Site icon Sanchika

తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-3

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

సానలు దీరిన స్వజాతిపంచరత్నములు

కవిసార్వభౌమా!

ఆదినన్నయకవి యానతిచ్చినపూలు, తిక్కనెఱ్ఱన్నలు తెలుపుపూలు

శ్రీనాథకవిరాజు సింగారములపూలు, పోతనయమృతంపు పోతపూలు

పెద్దన్నకవివర్యు విద్దంపు జిగిపూలు, భట్టుమూర్తి మెరుంగు పసిడిపూలు

చేమకూర్వెంకన్న జిలుగుజల్తరుపూలు, పింగళి సూరన్న బెళుకు పూలు

లలిత శోభితదివ్యనిర్మల సుగంధ

రాజితానందభోగపరాగ మలర

బూచుచుండును నీ తెల్గుపూలతోట

దివ్యగుణధుర్య ! అభినవ తిక్కనార్య !

కమ్మ తెమ్మరవీవ గుమ్ము గుమ్మున తావి జల్లి పిసాళించు మల్లెపూలు,

మెరుగు బంగరుచాయ మించు నిగారంపు

పసిమివన్నియ ముద్దబంతిపూలు

మంచుచుక్కల ధిక్కరించి

చెలాయించి సోబించు తెల్లగులాబిపూలు

పగడంపు కెంజాయ సొగసు దుబారించి

ధగధగల్‌ కురిపించు పొగడపూలు

హంగు రంగుల గేరు సంపంగిపూలు

చక్కదనముల నదలించు జాజిపూలు

ముద్దులను మూటగట్టెడి పొన్నపూలు

వెరచు నీ తెల్గుపూల సుందరము జూచి

గండుతుమ్మెద రెక్క గసరు కస్తురిచుక్క నిద్దంపుమోమున నిగ్గుదీర

చిగురాకు వెడలించు నిగనిగల్‌ సవరించు కమ్మ తెమ్మరమోవి చెమ్మలూర

మిసిమిమీగడతీరు మెరుగు టద్దము గేరు చొక్కంపు చెక్కిలి సొబగువార

పసగుల్కి రేయెండ ప్రసరించు తళతళల్‌ తూలించు చిరునవ్వు జాలువార

దేశ దేశాలు గాలించి తెలుగుతల్లి

పరిమళంబుల ఘుమఘుమల్‌ పరుగు లిడగ

విసరి విరజిమ్ము రత్నాల పసిడిపూలు

పూచుచుండును నీ తెల్గు పూలతోట

జిలిబిలినాణెంపు జిగిపల్కు జటిలంపు షేక్‌స్పియ రింగ్లీషు జిలుగు వెలుగు

నీటునిగారంపు నిగ్గు టొయారంపు పిరదౌసి పారసీ బెళుకు తళుకు

రకరకంబుల భావరసబిందువులు చిల్కు ఠాకూరు బెంగాలి ఠీకుపోకు

కమ్మ తావులు చిమ్ము తుమ్మల యభినవతిక్కన యాంధ్రంపు తీరుసౌరు

గాంచి విద్యావధూటివిళాసమిళిత

లలితకోమల పదసుమగళితసరస

భావ ఘుం ఘుమపరిమళ వరవిలాస

విసరశోభితయై నలుదెసల మెఱసె

సారసారితుషార శారదచంద్రికా నవకుంద సమశోభనావిలాస

మందారమాలతీ మల్లికా చంపక సుమబృంద పరిమళ సమవికాస

వై కాంతమరకత వైదూర్యమాణిక్య సందర్శనానంద సమవిభాస

రజతాదిసదన నీరజ సంభవాచ్యుత చాతుర్యసామర్ధ్యసమవి శేష

లలిత తుమ్మల కులసుధాజలధిచంద్ర!

నిర్మలానంద బుధజన నిలయ కేంద్ర!

సకల సుకళావినోద విస్తార సాంద్ర!

అమలగుణ సీతరామయాహ్వయ సుధీంద్ర !

కవిరాజశిరోమణి, శ్రీమాన్‌ ఇనగంటి పున్నయ్యచౌదరి, అప్పికట్ల, బాపట్ల తాలూకా

~

కనకాభిషేకము

జయ ! జయ! భారతీవిమల చారుపదద్వయ సేవనప్రియా!

జయ ! జయ ! రాష్ట్రగాన విలసత్కవితాప్రతిభావిశేషణా!

జయ ! నవతిక్కనా ! విజయసంపద నీ కనకాభిషేక వ

త్క్రియలకు సొంపునింపుత ! పరిష్కృతకావ్యచయాభిశోభితా !

