తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-21

2
2

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ధనా‘ధన్’:

[dropcap]‘ప[/dropcap]దరా, పోదాం రాజు

ప్రేమ సిన్మ చూడ

పదరా పోదాం రాజు..’ –

ఓ సినిమాలోని పాటకి పేరడీ కడ్తూ హమ్ చేస్తూ సైగ చేశాడు విజయ బాబు. ఆ వెంటనే నేనూ ఓ పాట ఎత్తుకున్నాను..

‘పద పదరా చిన్నారి బాబు,

‘టైమ్కీ’ పక్షిలా ఎగురుకుంటూ

‘బుక్కు’ వైపు చూడకుండా, పద పదరా..’ –

అంటూ సై అంటే సైసై అన్నాను. నన్ను నందిగామలో చాలా మంది నాగరాజు అని అంటార్లేండి.

అదేదో మాంచి ప్రేమ సినిమా అంటా, చూద్దాం పదరా అన్నాడు వాడు. రోమాంటిక్ సినిమాలను వాడలా పిలిచే వాడు.

అది గుంటూరులోని అరండల్ పేట ఆరవ లైన్‌లో డాబా ఇంటిపైన ఉన్న ఓ చిన్న గది. ఆ ఇంటి యజమానులు బాచిలర్స్‌కీ, స్టూడెంట్స్‌కి అద్దెకిస్తుంటారు. ఆ విషయం మా అన్నయ్యకు తెలుసు. ఇంటి ఓనర్‌తో మాట్లాడి ఆ రూమ్ నెలరోజుల పాటు అద్దెకి తీసుకుని అందులో ముగ్గుర్ని పడేశాడు. అంటే ఆ గదిలోకి దింపాడన్న మాట.

ముగ్గురిలో మూడో వాడు ఉన్నాడే.. వాడు ‘పుస్తకం చేతన్ బూని..’ అన్నట్లుగా శ్రద్ధగా పుస్తకాలు చదువునే టైపు. వాడు డాక్టర్ అవుదామనే మాతో పాటుగా వచ్చేశాడు.

అది 1976వ సంవత్సరం. ఎండాకాలం. ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవడం కోసం మమ్మల్ని నందిగామ నుంచి ‘తోలుకొ’చ్చి ఇదిగో ఈ గదిలో పడేశారు. అప్పటికే మా అన్నయ్యకు గుంటూరుతో బాగానే పరిచయం ఉంది. అలా అని నాకు లేదని కాదు. ఆనంద్ భవన్, శంకర్ విలాస్, లక్ష్మీ టాకీస్, హరిహరమహల్, రంగ మహల్, శేష్ మహల్, మాజేటి గురవయ్య హైస్కూల్, హిందూ కాలేజీ, ఏసీ కాలేజీ వంటివి బాగానే తెలుసు. అప్పట్లోనే ధన్ కాలేజీ (రవి కాలేజీ) కూడా బ్రాడీపేటలో అటుగా పోతున్నప్పుడు చూశాను. కానీ లోపలకు వెళతానని మాత్రం అప్పట్లో అనుకోలేదు. గుంటూరు గురించి ఇన్ని విషయాలు మిగతా ఇద్దరికీ తెలియవు. వాళ్లకు తెలియని ప్రపంచం నాకు తెలిసినందుకు ఆ కాసేపు నాకెంతో గర్వం అనిపించేది. బోలెడు విషయాలు తెలుసు కనుక, అందునా రవి కాలేజీ కూడా తెలుసు కనుక అదరగోట్టేస్తానని అనుకున్నారు. అందుకే అప్రకటిత నాయకుడ్ని అయ్యాను ఆ నెల రోజులూ.

గుంటూరులో ఉన్నప్పుడు మా ముగ్గురిలో నేనూ, బాబు చురుగ్గా తిరిగే వాళ్లం. ‘చదివే వాళ్లం’ అన్న పదాన్ని నిజాయితీగా చెప్పాలంటే వాడబుద్ధి కావడం లేదు. అందుకే చురుగ్గా ‘తిరిగే’ వాళ్లం అన్నాను.

‘నిజం చెప్పమంటారా?

