Site icon Sanchika

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-16

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

పలికింది ఆకాశవాణి:

[dropcap]ఆ[/dropcap] ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. అయితే వెళ్లాలంటే ముందు రిక్షా ఎక్కాలి, ఆ తర్వాత బస్సెక్కాలి. మూడు గంటల ప్రయాణం అయ్యాక కాస్త దూరం నడవాలి. అప్పుడు కానీ ఆ ఇల్లు కనబడదు. ఎండాకాలం సెలవుల్లో మంగళగిరి నుంచి నందిగామ లోని పాత బస్టాండ్ వద్ద ఉన్న చిన్నమ్మమ్మ గారింటికి రావాలంటే ఇవన్నీ తప్పువు మరి.

నా వయసు అప్పుడు – ఎనిమిదేళ్లో తొమ్మిదేళ్లో ఉంటాయి. ఇప్పటికీ ఆ ఇల్లు నాకెంతో ప్రత్యేకం. ఎంతగా అంటే – అక్కడ నేను చూసిన ఒక వస్తువు జీవితంలో నాకు ఒక గుర్తింపుని – అది కూడా ‘జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం’ అందుకునే స్థాయికి ప్రేరణగా నిలిచింది. ఇంతకీ ఏమిటా వస్తువు? అది నా జీవితంలో ఎలా ప్రభావం చూపిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

ఆ ఇంట్లో కొంచెం ఎత్తులో ఒక చెక్క బిగించారు. అదేమో కరెంట్ ప్లగ్, స్విచ్ లకు దగ్గర్లోనే ఉండేది. నాబోటి చిన్న పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచారు. ఆ చెక్కపై ఒక పెట్టె ఉండేది. మా చినతాతో, వారి పిల్లలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఆ పెట్టె దగ్గరకు వచ్చి, అందులో ఒక మీట నొక్కుతారు. ఆశ్చర్యం, ఆ పెట్టెలో లైట్లు వెలిగేవి. ఆ పెట్టెలో ఒక చోట సన్నటి, పొడవాటి గీతలాంటి చోటు ఉంది. పెట్టె మీట నొక్కనంత వరకు అది ఉన్నట్లే తెలియదు. కానీ మీట నొక్కగానే అందులో నుంచి ఆకుపచ్చ కాంతి వచ్చేది. మధ్యలో ఒక స్కేల్ లాంటి చోట ఏవేవో అంకెలు ఉండేవి. ఎర్రటి పుల్లలాంటిది దాంట్లో బిగించారు. చక్రం లాంటి బటన్‌ని తిప్పుతూ ఆ ఎర్రటి పుల్లను ఎడమవైపుకీ అలాగే కుడి వైపుకీ తిప్పేయవచ్చు. అలా తిప్పుతున్నప్పుడు ఒక చోటకు రాగానే పెట్టెలోంచి మాటలు వచ్చేవి. అలాంటప్పుడే మొదటి సారి విన్నాను ఈ మాట –

‘ఆకాశవాణి, విజయవాడ కేంద్రం, నిలయంలో సమయం ఆరు గంటలు’

పెట్టెలో నుంచి మాటలే మాటలు. పాటలే పాటలు. నాకేమో బోలెడు ఆశ్చర్యం. ఎవరు మాట్లాడుతున్నారు ఆ పెట్టలోంచి? నా చిట్టి బుర్రకు తట్టలేదు. గోడకి, పెట్టకి మధ్య కాస్తంత గ్యాప్ ఉంది. అందుకే నేను గోడకు ఆనుకుని మెడ పైకెత్తి ఆ సందులోకి చూశాను. పెట్టె లోపల ఏవో గోళీలున్నట్లు అనిపించింది. అవి మిళమిళా మెరుస్తున్నట్లున్నాయి. అంటే, మెరిసే గోళీలే మాటలు చెబుతున్నాయా..? ఏమో..

ఇలా ఆలోచిస్తుండగానే పెట్టెలో నుంచి పాట మొదలైంది. మరోసారి గోడకీ పెట్టెకీ మధ్య ఉన్న సందులో నుంచి నిక్కినిక్కి చూశాను. అబ్బే లాభం లేదు. నేననుకున్నట్లు ఎవ్వరూ లేరు అందులో.

