Site icon Sanchika

సాహిత్య ‘భాస్కరు’డు!

[ప్రముఖ సాహితీవేత్త శ్రీ లగడపాటి భాస్కర్ గారికి నివాళి అర్పిస్తున్నారు డా. సిహెచ్. నాగమణి.]

[dropcap]సా[/dropcap]హిత్యమే ఆయన శ్వాస.. సాహిత్యమే ఆయన ధ్యాస. రెండు పదులు దాటిన వయసు నుంచే సాహితీ సేద్యం ప్రారంభించి, ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు పైగా అవిరళ అక్షర కృషి చేసి, అరవై నాలుగు గ్రంథాలు రచించడమంటే అదొక అక్షర యజ్ఞంగానే భావించాలి. అందులో పది పద్య కావ్యాలు, అయిదు శతకాలతో పాటు, స్థల మహత్యాలు, నవలలు, పద్య, గేయ, నాటక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇంతటి సాహిత్య పంట పండించి, శ్రీకాళహస్తి పట్టాణానికే సాహిత్య భాస్కరుడిగా వెలుగొందిన లగడపాటి భాస్కర్ 2023 సెప్టెంబర్ 14 న అస్తమించడంతో సాహితీ లోకం వెలవెలబోయింది.

సాహితీ కురువృద్ధులయిన లగడపాటి భాస్కర్ చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, సదకుప్పం గ్రామంలో 1935 అక్టోబర్ 15న జన్మించారు. విద్వాన్ (తెలుగు), ఎం.ఎ., ఎం.ఇడి. పట్టాలు అందుకున్నారు. పూజ్య గురువులు అల్లసాని రామనాథశర్మ, చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ, కె.సభా, పాటూరు రాజగోపాలనాయుడు గార్ల స్ఫూర్తితో లగడపాటి భాస్కర్ తమ ఇరవై రెండవ ఏట రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు.

2010లో ‘ధూర్జటి రసజ్ఞ సమాఖ్య’ పేరిట ఓ సాహితీ వేదికను ఏర్పాటుచేశారు. తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు సేవలందిస్తూ పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు, సదస్సులు ముందుండి జరిపించారు. ‘ధూర్జటి ప్రాశస్త్యం’ శీర్షికన సదస్సు నిర్వహించి, ‘ధూర్జటి గుండె చప్పుడు’ పేరుతో సంకలనం వెలువరించారు. 2016లో శ్రీకాళహస్తిలో తొలిసారిగా జాతీయ తెలుగు కవి సమ్మేళనం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 157 మంది తెలుగు కవులు పాల్గొనడం విశేషం. ప్రతి ఏటా ఉగాది, సంక్రాంతి పండుగలకు కవి సమ్మేళనాలు నిర్వహించి, ఆ సందర్భంగా స్వీయ రచనలను కూడా ఆవిష్కరించి యువతకు స్ఫూర్తినందించారు.

ఆయన రచించిన ‘భక్త తిన్నడు’ పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ఆయన రచనల్లో కొన్ని.. భగవతి శ్రీ జ్ఞానాంబికా చరితము, శ్రీ వాయు లింగేశ్వర శతకము, కవితల్లో కమ్మదనం – కల్పనదే గొప్పదనం (పద్య పరామర్శ), తెలుగు కలాలు – తెలుగు బాణీలు (కవల కవితలు).

ముఖ్యంగా ప్రస్తావించుకోవలసిన మరో అంశం ధూర్జటి మునిమనవడు మునిలింగరాజు రచించిన ‘శ్రీ కాళహస్తి మహాత్మ్యం’ ను సరళ తెలుగులో రాశారు. ఆ గ్రంథం కొద్ది రోజులలో ఆవిష్కరణ జరుగనున్న తరుణంలో లగడపాటి భాస్కర్ ఆకస్మికంగా అనంతలోకాలకు తరలిపోవడం ఎంతైనా విచారకరం.

లగడపాటి భాస్కర్ తమ సాహితీ సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందులో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా అందుకున్న పురస్కారం కూడా ఉంది. లగడపాటి భాస్కర్ అస్తమించినా ఆయన అందించిన గ్రంథాలు సాహితీ జగత్తులో వెలుగులు వెదజల్లుతూనే ఉంటాయి.

అక్షర ‘భాస్కరు’నికి నివాళి

~
చెరగని దరహాసం మీ భూషణం
వీనుల విందై రంజిల్లు సౌమ్య భాషణం
శ్రీకాళహస్తి పురమున విరబూసిన సాహితీవనం
ప్రాచీన, నవ్య కవితా సంగమం మీ కవనం
~
అచ్చ తెనుగు సంస్కృతికి చిరునామా మీ పంచెకట్టు
పట్టె అలవోకగ సత్కవీశ్వరుల భాష గట్టి పట్టు
ఆంధ్ర సారస్వతాంబుధి ఆపోశన పట్టు
లెస్సగా ప్రయోగించే తేనెల తెలుగు నుడికట్టు
~
తెలుగు భాషా వికాసోద్యమ కృషి అపారం
రచనా వ్యాసంగానికి ప్రేరణ ధూర్జటి కవితా సారం
ఆత్మీయ స్నేహ సౌరభాల కాణాచి మీ హృదయం
అవిశ్రాంత అక్షర శోధన అసమానం, అప్రమేయం
~
సతి మనసెరిగి ప్రేమాస్పదులై తగురీతి సహకరించు
సుతల వాత్సల్యముతో వెన్నుతట్టి ప్రోత్సహించు
బంధుమిత్రుల కోలాహలం మీ ఇంట పరిపాటి
ఆత్మీయ అతిథి సత్కారమందు మీకు మీరే సాటి
~
మరపురాని మీ జ్ఞాపకాలే మా గుండె చప్పుడు
మీరే ఆదర్శం మాకు అపుడు, ఇపుడు, ఎప్పుడూ
మహోపాధ్యాయా! అందుకొనుమా మా వందనం
సాహిత్య ‘భాస్కరు’ నికిదే నా అక్షర నివాళి

(సాహిత్య దిగ్గజం శ్రీ లగడపాటి భాస్కర్ గారి స్మృతిలో..)

Exit mobile version