Site icon Sanchika

తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-9

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

కనకాభిషేకము

[dropcap]చి[/dropcap]త్రవిచిత్రరీతులను సృష్టి నొనర్చి తదీయమైన వై

చిత్రికి సాద్భుతుం డగుచు జిత్తమునన్‌ స్మరియించుశక్తి నీ

ధాత్రిని నొక్కమర్త్యునకె తద్దయునిచ్చిన స్వామిసత్కృపా

నేత్రములం గనుంగొనుచు నిచ్చలు నీ కవివర్యు బ్రోవుతన్‌.

బుధజనవంద్య ! పూర్వకృతపుణ్యమునన్‌ సుజనాభినంద్యమై

ప్రథ సమకూర్పజాలు ప్రభవంబును గాంచితి యింతకుం గడుం

బ్రధితము లైన గౌరవపరంపరలన్‌ లభియింప జేయు స

త్కథల జగద్దితంబు లయి గ్రాల రచింపుము సత్ప్రబంధముల్‌

కడుపునఁ బుట్టినంతనే జగంబున సంతతి సార్ధకత్వముం

బడయదు తల్లి దండ్రుల సపర్య యొనర్పక మీకవిత్వపుం

బుడుత కృతజ్ఞ సర్వగుణ పూజితయై పితృభక్తి గూర్చె జే

పడ సభ గండపెండేరము పావనమౌ కనకాభిషేకమున్‌.

మనుజేంద్రు ల్ధనసాంద్రులుం బడయ సామాన్యంబె యీదృక్సుధీ

జనమాన్యం బసదృక్షమై నెగడు నీ సన్మాన మెచ్చోటనో

యనఘా ! గోచరమయ్యె సూ ”సుకవితా యద్యస్తి రాజ్యేన కి

మ్మ” నునార్యోక్తి ప్రసిద్ధ గౌరవము మీ రందంగ మర్యాళికిన్‌.

కవు లీసంసది మిమ్ము గూర్చి యనురాగం బూర నానావిధ

స్తవముల్‌ చేసి పని న్ముగించిరవి మీస్వాంతంబునం దుంచి స

ద్వ్యవహారంబునఁ బెంపొనర్చుటయె ధీరా ! యుండె శేషంబు సం

స్తవనం బార్యు లొనర్ప వర్ధిలుము సీతారామమూర్తీ ! తగన్‌.

సిరు లింపొందియు సౌమనస్యము భజించె న్ని న్ను భాషాద్వయీ

వరపాండిత్యము సత్కవిత్వరచనాప్రౌఢత్వముం జేరి వి

స్తరకీర్తిస్ఫురణాలతావితతి నాశారాశి బ్రాకించె ని

ద్దర లోటున్న దె తుమ్మలాన్వయజ ! సీతారామమూర్త్యగ్రణీ !

అది యేమో వివరింపజాలము సరోజామోదముల్‌ గ్రమ్మిన

ట్లు దితేందూపలనిస్సరజ్జలములం దోలాడిన ట్లెంతయున్‌

మదికిం జల్లనయుం గగుర్పొడుపు సంపాదించు నీ కైత లిం

త దురాపం బొకొ శైలి యన్యులకు సీతారామమూర్త్యగ్రణీ !

ఎచట న్నేపదమె ట్లిలముడ్పఁదగు నే యే పద్య మెచ్చోట న

భ్యుచితంబౌ నెటువంటి భావముల నే భూముల్‌ విరాజిల్లు ద

ద్రచనా నైపుణి నీకు బ్రాక్తన కవీంద్ర శ్రేణికిం బోలె నిం

త చిరాభ్యస్తముగాగ నొప్పెడినె సీతారామమూర్త్యగ్రణీ !

బలిజేపల్లియు రాయప్రోలు మతి కొప్రం బేటుకూ రింక తు

మ్మల మున్నైన మహాస్వయాంబుధు లిటుల్‌ మాణిక్యముల్‌ గాంచి కీ

ర్తి లసద్రోచుల దిక్కులన్‌ నెఱప బేర్మిం బ్రోచు గుంటూరు మం

డల తేజం బిది యింత యొప్పెడినె సీతారామమూర్త్య గ్రణీ!

ఘన భావంబులకై శిర స్తలములం గావింప వా ప్రాస బం

ధన విశ్రాంతులకై తడంబడవు విన్నాణంపు శబ్దాళికై

పనిబూనం గమకింప వాశుకవితాప్రావీణ్యగణ్యుండవై

తనరం గూర్చెదు హృద్యపద్యతతి సీతారామమూర్త్యగ్రణీ!