పెట్టెలో నుంచి ‘ఆకాశవాణి విజయవాడ కేంద్రం’ అన్న మాటలు మాత్రం పదేపదే వినడంతో ఈ పెట్టెకు అదే పేరు పెట్టుకున్నాను. అలా ‘ఆకాశవాణి పెట్టె’గా నేను పిలుస్తుంటే చినతాతగారు నవ్వేసి, ఓరేయ్ దీన్ని అలాగా పిలవకూడదురా, ‘రేడియో’ అనాలి – అని చెప్పారు. అప్పటి నుంచి మాట్లాడే పెట్టె పట్ల ఆసక్తి పెరిగిపోయింది. ఈ పరికరం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. రేడియో అన్నది ఒక పరికరమనీ, దాంట్లో నుంచి వివిధ స్టేషన్లు ఉంటాయనీ, అవి వివిధ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటాయని తెలిసింది. నేను హైస్కూల్‌లో చదువుతున్నప్పుడైతే రేడియో సిలోన్ పేరు వినడమే కాదు, మా ఇంట్లోని రేడియో పెట్టెలో సిలోన్ నుంచి వచ్చే కార్యక్రమాలను వినేవాళ్లం. మీనాక్షి పొన్నుదొరై అనే ఎనౌన్సర్ భలేగా తెలుగు మాట్లాడేసేది. అలాగే రేడియో మాస్కో పేరిట రష్యా నుంచి కూడా తెలుగు ప్రసారాలు వచ్చేవి.

ప్రేరణ ఇచ్చిన మిత్రుడు:

నేను ఆంధ్రప్రభలో చేరిన తర్వాత అసలు ప్రపంచంలో వందలాది రేడియో కేంద్రాలున్నాయని తెలిసింది. నా జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణంరాజు రకరకాల దేశాల్లోని రేడియో స్టేషన్ల గురించి మా ప్రభలోనే వ్యాసాలు వ్రాసేవాడు. అతని తెలివితేటలు చూసి నాకెంతో ఆశ్చర్యమేసేది. అతనప్పుడు ఉండేది పూరింట్లో అయినా బోలెడు పుస్తకాలు ఉండేవి. వాటిల్లో కొన్ని రేడియో స్టేషన్లు ఆ కార్యక్రమాల వివరాలకు సంబంధించినవి కూడా ఉండేవి. పుస్తకాలు వానకు తడవకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. పుస్తకాల సేకరణ నిజానికీ నాకూ అలవాటే. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కొనుక్కున్న పుస్తకాల్లో కొన్ని ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను ‘తరంగా’ రేడియో స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు నా ఆసక్తిని కనిబెట్టి సంస్థ సిఈఓ రావు గారు ప్రతి నెలా పుస్తకాలు కొనడానికి కొంత బడ్జెట్ శాంక్షన్ చేసేవారు. ఆ సంస్థ కొన్ని కారణాల వల్ల మూసివేసేటప్పుడు వందలాది పుస్తకాలు నాకే అప్పగించారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు నా దగ్గర ఓ 500 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సినిమా విశేషాలు, తెలుగు భాష సంస్కృతి వంటి అంశాలే కాదు, ఇతర భాషా వైభవాన్ని చాటి చెప్పే పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కువ పుస్తకాలను నందిగామలో భద్రపరిచాను. అప్పుడప్పుడు నాకనిపిస్తుంటుంది, ఈ 67 ఏళ్ల వయసులో ఈ పుస్తకాల బరువు ఇక మోయలేమోనని. పైగా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిందాయె, పుస్తకాలు కూడా పీడిఎఫ్ రూపంలో మొబైల్ ఫోన్‌లో కూడా చూసే వీలుంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గకపోయినా, ఇప్పుడు చాలా మంది ఫిజికల్‌గా పుస్తకం చేతపట్టుకుని చదవడం తగ్గిందనే చెప్పాలి. అయితే మంచి రేడియో కార్యక్రమాలు లేదా టివీ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని నా కెరీర్‌లో చాలా సార్లు తెలిసొచ్చింది. రేడియోకి ఒక ప్రసంగం తయారు చేయాలన్నా, పత్రికకు ప్రత్యేక వ్యాసం వ్రాయాలన్నా, టివీలో మాట్లాడాలన్నా ఇలా మీడియా రూపం ఏదైనా సరే, ఆ కార్యక్రమం రక్తికట్టించాలంటే రిఫరెన్స్ కోసం బుక్స్ తిరగేయాల్సిందే. ఈ లక్షణం ఇందాక చెప్పానే కృష్ణంరాజు అని, అతగాడిలో ఎక్కువ. ఈ మంచి లక్షణాన్ని ఇంకా పెంచుకోవాలని అతగాడ్ని చూసినప్పుడు అనుకున్నాను. అతనే ప్రపంచంలోని అనేక రేడియో స్టేషన్ల గురించి చాలా వివరంగా చెబుతూ నాలో రేడియో పట్ల ఆసక్తిని బాగా పెంచేశాడు.

