Site icon Sanchika

తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-2

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

ఆశిషః

సీతారామకవే! కవీన్ద్ర సమితావస్యాం మహార్థాన్వితా

నిర్దోషా సరసా సుకోమలపదన్యాసా గభీరాశయా

సద్వృత్తా కవితావధూ ర్జనపదాన్‌ సర్వాన్‌ చరిత్వా తవ

ప్రీత్యా యా కనకాభిషేకమకరోత్సా వర్థతాం వర్థతామ్‌

సభాస్వనేకాసు విహాయభీరుతాం

కవే! చరన్తీ కవితాసరస్వతీ

అభేదబుద్ధిం త్వయి కుర్వతీపదే

దధాతి మంజీరమితి ప్రబుధ్యతే

విహాయ హంసం కవితాసరస్వతీ

బహూపభోగా దధునా కుతూహలాత్‌

గజం, చజైష్ణుం విబుధేన్ద్ర మానితా

కవీశ్వరారుక్షదితి ప్రమన్యతే

హృద్యాయా కవితా రసోర్మిలవితా లిద్వన్నృపాలాలితా

ధీమంస్తే నవతిక్కనాఖ్యభిరుదం స్వార్ణం రణన్నూపురం

ప్రాదిత్సత్కనకాభిషేక మధునా శ్రీమద్గజారోహణం

తాభ్యాం శ్రీపరమేశ్వరః కరుణయా దద్యా త్సదా మంగళమ్‌

విష్ణుం దాశ్రితగోపగోపటల గోపీయౌవతానందవ

ర్తిష్ణుం డార్తియుత ప్రపన్న జనతాశ్రేయఃఫలాకల్పరో

చిష్ణుం డార్తియుత ప్రపన్న జనతాశ్రేయః ఫలాకల్పరో

కృష్ణుం డీ నవతిక్కనాఖ్యకవికిన్‌ క్షేమంబులం గూర్చుతన్‌

శ్రీమాన్‌ పండితశిరోమణి, మహావిద్వాన్‌, వేదాన్తం జగన్నాథాచార్యులు

~

సాప్తపదీనము

కనకాభిషేకంబు కావింతురే కాని, యొక స్కూలు హెడ్మాస్టరొసగ బోరు

గండపెండేరంబు కాలనుంతురె కాని, యే పెద్దపదవికి నెక్కనీరు

ఏనుగుపైన నూరేగింతురే కాని, రాజ్యాంగములదెస రా నొసగరు

అభినవతిక్కన్న యని పిల్చెదరు కాని, రాయబారముల తీర్పంగ నీరు

వ్యక్తిపై బులుపో బాసపైని వలపొ

తల్లి బాస పైపైని యాదరము కలిమి

యుప్పుగంజియు నింటిలో దెప్పుటయును

మాతృభక్తి మహాసభామండపముల.

ఒక యన్యాయము చేయజాలమి మహోద్యోగానికిన్‌, భేద భా

వకధీసంపుటిలేమి నాధునిక సంపద్దీప్తికిన్‌, ధర్మక

ర్షకమౌబుద్ధియు గల్మి లోకమమతారంభాప్తికిం గాని చా

లక నీ వచ్చ తెలుంగు బాసకవి వేలా కావు ధీమన్మణీ!

