Site icon Sanchika

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

‘బెల్ట్’ మాష్టార్:

రెండవ పానిపట్టు యుద్ధం..

హూఁ.. మొదటి పానిపట్టు యుద్ధమే బుర్రలోకి ఎక్కలేదు. ఇంతలో రెండవ పానిపట్టు యుద్ధమా? హతవిధి. ఈ సోషల్ బుక్ తెరిస్తే చాలు యుద్ధాలు, చంపుకోవడాలు, ఎప్పటివో ఆ సంవత్సరాలు, తేదీలు.. ఎన్నడూ వినని విచిత్రమైన పేర్లు. పైగా పేరుకి ముందు ఒకటవ రాజు, రెండవ రాజు, మూడవ వాడు.. అంటూ రైలుకి బోగీలు తగిలించి నెంబర్లు అతికించినట్లు ఈ అంకెగోల ఒకటి.. ఓహ్, పుస్తకం తెరవగానే నిద్ర ముంచుకు వచ్చేస్తుండేది. రాదా మరి.

కానీ ఏం చేస్తాం. పరీక్షలు-మార్కులు అనే రెండు గ్రహాలు పట్టి పీడిస్తుంటే, అనుభవించక ఏం చేస్తాం. ఈ మార్కుల యజ్ఞంలో సమిధలం కాక తప్పదు. సోషల్ పుస్తకంలో చరిత్రే కాదు, మిగతావి కూడా అంతే. మొత్తం మీద సోషల్ పుస్తకం ఓ బండరాయి.

సరిగా ఇలాంటి అభిప్రాయాలే ఉండేవి నేను హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో. ‘ఆ టెన్త్ కాస్తా గట్టెక్కిస్తే ఈ సోషల్ ఆ హిందీ, గొడవ పోతుందిరా’ అంటూ భవిష్య దర్శనం చేయించేవాడు ఓ ఫ్రెండ్. నాకు నచ్చని సబ్జెక్ట్స్ మూడు. అందులో ఈ సోషల్ ఒకటైతే, లెక్కలు, హిందీ మిగతా రెండన్న మాట.

లెక్కల చిక్కులు:

సోషల్ ఇలా ఉంటే, ఆ లెక్కలేమో మరీ గందరగోళం. అందులో అర్థమెటిక్స్ మరీ బోరు. ఆల్జీబ్రా అంటే గుండె గాబరా. నందిగామ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు లెక్కలు చెప్పడానికి ఇద్దరు మాష్టార్లు మాకొస్తుండేవాళ్లు. వారిలో ఆల్జీబ్రా చెప్పడానికి వచ్చే భూపతి రావు మాష్టారంటే మాకు హడల్. ఆయన క్లాస్ రూమ్ లోకి ఎంటరవుతూనే తన ప్యాంట్‌కి బిగించి కట్టుకున్న బెల్డ్ తీస్తూ ‘ఓరేయ్..’ అంటూ కేకలు పెడుతూ ఆకలిగొన్న సింహం, లేగ దూడలపై దాడికి దిగేటప్పుడు గర్జనతో దూకేసినట్లుగా వచ్చేవారు. నాబోటి బక్క ప్రాణులకు ఆయన వస్తున్నాడంటేనే హడల్.

క్లాస్ రూమ్ లోకి వస్తూనే..

‘ఓరేయ్, నువ్వు లే..’

పాపం సదరు ప్రాణి లేచి నిలబడేది.

‘ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంతరా?’

ఆ ప్రాణి గుటకలు మింగేది. వెర్రి చూపులు చూస్తుంటే.. ఆ క్షణంలో ఛళ్లున బెల్టు దెబ్బ తగిలేది. ఆ ప్రాణి కళ్లలో నీళ్లు ఉబికేవి.

క్లాస్‌లో పొట్టిగా ఉన్న వాళ్లు ముందు వరసల్లో కూర్చుంటే పొడుగ్గా ఉన్న వారు వెనక బెంచీలు ఆక్రమించేవారు. ఇక్కడా నాకు దురదృష్టమే వెంటాడేది. నేను కాస్తంత పొట్టే. అందుకని మొదటి వరుస బెంచీల్లోనే కూర్చునే వాడ్ని. ఈ మాష్టార్లున్నారే, వీళ్ల దృష్టి అంతా మొదటి వరసలోని పిల్లకాయల మీదనే. దీంతో ఫస్ట్ బెంచీల పిల్లకాయల గుండెకాయలు ఇలాంటి మాష్టారు ఎంటర్ కాగానే అదిరేవి.. బెదిరేవి.

ఫస్ట్ బెంచోళ్లలో ఒక రకమైన భయంతో కూడిన భక్తి బాగా ఉండేది. మాష్టార్ల చూపు ముందుగా పడేది మన మీదనే అని బాగా అర్థం కావడంతో ఎందుకైనా మంచిదని రేపటి పాఠాలు ఇవ్వాళే నేర్చుకునే ప్రయత్నం చేసేవారు. ఈ ముందు చూపు వల్లనే మాష్టారు అడగ్గానే ఠక్కున చేయెత్తి చెప్పడానికి సిద్ధమయ్యేవారు. ఈ భయంతో కూడిన భక్తి కారణంగానే ఫస్ట్ బెంచీల వాళ్లకు బాగా చదువుతారన్న పేరు వస్తున్నదని పెద్దయ్యాక, లోతుగా ఆలోచించాక నాకు అర్థమైన సత్యం.

సరే, మాష్టార్లలో రకరకాల వాళ్లు ఉంటారని ఒక్కొక్క క్లాస్ ఎదుగుతుంటే క్లియర్‌గా అర్థమవుతుంటుంది. పిల్లల్ని మందలించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒకరేమో చాక్‌పీస్ టీచర్ (కోపం వస్తే చాక్‌పీస్ ముక్కలు విసిరేసే టీచర్ అన్న మాట), డస్టర్ టీచర్ (కోపం వస్తే చాలు చేతిలోని డస్టర్ విసిరేసేవారు) అలాగే నోట్ బుక్ టీచర్, బెత్తం టీచర్, బెల్ట్ టీచర్ ఇలా ఉండేవారు. కొంత మంది టీచర్లు శాంతమూర్తుల్లా, సహనానికి మారుపేరుగా ఉండేవారు. ఇంకొంత మంది చిటపటేశ్వర్రావ్ లేదా చిటపటేశ్వరీల్లా కనిపించే వాళ్లు. కనుక, టీచర్లలో బెల్ట్ టీచర్ వేరయా అని చెప్పడానికే ఇదంతా రాస్తున్నానని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. తెలుగు పాఠాలు చెప్పే పంతులమ్మ శాంతంగా కుర్చీలో కూర్చుని అంతే శాంతంగా పాఠాలు చెప్పి, కథలు వినిపించి నాబోటి వాళ్లలో తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించేది. అదే లెక్కల మాష్టారు అదే నండి భూపతి రావు మాష్టారని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టేవి.

భయం మాయం:

మొదటి బెంచీలో కూర్చున్న నేను వణకిపోతున్నాను. బెల్టు చేతిలో ఊగుతూ నా దగ్గరకే వస్తున్నది. అది యమపాశంలా ఊగుతోంది, నా గుండేమో అదురుతోంది.