కమనీయంపుఁ గపోతయుగ్మము కథం గావించి యాతిథ్య ము

త్తమమ న్నీతిని బేరుకొంటివి పరద్రవ్యం బహార్యంబుగాఁ

గ్రమమౌ తండ్రిచరిత్ర జెప్పితి వహో; గాంధీయచారిత్ర మా

త్మముదం బొంద రచించి మించితివి సీతారామమూర్త్యగ్రణీ!

అమల యశంబు కబ్బముల నబ్బిన దెంతయు; నాంధ్రతాభిమా

నము దళుకొంద నెల్లరమనంబుల రంజిలజేయు రాష్ట్రగా

నము రచియించినాడ వది నాణెపుగబ్బముగాగ నాంధ్రదే

శమున ఓస్థిరత్వముం జిరయశంబు గడించిన దెంచి చూడగన్‌.

అభినవతిక్క నాహ్యయబిరుదంబు నందితివి నెల్లూరి పండితుల వలన

రాష్ట్రగానము శివరామనృపాలున కంకితం బొనరించి తప్పికట్ల

దానయ్యకవికి సత్కారంబు సేసి ధర్మజ్యోతి నొసగితి మహిత సభను

గనకాభిషేకంబు గండపెండరమును నిడుబోల గొంటి పండితుల యెదుట

నీదు భాగ్యంబు నెంత వర్ణింపగలము

కృతిపతుల బిల్చికొని సత్కరించువితము

నేగురులు నేర్పిరో నీకహీనమైన

కీర్తి గొంటివి సీతారామమూర్తి సుకవి !

ఆనంద మందెద మసమప్రబంధ సం, బంధ బంధములనిర్మాణమునకు

హర్షంబు నొందెద మమర తరంగిణీ, జలసేకసమమైన శైలిగాంచి

మోదంబు గాంతుము మురరిపు వేణుగా,నము బోని రచనసంధానమునకు

బ్రమదంబు గనుగొందు మమలశబ్దార్థ సంపదల బొంపిరి వోవు భావములకు

సమ్మదము జెందెదము పంకజాతవిమల

మధురమకరందబిందుసంగ్రథిత తావ

కీనసంభాషణములకు గృతివి నీవు

కీర్తనీయ ! సీతారామమూర్తి సుకవి !

శ్రీ భీమిరెడ్డి వేంకటప్పారెడ్డి

~

ప్రశంస

శ్రీదా సరోజమృదుపాదా జగత్త్రయరసౌదార్యదివ్యసుపదా

స్వాదా శ్రుతిస్మృతికలాది ప్రమోదపదవీదానదీక్షితపదా

మేధోలసత్సౌధపాదస్ఫురత్సుకవితాదిత్యదీప్తివిశదా

నేదీయసీభవతు భౌదా పనోదనిపుణా దివ్యశారదళలా

కవి సామాన్వుడు కాడు మాన్యుడగు నెక్కాలంబు శ్రీ విక్రమా

ర్కవిభుం డాదిగ దొంటిఱేండ్లు భయవాక్కల్యాణ సంధాయకుల్‌

కవితన్‌ రాజ్యము నొక్కమాదిరిగ నేలంజాలీ రీమధ్యవే

ళ విలోపించెను తద్విధాన మిపుడుల్లాసంబుఁ గొల్పెంగడున్‌.

ఔచిత్యమ్మును గుర్తెఱింగి సువిమర్శాదర్శమందున్‌ సదా

ప్రాచీనాద్యత నాంధ్రవాజ్ఞ్మయములన్‌ బ్రాధాన్యముం దెల్పువా

గ్వైచిత్రీనిధి ”రామలింగ” సుమనఃకల్పంబు మోచాఫల

త్ప్రాచుర్యోక్తు లెసంగె సత్కృతిని సీతారామ మేల్కైసరీ!

రసధారాప్లుతి దంత్యశోభయును సారప్రక్రియాంచద్గతుల్‌

పొసగన్‌ భారతికిన్‌ నిరంతరముబొల్పున్‌ భద్రమత్తేభముల్‌

పసగై సేసి యొసంగు నీకొకటియౌ భద్రేభ రాజోత్సవో

త్కసమం బెట్లగు ”రాష్ట్రగాన” కృతి సీతారామమేల్కైసరీ !

మెఱుఁగుల్‌ క్రిక్కిఱియించు భావమణులన్‌ మేకొల్పి పల్మెల్పునన్‌

దెఱగుల్‌ భవ్యసువర్ణ భూషలను వాగ్గేవీమనఃప్రీతి కే

ర్పఱుపం జాలిన నీకు నియ్యెడల సత్స్వర్గాభిషేకాదు లి

త్తఱి నిట్టుల్‌ రచియించుటల్‌ తగును సీతారామ మేల్కైసరీ !

