తుంటరి ఎలుక నేర్చుకున్న పాఠం

0
2

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశ్యంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box] 

ఎలుకల భవంతిలో ఆ రోజు ఎక్కడ చూసినా ఆనందం, సంబరం, వేడుకలే! ఆ భవంతిలో నివాసముంటున్న ఎలుకలన్నీ అటూ ఇటూ గంతులు వేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆ రోజు నల్ల ఎలుక ఒక చిట్టి ఎలుకకు జన్మనిచ్చింది మరి! ఆ చిట్టి ఎలుక కళ్లు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో! తుంటరితనంతో ఆ కళ్లు మరీ మరీ మెరుస్తున్నాయి.

కాలం గడుస్తున్న కొద్దీ ‘తుంటరి’ అన్న సార్థక నామధేయ అయిన ఆ చిట్టి ఎలుక మరీ మరీ తుంటరిగా పెరగసాగింది. తోటి చిట్టి ఎలుకలన్నిటితో ఎంతో దోస్తీగా ఉంటూ ఆ ఎలుకల భవంతిలో మన తుంటరి  రోజురోజుకూ మరింత తుంటరిగా, దుష్టస్వభావిగా మారింది. దానికి తోడు, పుట్టుకతో అలవడిన మరొక గుణం అంతులేని కుతూహలం. అది ఎలాటి కుతూహలమంటే తన తల్లి ఏ పని చేయవద్దు అంటే అదే చేయటం; ఎక్కడికి వెళ్ళవద్దంటే సరిగ్గా అక్కడికే వెళ్ళటం –  ఇలా అన్నమాట!

ఈ ఎలుకల భవంతి ఒక మానవ గృహం లోపల ఉండేది. ఆ మానవ గృహంలో తల్లి, తండ్రి, వాళ్ల ముగ్గురు పిల్లలు – అంతా అయిదుగురు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు పిల్లలూ అన్నం తినడానికి కూర్చోగానే మన తుంటరి ఎక్కడ నుండి వచ్చేదో కాని చాటుగా వచ్చి వాళ్లు వదిలేసిన ఎంగిలి మెతుకులు, పదార్థాలు దొంగిలించి క్షణాలలో అక్కడి నుండి పారిపోయేది. మనుషుల ఆహార పదార్థాలంటే తుంటరికి చాల ఇష్టం. అది ఆ రుచులకు బాగా అలవాటు పడింది. తుంటరి ఆ మనుషుల ఇంట్లోకి వెళుతున్న ప్రతిసారీ వాళ్ల అమ్మ దాన్ని ఎవరైనా పట్టుకుంటారేమో, దండిస్తారేమో అని భయపడుతూ ఉండేది. తుంటరి బయలుదేరుతూ ఉండగానే ఎంతో నచ్చచెప్పేది. ఆపదలో పడతావు అని హెచ్చరిస్తూ ఉండేది. అయినా తుంటరి వింటుందా?

ఒకరోజు మన తుంటరి ‘ఇక నుండి నేను చాలీ చాలని ఎంగిలి మెతుకులు తినను గాక తినను’ అని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ మనుషుల ఇంట్లో నోరూరించే రకరకాల వంటలు, ఆహార పదార్థాలు పెద్దమొత్తంలో దాచిపెట్టే చోటు ఒకటి ఉండే ఉంటుంది కదా. తన స్నేహితుల సహాయంతో దాన్ని కనిపెట్టి ఆ తినుబండారాలపై దండయాత్ర చేసి తీరాలని మన తుంటరి గట్టిగా నిశ్చయించుకున్నది.

