Site icon Sanchika

తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-13

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

కనకాభిషేకము

[dropcap]ఓ[/dropcap] కవికర్షకా ! కురియుచున్నది నేడు మహామహుల్‌ నమో

వాకము సల్పగా గనకవర్షము నీ కవితాలతాతతుల్‌

పాకునుగాక నాలుగు చెఱంగుల జక్కని తెల్గుతల్లి నా

జూకులు ఖండఖండములు సోకి విశాలములై విరాజిలన్‌.

ఈ కనకాభిషేకము వహించిన కైసరు లెందరుండి ర

న్నా ! కవిసార్వభౌముడు వినా మన తెల్గుజగాన సుప్రజా

నీకము మెచ్చ నిప్పటికి నీవ కదా కనిపించి తద్దశన్‌

గైకొని నిల్పికొంటివి యఖండకవిత్వపటుత్వ సంపదన్‌

పలుకులరాణి నీమధురభావమునం దుదయించి యెన్ని యో

కులుకులు చూపుచుండె గవికోకిల ! నీ కిల నేరు సాటి? యీ

తెలుగు పొలంబుపై బసిడితీగల పందిరి వేసి హాయిగా

నిలిపిన బిడ్డ వాంధ్రజననీమణి ని న్గని పొంగిపోయెరా !

హాయిగ విశ్వవీధులవిహారమొనర్చెను మంచిగంధమున్‌

బూయుచు బాదపాదముల బుప్పొడిరాల్పుచు జీవశిల్పమున్‌

గీయుచు బల్కు దేనె లొలికించుచు నీకవితాకుమారి ఆ

దాయ మెఱుంగునా? యెఱుగదా? కవిరాజకులావతంసమా!

కమ్మని తెల్గునందు నుడికారము దీరిచి దిద్దునేర్పు నీ

సొమ్మది నిక్కువమ్ము పరిశోధన చేసిన సత్కవీంద్రులే

నమ్మిరి భావిభారత మనందగు నాత్మకథన్‌ రచించి యో

తుమ్మలవంశదీప ! వినుతుల్‌ గొనవే మును తెల్గుగడ్డపై

అన్యా ప్రాపగుణంబులం బడసి దేశారాధకుండౌ జగ

న్మాన్యున్‌ మెచ్చి దయానురక్తిగృతిసన్మానంబు గావింతువే

కన్యాశుల్కము నంటబోవు కవిలోకం బందు నీజన్మమే

ధన్యం బైనది వాస్తవంబునకు సీతారామకవ్యగ్రణీ !

శ్రీ కన్నెగంటి వీరభద్రాచార్యులు (పల్నాటిసోదరకవులు)

~

జాతీయకవి – తుమ్మల

యుగమునకు ప్రతినిధిత్యము వహించి, సంఘమునందలి వివిధ పరిస్థితులను చితించువాడే కవి. జీవనసంగ్రామమునకు భయపడి భావకవిత్యము రచియించువారలు సంఘ శ్రేయస్సునకు బాటుపడజాలరు. సంఘమునందలి వాస్తవిక పరిస్థితులను తన కావ్య మనెడి దర్పణమున ప్రతిబింబింపజేయువాడే జాతీయకవి కాగలడు.

          మన తెలుగు సారస్వతము నందలి ప్రబంధకాన్యము లన్నియు నొకే ఫక్కిన ఉండినవి. భాషయందును, భావములందును శైలియందు రచనా విధానమునందును మార్పు ఇసుమంత గోచరింపదు. దేశము ప్రశాంతముగా నున్నపుడెట్టి సాహిత్యమైన నుచితమే. కాని విదేశ ప్రభుత్వము మన పై యధికారము చలాయించునపుడు మనభాషలు సంస్కృతి సభ్యతలు పతనావస్థను బొందినపుడు మనకు మానసిక పరివర్తనము కాకతప్పదు.

          స్వజాత్యుద్ధరణకై స్వదేశాభిమానముచే ప్రేరితులై నడుము బిగించుకవులు చాల తక్కువ. నిద్రించుజాతిని మేల్కొల్పుటయే కవి ప్రథమకర్తవ్యము. శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు అట్టికవులలో ప్రథమ శ్రేణికి చెందినవారు.

          స్వదేశాభిమానము, స్వభాషాభిలాష, దేశ స్వాతంత్ర్యము వంటి నుత్తమోత్తమగుణముల కాట పట్టగు వారి కావ్య సాహిత్య వాటిక వివిధ చిత్రవిచిత్రభావనా సుమములతో నొప్పారుచున్నది. వారు 1920 సం.. నుండియు సాహిత్య సేవయందే నిమగ్నులై తమ  తమ జాతీయ రచనాసాహితీ సుమములచే ఆంధ్రసారస్వతసదనము నలంకరింప చేయుచున్నారు.