అబద్దం చెప్పమంటారా?’ –

అని పాతాళభైరవిలో ఎన్టీఆరోడు అన్నట్లు అడగడం. పెద్దోళ్లేమో ‘నిజమే చెప్పండర్రా’ అని కోరడంతో – ‘గుంటూరులో మా సినిమాల వినోదం’ గురించి పూసగుచ్చినట్లు చెప్పేవాళ్లం. ఇంట్లో వాళ్లు కొట్టలేదు, తిట్టలేదు. ‘కానీ, వీళ్లు డాక్టర్లు కాలేరు’ అని తీర్మానించుకున్నారు. ఆ తర్వాత బీఎస్సీ, ఎమ్మెస్సీ ..ఇలా సాగిపోయింది చదువు. బాబు అయితే ఈ సైన్స్ నాకెందుకని అనుకుని ఆర్ట్స్‌లో చేరిపోయాడు. వాడు బీఏ, నేను బీఎస్సీ వెలగబెట్టాము. ఏమాట కామాటే చెప్పుకోవాలి. నందిగామ కాలేజీలో మేము మెరిట్ స్టూడెంట్స్ లిస్ట్ లోనే ఉన్నాము. ఎంతగా అంటే ఎమ్మెస్సీ సీట్ ఇచ్చిన యూనివర్శిటీ ఆఫ్ బొంబాయి (అప్పట్లో అలా పిలిచేవారు) వాళ్లు మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తూ కాలేజీలో చేరమని కబురు పంపారు. బీఎస్సీలో గ్రూప్‌లో నాకు 72 శాతం మార్కులు వచ్చాయన్న మాట. కానీ ఇంగ్లీష్‌లో మాత్రం అత్తెసరు మార్కులే.

అంతటి మెరిట్ స్టూడెంట్ అయిన నాకు ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం ఓ లెక్కా..ఇదీ నా ధీమా. అవతల విజయబాబు, పార్థ సారధి (మూడో వాడు) అంతే ధీమాతో ఉన్నారు. అందుకే కదా మమ్మల్ని గుంటూరు రవి కాలేజీ (సీవీఎన్ ధన్ కాలేజీ)లో చేర్చింది. కానీ..

ఏం జరిగింది..

అసలేం జరిగింది?

ఎంబీబీఎస్ కోర్స్‌లో చేరాలంటే ఆ రోజుల్లో ఎంట్రెన్స్ పరీక్ష తప్పని సరిగా వ్రాయాలి. అంతకు ముందు టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడైతే మనందరికీ తెలుసు కదా, ఎంసెట్ పరీక్ష వ్రాస్తేనే అటు ఇంజనీరింగ్‌లో అయినా ఇటు మెడికల్ కోర్స్ లోనైనా చేరేది. గుంటూరు రవి కాలేజీలో ఎంబీబీఎస్ ఎంట్రెన్స్‌తో పాటుగా ఇంజనీర్ ఎంట్రెన్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు చేరేవారు. ఇలాంటి వారి సంఖ్య వందల్లో ఉండేది. క్లాస్ రూమ్ లన్నీ కిటకిటలాడేవి. ప్రధాన భవంతి చాలక ప్రక్కనే ఉన్న భవంతులను కూడా రెంట్‌కి తీసుకునే వారు.

ఇక్కడ సివిఎన్ ధన్ గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. అప్పట్లో నాకు వారి ప్రతిభ తెలియదు. కానీ ఆయన ఓ సింహంలాగా ఉండేవారు. (20వ భాగంలో సింహం నవ్వింది అంటూ నేను రామోజీ రావు గారి గురించి వ్రాశాను కదా. అలాగే ఈయనా ఓ సింహమే). ఆరడుగుల ఎత్తు గంభీరంగా ఉండే మోము. గుబురు మీసాలు. విద్యార్థులకు ఈయనంటే భయం. సీవిఎన్ థన్ గారి అసలు పేరు – చెన్నావఝుల విశ్వనాథన్. వీరి స్వగ్రామం మా నందిగామకు దగ్గర్లోనే అంటే మునేరు దాటగానే వచ్చే రాఘవాపురం. దాదాపుగా ‘మనూరు వాడే’ కావడంతో మా పెద్దోళ్లలో ఒకరిద్దరు ముందుగానే ధన్ గారిని కలిసి కాస్తంత ఫీజుల రాయితీతో మమ్మల్ని అక్కడ చేర్చారు.

