Site icon Sanchika

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-20

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

సింహం నవ్వింది:

[dropcap]న[/dropcap]వ్వదా మరి, ఓ ఎలుక వచ్చి గెంతులు వేస్తుంటే. వచ్చీరాని విద్యలు ప్రదర్శిస్తూ మెప్పించాలి అని అనుకున్నప్పుడు, ఇట్లాంటివి అప్పటికే ఎన్నో చూసిన ఆ సింహం నవ్వదా మరి.

ఓ సింహాసనం లాంటి కుర్చీలో సింహం కూర్చుని ఉంది. భయం, భక్తి తెలియని ఓ ఎలుక తలుపు తోసుకుంటూ లోపలకి వచ్చింది. తన చిట్టి కళ్లతో అటూ ఇటూ చూసింది. అప్పుడు కనిపించింది ఓ గంభీర ఆకారం. ఆ ఆకారాన్నీ, ఆ వాతావరణాన్ని చూసి మహామహా ఉద్ధండులే భయపడతారట. కానీ అలా భయపడతారన్న జ్ఞానం ఈ ఎలుకకు లేదు కదా మరి.. ‘దొరికింది భలే ఛాన్స్’ అని పాడుకున్నట్లుగా జోరుగా లోపలకు దూరింది. తన తెలివితేటలు, గొప్పతనం ప్రదర్శించి మెప్పు పొందాలనుకుంది. ఈ అమాయకత్వం చూసి సింహం అప్పుడు నవ్వింది. అయితే ఆ నవ్వు అట్టహాసంగా లేదు. అలాగాని వెటకారం గానూ లేదు. అదో రకంగా నవ్వింది. నిజానికి అది ఏ రకమైన నవ్వో ఎవ్వరూ కనుక్కోలేరు. ఆ నవ్వు వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో, మరెలాంటి ప్రతివ్యూహాలు దాగున్నాయో కూడా తెలుసుకోలేరు. అంత గుంభనంగా ఉండే నవ్వు అది. అసలు నవ్వుల్లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా తెలియని ఈ ఎలుక ఆ గంభీర సింహానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

ఆ సింహం..

ఈనాడు పత్రిక యజమాని – రామోజీరావు.

ఆ ఎలుక – మరెవరో కాదు, నేనే.

ఈనాడు పత్రికలో అంతకు ముందే నేను వ్రాసిన వ్యాసం (గంగపుత్రుల వ్యథ) అచ్చయింది కదా. దీంతో మా ఊర్లో (నందిగామ) పెద్ద హీరోనైపోయాను కదా. సరిగా ఆ సమయంలోనే ట్రైనీ సబ్ ఎడిటర్ పోస్టులకు అభ్యర్థులు కావాలంటూ ప్రకటన వెలువడింది.

