తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-26

0
2

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ఠీవీగా..:

ఆదివారం ఉదయం 9 గంటలు కావస్తోంది. గేటు చప్పుడు అవడంతో అటుగా చూశాను. వాడే, మా ఫ్రెండ్ గాడే. సైకిల్ లోపలపెట్టి దాదాపు పరుగులాంటి నడకతో లోపలకు వచ్చి – నేల మీద చతికిలపడ్డాడు. అప్పటికే హాల్‌లో పిన్నా పెద్దా కలిసి ఓ పదిమంది కూర్చుని ఉన్నారు. అందరూ సర్దుకునే సరికి గడియారం 9-30 సూచిస్తోంది. ఇంట్లో ఓ వారగా టివీ సెట్టు ఠీవీగా నిలబడి ఉంది. అందరూ వచ్చారా అన్నట్లుంది దాని చూపు. అంతలో టివీ తెరపైన మరికొద్ది క్షణాల్లో – రామాయణ్ – అన్న వాక్యాలు కనబడ్డాయి. మా ఫ్రెండ్ గాడు తన ముఖానికి పట్టిన చమట తుడుచుకుంటూ కాస్తంత ఫ్యాన్ దగ్గరకు జరిగాడు. వాడి పేరు పార్థసారధి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వీడి పేరు ప్రస్తావించాను. నాకున్న ఆత్మీయ స్నేహితుల్లో ఇతగాడు కూడా ఒకడే. వీడిది నందిగామ దగ్గర్లోని అనాసాగరం. వాడూ నేను ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాము. వాడి నాన్నది బట్టల వ్యాపారం. ఆదివారం షాపుకి సెలవు. అందరూ ఇంట్లోనే ఉంటారు. కానీ వీడు మాత్రం ఆదివారమైనా ఏదో పనిపెట్టుకుని నందిగామ వచ్చి, మా ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసేవాడు. ఇప్పుడు మాత్రం కేవలం టివీలో రామాయణం చూడటం కోసమే నందిగామ వచ్చాడు. టైమ్‌కి చేరుకోవాలన్న తొందరలో సైకిల్ స్పీడ్‌గా తొక్కడంతో పాపం వాడు అలసిపోయాడు.

ఆ రోజుల్లో (80వ దశకం) చాలా మంది ఇళ్లలో టివీ సెట్లు లేవు. ఒక వేళ ఉన్నా, కలర్ టీవీలైతే దాదాపు లేనట్లే. కలర్ టీవీ కదా అని ఆ సెట్లో ప్రత్యక కార్యక్రమాలంటూ ఏవీ ఉండవు. ‘బ్లాక్ అండ్ వైట్ అయినా, కలర్ టివీ అయినా ప్రసారాలు ఒక్కటేరా’ అని మరో ఫ్రెండ్ మా ఇంట్లోకి టీవీ రావడానికి చాలా రోజుల ముందే, నాకు కొంతలో కొంత జ్ఞానోదయం చేశాడు. అప్పటికే తెలుగు సినిమాల్లో కూడా కలర్ మూవీస్ సంఖ్య క్రమంగా పెరగసాగింది. కలర్ ఫిల్మ్ ఖర్చు నిర్మాతలు భరించే స్థాయికి తగ్గింది. ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్ (ఈస్ట్‌మన్ కొడాక్ కంపెనీ వారి ఫిల్మ్)తో తీస్తే ఆ సినిమా సప్తవర్ణాలతో తళతళా మెరిసిపోతుండేది. అలాగే గేవా ఫిల్మ్‌తో కూడా కలర్‌లో సినిమాలు తీసేవారు. మొత్తానికి కలర్ సినిమాలు, వాటికి వాడే ఫిల్మ్ నాణ్యత గురించి స్నేహితుల్లో కొందరు అప్పుడప్పుడు క్లాస్‌లు పీకుతుండటంతో నాకూ బోలెడు నాలెడ్జ్ వచ్చినట్లు ఫీలయ్యేవాడ్ని. తెలుగులో లవకుశ (1963) పూర్తి నిడివి ఉన్న కలర్ సినిమా. దీన్ని గేవా కలర్ తోనే తీశారని నా కాలేజీ ఫ్రెండ్ ఓసారి చాలా వివరంగా చెప్పాడు. సినిమా చూడటం నాబోటి వాడు చేసేపని అయితే, వాడేమో సాంకేతిక పరిజ్ఞానం కూడా సంపాదించుకుని అవన్నీ తెగ ఫోజులిస్తూ మాకు చెబుతుండేవాడు. లవకుశ తీసిన మరుసటి ఏడాదే అంటే 1964లోనే ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్‌తో అమరశిల్పి జక్కన్న సినిమాని పూర్తి నిడివితో కలర్ లోనే తీశారనీ, అయితే అంతకు ముందే, 1963లో బందిపోటు అనే సినిమాలో ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్‌ని బందిపోటు సినిమాలో ఓ పాటలో వాడారని.. ఇలా ఏవేవో చెప్పేవాడు. అప్పట్లో వాడేదో మేధావి అని మాకనిపించినా, ‘హాయిగా సినిమా చూసి ఎంజాయ్ చేయకుండా ఎందుకీ తపన’ అని ఆ తర్వాత వాడి మీద జోకులు వేసుకునే వాళ్లం.

