Site icon Sanchika

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-15

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

‘జై ఆంధ్రా బ్యాచ్’:

‘జై ఆంధ్రా’ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలం లోనే టెన్త్ క్లాస్ చదువుతూ పరీక్షలు వ్రాసిన వాళ్లలో నేనూ ఒకడ్ని. మమ్మల్ని ‘జై ఆంధ్రా బ్యాచ్’ అంటుండేవాళ్లు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది చదువులు పాడైపోయాయి. నాబోటి వాళ్లు అదృష్టవశాత్తు గండం గట్టెక్కినట్లు పాసయ్యాము. ఎంతోమంది విద్యార్థులు ఉద్యమం ఫలితంగా మరణించారు. పోలీస్ కాల్పులు, లాఠీ చార్జ్‌లు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, రాజకీయ వ్యూహాల్లో చిక్కుకోవడాలు.. ఇలా ఎన్నో కారణాలతో ఆనాటి యువత ప్రధానంగా విద్యార్థులు నలిగిపోయారు.. నష్టపోయారు. 1972, 73 సంత్సరాలు నాకు ఎంతో గడ్డు కాలం. ఎందుకంటే మూడు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అమ్మ ఆరోగ్యం క్షీణించింది. తెలుగు మీడియంలో అంతంత మాత్రం చదువులు, జై ఆంధ్రా ఉద్యమ ప్రభావం. అందుకే ఈ మూడు అంశాలతో లింకైన విషయాలను ఈ భాగంలో చెబుతాను. ముందుగా, నేను టెన్త్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నప్పటి సంఘటన గుర్తు చేసుకుంటున్నాను.

టెన్షన్:

ఒకటే టెన్షన్. పరీక్ష ఫలితాలు ముద్రించిన పేపర్ చేతిలో ఉన్నా చూడలేనంత టెన్షన్. చేతులు వణుకుతున్నాయి. చెమటలు పట్టేస్తున్నాయి. నా అవస్థ చూసి మా అక్క నా చేతిలోని పేపర్ లాక్కుంది. నిజానికి అది కూడా నాతో పాటే టెన్త్ వ్రాసింది. ఒకటి రెండు సార్లు గట్టిగా పునాది ఉండాలని చదివిన క్లాస్‌లో మళ్ళీ చదివింది లేండి. అందుకే కలిసి ఒకేసారి టెన్త్ వ్రాశాము. నేను ఏడవ తరగతి పాసై ఎనిమిదవ తరగతిలోకి వచ్చాకనే ఏడవ తరగతికి కామన్ పరీక్ష అంటూ రూలొచ్చింది. సెవన్త్ పాసైతే చాలు ఎనిమిది, తొమ్మిదవ తరగతుల్లో తప్పడం అనేదే ఉండదు. మళ్ళీ పదవ తరగతిలోనే పబ్లిక్ ఎగ్జామ్ అన్న రూల్‌ని బ్రహ్మానంద రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్టారు. గుంటూరులో ఏడవ తరగతి చదివేసి, పాసై ఎనిమిదవ తరగతి నుండి టెన్త్ వరకు నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాను. రేకుల షెడ్ లాంటి గదుల్లో టెన్త్‌కి నాలుగు సెక్షన్లు నడిపేవారు. వాటిలో రెండేమో (ఏ సెక్షన్, బి సెక్షన్) కాంపోజిట్ మాథ్స్ ఎంచుకున్న విద్యార్థుల కోసం. మిగతా రెండు జనరల్ మేథమెటిక్స్ ఎంచుకున్న విద్యార్థుల కోసం. మా అక్కేమో జనరల్ మాథ్స్. నేనేమో కాంపోజిట్ మాథ్స్. ‘బెల్ట్ మాష్టారు’ భాగంలో చెప్పినట్లుగా భూపతి రావు మాష్టారు సెగ మాకు తగిలిందే కానీ అక్కకి తగల్లేదు. ఆ టెన్షన్ నుంచి అది తప్పించుకుంది. నేను టెన్త్ పబ్లిక్ పరీక్ష ఎలా వ్రాశానో, అందునా మాథ్స్ రెండు పేపర్లు ఎలా వ్రాశానో ఇంతకు ముందే చెప్పాను కదా. లెక్కల్లో, హిందీలో పాసవుతానా లేదా అన్నదే పెద్ద కొశ్చిన్ మార్క్. ఇదిగో ఇప్పుడేమో రిజల్ట్స్ వచ్చేశాయే మరి.

అక్క నా చేతిలో ఉన్న పేపర్ లాక్కుని మా నెంబర్లు చూడాలనుకుంది, కానీ పాపం అదీ కంగారు పడుతూనే ఉంది. ఫలితాలు చూసుకునేటప్పుడు మేము నందిగామలో లేము. విశాఖపట్నంలో ఉన్నాము. ఏదో సరదాగా సమ్మర్ టూర్‌కి వెళ్లలేదు.