          జాతీయకవులను (1) స్వజాత్యభ్యున్నతి నభిలషించు వారు 2) స్వదేశమునకు పాటుబడు వారు (3) విశ్వమానవకళ్యాణమును దృష్టియందిడు కొనువారని విభజింపవచ్చును. ఈ మూడింటిని తమ రచనలందు సుందరముగా శ్రీ తుమ్మలవారు సమన్వయము చేయకలిగిరి.

          రాష్ట్రగానమునందు తెలుగువారిని ప్రబోధించుచు ప్రాచీనాంధ్ర వైభవ గౌరవపతనమునకు కన్నీరుగార్చి ”పోతన్న కలముసొంపుల” నెరుంగుటకు బొబ్బిలికథలో దెబ్బలను చూచుటకు ”పూదండ సౌరభంబుల” బీల్చుటకును ఆహ్వానించెను.

          గత జాతీయసంగ్రామమందు తెలుగువా రొనరించిన అనేక త్యాగములు గలవు. దేశ స్వాతంత్య్రముకొఱకు తమ ఉడుకురక్తమును భారతమాత పాదారవిందముల కర్పణము చేసినవారనేకవీరయువకులును గలరు. కాని ఆంధ్ర రాష్ట్ర సంసిద్ధికై ఏకకంఠముతో ప్రయత్నము సల్పువారరిది. ”నాయకులం దనేకులు వినాయకులైరి సమస్త విఘ్నసంధాయకులైరి” అని కవి వాపోయెను.

          వీరి రాష్ట్రగానము హిందీసాహిత్యజాతీయకవి శ్రీ మైథిలీశరణగుప్త యొక్క ”భారతభారతి” వంటి అది హిందీ సాహిత్య మందు తమజాతీయ కావ్యము. అందు ప్రాచీన భారతౌన్నత్యము, వర్తమాన సంఘపతనము భావిభాగత ఆదర్శసంఘనిరూషణము గావించి గుపజీ నిద్రిత భారత జాతిని మేల్కొల్పెను.తెలుఁగులో ”జయభేరి” మున్నగు మరికొన్ని జాతీయ రచనలు ఇట్టివి గలవు.

          వీరి అన్యరచనలు ”ఆత్మకథ”, ”ధర్మజ్యోతి”, ”పఱిగపంట”, ”పెద్దకాపు”, ”అమరజ్యోతి” మున్నగునవి ప్రసిద్ధములు.

          ”ఆత్మకథ” యందు గాంధీజీ అమూల్యజీవితమును తన రసవత్తర శైలితో చిత్రించియుండెను. గాంధీజీ సిద్దాంతములను కావ్య శైలియందు నిరూపించి పండితపామర లోకమున ప్రచారము సల్పిన గౌరవము తుమ్మలవారికే దక్కినది.

          భారతదేశ స్వాతంత్య్రోపలబ్ధికి మూలకారకుడైన గాంధీజీ నిధన సమయమున ప్రపంచమంతయు హృదయా వేదనను వెలిపుచ్చెను. మన జాతీయకవి తుమ్మలయు ”అమర జ్యోతి” అను చిన్న కావ్యమున తన దుఃఖోద్వేగమును వ్యక్తపరచెను. వారి జాతీయ కావ్య కుసుమముల పరిమళము ఆంధ్ర కావ్య సాహిత్యవాటికలో మిక్కుటముగ వ్యాపించినది.

          తన కావ్యముల కితివృత్తముగ ఆధునిక సమస్యలనే గ్రహించి వాని ప్రచారమునకై మహత్తర మైన కృషి సల్పుచున్న శ్రీ తుమ్మల వారెంతయు అభినందనీయులు. అభినవ తిక్కన సముజ్జ్వల కీర్తిచంద్రికలు సంకుచిత రాష్ట్రీయతను వీడి విశ్వజాతీయతాకాశమున ప్రసరించుచున్నవి.

శ్రీ దేసు సత్యనారాయణ

~

కానుక

శ్రీ అభినవతిక్కనగారి గజారోహణకనకాభిషేకాది సత్కార సందర్భ మాంధ్రులకుఁ బరమానంద సంధాయక సమయము. శక్త్యనుసారము కానుక లర్పించి కన్నుల వేడుకగా గాంచుకాలము.

