Site icon Sanchika

తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-12

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

ప్రస్తుతి

[dropcap]గ[/dropcap]జరాజుమూపున ప్రజ లొహోయనుచుండ, ఉత్సవంబ నిను గూర్చుండ జేసి

గండపెండేరమా పండితాగ్రేసరుల్‌, మదిమెచ్చి నినుగూర్చి ముదము జెంద

కనకాభిషేకమా కమ్మకులోద్భవా! తలయూపి కవిలోక మలరుచుండ

కటమంచితిలకుడా కార్యకలాపంబు, జరిపింప సభ కబ్బె జనులు మెచ్చ

మేలు తుమ్మలాన్వయచంద్ర మిత్రరత్న, మలరె నిఖిలాంధ్రలోకంబు లవనిలోన

నీదు భాషామతల్లికి నీవు సేయు, సేవకుందగు ఫల మబ్బె శ్రీశుకరుణ.

శ్రీ వల్లూరి సత్యనారాయణచౌదరి

~

నేత్రపర్వము

సోమయాజుల వారింటి సుభగరూప

ఆంధ్రభారతి పంకిలయగుట గాంచి

అంకమున జేర్చి సరిక్రొత్తలన్ని నేర్పి

ఉద్ధరించినమూర్తి మా యూరివాడు

పసగల రైతులోకమున బ్రాభవజన్మము గాంచి ఆంధ్రి కిం

పెసగగ గావ్యసూనముల నెన్నొ సువాసన లుప్పతిల్లగా

వెస సమకూర్చి నల్దెసల బేరు వహించిన రామమూర్తి! నీ

కొసగెడి గండ పెండరపు టుత్సవ మెంతయు నేత్రపర్వమౌ

పులకండముల నొక్కి పుక్కిటి బిఱ్ఱుగా, రస మప్పళించెడి రామచిలుక

గున్నమావిచిగుళ్ళు గుత్త బేరము చేసి,కొన్నట్టి కోయిల కులుకులాడి

సంజజామున బాలసంద్రమ్ములో బుట్టి, చల్లగా నడయాడు పిల్లగాలి

తూరుపుగొండపై బారాడు సఖు గాంచి, పక పకలాడెడి పరువుదమ్మి

పల్కులును బాటలును ముద్దులొల్కు నడలు, మోము జిగి నీదుకవనమ్ము ముందు

నిల్వ జాలవని సేతువాదిగా జాటుచుండి, చేరి రేనాడొ అచ్చరల్‌ శీతగిరికి.

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ

~

ఉడుగర

చతురత వెల్గు తెల్గుకవి చౌదరి కైతకదేల గల్గెనో

యతులితమాధురీపిమ ? యాంధ్రుల యాదరణాభిమానముల్‌

సతమును తిక్కయజ్వ పదసంజ్ఞలవర్తి విదేశభక్తి సం

యుతజనతోపయుక్తకృతు లుత్సుకతన్‌ విరచించుట స్గదా !

గంధగజోత్సవంబు కనకంబభిషేకము గండపెండేరం

బందిరి పెద్దనాదులన నచ్చెరు వేల ? భవాదృశుల్‌ మహా

నందము గూర్చు కబ్బముల నల్లి యశేషజనాళి గారవ

మ్మందగ నేడు పండ్లు పులియం దిలకించిరి సత్కవీశ్వరుల్‌.

శ్రీ బ్రహ్మాండం రామకోటేశ్వరరావు

~

ఎవరా యేనుగు పైన ?

ఎవరాయేనుగు పైన గన్పడు ? మహీ శేంద్రుడు గాబోలు; నౌ

నవె మీసంబులు కట్టు బొట్టుగనగా నాఠీవి దర్శింపగా

నవకాశం బగు నెట్టు శంకకు ? గవిత్వారామపీఠస్థలిన్‌

నవపట్టప్రతిషిక్తుడై యెడద నానందంబు పొంగించెడిన్‌

తెనుగు తల్లి కడుపు తీపిగాబుట్టెను, దెనుగు పాలుత్రాగి తేజరిల్లె

దెనుగుదనము కొఱకె దినము వ్యాహారించు, దెనుగుగడ్డ కితడు దివ్విటీయె

ఆ ముఖము శాంతియోగసమావృతమ్ము, దెలుపు చున్నది కవితలో దివ్యగాంగ

ఝరము పొంగులు వాఱింప సత్సమాధి, లోన మునిగిన మనసు లోలోని లోతు

సీతారామకవీశున కింతటి సన్మాన మిడగ నెంచిన తెనుగుం

భూతలము క్ష్మాతలంబున, స్వాతంత్య్రము తోడ వెలుగ జాలెడు నింకన్‌

శ్రీ నిమ్మగడ్డ రామకోటేశ్వరశాస్త్రి

~

సుకవీ!

