Site icon Sanchika

తులసీ రామాయణంలో అవాల్మీకాలు-3

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న ‘తులసీ రామాయణంలో అవాల్మీకాలు’ అనే వ్యాస పరంపర.]

[dropcap]భ[/dropcap]రతుడు శ్రీరాముడిని కలుసుకోవటానికి తల్లులతో, గురువులతో, సైన్యంతో బయలుదేరాడు. ఆ రాత్రి చిత్రకూటంలోని ఆశ్రమంలో ఉన్న సీతకు ఒక కల వస్తుంది. భరతుడు చిక్కి శల్యం అయినట్లు, అతని బంధువులందరూ దీనవదనాలతో ఉన్నట్లు, అత్తగార్ల స్వరూపాలు పూర్తిగా మారిపోయినట్లు కలగంటుంది. ఈ కల గురించి నిద్రలేచిన తర్వాత భర్తతో చెబుతుంది. దానితో పాటు పెద్దపెద్ద గాలులతో ఉత్తరదిశ అంతా ధూళితో నిండిపోతుంది. పశుపక్ష్యాదులు వ్యాకులపాటుతో అల్లకల్లోలంగా పరుగెత్తుతూ ఉంటాయి. ఈ దుశ్శకునాలు అన్నీ చూసి రాముడు “ఇలాంటి దుస్వప్నం రావటం మంచిది కాదు, ఏదో ఆశుభవార్త వినబోతున్నాను” చెప్పి, తమ్ముడితో పాటు స్నానం చేసి పరమేశ్వరుడిని పూజించి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో భరతుడు రావటం, తండ్రి మరణవార్త వినిపించటం జరుగుతుంది. సీతాదేవికి వచ్చిన ఈ స్వప్న వృత్తాంతం అవాల్మీకం.

దశరథుడు మరణించాడన్న వార్త తెలిసి బాధపడుతూ అందరినీ పరామర్శించటానికి జనకమహారాజు అయోధ్యకు వచ్చాడు. దుఃఖంతో కుమిలిపోతున్న జనకుడిని చూసి అయోధ్య ప్రజలందరూ “ఈయన జనక మహారాజేనా! ఇంత దీనంగా ఎప్పుడూ చూడలేదే!” అనుకుంటారు. వశిష్ఠుడు ఆయనకి స్వాగతం పలికి “జనకమహారాజుకి కుశలమా!” అని అడిగాడు. “నా కుశలమంతా దశరథ మహారాజుతోనే పోయింది. అయోధ్యా మిధిలా నగరాలు దిక్కులేనివి అయినాయి” అన్నాడు విచారంగా. “రాజమందిరం అంతా ఇలా శూన్యంగా ఉందేమిటి? సీతారాములు, మిగిలిన కుమార్తెలు, అల్లుళ్ళు ఎక్కడ?” అని అడిగాడు. అప్పడు వశిష్ఠుడు కైక కోరిన రెండు వరాల గురించి చెప్పి, సీతారాములు అడవిలో ఉన్నారనీ, వారిని తిరిగి అయోధ్యకు పిలుచుకురావటానికి భరతాదులు కూడా అడవికి వెళ్ళారనీ చెప్పాడు.

అప్పుడు వశిష్ఠుడు, జనకుడు కూడా చిత్రకూటానికి ప్రయాణమయి వెళ్ళారు. నారవస్త్రాలు ధరించి మునివేషాలలో ఉన్న సీతారాములని చూసి జనకుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. సీత తండ్రిని చూసి ఎంతో సంతోషిస్తుంది. రాముడిని అయోధ్యకు వచ్చి తిరిగి పట్టాభిషేకం చేసుకొమ్మని భరతుడు కోరితే రాముడు అంగీకరించలేదు. “పోనీ కొద్దిరోజులు మీ సన్నిధిలో గడిపి ఆనందించే భాగ్యాన్నైనా ప్రసాదించండి” అని అడిగాడు భరతుడు. సరేనన్నాడు రాముడు. వశిష్ఠుడు, శతానందుడు, విశ్వామిత్రుడు కూడా అక్కడే ఉంటారు. విశ్వామిత్రుడు అందరికీ పౌరాణిక గాథలను వినిపిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల గల ఆటవికులు, భిల్లులు కందమూలాలు, పళ్ళు విస్తారంగా తీసుకుని వచ్చి అతిథి మర్యాదగా భరతుడికి సమర్పిస్తారు. భరతశత్రుఘ్నులు సమీపంలోని ఋష్యాశ్రమాలు, వనాలు, తీర్థాలు, తటాకాలు చూసి వస్తూ ఉంటారు.