అమ్మ – అనారోగ్యం:

మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. మేము తొమ్మిది, పది తరగతులు చదువుతున్నప్పుడు అమ్మ ఎక్కువగా మంచానికి అంటిపెట్టుకునే ఉండేది. పెంకుటిల్లు. గాలి వెలుతురు బాగానే ఉండేవి. హాలు మధ్యలో మంచం మీద పడుకుని ఉండేది అమ్మ. మా నాన్నగారిది బదిలీల ఉద్యోగం అని గతంలో చెప్పాను కదా. ఆయన గారు నందిగామలోనే రిటైర్ అవ్వాలన్న తపనతో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. దీనికంటే ముందు గుంటూరులో పనిచేస్తున్నప్పుడే అమ్మ ఆరోగ్యం మొదటిసారిగా దెబ్బతింది. ఓ రోజు ఉన్నట్లుండి రక్త విరేచనాలు అయ్యాయి. క్రమంగా రోగం ముదిరింది. ఒక దశలో బక్కెట్ల కొద్దీ బ్లడ్ పోయేది. ఇదంతా చూసి మేము కంగారుపడేవాళ్ళం. అమ్మ రోజురోజుకీ నీరసించి పోతున్నది. వైద్యం మొదలైంది. మందుల ప్రభావంతో కాస్త నయమైంది. ఈలోగా నందిగామ వచ్చేశాము. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. ఊర్లో అప్పటికే స్థిరపడిన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పాండురంగారావు గారికి చూపించి మందులు వాడుతున్నారు. అయినా నాలుగు రోజులు బాగుంటే మూడు రోజులు మంచానికే అంటిపెట్టుకునేది. ఆమెను పరామర్శించడానికి రోజూ ఎవరో ఒకరు వస్తుండేవారు.

ఊర్లో మాకు బంధువులు ఎక్కువే. ఇంట్లో వంటావార్పు అయిపోయాక భోజనాలు గట్రా చేసేశాక తీరుబడిగా అమ్మలక్కలు మా ఇంటికి చేరేవారు. తలా ఒక మాట అనేవారు. ఈ మాటల తీరు ఎలా ఉండేవంటే, ధైర్యం చెప్పినట్లు కానే కాదు, భయపెడుతున్నట్లే ఉండేవి.

ఒకావిడ ఇంట్లోకి వస్తూనే ఏడుపు లంకించుకుంది. ఆమె వయస్సు 70కు పైమాటే. వితంతువు. ఆ రోజుల్లో వితంతువులు తెల్లటి చీర కట్టుకునేవారు. గుండుతో కనిపించేవారు. నుదిటిన విభూదీ గంధం వంటివి పెట్టుకునే వారే కాని కుంకుమ పెట్టుకోరు. చేతికి కడియం లాంటి బంగారు గాజు ఉండేది. అంతే కానీ ముత్తయిదువుల మాదిరిగా రంగురంగుల మట్టి గాజులు వేసుకునేవారు కారు. ఆ తర్వాత కన్యాశుల్కం వంటి సినిమాలు చూసి, ఇదో దురాచారమన్న మాట అని అనుకునేవాడ్ని. కానీ మొగుడు చనిపోగానే కుంకుమ, గాజులు తీసేయడం నాకెందుకో అప్పట్లో చాలా బాధ అనిపించేది.

మా ఇంట్లోకి వస్తూనే పెద్ద పెట్టున ఏడుస్తూ..

‘ఒసే, రాజ్యం (మా అమ్మని అలా పిలిచేవారన్న మాట) ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావే’

అప్పటికే అమ్మని ఓదార్చ డానికి వచ్చిన మరో పెద్దావిడ –

‘అవునే బుల్లెమ్మో (పేర్లు పలికేటప్పుడు దీర్ఘం తీయడం అలవాటు) వారం క్రిందటే కదా నేను చూడటానికి వచ్చింది. ఇంతలోనే బాగా చిక్కిపోయిందే పిచ్చి తల్లీ..’

‘అందుకే సెప్తుంటా, పట్నం తీసుకెళ్ళి చూపిస్తే బాగుండ్ను అని’

‘నిజమే కానీ మనం తూగొద్దూ’ (మన ఆర్థికంగా తూగుతామా లేదా అన్నది కుడా వాళ్లే డిసైడ్ చేస్తారన్న మాట)

‘అదీ నిజమే, బోలుడు ఖర్చు. పట్నంలో వైద్యమంటే మాటలా..’

‘ఇదిగో బుల్లెమ్మో నీకిది తెలుసా, సూరమ్మ లేదూ, అదేనే మా దూరపు చుట్టం, ఆవిడ, చిక్కి శల్యమై మొన్నీమధ్యనే పోయింది.’

‘అవునా, దుక్కలా ఉండేది కదా, ఆ మహాతల్లి నాకెందుకు తెలియదు, గిన్నెడు అన్నం తనొక్కితే తినేదిగా, ఆ.. అయినా ఏం లాభంలే, ఏ చేతబడో చేసుంటారు. అది మామూలు రోగం అయిండదులే, మాయదారి రోగాలకు మందులేముంటాయి చెప్పు. ఇంతకీ ఆవిడ పోయి ఎన్నాళ్లయిందేం, నాకు కార్డు ముక్క రాలేదేమిటే చెప్మా..’