శ్రీనాథుం బరితుష్టు జేసె కవితాసీమంతినీ సేవక

క్ష్మానాథుం డొకరుండుమున్‌ కొలువులో స్వర్ణాభిషేకమ్ముచే

నీనాడీగతి నీ ప్రజాళియు బ్రియంబేపార నిన్‌ కాంచన

స్నానశ్రీరుచిరాంగుఁ జేయుట మహోత్సాహమ్ము మాకయ్యెడున్.

నవనవమై వినూత్నమయి నాటికి నేటికి తెన్గునాటిలో

ధవళ సుధాంశుమూర్తి వలె తావకకీర్తిపతాక మున్నత

స్తవముల నందికొన్న యది ధన్యుడ వీ విటు జీవితమ్ములో

కవిజన మిట్టి గౌరవము గాంచుట చిత్రము సూవె మిత్రమా !

తెలుగునాట లసత్కీర్తి వెలయుటనిన

అలతికార్యంబు కాదు ఈర్ష్యాళువులకు

నిలయ మీ నేల దీనిలో నెగ్గుటనిన

కోర్కెల నవారి పండించుకొన్నయట్లె !

పెక్కురు పెక్కు చందముల ప్రీతివహింతురు నీదు కైతలో

మక్కువ మాకు తావక సమాసమృదుత్యమునందుజూవె పే

రెక్కిన నిన్ను వంటి గుణవృద్దుల బుద్ధులు సుద్దులింత చే

జిక్కినజాలు నీ తెలుగు చిన్నలకున్‌ పరితోషదమ్ములై !

శ్రీ అద్దేపల్లి నాగగోపాలరావు

~

సువర్ణపుష్ప సన్మానము

శ్రీరాజితాభినవ తిక్కోరుబిరుద మొందినట్టి యో తుమ్మలసీ

తారామమూర్తి చౌదరి ! నీరాజన మొసగు నాంధ్రనిచయము నీకున్‌

ఎదలో మందున కేని గర్వ మనుమాటే లేక దేశీయసం

పదనుం బెంచు మనోజ్ఞభావములచే బా గొందుకైతన్‌ జగ

న్ముదముం గూర్పుచు నాంధ్రమాతపదముల్‌ పూజించు నీదైన భా

గ్య దశన్ గౌరవముం బొనర్చు టదియుం గర్తవ్య మెవ్వారికిన్‌

ఒక నిముసంబు నీదు కడ నోలిని భాషణముం బొనర్చువా

డిక నిరతంబు నీ చెలిమి నెక్కటి గోరెడి నిట్టి మేలి రీ

తి కడిది నొప్పు నీ కయిత దీవ్య దమర్త్యవనాంతరస్థ దీ

ర్ఘిక రకమౌ సుధారసముఁ గ్రిం దొనరింపఁగఁ జాలదే ! సఖా

నా యవధాన సత్సభకు నాయకతం దగినప్డు మానసా

ప్యాయనమైన నీ కయిత నారసి బంగరు పూజ కర్హుడౌ

నీ యనఘుం డటంచు నెద నెంచితి నీగొన మా శుభంబు నే

డీ యిటు నాకు సొంపు నిడె నిప్పుడు నీ కనకాభిషేకమై.

ప్రేమింపందగు దాంధ్ర భారత సవిత్రీపాదకంజాతసే

వామాధుర్య రసైక ధుర్య కవనప్రావీణ్యముం జేసి యు

ద్దామ త్వత్తదుదారతం గనిన తద్ జ్ఞశ్రేణి నీకున్‌ సుప

ర్ణామోదార్చనముం బొనర్చు టది యత్యంతంబు నర్హంబగున్‌

శ్రీనాథుండు కవీంద్రచంద్రముఁడు తొల్లిం బంగరుం బూల స

న్మానంబు న్నృపు చెంత నొందె నిపుడుం దాదృఙ్నృపుల్లేమిఁ దద్

జ్ఞానీకంబు సువర్ణ పుష్పముల నీ కారాధనం బిచ్చు మే

ధానైర్మల్య నిధీ ! యశోఎర్హుఁడవు సీతారామ కవ్యగ్రణీ!

సీతారామ ! సువర్ణ పుష్పముల నీ చెల్మిం దగన్‌ మించు సు

శ్రీతీ ఱొప్పిన వారు సల్పు నెడ నర్థిన్‌ సత్కవిత్వోల్ల స

చ్ఛీతారామ సువర్ణ పుష్పముల రక్తిన్‌ మేము నర్పింతు మెం

తో తాత్పర్యముతో గొనం దనరు గాదో ? మిత్ర చూడామణీ !

సర్వ సంపచ్చమూయుక్తః సర్వదా విభవాంచితః

సీతారామ స్సదా జీయాత్‌ సూత్న తిక్కనసత్కవి!!

