Site icon Sanchika

తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-16

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

దేశసేవ

[dropcap]ఆ[/dropcap]టంకమ్ముల వేల మాట లవి యేలా గట్టి గాన్‌ బేర్కొనన్‌

మా టంగ్టూరి ప్రకాశ సింహమునకున్‌ బట్టాభికిన్‌ నీవునున్‌

దీటౌవాఁడవు దేశసేవయెడ గంధేభంబుపై నెక్కుటన్‌

దాటన్‌ రాని ముదంబు మా కగును సీతారామ విద్వత్కవీ!

శ్రీ బాచిమంచి శ్రీహరిశాస్త్రి

~

కవిజాతీయ జీవనానికి జీవగఱ్ఱ

కవిత యొకగారడి. మానవులను వుత్సాహపరుసుంది; వుద్రేక పరుస్తుంది; వుషారు పుట్టిస్తుంది. నిరుత్సాహపరచగలదు. నిర్వీర్యులను జేయగలదు యేడ్పిస్తుంది, నవ్విస్తుంది. ఆనందపరవశం జేస్తుంది. దుఃఖాబ్ధిలో ముంచేస్తుంది. కవి చరిత్రకారుడు. కవి విజ్ఞానఖని. కవిత గమనము రెండు పాయలుగా యున్నది. స్వార్ధాన్ని త్యజించి, పరార్ధాన్ని కాంక్షించి, పీడిత ప్రజల వుద్దరణకు, దోపిడీ సమాజ నిర్మూలనకు వుజ్జ్వలపాత్ర వహిస్తుంది ఒక పాయ. స్వార్ధాపేక్షయే పరమాశయంగా పెట్టుకొని స్వీయప్రాబల్యమే జీవితలక్ష్యంగా యోచించి మానవహానికి, మారణహోమాగ్నికి దార్లు వేస్తుంది రెండవపాయ. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే అభ్యుదయ అభ్యుదయ నిరోధశక్తులవలె పని జేస్తుంటాయి.. మా అభినవతిక్కన కవిత్వం అందు మొదటిపాయకు జెందినదని చెప్పుకొనుటకు గర్వించుచున్నాను. జాతీయ విప్లవంలో సామాజిక విప్లవంలో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలలో కవుల కలాలు యెంతజోరుగా చిందితే విప్లవపోరాలు అంత వేగంగా పురోగమిస్తాయి. సోవియట్ రష్యా విప్లవవిజయానికి ”టాల్‌ స్టాయ్‌” , ”మాక్సిమ్ గోర్కీల” విప్లవరచనలే కదా కారణాలు. ఫ్రాన్సు ప్రజావిప్లవానికి కవిపుంగవులే కదా కారణం. ఐర్లండు జాతీయ విప్లవం కవీశ్వరుల విప్లవగీతికలతోనే కదా మొలకలెత్తింది. అంతవరకెందుకు. భారత జాతీయ విప్లవకవుల కలాలనుండి ప్రవహించిన విప్లవవాహిని గుండానే కదా విప్లవకారులు నడచింది. కాలప్రవాహాన్ననుసరించి కవిత నడుస్తుంది, నడవాలి. గతించిన చరిత్రలో కవిత్వం చాలా దార్లు తొక్కింది. యెవరు అధికారంలోవుంటే వారి వైపే నడచింది. రాజులను మెప్పించుట ద్వారా స్వంతలాభమును గడించుటకు కవిత్వమును అంకితం జేసినవారున్నారు. పాలితవర్గపు ధోరణి యెలాగున్నా పాలకుల పాదసేవయే పరమావధిగా పెట్టుకొన్నారు కొందరుకవులు. అయితే అట్టికవులను ఈనాడు చెప్పుకొనేవారు లేనే లేరు. స్వార్ధాన్ని త్యజించి సమాజం కొరకు తమకలాన్ని చిలికించిన పోతనామాత్యునివంటి వారే ఈనాటికీ సంఘలో కొలువ బడుతున్నారు. అట్టి కవి పుంగవులనే ఈనాటి సమాజం కావాలంటున్నది. సంఘం కొరకు వారు సంఘంలోని ప్రజల కొరకు తమకలాన్ని సాగిపోనిస్తారు. ఈ విధంగా స్వార్ధాన్ని త్యజించిన కవికి గాని, రచయితకు గాని ప్రస్తుత సమాజంలో స్థానమున్నదా? ఒక్కొక్కప్పుడు అలాంటి వాళ్లకు పచ్చి మంచినీళ్లయినా పుడుతున్నాయా అనిపిస్తుంది. పదునెనిమిదవ శతాబ్దంలో ఆంగ్ల దేశపుకవుల, రచయితల దుర్భరావస్థకు ఈనాటి మన దేశపు వాయసగాండ్ర, కవిపుంగవుల స్థితి తీసిపోదేమో. ఆరోజుల్లో ఒకడు ఓ కావ్యంవ్రాసినా పద్యంవ్రాసినా కథలల్లినా చదివేవాడు కనీసం వినేవాడైనా దొరికేవాడు కాదట, తాను వ్రాసిన కవితను చదివి వినిపించవలెనంటే కొంతరుసుము ముట్టజెప్పు కొని వినేవాడిని కొని తెచ్చుకొనవలెనట. అప్పులపాలై తుదకు తన చినిగిపోయిన కోటును అతుకు వేయించుకొన్నందుకుగూడ డబ్బు చెల్లింపలేక ఒక కవి దర్జీవానిచే ఖైదుచేయించ బడ్డాడట. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత శామ్యూల్‌ జాన్‌ సన్‌ ‘పగటిపూట కాళ్లకువాడిన మేజోళ్లను రాత్రి పూట తలకు టోపీగా ధరించే వాడట.