‘లేరా, భూషణం లే..’

ఎలా లేచానో తెలియదు.

‘చెప్పరా.. ఏ ప్లస్ బి హోల్ స్క్ర్వేర్ సూత్రం చెప్పు’

ఆ సింహగర్జనకు పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి.

అయినా, ధైర్యం తెచ్చుకున్నాను. ఆ ధైర్యం నా గుండెలో నుంచి రాలేదు. మెదడు లోంచి వచ్చింది. అంటే, ఆ సూత్రం నేను బట్టీ పట్టాను. ఇంట్లో చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. కానీ ఇప్పుడు చెప్పగలనా లేదా అన్న సందేహం మాత్రమే మిగిలింది.

నా ఆకారం, నా భయం తెలిసిన మాష్టారు కనుక కాస్తంత శాంతించారు. బెల్టు ఆయన వెనక్కి వెళ్ళిపోయింది. ముఖంలో ఎగతాళి లాంటి నవ్వొకటి కనిపించింది. సినిమాల్లో అప్పుడప్పుడు విలన్ గాళ్లు కూడా నవ్వుతుంటారే అలా అన్న మాట.

చాలు, ఆ మాత్రం నవ్వు చాలు. నా మెదడుకి పనిచెప్పాను. మెదడు నుంచి సంకేతాలు అందుకున్న స్వరపేటిక విచ్చుకుంది. అంతే, పెదాలు కదిలాయి. సూత్రం చెప్పేశాను.

మాష్టారు విన్నారు. సంతృప్తి ముఖంలో కనిపించి, అంతలో అదృశ్యమైంది. నవ్వు మాయమైంది. మరో అస్త్రం సంధించారు ఈ బక్క ప్రాణిమీద.

‘ఊహ్.. సరే, ఇది చెప్పు.. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ సూత్రం..’ అలవాటుగా బెల్ట్ పైకి గాలిలోకి లేచింది.

అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న మెదడు మొద్దుబారింది. అంతే గుండె జారినట్లనిపించింది. చమటలు పట్టేశాయి. ఈ క్షణమో, మరు క్షణమో కుప్పకూలడం ఖాయం అనుకుంటుండగా..

పైకి లేచిన మాష్టారి చేయి ఆలోచనలో పడింది. ‘ఊ.. కొడితే చచ్చేటట్టున్నావ్ రా. కూర్చో’ అన్నారు మాష్టారు.

ఆ తర్వాత కాసేపటికి గానీ దడ తగ్గలేదు. ఇలా ఉంటుంది ఆయన క్లాస్. కానీ మర్నాడు ఇదే సూత్రం అడిగితే తప్పకుండా తడబడకుండా చెప్పాలని ఆ క్షణమే గట్టిగా అనుకున్నాను. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. ఓ ఇరవై ముప్పయి సార్లు వల్లె వేయడం, వ్రాయడం వల్ల సూత్రం ఒంట బట్టింది. మర్నాడు మాష్టారు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. అడిగితే చస్తాడేమో అన్నట్లే ఉందీ ఆ చూపు. అయినా మాష్టారు కదా, అందునా బెల్ట్ మాష్టారాయే. ఆగరు. బెల్ట్ తీయకుండా ఉండలేరు.

‘నిన్న అడిగిన సూత్రం నోటికి వచ్చిందా?’ అలా అడిగినప్పుడు ఆయన అసలు ఊహించి ఉండరు. ఈ బెదురు గొడ్డు గడగడా చెప్పేస్తుందని. అప్పటి నుంచి ఆయన నా పట్ల కాఠిన్యం వహించలేదు. ఇలా అనేదానికన్నా, ఆ బెల్ట్‌ని చూస్తే నాకు అదివరలో లాగా భయం ఆవహించేది కాదంటే సబబుగా ఉంటుంది. భయం పోవడం వల్ల ఆల్జ్రీబ్రాలో పట్టు వచ్చంది. అదే టెన్త్ పరీక్ష గట్టెక్కించేలా చేసింది. అర్థమెటిక్స్‌లో ఆ లెక్కలు నాకు అర్థమయ్యేవి కావు. ఏమిటో ఒక రైలు వస్తుంటుందట. ఆ రైలు పొడవు, వేగం ఇస్తారు. రైలు పట్టాల పక్కన ఓ సిగ్నల్ స్తంభం ఉంటుంది. ఈ రైలేమో ఆ స్తంబం దాటి వెళ్ళిపోతుంది. అయితే ఎంత సేపట్లో స్తంభం దాటి వెళుతుందన్నది లెక్క.

నాకేమో అంతా గందరగోళంగా అనిపించేది. అలాగే మరో లెక్కలో ఒక మేకను పచ్చిక మైదానంలో యజమాని గుంజకు కట్టేస్తారు.

ఆ మేక ఎంత మేరకు గడ్డి తింటుందో చెప్పమనేవారు. ఇలాంటి లెక్కలను జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. ఇప్పటికీ రైలెక్కి ఏ ఊరువెళుతున్నా, కిటీకీ లోంచి బయటకు చూస్తున్నప్పుడు స్తంభాల్లాంటివి కనబడగానే రైలు – స్తంభం లెక్క గుర్తుకు వస్తూనే ఉంది. అలాగే ఆవులనో గేదెలనో పచ్చగడ్డి మైదానంలో కట్టేస్తే అవి గడ్డి తింటున్నట్లు కనబడితే చాలు, ఇందాక ప్రస్తావించిన ఆ రెండో లెక్క గుర్తుకు వస్తుంటుంది. అంటే, జీవితంలో ఇలాంటి లెక్కలు ఉపయోగపడతాయనే అనిపించేది. కాకపోతే నాకే బుర్రకెక్కలేదు. అంతే. స్కూల్లో చదివేటప్పుడు టీచర్లలో కొంత మంది ప్రభావం జీవితం చివరి వరకు ఉంటుంది. మరి కొందరి వల్ల చదువు పట్ల ఆసక్తే సన్నగిల్లుతుంటుంది. కొట్టినా, తిట్టినా అంతలో విద్యార్థులను ప్రేమిస్తూ వారికి ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పిన మాష్టార్లను ఎప్పటికీ గుర్తుతెచ్చుకుంటూనే ఉంటాము. మాష్టారు వల్ల నాకు ఆల్జ్రీబ్రాలో పట్టు వస్తుందని. నేను టెన్త్ లెక్కల్లో పాస్ కావడానికి ఈ సంఘటన అక్కరికి వచ్చింది. లెక్కల సబ్జెక్ట్‌కి రెండు పేపర్లు ఉండేవి. మొదటి పేపర్ 50 మార్కులకు అర్థమెటిక్స్ ఉంటే మరో 50 మార్కులకు ఆల్జీబ్రా ఉండేది. ఇందాకే చెప్పానుగా. అర్థమెటిక్స్ మన బుర్రకెక్కలేదు. ఆ పేపర్ పూర్తిగా చెడగొట్టాం. ఎలా అంటారా..