కోరిక తీరెనులే..:

సరే, చిన్నమ్మమ్మ గారింట్లో తొలిసారిగా చూసిన రేడియో అనుభవం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఎంతగా అంటే, పనిచేస్తే ఇలాంటి రేడియో స్టేషన్లో పనిచేయాలి అన్నంతగా. నేనూ రేడియోలోకి దూరేసి ‘ఆకాశవాణి విజయవాడ కేంద్రం’ అని అనాలనీ, నాకు నచ్చిన పాటలు వినేయాలని అనుకున్నాను. బలమైన కోరికను భగవంతుడు తీర్చాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోని స్టూడియోలో మైక్ ముందు కూర్చుని ఎదురుగా ఉన్న క్లాక్ చూస్తూ న్యూస్ చదవడం ప్రారంభిస్తూ –

‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది – తుర్లపాటి నాగభూషణ రావు’ అనగలిగాను.

విజయవాడలో రేడియో స్టేషన్‌ని మొదటి సారిగా చూసినప్పుడు ఒక రకమైన భావోద్వేగం కలిగింది. అది ఎలాంటిదంటే నందిగామలో తొలిసారి చూసిన రేడియో పెట్టెలోకి దూరేసినంత అన్న మాట. సంకల్పం బలంగా ఉంటే భగవంతుడు కూడా సత్సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. నా కెరీర్‌లో ఇది అనేక సార్లు నిజమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగంలో కొంత కాలం క్యాజువల్ న్యూస్ రీడర్‌గా పనిచేయడం ఆకాశవాణితో బలమైన అనుబంధం ఏర్పడటానికి దోహదపడింది. ఈ అవకాశాలు రావడం నేను ఆంధ్రప్రభలో పనిచేయడమే. విజయవాడ ఆంధ్రప్రభలో ఉద్యోగం చేస్తూ ఓసారి ‘నడుస్తున్న చరిత్ర’ అన్న కార్యక్రమం కోసం రేడియో స్టేషన్‌కి వెళ్ళాను. ఆ వారంలో వచ్చిన ప్రధాన వార్తలపై విశ్లేషణా కార్యక్రమం అది. సహజంగా ఈ కార్యక్రమం పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిస్టులకు అప్పగించేవారు. నేను అంత సీనియర్‌ని కాకపోయినా నాకు అనుకోకుండా అవకాశం వచ్చింది. ఓ పది నిమిషాలనుకుంటా అంతకు సరిపడా, స్కిప్ట్ తయారు చేసుకోవాలి. మన గొంతు బాగున్నదనీ, చక్కగా చదవగలరనీ రేడియో వాళ్లు అనుకుంటే మనం చదివేయవచ్చన్న మాట. అలా నేను మొదటిసారిగా రేడియో స్టేషన్ లోని రికార్డింగ్ స్టూడియోలో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని నా ముందు ఉన్న మైక్‌లో నా స్క్రిప్ట్ చదివాను. బాగుందని రికార్డ్ చేసిన ఆయన అన్నాడు. అప్పటి నుంచి అడపదడపా అవకాశాలు వచ్చాయి. అలా మొదలైన ఆకాశవాణి ప్రస్థానంలో నేను వ్రాసిన ‘అదిగో హరివిల్లు’ అన్న రూపకానికి ‘జాతీయ ప్రతిభా పురస్కారం’ రావడం మరో మధురానుభూతి. హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమైంది. రూపకాలు, నాటికల ప్రస్తావన గురించి మరోసారి చెబుతాను.