ఈనాటి మన రచయితల విషయం ఆలోచిస్తే, ఒకడు వ్రాసినదానిని మరొకడు ఆనందించే రోజులు గతించాయి. ఒకరచనగాని, కవిత్వంగాని బాగు లేకపోతే విమర్శించడం, బాగుంటే ఈర్ష్యపడటం జరుగుతుంది. మరి యెవరికోసం వ్రాస్తున్నామో తెలియకుండా వుంది. కవిసన్మానాలంటూ నామమాత్రంగా జరుగుతున్నాయే గాని వాస్తవిక దృష్టితో విచారించినచో అవి సన్మానాలని నేననను. ఒకరికి సన్మానం జరుగుతుంటే మరొకడు ఈర్ష్య పడటం, విమర్శించడం, తద్వారా సంకుచిత తత్వంతో సమాజమంతా లోపభూయిష్టమై పోవడమే కానవస్తున్నది. కాని సువిశాలభావాలు మచ్చునకైనా గానవచ్చుట లేదు. గౌరవ మర్యాదలు పూర్తిగా నశిస్తున్నాయి. వ్రాయసగానికి వ్యక్తిగతంగా గౌరవమర్యాదలు సంప్రాపించుట లేదు. ప్రసిద్ధ ఆంగ్ల రచయిత, జీవితచరిత్రకారుడునైన జేమ్సు బాస్వెల్‌ ను గురించి మెకాలే మహాశయు డేమన్నాడో చూడండి, ”బాస్వెల్‌ వ్రాసిన జాన్‌ జీవితము యెంత పేరుప్రతిష్టలు గడించి జీవితచరిత్రల ‘కన్నింటికీ తలమాణిక్య మైనదో దాని రచనాకారుడైన బాస్వెల్‌ ను అంత నీచాతినీచంగా లోకులు చూస్తున్నారు. తుదకు ఆ గ్రంథ ప్రకాశకుడు సహితం ” రచయితను గురించి ఒక్క వాక్వమైనా వ్రాసియుండ లేదు.” ఈనాటి మనకవుల, రచయితల స్థితిగూడా అట్లే యున్నదనుటలో సందేహం లేదు. ఎంత వున్నతకవియైతే అంత హెచ్చుమంది వ్యతిరేకులగు చున్నారు. ”కవిగానని ప్రదేశం రవి గాంచలేడు. కాని కవికి స్థానం లభించుట లేదు.” కవి, రచయితకు, కళాకారునకు ఉన్నతస్థానం లభించనంతవరకు సమాజానికి మోక్షం లేదు. వీరు సమాజానికి విజ్ఞాన ప్రదాతలు. మానవలోకానికి జీవగఱ్ఱలు. వీరు లేని సమాజం ఊసర క్షేత్రమే, వీరు లోపించిన జాతి అజ్ఞాన కూపమే, వీరుండని దేశము సహారా యెడారియే, వీరే అజ్ఞానానికి శత్రువులు. ఆనందానికి పట్టు గొమ్మలు, వికాసానికి వెన్నెముకలు, ప్రజాస్వామిక వ్యవస్థలో వీరిదే ప్రధాన తాంబూలం. పరిణామసమాజంలో వీరే అభ్యుదయగాములు, జాతీయపోరాటాలలో విప్లవగీతిక వినిపించి విప్లవకారులను వుషారు పరిచేది వీరే. ప్రజలను వుద్రేకులను వుద్వేగులను జేసేది వీరే. అరాచక వాతావరణంలోనున్న ప్రజా సముదాయాలను చిచ్చిగొట్టి జోలపాట పాడగలిగేది వీరే. సమాజ బాధకులకు అభివృద్ధినిరోధశక్తులకు వీరి హృదయాలనుండి పొర్లుకవచ్చే విప్లవ గీతికలు యమపాశాలై తగుల్కొంటాయి. అభివృద్ది కాముకులగు వీరి గీతాలు అమృతాన్నొలికిస్తాయి.

