Site icon Sanchika

యువభారతి వారి ‘తులసీదాసు కవితా వైభవం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

తులసీదాసు కవితా వైభవం

[dropcap]మ[/dropcap]న దేశపు మనుగడకు ఆధ్యాత్మిక చింతనయే పట్టుగొమ్మ. నరనరాల్లో జీర్ణించిపోయిన భక్తిభావం, మన సాంఘిక జీవనానికి ఊపిరి పోసింది. సాంస్కృతిక రంగంలో మార్గదర్శకత్వం వహించి, విదేశీయుల వెల్లువ నుండి దేశాన్ని సముద్ధరించి, మరణోన్ముఖమైన జాతీయ జీవనానికి కొంగ్రొత్త యౌవనాన్ని ప్రసాదించింది ఈ ఆధ్యాత్మిక తత్త్వమే.

ఈ తత్త్వం ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికీ, నియమితంగా ధర్మకర్మలాచరించి, దేవాలయానికి వెళ్లి పాపప్రక్షాళనం చేసుకోవడానికే పరిమితం కాకుండా – జీవన విధానానికే ఒక కరదీపికగా వెలుగొందింది. మతం అన్నది నీతి నియమాలు, ఆచార వ్యవహారాలుగా రూపొంది, దైనందిన జీవన విధానంతో సంబంధాన్ని కోల్పోయి సంకుచితంగా మారినపుడు, మళ్ళీ సమన్వయ దృక్పథంతో ఆదర్శ జీవన విధానాన్ని ప్రతిపాదించిన మహాత్ములు, మహాకవులూ, మన పుణ్యభూమి మీద అవతరించి సంస్కృతీ స్రవంతిని నిరంతరం ప్రవహింపచేస్తూ వచ్చారు.

అలా నేతృత్వం వహించిన మనీషులలో గోస్వామి తులసీదాసు ప్రాతఃస్మరణీయుడు. వెయ్యేండ్ల హిందీ వాంగ్మయాకాశంలో అప్రతిమాన ఆదిత్య స్వరూపుడు. సాంస్కృతిక చైతన్యానికీ, సాంఘిక పునరుజ్జీవనానికీ,  కళాత్మక అభివ్యక్తికీ ఆయన అగ్రదూతగా వెలుగొందాడు.

“పోతన్న తెలుగుల పుణ్య పేటి” అన్నారు విశ్వనాథ వారు. పోతన్న భాగవతం తెలుగు ప్రజలను, తెలుగు భాషను, తెలుగు కవిత్వాన్ని, భక్తిభావ బంధురంగా ఎలా మలచిందో, అలాగే హిందీలో తులసీదాసు రామచరిత మానస్ (రామాయణం) ప్రజల దైనందిన జీవితంతో కలిసి బ్రతుకున్నది.  తులసీదాసు జీవితం, సమకాలీన ప్రజల కష్టసుఖాలను, ఆదర్శాలను, వ్యంగ్యంగా, భంగ్యంతరంగా తన రామాయణంలో చిత్రించాడు.  ఆ రచనలన్నీ తన కాలంలోని పామరులు మాట్లాడుకొనే భాష లోనే చేశాడు. సంస్కృతంలో చిక్కని వైదుష్యాన్ని కలిగి ఉండి కూడా, ప్రజా బాహుళ్యానికి అనుకూలమైన భాషలో రచన సాగించి, తన సరళ స్వభావాన్ని ప్రదర్శించాడు.

అన్ని భారతీయ భాషల్లోనూ, అనేకానేక రామాయణాలు ఎన్నెన్నో సాహితీ ప్రక్రియల్లోకి ఒదిగిపోయినవి. భారతీయ కవితా తత్త్వానికి, రామాయణానికి ఉన్న సంబంధం విదీయడానికి వీలు లేనివి. వాల్మీకి రామాయణం ఒక మహా స్రవంతి లాగా ఎన్నెన్నో మార్పుల, చేర్పుల సెలయేళ్ళనూ, ప్రక్రియల ఉపనదులనూ కలుపుకొని నిరంతరంగా ప్రవహిస్తున్నది.

తులసీదాసు సాహిత్యంలోంచి కొన్ని సుందరములైన, విజ్ఞాన ప్రదములైన, భక్తిరస భరితములైన కవితలను ఏరి, డా. భీమసేన్ ‘నిర్మల్’ గారు చక్కని తెలుగులో వాటికి వ్యాఖ్యానం వ్రాసి ఇచ్చారు. ఆయన, తెలుగులోనూ, హిందీలోనూ, ఇంగ్లీష్ లోనూ అభినివేశం సంపాదించి హిందీవాళ్ళకు తెలుగు సాహిత్య సౌరభాలనూ, తెలుగువాళ్ళకు హిందీ రచనల సొబగులను అందించిన ధన్యజీవులు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%B8%E0%B1%80%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/page/n5/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version