ఇలాంటి కబుర్లు వింటూ మంచం మీద అమ్మ ఇంకా దిగులు పడేది. చేతబడి, దెయ్యాలు పట్టడం వంటి మాటలతో హడలెక్కించేవాళ్లు. రక్ష రేకు కట్టించుకోమనేవాళ్లు ఒకరు, విభూది పెట్టి వెళ్ళేవారు మరొకరు. రోగం కంటే ఇలాంటి కబుర్ల వల్ల పేషెంట్ మానసిక స్థితి మరింత దిగజారుతుందని నాకు తెలిసినా చెప్పే ధైర్యం లేదు. ఇంకా, వీళ్లంతా ఎలాంటి వాళ్లంటే..

ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆ మనిషి పోయినట్లే భావించి, ముందస్తు ఏర్పాట్ల గురించి ఆలోచించేవారు. ఇంటి దగ్గరకి శవాన్ని తీసుకు వచ్చే లోపే ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న ప్లానింగ్‌లో ఉండేవారు. ‘ఇదేమిటమ్మా?’ అని అడిగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు, ఒకవేళ ఎవరైనా అడిగితే, ‘చూడు బాబూ, ఇంటికి శవం చేరాక ఎక్కువ సేపు ఉంచుకోం కదా, అప్పటికప్పుడు అన్నీ సమకూర్చుకోవడం ఎంత కష్టం’ అంటూ ఇదంతా తమ అనుభసారం, నీకేం తెలియదు పిల్ల కాకి అన్నట్లు చూసేవారు. ఇంతటి దారుణ మనస్తత్వం పేరుకు పోయేది ఆ రోజుల్లో.

తొలి శుభకార్యం:

ఇంట్లో ఇలాంటి మాటలతో అమ్మ ఆరోగ్యం మరీ పాడైంది. ఇంట్లో ఒక్క శుభకార్యమన్నా చేయకుండానే పోతానేమో అన్న భయం ఆమెను ఆవహించింది. నాన్నకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆలోచించారు. ఫలితంగా అన్నయ్య ఉపనయనం. ఇదే మా ఇంట్లో జరిగిన తొలి శుభకార్యం కావడంతో కాస్తంత అట్టహాసంగానే జరిగింది. అమ్మని ఇంతగా భయపెట్టిన అనారోగ్యం విశాఖలో జరిగిన ఆపరేషన్‌తో తొలిగిపోయింది. ఆ తర్వాత దాదాపు 13 సంవత్సరాల దాకా అమ్మ హాయిగా ఉంది. పిల్లల పెళ్ళిళ్లు చూసింది. మనవరాళ్లను, మనవళ్లను చూసింది. మా పెళ్ళయ్యాక శ్రీదేవి గర్భవతి అని తెలుసుకుని ఎంతో ఆనందించిన తర్వాత మరో మారు అనారోగ్య సమస్యతో విజయవాడ ఆస్పత్రిలో చేరి కన్ను మూసింది. ఆ తర్వాత మనవడు పుట్టాడు. అమ్మ పేరు కలిసి ఉండేలా వాడికి రాజేష్ అని పేరు పెట్టుకున్నాము. అమ్మ (వాడికి బామ్మ) దయతో వాడు ఆనందకరమైన జీవితం గడుపుతున్నాడు.

సరే విశాఖలో కెజీహెచ్ ఆస్పత్రిలో అమ్మకి శస్త్రచికిత్స జరిగింది. అంతకు ముందు, నందిగామ డాక్టర్లు కూడా అమ్మని పెద్ద ఆస్పత్రిలో చేర్చమని చెప్పారు. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ముందుగా అమ్మను చేర్చాము. అయితే అక్కడి పరిస్థితులు బాగోలేక పోవడంతో చిన్న మామయ్య (డాక్టర్ కె. సత్యనారాయణ రావు) సూచన మేరకు అమ్మను ఆ రోజుల్లో కారు మాట్లాడుకుని విశాఖపట్నం చేర్చాము. అమ్మతో పాటు నాన్నగారు, అక్క, నేను బయలుదేరాము.

రైల్లో అమ్మ చేతి ముద్దలు:

విశాఖపట్నం వెళ్లడం అది రెండోసారి. అంతకు ముందు మామయ్య పెళ్ళికి రైల్లో విశాఖ వెళ్ళాము. అప్పుడైతే బలే సరదాగా ప్రయాణం సాగింది. బంధువులమంతా రైలెక్కి వెళ్లడం, అమ్మ, పిన్ని మా అందరికీ గోంగూర పచ్చడి కలిపిన అన్నం, కందిపొడి ఆవకాయ కలిపిన అన్నం ముద్దలుగా చేసి చేతికి అందించారు. రైలు అటూ ఇటూ ఊగుతుంటే దానికి తగ్గట్టుగా మేమూ ఊగుతూ ఇలా చేతిలో పెట్టిన ముద్దలు తినడం బలే తమాషాగా ఉండేది. అలా ఆ ప్రయాణంలో పిల్లల చేతిలో అన్నం ముద్దలు పెట్టిన అమ్మ ఇప్పుడు ఈ ప్రయాణంలో నీరసంగా పడుకుని ఉంది. అమ్మ చేతి వంక చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు.