లెక్కల పరీక్షకి రంగు పెన్సిల్స్:

లెక్కల పరీక్షలో బొమ్మలు వేసి, వాటికి రంగులు దిద్దే వాడ్ని మీరెక్కడైనా చూశారా? చూసి ఉండర్లేండి. ఎందుకంటే నాలాంటి వాడు మీకు తారస పడి ఉండకపోవచ్చు. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్‌లో మాథ్స్ మొదటి పేపర్ రాయడానికి వెళ్ళాను. వెళ్లేటప్పుడు రంగు పెన్సిల్ ఉన్న బాక్స్ కూడా తీసుకు వెళ్ళాను. ‘ఇవెందుకురా’ అని ఫ్రెండ్స్ ఆశ్చర్యంతో అడిగారు, నేను పట్టించుకోలేదు. లెక్కలు ఎలాగో సరిగా చేయలేం కదా, నీట్‌గా బొమ్మలేసి పేపర్ దిద్దేవాడ్ని బుట్టలో వేసుకోవాలన్నది నా ప్లాన్. ఇది అందరికీ చెప్పకూడదు కదా. సీక్రెట్ ప్లాన్ అన్న మాట. చెబితే వాళ్లూ పేపర్లు దిద్దే వాడిని బుట్టలో వేసుకుంటారు కదా. అందుకన్న మాట. నేను కామ్‌గా నా వ్యూహం అమలు చేస్తున్నాను.

కొశ్చిన్ పేపర్ ఇచ్చారు. నాకు వారిచ్చిన లెక్కల్లో చాలా మటుకు ఎలా చేయాలో తెలియదు. కొశ్చిన్ పేపర్‌లో రైలు లెక్క ఇచ్చారు. సరే, పెన్ను తీసుకున్నాను. రైలు బొమ్మ గీశాను. దాని పొడవు ఎంతో వ్రాశాను. మధ్యలో ఎలక్ట్రిక్ స్తంభం బొమ్మ కూడావేశాను. బొమ్మ బాగుండాలని రైలుకి ఆ ప్రక్కా, ఈ ప్రక్కా పచ్చిక మైదానం లాంటిది, దూరంగా కొండలు వంటివి వేశాను. సంపూర్ణ చిత్రం రెడీ. ‘లెక్కల్లో ఈ బొమ్మలేమిటీ..? లెక్క చేయకుండా’ అని ఇన్విజిలేటర్ చీటికీ మాటికీ వచ్చి చూసి బోలెడు ఆశ్చర్యపోతున్నాడు. బొమ్మ బాగా వచ్చిందని సంతృప్తి చెందాను. కలర్ పెన్సిల్స్ తీసుకుని రైలు ఇంజన్‌కీ, రైలు పెట్టలకు రంగులు అద్దాను. పచ్చిక మైదానం, చెట్లు కొండలకి కూడా రంగులు పులిమాను. శహభాష్ రా అంటూ నా భుజం నేనే తట్టుకుంటుంటే, ఆ ఎన్విజిలేటర్ ఎవరితోనో అంటున్నాడు, ‘చూడు, ఆ రెండో బెంచ్ లో కూర్చున్న కుర్రాడు లెక్కల్లో తప్పడం ఖాయం. కావాలంటే రాసిస్తాను.’

కొంత మంది చెప్పే మాటలను దేవుడు వినడు. ఆయన చెప్పింది జరగలేదు. నేను టెన్త్ ఫస్ట్ ఎటెంప్ట్ లోనే పాసయ్యాను. ఇదెలా జరిగింది! మొదటి పేపర్ ని పూర్తిగా చెడగొట్టిన నేను మర్నాడు ఆల్జీబ్రా తదితర అంశాలతో కూడిన పేపర్ వ్రాయాలి. ఆ సాయంత్రం ఇంటి ఆరుబయట నులక మంచం వాల్చుకుని వెల్లికిలా పడుకుని ఆకాశం వైపు చూసాను. మబ్బులు ఏదో తొందర పని ఉన్నట్లు వేగంగా పరిగెడుతున్నాయి. నా కళ్లలో నీళ్లు అంతే వేగంగా లోపలి నుంచి తన్నుకుంటూ బయటకు వస్తున్నాయి. నా పరిస్థితి మా అన్నకు అర్థమైంది. బీఎస్సీలో డబుల్ మాథమెటిక్స్ ఫిజిక్స్ (దీన్ని ఎంఎంపీ గ్రూప్ అంటారు)తో పాసైనవాడు. ఆ రోజు రాత్రి ముఖ్యమైన లెక్కలు నా చేత చేయించాడు. తప్పులు సరిదిద్దాడు. బిట్స్ ఏవేవి రావచ్చో చెప్పాడు. తెల్లారింది. పరీక్షకు వెళ్ళాను. ఇన్విజిలేటర్ నన్ను అదోలా చూశాడు. ‘వచ్చాడూ, పెద్ద పోటుగాడిలా..’ అని అనుకున్నట్లున్నాయి ఆ చూపులు. కానీ ఎక్స్‌ట్రా పేపర్లు తీసుకుని తెగ రాసేస్తుంటే పాపం బిత్తరపోయాడు. చివరకు ఈ రెండో పేపర్ వల్ల వచ్చిన మార్కులతోనే నేను టెన్త్ గట్టెక్కాను. బెల్ట్ మాష్టారుకీ, చివర్లో హెల్ప్ చేసిన అన్నకి మనసులో థాంక్స్ చెప్పుకున్నాను.

బెల్ట్ మాష్టారు కారణంగా నాకో విషయం అర్థమైంది. గట్టిగా కృషి చేస్తే ఎంతటి కఠినమైన పని అయినా సులువు అవుతుందన్న సత్యం తెలిసి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఆ తర్వాతి కాలంలో నాటకాలు గట్రా వేసినప్పుడు డైలాగ్‌లు కచ్చితంగా చెప్పడానికి కావలసిన పట్టుదల ఇచ్చాయి. అలాగే ఏదైనా వ్యాసం రాయాలన్నా ముదస్తు కసరత్తు పకడ్బందీగా ఉండే తత్వం అలవాటైంది. అంతే కాదు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్న నిబ్బరం అలవడటానికి ఈ బెల్ట్ మాష్టార్లాంటి వాళ్లు ఉపయోగపడతారని ఆ తర్వాత అర్థమైంది. నా జర్నలిజం కెరీర్ లో కూడా ఇలాంటి వాళ్లు కనిపించారు. వారి వల్ల పునాదులు గట్టి పడ్డాయి కూడా. అవి తర్వాత చెబుతానులేండి.

మరో ఆశ్చర్యం:

మరే, లెక్కల వల్ల నాటకాలు వేయగలిగినట్లే, సోషల్ వల్ల నాలోని నాటక రచయిత మేల్కొన్నాడు. ఇది ఇంకో ఆశ్చర్యం. చదువుతున్నప్పుడు మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నా జీవితంలో అలా జరగకపోతే నేనూ కూడా ఆశ్చర్యపోయే వాడిని మీలాగానూ.