‘ఆనంద’ భోజనం:

మమ్మల్ని రూమ్‌లో చేర్చడానికి ముందే రూమ్ అద్దె కట్టేశారు. ఇక మిగిలింది భోజనం ఖర్చు. దానికీ పెద్దోళ్లు ప్లాన్ చేశారు. డబ్బులు ఎక్కువగా ఇవ్వకుండా ప్లాన్ అన్న మాట. నెలకు సరిపడా లంచ్, డిన్నర్ టికెట్లు అంటే మనిషికి 60 టికెట్లు కొని ఇచ్చేశారు. 30 టికెట్లు కలిపి ఒక చిన్న బుక్‌గా ఇచ్చేవారు. తలా రెండు టికెట్ బుక్స్ చేతిలోకి వచ్చి వాలాయి. ఇక మిగిలింది ఫలహార ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు అంతే. ‘పెద్దోళ్లు యమ తెలివిగలోళ్లు’ అని అనుకున్నాం. ఆనంద్ భవన్‌లో రాత్రి డిన్నర్ కి లేటుగా వెళితే ఒక్కోసారి కర్రీ అయిపోతుంది. అయితే మాబోటి వాళ్ల కోసం సెకండ్ కర్రీ (ఇది సహజంగా బంగాళ దుంప ఫ్రై అయి ఉంటుంది) చేసేవారు. హోటల్‌లో చక్కటి అరటి ఆకులు పరిచి, చిన్న గిన్నెతో నెయ్యి (అతి చిన్న గిన్నండోయ్.. అసలు అలాంటి గిన్నెలు కేవలం హోటళ్ల వాళ్లకోసమే తయారు చేసే వారేమో) నెయ్యి కూడా కమ్మటి వాసన వస్తుండేది. రెండు కూరలు, పప్పు, అప్పడం, బండ పచ్చడి, సాంబారు, రసం, గడ్డ పెరుగు.. వీటితో తెల్లటి వరన్నం కలుపుకుని మద్యమధ్యలో నెయ్యి జార్చుకుంటూ తింటుంటే ఇంతకు మించి ఆనందం మరేముందనుకుంటూ ‘ఆనంద్ భవన్ సుఖీభవ’ అని అనాలనిపించేది.

క్లాస్‌లు రాత్రి ఏడు గంటలకల్లా అయిపోతాయి. మరి అలాంటప్పుడు సకెండ్ కర్రీ దాకా ఎందుకు ఆగాలి. నిజానికి అక్కర్లేదు. కానీ ఒక్కో సారి క్లాస్‌లు ఎగ్గొట్టి ఫస్ట్ షో సినిమాకు చెక్కేసినప్పుడు మరి సెకండ్ కర్రీ వేళే కదా అయ్యేది. అదన్న మాట అసలు సంగతి.

ఆనంద్ భవన్ ఇటు బ్రాడీపేట్ వాళ్లకీ, అటు అరండల్ పేట వాళ్లకీ అందుబాటులో ఉంది. బ్రాడీపేట – ఏసీ కాలేజీల మధ్య రైల్వే ట్రాక్ కూడా ఉంది. అక్కడ ఒకప్పుడు మాన్యూవల్ గేట్ ఉండేది. రైలు వస్తున్నా, వెళుతున్నా గేట్ మూసేయడంతో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యేది. అక్కడో ప్లై ఓవర్ అవసరమని ఎంతగా మొత్తుకున్నా చాలాకాలం పాలకులకు పట్టించుకోలేదు. మా మామగారు (మన్నవ గిరిధర రావు గారు) కూడా ఫ్లై ఓవర్ అవసరాన్ని గుర్తు చేస్తూ ఓ వ్యాసం కూడా వ్రాశారని నా పెళ్లాయ్యాక మా ఆవిడ చెప్పింది. మొత్తానికి 60 దశకం కంటే ముందే అక్కడ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రాడీపేట వైపుకి వంతెన దిగుతుండగానే ఎడమ వైపున లక్ష్మీ టాకీస్ ఉంది. దాని ప్రక్కనే ఆనంద్ భవన్. ‘గుంటూరు అంటే ఆనంద్ భవన్’ అనే వారు నేటికీ ఉన్నారు. ఆ తర్వాత శంకర్ విలాస్ వంటి అధునాతన హోటల్ వచ్చినా ఆనంద్ భవన్ భోజనం ఒకసారి రుచి చూస్తే ఎప్పటికీ మరువలేము. ఆ రుచిని ఏకంగా 30 రోజుల పాటు చవిచూసిన అనుభవం మాత్రం ఎప్పటికీ మరచిపోలేను.