సరే, ఇప్పుడేమో టివీల్లో కూడా రెండు రకాలు ఉన్నాయని తెలిసింది. కాకపోతే మా ఊర్లో కలర్ టివీ సెట్ కొనుక్కున్న వాడు ఆ రోజుల్లో చాలా తక్కువ. ఏ టీవీ అయినా దూరదర్శన్ వాళ్లు అందించే ప్రసార కార్యక్రమాలే దిక్కు. అప్పటికే రేడియో స్టేషన్లు పాటించే ప్రసార వేళలనే దూరదర్శన్ వాళ్లూ పాటించేవారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రసారాలు అంచెలంచెలుగా ఉండేవి. దూరదర్శన్‌లో చిత్రలహరి అనే కార్యక్రమం చాలా పాపులర్ అయింది. తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఇది. అప్పటి వరకు ఆకాశవాణి (రేడియో) ప్రసారం చేసే పాటలు వింటూ ఆనందించే శ్రోతలు ఉన్నట్లుండి ప్రేక్షకులుగా మారిపోయి, అవే పాటలను ఇంట్లో కూర్చుని వీక్షించడం ఓ మధురమైన అనుభూతి. చిత్రలహరి వస్తున్న సమయంలో కరెంట్ పోతే ఉన్నట్లుండి అందరిలో నిరాశ నిస్పృహలు ఆవరించేవి. కరెంట్ వాడిమీద బోలెడు కోపం కూడా వచ్చేది. ఈ సందర్భాన్నే ఓ సినిమా కవి తన పాటలో..

‘చిత్రలహరిలో కరెంట్ పోతే టేకిటీజీ పాలసీ..’ అంటూ వ్రాశాడు. కానీ అంత ఈజీగా తీసుకోలేక పోయేవాళ్లం. మంచి పాట, అచ్చు సినిమా హాల్లో కూర్చుని చూస్తున్నట్లు ఫీలవుతుంటే వీడు – కరెంట్ గాడు పుటుక్కున వైరు తెంపినట్లు, ఫీజు పీకినట్లు చేస్తే మరి కోపం రాదా ఏంటీ..?

తీరా కరెంట్ వచ్చే సరికి – చిత్రలహరి అయిపోయేది. ఏదో చెత్త కార్యక్రమం వస్తుండేది. పాపం – దూరదర్శన్ వాళ్లు మాత్రం చాలా మంచి కార్యక్రమం అనే ప్రసారం చేసినా మాకేమో చెత్త.. పరమ చెత్త కార్యక్రమం అన్న భావనే కలిగేది.

అసలు ఈ కరెంట్ వాళ్లకు ఎంటర్టైన్‌మెంట్ వాల్యూ తెలియదు. రేడియోలో నాటికలు, నాటకాలు లేదా సంక్షిప్త శబ్ద చిత్రాలు వచ్చేటప్పుడు కూడా ఇలాగే పుటుక్కున కరెంట్ ఆపేసేవాడు. నా దృష్టిలో ఈ కరెంట్ వాడు ఓ శాడిస్ట్. పైగా ఒకసారి కరెంట్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. రాత్రి పూటైతే మనం నిద్రలోకి జారుకున్నాక కరెంట్ వచ్చేది. టివీ సెట్ స్విచ్ ఆఫ్ చేయడం మరచిపోతే – ‘గుర్ర్.. ఘుర్రూ.. గుర్..’ వంటి శబ్దాలు చేసేది. ఆ విచిత్ర సౌండ్స్‌కి మొదట్లో భయమేసేది. ఏ జంతువో వచ్చిందని అనుకునేవాళ్లం. తీరా చూస్తే, కరెంట్ రావడంతో సెట్ ఆనవుతుంది. కానీ అప్పటికే దూరదర్శన్ వాడు మౌనముద్రలోకి వెళ్లడంతో ఇదిగో ఈ విచిత్ర సౌండ్స్ వచ్చి మమ్మల్ని కలవరపరిచేవి.