ఒకరోజు భరతుడు సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి ఆయన్ని ఆదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసిన తర్వాత “ఈ సమీపంలో ఒక అందమైన బావి ఉన్నది. అది చూడటానికి రా!” అని చెప్పి తీసుకువెళ్ళాడు. “ఒకప్పుడు ఇది సిద్ధక్షేత్రం. కాలక్రమేణా మరుగున పడిపోయింది. దీని గురించి ఎవరికీ అంతగా తెలియదు. రామపట్టాభిషేకం కోసం తీసుకువచ్చిన వివిధ తీర్ధాల జలాలను ఇందులో ఉంచు. ఇక్కడి నీటితో స్నానం చేసిన వారికి సమస్త తీర్థాలను సేవించిన ఫలితం వస్తుంది” అని చెప్పాడు. భరతుడు సేవకులను పంపించి చిత్రకూట పర్వతం మీద ఉన్న రాముడి ఆశ్రమంలో ఉంచిన ఆ తీర్థాలను తెప్పించాడు. అత్రి మహాముని ఆదేశం మీద భరతుడు ఆ తీర్థాలను బావిలో కలిపాడు. “ఈ తీర్ధ జలాల వలన ఇది పవిత్రమైనది. ఇక నుంచీ ఇది ‘భరతకూపం’ (భరతుని బావి) అనే పేరుతో ప్రసిద్ధమౌతుంది” అని చెప్పాడు అత్రి మహర్షి.

ఇప్పుడు చెప్పిన సంఘటనలు అన్నీ అవాల్మీకాలు. బాలకాండ తర్వాత వాల్మీకంలో విశ్వామిత్రుడి ప్రసక్తి ఉండదు. రాముడిని అయోధ్యకు రమ్మని పిలవటం, అయన అంగీకరించకపోవటం అనే సంఘటన మాత్రమే వాల్మీకి చెబుతాడు.

అన్నగారి సమక్షంలో కొద్దిరోజుల గడిపిన తర్వాత భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చి పాదుకాపట్టాభిషేకం చేయటం జరుగుతుంది. దీనితో తులసీ రామాయణంలో అయోధ్యాకాండ ముగుస్తుంది.

అరణ్యకాండ

ఇంద్రుడి కుమారుడు జయంతుడు. ఒకరోజు రాముడు మంచి మంచి సువాసనా భరితమైన పూలను సేకరించి సీతకిచ్చి ఆమెతో కలసి ఒక నిర్మల స్పటిక శిలపైన కూర్చున్నాడు. శ్రీరాముడిని పరీక్షించాలనే మందబుద్ధితో జయంతుడు కాకి రూపం దాల్చి సీతాదేవి పాదాలను ముక్కుతో పొడిచి పారిపోయాడు. అక్కడ గాయం అయి రక్తం స్రవించటం చూసిన రాముడు ఆగ్రహంతో ఒక గడ్డిపోచను మంత్రించి జయంతుడి మీదకు ప్రయోగించాడు. అది బ్రహ్మాస్త్రమై వెంటపడింది. కాపాడమని ఇంద్రుడి దగ్గరకి, బ్రహ్మ దగ్గరకి, కైలాసానికి పరుగెత్తాడు. కానీ ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. అప్పుడు నారదుడు కనిపించి తిరిగి శ్రీరాముడినే శరణు వేడమని సలహా ఇచ్చాడు. చేసేది లేక జయంతుడు రాముడి కాళ్ళమీద పడి రక్షించమని అడుగుతాడు. ఒక కన్ను పరిహారంగా తీసుకుని అతడిని క్షమించి విడిచిపెడుతుంది బ్రహ్మాస్త్రం. ఈ సంఘటన అరణ్యకాండ ప్రారంభంలో చెబుతాడు తులసీదాసు. అయితే ఈ సంఘటన వాల్మీకి రామాయణంలో సుందరకాండలో వస్తుంది. సీత అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుడితో ఈ వృత్తాంతం చెప్పి (కాకి సీత రెండు స్తనాల మధ్య గాయం చేసినట్లు చెబుతాడు వాల్మీకంలో), “నాకు చిన్న గాయం అయితేనే కాకి మీద బ్రహ్మాస్త్రం వదిలి రక్షించావే, ఇప్పుడు రాక్షసుడి చెరలో, నీ వియోగంతో కుమిలిపోతున్న నన్ను కాపాడకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నావు?” అని రాముడిని అడగమని చెబుతుంది.