మరో వారంలో పరీక్షలు రాబోతున్నాయి. ఆటలు ఆపేసి పుస్తకాలు పట్టుకోమని ఇంట్లో వాళ్లు పోరాడుతున్న రోజులు. ఓ సారి మా ఇంటి వరండాకి కుడివైపున ఆనుకుని ఉన్న చిన్నగదిలో చాప పరుచుకుని ఒక వైపు గోడకి ఆనుకుని చదువుకుంటున్నాను. చదువుకి ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదని తలుపు వేశాను. తొమ్మిదో తరగతి చదువుతున్నాను. సోషల్ టెక్స్ట్ బుక్ తీశాను. అందులో హిస్టరీ అంటే నాకు మిస్టరీగా కనిపించేది. అయినా చదవాలి. తప్పదు. ఈ అక్బరేమిటో, ఆ బాబర్ గాడేమిటో, చోళులంతా ఎవరో, పల్లవుల గోలేమిటో నాకు ఒక పట్టాన అర్థంకాక పుస్తకంలోని అక్షరాలతో కుస్తీ పడుతున్నాను. అంతలో తలుపు చప్పుడైంది. అటు చూశాను.

నా వయసువాడే, నా ఫ్రెండే వాడు. నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. వాడి పేరు రాధాకృష్ణ.

వాడు మాట్లాడుతుంటే అదో గమ్మత్తుగా ఉంటుంది. ప్రతి మాటా సాగదీస్తుంటాడు. వాడి మాటలు చాలా అమాయకంగా ఉండేవి. చేష్టలు అంతే. ఎందుకో తెలియదు నేనంటే గురి. నా మాటే వాడికి శాసనం. నా చుట్టూనే తిరిగేవాడు. మా ఇంట్లో వాళ్లతో బాగా కలిసిపోయాడు.

‘ఏం చదువుతున్నావు రా..’

‘అదేరా సోషల్.. చరిత్ర..’

‘ఓరేయ్, నాకూ చెప్పరా. అర్థం కావడం లేదు’

‘ఏం చెప్పమంటావు?’

‘నువ్వు ఏది చదువుతావో అదే నాకు చెప్పరా’ అన్నాడు వాడు.

నాకో లక్షణం ఉంది. నేను ఒంటరిగా చదువుకుంటున్నా, మనసులో చదువుకోను. పైకి చదువుతుంటాను. అది కూడా ఎదుటి వాడికి చెబుతున్నట్లు ఉంటుంది. అందుకే వింటుండే వాళ్లకి నాలో నేను మాట్లాడుకుంటున్నట్లు ఉండేది. ఈ లక్షణం వాడికి ఇష్టం అన్న మాట. నేను కాసేపు చదువుకుందాం అనుకున్నప్పుడల్లా వీడు రావడం మామూలే.

‘ఇంట్లో అటక మీద గోళీలు ఉన్నాయి తీసుకు రారా..’

నా మాట వాడికి ఆజ్జ్ఞ లాంటిదన్న మాట. అదేంటో జీవితంలో కొంత మందితో అనుబంధం అలా అతుక్కుపోతుంది, తుమ్మ జిగురులా.

గోళీల ఆటల్లో..

గోళీల ఆటల్లో కొండంత సత్యం అవగతం కాకున్నా, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికీ, జీవితంలో కొన్ని సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఈ ఆటలు పనికొచ్చాయి. అదెలోగో చెబుతాను.

నా మాట పూర్తి కాకముందే రాథాకృష్ణ ఇంట్లోకి దూరిపోయాడు. వాడికి బాగా తెలుసు గోళీల డబ్బా ఎక్కడ ఉందన్నది. పరీక్షలు వస్తున్నాయి కదా. గోళీలు, బచ్చాలు, బంతాటలు ఆడకుండా బుద్ధిగా చదువుకోవడానికని ఇంట్లో 144వ సెక్షన్ లాంటిదేదో అమలు పరిచేశారు. ఆంక్షలు పెట్టేశారు. ఈ ఆంక్షలు ఇలా ఉండేవి..

స్మెల్ డిటెక్టర్లు:

పరీక్షలొస్తున్నాయంటే చాలు ఇంట్లో స్మెల్ డిటెక్టర్స్‌గా కొంత మంది పనిజేస్తుండేవారు. ఎలోగో వీలు చూసుకుని సినిమాకి చెక్కేసి ఇంటికి వస్తే ఈ స్మెల్ డిటెక్టర్లు పట్టేసేవి. కచ్చితంగా దొరికిపోతామని మాకూ తెలుసు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ సినిమాలు కొత్తవి వస్తే ఎలా ఆగగలము. పైగా ఏ సినిమా అయినా టౌన్స్‌లో లాగా 50 రోజులూ, వంద రోజులు మా ఊర్లో ఆడవాయె. మహా అయితే వారం పది రోజులు ఆడితే గొప్ప. రిలీజ్ అయిన నాలుగో రోజు నుంచే సినిమా బండి వాడు ‘నేడే ఆఖరాట.. తప్పకుండా చూడండి’ అంటూ తెగ కంగారు పెట్టేసే వాడు. కానీ తర్వాత తెలిసిందేమిటంటే, నేడే ఆఖరాట అనగానే మనం తొందర పడనక్కర్లేదు. గ్యారంటీగా నేడే ఆఖరాట అంటూ మైకోడు చెప్పేదాకా ఆగొచ్చు. పైగా మా ఫ్రెండ్ మరో కిటుకు చెప్పాడు. కొత్త బొమ్మ విడుదల తేదీతో సహా గోడల మీద పోస్టర్స్ అంటిస్తారు కదా.. అలా ఈ ఆఖరాట వ్యవహారం పట్టేయవచ్చని అని అనేవాడు. వాడి బుర్ర నిండా ఇలాంటి ఆలోచనలు బోలెడు పుట్టుకొచ్చేవి. కొత్త బొమ్మ సినిమా పోస్టర్ గోడకి అంటించగానే దాన్ని నిశితంగా చూసి మాకు ఆ సినిమా కథ చెప్పేవాడు. నువ్వు చూశావురా.. అని అడిగితే లేదురా, పోస్టర్ చూసి చెప్పేయగలను – అంటూ ఫోజులు కొట్టేవాడు. తొమ్మిదో క్లాసంటే ప్రాక్టికల్స్ గట్రా ఉండవు. స్పెషల్ క్లాసులు అంతగా ఉండవు. అదే ఇంటర్‌కి వచ్చేసరికి ఇవన్నీ వచ్చేస్తాయి. సైన్స్ గ్రూప్ అంటేనే వారానికి రెండు మూడు ప్రాక్టికల్ క్లాస్‌లు తప్పవు కదా. ఒక్కో క్లాస్ రెండు మూడు గంటలు ఉండేవి. సాధారణంగా లంచ్ తర్వాత ఈ ప్రాక్టికల్స్ క్లాస్‌లు పెట్టేవారు. అవి అయ్యాక ఆ పూటకి ఇంటికే మరి. లంచ్ తర్వాత అంటే మాట్నీ షోలు మొదలయ్యే సమయం. ప్రాక్టికల్ క్లాస్ ఎగేసినా పెద్దగా గుర్తించరులే అనుకుంటే చాలు, మాట్నీకి చెక్కేయడమే మా పని. ఈ పని చక్కబెట్టడానికీ, నడిపించడానికీ ఓ గ్యాంగ్ ఉండేది. మరి గ్యాంగ్ అంటే లీడర్ ఉండాలి కదా. మా గ్యాంగ్‌కి లీడర్ ఉండేవాడు. వాడు సైన్స్ గ్రూప్ కాదు. కానీ వాడు ఆప్టర్‌నూన్ క్లాస్‌లు ఈజీగా ఎగ్గొట్టేసి జట్టు కట్టి సినిమా హాలు వైపుకి నడిపించడంలో మొనగాడు. వాడి జేబుల్లో ఎప్పుడూ డబ్బులు గలగలలాడుతుండేవి. అలా ఎలా వచ్చేవో మాకు తెలియదు కానీ, వాడు అప్పుడప్పుడు తానే టికెట్ డబ్బులు ఇచ్చేస్తూ మాకు షోలు చూపిస్తుండే వాడు. కానీ కొన్ని షరతులు పెట్టేవాడు.