కమ్మని తేనె లూరు నుడికారపుసొంపును నింపుచుండి స

త్యమ్మును జాటనేర్చి కడు ధన్యుడనౌదు వెళాని యీ మహిన్‌

స్వమ్మును గోరఁబోవు మఱి శారదమెప్పుల నందు దౌర! యో

తుమ్మలవంశధీమణి! యితోధికమన్నన లందుమా తగన్‌.

శబ్దసాధుత్వ రూపాన సంతరిల్లు, అర్దసౌలభ్యభాగ్యాన నతిశయిల్లు

భావగాంభీర్యదీప్తులన్‌ పరిఢవిల్లు చతురకవితయె నీదిగా చౌదరీంద్ర!

చల దుత్తుంగ తరంగ మాలిక మహాజాజ్వల్య భావంబులే

వలగొన్నట్టుల నీదు నవ్యకవితావాక్చాతురీ గుంఫనల్‌

విలయం బందెడిజాతి కైన సతమున్‌ విజ్ఞాన సంపాద్యమై

ఇలవర్తించునుగాదె మాదు సుకవీ! ఇంకేల సందేహముల్‌.

సంతతానంద సంధానశక్తి గలిగి, రాజితానూన కవితానురక్తి గలిగి

సర్వజనశోషితాశేషశక్తియుక్త, ధన్యజీవివి సుకవీశ ! ధరణి నేడు.

శ్రీ కొమ్మినేని వేంకటరామయ్య

~

సత్కారము

నినుబోల్పండితచక్రవర్తులిలపై నేర్పు లెసంగించినన్‌

ఘనమాహాత్మ్యము లాంధ్రజాతి కొదవు న్గళ్యాణభాక్కౌ సదా

మనయాంధ్రావని అంధత న్విడుతు రీమర్త్యుల్వివేకాత్ములై

అనఘా ! తుమ్మల సీతరామ ! గొనుమయ్యా ! మాన్యసత్కారముల్‌.

శ్రీ నామతీర్థాల పుల్లయ్య

~

కవిచంద్ర!

తెలుగుల శౌర్యమున్‌ దెలిపి దీక్షను జూపియు బౌరుషంబు మే

ల్కొలిపిన మీ యనర్ఘపదగుంఫిత గానరస స్రవంతిచే

పులకితులైన యాంధ్రులొక భూరిసువర్ణ మహాభిషేకమున్‌

సలుపుట యబ్రమౌనె కవిచంద్ర ! శతంబును గూర్చుగావుతన్‌.

శ్రీ వడ్డెపాటివిద్యానందశర్మ

~

ఆంధ్రవైతాళికుడు

ఓ మహాంధ్ర సత్కవి సార్వభౌమ ! నీదు

మృదుమధురభావ నవరసామృతము చిందు

రాష్ట్రగానకృతిని పరప్రాభవమున

తెలివిదప్పి నిద్రాణమౌ తెలుగుజాతి

మేలుకొల్పితి వాంధ్రవైతాళికుడవు.

పలుకులనింపు సొంపు మృదుభావపరంపరలందు ముద్దులన్‌

గులుకు నలంకృతుల్‌ లసదకుంఠితధారణశక్తి గుండియల్‌

చిలికెడి వీర్వతత్వము విశిష్టపుహాస్యరసపు లబ్ది నీ

కలవడె గాక ఏరి కిల నబ్బును సత్కవి రాజశేఖరా !

గంగోత్తుంగతరంగ భంగిమల పోకల్‌ పోవు వాగ్ధారలో

రంగుల్‌ దేరిన కావ్వపద్మమణిహారాల్‌ భక్తి నిండార బల్‌

సింగారించితి వాంధ్రవాఙ్మయకళా సీమంతినిన్‌ ని న్గళా

రంగంబం దెదిరించి నిల్వంగల ధైర్వం బున్నవాఁ డుండెనా?

ఎదివచియించినన్‌ మధువు లీనునటుల్‌ వచియింతు వెప్పు డె

య్యది రచియింతు వేని సకలాంధ్రజగజ్జనగేయమౌను నీ

హృది పదిలించుకొన్న దెదియేని బహిర్గతమాట నేరికే

న్బెదరవు ధన్యమూర్తివి వినిర్మలశీలుడవో కవీశ్వరా!