ఈనాడు ఆదివారం సంచిక ఆ రోజుల్లో బుక్‌లా కాకుండా పెద్ద సైజులోనే వస్తుండేది. ఇంకా తెలుగు పత్రికల్లోకి కలర్ యుగం రాలేదు అప్పటికి. అలాంటి రోజుల్లో నా వ్యాసం ప్రచురిత మయ్యాక కొద్ది రోజులకు ఈనాడు కార్యాలయం నుంచి ఓ లెటర్, దానితో పాటు వంద రూపాయల మనియార్డర్ వచ్చాయి. ఆ వంద రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియలేదు నాకు. సరే మిత్రులతో టిఫినీలు చేస్తూ కాఫీలు త్రాగుతూ కాలక్షేపం చేస్తుంటే ఇదిగో ఈ జాబ్ ప్రకటన ఒకటి. మిత్రుల ప్రోత్సాహంతో అప్లై చేశాను. ఈ విషయంలో విశాఖపట్నం మిత్రుల పాత్ర ఎక్కువనే చెప్పాలి. అప్పటికే వారి దృష్టిలో కూడా నేనే మేధావినయ్యాను. పైగా సివిల్స్ పరీక్షకోసం ప్రిపేర్ అవుతున్న రోజులవి. అప్పటి వరకు నా సైన్స్ సబ్జెక్ట్ తప్ప మిగతా సబ్జెక్ట్ పట్ల గొప్పగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సివిల్స్ అంటూ స్టడీ చేయడం మొదలుపెట్టానో జ్ఞాన ద్వారాలు ఒకటొకటి తెరుచుకోవడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యం నన్ను విపరీతంగా ఆకర్షించింది. వేమన, శ్రీశ్రీ, ప్రబంధాలు.. ఇలా ఒకటేమిటీ అన్నీ చదవాలన్న పట్టుదల వచ్చేసింది. సాహిత్యం పట్ల ‘పట్టు’ రాలేదు కానీ పరిచయం ఏర్పడింది. నాలుగు ముక్కలు మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాను. ఆ సమయంలోనే ఈనాడుతో పాటుగా ఆంధ్రప్రత్రిక, విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పత్రికలకు వ్యాసాలు పంపాను. వాటిలో కొన్ని అచ్చయ్యాయి. ఇస్లామిక్ కట్టడాల్లో హిందూ శిల్పశైలి, గ్రామదేవతల విశిష్టత.. వంటి వ్యాసాలు వ్రాసినట్లు గుర్తు. మా ఫ్రెండ్ విష్ణు దగ్గర ఓ క్లిక్ థర్డ్ కెమేరా ఉండేది. దగ్గర్లోని గ్రామదేవతా ఆలయాల వద్దకు వెళ్ళి ఫోటోలు తీసి ప్రింట్ తీసి ఇచ్చేవాడు. ఇలా వ్యాసంతో పాటు ఫోటోలు కూడా పత్రికల వారికి పంపేవాడ్ని. ఈ వ్యాపకం నన్ను మరీ మరీ ఆకర్షించింది. నేనో గొప్ప రచయితనైపోయానన్న ఫీలింగ్ బలపడింది. అదిగో అప్పుడే ఈనాడులో ట్రైనీ సబ్ ఎడిటర్ పోస్టులు పడటం మనం అప్లై చేయడం , వాళ్లు పిలవడం, టెస్ట్ పెట్టడం, ఆ తర్వాత ఇంటర్వ్యూ..

ఈనాడు పత్రికని రామోజీరావు నడుపుతున్నారని తెలుసు. ప్రియా పచ్చళ్లు కూడా వారిదేనని తెలుసు. కానీ వారినెప్పుడూ చూడలేదు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.

ఆయన వైపు, కాస్త భయం, కాస్త ధైర్యం, మరికాస్త తెగువ కలయడంతో తలెత్తి ఆయన కళ్లలోకి చూశాను. అమ్మో, ఆ కళ్లు చాలా చురుగ్గా ఉన్నాయి.

ఆ గదిలో మరెవ్వరూ లేరు. నాకేమో ఆశ్చర్యమేసింది. మామూలుగా ఇంటర్వ్యూ అంటే కనీసం ఇద్దరో ముగ్గురో ఉండాలి కదా. మరి ఇదేమిటీ ఈనొక్కరే ఉన్నారు! ఆయన్ని చూస్తుంటే నాకెందుకో సింహం గుర్తుకు వచ్చింది. అది ఇంటర్వ్యూ.. భయపడకూడదు. నా తెలివితేటలు ప్రదర్శించి జాబ్ కొట్టేయాలి. ఇదీ నా ఆలోచన.

కొద్ది గంటల ముందు జరిగిన వ్రాత పరీక్షలో వారిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తూ – వేమన పద్యాలనో, శ్రీశ్రీ కవితలనో, నన్నయ, తిక్కన వంటి కవుల ప్రస్తావనో తీసుకువచ్చాను.

ఇది పెద్దాయన పసిగట్టారు.

‘నీకు తెలుగు అంటే ఇష్టమా..?’