‘ఒరేయ్, నేను టికెట్ డబ్బులు పెడతాను. నువ్వేమో ఇంటర్వెల్‌లో ముంత క్రింద పప్పు, పప్పుండలు, గోళీ సోడా ఇంకా సినిమా పాటల పుస్తకం లాంటివి కొనాలేం..’ అనేవాడు.

మన దగ్గర వాటికీ డబ్బులు ఉండేవి కావు. ‘లేవురా, నిజంరా.. ఒట్టురా..’ వంటి మాటలు ఓ పది పదిహేను సార్లు చెప్పాక వాడి మనసు కరుగుతుంది. నిజంగా ఇది ‘నిఝం’ అని నమ్మేస్తాడు. అప్పుడు ఈ సాదర ఖర్చు కూడా వాడే భరిస్తాడు. అయితే అందరికీ కాదు. వాడికి బాగా విధేయుడిగా ఉన్న వాడికో, బాగా నమ్మిన వాడికో ఇచ్చేవాడు. ఎందుకో తెలియదు కానీ నా మాట తీరు సౌమ్యంగా ఉండటంతో మంచి వాడిననీ, అబద్ధాలు చెప్పనని నమ్మడం వల్లనో నాకు అలాంటి అవకాశాలు తరచుగా వచ్చేవి. అలా ప్రాక్టికల్స్ పేరిట సినిమాలు చూసి ఇంటికి చేరగానే షర్ట్‌కి పట్టిన సిగరెట్ పొగ వాసన ఇంట్లో వాళ్లు పట్టేసేవారు. అలా అని మేమోదో సిగరెట్లకు అలవాటు పడ్డామని కాదనుకోండి. సినిమా హాళ్లలో పొగ త్రాగకూడదన్న కార్డులు స్క్రీన్ మీద పడుతున్నా, గోడల మీద వ్రాసి ఉన్నా వాటిని చూడగానే చాలా మందికి దమ్ముకొట్టాలని గుర్తుకు వచ్చేది. హాయిగా దమ్ము కొడుతూ, పొగని రింగులురింగులుగా వదులుతూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో మా ఊర్లో ఉన్న సినిమా హాళ్లన్నీ మామూలువే. అంటే ఏసీ సౌకర్యం లేనివన్న మాట. సినిమా ప్రారంభం కావడానికంటే ముందు హాల్లో సిగరెట్, చుట్ట, బీడీ పొగలతో మేఘాలు ఏర్పడేవి. అదంతా పెద్ద సీను.

సినిమా చూసి ఇంటికి రాగానే ఇంట్లో అక్కో, అన్నోలేదా ఇలాంటి పెద్దోళ్లో ఎవరో ఒకరు ‘స్మోక్ డిటెక్టర్స్’ గా బాధ్యత తీసుకుని మా షర్టుకు పట్టిన సిగరెట్ వాసన పట్టేసి, మేము ప్రాక్టికల్స్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లామని పై వారికి (పెద్దోళ్లకి) రిపోర్ట్ ఇచ్చేవారు. దీంతో ఇకపై ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏం చేయాలా అని పెద్దోళ్లు ఆలోచనలో పడేవాళ్లు. ఇలాంటి ఆలోచనల వల్లనే ఏటికేడు పరీక్షల సీజన్‌లో మాపై విధించే షరతుల జాబితా పెరిగిపోతుండేది.

‘ప్రాక్టికల్స్ – సినిమా’ అనే ఈ సౌకర్యం టెన్త్ దాకా ఉండదు కదా. అందుకే డౌట్స్ ఉన్నాయంటూ ప్రెండ్స్ ఇంటినో , టీచర్ ఇంటికనో చెప్పి బయటపడి మ్యాట్నీకి చెక్కేసే వాళ్ళం.

హక్కుల కోసం పోరాటం:

ఇంట్లో ఎగ్జామ్ సెక్షన్ అమల్లో ఉన్న రోజుల్లో ఇదిగో, రాధాగాడు గోళీలు తేవడానికి అందునా అటక మీద దాచిన గోళీల డబ్బాని దించడానికి ఇంట్లోకి వెళ్ళాడు.

పరీక్షలు వచ్చాయంటే చాలు గోళీలే కాదు, ఖాళీ సిగరెట్ ప్యాకెట్ ముక్కలు, కర్రా బిళ్లా వంటి ఆటల పరికరాలనే కాదు, పాటలు పాడే ట్రాన్సిస్టర్ రేడియో పెట్టెని కూడా మాకు అందుబాటులో ఉంచే వాళ్లు కారు. ఇదంతా మా హక్కులను హరిచడంలా అనిపించేది. లాభం లేదు, పోరాటం చేయాలి.

‘పోరాడితే పోయేదేమీ లేదు’ అనో, ‘అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు’ అనో.. ఇలాంటి స్లోగన్స్ చేస్తూ కమ్యూనిస్టు కుర్రాళ్లు అప్పుడప్పుడు వీధుల్లో తిరుగుతుండేవారు. ఇవి వింటుంటే నాకు కూడా ఆవేశం కమ్మేసేది. అయితే ఆవేశం కంటే ఆలోచన అనేదే బాగా పనిచేస్తుందనే ఇదిగో రాధా గాడిని గోళీల డబ్బా తెమ్మనమని చెప్పాను. పరీక్షలకు చదువుకోవాలి. ఈ విషయంలో రాజీ లేదు. అలా అని గోళీలతో కాసేపన్నా ఆడుకోవాలి. ఇక్కడా రాజీ ఉండకూడదు. కానీ, ఎలా.. కిమ్ కర్తవ్యం?? ఇలా ఆలోచిస్తుంటేనే తట్టింది మెరపు లాంటి ఆలోచన. అందుకే గోళీల డబ్బా తెమ్మనమని రాదా గాడికి పురమాయించాను. చూద్దాం, నా వ్యూహం ఎలా ఫలిస్తుందో..