కవిచక్రవర్తి, శతావధాని, శ్రీదోమా వేంకటస్వామిగుప్త

~

ఉపద

తీయని జాను తెన్గు నుడి తేనెల సోనలు జాలువారగా

సోయగముల్‌ వెలార్చి సొగసుందనముల్‌ పచరించుచున్‌ శ్రవః

పేయ సుధామనోజ్ఞ సుమపేశల మంజులకావ్యకల్పనల్‌

స్వీయము చేసికొన్న రససిద్ధులు తుమ్మలసత్కవీశ్వరుల్‌.

అభినవసుందరమ్ములగు నాంధ్ర కవిత్వ మహోదయప్రభా

విభవసుగంధి గంధవహవీచుల దోగుచు రాష్ట్రగానమం

దభిరుచి వాసనల్‌ గఱపి యాంధ్రజనావళి మేలుకొల్పి రీ

యభినవతిక్క నార్య బిరుదాంకులు తుమ్మల సత్కవీశ్వరుల్‌.

తుమ్మలవారి కావ్యరసధోరణు లాంధ్రరసజ్ఞలోకమం

దిమ్ముగ జైత్రయాత్ర ముగియించి జయేందిరతోడ నీ సద

స్యమ్మున కేగుదెంచె విజయాంకములన్‌ రచియించి సత్కవి

త్వమ్ముల స్వస్తి వాక్‌ శ్రుతి పదమ్ములు పల్కు- డహో ! కవీశ్వరుల్‌.

స్వర్ణాభిషేకంబు సలుప బూనుట యన,  కవ్యాత్మ దర్శింప గల్గియేమొ

ఏను గంబారీల నెక్కింప దలచుట,  కవిభావమూహింపగలిగియేమొ

గండ పెండారాలు కాళ్లదొడుగుట యన, కవిశిల్పమును గాంచగలిగియేమొ

పల్లకీ ల్తమకేల బట్టి యెత్తుట యన, కవిగౌరవము గాంచగల్గియేమొ

ఏకసుముహూర్త స్వర్ణాభిషేక విభవ

గజసమారోహణోత్సవ గండపెండ

రాదిసత్కారతన్మయం బయ్యెనాంధ్రి

విశ్వరూపసందర్శనావిష్టయేమొ.

ఆనీ తాంధ్రధరాధినాయక కవిత్వారాధనై కోజ్జ్వలా

స్థానోదీర్ణ మహాసభాంగణలసత్‌ స్వర్ణాభిషేకోత్సవ

శ్రీనాథుల్‌ కవిగండపెండెర మహత్ శ్రీలాంఛనోల్లాసితుల్‌

ఆనందప్రభు లొక్కరూపమున ప్రత్యక్షంబు ఖాయం బిటన్‌.

శ్రీ యర్రోజు మాధవాచార్యులు

~

అఖండగౌరవము

అభినవ తిక్కనా! వినుతి కర్హుడవయ్య సవాలుచేసి నా

డుభయ కవీంద్రమిత్రపద మూనిన తిక్కమనీషి కీడుగా

సభల సనర్గళమ్మయిన సాహితిఁజూపి యఖండగౌరవ

ప్రభల సమాహరించితివి పండితలోకము వెన్నుదట్టగన్‌.

అలసాని పెద్దన్న నవల బెట్టెదవులే, కావ్యనిర్మాణైక కౌశలమున

భట్టుమూర్తిశ్లేష పలుకరించెదవులే, ప్రతిపద్యపద రసాస్ఫాలమున

శ్రీనాథకవిరాజు చేయిగల్పెదవులే, మంజుల జటిల సమాసఘటన

తిక్కన్న కవి నచ్చుదింపివేసెదవులే, తేటతేనియ లూరు తెల్గు నుడుల

పుణికి పుచ్చుకొందువు భక్తపోతరాజు

రమ్య సాహిత్య మనువాదరంగమందు

సుధలఁజిందించు సిద్ధహస్తుఁడవు నీవు

అలఘుతరకీర్తిసాంద్ర! తుమ్మలకవీంద్ర !

బాపుజీకథ రసోల్బణముగా విరచించి, దేశిమార్గము దీర్చి దిద్దినావు

రాష్ట్రగానము మనోరంజకమ్ముగ వితర్కించి, దేశము నూదరించినావు

తండ్రి ధర్మప్రవృత్తము సానలన్‌ దీర్చి, కావ్యజగత్తులోఁ గల్పినావు

పఱిగపంటను పెద్ద పంటకాపును జేసి, నాల్గుమూలల ఖ్యాతి నాటినావు.