‘అవును’ (జాబ్ రావాలి కదా, ధైర్యంతో గట్టిగా చెప్పేశాను)

‘ప్రతి వ్యాసంలో వేమన, శ్రీశ్రీ వంటి వారిని కోట్ చేశావెందుకు?’

‘వారంటే నాకిష్టం’ (అప్పటికి నేనేదో వీరాభిమాని అయినట్లు ఫోజొకటి)

అప్పుడు.. ఆ సమయంలోనే..

సింహం నవ్వింది.

ఎలుక గాభరా పడింది.

‘సరే వెళ్ళు’ అంది సింహం.

‘అమ్మయ్యా..’ అనుకుంటూ ఎలుక బయటకు వచ్చేసింది.

ఆ తర్వాత ఆఫీస్ గోడకు ఓ లిస్ట్ అతికించారు.

కొంత మందిని ట్రైనీ సబ్ ఎడిటర్స్‌గా తీసుకున్నారు.

అందులో ఈ ‘ఎలుక’ కూడా ఉంది.

సంస్థలో ట్రైనీ సబ్ ఎడిటర్ అన్నది ఓ చిన్న పోస్ట్. ఆ పోస్ట్‌కి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పత్రిక యజమాని స్వయంగా ఓ పది నిమిషాలు టైమ్ తీసుకోవడం నాకెంతో ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత తెలిసింది.. సంస్థలో ప్రతి విషయం పట్ల ఆయన శ్రద్ధ పెట్టేవారని. అంతే కాదు, ఆయన చూపు ‘పునాది’ మీదనే ఉంటుంది. ఇదే వారి విజయరహస్యం.

ఈనాడులో నేను పనిచేసింది ఎక్కువ కాలమేమీ కాదు. కనుక ఈనాడు అంతర్గత వ్యవహారాల గురించిగానీ, రామోజీరావు గారి వ్యవహార శైలి గురించి కానీ నాకు ఆట్టే తెలియవు. ఆ తర్వాత కూడా నేనెప్పుడూ వారిని చూడలేదు. రామోజీ ఇక లేరన్న వార్త చదివినప్పుడు నాకు ఆ నాటి సింహం-ఎలుక సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ దిగ్గజానికి ఇదే నా అక్షరాంజలి.

ఈనాడులో మాకు చక్కటి శిక్షణ ఇచ్చారు. ఆ అనుభవాలు కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. ‘దానవీరశూరకర్ణ’ సినిమాకి డైలాగ్‌లు వ్రాసిన కొండవీటి వెంకటకవి గారు వచ్చి క్లాస్‌లు చెప్పేవారు. అలాగే సీనియర్ జర్నలిస్టులు వరదాచారి గారు, పతంజలి గారు మాకు జర్నలిజంలో మెళకువలు నేర్పారు. వీరిద్దరూ సౌమ్యంగా ఉంటూ మాలోని ప్రత్యేకతలను గుర్తించి అందుకు తగ్గట్టుగా ఇంగ్లీష్‌లో ఉన్న వార్తలను తెలుగులోకి అనువదించమనే వారు. ఓ సారి..

నేను సైన్స్ పిజీ అని తెలుసుకున్న పతంజలి గారు, ఓ సైన్స్ ఐటెమ్ (గ్రహాలు, రాకెట్ ప్రయోగం.. అంశాలున్నది) ట్రాన్స్‌లేట్ చేయమన్నారు. నండూరి వారి ‘విశ్వదర్శనం’ చదివిన నాకు ఇది సులువనే అనిపించింది. ఓ పావుగంటలో వ్రాసి ఇచ్చాను. తర్వాత ఆయన పిలిచి – నేను అందులో వ్రాసిన ఒక పదం వద్ద ఎర్రటి ఇంకుతో రౌండ్ చుట్టారు.

‘ఇదేమిటి?’ అని అడిగారు.

‘కక్ష’ – అన్నాను.

‘కక్ష కట్టినట్లుంది’ – అంటూ నవ్వారు.