కొత్తా రేడియో అండీ..:

చిన్నమ్మమ్మ గారింట్లో రేడియో పెట్టె చూసినప్పటి నుంచీ మన ఇంట్లో అలాంటి పెట్టె ఎందుకు లేదన్న సందేహం వచ్చింది. అన్నయ్యకు చెప్పడం, వాడేమో అమ్మకు చెప్పడం, అమ్మేమో నాన్న చెవిలో వేయడంతో కొంత కాలం తర్వాత ఇంట్లోకి రేడియో పెట్టె వచ్చేసింది. అయితే అప్పటికే మేము మంగళగిరి నుంచి గుంటూరు అద్దె ఇంటికి మకాం మార్చేశాము. కొత్త రేడియో పెట్టె ఇంటికి తీసుకువస్తున్నారన్న విషయం తెలిసినప్పటి నుంచి నా చూపులన్నీ గేటు వైపునే. వీధి చివర్లో ఏ రిక్షా కనిపించినా అది మనింటికేనేమో అనిపించేది. అంత ఆతృత. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. రేడియో పెట్టెను ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకు వచ్చారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. నేను చిన్నమ్మమ్మ గారింట్లో చూసిన పెట్టెకంటే ఇది చాలా నాజూగ్గా ఉంది. ఫిలిప్స్ కంపెనీ వారి రేడియో అది. చాలా ముద్దుగా ఉండే ఆ రేడియో పెట్టె అంటే రోజురోజుకీ ప్రేమ పెరిగిపోయింది. దాన్ని తాకుతుంటేనే ఒక రకమైన వైబ్రేషన్. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నావి ఇవే కబుర్లు. కొంత మంది ఫ్రెండ్స్ అయితే ఇంటి కొచ్చి చూసెళ్లారు. ఆ పెట్టెతో పాటు కాపర్ నెట్‌లా ఉన్న ఒక పొడవాటి రిబ్బన్ ఇచ్చారు. దాన్నేమో ఇంట్లో ఒక మూల నుంచి మరో మూలకు పైన కట్టేస్తే సిగ్నల్ బాగా క్యాచ్ చేసి ఈ నాజూకు పెట్టె ముద్దు ముద్దుగా మాట్లాడుతుందట. దీన్నే ఏరియల్ అంటారట. అది కట్టకపోతే సిగ్నల్ ముల్లు తిప్పినా ‘ఘర్.. గుర్.. థ్రూర్..’ వంటి విచిత్ర శబ్దాలు చేస్తుందే తప్ప, మనం కోరుకున్నట్లు ఉదయం భక్తి గీతాలు పాడదు, రాత్రి పూట హరికథలు వినిపించదు. ఆ రోజుల్లో రేడియో పెట్టె వాడతుంటే లైసెన్స్ ఉండాలి. ఏడాదికి ఒకసారి లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడం కోసం మా అన్నయ్యే నేనో పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లం. మరి ఇప్పుడు ఆ పద్ధతి ఉన్నదో లేదో నాకు తెలియదు. అయినా ఇప్పుడు రేడియో పెట్టెను ఇంట్లో ఉంచుకున్న వారెందరూ..? పరికరం మారవచ్చేమో కానీ రేడియా పట్ల ఆదరణ మాత్రం ఇప్పటికీ చెక్కుచెదర లేదు.

ఆదివారాల్లో నాటకాలు వినడం కాలేజీ రోజుల్లో బాగా అలవాటైంది. ఆ రోజుల్లో నేను విన్న ‘గణపతి’, ‘సక్కుబాయి’ వంటి నాటకాలు నాకిప్పటికీ గుర్తే. ఇవి కాక హాస్య నాటికలు చాలానే విన్నాను. నండూరి సుబ్బారావు, పుచ్ఛా పూర్ణానందం వంటి నటులు మాట్లాడుతుంటేనే మనకు నవ్వు వస్తుంది. పుచ్ఛా పూర్ణానందం గారు సినిమాల్లో కూడా నటించారు. మా పెళ్ళి చూడటానికి అతిథిగా ఆయన కూడా వచ్చారు. స్టీల్ మరచెంబు పెళ్ళి కానుకగా ఇచ్చినట్లు గుర్తు. మావగారు మన్నవ గిరిధర రావుగారికి వీరు ఆత్మీయ మిత్రులు. హాస్య నాటికలు రేడియోలో వింటూ ఇంటిల్లిపాది నవ్వుకునే వాళ్లం. అలాంటిది, నేను కూడా రెండు మూడు హాస్య నాటికలు రేడియో వాళ్లకు వ్రాస్తానని మాత్రం అప్పట్లో అనుకోలేదు.

చిన్నప్పుడు తొలిసారిగా రేడియోలో నాటకం విన్నప్పుడు మాత్రం బోలెడు ఆశ్చర్యమేసింది. పాత్రధారులంతా ఆ చిన్నపెట్టెలో ఎలా దూరి మాట్లాడుతున్నారన్న సందేహాల్లాంటివి రాలేదు కానీ, అసలు వీళ్లంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నది మాత్రం అర్థం కాలేదు.