సమతాదేశము దేశసేవకలభాషాసేవ గావించి ధీ

రమణీయం బగు కైతతీవె ఏపువులన్‌ గ్రంథంబులం గూర్చి స

ర్వమనోజ్ఞంబగు కీర్తినొప్పు నిను శ్రీ రామప్రభుం డేలు ని

త్యము దీర్ఘాయు వనామయం బొసఁగి సీతారామ మేల్కైసరీ !

శ్రీ చల్లా పిచ్చయ్యశాస్త్రి

~

విరిదండ

చండ భుజార్గళోద్ధతి కజాండము బెగ్గడిలంగ నాంధ్ర భూ

మండల మేలినట్టి బుధమాన్యుడు రాజనరేంద్రు కొల్వులో

బండెను తెల్గుపంట మనభాగ్యము స్వర్ణ ముహూర్త మద్ది, నా

డుండినవారు ధన్యులు మహోజ్జ్వలభారతగాధ ద్రవ్వి ది

గ్భాండము నిండబోసె ననపార్యుడు, తిక్కన ప్రెగ్గడార్యుడున్‌

డిండిమభట్టు సాముగరిడీ లొనరింపగ కంచుఢక్క వా

గ్భండన మందు వ్రచ్చి కనకంబున తీర్థములాడె సార్వభౌ

ముండు ! నిశాతఖడ్గపరిభూత తురుష్కధరాధినాథుడౌ

గండరగండపోటు మొనగాడు కవీంద్రుడు కృష్ణరాయడే

పెండెరముం దగుల్ప పురవీధిని తా నెదురైనచోట వే

దండము నాపి కేలొసగ దర్పముతో దిరుగాడె పెద్దనా

ర్వుండును; తత్కథ ల్వినగ రోమములెల్లను నిక్కు, నిట్టు లె

న్నండొకొ! చూచుటీ తెలుగునాట మనోహర కావ్యరంగ మా

ర్తండుడు పూర్య శైల శిఖరంబును బోని మదేభ మెక్కి పూ

దండల మున్గ నాంధ్రకవితావనితాలలితోపహారముల్‌

మండెలుగాగ దిక్కరులమాడ్కి మహాకవు లెల్లచోట గై

దండ లొసంగ దేవగురుదర్ప మడంపగజాలు పండితా

ఖండలు నెల దిక్కుల జకాచకబారులుదీర్చి నిల్వ బ్ర

హ్మాండము తూర్యశంఖపటహధ్వని ఘూర్ణిలజేయు నిట్టి యీ

పండువు జూచు భాగ్య మని భావపరంపర గ్రుద్దులాడ నా

గుండియలోన మ్రోగినది గుఱ్ఱపు డెక్కల సవ్వ డిప్పుడో

నిండె సుధాస్రవంతి రవణించెను తెల్గుపొలంతి గజ్జియల్‌

పండువునేడు నిన్ను కడుపారగ గన్న తెలుంగుతల్లికిన్‌

***

కమ్మని తెల్గుబాస చిరకాలము నోచిన నోము పండె  నీ

తుమ్మల వంశమందు; పెడత్రోవల బట్టిన యాంధ్రజాతి బ

మ్ముల బట్టి తెచ్చుటకుగా విరచించితి పౌర రాష్ట్రగా

నమ్ము మహోజ్జ్వలాంధ్రజన నాయకవృత్తము లెల్ల నెత్తి లో

కమ్మున గ్రుమ్మరించితివి; కాలరథమ్మున కగ్గమైన శి

ల్పమ్ముల జూపినావు ! పరభాషలకై పరువెత్తు వారి లో

పమ్ముల నెత్తి చూపితివి పశ్చిమమండలవాసు లొండు రా

ష్ట్రమ్మును గోర దెల్పితి విచారమ్ము నాంధ్రులలోన నైకమ

త్యమ్ము తిరమ్ముగా వలయుదాస్యము ద్రోయుట కంటి; లోకదా

స్యమ్మునడంపబుట్టిన మహాత్ముని వృత్తము జెప్పినావు; పా

ఠ్య మ్మది యాంధ్రచెన్ననగరాన్నమలాది కళాలయంబులన్‌

మమ్ము క్షమింపగావలయు మామకు నల్లుడు స్వీయమాతృవం

శమ్మునుగూర్చి చెప్పినటు సర్వధరోజ్జ్వలదీపసూర్యబిం