ఈ తుంటరి ముఠా ఒక రోజున నోరూరించే తినుబండారాలు ఉన్న చోటును ఇట్టే కనిపెట్టేసింది. వాసన పసి పట్టటంలో వాటి నైపుణ్యం చాల గొప్పది కదా! అక్కడ ఒక గాజు జాడీ ఉంది. ఆ జాడీ వంక చూసీ చూడగానే తుంటరి కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. అంత పెద్ద గాజు జాడీని అది ఎప్పుడూ చూడలేదు. “అబ్బా! ఈ జాడీలో ఎన్ని రకాల తినుబండారాలు దాచి ఉంచారో” అని అనుకుంటూ ఉండగానే దానికి నోరూరిపోసాగింది. ఆ తుంటరి ఎలుకల ముఠా ఎలాగైనా సరే జాడీలోనికి ప్రవేశించి అందులోని పదార్థాలన్నీ పొట్ట నిండా తినాలని జాడీ వైపుగా వెళ్లసాగాయి. ఇంతలో వెనుకనుంచి ఎవరో వస్తున్న అలికిడి అయింది. ప్రాణభయంతో ఎలుకలన్నీ తలో దిక్కూ పారిపోయాయి. కొద్దిసేపటికి నిశ్శబ్దంగా అయాక మళ్లీ అవన్నీ అక్కడికి చేరాయి. కాని ఇక అప్పటికే ఆలస్యమైంది కాబట్టి రేపు వద్దామని నిర్ణయించుకుని ఆ పూటకి ఎలుకలన్నీ ఇంటి దారి పట్టాయి.

మరుసటి రోజు రాత్రికి తుంటరిగుంపు ఆ జాడీపై దండెత్తడానికి సిద్ధమై వచ్చేసింది. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా జాడీ ఉన్న గదిలోకి ఆ గుంపు చేరుకున్నది. ఒకదానిపై ఒకటి ఎక్కి నెమ్మదిగా మూత వరకు చేరుకున్నాయి. జాడీ లోపల ఏమున్నాయో చూసిన ఆ ఎలుకల కళ్లు తళతళ మెరిశాయి. తాము కన్న కలలన్నీ నిజమవుతున్న వేళ వాటి ఆనందానికి హద్దు లేదు. మిఠాయిలు, క్యాండీలు, తీపి పదార్థాలు, చాక్లెట్లు ఎన్నో… ఎన్నెన్నో…. ఆ జాడీలో ఉన్నాయి! తమ కళ్లను తామే నమ్మలేక పోతున్నాయి ఆ తుంటరి మూషికాలు. ఆ జాడీలోకి దూరి దొరికినవి దొరికినట్టు ఎంతో ఆబగా ఒక మిఠాయి కన్నా ఇంకొకటి ఇంకా బాగున్నదని లొట్టలేసుకుంటూ తినసాగాయి.

అలా తింటూ తింటూ ఉన్న ఆ తుంటరి ముఠాకు సమయం ఎంత గడిచిందో కూడా తెలియలేదు. ఉన్నట్లుండి ఒక ఎలుక “మనల్ని ఎవరైనా పట్టుకునే లోపుగా ఇక్కడి నుంచి పారిపోయి ఇల్లు చేరదాం” అన్నది. కాని తిండి ధ్యాసలో తలమునకలై ఉన్న మిగిలిన ఎలుకలు “ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉండి మనకిష్టమైనవన్నీ హాయిగా ఆరగిద్దాము” అని గట్టిగా ప్రకటించాయి. అప్పటికే బొజ్జలన్నీ మిఠాయిలతో నిండి బరువెక్కి పోవడంతో అవన్నీ హాయిగా నిద్రలోకి జారిపోయాయి.