ఫలించిన వ్యూహం:

రాధా గాడు పిల్లిలా ఇంట్లోకి దూరాడు. మధ్యాహ్నం భోజనాలు కానిచ్చి నడుం వాల్చే సమయం. ఏ మాత్రం అలికిడి కాకుండా అటకెక్కి చిటికెలో గోళీల డబ్బాతో క్రిందకు దిగి, చప్పుడు కాకుండా నేను చదువుకుంటున్న గదికి వచ్చేశాడు. వాడి ముఖంలో విజయగర్వం తొణికిసలాడుతోంది. కాదా మరి, ఇదేమన్నా చిన్నాచితకా విజయమా ఏంటి. నేను వాడి భుజం తట్టాను. వాడేమో పొంగిపోయాడు. నా ముఖం కూడా విజయగర్వంతో పొంగింది అనుకోండి. ఎందుకంటే ఏ గోళీలను చూస్తే పిల్లగాళ్ల చదువులు సాగవని ఇంట్లో వాళ్లు అనుకుంటూ వాటిని అటకెక్కించారో అవే గోళీలను నేర్పుగా నా వద్దకు రప్పించ గలిగానంటే నా వ్యూహ రచన చూసి నేనే పొంగి పోవాలి కదా. అందుకే నా కుడి చేయి అరచేతిని ఎడమ భుజం పైన తడుతూ ‘శహబాష్ రా’ – అని నాకు నేనే పొగుడుకున్నాను. రాధా గాడు నా వైపు అదోలా చూశాడు.

కాసేపయ్యాక వాకిట ప్రక్కన ఉన్న గదిలో గోళీల చప్పుడు విని మా అక్క నెమ్మదిగా వచ్చి తలుపు తీసి చూసింది. అక్కడున్న దృశ్యం చూసి కంగుతిన్నది. తినదా మరి..

నిజానికి మేమప్పుడు గోళీలతో ఆడుకుంటూనే చదువుకుంటున్నామన్న మాట. ఈ రెండూ ఒకే సారి ఎలా సాధ్యమంటారా..

రెండవ పానిపట్టు యుద్ధం గురించి నేను సోషల్ బుక్ లోని పాఠం బిగ్గరగా చదువుతున్నాను. నాలుగైదు లైన్లు చదివాక అందులో ఉన్న సారాంశానికి తగ్గట్టుగా గోళీలతో సీన్ క్రియేట్ చేసేవాళ్లం.

ఏ యుద్ధమైనా రెండు వర్గాలుంటాయి. చరిత్రలోనైతే ఇద్దరు రాజుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి కదా. నా వద్ద ఉన్న గోళీలను రంగుల వారీగా విభజించడం రాధాగాడి పని. వాడా పని బాగానే పూర్తి చేశాడు. నీలం రంగు గోళీలను అక్బర్ సైన్యంగా ఒక వైపున ఉంచాము. అందులో నీలం రంగు పెద్ద గోళీ అక్బర్ అన్న మాట. రెండో వైపున హేమచంద్ర విక్రమాధిత్య. ఎరుపు రంగున్న గోళీలు, పసుపు రంగు గోళీలు ఇలా ఇంకా మిగిలి ఉన్న ఇతర రంగు గోళీలన్నీ హేమచంద్ర వైపు నిలబెట్టాము. ఇందులో కూడా బాగా పెద్దగా ఉన్న ఎరుపు రంగు గోళీనే హేమచంద్ర విక్రమాధిత్య అన్న మాట.

మా రాధా గాడు ‘ఒరేయ్, యుద్దం మొదలు పెట్టనా..’ అంటూ అప్పటికే నాలుగైదు సార్లు అడిగాడు. ‘ఆగాగు, ఓ రెండు పేరాలు చదవనీ, అప్పుడన్న మాట యుద్ధం’ అంటూ ఆపాను వాడిని.

సరే, పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో హేమచంద్ర విక్రమాదిత్య మరణించాడని అని తెలియగానే ‘యుద్ధం మొదలెట్టు’ అంటూ అరిచాను. ఆ అరుపుకే ఇంట్లో వాళ్లు లేచినట్లున్నారు. మెల్లగా ఒకరొకరు గది గుమ్మం దగ్గరకి చేరారు. రాధా గాడు ఎర్ర గోళీలను నీలం గోళీలతో కొడుతున్నాడు. నేనేమో నీలం గోళీలతో ఎర్ర గోళీలను చితక్కొడుతున్నాను. ఇద్దరం చెరో పక్షం చేరిపోయాము. ఆవేశాలు మిన్నంటాయి. యుద్దం జోరుగా సాగింది. కొన్ని గోళీలు నిజంగానే పగిలిపోయాయి.

అప్పుడు అడ్డం తగిలింది మా అక్క.

‘చాల్లే ఆపండిరా మీ ఆటలు. నాన్న చూశారంటే అరుస్తారు’

‘ఆటలు కావే అక్కా, చదువే’ – అన్నాను నేను.

‘అవునక్కా, చదువే’ వంత పాడాడు రాధాగాడు.

ఇంతలో అమ్మా, బామ్మ కూడా అక్కడికి చేరి మేము సృష్టించిన యుద్ధ సన్నివేశాన్ని చెల్లా చెదురు చేశారు. అక్కేమో గోళీలన్నింటినీ నిర్దాక్షన్యంగా డబ్బాలోకి తోసేసి డబ్బాతో లోపలకు వెళ్ళిపోయింది.

‘ఏమే, ఇంతకీ వీళ్లు చదువుకుంటున్నారా.. ఆడుకుంటున్నారా..?’

బామ్మ అడిగిన ప్రశ్నకు అమ్మకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.

అసలు ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా చాలా కాలానికి కూడా దొరకలేదు. ఆకతాయితనంతో చదువులో ఆటను చేర్చేశాను. కానీ ఇదో రకం ఎడ్యుకేషన్ అని ఇప్పుడిప్పుడు మా మనవళ్ల చదువులు, ఆ స్కూళ్ల వాతావరణం చూస్తుంటే నాకనిపిస్తోంది. ఆ రోజుల్లోనే నేనో గొప్ప విద్యా సంస్కరణవేత్తనన్న మాట. ఇది మరీ ఓవర్‌గా ఉంటే ఇంకో పదం ఏదైనా అనుకోవచ్చు మీరు.

గోళీల ఆట – నాటక రచన:

ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదన్నట్లుగానే ఆట పాటల్లా చదువు సాగుతుంటే ఆ చదువు పట్ల ఆసక్తి కలుగడం ఖాయం. ఈ గోళీల చదువు వల్ల నాకు భవిష్యత్తులో అనేక లాభాలు కలిగాయి. అందులో ప్రధానంగా నాటక రచన బాగా సాగించగలగడం. తెలుసుకున్న విషయాన్ని డ్రమటైజేషన్ చేయడం ఓ కళ అని అప్పట్లో నాకు తెలియదు. విజయవాడ ఆకాశవాణి వారికి ఓర్పు-సహనం అన్న టాపిక్ మీద రూపకం వ్రాశాను. అందులో ఓ చోట మహాభారతంలోని సంఘటనను డ్రమటైజ్ చేశాను.

అశ్వత్థామ రాత్రి వేళ ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. ఆ విషయం తెలుసుకుని పాండవులు అశ్వత్థామను బంధించి విలపిస్తున్న ద్రౌపది ముందు నిలబెడతారు. అప్పుడు ద్రౌపది అన్న మాటలను ఈ నాటకీకరణలో హైలెట్ చేశాను.

ద్రౌపది అంటున్నది..