సివిఎన్. ధన్ – టిఎన్ బి. షన్:

నేను ఆంధ్రప్రభలో చేరాక అక్కడో పెద్ద మనిషితో పరిచయం అయింది. వారి పేరు కందర్ప రామచంద్రరావు. ఆంద్రప్రభలో ఎడిట్ పేజీల వ్యాసాలు సరిచేస్తుండేవారు. ఆయనోసారి సివిఎన్ ధన్ గురించి చెప్పారు. వారు చెప్పిన వాటిలో కొన్ని మాటలు మాత్రమే నాకిప్పుడు గుర్తున్నాయి. ధన్ గారి ఆలోచనలు భిన్నంగా ఉండేవి. రూరల్ ప్రాంతాల్లోని విద్యార్థులను వారు ప్రోత్సహిస్తుండేవారు. పల్లెల్లో చదువుకున్న పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని అనుకునేవారట. బెనారస్ విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రజాస్వామిక, జాతీయ భావజాలం కలవారు. ఎడ్యుకేషన్ ఫిలాసఫీని బాగా అర్థం చేసుకున్న మనిషి. ధన్ గారి జీవిత చరిత్రను వారి తమ్ముడు సిఎస్ రామచంద్ర మూర్తి ‘ధన్యాత్ముడు’ సీవీఎన్ ధన్ – పేరిట పుస్తకం వ్రాశారు.

ఆయన ఇంతటి వాడని తెలియని రోజుల్లో నేను ఆయనను చూశాను. నందిగామ నుంచి వచ్చిన మమ్మల్ని చూసి ‘ఊ.. బాగా చదువుకోండి’ అని చాలా గంభీర కంఠంతో అన్నారు.

ధన్ గారి గురించి అప్పట్లో తెలియకపోయినా ఆయనను ‘ధన్.. ధన్’ అని పిలవడం నాకెంతో నచ్చింది. అది ఎంతగా అంటే, డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నెలవారీ పరీక్ష ఆన్సర్ షీట్ మీద నా పేరును TNB SHAN (టి. నాగభూ‘షన్’) అని వ్రాసుకునేటంతగా. అక్కడితో ఆగలేదు. నా ఫ్రెండ్స్ సిహెచ్. పార్థసారధి, ఎం. విష్ణు వర్థన్ పేర్లను కూడా మార్పించాను. నా ప్రేరణతో పాపం వీరిద్దరూ కూడా ఆన్సర్ షీట్ల మీద – ChPS DHI (సిహెచ్ పార్ధసార ‘ధి’) అని, MVV DHAN (ఎం. విష్ణువర్ ‘ధన్’) అని మార్చేసి వ్రాశారు. మా జువాలజీ మాష్టారు డికేఎం గారు ఈ వింత పోకడను గమనించి మందలిద్దామనే క్లాస్‌కి వచ్చి , ‘ధన్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వ్రాశామని’ గర్వంగా చెప్పగానే ఆయన ఫక్కున నవ్వేశారు. దీంతో క్లాస్ అంతా నవ్వుల మయం. ఆ తర్వాత తెలిసొచ్చింది..’అనుకరణ’ అనేది ఇలా కాదనీ వారి స్థాయికి ఎదగడంలో అనుకరించాలన్న సంగతి.

కానీ ఏం చేశాము..

మాకూ డాక్టర్లు కావాలనే ఉండేది. చక్కగా తెల్లటి కోటు వేసుకుని మెడలో స్టెతస్కోప్ తగిలించుకుని, మందుల చీటి వ్రాస్తూ పేషెంట్లకు క్లాస్‌లు పీకాలని నాకైతే మహ ఉబలాటంగా ఉండేది. అదేమిటో చిన్నప్పటి నుంచి నాకో లక్షణం ఉంది. చిన్నప్పుడు బస్సు కండెక్టర్నీ, డ్రైవర్‌ని చూసి నేనూ వాళ్లంతటి వాడినవ్వాలనుకున్నాను. మా ఊర్లో పోస్ట్‌మాన్ ఇంటింటికీ లెటర్స్ ఇస్తుండే పద్ధతి బోలెడు నచ్చేసి నేనూ పోస్ట్‌మాన్ అవ్వాలనుకున్నాను. కాలేజీలో లెక్చరర్‌ని చూసి నేనూ అలా కావాలనుకున్నాను. కానీ ఇవేవీ కాలేదు. అనుకోకుండా జర్నలిస్ట్‌ని అయ్యాను. సరే..

మమ్మల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దాలని పాపం రవి కాలేజీ లెక్చరర్స్ చాలా శ్రమపడ్డారు. వారి కష్టం చూసి నాకు జాలేసింది. ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పే ఆయనేతే మరీనూ. ఆయాసపడుతూ బ్లాక్ బోర్డ్ నిండా సూత్రాలు గట్రా వ్రాసేస్తూ నానా హడావుడి పడేవారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పడానికి ఒకటి రెండు సార్లు ధన్ గారు వచ్చినట్లు గుర్తు. మిగతా వాళ్ల మాట ఎలా ఉన్నా ఎప్పుడన్నా ధన్ వస్తే మాత్రం పిన్ డ్రాప్ సైలెంటే. ఆయన కారిడార్‌లో కనిపించినా అంతే. ఆ తర్వాత తెలిసింది. వారు మరీ అంత సీరియస్ కాదట. ఆయనకు పిల్లలంటే ఇష్టమేనట. మా నాన్నగారు అంతేలేండి. పైకి గంభీరంగా ఉంటారు, లోపల మనసు మాత్రం వెన్న.

