభేదాలకు కారణమైనదానిలా మిగిలిపోయింది తప్ప ఆమె గానసంవిధానానికి గానీ, పాడిన హిట్ పాటల ఆధారంగా కానీ సినీ ప్రపంచంలో మన్ననలందుకోలేకపోయింది. ఆమె పాటలు విన్నప్పుడల్లా శంకర్ జైకిషనల ప్రతిభకు ఆశ్చర్యం కలుగుతుంది. వారికి జోహార్లర్పించాలనిపిస్తుంది. ఈనాటికీ శారద, తాను సంగీత దర్శకత్వం వహించిన ‘మా బెహన్ ఔర్ బేటీ’ సినిమాలోని పాటను పాడుకుంటూ మిగిలిపోయింది. ‘అచ్ఛా హి హువా దిల్ టూట్ గయా, అచ్ఛా హి కియాజో తూనె కియా, లూంగా న కభీ అబ్ నామ్ ఎ వఫా’.