విష్ణు ‘మాయ’:

నందిగామ కాలేజీలో చదువుతున్నప్పుడు రేడియో పట్ల ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే, ఓ సారి మా ఫ్రెండ్ విష్ణుతో అన్నాను, ‘ఓరేయ్, మనమే ఓ రేడియో స్టేషన్ పెడితే ఎలా ఉంటుంది?’ ఈ ప్రశ్న వాడి బుర్రని తొలిచేసింది. అసలే వాడికి టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. చదువుతున్నది బైపీసీ అయినా ఓ ఇంజనీర్ బుర్ర వాడిది. నేనేం అతిగా చెప్పడం లేదు. నిజమే, వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తయరు చేసేవాడు. మరి అలాంటి వాడి చెవిన పడిన నా మాట వృథా పోతుందా ఏమిటి. పైగా ‘తథాస్తు దేవతలు పైన ఉంటార్రా’ – అని మా బామ్మ అంటుండేది కదా.

అప్పటికే విష్ణు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త వస్తువు తీసుకువచ్చేవాడు. గ్రామ్ ఫోన్ రికార్డులు వాడు తెస్తేనే వాటిని పట్టుకుని చూసి తన్మయం చెందాను. వాటిని చేతికి తీసుకున్నది అప్పుడే. అయితే, అప్పటికే సినిమాల్లో గ్రామ్ ఫోన్ రికార్డులు ప్లే చేయడం వంటి సీన్లు చూశాను. ఇలాంటివన్నీ గొప్పింటి వాళ్ల దగ్గర ఉంటాయని అనుకున్నాను. అలా సినిమాల్లో చూసిన గ్రామ్ పోన్ రికార్డులు నా చేతిలోకి వచ్చి వాలడం నాకెంతో సంతోషమేసింది. రికార్డ్ మధ్యలో – పాట ఏ సినిమాలోనిదీ, ఎవరు పాడారు, సంగీతం ఎవరు వంటి వివరాలతో పాటు ఏ కంపెనీ వాళ్లు ఈ రికార్డ్‌ను తయారు చేసేవారు ఇలాంటి వివరాలు ముద్రించేవారు. అవి చదువుతుంటే ఎప్పటికైనా నా వాయిస్ కూడా ఇలా రికార్డ్ ల్లోకి ఎక్కుతుందేమో అని ఆశపెట్టుకున్నాను.

హెచ్.ఎం.వీ రికార్డుల మీద ఉన్న కుక్క బొమ్మ మగదా, ఆడదా? అని అప్పట్లో తెలివైన ఫ్రెండ్స్ ప్రశ్నించే వారు. ఆ తరువాత తెలిసింది. హెచ్.ఎం.వి. అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ అని. ఇక డౌటేముంది.

అలా, వాడు తెచ్చిన రికార్డుల్లో కొన్ని చిన్నవి అయితే, మరి కొన్ని పెద్దవి. అంతలో మా అమ్మ ఇంట్లో నుంచి వచ్చి ఈ రికార్డులు చూసి ‘ఏమిట్రా ఇవి, గిన్నెల మీద మూతలు పెట్టుకునే పేట్లులా ఉన్నాయి’ అన్నది. అప్పుడు నాకూ అలానే అనిపించింది. నిజమే, వాటిలో కొన్నేమో పెద్ద అన్న గిన్నె మీద పెట్టే ప్లేటుల్లా ఉండేవి. మరి కొన్నేమో పాల గిన్నెల మీద పెట్టే మూతల్లా చిన్న సైజులో ఉన్నాయి. వాటి మధ్యలో చిల్లు మాత్రం తప్పకుండా ఉండేది.

‘ఒరే అబ్బాయ్ ఈ ప్లేట్లకు మధ్యలో ఈ చిల్లు ఎందుకురా..?’ మధ్యలో బామ్మ దూరి అడిగింది. బామ్మ మాటలు పట్టించుకోనట్లే వాడు సమాధానం చెప్పకుండా జంప్.. నిజంగానే ‘జంప్’ చేసే వెళ్లాడు. వాడింటికీ మా ఇంటికి మధ్య గోడే అడ్డం. వాడిల్లేమో మెయిన్ బజారులో ఉంటే, మాదేమో పక్క సందులో ఉండేది. మా ఇంటి వెనుక భాగం ప్రహరీ గోడ వాడింటి వెనక భాగం ప్రహరీ గోడ ఒకటే. గోడకి అటూ ఇటూ ఇటుక రాళ్లో, నాప రాళ్లో పేరిస్తే చాలు క్షణాల్లో జంప్ చేసి వాడింట్లోకి వెళ్ళవచ్చు. కాలేజీకి వెళ్ళాలన్నా మా ఇంటి నుంచి బయటకు వచ్చి, మెయిన్ బజారులోకి వచ్చి మళ్ళీ వాడింటి మీదగా వెళ్ళాల్సిందే. ఎందుకీ శ్రమ, చిన్న జంప్ ఉండగా మా చెంత.