బమ్మును దివ్వె జూపినటు వల్కితి నల్లుడగాన ఏల నీ

కమ్మయు గబ్బమౌ తెలుగు కావ్యసుమంబులఁ గమ్మ పుప్పొడుల్‌

చిమ్మగ, లోక మెల్ల మధుసింధువు కుత్తుకబంటి గాగ భృం

గమ్మయి దోగి తన్మధురకంఠము నెత్తి పఠింపసాగె గీ

తమ్ములు రోళ్ళరోకళుల దద్ధిమి తద్దిమిమ్రోగు నీదు కా

వ్యమ్ములు తెల్గుపూవుల సువాసన లెల్లెడ బర్వుగావుతన్‌.

***

ఏర్ల గడ్డమీదనేపుగా బెరుగుట, కతన వక్రవృత్తి గలుగలేదు

చిగురు గొమ్మయందు జేవయే గనుపించు, కంటకమ్ము లిచట గానరావు

దానయాదులకే కావ్యదాతవయ్యు, కమ్మవిలుకాని నల్లునిగాగ బడసి

పుచ్చుకొనుమాట యెఱుగని పుణ్యమూర్తి!, అందుకొనవయ్య! కపురంపు టారతులను

సర్వవిశ్వసృష్టిసాధకం బగుళక్తి, సర్వలోకములను సాకుశక్తి

సర్వభూతములను సంధించు పరశక్తి, శతశరత్తులవని సాకు గాత.

శ్రీ యార్లగడ్డ వేంకటసుబ్బారావు

~

అన్న

నీవు నీత్రోవ వెంబడి పోవునప్పు డెన్నొమారులు చూచియు నేను వచ్చి

పలుకరించను నిను నాదు దలపునందు, వేయి యూహలలో నిండిపోయి నిలుతు.

ఒక పునీత సంబంధ మెదోయెదో మనకు గలదని లోలోన దవ్వుకొనుచుందు

నింతలో దోచుబో ! మన యిర్వురకును మధ్య, మన ”మహాపిత ” అహింసా వ్రతనిధి.

అన్న వనుకొందు నప్పుడే అన్నవ్రాసి కొనెను తండ్రి పుణ్యకథను తెనుగులోన

అన్న పితృభక్తిపరుడన్న ఆస్తికుడు క, డుంగడు గృతార్థుడనుకొని పొంగిపోదు.

అపుడేమో యొక బుద్ధిపుట్టు కవినై ఆంధ్రావనీదిగ్దిగం

తపరివ్యాప్త మహాప్రశస్తి గనువిన్నాణమ్ము నాకెట్లు, లే

ద పితృస్వామికథా సుధావచన హృద్యంబైన నీయింటియం

దెపుడున్‌ నేను ప్రతిధ్వనించుకొనరాదే ! యంచు భిత్తిస్థితిన్‌.

నీహృదయోన్నతిం దెలియనేరని వారికిగాక ఈ గజా

రోహణమేల నీకు ? కవిలోమణీ! కనకాభిషేక పు

ణ్యాహము తెచ్చిపెట్టగలదా ? సరిక్రొత్త మెఱుంగు నీకు ఓ

హోహొ ! ఇవెల్ల తెల్గుప్రజ యుష్మ దుదాత్తత కిచ్చు కానుకల్‌.

తనకేమొ బ్రహ్మరథమ్ము పట్టినది లో, కమ్ములోకమ్ము తద్గౌరవమ్ము

తనకు గాదని తండ్రి తనలోని రాముని, జూచుకొన్నాడు లో జూపులోన

విశ్వహృదయ మహావిపులసామ్రాజ్యమ్ము,  చెఱగులు నాల్గింట మెఱసినట్టి

నిశిత తత్పితృదేవ నిష్కామఖడ్గంబు, కవిరాజ ! నీకు రక్ష నిడుగాక.

తత్ప్రభావ దీప్తి తప్తమౌ నీయెడం

దయు గడింది కూర్చు తమ్ముగుఱ్ఱ

లేము కవులు తండ్రి యేగిన నిష్కామ

పథము నడువ తోడుపడును గాక !

శ్రీ వోగేటి పశుపతి

~

పొలి గలగాలి

కలుముల కయిదాలుపు కా

పుల కిల వేలుపు తెలుంగు పొలివేలుపు క

న్నుల చల్వ బొలిగలుగు తు

మ్మల సీతారామసుధికి మా పొలికవికిన్‌.