‘అశ్వత్థామా, నీవు గురు పుత్రుడివి. పైగా బ్రాహ్మణుడివి. నాకు కుమారుడితో సమానం. అయినా ఏమాత్రం దయలేకుండా నా బిడ్డలను చంపేశావు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పిల్లలను చంపడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీలోని ఓర్పు, సహనం ఏమయ్యాయి? పుత్ర శోకంతో గుండెలు పగిలిపోతున్న నాలాగానే నీ తల్లి కూడా అర్జునుడికి బంధీవైన నిన్ను గురించి గుండెలు పగిలేలా విలపిస్తుంటుంది. కనుక నాకు కలిగినట్లుగా ఆ తల్లికి గర్భశోకం కలగకూడదు, అర్జునా, వీడిని విడిచి పెట్టండి’ ఈ సీన్‌తో రూపకం ముగుస్తుంది. విన్నవారు బాగుందని అన్నారు.

గోళీలను ఎప్పుడు చూసినా నాకెందుకో విశ్వదర్శనం కలిగినట్లు ఫీలయ్యే వాడిని. ఈ భూమి ఓ పెద్ద గోళీ. అంతకన్నా పెద్ద గోళీలు మరి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సూర్యుడు అనే మండుతున్న గోళీ చుట్టూ తిరుగుతుంటాయి. విశ్వంలో ఇలాంటి గోళీలు కోకొల్లలు. నేనూ రాదా గాడు ఇంట్లోని ఓ గదిలో కూర్చుని గోళీలతో చదువుకుంటూ ఆడుకున్నట్లుగానే ఈ విశ్వం అనే గదిలో గోళీలతో ఆ భగవంతుడు (శక్తి స్వరూపుడు) ఆడుకుంటున్నాడు. ఇలా సాగేవి నా ఆలోచనలు.

శ్రీ షిర్డీ సాయిబాబా మహత్మ్యం చిత్రంలోని ఒక పాట గుర్తుకు వస్తున్నది. అందులో ఓ చోట..

‘గోళీల ఆటల్లో

కొండంత సత్యం

చాటావు ఓ సాయి

మమ్ము సాకావు

మా సాయి’-

అంటూ సాగుతుందీ ఆ పాట. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి విశ్వరూప దర్శనం చేయిస్తాడు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూసినప్పుడు నాకు మా గోళీల ఆటే గుర్తుకు వచ్చేది. గోళాల్లాంటి గ్రహాలు అనేకం తిరగాడటం విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు కూడా గోళీల మాదిరిగానే ఉంటాయని యాస్ట్రానమీ చదువుతున్నప్పుడు నాకర్థమైంది. శ్రీ కృష్ణావతారం లాంటి సినిమాలు చూసినప్పుడు మేము ఆడిన గోళీల్లో ఇంత సత్యం (నాలెడ్జ్) ఉన్నదా అనిపించేది.

‘గోళీ’కి నివాళి:

చాలా కాలం మంచి మిత్రుడిగా ఉన్న రాథాగాడు ఉన్నట్లుండి కనబడటం లేదు. ఆరా తీస్తే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది.

అప్పుడు నేను ఆంద్రప్రభలో ఉద్యోగం చేస్తున్నాను. చదువు అయ్యాక, ఉద్యోగాల వేట అయ్యాక ఆంధ్రప్రభలో స్థిరపడి పెళ్ళి చేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న నేను అడపాదడపా నందిగామ వెళ్ళేవాడిని. కొత్త మిత్రుల రాకతో చిన్ననాటి స్నేహితుల గురించి నిత్యం ఆలోచించే తీరిక లేకుండా పోయింది. పైగా జర్నలిస్ట్ ఉద్యోగం, అది కూడా డెస్క్ ఉద్యోగం అంటే చీటికీ మాటికీ సెలవులు పెట్టడం కుదిరే పని కాదు. ఆఫీస్‌లో మనకు అప్పగించిన బాధ్యతల నుంచి అంత తొందరగా తప్పించుకుని పోయేందుకు వీలు లేదు. ప్రతి నెలా కాకపోయినా ఆరు నెలలకొకసారి నందిగామ వెళుతుండే వాడ్ని. అలా ఒకసారి వెళ్ళినప్పుడు రాథాగాడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసింది. నా మనసు బాధతో మూలిగింది.

అంతకు ముందు ఓ సారి వినాయక చవితి పండుగకి ఊరెళ్ళినప్పుడు పొద్దున్నే పత్రి, పూలు కొనడానికని బజారుకు వెళితే వాడు.. రాథాగాడు పొడవాటి అగరబత్తీలు, కలవ పూలు వంటి పూజా సామాగ్రిని నేల మీదనే పరిచి అమ్ముతూ కనిపించాడు.

‘ఇదేంట్రా?’ అడిగాను.

వాడు అదోలా నవ్వాడు.

నాకు అర్థం కాలేదు.

ఆ తర్వాత మిత్రులు కొందరు చెప్పారు. వాడి పరిస్థితి బాగోలేదని. వాడికి పెళ్ళయింది. ఉద్యోగం లేదు. చదువు సరిగా అబ్బలేదు. నాతోపాటు చదివినా ఇంటర్ దాటలేకపోయాడు. సంసార రథం ఈడ్చలేకపోతున్నాడట.

ఆ తర్వాత ఇదిగో ఇలా వాడి మరణ వార్త తెలిసింది. అంతవరకు పళ్లెంలో గిరగిరా తిరగాడిన గోళీ ఆగిపోయినట్లు అనిపించింది. సర్కస్‌లో బావిలో గిరగిరా తిరిగే మోటార్ సైకిల్ ఫీట్ చేసే వాడు ఉన్నట్లుండి పడిపోయినట్లు అనిపించింది. కళ్లు చెమ్మగిల్లాయి. ఈ అమాయకుడ్ని ఏ శక్తీ కాపాడలేకపోయిందేమిటా- అని ఇప్పటికీ బాధ పడుతుంటాను.

సర్లేండి, ఈ బరువైన సంఘటన నుంచి తేలికైన సంఘటనకి తీసుకువెళతాను. పదండి.

సరదా సరదా సిగరెట్:

సిగరెట్ త్రాగడం ఓ ఫ్యాషన్. సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని తిరగడం ఓ స్టైల్. 70వ దశకం రోజుల్లో బర్కిలీ సిగరెట్ కంపెనీ వారి వ్యాపార ప్రకటన నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఎస్వీ రంగారావు ఎంతో హుందాగా కూర్చుని నల్ల కళ్లజోడు పెట్టుకుని నోట్లో తెల్లటి సిగరెట్ పెట్టుకుని ఉంటాడు. పెట్టె మీదనే ఎస్వీఆర్ చెప్పినట్లు ఓ కొటేషన్..