విష్ణు గాడు అలా జంప్ చేసేసి రాకెట్ స్పీడ్‌లో గ్రామ్ ఫోన్ ప్లేయర్ పట్టుకొచ్చాడు. నాకు ఇంతకు ముందే చెప్పడంతో నేను ఆశ్చర్యపోలేదు. బామ్మ ఈ పెట్టని కూడా ఆశ్చర్యంతో చూసింది. ఇదేమో చిన్నసైజు చెక్కపెట్టెలా ఉంది. పట్టుకు వెళ్లడానికి హాండిల్ కూడా బిగించి ఉంది. దీన్ని వాడు విజయవాడ వెళ్ళి కొనుక్కురాలేదు. వడ్రంగి మేస్తీకి చెప్పి తయారు చేయించాడు. అలా అని ఇదేమీ బొమ్మ వస్తువు కాదు. నిజంగానే పనిచేసేదేనని ఎంతో గర్వంగా చెప్పాడు వాడు. గ్రామ్ ఫోన్ ప్లేయర్.

అప్పటికే వాడు తెచ్చిన రికార్డుల్లో ఒక దాన్ని దాని మధ్య పరిచాడు. రికార్డ్ మధ్యలో ఉన్న చిల్లులో ప్లెయర్ బుడిప సరిగా అమరి అది తిరగడానికి వీలు కల్పించింది. ప్లేయర్ బటన్ నొక్కి రికార్డ్ మీద ముల్లు పెట్టగానే సౌండ్ రావడం మొదలైంది. ఆ రోజుల్లో ఇలాంటి రికార్డులు వాడు చాలానే సేకరించాడు.

రేడియో స్టేషన్:

మనం రేడియో గురించి కదా మాట్లాడుకుంటున్నదీ, మధ్యలో ఈ రికార్డుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఊరికే రాలేదులేండి. ఆ రోజుల్లోనే ఓసారి ఘంటసాల మాష్టారి భగవద్గీత రికార్డ్ తీసుకువచ్చాడు విష్ణు. అలాంటి సమయంలోనే నేనేమో నా మనసులోని మాట చెప్పేశాను కదా. ‘రేడియో స్టేషన్ ఎందుకు పెట్టకుడదరా’ అని.. కొద్ది రోజులయ్యాక చాలా సంతోషంగా చెప్పాడు ‘మనం కూడా రేడియో స్టేషన్ పెట్టెయవచ్చురా’ అని. నాకు బోలెడు ఆశ్చర్యంతో పాటుగా ఏనుగు ఎక్కినంత సంబరం కూడా వచ్చేసింది.

అప్పటికే వాడింటికీ మా ఇంటికీ మధ్య ఓ ఫోన్ లైన్ (పర్సనల్) ఏర్పాటు చేశాడు విష్ణు. ఎలక్ట్రానిక్స్ పుస్తకాలు తెగ తిరగేసేవాడు. దీంతో సంపాదించుకున్న నాలెడ్జ్‌తో ఫోన్ పరికరం తయారు చేశాడు. హ్యాండిల్‌ని కూడా చెక్కతో తయారు చేయించాడు. ఇవన్నీ వాళ్లింట్లో పెద్దలకు ఇష్టం లేకపోయినా భరించారు. పాపం.

మరి, ఫోన్ వైర్లు ఉండాలి కదా. వాడింటికీ మా ఇంటికీ మధ్యన సన్నటి తీగలు బిగించాడు. అవేమో వాడింటి పెరట్లో బట్టలు ఆరేసుకునే దండెం తీగలను సపోర్ట్ చేసుకుని ఫోన్ లైన్లను చుట్టేశాడు. వాళ్లమ్మగారేమే ఇవేంటీ మధ్యలో అడ్డంగా ఉన్నాయంటూ తెంపేసేవారు. ఆవిడ అటు వెళ్లగానే మేమిద్దరం మళ్ళీ వాటిని చుట్టే వాళ్లం. వాడింట్లో ఒక రూమ్‌లో కూర్చుని రింగ్ ఇవ్వగానే ఇక్కడ మా ఇంట్లో వసారాలో ఒక ప్రక్కన ఉన్న గదిలో అమర్చిన ఫోన్ రిసీవర్ నుంచి శబ్దం వచ్చేది. నేను హ్యాండిల్ ఎత్తి చెవిలో పెట్టుకోగానే వాడి మాటలు వినిపించేవి. నా మాటలూ వాడు చక్కగా వినగలిగే వాడు. సక్సెస్.