తెనుగుకవులందు మేటిపందెమ్ము చఱచి

సారమైన జాతీయత నూరిపోసి

కాంచితివి గండ పెండార గౌరవమ్ము

కీర్తినిధివి సీతారామమూర్తి సుకవి

ఒక నిరుపేదజీవి తనకున్న సమస్తము నొడ్డి బాల బా

లికలకళాభివృద్ధికని లేమిని దా వరియించు గాథ నీ

వొక రసయుక్త ఘట్టమున నూది జగమ్ముల మేలుకొల్పితో

సుకవివరేణ్య ! నీ కవిత సూనృతవృత్తిని రాణ కెక్కెరా !

పలుచ పలుచగ రాలు కంకులని మట్ట

బఱిగపంటయె యంత గొప్పగ ఫలించె

తీర్చి వేసిన కుప్పలు నూర్చునపుడు

ఎన్ని ధాన్యరాసులు మిన్ను దన్నఁగలవో

కనకాభి షేకగౌరవ మన నసదే ?

దీనిఁబడయ నందఱ కగునే

మొనగాడవు నీ కవితాధుని నభినందింపవలదె ? తుమ్మలసుకవీ!

శ్రీనాథుని మున్నెవరో, భూనాథుఁడు పసిఁడితోడ పూజించెను ని

న్నీ నాడాంధ్రప్రజ స న్మానమ్ములఁ దేల్చుట నుపమానము గాదే?

కవిరత్న శ్రీ కొసరాజు రాఘవయ్యచౌదరి

~

కవిచంద్రా!

కనకాభిషేక మహమున్‌

గని, పెండారమ్ము తొడుగ గాగాంచి, గజ

మ్మును నెక్కు టరసి శ్రీనా

థుని బెద్దన్నను స్మరించుదుము కవిచంద్రా!

కవిపదము సార్ధకముగా

భువి మంటివి పూర్వజన్మ పుణ్యముకతనన్‌

కవి వైతివి నీకు శుభ

మ్మవు గావుత మన్ని యెడల నంధ్రకవీంద్రా!

ప్రగతికి సుగతి కనారత

మగుకావ్యము లెస్ససేతు రార్యులు నీవా

తగ వెఱిగి రచించెద వా

వగఁ గూర్పనివానికేల వన్నె ఘటిల్లున్‌ ?

నీకవితా సంభావన

కీకానుక లంపినాడ హీరతుషార

శ్రీకమనీయంబై యశ

మాకల్పమ్మెసక మెసగు నంధ్రావనిలో.

కవిబ్రహ్మ, శ్రీ ఏటుకూరి వేంకటనరసయ్య

~

అభినందనము

శ్రీరాము, డాంధ్రకవి లో కారాధ్యుని, సత్కవీశు నమలాత్ముని సీ

తారామమూర్తి చౌదరి నారోగ్యాయువుల నిచ్చి యరయుం గాతన్‌.

తెలుఁగుందల్లికి గావ్యభూష లిడి భక్తిన్‌ గొల్చుచున్‌ దత్పదా

మలనేవానిరతిన్‌ మహార్యజనసంభావ్యంబుగా బ్రాక్కవీ

శులఫక్కిన్‌ విడనాడ కద్భుతముగా సొంపెక్కు సత్కావ్యముల్‌

పలుకం జాలిన మిత్రరత్నమును సంభావింతు నత్యంతమున్‌.

సరసకవితా చమత్కార సౌష్ఠవంబు, పరమనిర్దుష్టమై మించుభాష తెలుగు

తీరుఁదీయము లెఱింగిన నేరిమియును, వెల్లివిరిసిన వితనికవిత్వమందు.

ఆర్యసమ్మతముగ నధునాతన విషయములను గైతసెప్పి తలల నూప

చేయు జాణ కిపుడు సేయు గౌరవమెంత, విధిని దీర్చికొనెడి విధముగాక.

అభినవ తిక్కన యనగా, నభినుతి గన్నట్టి మిత్రు నభినందింతున్‌

శుభకవితన్‌ వాచస్పతినిభుడని కనకాభిషేక నిరుపమవేళన్‌

‘ఆత్మకథ’యు నవల ‘నాత్మార్పణంబు’ను ఇతనికీర్తి కెల్ల నెల్ల లగును

‘పఱిగపంట’ తోడఁ బరఁగు ‘ధర్మజ్యోతి’ అమరకీర్తి యితని కలరఁజేయు

‘రాష్ట్రగానంబు’ నాంధ్రరాష్ట్రంబు వచ్చుదనుక కనుమూయనీయదు తమమడంచి

ఆంధ్రజనులకు నుద్బోధమై యెసంగు సత్కవీశ్వరువాక్కు లసత్యమగునె

కనకాభిషేకనామక ఘనగౌరవ మంది గండపెండేరము నీ

వును దాల్చి యేనుఁగెక్కెడు ననువగు వేళన్‌ గవీశ! అభినందింతున్‌

శ్రీ బులుసు వేంకటేశ్వర్లు, బి.ఏ

(సశేషం)

Exit mobile version