[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]
సుకవిచంద్ర
శ్రీరమ్య తుమ్మలకుల
క్షీరాంబుధిచంద్ర ! విబుధ శేఖర ! వినుతో
దారగుణ ప్రోజ్జ్వల ! సీ
తారామకవీంద్ర ! భూషితయశోరుంద్రా !
కనకాభిషేకంబు గావించుకొనె గవి,సార్వభౌములు మహోత్సాహమంద
గండపెండేరంబు గైసేసికొనె నాంధ్ర,కవితాపితామహుల్ గణుతి సేయ
అభినవతిక్కనాద్యద్భుతబిరుదమ్ము లందె, నాంధ్రప్రజ యభినుతింప
భద్రగజము నెక్కి భాసిల్లుచు జగాన, నిజయశోదీధితుల్ నింపుకొనియె
ఔర ! తావక కవితాకుమారి పూర్వ, జన్మమున నెట్టి సుకృతంబు సలిపెనొక్కొ
కానిచో నట్టి మహిమంబు గాంచగలదె? సుగుణసాంద్ర ! సీతారామ సుకవిచంద్ర!
పినతన మాదిగా నెటుల బెంచితివో కవితాకుమారినిం
గనన నఘాత్మ! ప్రోడయయి కమ్మని తేనియబొట్లు పల్కు ప
ల్కున జిలుకంగ బల్కు, రసికు ల్మది మెచ్చ నటించు జూచినం
తనె గలిగించు మోజు పరదా మరువున్న నెలంత కైవడిన్ :
ఆస్థానపదవియం దలరారుగావుత తావక, ప్రియకవితాకుమారి
ఇట్టి సత్కారంబు లెన్నేనిఁ గాంచుత తానకప్రియ కవితాకుచూరి
నూత్న పద్దతుల వినోదంబు గూర్చుత, తావక! ప్రియ కవితాళుమారి
పుడమి నాచంద్రార్కముగ బెంపు నొందుత, తావకప్రియ కవితాకుమారి
తన సుధామయసూక్తులఁ దనిపి సకలmజనుల కన్యోన్య మొనగూర్చు చనుపమాన
కీర్తిగాంచుత సుజనానువర్తిని యయి, ధన్యగుణహారి త్వత్కవితాకుమారి.
సర్వలోకైకనాథుడీశ్వరుడు మీకు, జిరతరాయురారోగ్యవిశేషభాగ్య
భోగ్యము లొసంగి ప్రోచుగావుత సతంబు, కీర్తిసాంద్ర ! సీతారామమూర్తి సుకవి!
– శ్రీ దేవినేని సూరయ్య
~
జోహారులు
ఆంధ్రవీరుల కదనపాండితి
ఆంధ్రజాతి పురా ప్రభావము
అమరగాన మొనర్చి నేర్పిన
ఆంధ్రగురుమూర్తీ!
దేశ భాషల తెలుగు లెస్సని
తెలియ జెప్పితి మేటియొజ్జగ
అట్టి నీ మృదుమధురబోధన
హత్తుకొనె నెదలన్!
తియ్యనైన తెలుంగుకూర్పుల
తీర్చిదిద్ది యనుంగుతల్లికి
భక్తి మీర సపర్య సలిపిన
ధన్యతమజీవీ !
కవిత లల్లిన కవివరేణ్యులు
కలరు పెక్కురు తెలుగునేలను
కాని నీ యసమానమార్గము
కానిపింపదుగా!
పొల్లెరుంగని నీదుపల్కులు
డంబమెరుగని నీదునడవడి
విన్న కన్నను వింతగొల్పుచు
గారవము కూర్చున్!
నిస్తులం బగు నీదు ప్రతిభకు
నాల్గు చెరగుల’ తెల్గు నేలయు
పొంగి ‘అభినవ తిక్కనా’ యని
అభినుతించె గదా!
కట్టమంచియె సభకు పెద్దలు
గండపెండేరమ్ము తొడగగ
కన్నుగవ నానందబాష్పపు
కడలి ప్రవహించెన్
నేడు నీ కనకాభిషేకము
నేడు నీదు గజాధిరోహణ
మూడుకోట్ల మహాంధ్రజాతికి
ముద్దుముచ్చటలే!
మద్గురూత్తము భాగ్యరాశియు
మద్గురూత్తము పుణ్యరాశియు
మామకీనమహాంధ్రమాతకు
మాన్యతను గూర్చున్
ఆయురారోగ్యమ్ములందుచు
అచిరకాల మపూర్వ సేవల
ఆంధ్రమాతకు నంద జేయుము
జయము గురుదేవా!
– శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తం
~
కవివర్యా!
మీకబ్బుత దీర్ఘాయువు, మీకబ్బుత మెల్ల సిరులు మేరలు మీరన్
మీ కబ్బంబుల నెప్పుడు, నా కాంక్షించెదరుగాక యాంధ్రులు నెమ్మిన్
కళదప్పిన మనజాతికి, గళ దిద్దగ గలము బట్టి కంకణధరులై
భళి ! రాష్ట్రగాన మొనరిచి, కలకాలము వెలయు మీకు గలుగుత శుభముల్.
ఆంధ్రావళి మోదముకై, యాంధ్రత్వము, వెలయునట్టు లాంధ్రుల చరితన్
ఆంధ్రమ్మున రచియించిన యాంధ్రుడ! మిము; దిక్కనార్యుడనుటకు గొఱతే?
నీఱు గవిసెను మనజాతి పౌరుషమ్ము, ఆర లేదింక నెన్నడు నారఁబోదు
అనుచు చాటిన మీబోటి యాంధ్రకవికి, నాంధ్రలోకమ్ము హారతు లంపు టరుదె?
ఈ రీతిగ జిరకాలము, మీరలు పలుకావ్యములను మెఱుగులు మీరన్
ధీరగుణా ! రచియింపుచు, సారస్వత సేవ సలుపు సత్క వివర్యా!
– శ్రీ జాస్తి సూర్యనారాయణ
~
అభినవ తిక్కనా!
ఎపుడో నీ వీనాటను
ద్విపమెక్కుట జరుగవలసె ధీనిధి ! లోక
ద్విపములు హర్షింప నిపుడు
ద్విపవర మెక్కితి వభినవ తిక్కన ! సుకవీ!
ధరియించెను మును పెద్దన
ధరియించిరి మొన్న మొన్న ధరలోన: గవీ
శ్వరులు నలుగురొ ముగ్గురొ
ధరియించితి నేడు నీవు దగబెండెరమున్
కవితామాధుర్యంబును
జవిచూపించితివి నీవు సద్బుధలోకం
బవురాయని నుతియింపగ
గవివర్యా ! రామమూర్తి కమనీయాఖ్యా !
– శ్రీ కోగంటి దుర్గామల్లికార్జునరావు
~
ప్రాతఃస్మరణీయుడు
ఆంధ్ర జగతికి చిరకాల పరిచితులు పూజ్యులు ‘నగు అభినవతిక్కన తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారిని గూర్చి నాకు గల అభిప్రాయమును వెల్లడించుట పరమవిధిగా భావించుచున్నాను.
చౌదరిగారు సాహితీరంగమున ప్రవేశించిన దాదిని వారిని నే నెఱుంగుదును. ఆంధ్ర సాహిత్యమున పూర్ణాభినివేశమును బడయకమున్నె ఆయన జీవిత వృత్తము జాతీయముగ నిరాడంబరముగ నుండెడిది. ఆయన సామాన్య కర్షక కుటుంబమున జన్మించి స్వయంకృషిచే తన చిత్తసీమను దాగియున్న కవితా బీజమును మహోన్నత వృక్షముగ గావించి ఆంధ్ర జగతీ తలమున మహాకవి తిక్కన దిద్ది తీర్చిన తెలుగు కవితయొక్క సొంపును ఇంపును వెలార్చి విద్వత్కవుల ప్రశంసలకు బాత్రుడైన స్వయంప్రకాశుడు. ఒకరి తోడు ఆదరణ లేకుండినను తన స్వయంకల్పిత కవితా కుటీరమున గూర్చుండి ప్రాచీన ప్రాభవమును గోల్పోయి ప్రభు సత్కారమునకు దూరమై నిర్జీవమగుచున్న ఆంధ్ర కావ్యకళకు కన్నీరు గార్చి ఆత్మోపాసనా శక్తిచే ఆంధ్రకవితా కన్యకు నూతన జీవకళలను ఆపాదించుటలో అతని విశిష్ట పాండితి, భావనాశక్తి, ఉపాసనాబలము; ఆంధ్ర జగద్విదితములు. ఆంధ్ర విజ్ఞాన ప్రాభవమును, జాతీయ జీవనవిధానమును దేశభక్తిని, ఆంధ్ర విశిష్ట వైదగ్ధ్యమును శ్రీ చౌదరి గారు తన రచనల యందు తొణికిసలాడ జేసిన సహజ ప్రతిభా సముపేతుడగు కవిచంద్రుడు. అన్నపూర్ణా మందిరమగు పల్లెపట్టు చిరకాలానుగత దాస్య ప్రభావముచే నిర్జీవమై తొల్లింటి వైభవము దక్కి, కొనయూపిరితో నున్న విషయమును తన శిల్పకళా చాతుర్యముచే నభినవ తిక్కన హృదయంగమముగ తన శిరీషకుసుమ పేశల కవితా రచనలచే చిత్రించి భావుకుల చిత్తప్రవృత్తిని గ్రామ సేవాయత్త మొనరించుటలో అభినవతిక్కన మేటి.