          1947 నకు బూర్వము శ్రీ చౌదరిగారిని దర్శించు భాగ్యము నేను బొందకున్నను పత్రికలలో వెలువడుచున్న వారి మధురకవితా మృతమును గోలి చొక్కి సోలినవాఁడనే. నేడు వారిసహవాససాహచర్యములు సంప్రాప్తింప జేసిన నా యదృష్ట దేవతకునే నెంతయు మ్రొక్కుచున్నాను. వారు నాకు బూజ్యులు, గురుతుల్యులు, సహాధ్యాపకులు, మిత్రులు నాదర్శపురుషులును. రసవత్తగమగు వారి కవితవలె నాదర్శప్రాయమగు వారి గుణగణంబును శీల సంపదయు సదా సర్వజనాకర్షణీయములుగదా!

          ఆంధ్రావనింగల కవిపండితు లెల్ల రేకకంఠంబున వీరి కవితా ప్రాశస్త్యమును గొనియాడియున్నారు. ఉత్తమశ్రేణికిం జేరిన యాధునికాంధ్ర కవి శ్రేష్ఠులలో నున్నతస్థాన మలంకరింపదగువా రని ”నభూతో న భవిష్యతి” యనురీతిని సర్వాంగ సుందరంబై సకలాంధ్ర సమర్పితంబగు నేటియీ సత్కారమే బహుధా స్థిరీకరించుచున్నది.

          ”స్వయం తీర్ణః పరాన్‌ తారయేత్‌”అను నార్యోక్తి చొప్పున దాను యశఃకామి యగుటయేకాక తన జాతివారినందరనున్న తాశయములతోను నుదారభావములతోను నింపి యశఃకాములం జేసి వారి సర్వాభివృద్ధికి దోడ్పడుటయే కవి కొకవిధి. అట్టి కవియే సారస్వత సేవామూలమున నిజమైన దేశసేవ జేసిన వాడుగా బరిగణింపబడగలడు. ఆనాడే ”కావ్యం యశసేర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే” యను నాలంకారిక నూక్తిని దనకృతులం దాతడు సాధించిన వాడగును. అట్టివానికృతులే సారస్వతములోనగ్ర శ్రేణిం జేరి చిరస్థాయిగా నిలువ గలవు. శ్రీ చౌదరిగారు పై నుదహరించిన కవిత్వ ప్రయోజనముల నన్నింటిని దమ కృతులలో సాధించి యున్నారనుటకు వారి యభినవతిక్కన బిరుదంబును, నభూతపూర్వంబైన నేటిసత్కారంబును నిదర్శనంబులు.

          ”చవియు సారంబు నెఱుగని చచ్చుకవులు” నేడు ”వినగూడని కబ్బము లల్లి గ్రామ్యముల్‌ బండులు బండ్లుగా” నింపుటయే కాక ”యీ కవిపాంసను” లాద్యకవీంద్రమార్గముల్‌ దుండఱికమ్మునన్‌ దెగడుచున్నారు. కావున నేడభినవ తిక్కనగారు ”తెల్గువాణి పాండువడంగు”నట్లును ”పాషండమత ప్రచారములు స్రగ్గి జగద్ధితమబ్బు” నట్లు ఎన్నండో తొలంగిచన్‌ విలసనంబులు శారదకబ్బు” నట్లును రాష్ట్రవాణిని తీర్చిదిద్దుటయే తమ ధర్మముగాను కొనియున్నారు. నేటియాంధ్ర సారస్వతమున నిట్టి యుదాత్తాశయములను సాధింపబూనుకొనుట శ్రీచౌదరిగారి వంటి యసాధారణ ప్రజాధురీణులకే చెల్లును. చౌదరి గారు తమ కృతులం దాద్య కవీంద్రుల పోకడలజూపి యాంధ్రవాణి కమూల్యాలంకారములు దొడిగి యామెను సర్వలక్షణలక్ష్మి జ్ఞాతనుగా సర్వాంగసుందరిగా నిర్మించి నిరూపించిరి. నన్నపార్యుని ధారాశుద్ధి, తిక్కనగారి తెనుగుదనము, శంభుదాసుని ‘ప్రబంధసరణులు’ శ్రీనాథుని సీసపు బోకడలు పోతన్న మత్తేభ యానములు, రామరాజ వేంకటకవుల శ్లేషభంగిమలు, సూరనార్యుని చమత్కృతులు, పినవీరుని ప్రసాదమాధుర్యాది గుణములు, విన్నకోటవారి ఛందశ్శ్రద్ధయు నీ కవివరేణ్యుని కవితలో మూర్తీభవించి తాండవించుచుండును.