వెనక సీట్లో బలహీనంగా నీరసంగా మూలుగుతూ పడుకుని ఉంది. అమ్మకు అసలు ఏమైందీ? విశాఖ తీసుకెళితే నయం అవుతుందా? ఇలాంటి ఆలోచనలతో ప్రయణం సాగుతూ తెల్లారాక కారు ఊరు చేరింది. ఆలస్యం చేయకుండా చిన్న మామయ్య అమ్మని కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. ఇది బ్రిటీష్ కాలం నాటి బిల్డింగ్‌లో ఉంది. పెద్ద భవంతి. మా ఊర్లో లాగా చిన్నా చితక ఆస్పత్రి కాదని తెలిసింది. లోపలకు వెళుతుంటేనే ఆశ్చర్యంగా ఉండేది. తెల్లటి దుస్తులు ధరించిన నర్సులు, అంతే తెల్లటి కోటు, మెడలో స్టెతొస్కోప్ వేసుకున్న డాక్టర్లు హడావుడిగా తిరగడం చూస్తుంటే ఏదో సినిమా చూసినట్లు ఫీలయ్యాను. అమ్మకి ఆపరేషన్ చేశారు. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయట. అవి మాకూ చూపించారు. ఈ రాళ్లేమిటీ, అమ్మ కడుపులో ఉండటమేమిటీ..! అంతా ఆశ్చర్యమే. బియ్యం ఏరుతూ అప్పుడప్పుడు అమ్మ చేటలోని మట్టి గడ్డలను నోట్లు వేసుకోవడం నాకు తెలుసు. అలా లోపలకు పోయిన గడ్డలే ఈ స్టోన్స్ అని నేను గట్టిగా నమ్మేశాను. వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అలా చిన్న మామయ్య ఇంట్లో ఉన్నప్పుడే టెన్త్ పరీక్ష ఫలితాలు తెలిశాయన్న మాట. మా నెంబర్లు ఉన్నాయో లేవో చూడటానికి అక్క కూడా కంగారు పడుతుంటే చిన్న మామయ్యే పేపర్ లాక్కుని మా ఇద్దరి నెంబర్లు చూశాడు. మొదట ఫస్ట్ క్లాస్‍లో.. ఊహూ లేవు. తర్వాత సెకండ్ క్లాస్‍లో.. ఊహూహూ లేవు. ఏమిటో మా మామయ్యకు మా మీద అంత నమ్మకం అని నేను మనసులో అనుకుంటుండగా మామయ్య మా వైపు తిరిగి, ‘ఒరేయ్, మీకు ఏ స్వీట్ అంటే ఇష్టంరా.. చెప్పండి’ అన్నాడు. ఇద్దరూ పాసయ్యార్రా అని ముక్తాయింపు ఇచ్చాడు. థర్డ్ క్లాస్‌లో అన్న మాట. నాకైతే ఏనుగు ఎక్కినంత సంబరం వేసింది. అదే మా ఊర్లో ఉండి ఉంటే రయ్యిన వీధుల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్‌కి గర్వంగా చెప్పేసే వాడ్ని. కానీ ఇది మనూరు కాదు కదా.

‘ఏ స్వీట్ కావాల్రా’ అని మామయ్య అనగానే నాకు హల్వా గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు స్వీట్ బండి వాడు రావడం, నేనేమో పది పైసలకి హల్వా చేతిలో పెట్టించుకోవడం 10వ భాగం (గోరింట పూసింది) లో చెప్పాను కదా.

నా ఫేవరేట్ స్వీట్ హల్వా. ఆ తర్వాత బూందీ మిఠాయి. ఇది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా తిరనాళ్లూ, పండుగలప్పుడు గుడికి వెళితే బయట మిఠాయి దుకాణాలు బోలెడు కనిపించేవి. ఇప్పట్లా స్టాల్స్‌లా పెట్టి అమ్మకపోయినా ఓ నులక మంచం వేసి దాని మీద పళ్లాల్లో మైసూర్ పాక్ ముక్కలు, హల్వా, బూందీ, కట్టె మిఠాయి, లడ్డూలు, గవ్వలు, జిలేబీ చుట్టలు – ఇలాంటివన్నీ అమ్మేవారు.

సరే, నేను హల్వా అనగానే మా మామయ్య నవ్వేశాడు. నాకు కోవా బిళ్లలు కాకుండా మరో రకమైన కోవా తీసుకు వచ్చాడు. అసలు కోవాలో ఇన్ని రకాలుంటాయని నాకు తెలియదు. తింటే బలేగా ఉంది. తిన్నానే కానీ దాని పేరు తెలియదు. కలాకండ్ అన్న పేరు నా పెళ్లయిన తర్వాతనే మా ఆవిడ ఇంట్లో వారు చెబితే తెలుసుకున్నాను. ఏమిటీ వీడు మరీ ఇంత అమాయకుడా! అని ఆశ్చర్యపోతున్నారా..