అయినా నా బుర్ర వెలగలేదు.

అప్పుడు ఆయన నవ్వుతూ అసలు విషయం చెప్పారు.

‘గ్రహాలు కక్ష్యలో (ఆర్బిట్‌లో) తిరుగుతాయి, అంతే కానీ కక్షలు, కార్పణ్యాల చుట్టూ తిరగవు’

అప్పుడర్థమైంది. నేను చేసిన తప్పేమిటో..

అప్పుడే మరో విషయమూ అవగతమైంది. తప్పు ఎత్తిచూపడంలో ఆయన చూపించిన సరళత ఎంత గొప్పదో. ఈ లక్షణం అందరిలో ఉండదు. అందునా అధికారంలో ఉండే వారిలో ఇది అడుగంటి అహంకారం బుసలు కొడుతుంటుంది.

ఇంకో విషయం కూడా అర్థమైంది. తప్పులు చేయకుండా ఈ జర్నలిజంలో ప్రయాణం సాగించడం అసాధ్యమని. కానీ తప్పులు కాచే పెద్ద మనసు పై అధికారుల్లో ఉండవద్దూ..

ఆంధ్రప్రభలో వాసుదేవ దీక్షితులు గారు కూడా పెద్దమనసుతో తప్పులు సరిచేసేవారు. వారి మాటలనే ఆ తర్వాత నా జూనియర్స్‌కి చాలా సందర్భాల్లో చెప్పాను. అదేమిటంటే..

‘నువ్వు వంద తప్పులు చేయి. ఫర్వాలేదు. కానీ ఏ తప్పు రిపీట్ కాకూడదు’

ఈ ఒక్క సూత్రం పాటిస్తే తప్పులు రిపీట్ కాకుండా ఉండటమే కాకుండా కొన్నాళ్లకి అసలు తప్పులు లేకుండా పని చేయగలుగుతామన్నది ఆయన అందించిన సూత్రం.

ఈనాడులో జర్నలిజం పాఠాలు నేర్చుకుంటున్నప్పుడే వరదాచారి గారు ఓ సారి – ‘నీ రచనా శైలి బాగుందోయ్, మంచి జర్నలిస్ట్‌వి అవుతావు’ – అన్నారు. ఇలా ఎవరైనా పొగిడితే – నా కుడి చేయి లేచి ఎడమ భుజాన్ని తడుతుంది. ఇది నా మేనరిజం.. గతంలో చెప్పాను కదా. ఇప్పుడూ కుడి చేయి లేవబోయింది. కానీ బాగుండదని దాన్ని వెనక్కి దింపించాను.

అసలు, ఈనాడులో చేరేవరకు నాకు సబ్ ఎడిటర్ అన్న పదవి చాలా గొప్పదని, ఎడిటర్ తర్వాత ఇదే అని భావించాను. నా లాజిక్ నాది. ఎందుకంటే, సబ్ ఎడిటర్ అయితే రేపు ఆ ‘సబ్’ కాస్తా ఎగిరిపోతుంది. అప్పుడు మనమే ఎడిటర్ – అన్న అమాయకత్వం అది. ఆ తర్వాత తెలిసింది. ఈ రెంటి మధ్యన ఎన్నో పోస్ట్‌లు. మరెన్నో అంతరాలు.. ఇంకెన్నో అడ్డంకులు. నా లాజిక్‌కి అందని మ్యాజిక్‌లు ఉంటాయన్న సంగతి.

అమాయకత్వంతో జర్నలిజంలోకి ప్రవేశించిన నాకు మొదట్లో ఆనందాలు కంటే చేదు అనుభవాలే ఎక్కువ ఎదురయ్యాయి. అసలు ఈ వృత్తికి పనికి రావు అన్న వారూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ వృత్తి వదిలేద్దామని చాలా సార్లు అనుకున్నాను. కానీ పట్టుదల, కసి పెరిగిపోయాయి. ఎక్కడ పనికి రావని అన్నారో అక్కడే రాణించాలన్న పట్టుదలే – నా జర్నలిజం యాత్రని ఏకబిగిన 40ఏళ్లు నడిపింది. ఇప్పటికీ నడుపుతూనే ఉంది.