వీరిని పోషించుకోవడం, పెంచుకోవడం, బలపరచుకోవడం సమాజం వంతు. ముఖ్యంగా కొత్తగా స్వాతంత్ర్య పవనాల మధ్యకు ప్రవహించిన మనం వీరినెంతగానో వినియోగపరచు కోవాలి. సాధించుకొన్న స్వరాజ్యాన్ని సుస్థిరం జేసికొనుటకు, సర్వశ్రామికులను అందు సమాన భాగస్వాములుగా జేయుటకు, వీరి సహకారము యొక్క అవసరమెంతైనా గలదు. ఈ తరుణంలో మన విప్లవకవి, జాతీయకవి, ప్రజలకవి, శ్రీ సీతారామమూర్తి చౌదరిగారికి కనకాభిషేక మహోత్సవం మనమందరం జరుపుకోవటంయెంతైనా సముచితం. చౌదరిగారు రైతుబిడ్డ.అందుచే శ్రామికుల కష్టాలు ఆయనకు సుపరిచయాలు. మట్టి నుండి రత్నాలను వెలయించే రైతుల మధ్య నుండి వెలసిన ఈ రైతుకవి కలంనుండి వజ్రాలను రాల్చుతాడు. అవును. రైతులనుండి కవులు బయలు దేరాలి. కార్మికులనుండి గాయకు లుద్బవించాలి. కష్టజీవులనుండి కళోపాసకులుత్పన్నం గావాలి. శ్రామికులనుండి చిత్రకారులుద యించాలి. ఆనాడే సర్వ శ్రామిక జనావళికి విముక్తి, ఆనందం, వుత్సాహం. కవులకు ప్రజల ప్రోత్సాహం, ప్రజలకు కవుల సహకారం, ఈ రెండు అంశాలు అమలునందుంటేనే సమాజానికి అభివృద్ధి, వికాసం. ఇవి లేని సమాజం చచ్చిపోయిన దానికిందనే అంచనా వేయవలసి వస్తుంది. ఈ శుభ సమయంలో మన అభినవతిక్కన శ్రీతుమ్మల సీతారామమూర్తి గారికి నా హృదయపూర్వకాభివాదములు, నా భక్తి పూర్వక శ్రద్దాంజలులు.*

శ్రీ కె.వి.సుబ్బయ్య, సంపాదకుడు, కాంగ్రెస్‌, సేవాదళ్‌

~

అమరసృష్టి

కవియు శిల్పియు నాయకగాయకులును

బ్రహ్మ సదృశులు సృష్టి ప్రపంచమందు

బ్రహ్మ సృష్టి చిరమ్ముగా బ్రదుక లేదు

సుకవిసృష్టి యమరముగా శోభ చెందు

ఆధునిక యుగధర్మమ్ము లరసి యరసి

తుమ్మల కవీశ్వరుఁడు మనోజ్ఞమ్ము గాగ

నాత్మకథ రాష్ట్రగానాది యమర సృష్టి

రచన మొనరించె దీని కాంధ్రమ్ము పొంగి

నేడు కనకాభి షేకింబు నెఱుపుచుండ

సంతసమున నివాళు లొసంగుచుండ

కవికలములోని సత్తువ గాంచుచుండ

నెల్ల వారికి నుల్లమ్ము పల్లవించె

శ్రీ ధనేకుల బుచ్చి వేంకటకృష్ణచౌదరి

~

ఆవిష్కరణము

జననమందినదాది నజ్ఞాతవనిని

గావ్యగానంబుసలిపి యఖండధార

బయన మొనరించు చదువరిబాటసారి

మానసము గుత్తగొను కోయిలా! నమోస్తు!