చివరకు కాలేజీ లెక్చరర్లు కూడా విష్ణుని ‘ఇంటర్‌కమ్ ఫోన్ తయారు చేశావటగా’ అని అడిగేవారు.

అలా వాడిల్లు మా ఇల్లు టెక్నికల్‌గా కలిసిపోయాయి. వాడింట్లో ఉన్న అన్ని సౌకర్యాలు మా ఇంట్లోకి వచ్చేశాయి. రేడియో స్టేషన్ పెట్టడానికి కావాలసిన ముడి సరుకంతా అమరిపోయిందనే నేను భావించాను. అందుకే వాడ్ని ‘రేడియో స్టేషన్ నందిగామలో పెట్టవచ్చా’- అని అడిగింది. వాడేమే వైర్‌లెస్ సెట్ ఎలా తయారు చేయాలన్న విషయంపై బాగా చదివేసి, బొమ్మలూ గట్రా కాగితాలపై గీసేసుకుని పనిలో పడ్డాడు.

అతి తక్కువ ఖర్చుతో కిలోమీటర్ పరిధిలో పనేచేసేలా రేడియో ట్రాన్స్‌మీటర్ (ఈ పదమే వాడు వాడినట్లు గుర్తు) తయారు చేశాడు. అప్పట్లో రేడియోలో వివిధ భారతి కార్యక్రమాలు చాలా పాపులరయ్యాయి. వివిధ భారతి ప్రసారాలు అయ్యాక ఇంచు మించు అదే ట్రాన్స్‌మీటర్ల మీద మా ప్రసారాలు ఉండేలా ప్లాన్ చేశాడు. నేనేమో ఎనౌన్సర్ అన్న మాట. వసారాలోని మూల గదే స్టూడియో అన్న మాట. మా అన్నా, వదినా పిల్లలు అంతా ఏదో వింత చూస్తున్నట్లు ఫీలయ్యారు. మా ఇంటి గది నుంచి ఎనౌన్సర్‌గా నేను మాట్లాడగానే నా మాటలకు తగ్గట్టుగా వాడేమే వాడి ఇంట్లోని గది నుంచి పాటలు వినిపించేవాడు. ఇదో అద్భుతమైన ప్రయోగం.

ప్రయోగం అని ఎందుకు అన్నానంటే, నిజంగా రేడియో స్టేషన్లు నడపకూడదు. ఆ విషయం మాకు తెలియదు. అలా నడపాలంటే లైసెన్స్ గట్రా ఉండి తీరాలి. నందిగామలో కొంత మంది మా ప్రసారాలు విన్నారని చెప్పారు కూడా. ఈ వార్త పెద్ద సంచలనమైంది.

ఈ సందర్భంగా నేను ఈ మధ్యనే చూసిన AE WATAN MERE WATAN అన్న హిందీ సినిమా గురించి నాలుగు మాటలు. అచ్చు మేము ఎలాంటి ప్రయోగాలు చేశామో ఈ సినిమాలో కూడా అలాంటి తంతే కనిపించింది. సినిమా కథ స్వాతంత్ర్య పోరాటం నాటిది. ఉషా మెహతా అనే యువతి సాహసోపేతంగా తన మిత్రులతో కలిసి కాంగ్రెస్ రేడియో స్టేషన్‌ను స్థాపిస్తుంది. రహస్యంగా ప్రసారమయ్యే కార్యక్రమాలు స్వాతంత్ర్య పోరాట యోధులను చైతన్యపరిచేవిగా ఉండేవి. రామ్ మనోహర్ లోహియా కూడా తన ప్రసంగాలను ఈ కాంగ్రెస్ రేడియో నుంచి వినిపించారు. ఇదే భారతదేశపు తొలి ప్రైవేట్ రేడియో స్టేషన్. అయితే ఈ రేడియో స్టేషన్ ప్రసారాలను బ్రిటీష్ అధికారులు నిలిపివేయించారు.