పికముల్‌ కూయు శుకంబులున్‌ మొఱయు ఠీవిన్‌ గేకులున్‌ మ్రోయు నీ

సకలోద్యానము నందు నాంధ్రమయభాషాభారతామ్నాయ శ

బ్దకవిబ్రహ్మరహస్యసంగ్రథనశ క్తం బొక్క నీ వాక్కె, కొం

తకు తత్వజ్ఞులు కాని వారల వనంతంబుల్‌ వచోధోరణుల్‌

నాచేగానివి నీ వెఱుంగుదవ యన్నా! బట్టుకైవారముల్‌

నా చేతంబున శక్తి చాలదని యన్నం గాని కావచ్చు; నే

దాఁచం దోచినయంతవట్టు, భవదుద్యత్సాధునిర్దుష్ట శ

య్యాచిత్రం బెసలారు దిక్కకవిదీవ్యద్భారత స్వచ్ఛమై

ఎనసి పరీక్షచేసి యిది యింత వెలంచును నిర్ణయంబు చా

లని తెలుగుం గవిత్వపుబొలాల నహో ప్రతివాడు కాళిదా

సునకును మేనమామ ననుచు న్నటియించును గాని వేడు స

జ్జనుడని చెప్పరాదు కవిచంద్రమ! ని న్నొకనిన్‌ ద్యజించినన్‌

అన్నమాటకు దిరుగాడ వంటకును నీ గొప్పేమి నీ తండ్రి గుణము వచ్చె

మివుల ఠీవి నెసంగు మేలైన మూర్తి నీ యెక్కు వేమి కులాననే కల దది

నిర్దుష్టరచన నిండిన పెల్లదేమి తిక్కన గురుమూర్తి నేర్పినది కాక

యెడద మెత్తదనంబు కడిది యే మధికంబు సహజమౌ కవియైన జన్మఫలము

ఆత్మకథ తెన్గుసేసితి వంతకంటె

నెవడు నచ్చును బోసివా డెవడొ కాక

నిన్ను మెచ్చుద మన్న గన్పించ దేది

భవదపఘన నిర్మాణ సంపత్తి తక్క

నినుబట్టి తెలుగు నుడిపొలమున దుమ్మలలోన బ్రొద్దు పొడిచెను సఖుడా!

నినిచిన తమ్మి వెలందుక కనుదమ్ముల వెలుగు రేక కడలు కొనంగా

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

~

చౌదరీ

పరమాప్తులయిన మీకు గజారోహణాది సన్మానము జరుగనున్న వార్త నన్నానందభరితుని గావించినది. అనితర సాధారణమైన కమ్మదనము సహజముగనే కల మీ కవిత్వమున తిక్కన రసాభ్యుచితబంధము, శ్రీనాథుని శైలీ సౌభాగ్యము, పెద్దన ప్రసాదగుణమును ఇరవుకొన్నవి. కావుననే రసికలోకము మిమ్ము ‘అభినవతిక్కన’ యనియు, పేర్కొనవచ్చునని నా తలపు. సుహృన్మణీ! విద్వత్కవిబృందారక బృందసుందరమగుటచేత కనులకును, కవితా కళామర్మవిదులును చతురవచో నిధులును నగు అధ్యక్షుల చమత్కారపు చెణుకులతో వీనులకును విందుసేయు మీ సన్మానసభాశోభ అపూర్వానంద సంధాయక మగును గదా!

శ్రీ  దీపాల పిచ్చయ్యశాస్త్రి

~

కాన్క

ముగ్గురు సత్కవుల్‌ కరగిపోసిన భారత కావ్యసృష్టిలో

నిగ్గును ఘంటికాగ్రమున నిల్పిన చౌదరి తిక్కయజ్వ! నీ

పగ్గియ యేన్గు నెక్కి వలపాదమునందు పసందు జాళువా

గగ్గెర దాల్చు నన్ననుడి గర్వము గూర్చె కవీంద్ర కోటికిన్‌

పులకల్‌ గూర్చు తెలుంగు వీరుల కథాపుష్పాంజలిన్ జల్లి మే

ల్కొలుపుల్‌ పాడిన రాష్ట్రగాన మిపుడుగ్గుంబాలతో నాంధ్ర కాం

తలు ద్రావింతు రనుంగుబిడ్డలకు సీతారామవిద్మన్మణీ!

వలచె న్నిన్ను పసిండిపెండియరముల్‌ బంగారు గంగాపగల్‌

మును ముత్యాలమహళ్ళలోన గనకంపుం బుగ్గలం దానమా

డిన శ్రీనాథకవి ప్రభూత్తమునకంటెన్ దొడ్డమర్యాద లం

దిన దివ్యత్కవితాకళానిధివి సందేహంబులే దాంధ్ర నం

దన! దీర్ఘాయువు నీకు చౌదరి కవీంద్రా! శారదా విగ్రహా!