శ్రీ కోపల్లె శ్రీనివాసరావు

~

కైవారము

తెనుగుందోట వసంతకాలమున నుత్తేజంబుగా లేజిగుళ్ళను

నింపారగ మెక్కి, పాంథులకు నుల్లాసంబుగా విశ్వమో

హనగీతాదుల గానము న్సలుపు సీతారామపుంస్కోకిలం

బును వేనోళ్ళ నుతించుచుంద్రు రసలుబ్ధుల్‌ మోద మింపొందగన్‌.

నిదురించు సింగపుం గొదమల బోలిన, యాంధ్రుల మేల్కొల్పునట్టి సుకవి

నివురుగప్పిన యట్టి నిప్పునాన్‌ లోనున్న, శౌర్యాగ్ని రగులింప జాలు సుమతి

నిద్రాణమైయున్న నిజరాష్ట్రవాంఛాల, తల బెంపు నొందింప దగిన మేటి

గాఢసుషుప్తిలో గనిన బంగారుస్వ, ప్నముల కాకృతినిచ్చు జ్ఞానమూర్తి

తెనుగుబొలమును నలుగడ దీర్చి దిద్ది, సరసజాతీయభావబీజముల జల్లి

గౌరవం బందు వ్యవసాయ సూరివర్యు, డితడు హాలికకువలయామృతకరుండు.

సరసకవితకు వెలగట్టజాలు నెవడు

గండపెండేరములెగాదు కనకవర్ష

ములను గురియించినను సరి మూల్య మగునె?

తెలియ నివియెల్ల మనదు దిదృక్షకొఱకె.

దివ్యసందేశంబు నవ్యంబుగా నిచ్చు, జాతీయరచనల జదివి చదివి

కనకాభిషేకంబు గావించి ఘనముగా, గండపెండెరమిచ్చి నిండుభక్తి

గజముపై గూర్చుండ గావించి యుత్సవాల్‌, కవితల నుతియించి కరముప్రీతి

సన్మానసంచిక చక్కగా గైసేసి, భవ్యకవిత్వప్రభావ మెంచి

ఆంధ్రదేశమ్ము ముదముతో నమలదీక్ష కట్టమంచి రెడ్డ్యగ్రణి యెట్టయెదుట

నీకు సత్కారమున్‌ జేసె నిర్మలాత్మ!, సజ్జనవిధేయ! సుకవీశ సార్వభౌమ !

అభినవతిక్కన బిరుదము

సభయందుం బండి తాళి సరసత్వముతో

నభినుతి సేయంబడసిన

విభవము నీపాలి దయ్యె విశ్రుతకీర్తీ !

శ్రీ జాస్తి వెంకటనరసయ్య, శ్రీ ధూళ్ళిపాళ వేంకట సుబ్రహ్మణ్యము

~

కవిప్రశంస

శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగా రాంధ్రకవితా ప్రపంచములో గణుతికెక్కినవారు. అభినవతిక్కన బిరుదాంకితులు. ‘లేజవరాలి మోవికి  జిలేబి రసాలమార్దవ శ్రీజనయిత్రికిన్‌ రుచులు చిందెడు నాంధ్రవాణీ’ ముఖ్యోపాసకులు. వీరి యాదర్శకవి తిక్కయజ్వ ‘ సరసులెల్ల మెచ్చ మెఱయింతు గవితలో గమ్మదనము మత్కులమ్మున వలె’ నన్న ధీమాతో సాగించిన ఆత్మకథ, ధర్మజ్యోతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, అమరజ్యోతి మున్నగురచనలు వీరి యుపాసనా బలసంలభ్యములు. వీరి పద్యరచన ఆధునిక సంప్రదాయముల నలవరచుకొన్నను గద్వము మాతము పెద్దన ననుసరించినది. వీరి కవితాధోరణి తిక్కనరచనా విధానము స్ఫురింప జేయుచుండును. శ్రీనాథ, పెద్దనల ఛాయలు వీరి రచనములో కన్పించును.

వీరి ‘ఆత్మకథ , శివరామశాస్త్రి, గాంధీచరిత్రమునకు పద్యానువాదము, వీరి కృతులలో నిది యుత్తమోత్తమము, సుందరమునయినది, తమ రచనాప్రాగల్భ్యముతో చౌదరి గారు ఉత్తమపురుషుని జీవితవృత్తాంతమును ఉత్తమకావ్యరూపమున వెల్వరించినారు.