          కవిత్రయములో దిక్కనయెజ్జాప్రగడలు తమ తమ భారతభాగములందు దమపోకడల కనువగు ప్రత్యేక కవితారీతులు పెంపొందించినను కథాసంవిధానంబున రసవద్ఘట్టకల్పనంబున విశిష్టభాషాప్రయోగంబున వారు వాగనుశాసనుల యడుగుజాడలలోనే పోయిరని చెప్పవలసి యున్నది. కావుననే యాంధ్ర సారస్వతమున గవిత్రయమువారికి మఱి యేరికిని లేని సమష్టి

విశిష్టత యేర్పడియున్నది. అభినవ తిక్కనగారును నన్నయయడుగుజాడలనే పోయి నేటికవులకు మార్గదర్శకులగుచున్నారు. ”పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణపుంజ” మగు పండిత బృందమును మెప్పించు కుంటువోని పవిత్ర కవితాధారయు ”ప్రసన్నకథాకలితార్థయుక్తి”యు వీరి ధర్మజ్యోతిలో వెలయుచున్నవి. పామరులను రంజింపజేయు అక్షరరమ్యత యన్ననో వీరి కృతులం దెల్లెడల బ్రత్యక్షమగుచునే యుండును.

          నన్నయ యడుగుజాడలలో నడచుటకే నన్నయ ప్రయుక్తంబులైన ”నల్లవో” మున్నగు అచ్ఛాంధ్ర పదములు మఱుగుపడి మాసిపోకుండ తమ కృతులందు బ్రయోగించుచున్నారు. మన కవులలో దిక్కనకుంబలె నీ యభినవతిక్కనకును జాను తెనుగు పదములన గడుంగడు మక్కువ. నేటిప్రపంచ పరిణామములం బట్టి భాషలో నన్యదేశ్యపదములు తండోపతండములుగా వచ్చి చేరెడి యీ రోజులలో నిట్టి జాను తెనుగుపదములు సమసి పోకుండ సంరక్షించుట భాషాయోగ కపూర్వాంగ సౌష్ఠవ మొనగూర్పుటయే యగునుగదా ! రేడియో రాగములు, నాటకపు బాటలు సినిమాస్టైలు ఔత్తరాహుల బాణీలు ప్రబలి దేశీయగానము మఱుగుపడి నశించుచున్న నేడు జానపదుల గేయముల నుద్దరించుటచే దేశీయభాషకు గానమునకు నెట్టి పుష్టి, సౌష్ఠవము నేర్పడునని విజ్ఞులు భావించుచున్నారో యట్టి సౌష్టవమే పురాతనపు జాను తెనుగుపదములను ప్రచారములోనికి దెచ్చుటవలన భాషకు సమకూరుచున్న దనుటలో విప్రతిపత్తి యుండ నేరదు.

          మఱియు నన్నయ ఆనాడాంధ్రుల వేష భాషాభిరుచులను గ్రహించి తదనుగుణమగు సారస్వత సృష్టి యొనర్చి వాగనుశాసనుడైనట్లే నే డాధునిక కవులలో చౌదరి గారును నాంధ్రుల సంస్కృతి ఆశయములు, పలుకుబడులు మున్నగున వెల్ల నిరూపించి యభినవ తిక్కన బిరుదముం గాంచిరి. ”స్వస్ధాన వేష భాషాభిమతాస్సంతో రసమలుధియః” అను నన్నపార్యుని రససూత్రరహస్యమును నేడు పాటించిన దిట్టకవి యీయభినవ తిక్కనయే. రసలుబ్ధ మానసమగు నాంధ్రమహాశయలోకము నన్నయకాలము నుండియు స్వస్థాన వేషభాషాభిమతాదులం దాదరాభిమానముల జూపుచున్నది. అట్టి స్వస్థానాదికము నుండి పాశ్చాత్య విద్యా నాగరకతాది సంపర్కముచే జ్యుతమైన యాంధ్రలోకమున – తెలుగు వెలుంగులు, తెన్నులు, వన్నెలు తీర్చి దిద్ది స్వస్థాన గరిమం గ్రహింపజేయుటయే కవిగారి ముఖ్యాశయము. అట్టి యుత్తమాశయము తమ రాష్ట్ర గానమున సంపూర్ణముగా నిర్వహించుటం బట్టి యాంధ్రుల కృతజ్ఞత కెంతేని పాత్రులై యింకను నెన్నేని యిట్టి సత్కారములకు బిరుదులకు నర్హులగుచున్నారు. నవ్యాంధ్ర కవితా పితామహులు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి ”గుణాఢ్యుం డితడే నెఱుంగుదు సదస్యుల్‌ మెచ్చి యే దిచ్చినన్‌ దగు నీతండటువంటి మేల్బిరుదమున్‌ దాల్పంగ ముమ్మాటికిన్‌” అను నీయాశీస్సులే పై యభిప్రాయమును ముమ్మాటికి ధృవపఱుచుచున్నవి గదా!