శ్రీ జి.జాషువ

~

సందేశములు

శ్రీ సీతారామమూర్తి చౌదరిగారి కనకాభిషేకాది సత్కారములకు జాలసంతోషించుచున్నాను. సౌశీల్యము, సత్కవిత, సత్కవితకుదగిన సద్వస్తుగ్రహణము, వారియెడ నాకు గౌరవమాపాదించినవి. నిరాటంకముగా వారి సత్కారోత్సవములు సాగుఁగాక.

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి

~

శ్రీ అభినవతిక్కన బిరుదభాగులైన సీతారామమూర్తి చౌదరిగారికి తాము జరుపనెంచిన మహాసన్మానము చాలా ప్రమోదావహమైన విషయము, ఆంధ్ర దేశీయసంప్రదాయమును తాము చక్కగా నిర్వహింప సంకల్పించితిరి. నా హార్ధాభినందనములు. తమ సంకల్పించిన యుత్సవం మహోదయముగా నెర వేరుఁగాక !

శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

~

మహాకవినేత

ఏపరిమేష్టినాట జనయించెనొ యీ కవితాకుమారి నీ

ప్రోపున జేసి సర్వవిధభూషణభూషితయై లసద్ర సో

ద్దీపితయయ్యె నీకు సరిదీటు మహాకవినేత యెన్ని యె

న్నో పురుషాంతరమ్ములకు నొక్కొక డుద్భవమందు చౌదరీ!

సుహృత్తమా! శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రి

కవివరుడు దేవతాంశసంభవు డటంచు

సింధురారోహ కనకాభిషేకబిరుద

లాంఛనముల బూజించు కాలంబు మరల

వచ్చినటు నేటి సన్మాన వార్త దెలుపు

వరవాచావిభవంబు రంజిలగ భావస్ఫూర్తి దైవార సుం

దరబంధంబుగ బద్యగద్యరచనాధౌరేయులౌ వారిలో

ధరబేర్వాసి గడించినాడు గద సీతారామమూర్త్యాఖ్య ‘చౌ

దరి’ సౌందర్యము నించు కార్యమగుగాదా! వారి సత్కారమున్‌

తరతమవిజ్ఞతన్‌ హితమితప్రియభాషల నేరినైన సా

దరముగ గౌరవించునుచితజ్ఞుడు భావపదార్థ బంధ బం

ధురముగ భావనాబలముతో రససృష్టి యొనర్చు సత్క వీ

శ్వరుడు వినీతుడుత్తముడు చౌదరి సత్కృతుజేయుటొప్పదే!

కవియు మహానుభావుడగు గాక జనుల్‌ తదుదారకావ్యవై

భవములకున్‌ గరంగు ననుభావముబొందక యున్న బొందియా

కవికొక మంచిమాటయిన గానుక పెట్టకయున్న నెందు కా

కవియు గవిత్వ ? మిందురసిక ప్రవరుల్‌ సుమి యాంధ్రసోదరుల్‌

తమ సత్కారమహోత్సవాకలన సీతారామమూర్తీ! సుహృ

త్తమ! యాహ్లాదముగూర్చెనయ్య! విపులాంధ్రక్షోణి నీ భవ్య కా

వ్యములన్‌ డెందమువిచ్చెనయ్య! కవివర్యా ! యిట్లె సత్కావ్య పు

ష్పములన్‌ గొల్వుమువాణి; మీకమరతన్‌ సంపచ్చిరాయుష్యముల్‌

శ్రీ మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి

~

సందేశములు

సీతారామమూర్తి చౌదరిగారికి జరుగుచున్న యీ సన్మానము మీలో నెక్కువ మంది కంటెనో యందఱకంటెనో నాకెక్కుడుగ నానందదాయకము. ఆయనకును నాకును గల యనుబంధము తాదృశము. ఈ కవివర్యుడు సరసుల హృదయసీమలందు నిరంతరము, సలక్షణమగు కమ్మని కవితాప్రసంగముల వెలయించుచు నమూల్యమగు యశోలక్ష్మి నందగల్గుటకు దగిన యారోగ్యమును భాస్కరుడనుగ హించుగాత మని నాకోరిక.

శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి

~

పండితులు, సరసకవులు, సత్పురుషులు అయిన సీతారామమూర్తి చౌదరిగారికి ఇంతటి సత్కారం జరుగుతున్నదంటే ఎంతో సంతోషం కలుగుతూఉంది. చౌదరిగారి రాష్ట్ర గానం ఆంధ్రులకు మేలుకొలుపులు పాడింది. ధర్మజ్యోతి మొదలయిన వారికృతులు సజీవ రచనలు. పూర్వకవుల పోకడలన్నీ పుడికి పుచ్చుకున్నారు చౌదరిగారు. గాంధిజీ ఆత్మకథను చౌదరిగారు నిరుపమానంగా రచించారు. కృష్ణరాయాదిచక్రవర్తుల కాలంలో ఆంధ్రభాష అనుభవించిన మహాభోగాన్ని తలపునకు దెచ్చే నేటిసత్కారమును ఆంధ్ర ప్రజలే చౌదరిగారికి జరపటం ఎంతైనా కాలోచితంగా ఉండి, ఆంధ్ర సారస్వతవృద్ధిని కాంక్షించే మాబోంట్ల కభినందనీయ మవుతున్నది.

శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు

~

తెలుగుతీపి, తెలుగుపస ”అభినవ తిక్కన” కృతులలో తొణికిస లాడుచున్నది. ఆయనను సన్మానించడం ద్వారా ఆంధ్ర దేశం తనను తానే సన్మానించుకొంటున్నది.

శ్రీ నార్ల వెంకటేశ్వరరావు

~

కనకాభిషేకము

సమతాబంధురమై ప్రసాదగుణవర్చస్వంతమై చారువా

క్సుమనస్సౌరభపూర్ణమై కవిజనాకూతిప్రియం భావుక

త్వములన్‌ నీమన సట్లు నీకవితయున్‌ భాసిల్లు నిర్దుష్టము

త్తమకక్ష్యాగణనీయమై యెసగి సీతారామ సన్మిత్రమా!

మాయల్‌ బూటకముల్‌ మృషాభినయముల్‌ మచ్చుల్‌ పరోచ్ఛిష్టముల్‌

హేయ క్షుద్రకలావికారములు నోరెత్తన్‌ వడంకాడు నీ

శ్రీయుక్సత్త్వకలావదాత కవితాసీమంతినీస్వచ్ఛ వృ

త్తాయుష్మత్తలఁగాంచి ప్రాజ్ఞపరిషగ్గాణేయ కవ్యగ్రణీ !

ఆవేశంబున రాష్ట్రగానములు నీవాలాపనల్‌ సేయ నాం

ధ్రీ వైదగ్ధ్యము చూర లిచ్చితివి సధ్రీచీన శృంగార వీ

రావర్త ప్రవహద్రసాంబునిధి సర్వాంధ్రంబు నిండారె జ్యో

త్స్నావిర్భావము తెల్గుతల్లి కిడు నారార్తిప్రభన్‌ వెల్గగన్‌

కమ్మచ్చునందీయు కరణివచ్చెడు పద్య తతి తిక్కనార్యుని ధైర్య ముడుప

ఆలప్తరాష్ట్రగానామృతశైలికి సార్వభౌములును మఝ్ఘాయనంగ

తెనుఁగుజాతిపసందు దిద్ది తీర్చెడుపట్ల చేమకూరాదులు చెడివడంక

పితృభక్తి మత్కావ్యవిధిఁ బ్రవచించుచో ధర్మదూరుల మనోదార్ఢ్య ముడుగ

సంప్రదాయశుద్ధి సద్వృత్త మీలువ

తనము వొల్చు కులముతన్వివోలె

నీదుకైత నెగడు నిర్మలాంతఃకర

ణాత్మరూపబింబ మగుచు సఖుడ !

ఓయీ యభినవతిక్కన ! జే.యగుతన్‌ నీదుకైతసింగారికి దీ

ర్ఘాయుష్మంతుడవై యాం ధ్రాయతనంబులను బేరు నందుము వర్మీ !

శ్రీ విశ్వనాథ వేంకటేశ్వరులు

(సశేషం)

Exit mobile version