వీరి ‘రాష్ట్రగానము’ పైత్య మెసరేగి కింకి భ్రమలు గ్రమ్మి, దిక్కు దెలియకయున్న తెలుగువానికి దారిజూపి స్వరాష్ట్రాందోళనాభిముఖుని గావించినది. శ్రీచౌదరిగారు ‘రాష్ట్రగానము’ లోని ప్రతి అక్షరమునకు జీవముపోసి తమ ఆశయములను ప్రతిబింబింపజేసినారు. ‘యావదాంధ్ర విషయమ్ము నొక్క రాజ్యమ్ము జేసి పట్టి జయభేరి పై దెబ్బగొట్టువరకు తెలుగు పసిపాపకైన నిద్రింప దగునె’ అని ప్రబోధము జేయుచు సుషుప్తిలో మునిగిన తెలుగుజాతిని మేల్కొల్పినారు. ”ఆంధ్రుడవై జన్మించితి వాంధ్రుడవై యనుభవింపు మాయుర్విభవం బాంధ్రుడవై మరణింపుము ఆంధ్రత్వము లేని బ్రతుకు నాశింపకుమా” యని వీర సందేశ మంద జేసినది.

శ్రీ సీతారామమూర్తిగారి మాతృభాషాభిమానము వర్ణనాతీతము. తెలుగు పసదనమ్ము విడిచి పరభాషలకై ప్రాకులాడు దుర్బుద్దులన్న వీరికి గిట్టదు. వీరి కవిత్వములో ఇట్టి ప్రబోధములు కోకొల్లలు. వీరి రాష్ట్రగానము కవి దేశభక్తినీ, కవితాశ క్తినీ నిరూపించజాలినది.

శ్రీ మేడికొండ శ్రీరాములు

~

అక్షరాంజలి

శుద్ధఖద్దరులోన గూర్చున్నమూర్తి, ఎవ్వరాయని వేరె ప్రశ్నింపనేల ?

తిక్కనాదుల మరపించు దివ్యమూర్తి, ఆతడే నేటి తిక్కన్న అరయ రేమి ?

నాడు గొంతెత్తి మీరు గానమ్ము సేయ

ఆంథ్రిరతనాల భవనాలు అరగి కరగి

కరడుగట్టిన ఈతెన్గు కైత తోపు

లందు ప్రవహించి పల్లె పొలాలుచేరె

తెలుగుపొలాలపంట సిరి తీయదనాలు త్వదీయ లేఖనిన్‌

వలచి వసించెనేమొ కవివర్య ! సవా లొనరించు నీ కృతుల్‌

తొలకరిమబ్బులై కురియు తోయములన్‌ జలకంబు లాడి న

ట్లలరినయ్టి మాదు హృదయమ్ముల నిద్దుర మేలుకొల్పెడిన్‌

తాతలనాటి రెడ్డి సరదారుల పాలనలోన స్వేచ్ఛగా

పోతలు వ్రాతలై పెరిగిపోయిన వాంధ్రధరిత్రియందు ఏ

వో తలపోయనేటికి పవిత్రచరిత్ర! త్వదీయసాహితీ

రీతుల రైతులోకము వరించె నమస్సుల నందరా ప్రభూ!

శ్రీ వాసిలి రామకృష్ణశర్మ

~

సెబాసు

ఓ గురువర్య ! తెల్గుజగ ముమ్మడిగా నిడుబ్రోలులోన సు

స్వాగత మిచ్చె గైకొని యశమ్ము చిగుర్పగ నేన్గు నెక్కి యూ

రేగుము పండితుల్ సుకవు లెల్లరు నీ విభవంబు చూచి మేల్‌

బాగు! సెబాసు ! భేషనగ బంగరు పువ్వులలోన మున్గుమా!

ఉపాధ్యాయమిత్రుడు, వాసిలి కృష్ణమోహనదాసు

~

ఉపహారము

కొమ్ములు తిర్గినట్టి కవికుంజరు లెందరొ స్వాపతేయమం

దిమ్ముఘటిల్ల గీకెద రొకేపనిగా గవనమ్ము దాన బు

ణ్యమ్మును బూరుషార్థమును నభ్రసుమంబగు గాని నీవు వి

త్తమ్మును గడ్డిపోచలవిధంబున నెంతువుగాదె చౌదరీ !

శ్రీ యన్‌.వి.రత్నము

~

సుధీమణీ

జయజయ సత్కవీశ్వర ! విశాల వినూత్నవి శేషభావనా !