ఇంకొకచోట తులసీదాసు మరో కల్పన చేశాడు. అరణ్యంలో సీతా వియోగంతో బాధ పడుతున్న రాముడి దగ్గరకు వచ్చి, నారదుడు “ఆనాడు క్షణికావేశంలో, మహావిష్ణువుగా ఉన్న నిన్ను భార్యావియోగంతో బాధ పడమని శపించాను. నాకు వివాహేచ్ఛ కలిగినప్పుడు నువ్వు అడ్డుపడి నన్ను వివాహమాడనీయక పోవటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అప్పుడు రాముడు “పసిపిల్లవాడు తెలియక నిప్పుని ముట్టుకోబోతే తల్లి అతడిని దూరంగా లాగి కాపాడుతూ ఉంటుంది. నాకు నా భక్తులు కూడా అలాంటివారే! కామ క్రోధాలు మానవుడికి ప్రబల శత్రువులు. ఈ శత్రువుల బారి నుంచీ నా భక్తులను రక్షించే భారం నాది. అందుకే నిన్ను వివాహమాడ నీయలేదు” అన్నాడు.

“సాంసారిక భ్రమల్లో పడి భగవంతుని ధ్యానించని వారు అజ్ఞానులు. నన్ను అజ్ఞానం నుంచీ కాపాడినందుకు కృతజ్ఞుడిని” అని చెప్పి తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు నారదుడు. ఈ సన్నివేశం తులసీదాసు ఇంకా వివరంగా నారదుడికి శ్రీరాముడి ఉపదేశంగా చెబుతాడు. ఇది వాల్మీకి రామాయణంలో లేదు.

కిష్కింధా కాండ

కిష్కింధా కాండలో తులసీ దాసు కల్పనలు ఏమీ లేవు. కానీ సుగ్రీవ మైత్రి, వాలి వధ, వనరుల సీతాన్వేషణ, సంపాతి వృత్తాంతం మొదలైనవి చాలా క్లుప్తంగా చెబుతాడు. ఎంత క్లుప్తంగా అంటే కిష్కింధా కాండ మొత్తం ఓ ఇరవై పేజీలలో ముగించేస్తాడు.

సుందర కాండ

రామాయణంలో సుందరకాండ సుందరమైనది అని అంటారు. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు సముద్ర లంఘనం చేసేటప్పుడు మైనాకుడు కొద్దిసేపు తన మీద విశ్రాంతి తీసుకుని వెళ్ళమనటం, నాగమాత సురస అడ్డుపడటం, సింహిక వధ మొదలైనవి కనిపిస్తాయి. కానీ రామచరిత మానస్‌లో అవేమీ లేవు. అదే విధంగా హనుమంతుడు సీత కోసం లంకని అడుగడుగూ గాలించటం చక్కగా వర్ణిస్తాడు వాల్మీకి, కానీ తులసీదాసు వీటిని క్లుప్తంగా చెబుతాడు. అయితే ఇలా వెతుకుతూ ఉండగా దాదాపు తెల్లవారు జాము అవుతూ ఉంటుంది. విభీషణుడు లేచి స్నానం చేసి, శుచిగా కుర్చుని రామ నామం జపిస్తూ ఉంటాడు. హనుమంతుడు బయటి నుంచీ చూసి “ఈ ప్రదేశం ఇంత ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ ఏ మహానుభావుడు నివసిస్తున్నాడో!” అనుకుంటూ లోపలికి వచ్చి అక్కడ విభీషణుడిని చూస్తాడు.