ఈనాడులో పనిచేసిన రోజుల్లోనే ఇద్దరు ముగ్గురు మంచి మిత్రులయ్యారు. వారిలో జంధ్యాల శరత్ బాబు, తెలిదేవర భానుమూర్తి వంటి వారు ఉన్నారు. (మిగతా వారి పేర్లు వ్రాయలేదని వారు ఫీలవరని నేను ఫీలవుతున్నాను) జంధ్యాలతో ఇప్పటికీ ఆత్మీయ స్నేహబంధం ఉంది. తెలిదేవర భానుమూర్తి పైకి గంభీరంగా ఉన్నా మనసు వెన్న. అతనే బేగంపేటలో నాకు వాళ్ల ఫ్యామిలీ పోర్షన్‌కి ప్రక్కనే ఉన్న ఒక గది ఇప్పించాడు. ‘బాచిలర్ బతుక్కి ఓ రూమ్ చాలుగా’ అనేవాడు. తెలిదేవర మాటలు, చేష్టలు నన్నెంతో ఆకట్టుకునేవి. తెలంగాణ మాండలీకంలో మాట్లాడుతుంటూ కృష్ణాతీరం నుంచి వచ్చిన నాకు చాలా మాటలు అర్థమయ్యేవి కావు. ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఈనాడులో చేరీచేరగానే రోజూ పొద్దున్నే కాంప్లిమెంటరీగా పేపర్ వచ్చి వాలేది. అదేదో గొప్పగా ఫీలయ్యాను.

ఆ రోజుల్లోనే ఈనాడు యాజమాన్యం ఇంగ్లీష్ పేపర్‌ని కూడా తీసుకువచ్చింది. వాకాటి పాండురంగారావుగారిని ఎడిటర్‌గా చేసింది. ఆ తర్వాత ‘సోమా’ ఫ్రూట్ డ్రింక్స్‌ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈనాడు ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇచ్చారు. ఈనాడు ఆఫీస్ అప్పట్లో ఖైరతాబాద్‌లో ఉండేది. అందుకే నేను బేగంపేటలో రూమ్ తీసుకున్నది. మా పెద్ద మామయ్య (కానూరి రామలింగేశ్వర రావు) వాళ్లు చిక్కడపల్లిలో ఉండేవారు. వారం పదిరోజులకొకసారి మామయ్య వాళ్ళింటికి వెళ్ళేవాణ్ణి. ఇలా అదనంగా ఒక నెల జీతం వచ్చిందని చెబితే మామయ్య సంతోషిస్తూ, ఒక టేబుల్ ఫ్యాన్ కొనుక్కోమని సలహా ఇవ్వడమే కాకుండా షాప్‌కి తీసుకువెళ్ళి కొనిబెట్టారు. ఆ ఫ్యాన్ నా పెళ్లయ్యాక కూడా చాలా కాలం బాగానే పనిచేసింది. 2010 ప్రాంతంలో నేను టివీ5లో పనిచేస్తున్నప్పుడు మణికొండలో ఉండేవాళ్లం. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ అడిగితే ఆ ఫ్యాన్ ఇచ్చేశాము.

గంగి గోవు పాలు..

