త్రిశక్తి

0
2

[dropcap]’త్రి[/dropcap]శక్తి ఆలయం…’ బ్రహ్మోత్సవాల శోభతో కళకళలాడుతోంది. శుక్రవారం, రథ సప్తమి రోజున జరిగే లలితా పారాయణం, ఆనంతరం అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి పల్లకీ సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ రూపాలలో ముగురమ్మలూ ఒకే పీఠంపై వెలిసిన మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన త్రిశక్తి ఆలయంలో… గోవిందాచార్యులు వంశానికి చెందిన నాలుగు తరాలవారూ అమ్మవారి సేవలోనే తరించారు.

అయిదవ తరానికి చెందిన గోవిందాచార్యులు, శ్రీపంచమి రోజున తన మనుమడు శివ నారాయణకి, అమ్మవారి గర్భాలయానికి అభిముఖంగా ఉన్న ‘మేరు శ్రీచక్రం’ వద్ద అక్షరాభ్యాసం చేయించారు.

రాష్ట్రం నలుమూలలనుంచి వలంటీర్లుగా వచ్చి, ఆలయానికి దగ్గర్లోని వసంత మండపం వెనుకనే ఉన్న ‘అన్నమ్మ’ సత్రంలో సేదతీరుతున్నవారిలో భ్రమరాంబ, లక్షుమమ్మ ఇలా సేవకు రావడం ఇది మూడోసారి. కొత్తగా వచ్చిన వలంటీర్లకు చేయాల్సిన పనుల గురించి వివరిస్తూ, పల్లకి సేవలో పాల్గొనేవారికి ప్రత్యేక సూచనలిస్తూ బాగా పొద్దుపోవడంతో నిద్రకుపక్రమించారు.

ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చెయ్యడం, అమ్మవారి అలంకారానికి మాలలల్లడం, ప్రసాదాల తయారీ, కుంకుమ పూజాలూ దీపారాధనకై ఏర్పాట్లూ, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శన ఏర్పాట్లూ, వితరణకై వంటల ఏర్పాట్లూ… ఇలా ఆరు విభాగాల్లో వలంటీర్లు సేవలందిస్తున్నారు.

తొమ్మిదిరోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగురమ్మలను ఒక్కోరోజు, ఒక్కో అలంకారంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ప్రధానార్చకులు గోవిందాచార్యులు ముగురమ్మల అలంకారంలో నిమగ్నమైయున్నారు.

“గోవిందా! అమ్మవారి కాసులహారం కనిపించటం లేదేమిటీ?” గాభరాగా ప్రశ్నించారు నరసింహాచార్యులు.

“ఆ! కనిపించటంలేదా? ఏది… సరిగా చూడనివ్వండి,” కంగారుగా నెమలిముఖం కుందులోని కమలవత్తిని పైకి జరుపుతూ, ఆ వెలుతురులో అమ్మ ముఖంలోకి చూసారు గోవిందాచార్యులు.

ప్రసన్నంగా నవ్వుతూ కాళీ, సరస్వతుల మధ్యన ఎడమకాలు పైకి మడిచి ఆశీనురాలైన శ్రీమహాలక్ష్మికి చేతులు జోడించి,

“ఏమిటిది తల్లీ? ఈ భక్తుడినే పరీక్షిస్తున్నావా?” వడలిన ముఖంతో ప్రశ్నిస్తూ… “అపవాదు పడనీకు తల్లీ” అని మౌనంగా వేడుకున్నారు గోవిందాచార్యులు.

ఇంతలో బ్రహ్మోత్సవాల కవరేజి కోసం ఆలయానికి వచ్చిన రిపోర్టర్ చెవిలో ఈ వార్త పడటంతో, ఛానెల్ రేటింగ్ పెంచుకోడం కోసం ఫ్లాష్ న్యూస్‌లో ఈ విషయాన్ని ప్రసారమయ్యేలా చేసాడు.

ఈ గందరగోళానికి అమ్మవారి సేవలూ, భక్తుల దర్శనాలూ నిలిచిపోయాయి.

హుటాహుటిన గర్భాలయం చేరిన ఆలయ కమిటీ సభ్యుల విచారణలో గోవిందాచార్యులవారే ముందు రోజు రాత్రి ఆలయాన్ని మూసి, తాళాలు తీసుకువెళ్లినట్టు తేలింది.

“అయ్యా! గర్భగుడికి నేను తాళం వేసిన మాట వాస్తవమే. కానీ అంతకు అరగంట ముందు మా ఇంటినుంచి కబురు రావడంతో వెళ్లి, తిరిగి మళ్లీ గుడికి చేరాను. ఆ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు.” జరిగినది చెప్పబోయారు గోవిందాచార్యులు.

ఎన్నోఏళ్లుగా ప్రధానార్చకుడి పదవి కోసం ఎదురుచూస్తున్న వరదాచారి, ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు.