కవి శిల్పి గాయకుల రచనా ప్రశస్తి వారి ఆత్మశుద్ధి ననుసరించి యుండుట కద్దు. ఆత్మ నుఱ్ఱూత లూప గలిగి పరవశత్వమును విహ్వలత్వమును గలిగింపగల రసార్ద్రఘట్టముల సృష్టింపగల అనంతభావనా ద్రఢిమగల లేఖిని మన యభినవతిక్కన్న గారిది. జడుడగు మానవుని సంస్కారశూన్యమగు చిత్తము నేని కదల్పగల సమ్మోహనశక్తి అభినవతిక్కనగారి ప్రతి పదమునుండి ప్రదర్శితము కాగలదు. వంగ సాహిత్య మున రవీంద్రకవి కల్గించిన విప్లవము వంటి విప్లవమును అభినవతిక్కన ఆంధ్రకవితారంగమున కలిగించినాడన్న నతిశయోక్తి కాదు. వేషమున రూపమున జీవన విధానమున అసామాన్య కర్షకకుమారునివలె కాన నగు నీ కవిచంద్రుఁడు పోతనవలె హాలికవృత్తియందాసక్తి గలిగి కేవల కర్షకుడుగ జీవించి ఆంధ్ర కావ్యజగత్తు నందింతటి మహోన్నతస్థానము నందుటకు అతని పవిత్ర చరిత్రయే ప్రబల హేతువు.
ఇతడు గాంధిభక్తుడు, శుద్ధఖద్దరు ధారి, నిరాడంబర నిగర్వచూడామణి; కాయకష్ట జీవి, మితభాషి, కాని మృదుభాషి. నిరంతర మేకాంతమున జపించి తపించి ఉపాసించి సరస్వతీ వర ప్రసాద లబ్ధసహజమృదు మధుర కావ్యశిల్పముచే ఆంధ్ర భాషావధూటిని నిత్య నవయౌవన సంశోభితగ జేయుట యందే తన జీవిత చరితార్థతను గన నుత్సహించు మహాకవిచంద్రుడు. ఈయన రచనలు తేనెతేటల నొలికించుచు కలకండ తీయందనమును నుప్పతిల చేయుచు తెలుగు నుడికారమును భావనాస్ఫూర్తిని వెల్లివిరియ జేయుచు రసవాహిని బొంగించుచు జీవమును జీవకళల నుట్టి పడజేయు నుత్తమశ్రేణికి చెందిన సహజ కవితా జగత్తునకు అపూర్వాభరణములు.
ప్రపంచము మానవ సహాయకరమగు సమరరంగమున మనుష్యత్వమును గోల్పోవుచున్న దినము లివి. సత్యాహింసలచే గాంధీ మహాత్ముడు నరాధముని నరోత్తముని గావింప గృషి సలిపిన విప్లవసంధికాల మిది. ఇట్టి కాలమున గాంధేయ మహోన్నత భావములను ఉత్తమ కవితాశిల్పమున ఆంధ్రజగతికి తొలుదొల్త సమర్పించిన పుణ్యధను డీ కవిరాజు. ఇఱువదవ శతాబ్దికి దగినట్టుగ నజరామరములగు భారత రామాయణముల వలె నాచంద్రతారార్కస్థాయిగ మహాత్ముని ఆత్మకథను జదివి మననము చేసి జీర్ణింపజేసికొని భక్తివిహ్వలుడై ఈ కవివతంసుడు తన అమృత సమానమగు కవితాఝరిలో ఆంధ్రరసజ్ఞ ప్రపంచము నీదు లాడింపగలిగిన ధన్యచరితుడు. రవీంద్రునివలె తన రాష్ట్రగానముచే నాంధ్రుల చిత్త సీమను ఆంధ్ర జాతీ యతాపరిపక్వభావసంస్కారబీజముల హత్తుకొన జేసిన ఆంధ్రరాష్ట్రోద్యమాభిమాని. జడుడై నిర్వీర్యుడై నిర్జీవ ప్రతిమయై దేశభక్తి శూన్యుడుగ నున్న ఆంధ్రుని యందు నిద్రాణ మైయున్న దేశభక్తిని, క్షాత్రమును, విజ్ఞానమును దట్టి లేపగల ఉద్దీపితాంధ్ర శౌర్య భావనాచిలసిత మగు పటుతరశ్రావ్య గేయముల సలిపిన ఆంధ్రభావోత్ఫుల్లకవీంద్రు డితడు.