వర్ణ సంకరమైన కావ్యప్రపంచ

మందు నెన లేని ప్రతిభ వెన్నంటి నడువ

నంద ఱవునని మెచ్చ వర్ణాభిమాన

మమలుపఱపింపగల ప్రవక్తా ! జయోస్తు !

తెలుగు పలుకుల దీయని తేనెతేట

జాలువాఱగ గావ్యమ్ము సలిపి సతము

విశ్వకల్యాణభావంబు వెల్లి విరియు

నట్టి కవియోగి ! నీకు దీర్ఘాయురస్తు !!

నిన్ను గడుపున శారద కన్నదాది

సవతిబిడ్డల దుశ్చర్య సమసిపోయి

ప్రాజ్ఞ్మనోహరశోభతో బ్రదుకజొచ్చె

బుత్త్ర ధర్మంబు విడని నీ పూన్కి జేసి.

అక్షరజ్ఞాన మెఱుగని యట్టి వారి

కధికగారవమిచ్చి యనర్ధములను

దెచ్చికొన్నట్టి లోపము తీరిపోయె

గనకసుమముల నిన్ను నర్చనము సేయ.

ఎంతకాలంబుననుండియో హృదయమందు

గొట్టుమిట్టాడుచుండిన కోర్కి యిపుడు

మూర్తి గైకొన్నదని విని మురిసిపోవు

భావసుమమాల గళసీమ బరగు గాత !!

బాలసరస్వతి, శ్రీ కోట వీరాంజనేయశర్మ

~

ప్రశంస

ఏ మహామహుని జాతీయతావేశమ్ము, ‘రాష్ట్రగానమ్మున’ రక్తి గాంచె

ఏ కవిరాజునమృతవాక్కులదొరగి, యాంధ్ర కవిత్వ మొయ్యారమందె

ఏ యున్న తాదర్శు నేపారు రుచులలో, ‘నాత్మకథ’ నవయుగాంక మయ్యె

ఏ ప్రతిభాశాలికృతుల నాంధ్ర క్షేత్ర, మణఁగిపోయిన శౌర్వమందుకొనియె

నతఁ ‘డభినవతిక్కన’ బిరుదాంచితుండు పండి తాగ్రేసరుడు, గద్యపద్యరచన

లం దమోఘసమర్థుడు లలితగుణుఁడు, స్నేహమయుఁడు తుమ్మల కవి

  శేఖరుండు.

పూజ్యుడైన సీతారామమూర్తికవికి, నాంధ్ర జనులు నేటికి కనకాభిషేక

ముత్సుకముతో గజారోహణోత్సవమ్ము, సలిపి భాషాభిమానమ్ము చాటినారు.

ఇది కవిలోక మెల్ల సుఖియించెడి యుత్సవ వేళ పూర్వసం

పదలను బొంది దేశమిక వర్ధిలి కావ్యకళాప్రసూనముల్‌

ప్రిదిలి సుగంధ బంధురత బెంపువహింప ప్రజాసమూహ మ

భ్యుదయవిధానము, దెలిసి ప్రోజ్జ్వల దాంధ్ర చరిత్ర నిల్పుతన్.

శ్రీ దండిపల్లి వేంకట సుబ్బశాస్త్రి

~

జేజే

నీకు గనకాభి షేకంబు నెమ్మి జేయ

నున్న వా రన్న వార్తను విన్నయంత

నుబ్బె మానస మొకనాటి యొజ్జ వగుట

దుమ్మలాన్యయ వారాశితుహినకిరణ!

శ్రీ యాచమనేని మాధవరావు

~

సందేశములు

శ్రీశ్రీశ్రీ ముక్త్యాల కుమార రాజా వారి కుమారుని జన్మదినోత్సవ సందర్భమున శ్రీ రాజావారు శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారి నాహ్వానించి కవిసత్కారము గావించిరి. అప్పుడు జగ్గయ్యపేట స్థానికోన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడుగానున్న నాకు శ్రీ రాజావారు సన్మానసభాధ్యక్షతను కల్పించిరి. శ్రీ సీతారామమూర్తిగారికి, నాకును, తొలిపరిచయము గలిగినది యానాఁడే. అది 1944వ సంవత్సరమని జ్ఞాపకము. తదాది తిరిగి మేమిరువురము కలియవలెనని యాసించిన, నది సంభవించినది కాదు. అయినను మానసికముగా మాకిరువురకును నేదో యనుబంధము కలిగినది.