హఠాత్తుగా ఏదో ప్రకంపన శబ్దం వాటి నిద్రను భంగపరచింది. ఆ జాడీని ఎవరో కదుపుతున్నారు. అంతేనా? ఎవరో మనుషులు మాట్లాడుతున్న శబ్దం కూడా వినబడుతున్నది. వాటికి భయంతో గుండె గుభేలుమన్నది. ఎవరికీ చిక్కకుండా జాడీలో నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆదుర్దా పడసాగాయి. ఇంతలో ఎవరో ఆ జాడీని క్రింద పెట్టారు. ఇదే అదనుగా ఎలుకలన్నీ మళ్లీ ఒకదానిపై ఒకటి ఎక్కుతూ పిచ్చి పట్టినట్లు చకచకా జాడీలోనుండి బయటకు దూకేస్తున్నాయి. “హమ్మయ్య! అందరం బయటికి వచ్చేశాము, పదండి త్వరగా ఇల్లు చేరుదాం” అని ఒకదానిని ఒకటి తోసుకుంటూ తమ భవంతి వైపు పరుగెత్తసాగాయి. అందరమూ వచ్చేశాము అనుకొని వెనుదిరిగి ఆ జాడీ వైపు చూశాయి ఎలుకలు. ఇంతలోనే ఎవరో ఆ జాడీ పై మూత బిగించారు. “ఇవాళ మన అదృష్టం బాగుంది! దేవుడా, నీకు మా ధన్యవాదాలు” అనుకుంటూ అవన్నీ హాయిగా ఊపిరి తీసుకున్నాయి.

అవన్నీఎలాగో బయట పడ్డాయి కాని వాటికి తుంటరి ఎక్కడా కనిపించలేదు. అలా జరగకూడదని ఎలుకలు భయం భయంగా అనుమానపడుతున్నదే నిజమైంది. అమ్మో! తుంటరి జాడీ లోపలే ఉండిపోయింది! ఇప్పుడది బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరో జాడీ మూత బిగించేశారు కదా. ఇప్పుడు తుంటరి ముఠాలో ఎలుకలన్నీ భయంతో వణికిపోతున్నాయి. తమ భవంతికి వెళ్ళగానే తుంటరి వాళ్ల అమ్మ ‘తుంటరి ఎక్కడ?’ అని అడుగుతుంది. ఆమెకు ఏమని సమాధానం చెప్పాలి? ఇప్పుడేం చేయాలి?

వీళ్ళు ఇల్లు చేరేటప్పటికే తుంటరి వాళ్ళ అమ్మ అటు ఇటు దడబిడలుగా తిరుగుతూ తుంటరి కోసం వెతుకుతూ ఉన్నది. ఎలుకలన్నీ భయం భయంగా ఏమి జరిగిందో చల్లగా చెప్పేసరికి ఆమె హతాశురాలయింది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఆపద వస్తుందని ఆమె భయపడుతూనే ఉన్నది. ‘ఇప్పుడేం చేయాలి? తుంటరిని ఎలా కాపాడాలి? ఇప్పుడు ఏమి గతి?’ అనుకుంటూ తల్లి ఎలుక బాధపడసాగింది.

ఆ జాడీ మూత పూర్తి బిగువుగా పెట్టలేదు; ఇదే మన తుంటరి పాలిటి గొప్ప అదృష్టం అని చెప్పాలి. అది ఎలాగో ఆ రాత్రికి ఆ జాడీ లోపలే అపాయమేమీ లేకుండా గడిపింది. మూతకు, జాడీకి మధ్యనున్న ఖాళీ స్థలంలో నుంచి దానికి గాలి పీల్చుకోవడం సాధ్యపడింది. తనను ఎవరో ఒకరు వచ్చి ఎలాగోలా కాపాడుతారు అన్న ఆశతో నిద్రలేని రాత్రిని గడిపింది మన తుంటరి.