అందుకే ఆ రోజే అత్తారింట్లోనే మనసులోనే గట్టిగా శపథం లాంటిది చేసుకున్నాను. ఎంత బొంబాయి వెళ్ళి ఎమ్మెస్సీ చేసినా ఏం లాభం, కలాకండ్ గురించీ, పేణీల గురించి తెలియనప్పుడు. లాభం లేదు, నేను మారాలి. నిజంగా మోడ్రన్‌గా మారాలి అనుకున్నాను. కానీ, ఇప్పటికీ నేను మారలేదు. నా చిన్నప్పటి తినుబండారాలు, ఆనాడు నేను చూసిన సినిమాలు, నాటకాలు ఇవే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాలం మారుతున్నదని తెలుసు. మారుతున్న మనుషుల పోకడలను నేను విమర్శించను. సమాజం నిశ్చలంగా ఉండదు, ఉండకూడదు కూడా. కాకపోతే జరిగినంత కాలం ఆ పాత జ్ఞాపకాల చుట్టూ తిరగాడుతుంటాను. ఇదే నా పోకడ.

పరువు తీసిన సీడ్ లెస్ కిస్మిస్:

పెళ్ళిచూపులు అయ్యాక రెండోసారో, మూడోసారో సరదాగా (ఆ మాత్రం సరదా ఉంటుంది కదా) మామగారి (మన్నవ గిరిధర రావు) ఇంటికి వెళ్ళినప్పుడు బావమరిది గుంటూరు శంకర్ విలాస్ సెంటర్‌కి తీసుకు వెళ్ళి అక్కడికి దగ్గర్లోని పండ్ల దుకాణంలో సీడ్‌లెస్ కిస్మిస్ తీసుకున్నాడు. ఇవెందుకు అంటే వీటిలో సీడ్ ఉండదు బావగారు అన్నాడు. నిజానికి నేనెప్పుడూ సీడ్‌లెస్ తినలేదు. అయితే ఆ మాట చెప్పకుండా, ‘సీడ్ ఉంటే మాత్రం ఏం, ఉమ్మెస్తే పోలా..’ అన్నాను, నేనేదో తెలివిగల వాడిలా. ఫక్కున నవ్వేశాడు. ఇప్పటికీ అత్తగారింట్లో నా మీద వేసే జోకుల్లో ఇదొకటి. ఏం చేస్తాం, అలా అడ్డంగా దొరికిపోయను.

సరే, మామయ్య స్వీట్స్ తెచ్చాడు. మా నోరు తీపి చేశాడు. అసలు పాస్ అవడమే గొప్ప అనుకుంటే ఇలా స్వీట్ ఇవ్వడం నాకెంతో ఆనందం కలిగించింది. ఇప్పట్లో లాగా రిజల్స్ నిమిషాల్లో చూడలేము. పేపర్లలోనే ఫలితాలు చూడాలి. చీమల బారులాంటి నెంబర్లు పేజీలకు పేజీలు నిండి ఉండేవి.

పరీక్షల ఫలితాల విడుదల అనగానే విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రప్రభతో పాటుగా మరికొన్ని పత్రికలు సాయంత్రానికల్లా స్పెషల్ ఎడిషన్స్ తీసుకు వచ్చేవి. పత్రిక ఫ్రింట్ అయ్యే కేంద్రాల్లో అయితే ఆ రాత్రికల్లా అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. దూరంగా ఉన్న ఊర్ల వాళ్లకు మర్నాడు ఉదయం ఫలితాలను ఈ పేపర్లు మోసుకెళ్లేవి. 1973లో నా టెన్త్ పరీక్ష ఫలితాలు విశాఖపట్నంలో చూసుకోవాల్సి వచ్చింది. అది కూడా మర్నాడు ఉదయం మామయ్య వాళ్లింటికి వచ్చిన ఇంగ్లీష్ పేపర్‍లో అన్న మాట.

జై ఆంధ్రా – జైజై ఆంధ్రా:

మా టెన్త్ బ్యాచ్ ఆషామాషీదేమీ కాదు. 1972-73 బ్యాచ్ ఇది. మేము చదువుకున్నది విజయవాడకు చేరువలోనే ఉన్న నందిగామలో. సరిగా ఆ సమయంలో విజయవాడ కేంద్రంగా జై ఆంధ్రా ఉద్యమం ఊపెక్కింది. అటు రాజకీయ పార్టీలు, ఇటు విద్యార్థి సంఘాలకు చేతినిండా పని. ఆవేశాలు, కావేశాలు మిన్నంటేవి. అలాంటి సమయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి వచ్చింది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు నాలుగు నెలల తర్వాత జరిగాయి. ఫలితాలు అంతే లేటుగా వచ్చాయి. అందుకే మాది ‘జై ఆంధ్రా బ్యాచ్’ అని చెప్పుకునేవారు.