          కవి రసభావపూరితుడై యున్న తాశయములపై దృష్టి సారించి పరవశుడై స్వానుభూతులనే సర్వ ప్రపంచానుభవములుగా మార్చివేయ గలుగుచున్నాడు. క్షణికమైన క్షుద్రప్రయోజనములకై తనశక్తిని ఉపయోగింపక లోకకల్యాణమే గుఱిగా తన కవితాశక్తిని, మహత్ప్రయోజనములను సాధించు పొంటె వినియోగించును. నాడే కావ్యోనిష్టములగు సత్య నిరూపణ సౌందర్యోపాసనాది మహాప్రయోజనములన్నియు, ”ఉదారచరిత నిబంధనాప్రబంధ ప్రతిష్ఠా నాయకో యది వర్ణ్యేత లోకోత్తరగుణోత్తర” అనునాలంకారిక నూక్తికి గుఱియై సాధితములగుచున్నవి. అభినవ తిక్కన గారి కృతులన్నియు బైలక్షణమునకు లక్ష్యములైయున్న వనుట నిస్సంశయము. దేశభక్తుడు సత్పురుషుడు, సత్యద్రష్ట, ప్రతిభాశాలియునగు నీ కులశ్రేష్ఠుడు తన యున్నతాశయములచేత నుత్తేజితుడై సత్యనిరూపణ, కళోపాసన యను రెంటిపై దృష్టి సారించి తన మధురరచన కుద్యుక్తుండగును. వీరి కృతులం దెల్ల వీరి సత్యనిరూపణాసక్తియు గళోపాసనాతత్పరతయు సువ్యక్తములై యున్నవి.

          పరిగపంట, పెద్దకాపు అనునవి రెండును ఖండ కావ్యముల సంపుటములు. అచ్చమైన రైతై పెరిగిన యీ కవి తనకైతపంట నేర్చి కూర్చి సంపుటీకరించగా నేర్పడిన కావ్యద్వయమునకీ పేర్ల నిడి తనబిరుదమును సార్ధకము చేయుచున్నాడు.

          పెద్ద కాపులోని కృత మెరుక యను రచనకు కవి జీవితములోని యొక యద్భుత సంఘటనము కారణము. ఇందు గవి తనపరిణామశూలను పది సేర్ల గోధుమల నంపి తాత్కాలికముగ నుపమింపఁచేసిన వారియెడ గృతజ్ఞత చూపుట విషయము. చేసిన మేలు అత్యల్పమైనను మఱవకుండుట యను కవి సౌజన్యమే కృత మెఱుకలోను, తదితర కృతులందును వెల్లివిరియు చుండును. ”అడుగకయ మున్న పంపిన ఇట్టి యీవి కెంచి వెలకట్ట నోపువా డెవడుకలడు” అని లోకమున కుద్బోధించుటయే కృత మెఱుక యుద్దేశము.

          ఇందలి నేతాజీ, స్వతంత్ర భారతము మున్నగున వెల్ల గవ్యుదిష్టములగు నాదర్శములనే వెలయించు చున్నవి.

          ”భవ్యభారత మధురమూర్తీ

          దివ్యభారత సవ్యసాచీ

          నవ్యభారత చక్రవర్తీ

          నతులు నీ కివిగో”

          అని కవి భక్త్యావేశముతో నేతాజీకి నమస్కరించును. మఱియు నాదేశభక్తి యినుమడింప,

          ”పూనవోయీ! మల్లెపూలదోసిళ్లు

          పాడవోయీ ! వీరభక్తి గీతాలు

          కులవర్గములు పెంచు క్రుళ్ళింత లేని

          మతపిశాచంబుల మనుగడలేని

          జీవత్సమాజంబు సృష్టి గావించి

          తమ్ముడా! నీతేరు తరలింపవోయి”

          అని వీరభ క్తి గీతాలు పాడుచు సమాజమునకు నూతన చైతన్యము కలిగించి క్రొంగ్రొత్త సందేశములచే దానిని సజీవము చేయును. ఇంక ”మేలి పల్కు” లో ”తోటకూర ” వారిపై గల పద్యములు చేమకూర వారి పాకమున బడ్డవి. ”ఇంత వెరవకమ్మ యితడు నీ చేతికి దొరకినట్టి లేత తోటకూర పులుసుపిండి నీకు వలసిన చందాన వాడవచ్చు రుచులు చూడవచ్చు” ఇందలి నుడికారపుసొంపు శ్లేషభంగి చేమకూర వారిని ద్రోసిరాజు చేయుచున్నవి.