ఇంతలోకి తెల్లవారింది. తుంటరికి ఏవేవో శబ్దాలు, తానున్న జాడీని కదిలిస్తున్నట్లు, జాడీని ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకువెళుతున్నట్లు అర్థమవసాగింది. బయట ఉన్న వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి తుంటరికి ఒక విషయం రూఢిగా తెలిసిపోయింది. అదేమిటంటే ఈ ఇంట్లో ఉంటున్న మనుషులు తమ నివాసాన్ని వేరే చోటికి మార్చుకుంటున్నారనీ వాళ్లు ఇల్లు మారే రోజు ఇవ్వాళే అనీ. తాను ఉన్న జాడీని ఎవరో ఆ గదిలో నుంచి బయట సామానుతో నిండి ఉన్న ట్రక్కు వైపు తీసుకు వెళుతున్నట్లు దానికి అర్థమైంది. ఇక తనను వాళ్లు ఆ జాడీ లోపలే గట్టిగా బంధించి వేస్తారని, తాను తమ ఎలుకల భవంతికి ఎప్పటికీ వెళ్ళలేనని తెలుసుకున్నది మన తుంటరి. తాను తన తల్లి నుండి, తన స్నేహితుల నుండి వేరు చేయబడుతున్నాను అన్న ఆలోచనే దానికి భరించలేనంత దుఃఖాన్ని కలిగిస్తున్నది. అమ్మ తనకు ఎన్నోసార్లు జాగ్రత్తలు చెబుతూనే ఉండేది. తాను ఒక్కసారి కూడా అమ్మ మాటలు లెక్క చేయలేదు. అమ్మ మాట విని ఉంటే తనకు ఇలాంటి విపత్తు ఎప్పటికీ వచ్చి ఉండేదే కాదు! సామానుతో నిండిన ట్రక్కు ఆన్ అయ్యి కొంచెం ముందుకు కదలడం తుంటరికి తెలుస్తూనే ఉన్నది. ఇవాళ్టితో తన ఆయుష్షు తీరిపోయిందని దానికి అర్థమైంది. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు.

ఇంతలో ఎవరో బయట పెద్దగా అరుస్తున్న శబ్దం వినపడింది. ఇల్లు ఖాళీ చేసి వెళుతున్న వీళ్ల తండ్రిని పొరుగింటాయన పిలుస్తున్నాడని, ఆయన ట్రక్కు వెనకాలే పరుగెత్తుతూ వస్తున్నాడని అర్థమైంది దానికి. ఆయన ట్రక్కును చేరుకునేసరికి ఆయాసంతో ఎగశ్వాస తీసుకుంటూ “మీరు మా దగ్గర అరువు తీసుకున్న జాడీ ఇవ్వకుండానే వెళుతున్నారు” అని అన్నాడు. ట్రక్కు ఒక్క కుదుపుతో ఆగింది. ఇప్పుడు తుంటరికి జరుగుతున్నదేమిటో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.

ఈ ఇంట్లో ఉంటున్న వాళ్లు పొరుగింటివాళ్ల దగ్గర ఒక గాజు జాడీని అరువు తీసుకున్నారు;  ఇల్లు ఖాళీ చేసే ముందు వాళ్లు ఆ సంగతి మరచిపోయి జాడీని కూడా తమ సామానుతో పాటు ట్రక్కులోనే పెట్టేశారు.  ఇప్పుడు తాను ఉన్న జాడీ అదే! ఇల్లు ఖాళీ చేసి వెళుతున్న పెద్దమనిషి మనస్ఫూర్తిగా పొరుగింటాయనకు క్షమాపణలు చెప్పి ట్రక్కులోని సామానుల మధ్యలో ఉన్న ఆ జాడీని బయటకు తీసి ఆయన చేతిలో ఉంచాడు.  అలా పొరుగింటాయన చేతిలోకి ఆ జాడీ చేరుతుండగా ఆయన మూత తీశాడు. ఇదే అదనుగా భావించిన తుంటరి మెరుపు మెరిసినట్లు జాడీలో నుండి వేగంగా బయటకు దూకింది. ఒక్క పరుగులో తన ఎలుకల భవంతికి చేరుకున్నది. వెనుతిరిగి చూస్తే ఒట్టు!

ఇంటికి చేరుతూనే వాళ్లమ్మ కోసం వెతికింది తుంటరి. తల్లి కనబడగానే ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అన్నట్లు ఒక్క ఉదుటున తల్లిని గట్టిగా కౌగిలించుకొని “అమ్మా! ఇంకెప్పుడూ నువ్వు చెప్పిన మాటను పెడచెవిని పెట్టనమ్మా. నువ్వు ఏమి చెబితే అది వింటానమ్మా! నువ్వు ఎలా చెబితే అలా చేస్తానమ్మా” అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది తుంటరి. ఈ సంఘటన తుంటరికి ఒక మంచి పాఠం నేర్పినట్లయింది.

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here