చెప్పేది ఏమిటో..

ఒక్కో లెక్చరర్ వస్తున్నారు. పాఠాలు చెబుతున్నారు. నోట్స్ వ్రాసుకోమంటున్నారు. ఇరుకు ఇరుకు బెంచీల మీద, ఉక్కబోత.. ఆ పైన చెప్పేది బుర్రకెక్కక పోవడం. ఏమిటో అంతా గందరగోళం. క్లాస్‌ల మధ్యలో నేను బాబుని అడిగాను. ‘ఏరా, నీకేమైనా అర్థం అవుతున్నదా వాళ్లు చెప్పేది’ వాడు సమాధానం చెప్పలేదు. మరో ప్రక్కనే ఉన్న పార్థాని అడిగాను. వాడేమే ఒకసారి అడ్డంగా మరోసారి నిలువుగా తల ఊపాడు. ఇలా ఓ మూడు రోజుల పాటు శ్రద్ధగానే పాఠాలు విన్నాము. నాకో విషయం అర్థమైంది.

పాఠాలు అవే, పుస్తకాలు అవే.

కానీ నందిగామలో మేము మెరిట్ స్టూడెంట్స్.

కానీ ఇక్కడేమో వెనకబడిపోతున్నాము.

మాష్టార్లు అడిగే ప్రశ్నలకు కొంత మంది ఠకఠకా సమాధానాలు చెప్పేస్తున్నారు.

ఎక్కడో లోపం ఉంది.

ఎక్కడో తెలియడం లేదు.

వారం గడిచే సరికి మాకు అర్థమైన విషయం ఏమంటే, మనం పుంజుకోలేము. కేవలం నెల రోజుల వ్యవధిలో ఎంత కష్టపడ్డా సీటు సంపాదించుకోలేము. కనుక.. కిమ్ కర్తవ్యం? ఈ గందరగోళ క్లాస్‌లకు వెళ్తూ టెన్షన్ పెంచుకోవడమా..? లేక ‘సినిమాలు గట్రా చూస్తూ మిగతా రోజులు కాలక్షేపం చేయడమా, ఏమిటి మన తక్షణ కర్తవ్యం?’

ఉన్నది ముగ్గురం. కానీ ఒక మాట మీద నిలబడలేకపోయాము. నేనూ, బాబు ఒక పార్టీ అయితే పార్థూ వేరయ్యాడు. అంటే, ఈ పార్థూ గాడు సినిమాలకు రానన్నాడు. ‘అయితే క్లాస్. లేకుంటే రూమ్.. నాకైతే చదువే ముఖ్యం’ అన్నాడు కచ్చితంగా. ‘సరే, చెడిపోయేవాళ్లని ఏం చేస్తాము, నువ్వు పదరా’ అంటూ బాబు..

‘పదరా, పోదాం రాజు

ప్రేమ సినిమా చూడగ’ – అంటూ పాడేశాడన్న మాట. అదీ సంగతి. పార్థూని పుస్తకాలకు అప్పజెప్పేసి మేము రెడ్డెక్కాము.

పార్థూ పూర్తి పేరు చవట పార్థసారథి. వీడి స్వగ్రామం నందిగామకు ఆనుకునే ఉన్న అనాసాగరం. వారి నాన్నగారి నందిగామలో బట్టల వ్యాపారి. సరే, విజయబాబుది నందిగామే. వీడి నాన్నగారు కస్తల పూర్ణేశ్వర రావు గారు నందిగామ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. పార్ధా చాలా మంచివాడు. ఎంతగా అంటే రాముడు మంచి బాలుడు అన్నంత అన్న మాట. నేనూ, బాబు కాస్తంత అల్లరి బ్యాచ్‌లో వాళ్లమే. సరదాగా మాట్లాడమూ, చిలిపి చేష్టలు చేయడం మాకిష్టం. ఈ విషయాల్లో వాడు సీరియస్. అందుకనే పార్థా ‘చదువుకే నా ఓటు’ అన్నా మేమేమీ బాధపడలేదు. మేము ఒక్కో థియేటర్ ఎక్కడుందో ఏ సినిమా ఆడుతుందో తెలుసుకుని చల్లగా జారుకోవడం మొదలెట్టాము. ఈ జారుకోవడంలో ఒక్కోసారి క్లాస్ లోంచి కూడానూ. ముత్యాల ముగ్గు, అన్నదమ్ముల అనుబంధం, చీకటి వెలుగులు వంటి కొత్త సినిమాలతో పాటు సెకండ్ రీలీజ్ సినిమాలు, ఇంకా పాతవీ మొత్తంగా ఓ 11 సినిమాలు చూసేశాం. నందిగామ వెళ్ళాక ఈ విషయం మా ఫ్రెండ్స్‌కి చెబితే ‘ఒరేయ్, ఇదో రికార్డ్ రోయ్. గిన్నీస్ బుక్ ఎక్కేశార్రోయ్’ అంటూ ఎగతాళిగా అన్నా మేము పట్టించుకోలేదు. పైగా అలాంటి బుక్ ఎదో ఎక్కేసినట్లే తెగ ఫీలయ్యాము. మొత్తానికి ఎంట్రెన్స్ పరీక్ష వ్రాశాము.