ధర్మజ్యోతిలో యథార్థవిషయమును సంగ్రహించి కవి ధర్మపరాయణుడైన మానవుని ప్రవర్తన మెట్లుండవలెనొ విపులముగా వివరించియున్నాడు. కవిగారితండ్రి తన దాచిన ధనమును దాని యజమానున కొసంగగా నతడు ఈతని యాత్మపావిత్య్రంబునకు విస్మయము జెంది వానిం గొనియాడెను. అందులకా ధర్మమూర్తి ‘ఘనకార్య మేమి నెఱపితిని నీ సొమ్ము నీకొసంగితిని. ఈ సేతకు బసదనంబు లీయవలయునా” అని పలుకుచు వారించెను. ”పర ధన వైముఖ్యము నిక్కరణిం” బ్రకటించిన ధర్మపరాయణు డసంఖ్యాకమగు మానవ సంఖ్యలో నెక్కడో లెక్కకొక్కడు కలుగుటయు దుర్లభముగదా! ఈతడు గీతానిరూపితాదర్శ కర్మయోగిం బోలి యున్నాడు. మిత్రుడగు దానయార్యుఁడు ధర్మజ్యోతి మదంకితము గాగ నొనరింపగదే” అని పేదలు కృతజ్ఞతయ కాక యేమి యిత్తురు కాన్కల్‌” అని కవిగారిని కోరగా ”కృత మెఱుక చాలు”నని యీ కావ్యమును వారి కిచ్చుటయేకాక ”కోరకమున్న యీ హితునకు గృతినిచ్చెడి భాగ్యరేఖ చేకూరమిఁ జేసి లజ్జయును గొందలమున్ ” తలసూపుచున్నవని వగచెను.

          తనపై దిరుగుబాటు చేసిన అవిడియన్‌ కాసియస్‌ యొక్క హత్యావార్తను విని తన కాతని లోబరచుకొని రక్షించి క్షమించెడి యానందము చేకూరదయ్యె గదాయని విచారించిన రోమన్ సమ్రాట్టు మార్కెస్‌ అరులియస్‌ను దలపించుచు నీ వాక్యములు కవిసౌజన్య సంపదకు బరమావధినే సూచించుచున్నవి.

          ఆత్మార్పణ మను పేర రచింపబడిన కపోతో పాఖ్యానము తిక్కనవ్రాత కన్నింట దీటై యుండి  భారతీయుల యతిథిపూజాతత్పరత, దాంపత్య ప్రేమావయు నిరూపించుచు గరుణరసమును జిప్పిల్లు చేయుచున్నది. మహాత్ముని యాత్మార్పణముతో వెలింగెడి ”అమరజ్యోతి” కరుణరసమునం దీయాత్మార్పణమున కన్నింట మిన్నయై యున్నది. మహాత్ముని నిర్యాణము మానవ కోటికే మహోపద్రవకారియని గుర్తించిన యభినవతిక్కన ”మహోర్మిన్‌ బోని – కన్నీటితోన్‌” గాందీ నిర్యాణకృతిని రచించెను. ఆత్మకథ అమరజ్యోతులలో మహాత్ముఁడు బ్రతుకులో మృతిలో” పీడిత ప్రజ సల్పిన యూడిగం బును జూపి యాతనిని గోముగా, సాధారణ భారతీయునిగా భావించిన వినాయక గోడ్సే నశ్వరమైనయాతని కాయమును గూల్పగల్గెను గాని శాశ్వతమైన యాత్మను నాశనముచేయ నసమర్థుడనియు నయ్యది శుభసంపదలతో సత్యసౌందర్యములతో నిరవధికామరజ్యోతియై లోకలోకముల వెల్గు జూపుననియు నిరూపించుటయ కవియాశయమై యున్నది. అభినవతిక్కనగారు తమ సారస్వత సేవారూపమున నాంధ్రులకు జేసిన సేవ యింతింతని చెప్పనలవికానిది. రాష్ట్రగానము రచించి యాంధ్ర లోకమునకు మహోపకార మొసరించిన వీరు ఆంధ్రుల కృతజ్ఞత కేం తేని పాతు లగుచున్నారు. ఎన్ని కనకాభిషేకములు చేసి, డాకాల నెవ్ని గండ పెండరముల దొడిగి యెన్ని గజారోహణములు కల్పించినను నాంధ్రుల ఋణము తీఱునది కాదు. ఆంధ్ర లెల్లరు రాష్ట్రవిషయమున నేకమై నేటికొక తాటిపైని తీవ్ర సన్నాహములు సల్పుచుంట శ్రీ చౌదరిగారి రాష్ట్ర గాన ప్రభావము కాక యింకేమి కాగలదు. ఆంధ్రులెల్లరొక్కుమ్మడి ”మఱు మ్రోయున్ గద తెల్గు వీణియలయుష్మ ద్రాష్ట్ర గానమ్ము మీ కొరడాదెబ్బకు దద్దఱిల్లిపడి తెల్గుల్‌ మేలుకొన్నారహో!” అని కృతజ్ఞతా పూర్వకంబుగ వచించిన గొంత ఋణము తీరునేమోయని భావించుచు భక్తి పూర్వకముగ నమస్కరించి వారికీ కానుక నర్పించి సెలవు తీసికొనుచున్నాను.