విభీషణుడు హనుమంతుడిని చూసి “మీరెవరు? హరిభక్తులలో ఒకరా! మిమ్మల్ని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతున్నది” అని అంటాడు. అప్పుడు హనుమంతుడు తను వచ్చిన కార్యం చెబుతాడు. “నేనిక్కడ దంతాల మధ్య నాలుక లాగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఆ భగవంతుడికి నామీద దయ ఉన్నది కాబట్టే మీ దర్శనం అయింది” అని అంటాడు విభీషణుడు. ఇద్దరూ ప్రేమగా కౌగలించుకుంటారు. తర్వాత విభీషణుడు సీత ఎక్కడ ఉన్నదీ చెప్పి ఆమెను కలుసుకోవటానికి ఉపాయాలు కూడా చెబుతాడు. ఈ సన్నివేశం అవాల్మీకం. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఎవరి సహాయం లేకుండానే స్వయం ప్రతిభా శక్తితోనే సీత ఉన్న చోటు కనిపెడతాడు.

అలాగే వాల్మీకంలో మండోదరి పాత్ర చాలా తక్కువ. రావణుడు మరణించిన తర్వాత విలపిస్తుంది. అంతవరకే ఆమె పాత్ర. శయ్యామందిరంలో నిద్రపోయేటప్పుడు ఆమెని చూసి హనుమతుడు సీత అని భ్రమ పడతాడు. కానీ అక్కడ ఆమెకి సంభాషణలు ఏమీ లేవు. ఈ రెండు చోట్ల మాత్రమే మండోదరి ప్రసక్తి వస్తుంది. కానీ తులసీ దాసు మాత్రం హనుమంతుడు లంకాదహనం చేసి వెళ్ళిన తర్వాత ఆమె “దూతబలానికే మనం తట్టుకోలేకపోయినప్పుడు స్వయంగా ప్రభువే వస్తే మన గతి ఏమౌతుంది? నా మనవి విని సీతను రాముడికి అప్పగించి మన్నించమని వేడుకొండి. శ్రీరాముడు అనే సర్పం రాక్షస జాతి అనే కప్పలను కబళించక ముందే మీ పట్టుదల మానండి” రావణుడికి హితబోధ చేసినట్లు చెబుతాడు.

“స్త్రీలు స్వభావసిద్ధంగా పిరికి వారు. అనవసరంగా భయపడుతూ ఉంటారు. వానర సైన్యం వస్తే వారిని రాక్షసులు భక్షించి వేస్తారు. దేవతలే నన్ను చూసి భయపడుతూ ఉంటారు. నా భార్యవైన నువ్వు మానవుడిని చూసి భయపడటం హాస్యాస్పదం” అని వెళ్ళిపోతాడు రావణుడు.

రాముడు లంకను సమీపించటానికి సముద్రుడిని ప్రార్థించటం, సముద్రుడు ప్రసన్నం కాకపోతే బాణం వేయబోవటం, సముద్రుడు ప్రత్యక్షమై తనపైన సేతువు కట్టమనీ, రామబాణాన్ని సముద్రంలో ద్రుమకుల్యం అనే ప్రదేశంలోని రాక్షసుల మీద వదలమని చెప్పటం జరుగుతుంది. ఇంతటితో తులసీ రామాయణంలో సుందర కాండ ముగుస్తుంది. కానీ ఇవన్నీ వాల్మీకంలో యుద్ధకాండ ప్రారంభంలో జరుగుతాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version