జై ఆంధ్రా అని వినగానే మా నోటి నుంచి జైజై అంధ్రా అని వచ్చేసేది. ఈ నినాదంలోనే ఒక ఊపు, ఒక రిథమ్ ఉండేవి. మెయిన్ బజారుకి ప్రక్క వీధిలోనే మా ఇల్లు ఉండేది. పెద్దపెద్ద నాయకులు ఎప్పుడు వచ్చినా మీటింగ్ వివరాలు ముందుగా తెలియజేయడం కోసం రిక్షాలకు లౌడ్ స్పీకర్స్ పెట్టి మైకుల్లో చెప్పేవారు. ఉద్యమకారులు ఉత్సాహంగా ‘జై ఆంధ్రా, జైజై ఆంధ్రా’ అంటూ అరుస్తుండేవారు. దీంతో ఇంట్లో పిల్లలందరికీ మా ప్రేమేయం లేకుండానే నోట్లో నుంచి జై ఆంధ్రా నినాదాలు బయటకు వచ్చేసేవి. తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకుని టెన్త్ లోకి అడుగుపెట్టగానే ఊర్లోని పరిస్థితి ఇది. నిజానికి ఒక విద్యార్థికి టెన్త్‌లో వచ్చే మార్కులు చాలా కీలకం. మంచి మార్కులు వస్తే పై చదువులు చదకుండానే ఉద్యోగం తెచ్చుకునే వీలుంది. సరే ఉద్యోగం సంగతి అలా ఉంచుదాం. అసలు టెన్త్ సర్టిఫికెట్ జీవితాంతం చాలా కీలకమే కదా. పై చదువులప్పుడు, ఉద్యోగాల్లో చేరేటప్పుడు.. ఇలా ప్రతిసారీ టెన్త్ సర్టిఫికెట్ కాపీ జత చేయమనేవారు. బర్త్ సర్టిఫికెట్‌గా కూడా దీన్నే ఆమోదించడంతో ఈ సర్టిఫికెట్ విలువ అమూల్యమైనదని మాకు బాగా అర్థమైంది. ఇప్పటికీ టెన్త్ సర్టిఫికెట్‌ని మాత్రం పదిలంగా ఉంచాను. ఐదు దశాబ్దాలకు పైబడిన జీవితంతో సర్టిఫికెట్ వయసు పైబడిన వ్యక్తి లాగానే ముడతలు పడి, అక్కడక్కడా బాగా నలిగిపోయి, మసకబారి బీరువాలో ఓ మూలగా వొదిగి పడుకుని ఉంది. మార్కులేమన్నా గొప్పగా వచ్చాయా అంటే అదీ లేదాయె. అందుకే నా మటుకు నేను ఎవరన్నా టెన్త్ సర్టిఫికెట్ చూపించండి అని అన్నప్పుడల్లా మనసులో ముల్లు గుచ్చుకుంటున్నట్లు ఉంటుంది. లెక్కలు, హిందీలో తక్కువ మార్కులే వచ్చినా మిగతా వాటిలో బాగానే వచ్చాయి. అంటే 50 పైమాటే. అయినా ఎందుకో ఇప్పటికీ సిగ్గు పడుతుంటాను. ఈ సర్టిఫికెట్ గుర్తుకు రాగానే, ఆ వెంటనే ఈ జై ఆంధ్రా ఉద్యమం (ఫుట్‌నోట్: చూ. 15) గుర్తుకు వస్తుంటుంది.

మా ఊర్లో గాంధీ సెంటర్ అన్ని రకాల మీటింగ్‌లకు ప్రధాన కేంద్రం. సాయంత్రమయ్యే సరికి ఏదో ఒక మీటింగ్ ఉండేది. లౌడ్ స్పీకర్లలో నాయకుల ప్రసంగాలు మా ఇంటిదాకా వినబడుతుండేవి. ప్రసంగాలు మొదలు కాగానే ఏదో మిషతో అక్కడికి చేరేవాళ్లం. రాజకీయాల పట్ల అవగాహన లేకపోయినా నాయకులు మాట్లాడే తీరు, వారి హావభావాలు నిశితంగా గమనించేవాడ్ని. ఇదే ఆ తర్వాత మిమిక్రీ విద్యలో ప్రవేశం కలగడానికి దోహదపడింది. మా బంధువు, జనసంఘ్ నాయకుడు అయిన కొమరగిరి కృష్ణమోహన రావు గారి స్పీచ్ నన్ను ఆకట్టుకునేది. ఆయనలా ఇంట్లో మాట్లాడేవాడిని.

‘ఒక్క సారి ఆలోచించండి. ఆంధ్రుల పరిస్థితి ఎలా ఉన్నదో. ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ ఆలోచించండి..’ ఇలా సాగుతుండేది కొమరిగిరి గారి ప్రసంగం.

ఆ రోజుల్లోనే వసంత నాగేశ్వర రావు వంటి యువ నాయకులు పేరు తెచ్చుకున్నారు. కాకాని వెంకటరత్నం గారు కీలక పాత్రనే పోషించారు. ఎప్పుడు ర్యాలీలు జరుగుతాయో, ఎప్పుడు నిరాహార దీక్షలు మొదలవుతాయో, ఎప్పుడు ఏ టెన్షన్ వస్తుందో తెలియదు. ఉన్నట్లుండి పోలీసులు రంగంలోకి దిగేవారు. కాల్పులు జరిపిన సంఘటనలూ ఉన్నాయి.