విద్వాన్‌ శ్రీ బి.వి.సత్యనారాయణ, బి.ఎ.,బి.యిడి.

~

సుకవి

నేను గోచి పెట్టనినాడె నీవు తెలుగు

నాట కవియన్న పేరొందినాడ విపుడు

నన్ను చెలికాని వలె చూచు నిన్ను జూచి

నిండుకుండ తొణక దని నిలచి తలతు.

ఎంతటి పూర్వపుణ్యము వహించినదో భవదీయజన్మ మా

ద్యంతవిముక్తకాలహృదయమ్మునభాసిలు రత్నమాల నా

శాంతము వెల్లు లీను మణి వై జనియించితి వాత్మబుద్ధమై

యెంతి వానికిం గలుగు నీయజరామర కావ్యభోగముల్‌.

తెలిపితి వాత్మార్పణమున్‌, పలికితి వాత్మకథ తెలుగుపలుకుబడుల నీ

వలకున్‌ బిలచి కవీ ! తు, మ్మల సీతారామమూర్తి మహితుడవయ్యా!

గత మనెడి మ్రాడు చివురించుకవులకడ, న

నాగతాతి కర్కశబీజ మంకురించు

కవులవాగ్ధార లందు శోకహత జగతి

కిని పునర్జీవ మొసగెడి ఘనులు కవులు.

ఆనాటిపెద్దనార్యుని, శ్రీనాథుని జ్ఞప్తి తెలయ జేసెడు జుమ్మీ

ఈనాటి నీమహోత్సవ, మేనాడును నీకు శుభములే యగు గాతన్‌.

శ్రీ చిరంజీవి కొండయ్య

~

పెద్దకాపు

కారకమద్భుతమ్ము నుడికార మనన్యధనమ్ము శబ్దసం

స్కారమశేష మాంధ్రజన సంస్కృతి పూర్ణ మహోరసంబు మం

దారమరంద మంచిత కథాసువిధాన ముదాత్త మౌచితీ

స్ఫారము లాత్మ కావ్యములు ప్రస్తుతిగన్నవి నవ్యతిక్కనా !

పిన్నటనాటగోలె మురిపెంబును భక్తియు దాండవింపగా

నన్నయతిక్కనాది కవినాథుల కావ్యకళావిశేషముల్‌

మన్నననేర్చి కూర్చి బహుమానముచేసితి తెన్గుతల్లికిన్‌

నిన్నిటబోలువార లవనీస్థలి నన్నయతిక్కనాదులే.

వేనకువేల నిత్తుమని వేడిన వారికి గాదుపొమ్ములై

మానుగ నంకితంబు లవి మాన్యులకైనవి లోకముబ్బఁగన్‌

సూనృతధర్మవర్తనలు సూరిజనావళి మెచ్చు తీరులున్‌

గానగవచ్చు జీవితము కావ్యము రెంటను నచ్చుకూర్పులై.

కంటిమి తెల్గునాటగల కావ్యములం గవిసార్వభౌములన్‌

గంటిమి నాడునేడు గల కావ్యకళారమణీయశిల్పమున్‌

వింటిమి పూర్వ వైభవము విశ్రుత కీర్తియు గాన మెందు నీ

వంటి కవీంద్రు నీ కవిత వంటి విశిష్టకవిత్వ శిల్పమున్‌.

బాపుజీకృతి కర్త బంగారుకొండకు, గనకాభిషేకంబు కాసుదండ

ఆత్మార్పణాదర్శ మందించు త్యాగికి, నంబారి సేవలు నందలములు

రాష్ట్రగాన సుకవిరాజ శేఖరునకు, గండపెండేరంబు కంచుఢక్క

ధర్మామరజ్యోతి నిర్మాణకర్తకు, నీరాజనంబులు నిలువు దొడుపు.

పఱిగపంటలతో బాసకఱవు దీర్చు

పెద్దకాపునకుం దెన్గు పెద్దఱికము

తెన్గువారిచ్చిరభినవ తిక్కనకును

ధరణి వర్ధిల్ల నాచంద్రతారకముగ

శ్రీ పరుచూరి వెంకయ్యచౌదరి

~

కవిశార్దూలా!