ఆంధ్రప్రభ వాళ్లు పేపర్‌లో ప్రకటన ఇస్తూ, పిజీ చేసిన వాళ్లకు ప్రయారిటీ ఇస్తూ ‘సబ్ ఎడిటర్ పోస్ట్‌లు కావలెను’ అన్నారు. అది కూడా విజయవాడ ఎడిషన్‌కి అని తేల్చి చెప్పారు. దీంతో అప్లై చేశాను. సివిల్స్‌కి ప్రిలిమినరీ, మెయిన్ ఉన్నట్లుగా ఆంధ్రప్రభ వాళ్లు రెండు సార్లు వ్రాత పరీక్షలు పెట్టారు. మొదటి పరీక్ష ఇంటి నుంచే వ్రాసే వీలు కల్పించారు. నాలుగు టాపిక్స్ మీద వ్యాసాలు వ్రాయమన్నారు. అందులో సైన్స్, ఆధ్యాత్మికం, పొలిటికల్, యాక్సిడెంట్. పొలిటికల్ వ్యాసం వ్రాసేటప్పుడు ఎప్పటి లాగానే మిత్రుడు కస్తల విజయబాబు సలహాలు ఇచ్చాడు. సరే, నాలుగు వ్యాసాలు వ్రాసేసి పోస్ట్ చేశాను. వారం గడిచాక మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయనీ విజయవాడ రమ్మనమని కబురు అందింది. వెళ్లాను.

ఆంధ్రప్రభ ఆఫీస్ (1984) విజయవాడ పూర్ణానందం పేటలో ఉండేది. ఇది రైల్వే స్టేషన్‌కి చాలా దగ్గర. బస్టాండ్‌కి మరీ దూరం కాదు. అప్పట్లో బస్టాండ్ హోటల్ మమతా, దుర్గాభవన్‌కి ఎదురుగా ఉండేది. బస్టాండ్ వల్ల ఈ రెండు హోటళ్లు ఎప్పుడూ రద్దీగానే ఉండేవి. ఆ తర్వాత బస్టాండ్ మార్చేయడంతో ఈ రెంటి హవా తగ్గింది.

ఆంధ్రప్రభ ఆఫీస్ విశాలమైన ఆవరణలో ఉంది. ఈనాడు లాగా నాలుగంతస్తుల భవనం కాదు. పైగా ఖైరతాబాద్ లాగా రద్దీ అయిన ప్రాంతంలో కాదు ఈ పూర్ణానందం పేట. ఏ రకంగా చూసినా హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడ జీవనం సాఫీగా కూల్‌గా సాగిపోతున్నట్లే నాకు అనిపించేది. అందుకే ఇప్పటికీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ (కోకాపేట)లో ఉంటున్నా నేనూ నా భార్య (శ్రీదేవి) విజయవాడ అంటేనే ఎక్కువగా ఇష్టపడతాము. ఆ మధ్య ఓసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఆంధ్రప్రభ ఆఫీస్ ఉన్న పూర్ణానందం పేట రోడ్డు, అలాగే సత్యనారాయణపురం చూసి ఏదో చక్కటి గాలి లభించిందన్న ఫీలింగ్‌తో ఊపిరి పీల్చుకున్నాము. సత్యనారాయణపురంతో మాకున్న అనుబంధం గురించి విడిగా చెబుతాను.

ఆంధ్రప్రభ ఆవరణ ముందు పెద్ద చెట్లు, లోపల దేవుడి గుడి, వాటి వెనుక రేకుల షెడ్లు కనిపించాయి. నాకెందుకో ఈ వాతావరణం సెట్ అవుతుందని అనిపించింది. నా సంకల్పాన్ని దేవుడు విన్నట్లున్నాడు.

మెయిన్ పరీక్ష అన్నారు. మళ్ళీ ఇంతకు ముందులాగానే నాలుగైదు ప్రశ్నలు ఇచ్చారు. ఈ సారి లీగల్ ఐటెమ్, సినిమా ఐటెమ్ కూడా జత అయ్యాయి. అప్పటికే కొద్దో గొప్పో అనుభవం ఉండటంతో వ్రాసిపారేశాను. నాలాగే చాలా మంది పీజీ వాళ్లు వచ్చారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాలో నా పేరు ఉంది. ఆవరణలోనే మరో ప్రక్క క్యాంటీన్ ఉంది. అక్కడ కూర్చోమన్నారు. ఈ క్యాంటీన్‌తో ముందుముందు అనేక అనుభవాలు ఉండబోతున్నాయని నాకప్పుడు తెలియదు. నన్ను పిలిచారు.