వీరి గ్రంథములను కొన్నింటిని చదివితిని. వీరాంధ్రకవితాప్రపంచమున నది తీయస్థానము నలంకరించిరనుటకు సందియము లేదు. అట్టి యీకవితల్లజుని నేను వర్ణింపబూనుట సాహసము, అయినను వారి కవితయం దొకయాకర్షణశక్తి యున్నదని మాత్రము చెప్పవలసి యున్నది. ఇట్టి శక్తికి వీరి సౌజన్య, సౌశీల్య, సౌహార్ద, నిర్మల మనఃప్రవృత్త్యాదికములే నిదానములై యున్నవి. శ్రీ చౌదరిగారు సజ్జనులు; సద్గుణరత్నసువర్ణ పేటికలయి యున్నవారు. ఇట్టి వీరికి నేడు కనకాభిషేకము గావించి విశాలాంధ్రము మురిసి ధన్యత నొందుచున్నది.

శ్రీ వెంపటి పురుషోత్తం, ఎం.ఏ

~

శ్రీ సీతారామమూరిచౌదరిగారు కవి. అచ్చంగా తెలుగుకవి. అంటే చురుకైన బుద్ధి, మెత్తనిహృదయం కలవారు. కీర్తికి తగిన సరసత, విద్యకు తగిన వినయం వీరిని మహాకవిని చేశాయి. వీరి గానం రాష్ట్రవ్యాప్తి పొందింది. ఆ గీతామాధుర్యాన్ని ప్రజలు రుచి చూచి వీరిని సత్కరిస్తున్నారు చేతికి కాలికి బంగారు గొలుసులతో. వైద్యుణ్ణి కాబట్టి చెప్పుతున్నాను. అదే వీరికిప్పుడవసరం. వయోవృద్ధులలో లుప్తమైన ఓజశ్శక్తి సువర్ణ ప్రయోగం వల్ల పునః పరిపూర్ణమై వీరికి దీర్ఘ ఆయురారోగ్యములు కలిగిస్తుంది. దానివల్ల ఆంధ్ర సరస్వతికి నవీనాలంకారాలు కలుగుతాయని నా విశ్వాసం.

శ్రీ గూడూరు నమశ్శివాయ

~

శ్రీ సీతారామమూర్తి చౌదరిగారి సిద్ధహస్తము ఆంధ్రలోకమునకు చిరపరిచితము. వారొనరించిన భాషాసేవ ఆంధ్రభారతికి అమూల్యాలంకారము. వారికృతులు నిద్రాణమైన జాతిని మేలుకొల్పిన అమూల్యవ్యాసభాండారములు. దీనిని గ్రహించి సత్కరించుభాగ్యము మా అప్పికట్ల వాసులకు తొలిసారిగా దక్కినది. ఈనాడు వారికి కనకాభిషేకాది మహోత్సవములు జరుపుట దేశీయులు తమ్ము దాము గౌరవించుకొనుటయే యగును. ఇట్టి మహాగౌరవమును పొందిన చౌదరిగారు నవ్యభారతములో దేశాభ్యుదయకర రసవత్ప్రబంధముల సమకూర్చి జాత్యుద్ధరణ జేయుదురుగాక.

శ్రీ ఇనగంటి వేంకటప్పయ్య చౌదరి

~

సీతారామమూర్తిగారికి సన్మానమంటే, ఏ ఒక్క కవికో సన్మానం చేస్తున్నట్టుగాక ఒక ఆశయానికీ, ఒక నిజాయితీకీ ఒకధర్మానికి సన్మానం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇందులో నాకు కూడా కొంతభాగం ముట్టుతుందేమో!

దేశంయొక్క, దేశ ప్రజల యొక్క జీవితచరిత్రల్లోని కష్టనిష్ఠురాలను తమవి చేసికొని ప్రగతి కొరకు మహాప్రస్థానం సాగిస్తున్న ఆంధకవిలోకంపట్ల ఆదరం వున్నదని ఈ సన్మానం ఋజువు చేస్తుందనుకొంటాను.

శ్రీ ప్రయాగ

~

”అభినవ తిక్కన” బిరుదము నందిన శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి కిప్పట్టున నాంధ్రాళి యొనర్పబోవు స్వర్ణాభిషేకమహోత్సవము ఆత్యంత ముదావహము.