రేడియో పరిస్థితి అంతే. కాకపోతే రేడియో సెట్లలో కొన్నేమో బ్యాటరీతో నడిచేవి. కరెంట్ రేడియో ఉన్న ఇళ్లలో ఏ నాటకమో, లేదా మరో మంచి కార్యక్రమమో వింటుంటే, సరిగా ఆ సమయంలో కరెంట్ పోయేది. ఈ గోల భరించలేక చాలా మంది కరెంట్ రేడియో ఉన్నప్పటికీ బ్యాటరీ రేడియో సెట్ ఒకటి కొనిపెట్టుకునేవారు. ఇలాంటి ఇబ్బందులను సున్నితంగా చెబుతూ నండూరి వారి నాటిక అనుకుంటా – ‘నాటకం విన్నారు’ ప్రసారమైంది. ఓ ఇంట్లో పిన్నా పెద్దా నాటకం వినడానికి రేడియో సెట్ దగ్గర కూర్చున్నారు. వాల్యూమ్ పెంచి శ్రద్ధగా వినడానికి సిద్ధమయ్యారు. రేడియోలో ఎనౌన్సర్ – ‘ఇప్పుడు నాటకం వింటారు..’ అని ఎనౌన్స్ చేయగానే అంతా చెవులు రిక్కించారు. కానీ.. అంతలో కరెంట్ పోయింది. ఇంట్లో అందరూ నిరుత్సాహపడ్డారు. కాసేపు అయ్యాక కరెంట్ వచ్చింది. రేడియో తిరిగి ఆన్ అయింది. అప్పుడు ఆ రేడియో సెట్ నుంచి వచ్చిన మాటలు – ‘నాటకం విన్నారు’ – అని. ఇది ఎనౌన్సర్ ఇచ్చిన క్లోజింగ్ ఎనౌన్స్ మెంట్.

ఇలాంటి ప్రయోగాత్మక నాటికలు ఆ రోజుల్లో ఆకాశవాణి నుంచి వచ్చేవి. నేనూ ఇలాగే రేడియోకి నాటికలు వ్రాయాలని అనుకున్నాను. కానీ కోరిక తీరుతుందా..?

భగవంతుడు ఏమనుకున్నాడో ఏమో.. ఆ కోరిక విజయవాడలో నేను పనిచేస్తున్నప్పుడు తీరింది.

ఆ రోజుల్లో రేడియో కళాకారులకు భలేగా క్రేజ్ ఉండేది. వివిధభారతి కార్యక్రమాలు పాపులర్ అయ్యాక ఆ ఎనౌన్సర్లను చూడాలని తెగ అనుకునేవాళ్లం. వారి శ్రావ్యమైన గొంతుని బట్టి వారి ఆకారాన్ని ఊహించుకునే వాళ్లం. మా ఊహల్లో వారంతా హీరోలు.. హీరోయిన్లే. ఇలాంటి వారిని చూడాలని నేనూ కలలు కన్నాను. నా కలల కోరిక తీరింది. రేడియో రామం గార్నీ, డిఎస్సార్ ఆంజనేయులు, ఉషశ్రీ వంటి వారిని చూడటం తటస్థించింది. రామం గారితో ఛానెల్5ఏఎంలో ప్రత్యేక కార్యక్రమం కూడా ఇచ్చాను. ప్రయాగ రామకృష్ణ గారిని తరంగా స్టూడియోకి ఆహ్వానించి వారితో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాను. న్యూస్ రీడర్స్ కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ వంటి ప్రముఖలను చూడటమే కాకుండా, వారి ప్రక్కన కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఎంవీఎస్ ప్రసాద్ వంటి అధికారులతో కలసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆంధ్రప్రభ – విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు తన స్క్రిప్ట్‌ని పట్టుకుని కార్యాలయానికి వస్తుండేవారు. అలా ఆయన పత్రికాఫీస్ లోకి ఎంటరవుతూనే, ఏదో ఒక సబ్ ఎడిటర్‌ని –

‘ఒరేయ్ ఇటు రా..’ అని పిలిచేవారు.