సరే, ఉద్యమం దారి ఉద్యమానిది, మన దారి మనది. పరీక్షలు పోస్ట్‌పోన్ కావడంతో పుస్తకాలు మూలకెళ్లాయి. సినిమాలు షికార్లు ఎక్కువయ్యాయి. ఇంట్లో అడిగినా ‘పరీక్షలు ఇప్పుడు కాదుగా’ అనేసేవాళ్లం. అయితే నాతోటి వారిలో కొంతమంది ఈ ఉద్యమ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాంటి వాళ్లను ‘పుస్తకాల పురుగుల్లా’ అంటూ ఎగతాళి చేసేవాళ్లం. అలా అని మా బ్యాచ్ పూర్తిగా చదువుని నెగ్లెట్ చేసిందని కాదులేండి. చదువు కోసం కొంత సమయం కేటాయించేవాళ్ళం. మా జట్టు వాళ్లం రాత్రి ఏడు గంటల నుంచి మా ఇంట్లోనే కలిసి చదువుకునేవాళ్లం. రాత్రి తొమ్మిది గంటలకు ఓసారి టీ త్రాగడానికని బయటకు వెళ్ళేవాళ్లం. మళ్ళీ మేం తిరిగి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉండేది. అంటే అంతా నిద్రపోయే వరకు తిరిగి ఇంటికి చేరేవాళ్లం కాదన్న మాట. అయినా సరే, ఆ కాస్త చదువే అక్కరకు వచ్చింది. మొత్తానికి జై ఆంధ్రా బ్యాచ్ అయినా టెన్త్ పాసవగలిగాను. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. ఇక పై చదువులకు ఏ కాలేజీలో చేరాలన్న చర్చ ఇంట్లో మొదలైంది. సరే ఆ ముచ్చట్లు మరోసారి చెబుతాను.

జై ఆంధ్రా – సినిమావోళ్ళు:

జై ఆంధ్రా ఉద్యమం తెలుగు సినిమా వాళ్లపైనా పడింది. ఈ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ విషయం పెద్దగా నాకు తెలియలేదు కానీ ఆ తర్వాత ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు అక్కడి లైబ్రరీలో పాత పేపర్లు తిరగేస్తుంటే హీరో కృష్ణ, గుమ్మడి, చలం వంటి వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలను చూశాను. హీరో కృష్ణ నిజంగానే డేరింగ్ ప్రకటనే చేశారని చెప్పుకునేవారు. కృష్ణ సినిమాలపై వారి రాజకీయ భావజాలం గట్టి ముద్రే వేసిందని అనేవారు. ఈ మధ్యనే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటే ఆ సమయంలో హీరో కృష్ణ రాజకీయ అవగాహన అబ్బురపరిచింది. నేను చదివింది ఇది..

కృష్ణలోని రాజకీయ చైతన్యం ఆనాడు ఆయన్ను ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం భారత చరిత్రలోనూ అపూర్వమైనదంటూ ఆ ప్రకటనలో ప్రస్తావించారు. ‘ఆంధ్ర ప్రజానీకమంతా ఒక్క తాటి మీద నించి ఒకే మాట మీద నిలబడ్డారు. ఇది ప్రజా వెల్లువ. ఈ వెల్లువను ఆపే శక్తి ఎవ్వరికీ లేదం’టూ ప్రకటించారు కృష్ణ. అంతే కాదు, ఆయన దీక్ష కూడా చేపట్టారు.

ఆనాటి ప్రముఖ హీరోయిన్ అంజలి దేవి కూడా స్పందించారు. ఆమె పత్రికలో ప్రకటన ఇస్తూ – ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకారులపై సాగిస్తున్న హింసాకాండను నిరసించారు. ‘ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు అశ్రుతర్పణతో అంజలి ఘటిస్తున్నానం’టూ ప్రకటన ఇచ్చారు.

సినిమాల్లో గయ్యాళి పాత్రలే ఎక్కువగా చేసిన ఛాయాదేవి కూడా ఈ ఉద్యమం చూసి చలించిపోయారు. ఆమె పత్రికలో ఒక ప్రకటన ఇస్తూ – ‘ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఒక రణరంగంగా మారిపోయింది. ఎందరో సోదరులు సిఆర్పీ, మిలటరీ వారి తుపాకులకు బలైపోతున్నారు. మహాలక్ష్మీల్లాంటి సోదరీమణుల మాంగల్యాలు తెగిపోతున్నాయి. ఎందరో తల్లులు తమ బిడ్డలను పోగుట్టుకున్నారు, వారి కుటంబాలకు నా సానుభూతి’ అని అంటూ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేస్తూ – ఆంధ్రుల కోర్కె వెంటనే నెరవేర్చి, మారణహోమాన్ని ఆపుచేయాలని కోరారు.