ఆంధ్రభాషాయోష కనుంగుబిడ్డడని పేర్గాంచి తజ్జనని కపారసేవ నొనరించిన యీ విద్వత్కవి పుంగవునికి జరుపు నీమహోత్సవము ఆంధ్రులకు కనులపండువ. కేవల మాంధ్రమాతనే యాంధ్ర ప్రజ యర్చించుకొనుచున్నదని నుడువుటలో నావంతయు నతిశయోక్తి లేదు. కవిగా రత్యల్ప వయసుననే ఆంధ్రగీర్వాణభాషలం దపార పాండితీ పటిమ నార్జించి తత్కవితా వాసనలచే తద్భాషాద్వయోప బృంహిత పదజాల విలసితంబులును, బహురమణీయంబులును, మృదు మధుర శైలిసంశోభితంబులును, నై చెలువొందు తెలుగుకబ్బముల పెక్కింటిని రచియించినారు.

వీరు తమ రాష్ట్రగానామృతస్రవంతిలో నాంధ్రాళి నోలలాడించి తన్మయుల నొనర్చి సరసమగు కవితల నల్లినారు.

పలు తెఱంగుల వేష భాషాటోపాదిగాంభీర్య మిసుమంత యేని చెంతకు రానొల్లని యీ కర్షకలోక విద్వత్కవితల్లజుని శ్రీ వాణీ దేవత యాచంద్రార్కము రక్షించుగాత.

శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య

~

సోదరా!

నవ్యభారతంలో అభ్యుదయపంథాలో ఉత్తమకావ్యాల్ని సృష్టించిననీకు యావదాంధ్ర ప్రజానీకం యీనాడు బ్రహ్మరథం పట్టడం, కనకాభిషేకం చేయడం నాకు గానే భావించుకుంటున్నా. ఎంచేతనంటే యిరవైయైదేళ్ళ సాహచర్యం, సౌహార్దం, ఆత్మీయతా నీకూ నాకూ పెన వేసుకుని వున్నప్పుడు సన్మానం నాకు గాక నీకా?

విద్వాన్‌, శ్రీ మల్లాది వేంకట కృష్ణయ్య

~

మా సీతారామమూర్తి

ప్రాచీన అధునాతన శిష్టసంప్రదాయముల మేలికలయిక మా సీతారామమూర్తి. ప్రాచీనకవిత చాలవరకు అనుకరణప్రధానము. భాషాంతరీకరణ మిచట ప్రసిద్ధినందిన మార్గము. కవి పూర్వసృష్టి నుండి తనకొదవిన అనుభూతి బలమున నవ్యసృష్టి గావించి తన భావనాబలమును ప్రకటన సామర్ధ్యమును సరికొత్త మార్గముల కదను తొక్కించి భాషా యోష కొక వింత విన్నాణము చేకూర్చును.

తిక్కయజ్వ విరాటోద్యోగ పర్వములలో, పోతన శ్రీకృష్ణలీలావర్ణనములో, శ్రీనాథుని హంసదౌత్యములో, పెద్దన్న వరూధినీ ప్రవర సంవాదములో కవితాకోకిలము ముద్దు ముద్దుగా

క్రోల్చినది.

ఆధునికకవులు పరువములో తమకొదవిన యొకానొక అనుభూతిని ప్రధాన వస్తువుగా స్వీకరించి తీయని తలంపులను, మాటలకందని వేదనలను అవ్యక్తముగ రచింప బూని పాండితీ బలము చాలమినో, యౌవనోద్వేగమును చీల్చుకొని దూరముగా పోయి తనది కాదన్నట్లు ఆబ్జెక్టివ్ objective దృష్టితో తన అనుభూతిని తర్కించి చూడజాలిమి చేతనో తికమక పడుచు శిష్ట సంప్రదాయముల మీఱుచు నూతన రీతులు వెదకుచు కట్టుబాట్లకు గాసిల్లుచు బాధపడుచున్నారు. మనకు వీరిబాధలో పాలు, అనుభూతిలో మెరుగు, అవ్యక్త భావములలో ఆనందము గిలకరించి నట్లయి హృదయమునకు దగ్గరగా కాన్పించును. కాని ఈ యభిమానము యౌవనాంతములో మనలో క్రమముగా సన్నగిల్లును.

మరి ఆధునికులలో నింతకంటె విశిష్టమైన సర్వతోముఖమైన అనుభూతినందు కొన్న వారే జాతీయకవులు. జాతినలయించుచున్న బానిస తనమును భావనచేసికొని impersonal దృష్టి నలవరచుకొని జాతీయ జీవనములో మునిగి జాతీయనాయకులుగ, సంఘమున కగ్ర నాయకులుగ, సంస్కర్తలుగ, దాస్యపరాభూతమైన జాతికి చేదోడు వాదోడుగ నిల్చి నూతన సృష్టి చేసి జాతి కుజ్జీవనము కల్పించిన వీరి కవితాసంపద మనహృదయముల నాకర్షించి శాశ్వత స్థాయి నందుకొన్నది.