“ఆరోజు గుడి తలుపులు మూసేముందు ఈయనగారు ఇంటికి ఎందుకు వెళ్లాడో నే చెబుతాను… మొన్న శ్రీపంచమి రోజున ఈయనగారి కోడలు అమ్మవారి మెడలోని కాసులహారం చూసి ముచ్చటపడి, అలాంటిది తనకూ వేసుకోవాలనుందని వీరి పుత్ర రత్నంతో అనడం మా ఇంటావిడ విన్నదట… కావాలంటే సాక్ష్యం చెప్పిస్తాను…” అంటూ ఉత్సాహం ప్రదర్శించాడు.

ఆయన గొంతుకు మరికొన్ని గొంతులు వంత పాడాయి.

ముగురమ్మల మూగ సాక్ష్యంతో కాసులహారం ఆచూకీ కనిపెట్టలేకపోయిన ఆలయ పెద్దలు… ప్రధానార్చకులు గోవిందాచార్యులనే దోషిగా నిలబెట్టారు.

కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతుంటే, “ఏమిటీ తల్లుల్లారా నాకీ పరీక్ష?” అంటూ మూగగా రోదించారు ప్రధాన అర్చకులు గోవిందాచార్యులు.

అంతలో కమిటీ వారి ఫోను కాలందుకుని అక్కడికి చేరిన పోలీసులు ప్రధానార్చకుని చేతికి బేడీలు తగిలించబోయారు.

“నాకు నిరూపించుకునే అవకాశమివ్వండి…” ప్రాధేయపడుతున్నారు గోవిందాచార్యులు.

“హారం మీరే దొంగిలించినట్టు క్లియర్‌గా తెలుస్తోంది… కాలయాపన చేసి మా సమయం వృథా చేయొద్దు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రేపు కోర్టులో చెప్పుకోండి…” అన్నాడు గద్దిస్తూ ఎస్ ఐ.

దీపపు కాంతుల వెలుగులో దగద్ధగాయమానంగా వెలుగుతున్న త్రిశక్తి అమ్మవార్లకు హారతి సేవకు సమయం కావడంతో ఆలయంలోని గంటలు ఒక్కసారిగా మోగాయి.

కర్పూర కాంతుల వెలుగులో, ధూపపు సువాసనలు వెదజల్లుతుంటే, గర్భాలయంలో ప్రవేశించిన గోవిందాచార్యులు… అరచేతిలో కర్పూరం వెలిగించి, ముగురమ్మల మూలశక్తిని శాంతిoపచేశారు.

నైవేద్యాలకు పోసిన అన్నపు రాసుల వాసన సోకిన ‘అమ్మలు’ ప్రశాంత వదనంతో దీవించినట్టుగా… కేశాలంకృతమైన తెల్లని చామంతి, అమ్మ ముఖంపైనుండి జారుతూ, వక్ష స్థలంపై నిలిచిన కోటి కుంకుమ ద్రవ్యాల జవ్వాది పరిమళాలను అద్దుకొని, అరచేత దోసిలి పట్టి వేడుకుంటున్న గోవిందాచార్యుల చేద్వయంలో పడింది. ఆ పుష్పాన్ని భక్తితో కళ్లకద్దుకుంటున్నవాడల్లా…

“స్వామీ! అపచారం జరిగిపోయింది…” అంటూ చెంపలు వేసుకుంటూ, గర్భాలయంవైపు పరిగెత్తుకొస్తున్న వలంటీరు భ్రమరాంబను చూసి ఆశ్చర్యపోయారు.

“స్వామీ! అమ్మవారి అలంకారానికి మాలలల్లి తెచ్చిన నేను, గర్భాలయం శుభ్రం చేసినప్పుడు మీరు తీసి ఉంచిన నిర్మాల్యాలను సూర్యాలయం వెనుక బుట్టలో ఉంచాను. అప్పుడు లేని ఈ కాసులహారం, ఇప్పుడు బుట్టలో దొరికింది… మరో క్షణం ఆగితే కోనేరులో వేసేసి ఉండేదాన్ని…” అంటూ ఆ కాసుల హారాన్ని తీసి ఇస్తుంటే,

“నీ రూపంలో ఆ అమ్మవారు నాముందు సాక్షాత్కరించింది తల్లీ!” అంటూ శిరసు వంచి ఆమెలోని త్రిశక్తికి ప్రణమిల్లారు గోవిందాచార్యులు.

త్రిశక్తి ఆలయ ప్రాంగణంలోని సూర్యాలయంలో అర్చకునిగా ఉన్న వరదాచారి, మెల్లగా అక్కడ్నుంచి జారుకునే ప్రయత్నం చేస్తుంటే, గమనించిన కమిటీ వారు…

“ఎస్.ఐ. గారూ అదిగో దొంగ దొరికాడు” అంటూ వరదాచారి వైపు చెయ్యి చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here