తెలుగు మీడియంలో చదివిన వారికి తెలుగులోనే ప్రశ్నలు ఇచ్చారు. రవి కాలేజీలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కొన్ని సెక్షన్స్ ఉంటే తెలుగు మీడియం వారికి మరికొన్ని సెక్షన్స్ ఉండేవి. చేరిన ప్రతి విద్యార్థికి చక్కటి శిక్షణ ఇవ్వాలన్నదే ధన్ గారి ఆశయం. వారి ఆశయం మంచిదే, కానీ మాకే చెప్పేది ఏమిటో, చదివింది ఏమిటో అర్థం కాలేదు. రవి కాలేజీ మా శిక్షణ గురించి మా ఇంట్లో కథలు కథలుగా తెలిసిపోయింది. గుంటూరులో ఉన్నప్పుడే ఓ సారి గమ్మత్తు జరిగింది.

అదృష్టం కలిసొస్తే..

అసలు మేము చదువుతున్నామూ లేదా అనో, ఎలా చదువుతున్నామో చూద్దామనో – ఓ సారి మా నాన్నగారు ఇంకో ఆయనతో కలిసి గుంటూరు వచ్చారు. రాత్రి పది గంటలు దాటింది. మెట్ల మీద అలికిడి అయింది. ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వారిద్దరూ పైకి వచ్చారు. ఆ సమయంలో వారు చూసిన దృశ్యం వారి కళ్లలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఇంతకీ వారు చూసిన దృశ్యం..

రూమ్‌లో మూడు చాపలు పరిచి ఉన్నాయి. ఒక చాప మీద పార్థా పడుకుని నిద్రపోతున్నాడు. మరో రెండు చాపల మధ్యన పుస్తకాలు పరిచి ఉన్నాయి. అటూ ఇటూ నేనూ, బాబు నోట్స్‌లు శ్రద్ధగా వ్రాసుకుంటున్నాము. మూడో వాడు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.

నాన్నగారు ఆ వచ్చిన పెద్దాయనతో అంటున్నారు..

‘వీళ్లిద్దరూ బాగానే చదువుకుంటున్నారండి, సీట్లు రావచ్చు.’

కాసేపు ముచ్చట్లు చెప్పాక ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. ఊర్లో ఈ వార్త పొక్కింది. మెరిట్ స్టూడెంట్స్‌గా ముద్రపడిన ముగ్గురిలో ఇద్దరికి సీట్లు రావడం ఖాయమని అనుకున్నారు.

అసలేం జరిగింది.. మేము ఆరోజున క్లాస్ లు ఎగ్గొట్టి మాట్నీ, ఫస్ట్ షో (రెండాటలు) చూసేసి, ఆనంద్ భవన్‌లో సెకండ్ కర్రీతోనే ఫుడ్ లాగించేసి, హడావుడిగా రూమ్‌కి వచ్చేసి, రోజున పార్థా క్లాస్‌లో వ్రాసుకున్న నోట్స్ ని జాగ్రత్తగా మా నోట్ బుక్స్ లోకి ఎక్కిస్తున్నామన్న మాట. అప్పుడు పెద్దోళ్లు రావడం నిజంగా మా అదృష్టం. ఆ క్షణంలోనే దేవుడ్ని ఇద్దరమూ పూర్తిగా నమ్మేశాం. ఆ తర్వాత ఎప్పుడో మేమిద్దరం తిరుమల వెళ్ళినట్లు గుర్తు. అంతే కాదు, అప్పుడు నాకనిపించింది, పార్ధూ మా బ్యాచ్‌లో చేరకపోవడం మంచిదే అయింది. వాడు రెగ్యులర్‌గా క్లాస్ లకు వెళుతూ, నోట్స్ వ్రాసుకోవడం వల్లనే, వాటిని మేము చూసి వ్రాసుకునే అవకాశం రావడం వల్లనే ఈ గండం గడిచిందని వాడిని మెచ్చుకున్నాను. అందుకే పార్ధా అంటే నాకు బోలెడు ఇష్టం.