విశాలమైన రూమ్ లోకి వెళ్లమన్నారు. ఈ సారి ఎవరుంటారు లోపల. ఒకరే ఉంటారా.. లేక ముగ్గురు నలుగురు ఉంటారా..

లోపలకి అడుగు పెట్టాను. మొత్తం నలుగురు ఉన్నట్లు గుర్తు. ఓ పెద్దాయన పంచకట్టులో ప్రశాంత వదనంతో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నారు. వారి పేరు అప్పుడు తెలియదు. తర్వాత తెలిసింది వారు – పొత్తూరి వెంకటేశ్వర రావు గారని. వారు అంతకు ముందు ఈనాడులో పనిచేశారట. నాకు తెలియదు. వారి ప్రక్కన వాసుదేవ దీక్షితులు గారు, అజంతా గారు, మరొకరు ఉన్నట్లు గుర్తు.

‘కూర్చోండి’ అన్నారు. మర్యాద ఇచ్చే మనుషులే సుమీ అనుకున్నాను. ఏవేవో అడుగుతున్నారు. చెబుతున్నాను. అంతలో పొత్తూరి గారు, ‘అబ్బాయి, ఈనాడు వదిలేసి ఆంధ్రప్రభలో ఎందుకు చేరాలనుకుంటున్నావ్..’ అన్నారు.

ఈ ప్రశ్నకు నా దగ్గర వెంటనే సమాధానం లేదు. అలా అని దాటేయకూడదు. సమాధానం చెప్పడానికి ఆట్టే వ్యవధి లేదు.

‘నాకు విజయవాడ అంటే ఇష్టమండి. మాది నందిగామ అండి. మా అమ్మ అనారోగ్యంతో ఉందండి. ఈనాడు వాళ్లు సెలవలు ఇవ్వడం లేదండి.. అందుకే..’ నసిగాను.

ఏదో పొంతన లేని మాటలు చెబుతున్నాను.

‘సెలవలు ఇక్కడ కూడా ఎక్కువ ఇవ్వరు తెలుసా..?’

‘ఫర్వాలేదండి. వీక్లీ ఆఫ్ రోజునన్నా అమ్మను చూసి వస్తానండి.. దగ్గరే కదా’

మదర్ సెంటిమెంట్ పనిచేసిందేమో.. ఏమో నాకు తెలియదు. జాబ్ మాత్రం వచ్చింది. ముహూర్తం మంచిదనుకుంటా.. ఆ క్షణం నుంచి మొదలైన ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్‌లో పని దాదాపు రెండు దశబ్దాల పాటు సాగింది, ఎన్నో అనుభవాలను మూటకట్టుకుంటూ. ఇంటర్వూలో సెలక్ట్ అయినట్లు తెలియగానే ఆనందం వేసింది. బస్టాండ్‌కి వచ్చి నందిగామ బస్సు ఎక్కాను. అప్పుడెందుకో వేమన పద్యం గుర్తుకు వచ్చింది..

గంగిగోవు పాలు గరిటడైనను చాలు..

ఇంటర్వూలు లేవు..

ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఎదుర్కున్న తరువాత నా కెరీర్ లో మరెక్కడా ఒక పద్ధతిగా జరిగే ఇంటర్వ్యూల్లో పాల్గొనలేదు. తెలుగు వన్ అయినా, టివీ ఫైవ్, తరంగా అయినా ఎక్కడా ఇంటర్వ్యూ అన్న భావన లేకుండా ఏదో స్నేహితుల కబుర్లలా సాగిన అవగాహనతోనే సెలెక్ట్ అయ్యాను.