జయజయ నవ్యతిక్కన ! లసత్కవితాగుణ ! స్వాదుభాషణా!

జయజయ కమ్మవంశకవిచంద్ర ! విశేషయశోధనాలయా !

జయజయ రాష్ట్రగానమధుసారకవిత్వపటుత్వ వైభవా !

కమ్మని తేనెవాక తమకైత గుణాలయ ! భారతీ ప్రియా !

చిమ్మితి వీవు తెల్గువనసీమల పూవులచెండ్లు మ్రోగె నీ

గుమ్మముముందటన్‌ గొనబుకోర్కెలపంటకు కాలమౌట నో

తుమ్మలవంశవార్ధిశశి ! తూర్యజయారవముల్‌ సుధీమణీ !

శ్రీ వేదాన్తం గోపాలకృష్ణాచార్యులు

~

ధీరాగ్రణీ

విలసత్కోమలతాంఘ్రియై సుపథయై విఖ్యాతసద్భావయై

కలితాలంకృతయైన నీదు కవితాకన్యాలలామంబు స

త్కులకాంతామణి వోలె నెల్లరును దోడ్తో సన్నుతింపంగ వ

ర్తిలెడు న్నూతన తిక్కయజ్వ ! సుకవీ! ధీరాగ్రణీ ! నిచ్చలున్‌

సరసపదార్థముల్విసరి సంతసముం బొనరింతు వార్యులన్‌

ధరను వదాన్యు డంచు నిను తద్దనుతింపగరాదె సత్కవీ

శ్వర ! విరసంపువాక్యము లవంబును గానగరాదు చూడ త్వ

ద్విరచితగ్రంథరాజముల వింతచవుల్‌ వెదజల్లు నిచ్చలున్‌

అభినవతిక్కనాహ్యయము నల్ఫమె దాల్పగ నేరికైన దు

ర్లభమది నీకు లభ్యపడె రమ్యతరం బగు పుష్పరాజికిన్‌

ప్రభవముతోన సౌరభము వర్తిలునట్టు నోసుహృద్వరా!

శుభమగుగాత ! నీ మధురసూక్తులకు న్మఱి నీకు నిచ్చలున్‌.

శ్రీ అడ్డాడ వీరభద్రాచార్యులు

~

సువర్ణాభిషేకము

”అభినవతిక్కన” బిరుదము, శుభమతులు కవీంద్రులీయ సొంపుగ విద్వ

త్సభలను గణ్యత కెక్కిన సుభగచరిత్రుండ వీవు సుజనస్తుత్యా!

తిక్కనయజ్యపద్యముల తియ్యదనమ్మును మీకలమ్ము పె

న్మక్కువ, గోలి క్రోలి యసమాన మనోహర ఖండకావ్యముల్‌

తక్కక సృష్టిచేసిన ఫలమ్ము సువర్ణజలాభిషేకమై

గ్రక్కున రూపుదాల్పగ గరమ్ము ముదమ్ము జనించె నెమ్మదిన్‌.

శ్రీ గిద్దలూరు చెంచుబసవరాజు

~

పలుకు కవిత

సత్కవీంద్రుల భక్తిని సత్కరింప

వాసిగాంచెను నిడుబ్రోలువారి సరణి

సకలసాహిత్య సమ్మానసభల యందు

గులుకు గావుత తుమ్మల పలుకు కవిత.

శ్రీ మంగళగిరి దాశరథి

~

అపర తిక్కన

ఆంధ్రవిద్యార్ధుల యాత్మ వీధులయందు, స్వర్ణాక్షరంబులు చల్లునెవడు

ఆంధ్రావనీ కవీశాంబుధి సోముడై, గణన కెక్కిన యట్టి ఘనుడెవండు

ఆంధ్రలోకంబున కాదర్శమౌ నమరజ్యోతి వెలిగించె రాణ నెవడు

ఆంధ్రసుధామధురాశరంబుల రాష్ట్ర, గానంబు గూర్చిన కవి యెవండు?

అపర తిక్కనయను బిరుదందె నెవడు, అతడు కమ్మకులోద్భవు డంచితుండు

సీతరామాఖ్యు డంబికానేకరుణ, నాయురారోగ్య సంపదలందుగాత.

పరుసములు పల్క డెప్పుడు పరులతోడ, ముచ్చించును మాటలో ముద్దులొల్క

మోమునందెఫ్డు చిఱునవ్వు మొలకలెత్తు, నౌర ! ఏమందు మాతని గౌరవంబు

మెచ్చటి మైత్రి కెందును నీతడె పాత్రుడనగ

బరుల కష్టాల భాగంబు పంచుకొనును

సౌఖ్యముల జూచి దనయాత్మ సంతసించు, ననుభవజ్ఞుండు మేధావి యమలమూర్తి.