అభినవ తిక్కన ఆధునికులలో ఈ రెండవ తెగకు చెందినవాడు. ఇతడు ప్రాచీనులలో కవిత్రయమును దలపించును. ఇతని ‘ఆత్మకథ’ తిక్కన రీతుల నలవరుచుకొని ప్రాచీన ప్రపంచమున నూతనచరిత నుత్పన్నము గావించినది. రాష్ట్రగానము ఆంధ్ర జాతీయ జీవనమున విశిష్టస్థానము నందినది. భావకవులపోకడలు, బాధలు, అవ్వక్తభావములు ఇతనికి లేవు. తానొక ప్రవక్తగా నుండి ఎంతెంత క్లిష్ట సమస్యలనైనను కరతలామలకముగా వివరింపగల్గిన యోగి పుంగవుడు మన తుమ్మలకవి. ఆంధ్రులకు బహునాయకత్వమన్న అపవాదును ఆకళింపు చేసికొని అందులకు వీరిచ్చిన సమాధానమే యిందులకు తార్కాణము, రాష్ట్రసిద్ధికి రాయబారములు లాభింపవన్న ‘ పెద్ద కాపు ‘ లోని యితని యావేదన మనకిపుడు వ్యక్తమగుట లేదా ? ఆంధ్రుల మగటిమి యీసవాలును స్వీకరించి అఖిలభారత కాంగ్రెసు పీఠము నెక్కలేదా ?

మన జాతిపితమగణమును విన్నపుడు ఈకవి రచించిన ‘అమరజ్యోతి’ భారత జాతి హృదయవీధుల వెలిగించిన అమరజ్యోతి, ఏది చెప్పదలచి, చెప్పుట చేతగాక మన మేడ్చుచుందుమో అది కవి కడుసున్నితముగా శ్రవణ పేయముగా గానము చేయును గదా? భారతజాతి పితృవిహీనయై దిక్కుమాలి యేడ్చినది. చెనటియై మన యాశాజ్యోతి నార్పిన కిరాతుని వే విధముల నిరసించినది. నేల నాలుచెఱగుల నీమహామహుని మరణము వలన గలిగిన పరితాపమును గని గర్మించినది. కడకు ఆత్మోద్దీపనము నంది పోవుట యెచ్చిది, మనగాంధి మనలోనే కలడన్న వేదాంతార్థము స్మరించి అతడు వెల్లించిన అహింసా జ్వోతి నాదర్శముగా గొని శాంతించినది. జాతి జీవనమును సర్వతోముఖముగ తమ కవితలో ప్రతిబింబింపజేయువారు గదా జాతీయ కవులు, జాతి నలయించుచు మాటలకందక అవ్యక్తము లైన భావములను రమణీయముగా గానము చేసి జాతికి సంతృప్తి గూర్చి కర్తవ్యము చూపువారు కాక జాతీయ కవులన్న వేరే కలరా ? అరువదేండ్ల నుండి ఆంధ్రుల నలయించుచు ఆంధజాతి యేకైక లక్ష్యమైన రాష్ట్రవాంఛ నింత చక్కగా గానముచేసి ఆంద్రోద్యమమున కొక వింత విన్నాణము చేకూర్చుటయే గాక రాష్ట్ర నాయకుల కడుగడుగున నూతనాదేశముల నొసంగుచు మార్గదర్శియైన మన సీతారామమూర్తి ఋణము నాంధ్రజాతి యెన్నడీగ గలదని యెంతయో తపించి సాధించిన యీచిఱుత సన్మానమును జూచి సంతసింపని వారెవ్వరుందురు?