చక్కని పదములతో, బెం

పెక్కిన రసధారల గవివృషభులు మెచ్చన్‌

దిక్కన ఫక్కిని సొగసుగ

జెక్కగలాడవు కయితను సీతారామా!

కాంతు లెగజిమ్ము నీ ప్రతి కావ్యమందు

మధుర రసభావముల నెట్లమర్చినావొ

చెరకురసమును బోసి గుచ్చెత్తినావొ

కండచక్కెర తేనియ కల్పినావొ.

రాష్ట్రగానమ్ము ఈ యాంధ్ర రాష్ట్ర మెల్ల

బూరి గుడిసెలలో గూడ మారు మ్రోగి

చాటుచుండెబో నీయశశ్చంద్రికలను

గడగి కనక మూర్ధాభిషేకమ్ముతోడ.

శ్రీ నందివెలుగు వేంకటేశ్వరశర్మ

~

భావవిప్లవము

కవితయు గానము నృత్త్యము చిత్రము నిత్యాది లలితకళలకు రెండే

పరమ ప్రయోజనంబులు జాతికి నుద్బోధనంబు నానందంబున్‌

కళలలో రాణి కవితగా రసికవరులు విజ్ఞులును నిర్ణయించిరి నిజము నంతె!

కవిత రాజ్యాల నిల్పును గూలద్రోయు కవిత యిచ్చును నిస్తులానంద మహహ!

రెంట నేదియు గొరవడన్‌ గొరతయె సుమ! ఉభయసంపాదకంబున్‌ రాష్ట్రగాన

మాదిగా కావ్యరాజి భావాన విప్లవంబు నిడె భాషలో విప్లవంబు విడిచి.

శ్రీ శోభనరావు

~

రాష్ట్రకవి

స్వాతంత్య్ర భారతావని

జాతీయకవీంద్రుడన యశం బందితి శ్రీ

సీతారామ కవీ! వి

ఖ్యాతిన్‌ కనకాభిషేక మందుము సతమున్‌.

శ్రీ కోళ్లపూడి మల్లికార్జునకవి

~

స్వర్ణాంజలి

శ్రీమత్తుమ్మల వంశ వార్ధిశశినం విద్వద్యశోభూషితమ్‌

శ్రీ వాణీనిలయ ప్రవేశ రచనామాధుర్య ధుర్యాననమ్‌

శ్రీ హేలా సుమగుచ్ఛరంజిత పదావిర్భూతగానామృతమ్‌

శ్రీ సీతారామకవీన్ద్రపణిత మముం శ్రీ భారతీ పాతువై!

శ్రీనిధిం సుగుణోపేతం శ్రీవాణీవిలసన్మణిమ్‌

సీతారామ మముం ఖ్యాత మనిశం పాతు శఙ్కరః

శ్రీకరం తిక్క యజ్యానం దివ్య దేశామృతప్రదమ్‌

కనకాభిషేక సంయుక్తం ప్రజాదరణ భూషితమ్‌.

శ్రీ సుసర్ల వేంకటేశ్వరశాస్త్రి

~

అభినవ తిక్కన

చక్కని రసార్ద్రహృదయము, మిక్కిలి మోదమ్ముగూర్చు మృదుల కవిత్వం

బొక్కట నలవడె నీకిటు, అ క్కవితిక్కనకువలెనె అభినవతిక్కా!

జాతీయమ్ములె సొమ్మై రాతిని గిలగింత బెట్టు రసమే యసువై

జాతికిమానము వోయును ఆతతమౌ నీదు కవిత అభినవ తిక్కా!

కనకపు టభిషేకమ్మును, ఘనగజ మెక్కించి త్రిప్పి కై సేయుటయున్‌

పెను గండపెండెరమ్మును అనువౌనౌ నీదు కవిత కభినవతిక్కా!

శ్రీ ప్రతాప రామకోటయ్య

~

యుగకవి

అభినవతిక్కనా ! సలలితాధికసత్కవితావిలాస ! సం

ప్రభవయశఃప్రకారజిత వారిజ వైరి సుధా సురాపగా!

విభవము నాయువున్‌ సుఖము విశ్రుతలక్ష్మియుఁ బెక్కు భంగులన్‌

శుభగతిపొంది వర్దిలుము సూరులు మాటికి సన్నుతింపగాన్‌

వాఙ్మయావని నీ కీర్తిభాస్వరంబు

హైమమయమైనయట్టి మహక్షరంబు

నేటిసన్మానమే నీకు మేటిగాదు

ఎట్టి సన్మానమైన నీ కీయదగును

శ్రీ వాకాటి పెంచలరెడ్డి

(సశేషం)

Exit mobile version