పట్టణ నాగరీకతకు బానిసలై మనురీతి మాని యీ

పుట్టు పురోహితుల్‌ నకలు భూపతులుం గుహనావణిగ్వరుల్‌

మొట్టమొదంటి కాపు లటుపోయిన గాంధియుగమ్ములోన నీ

కట్టిన కాపు గైతలకు గమ్మని జోత లివే మహాకవీ!

కవి చేతిబట్టి నాగలి దున్ను కాలాన దోచిన ఋక్కులతో మహర్షి

నాగ నొప్పినమాట నాడును నేడును దథ్యంబ తద్దివ్యదర్శనమున

లోకోత్తరాద్భుతానైక వ్యానీకముల సృష్టిచేసి మీబోంట్లు ఋషుల

తావు మెట్టిరి నేడు ధర్మంబు సత్యంబు పోకడవోయిన పుణ్యనిధులు

ఋషుల దేశానబుట్టి తద్రీతి నెఱిగి

నానృషిః ”కురుతే కావ్య” మనెడు సూక్తి

యెరిగి యెరిగి కన్దోయికి నెట్టయెదుట

జెలగు ఋషికల్పు మిమ్మలక్షింప జాల.

తెలుగుం బల్కుల పాలవెల్లి నిలువుల్‌ తెర్లించి తెర్లించి నీ

వలె నింపౌ నుడికారముం జిలుక నేర్వం డింకొకం డౌర ! ని

ర్మలనిత్యార్జవనీతిబద్దరచనామాత్రైక దీక్షల్ సుశో

భిల సత్కా వ్యసుధన్‌ విదల్చడని గర్వింతున్‌ మదిన్‌ మద్గురూ !

గుమ్మలసత్కవీ ! భవ దతుల్యపవిత్ర కవిత్వ సేవలో

కమ్మదనంబు నీగొనము కమ్మదనంబును నెంద ఱెందఱో

నమ్మిన నాదుబోంట్లకు ఘనంబుగ వెన్నెల వెల్గు లీనగా

ని మ్మిక బ్రాహ్మణత్వమున కెంచము లెమ్ము కులమ్ము బుట్టువున్‌.

శ్రీ శిష్ట్లా సత్యనారాయణరాజశేఖరము

~

కవీశ్వర!

ఇది యూరూరుల పొర్లు నిన్గన గవీ యేతెంచు ! భూరిప్రజా

నది; ముం దల్లదె, మిత్రపండిత కవీంద్రశ్రేణి వచ్చెన్‌ సభా

సదులారా ! నవతిక్కనార్యుడు భవత్సన్మానసంలక్ష్యసం

పద భూపాలకరామలింగముఖ విద్వద్గాఢ సంశ్లేషుడున్‌.

కోమలమైన నీ పరిగ గువ్వలబొమ్మ లమర్చివేది ధ

ర్మామరదీపముల్‌ నిలిపి యాత్మకథన్‌ గరిగించి రాష్ట్ర గా

నామలశోభ నర్తిలుచు నాంధ్రి శుభాక్షత లంది పొల్చెనో

యీ, ముదమారగంటివె కవీశ్వర ధన్యభవుల్‌ భవాదృశుల్‌.

రాయలకొల్వు లందు గవిరాజులు వెల్గిరి తొల్లి యిర్వురీ

చాయల రెండురీతులగు సత్కృతు లొంది యవెల్ల గుప్పగా

నీ యొడిజేరజూచితిమి నేడిట ఇట్టి ముహూర్త దర్శనా

ప్యాయితులైన తెల్లులకు బర్వదినంబులు నాడు నేడుగా

వెగటై కొందఱు చూడలేని కనులన్‌ వీక్షింతురా ? రోగి దృ

ష్టిగుణం బట్టిది పైడిలోమునిగి పెండేరమ్ము గైసేసి భ

ద్రగజారోహణసల్పి హారతులు వొందన్‌ లెమ్ము ముమ్మాటికిన్

దగు నీపాల గళారసానుభవ ! ఏతద్గౌరవాభ్యున్నతుల్‌.

కవితాకాంత మరింత దాల్చి భవదుద్గ్రంథప్రసూనావళిన్‌

నవ సౌందర్య నిధానయై చెలగుతన్‌ తత్కంకణాందోళనా

రవగీతంబుల హాయిలో నొడలు మర్వన్‌ జేసి నీ వంశమున్‌

భవ దుర్విన్‌ గరుణాశరణ్యయగుచున్‌ బాలించి లాలించుతన్‌.

శ్రీ పి.వేం.గోపాలరావు, బి.ఎ

(సశేషం)

Exit mobile version