ఆ సబ్ ఎడిటర్ పెద్దాయన దగ్గరకు వచ్చేవాడు.

‘సుబ్రహ్మణ్యం లేడా’ అని అడిగేవారు.

సుబ్రహ్మణ్యం అనే ఆయన ఎడిటర్ గారికి పీఏ.

ఏదో పనిలో ఉన్న మనం ఆ కంచుకంఠం వినగానే తెలియని ఆనందం కలిగేది. ఎందుకంటే ఈ కంఠమే రేడియోలో రామాయణం, మహాభారతం ప్రతి ఆదివారం వినిపించేది. వారిని చూడటం ఓ అదృష్టంగా భావించాను. ఊషశ్రీ – గారి రామాయణం, మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం. రేడియోలో ఆదివారం మధ్యాహ్నం ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడ్ని. దీంతో ఆయన వాయిస్ ఇమిటేట్ చేయాలని అనిపించేది. కొంత వరకు సాధన చేశాను కూడా. ఒకటి రెండు సార్లు ఉషశ్రీ కంఠాన్ని కాలేజీ కార్యక్రమాల్లో అనుకరణ చేసి మెప్పుపొందాను కూడా. ఉషశ్రీ గారి కుమార్తెలతో నేను, తరంగాలో ప్రొగ్రామ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు – ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాను. పురాణపండ వైజయంతి గారితో నా పరిచయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆమెతో ఛానెల్ 5ఏఎంలో కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేశాను. ఉషశ్రీ గారి పేరు తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నా నరాల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంటుంది. విశ్వనాథుల వారిలాగానే వీరు కూడా నా మనోఫలకంపై చెరగని ముద్ర వేశారు.

టివీ వచ్చాక మనిషి కనబడుతుండటంతో వాళ్లు వేసుకున్న డ్రెస్, మేకప్, హావభావాలు వంటి వాటి గురించి తెగ చెప్పుకునే వాళ్లం. ఆడవాళ్లైతే ఏ ఎనౌన్సర్ ఏ బోర్డర్ చీర కట్టుకుంది. ఆమె ఎలాంటి బొట్టు పెట్టుకుంది వంటి అంశాలు కాలక్షేపం కబుర్లుగా చెప్పుకునే వాళ్లు. కలర్ టీవీలు ప్రాచుర్యంలోకి వచ్చాక రంగుల ప్రసక్తి కూడా మాటల్లో దొర్లడం మొదలైంది.