జీవితంలో చాలా పెద్దయ్యాక తెలిసింది ఏమిటంటే, అదృష్టం ఎప్పుడూ మన వెంటే రాదు. అది చాలా చంచలమైనది. లక్ష్మీదేవి లాగానే. కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఇచ్చే ఆనందం శాశ్వతం. ఆనంద దాయకం. జీవన సాఫల్యానికి ఇదే సరైన మార్గం. విజయానికి దగ్గరి దారి ఉండదు. కానీ ఇలాంటి సూత్రాలు తెలుసుకునే లోపే జీవితంలో సగభాగం దాటిపోయింది. సరే, ఎంట్రెన్స్ ఫలితాలు వచ్చాయి. మా ఇద్దరికీ సీటు రాలేదు. పార్థాకీ రాలేదు. మా కాలేజీలో ఒకడికి దివ్యాంగుల కోటాలో సీటు వచ్చింది. సర్లే, వాడన్నా పేరు నిలబెట్టాడని లెక్చరర్లు, ముఖ్యంగా సైన్స్ పాఠాలు చెప్పిన లెక్చరర్లు సంతోషపడ్డారు.

అక్కడితో ఎంబీబిఎస్ డాక్టర్ కావాలన్న కోరిక చప్పబడింది. కానీ డిగ్రీ చదువుతున్నప్పుడే డాక్టర్ కోర్సు చదివే మరో అవకాశం వచ్చింది.

హోమియో డాక్టర్:

నందిగామలో చదువుకుంటున్నప్పుడే నా మరో ఫ్రెండ్ విష్ణు వాళ్ల ఫాదర్ ఓ చక్కటి సూచన చేశారు. కానీ నాకు గానీ, వాడికి గానీ ఆ సూచన బుర్రకెక్కలేదు. కాలేజీ చదువులప్పుడు నందిగామలో ఎక్కడికి వెళ్ళినా నేనూ, విష్ణు, పార్థా కలిసే వెళ్ళే వాళ్లం. పార్ధాదేమో అనాసాగరం అని చెప్పాను కదా. ఇక మా ఇల్లు, విష్ణు ఇల్లు దాదాపుగా ఆనుకునే ఉండేవి. మేమిద్దరం చేసిన అనేక ప్రయోగాల గురించి ‘పలికింది ఆకాశవాణి’ ఛాప్టర్‌లో వ్రాశాను కదా.

ఆ రోజుల్లోనే విష్ణు వాళ్ల ఫాదర్ డాక్టర్ మేకపోతుల వెంకటపతి గారు మంచి లీడింగ్ హోమియో డాక్టర్. ఊర్లో ఉన్న శివాలయం, రామాలయం వద్ద దర్శనం కోసం వేచి ఉండే భక్తుల రద్దీ కంటే ఈయన ఇంటి వద్ద ఎక్కువగా పేషెంట్స్ ఉండేవారని చెప్పుకునే వారు. ఇది నిజం కూడా. నందిగామ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అనేక మంది రోగులు, వారిని తీసుకువచ్చిన వారూ కలసి రోజూ కనీసం 50 మందైనా వస్తుండేవారు. డాక్టర్ వెంకటపతిగారు కామెర్ల వ్యాధికి చక్కటి మందు ఇస్తారన్న పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు, పాము కాటుకి మందు ఇస్తే చిటికలో విషం దిగిపోతుందని కూడా గ్రామస్థులు అనుకునే వారు. సైన్స్‌లో డిగ్రీ చేస్తున్న రోజుల్లో ఓ రోజు వారిని ఓ ప్రశ్న అడిగాను. ‘మీరిచ్చే హోమియో పిల్స్ కి నిజంగానే విషం దిగిపోతుందా?’ అని. దానికి ఆయన నవ్వుతూ – ‘చూడు నాగరాజు (నన్ను మా ఊర్లో రాజు అని, నాగరాజు అని కూడా పిలిచే వారు) పాములన్నీ విష పూరితం కావు. ఒకటి రెండు జాతులు మాత్రమే విషపూరితం. అవి కాటేస్తే విషం నిమిషాల్లో తలకెక్కి మెదడు మొద్దు బారుతుంది. రక్త ప్రసరణ ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోనూవచ్చు. దీంతో మనిషి మరణించవచ్చు. అయితే చాలా మంది విషపూరితం కాని పాము కరిచినా తెగ భయపడిపోతుంటారు. వారి భయం వారి మెదడును మొద్దుబారిస్తుంటుంది. తమకు మృత్యువు తప్పదనుకుంటారు. ఈ రెండో రకం వారికి నేనిచ్చే పిల్స్ ఓ అపారమైన నమ్మకాన్ని, విషం దిగిపోతున్నదన్న భావనను కలిగిస్తుంది. అందుకే విషం ఎక్కిన సీరియస్ కేసైతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమంటాను. రెండో రకం వారిని మాత్రం ఈ మాత్రలు వేసుకుని ఇక్కడే పడుకోమంటాను. ఓ నాలుగు గంటలయ్యాక వారు తమకు ప్రమాదం గడిచిందని భావించి సంతృప్తితో వెనక్కి వెళ్ళిపోతారు. నమ్మకం ఉన్న చోటునే మందు పనిచేస్తుంది’ – ఈ మాటలు నాకిప్పటికీ వేద మంత్రాల్లా అనిపిస్తాయి.