శ్రీ ఉప్పల నాగయ్యచౌదరి

~

శతమానమ్‌

చక్కదనాల చుక్కగ పసందుగ గందొగ మీటి సాటికై

తక్కల భర్మహర్మ్యముల యందున నిత్యవిహారమూని పే

రెక్కిన యట్టి మిదు కవనేందిర, నేడిటు పట్టపేన్గుపై

నెక్కు నటన్న నా చెలువమెంతొ ముదావహమయ్యెనయ్య; ఆ

తిక్కన నానుడుల్‌ – సొబగుతీరులు – సౌరులు – మీదుసొత్తుగా

దక్కిన నాటనుండియునుఁ దాము రచించిన ఖండకావ్యముల్‌

మొక్కలు వోని ధైర్యము – సముజ్జ్యల తేజము – తుష్టి పుష్టియుఃన్‌

జిక్కనిరక్తమున్‌ దెనుగుసీమను బారిచి తేఱిచెన్‌; యశో

భాక్కులునైన యాంధ్రుల ప్రభావ వికాస విలాస హేల మీ

యక్కరబంతిలో, నిమిడి యక్షరమాయెను, కైతకన్నె మీ

యక్కున జగ్గునిగ్గు లెనయంగ విపంచిక మీటి మేటియై

‘కొక్కురోకో’ యటంచు బుధకోటిని మేల్కొనఁ జేసి సాహితిన్‌

మక్కువ గల్గు సజ్జనుల మాన్యత దా గనకాభిషిక్తయై

దిక్కులకెక్కె మీయశ ముదీర్ణముగా బదివేలకాలముల్‌

జక్కన శిల్పమట్ల – కవిచంద్రుల కావ్యవిభూతిభాతి – సొం

పెక్కును గాత ! మిమ్ము విజయేందిర కోరెడిగాత ! మీకు కు

మ్మక్కుగ విశ్వకర్మ ‘శతమాన’ మటం చనుగాత ! ధీమణీ !

శ్రీ ఏలేశ్వరాచార్యులు

~

ఉపహారము

కమ్మనికైతలో మధురగానమొనర్చు కవీంద్రకోటిలో

కమ్మున నెందఱుండినను గాని – విశేషము చెప్పలేము మా

”తుమ్మల” యన్న నాంధ్రుల కదోవిధమైన ప్రపత్తి, రాష్ట్రగా

నమ్ములు దిగ్విదిక్కులను నాదమొనర్చిన నాటినుండియున్‌.

రాష్ట్ర గాయకుడు – సిద్ధాంతి శ్రీ అయినంపూడి ప్రసాదరావుచౌదరి

దానధర్మ త్యాగధని గోగినేని శ్రీ, వేంకటసుబ్బయ్య విబుధు నెదుట

జగ మెఱింగినదాత చల్లపల్ల్యధినేత, శివరామభూపతి శ్రేష్ఠునెదుట

ఆంధాంగ్ల విద్యల నరసి శోధించిన, కట్టమంచి రెడ్డి శేఖరుని యెదుట

ఆంధ్రదేశంబునం దసమానపండిత, బిరుదు లందిన సత్కవీశు లెదుట

గండపెండేర కాంచన, కంకణాది శుభదచిహ్నాలతో బుధస్తుతుల తోడ

నొదవె గనకాభిషేకమహోత్సవంబు, రాష్ట్రగాయకునకు సీతరామకవికి.

శ్రీ బృందావనం రంగాచార్య

~

సారవాక్కు

శీతారామాయిత జూ

టీతరళ స్వర్ధునీఘటి కనకాంభో

జాత మహనీయతేజము

సీతారామయకు నీకు సిరుల నొసగుతన్‌.

తిక్కన పోకడలం గల

చక్కని కవులందు నీవు జాణ వవుర ! స

మ్యక్కు సుమిత వనమధురిమ

చిక్కణకవితాభిరామ ! సీతారామా!

అన్నా తుమ్మలవంశవారినిధిచంద్రా ! నీకు బ్రహ్మాయువౌ

పున్నెం బెన్ని తరాలనుండి పొదుపై పొందార దోగించెనో

ని న్నీనాడు; తెలుంగుగడ్డపయి నెన్నేండ్లయ్యెనో ”యెక్కుతి

క్కన్నా ! యేన్గు” నటంచు బల్కిసుకవుల్‌, కై సేసె నే డాసిరుల్‌.

తిక్కన యే మెఱుంగు నను ధీవరు లుందురు నే నెఱుంగుదున్‌

దిక్కనయే మెఱుం గనెడి ధీనిధి వెంతయు సంతసించితిన్‌

దిక్కన తీర్చినట్లు నుడి దీర్చుట మాటలు కాదు గాని నీ

కొక్కని కబ్బె జాలవఱకుజ్జ్వల శక్తి గదయ్య సత్కవీ !

ఆత్మకథను వ్రాయ నవసర మగుచుండె

రాష్ట్రగాన మయ్యె రాజకీర్తి

కోరకున్న ఫలము గారవించుచునుండు

సారవాక్కులయిన సత్కవులను.

శ్రీ ముదిగొండ వీరభద్రమూర్తి

(సశేషం)

Exit mobile version