సర్వమతసహన మతని సహజగుణము, సత్యసంధత యాతని నిత్యగుణము

సర్వసౌభ్రాత్రమతనిదౌ సరసగుణము, నిక్కముగ నార్జవమితని నిరతదీక్ష.

నిత్యసంతోషికెప్పుడు నెగడు సుఖమ టంచు బల్కు నార్యోక్తికి నాతడే తగి

యుండె గాన నట్టి కులోత్తమునకు, ఆయురారోగ్య సౌఖ్యమ్ము లమరుగాత!

శ్రీ వల్లూరి శంకరయ్య

~

జేజే

శ్రీసత్పూతచరిత్ర ! భారతసవిత్రీ పుత్రరత్నంబ ! నీ

వే సౌభ్రాత్ర పవిత్రభావ కుసుమా లీయాంధ్రదేశమ్మునన్‌

భాసిల్లంగ నొనర్చినావొ అవి మాభాగ్యమ్ముగా నెంచెదన్‌

నీసన్మానమహోత్సవంబు కడు రాణింపన్‌ యశం బందుమా!

శ్రీ పులివర్తి సుబ్రహ్మణ్యాచార్యులు

~

సత్కవీ

నీకమనీయ వాగ్ఝరులు నిబ్బరవుం గవనంబులున్‌ రసో

త్సేకము లౌచు నీ తెలుగుసీమల నెల్లడ జాలువారత

చ్ఛ్రీకర వ్యా: ప్రపూరముల సేచనలం దనివొందుచుం బ్రజా

నీకము పట్టసాగినది నేడు నివాళులు నీకు సత్కవీ!

శ్రీ మారుపూడి వేంకటేశ్వర్లు

~

కవివతంసా!

మతపు గై పునగన్ను గానక

మనమహాత్ముని హత్య చేసిన

నీతిహీనుని చెయ్ద ‘మమర

జ్యోతి’ చాటెను సత్కవీశ్వరా !

జగము పొగడిన తెలుగువాణికి

ప్రగతి చూపిన నీదు కబ్బము

లగణితములగు భూషణములై

యలరు తుమ్మల సుకవిచంద్రా!

తిక్కయజం కవిత్వ శైలిని

నిక్కువంబుగ దెలుగుగడ్డను

బిక్కటిల్ల నొనర్చి యుంటివి

పేరువొందిన చౌదరీంద్రా !

‘ఆత్మకథ’యను కావ్యకన్యక

యాంధ్ర దేశము నాల్గు చెరగుల

దీరు తీరగు దీపి నొసగుచు

దేజరిల్లె యశోవిశాలా!

ముక్కలైన తెలుంగువారల

నొక్క బాటను రాష్ట్రగానము

మక్కువను నడిపించి యాంధ్రుల

మన్ననల గొనె సుకవిచంద్రా !

ప్రతిఫలంబున కాశ సేయక

కృతులు సత్పురుషుల కొసంగెడి

ప్రతిభ పెట్టని సొమ్ము నీకా

ప్రతిన తప్పకు కవివతంసా !

కమ్మకులమున బుట్టి యిమ్మగు

కమ్మదనమును జూపి కవితకు

నిమ్మ హీస్థలిదీరు తియ్యము

లెన్నొ దిద్దితివయ్య సుకవీ!

పట్టుదలతో నీకు నాంధ్రులు

మొట్టమొదటనే పూజసల్సిన

బట్టపగ్గము లేక మే మతి

పారవశ్యము సెందకుందుమె !

కనక మభివర్షించినను – పెను

గజముపై నెక్కించినను – నీ

సాహితీసేవాఋణమ్మే

సరణి దీర్తురు కవివరేణ్యా !

తెలుగు నుడికార మది ముద్దుగ

దెలుగు గవనము నందు నిలిపియు

గవితనము జూపించియుండిన

ఘనతనీదే కవివతంసా!

నారాయార్యుని త్యాగమహిమలు

సారెసారెకు గనుల మెఱయుచు

ఖ్యాతికెక్కిన నీదు ‘ధర్మ

జ్యోతి’ వెలిగెను సుకవిచంద్రా!

శ్రీ యడ్లపల్లి దేవయ్యచౌదరి

(సశేషం)

Exit mobile version