మా ప్రైవేట్‌గా రేడియో స్టేషన్‌ని ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమన్న సంగతి మాకు ఉర్లో పెద్దలు చెప్పారు. ఏదో ప్రయోగం అని విష్ణు సర్దిచెప్పాడు. ‘వద్దు ఆపేయండీ, లేకపోతే ఇబ్బందులు తప్పవని’ హెచ్చరించడంతో వాడు ఆపేశాడు, తప్పు- ఒప్పు అన్న సంగతి ప్రక్కన బెడితే వాడి సృజనా శక్తి, రేడియో కార్యక్రమాల నిర్వహణ పట్ల నా ఆసక్తి ఊర్లో చర్చగా మారింది. ఆ తర్వాత వాడు హోమియో డాక్టర్ అయ్యాడు. నేనేమో జర్నలిస్ట్‌ని అయ్యాను. దారులు వేరయ్యాయి. అయినా ఇప్పటికీ మా మధ్య స్నేహం అలాగే ఉంది. అంతే అమాయకంగా ఇప్పటికీ మాట్లాడుకుంటాము.

ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేసిన రేడియోలు ఆ తర్వాత కాలంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కూడా వచ్చేశాయి. ప్రభుత్వం తీసుకున్న సరళీకృత నిర్ణయాల వల్ల ప్రసార మాధ్యమాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేశాయి. ఇంకా వస్తునే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ శకం మొదలైంది. దీంతో సోషల్ మీడియా రూపుదాల్చి వేగవంతమైన ప్రసార మాధ్యమంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఎవ్వరైనా ఆడియో స్టేషన్ పెట్టుకోవచ్చు. పాడ్ కాస్ట్‌లు చేసి ప్రజలకు అందించనూ వచ్చు. ఇలాంటి ఆన్‌లైన్ ఆడియో స్టేషన్లు కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని పెద్దపెద్ద స్టూడియోలతో అనేకానేక సొంత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ శ్రోతలను అనునిత్యం ఆకట్టుకుంటున్నాయి. ‘తరంగా’ పేరిట కొంత మంది ఎన్నారైలు ఏర్పాటు చేసిన ఆడియో స్టేషన్ (దీన్ని రేడియో స్టేషన్ అనవచ్చు)కి నేను కొంత కాలం ప్రొగ్రామ్ డైరెక్టర్ (ఇండియా)గా పనిచేశాను. వినూత్నమైన వందలాది కార్యక్రమాల రూపకల్పన చేసే భాగ్యం అలా దక్కింది. వందేళ్ల భారతీయ సినిమా వైభవానికి గుర్తుగా మేము నాన్-స్టాప్‌గా వంద గంటల పాటు వంద కార్యక్రమాలను ఇటు భారత్ నుంచి అటు అమెరికా నుంచి ప్రసారం చేసి సంచలనం సృష్టించాము. ఇందుకు గాను ఈ మెగా ఈవెంట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తపన చల్లారలేదు. ఆ తర్వాత ఫేస్‌బుక్ ఆధారంగా ఆడియో స్టేషన్ (ఛానెల్ 5 రేడియో స్టేషన్) ఏర్పాటు చేశాను. ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ స్టేషన్ నుంచి ప్రసారం చేయగలిగాను.

ఇదంతా ఎందుకు చెబ్తున్నానంటే ఒకప్పటి తప్పు నేడు ఒప్పు అయింది. ఒకప్పుడు కష్టమైనది అనుకున్నది ఇప్పుడెంతో సులువైనదిగా మారింది. సాంకేతికపరంగా వచ్చిన పెనుమార్పులు నా బోటి రేడియో ప్రియుల కోరికను ఇలా తీర్చేస్తున్నాయి. యాప్‌ల ద్వారా ప్రపంచంలోని రేడియో స్టేషన్లన్నంటినీ వినగలిగే అవకాశం వచ్చేసిది. ఒకప్పుడు రేడియో సెట్ వేరు, ఫోన్ సెట్ వేరు, టివీ సెట్ వేరు.. అలాంటిది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రాకతో ఇవన్నీ ఒకదానిలోనే దూరిపోయాయి. నా రేడియో కథలో ఇన్ని మలుపులు రాబోతున్నాయని ఆనాడు నేను అస్సలు ఊహించలేదు. ఇక ముందు మరెన్ని మార్పులు రాబోతున్నాయో. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో రేడియో కార్యక్రమాలు నిర్వహించే రోజు వస్తుందేమో, ఏమో..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version