ఉత్తముడు భక్తుడు, ప్రకృతి సౌందర్యరసలోలుడు, సాత్వికుడు, కార్మికకర్షక సహజ సరళ సాధుజీవనా సక్తుడు నగు ఈ అభినవతిక్కనగారి మహోత్తమ కవితా ప్రశస్తికి ఆంధ్రరసజ్జ ప్రపంచము తన్మయత్వ మంది ఆయనకు కనకాభిషేకము చేయు సందర్భమున ఆయన అమృతధారవంటి కవితా స్రవంతిలో నిత్యా నందము ననుభవించిన నే నీ నాలుగు ప్రశంసా వాక్యములను పలుకుట పరమవిధిగా భావించితిని. కనకాభిషేకము నందిన ఈ కవిరాజేంద్రుని అపూర్వ ప్రతిభా సంపద్విలసిత స్వయంకల్పిత భావనా జగత్తునుండి నానాట రసార్ద్రములు, సజీవములు, జాతీయములు జాతితన్మయత్వ హేతుభూతములగు మహోత్తమరచనలు తామర తంపరలుగ నాంధ్రజగతికి లభించి ఈ యభినవతిక్కనను ఆంధ్రజగతికి ప్రాతఃస్మరణీయునిగ నొనరింప బుద్ధదేవుని పదేపదే ప్రార్థించుచున్నాను.
– బౌద్ధవాఙ్మయబ్రహ్మ, శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య
~
పూలపూజ
సకలభాషలకంటె జవిగూర్చి మధురతల్, చిల్కు పల్కున గైత పల్కు వాడు
పదపదమ్మున మృగీమదము లందుచు, గావ్యకాంతకు సుఖ మిచ్చు కవివరుండు
రమణీయకృతుల కారాటించు వాణికి, బెద్ద కాపును జూపు ప్రేమజీవి
కవితలో సొగసులు కల్గించి ‘యభినవతిక్కన’ బిరుదాన దేలు మేటి
ధనము నాశింపకే కృతి ధారవోసి
కీర్తి గొన్నట్టి పోతన్న కేలుపట్టి
వాసి కెక్కిన యట్టి నా దేశికేంద్రు
డేలపొందడు బంగారుపూల పూజ?
– శ్రీ కోన ప్రసాదరావు
~
గురూత్తమా!
కల్లలు బొల్లు లెవ్వియును గన్గొన నేరవు బాపుజీ బలెం
బిల్లలలోన బిన్నవయి పెద్దలలోనను బెద్దవాడవై
నల్లన లేని జీవితమునన్ వెలు గొందెద వొక్క రీతిగా
నుల్లమునందు జూచెద వహో సుఖదుఃఖముల! గురూత్తమా!
కమ్మనికైత లల్లు మొనగాఁడవు నీ రచనంబులో గడుం
గమ్మని తీపిజల్లులు వికాసము నందె విశాలవిశ్వమున్
గ్రమ్మిన నీయశమ్ము గని కాన్కలు రాసులుగాగ నిచ్చి దే
శమ్ములవారు నిన్ను గడు సన్నుతి సల్పుదు రయ్య ! సత్కవీ!
తేటిగుంపు లానెడి పూవుదేనియలును
గరగరని జిలేబిని నూరు కండతీపి
దిరిసెనపు బూల జారిన తేటనునుపు
కలిసి ముద్దుగొన్నవి నీదు కావ్యరమను.
తెట్టలు గట్టుకొన్నవయ ! తీయని తేటతెనుంగుకబ్బముల్
దిట్టతనమ్ముచే జిలుగు దేనియతుంపురువాన నాని నీ
ప్టినపట్టు క్టిె వడివంకలు లేవు తెలుంగువారు నీ
య్టి మహాకవిం బడసి హర్షము చెందిరి తుమ్మలాన్వయా !
– శ్రీ లేళ్ళ వేంకటరామారావు
(సశేషం)