ఇక హీరో చలం, శారద ఉమ్మడి ప్రకటన చేస్తూ – ఉమ్మడి కుటుంబంలా సహజీవనం కష్టమని తేలిపోయాక అభిప్రాయ బేధాలతో కలిసి ఉండే దానికంటే ఆత్మతృప్తితో విడిగా ఉండటమే మంచిదని అన్నారు. అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.

ప్రముఖ హీరోయిన్ జమున కూడా స్పందించారు. గుంటూరులోని ఆమె సొంత థియేటర్ అలంకార్‌లో ప్రదర్శనలను ఆపేశారు. పోలీస్ కాల్పుల ఘటనలతో చలించిన జమున తన థియేటర్ లోని షోలను కొంత కాలం నిలిపివేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు.

అలాగే, ఎస్వీ రంగారావు ఆ నాటి రాష్ట్రపతి వి.వి.గిరి గారికి పత్రికలో ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రుల కోర్కెను మన్నించి మారణహోమాన్ని నిలవరింపచేయాలని కోరారు.

కలిసి ఉండాలని కోరేవారు, అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరినప్పుడు విడిపోవడమే మంచిదని కొందరూ సినీరంగ ప్రముఖులు బాహాటంగానో లేక వారి వారి సినిమాల్లోనూ తేటతెల్లం చేశారు. 1970 ప్రాంతంలో వచ్చిన ‘తల్లా-పెళ్ళామా’ అన్న సినిమాలోని ‘తెలుగు జాతి మనది, నిండుగ తెలుగు జాతి మనది’ అన్న పాట కూడా ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి మనోభావాలను అద్దం పట్టిందని అనేవారు.

కాలం మారుతుందీ, చేసిన గాయాలు మాన్పుతుంది అని ఓ సినీ కవి అన్నట్లుగా ఈ ఉద్యమం సమసిపోయింది. జై ఆంధ్రా ఉద్యమం నాపై ఎంతో కొంత ప్రభావం చూపినట్లే మా అబ్బాయి (రాజేష్) హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సెగ వాడికి తగలింది. బస్సులు తగలబెట్టడం, ర్యాలీలు, అశాంతి, దీక్షలు ఇలాంటి పరిస్థితుల్లో రోజూ కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్ర అవతరణతో ఈ ఉద్యమం ముగిసింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీడియా వాళ్లు ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో..’ అన్న పదం ఇప్పుడు తరచూ వాడుతున్నారు.

ఫుట్ నోట్ 15:

జై ఆంధ్రా ఉద్యమం: ఈ ఉద్యమం 1972, 73 సంవత్సరాల్లో ఆంధ్రా ప్రాంతంలో జరిగింది. చివర్లో సిక్స్ పాయింట్ ఫార్ములాతో సమసిపోయింది. రాష్ట్ర హైకోర్ట్, సుప్రీం కోర్టు, తెలంగాణలోని ముల్కీ రూల్స్‌ని ‘సమర్థించడం’తో రగిలిపోయిన ఆంధ్రా నేతలు జై ఆంధ్రా ఉద్యమానికి తెరదీశారు. 1973 సెప్టెంబర్‌లో ఆరు సూత్రాల హామీ పత్రం విడుదల అయింది. ప్రధాన మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ అప్పట్లో ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి హామీ ఇచ్చారు.

మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగడం, ఆ తర్వాత విశాలాంద్ర ఉద్యమం తలెత్తడం, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించడం జరిగిన తర్వాత తెలంగాణలో ముల్కీ ఉద్యమం తలెత్తి ఆంధ్రుల్లో అశాంతి రగులు కోవడంతో జై ఆంధ్రా ఉద్యమానికి బీజం పడింది. ఆవేశాలు తారాస్థాయికి చేరాయి. అణచివేతకు పోలీసులు కాల్పులు జరిపారు. నవంబర్ 21న మూడు వేరువేరు ప్రాంతాల్లో 13 మంది చనిపోయారు. విజయవాడలో డిసెంబర్ నెలలో పోలీసుల కాల్పుల్లో 23 మంది చనిపోయారు. ఇలా చనిపోయిన వారిలో కొంతమంది అమాయకులే. ఏదో పని మీద ఇంటి నుంచి వెళ్ళి కాల్పుల్లో చనిపోయిన వారూ ఉన్నారు. అలాంటి సంఘటనలు అప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కళ్లు చెమ్మగిల్లుతుంటాయి.

అంతే కాదు, ఈ ఉద్యమం కారణంగా వేలాది మంది గాయపడ్డారు. వికలాంగులైన వారూ ఉన్నారు. లక్షలాది మంది యువత భవిష్యత్తు గాడి తప్పింది. కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. వారిలో కొందరు రాజకీయంగా తారాస్థాయికి ఎదిగారు. మహా నాయకులయ్యారు. కొందరు ఆ తర్వాతి కాలంలో రాజకీయంగా చితికిపోయారు. మొత్తానికి మా చదువుల మీద ప్రభావం చూపిన జై ఆంధ్రా ఉద్యమాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version