ఒకసారి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఎఫ్ఎం న్యూస్ఎడిటర్‌గా ఉన్నప్పుడు న్యూస్ బులిటన్ తీసుకుని స్టూడియోలోకి వెళ్ళాను. ఆ టైమ్‌లో ఎఫ్ఎం స్టేషన్ నుంచి జ్యోతిష పండితులు వక్కంతం చంద్రమౌళిగారి కార్యక్రమం లైవ్ వస్తున్నది. నేను నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలకు వెళ్ళాను. ఆర్‌జె కాసేపు అలా కూర్చోండి అన్నట్లు సైగలు చేశాడు. నేను శబ్దం రాకుండా ఓ కుర్చీలో కూర్చున్నాను. కాసేపు అయ్యాక ఈ కార్కక్రమం అయిపోయింది. ఇక అప్పుడు న్యూస్ టైమ్. ఆర్‌జె తన ముందున్న మైక్‌ని నా వైపుకు జరిపాడు. నేను వార్తలు చదివేశాను. అవి అయ్యేవరకు వక్కంతం గారు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరం బయటకు వచ్చేశాము. అప్పుడు వారు నా గురించి అడిగారు. నేనే ఆంధ్రప్రభలో పనిచేస్తున్నాననీ, ఇది పార్ట్ టైమ్ జాబ్ అని చెప్పాను. వారు చాలా సంతోషించి, ‘మీ ఆఫీస్ నేను చూడవచ్చా’ అని అడిగారు. రండి అని ఆహ్వానించాను.

అన్నట్లుగానే వారు ఓ రోజు వచ్చారు. అప్పుడు నేను ఆంధ్రప్రభ – సండే మేగజైన్ సెక్షన్‌లో పనిచేస్తున్నాను. వక్కంతం గారు వచ్చి నా ప్రక్కన కూర్చుని కాసేపు నా పనితీరు చూశారు. ‘చంద్రబాబుగారి మీద ఓ సెటైర్ కావాలండి మీరు సాయం చేయగలరా’ అని అడిగారు. ‘అలాగేనండి, దాందేముందీ’ అంటూ అరగంటలో కంప్యూటర్ స్కీన్ మీద టైప్ చేసి, ప్రింట్ తీసి ఇచ్చాను. వారు చాలా ఆసక్తిగా చదివారు. ‘బాగుందండి’ అని మెచ్చుకున్నారు. ఆ ప్రింట్ తీసుకు వెళ్లవచ్చా అని అడిగారు.

అలా వారితో నా పరిచయం స్నేహంగా మారింది. ఓ నాలుగైదు రోజుల తర్వాత పొద్దున్నే అమెరికా నుంచి ఫోన్ కాల్. గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ ఓనర్ అరికట్ల వెంకట్ గారు అటు వైపు లైన్‌లో ఉన్నారు. చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్లుగా వారు నాతో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడి, వారి వెబ్‌సైట్‌లో రోజూ ఆర్టికల్స్ వ్రాసేలా అప్పటికప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా ఇది కూడా స్నేహపూర్వక వాతావరణంలోనే వచ్చిని అవకాశం అని చెప్పడానికి ఈ సంఘటనను గుర్తుచేసుకున్నాను.

తెలుగువన్‌లో ప్రముఖ కార్టునిస్ట్ మల్లిక్ గారితో కలసి పనిచేయడం, టివీ 5లో కందుల రమేష్, కొమ్మినేని, బ్రహ్మానందరెడ్డి వంటి వారితో పరిచయాలు నా కెరీర్‌లో ఉపయోగపడ్డాయి. ఆ విశేషాలు తర్వాత చెబుతాను.

సింహం ఎదుట కుప్పిగెంతులు పెట్టిన ఎలుక తర్వాత ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంది. క్రమంగా జర్నలిజంలో తనకంటూ ఒక ‘మార్క్’ని, ‘బ్రాండ్’ని సంపాదించుకుంది. దీనికి దశాబ్దాల తరబడి కృషి ఉంది. చివరి శ్వాస వరకూ శ్రమించడమే ఈ ‘ఎలుక’కి తెలుసు. ఇదే భగవంతుడు ఈ అల్పజీవికి ఇచ్చిన వరం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version