ఆ రోజుల్లోనే రాజమండ్రి హోమియో కాలేజీ బాగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత దాని పేరు అల్లు రామలింగయ్య హోమియో కాలేజీగా మారింది. పేరు మారక ముందే డాక్టర్ వెంకటపతిగారు మా ఇద్దర్నీ (నన్ను, విష్ణుని) ఓసారి పిలిచి, ‘రాజమండ్రి వెళ్ళండి , నేను చెబుతాను హోమియో కోర్స్‌లో చేరండి’ అని హితవు పలికారు. ఎందుకో తెలియదు కానీ దాన్ని మేము వ్యతిరేకించాము. అయితే వాడూ నేను పిజీ చేశాక వాడి మనసు మారింది. అప్పుడు రాజమండ్రి వెళ్ళి హోమియో కోర్స్ పూర్తి చేసి డాక్టర్ విష్ణువర్ధన్ అయ్యాడు. ఇప్పుడు వాడు విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆధునిక హోమియో వైద్యం విషయంలో అనేక పరిశోధనా పుస్తకాలు చదువుతుంటాడు. ఆ మధ్యనే నేను ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు నాచేత కూడా ఓ నాలుగు పుస్తకాలు తెప్పించుకున్నాడు. కదిలిస్తే చాలు వాడెన్నో కేసులు – మందుల గురించి అనర్గలంగా చెబుతుంటాడు.

ఇలా డాక్టర్ అవ్వాలన్న కోరిక, అవకాశం చేజారక నేను లెక్చరర్ అవుదామనుకుంటుండగా అనుకోని రీతిలో మలుపు తిరిగి (‘ఈ పడవకెంత దిగులో..’ అంటూ 9వ ఛాప్టర్ దీనికి సంబంధించిన విషయాలు చెప్పాను కదా అలా) జర్నలిస్ట్‌గా మారాను. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రప్రభుత్వం నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నాను.

ధనా‘ధన్’ అంటూ ధన్ కాలేజీలో చేరినా, ఫటాఫట్ అంటూ పరీక్షలు వ్రాసినా మా ముగ్గురిలో (నేను, బాబు, పార్థా)ల్లో నేనేమో జర్నలిస్ట్ అయితే, విజయబాబేమో విజయవాడ లయోలా కాలేజీలో లెక్చరర్ నుంచి వైస్ ప్రిన్స్‌పాల్ దాకా ఎదిగాడు. వీడు ఎన్.సి.సి. ఆఫీసర్‌గా ఛీప్ మినిస్టర్ మెడల్ సంపాదించుకున్నాడు. అంతే కాదు, చక్కటి రచయిత కూడా. ఇక పార్థా వ్యాపారంలోకి దిగాడు. కానీ బ్రెయిన్ ఫీవర్‌తో అకాల మరణం చెంది మాకెంతో దుఃఖం మిగిల్చాడు. మరోసారి పార్ధాకీ నాకూ మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి చెబుతాను. పెద్దవాళ్లు మమ్మల్ని బైపీసీలో చేర్పించి డాక్టర్ అవుతారీ పిల్లలు అనుకున్నా ఎవ్వరమూ ఎంబీబీఎస్ డాక్టర్లు కాలేకపోయాము. అయినా జీవితంలో ఓ సాఫల్యత సంపాదించుకున్నాం. ఇది చాలు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here