‘బర్కిలీ త్రాగడం నాకు మహదానందదాయకం. దానిలో ఉండే పొగాకు కమ్మని రుచి కలిగి.. సాఫీగా ధారాళమైన పొగ నిస్తుంది’

ఇలా సాగుతుంది ప్రకటన. పైనేమో – ‘చిత్ర రంగపు ఎన్నిక బర్క్‌లీ’ అని పెద్దక్షరాలతో రాసి ఉంటుంది. ఆ రోజుల్లో సినిమా అంటే ఎన్టీవోడు, ఏఎన్నారోడు, ఎస్వీ వోడు. అంతే. సిగరెట్ ప్యాకెట్ల మీద ‘కమ్మని రుచి’, ‘ధారాళమైన పొగ’ వంటి మాటలు ఉండేవే కానీ, ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’, ‘క్యాన్సర్ కారకం’ వంటి హెచ్చరికలు ఉన్నట్లు నాకేతై గుర్తులేదు. అలాంటి రోజుల్లో పిల్లాడు కుర్రాడిగా మారడం ఆలస్యం ఈ సిగరెట్ పొగ, వాసన ఆకట్టుకునేవి. సిగరెట్ పెట్టెల రంగులు, హంగులు నా బోటి పిల్లలను ఆకర్షించేవి. ఆ రోజుల్లోనే పొగరాయుళ్లు తాగి పడేసిన ఖాళీ సిగరెట్లు ప్యాకెట్లు ఏరుకోవడం మాకో పెద్ద హాబీ. ఈ సిగరెట్ పెట్టెలు ఎంత ఆకర్షనీయంగా ఉండేవో. రకరకాల రంగుల్లో సిగరెట్ పెట్టెలు.

నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ప్రెండ్స్‌తో కలిసి ఖాళీ సిగరెట్ పెట్టెలు ఎక్కడైనా కనబడితే వాటిని భద్రంగా తెచ్చుకుని దాచుకునే వాడ్ని. ఆ తర్వాత తెలిసింది. ప్రతి ఖాళీ సిగరెట్ పెట్టెకి ఆటల్లో కొన్ని పాయింట్లు ఉంటాయి. బచ్చాల ఆటల్లో కూడా ఈ ప్యాకెట్ ముక్కలు ఉపయోగపడేవి. సిగరెట్ పెట్టెల ముక్కలు, వాటిలో ఉండే తళుకు పేపర్లు ఇవన్నీ బచ్చాల ఆటలో పెట్టి ఆడేవారు. అందుకోసం ఖాళీ సిగరెట్ పెట్టెలు సేకరించేవారు. అలా డిమాండ్ పెరిగేది. నేను బచ్చాల ఆట ఎక్కువగా ఆడలేదు. కానీ నా దగ్గరున్న ఖాళీ సిగరెట్ పెట్టెలను బచ్చాల ఆట ఆడేవారు కొనుక్కుని నాకేమో వారి వద్ద ఉన్న గోళీలు ఇచ్చే వారన్న మాట. డబ్బులున్నప్పుడు కొన్ని గోళీలు షాపుకెళ్ళి కొనేవాడ్ని.

గోగు పుల్ల – సిగరెట్:

ఇలా ఖాళీ సిగరెట్ పెట్టెలతో మొదలైన హాబీ నిదానంగా సిగరెట్ వాసన, పొగ వైపు ఆకర్షితలవుతుంటారు. కుర్రాడిగా మారి ఉద్యోగమో సద్యోగమో వచ్చాక చేతిలో డబ్పులు ఆడతాయి కాబట్టి దర్జాగా సిగరెట్ ప్యాకెట్లు కొని ఎస్వీఆర్ లాగా ఫోజులెట్టి త్రాగేయవచ్చు. కొత్తగా కుర్రాడైనవారికి ఆ సౌకర్యం ఉండదు కదా. అందుకే అప్పుడప్పుడు సరదా పడి గోగు పుల్లలో, కంది పుల్లలో ఇలాంటివేవో కాల్చి పొగ వదులుతుండేవారు. కానీ వాటి వాసన ఎస్వీఆర్ చెప్పినట్లు కమ్మగా ఉండదు కదా. దీంతో ‘ఇది కాదురా, మనం కూడా సిగరెట్ ప్యాకెట్ కొని కాల్చాలిరా’ అన్న ఆలోచనలు మొలిచేవి. డబ్బులు లేకపోయినా గ్యాంగ్ లీడర్ లాంటి వాడిని పట్టుకుంటే కొనిపెట్టి మనకు అలవాటయ్యాక తప్పుకుంటాడు. నేను ఆంధ్రప్రభలో పనిచేసినప్పుడు ఈ కమ్మటి వాసనకు బందీనయ్యాను. సిగరెట్‌తో ఆలోచనలు పదును తేలతాయనీ, మంచి మంచి హెడ్డింగ్‌లు పెట్టొచ్చని ఓ నమ్మకం గట్టిగా ఉండేది. మెదడులో ఆలోచనలను గిలక్కొడుతుందని ఎవరో చెబితే నమ్మేశాను. ఏది ఏమైనా సిగరెట్ త్రాగడం హానికరమే. అవగాహన లేక తప్పులు చేస్తుంటాము. అందుకే రాముడు – భీముడు సినిమాలో కొసరాజు గారు ఇలా వ్రాశారు..

‘సరదా సరదా సిగిరెట్టూ..
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే..
స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ..
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
హా.. కంపు గొట్టు యీ సిగరెట్టు..
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కడుపు నిండునా కాలు నిండునా..
వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు..
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ
లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున
మేఘాలు సృష్టించవచ్చూ…
మీసాలు కాల్చుకోవచ్చూ
సరదా సరదా సిగిరెట్టూ…
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే
కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
పసరు బేరుకొని కఫము జేరుకొని
ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ
హా.. కంపు గొట్టు యీ సిగరెట్టు..
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకు
ముక్కులు ఎగరేస్తారు..
వా.. నీవెరుగవు దీని హుషారు
అబ్బో..థియేటర్లలో
పొగ త్రాగడమే
నిషేధించినారందుకే..
కలెక్షన్లు లేవందుకే
సరదా సరదా సిగిరెట్టూ..
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు..
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కవిత్వానికి సిగిరెట్టు..
కాఫీకే యిది తోబుట్టు..
పైత్యానికి యీ సిగిరెట్టు..
బడాయి కిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు..
ఆలోచనలను గిలకొట్టు
వాహ్.. పనిలేకుంటే సిగిరెట్టూ..
తిని కూర్చుంటే పొగపట్టూ
రవ్వలు రాల్చే రాకెట్టూ…
రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ..
దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ
సరదా సరదా సిగిరెట్టూ..
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు..
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు’

(ఈ పాట మొత్తం ఇవ్వడానికి కారణం, ఈ వ్యాసం చదివే వారిలో కొందరిలోనైనా చైతన్యం కలిగిస్తుందని, ఈ చెడు అలవాటుకు స్వస్తి పలుకుతారన్న ఆశ.)

నిజమే కదా. సిగరెట్ త్రాగకూడదని తెలిసొచ్చింది. ఓ సారి కాస్తంత గుండె నొప్పి అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే, ‘సిగరెట్ మానలేరా..’ అంటూ సూటిగా అడిగాడు. ‘ఎందుకు మానలేను’ అంటూ సవాల్‌ని స్వీకరించాను. అంతే, గుడ్ బై టు సిగరెట్. ఆ తర్వాత సిగరెట్ పెట్టెల గురించి గానీ, వాటి అందచందాల గురించి కానీ, వాటితో చిన్నప్పుడు గోళీలు కొనుక్కునే వాడినని గానీ ఎప్పుడూ గుర్తుకు రాలేదు. ఇదిగో ఇది వ్రాయడం మొదటుపెట్టడంతో ఈ సంఘటనలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి అంతే..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version