దూరదర్శన్ వాళ్లు ప్రజాహిత కార్యక్రమాలు అనేకం ప్రసారం చేసేవారు. అయితే ప్రేక్షకుల్లో చాలా మందేమో వినోద కార్యక్రమాలు, సినిమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఈ అంతరం కారణంగా డిడీని ఎక్కువ మంది విమర్శిస్తుండే వారు. అలాంటి విమర్శల్లో ఒకటి – డిడీ ఎప్పుడూ పందుల పెంపకం, గొఱ్ఱెల పెంపకం, పొలం పనులు నుంచి పిడకలు చేయడం ఎలా? వరకు చూపిస్తున్నదన్నది. ఇలాంటి కార్యక్రమాలు రేడియోలో వచ్చినా కేవలం అది శబ్దానికే పరిమితం అవడంతో ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ దృశ్యం కూడా కలవడంతో డిడీలో ఇలాంటి కార్యక్రమాలు ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉండేది. అయితే కొన్ని కార్యక్రమాలు మాత్రం చాలా పాపులరయ్యాయి. పైన చెప్పినట్లు చిత్రలహరి లాగానే తెలుగు సినిమాల ప్రసారం, ఆదివారం వచ్చే రామాయణం, మహాభారతం వంటివి అందర్నీ టీవీ సెట్ల ముందు కూర్చోబెట్టేవి. అలాగే, తెలుగులో వార్తలు – ఆ రోజుల్లో అందరూ ఆసక్తిగా గమనించేవారు. శాంతిస్వరూప్, విజయదుర్గ, రోజారాణి వంటి వాళ్లు వార్తలు చాలా చక్కగా అక్షర దోషాలు లేకుండా చదివేవారు. ఆ రోజుల్లో డీడీ వాళ్లు కొన్ని సీరియల్స్ కూడా ప్రసారం చేసేవారు. నాకు గుర్తున్నంత వరకు ఋతురాగాలు బాగా సక్సెస్ అయిన సీరియల్. ఆ రోజుల్లో చానెల్స్ మార్చే అవకాశమే లేదు. దీంతో రిమోట్ అవసరమే ఉండేది కాదు. నిర్ణీత వేళల్లో టివీ సెట్ ఆన్ చేస్తే చాలు కార్యక్రమాలు వస్తుండేవి. టివీలో బొమ్మ సరిగా కనపడాలంటే ఇంటి కప్పుమీద యాంటినా బిగించేవారు. అది గాలికి అటూ ఇటూ కదిలినా ఇంట్లో టీవీ సెట్లలో బొమ్మ మాయమై ఆ స్థానంలో చిత్రవిచిత్రంగా గీతలు, చుక్కలు దర్శనమిచ్చేవి. ఎవరో ఒకరు వెళ్ళి యాంటినా సరిచేయాల్సి వచ్చేది. యాంటినా మేడమీద ఉంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి. పెంకుటిల్లు అయితే పైకెక్కడం చాలా కష్టంగా ఉండేది. తుపాన్లు, ఈదురు గాలులు వీచేటప్పుడు చెట్టు కొమ్మలు విరిగిపడి యాంటీనా పాడైపోయేది. దీంతో ఇంట్లో టీవీ సెట్ మూగనోము పట్టేది. ఇలాంటి ఎన్నో సాంకేతిక ఇబ్బందులు, ప్రసార పరమైన ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఇంట్లో కదిలే బొమ్మ చూడటం మాత్రం ఎంతో ఆనందాన్నీ, మరెంతో ఉత్సాహాన్ని కలిగించేది. ఇంట్లో టివీ ఉంటే ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్లు.

ఏదైనా కాలపరిమితికి లోబడి ప్రసారాలు ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు టివీని వీక్షించే అవకాశం ఆ రోజుల్లో ఉండేది కాదు. 90వ దశకంలో శాటిలైట్ ఛానెల్స్ రావడంతో ఈ సమస్య తొలిగిపోయింది. ఈటీవీ రాకతో టివీ ప్రేక్షకుల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. దీనికి తోడు కేబుల్ టివీ సౌకర్యం రావడంతో మరికొన్ని వినోద కార్యక్రమాలు చూడటానికి వీలుచిక్కేది. కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్ తన స్టూడియో నుంచి వార్తలు కూడా ప్రసారం చేసేవాడు. ఇలా టివీ బొమ్మ చూడటంలో స్వేచ్ఛ అందుకోవడం మొదలైంది. టీవీ చుట్టూ ఎన్నో కబుర్లు, కథలు ఆ రోజుల్లో వినేవాడ్ని.

1982లో మన దేశం ఆసియన్ గేమ్స్‌కి ఆతిథ్యమిస్తున్నప్పుడు కలర్‌లో దూరదర్శన్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పట్లో ఇదో వింత. నెమ్మదిగా సాంకేతికంగా పుంజుకుని దూరదర్శన్ తెలుగు ప్రసారాలు కూడా కలర్‌లో ప్రసారం కావడం మొదలైంది. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ బుల్లితెర మీద చూసిన ముఖాలు ఉన్నట్లుండి కలర్‌లో చూసేసరికి ప్రేక్షకుల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. 1987-88లో నేను విజయవాడ ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు (రిలయన్స్ వరల్డ్ కప్ పోటీలు) జరిగాయి. అప్పటికే కాస్తో కూస్తో స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడంతో ప్రభ వాళ్లు నన్ను స్పోర్ట్స్ పేజీ చూడమన్నారు. ఈ విషయం తెలిసి నవభారత్ పబ్లిషర్స్ ప్రకాశరావు గారు పిలిపించుకుని అప్పటికే సిద్ధమైన క్రికెట్ మీద పుస్తకంలో వన్ డే క్రికెట్ గురించి యాడ్ చేయమని కోరారు. మిత్రుడు వెంకటేశ్ ఈ పుస్తకంలో క్రికెట్ చరిత్ర వ్రాశాడు. అయితే వన్ డే క్రికెట్ ప్రస్తావన లేకపోవడంతో అది పూర్తి చేసే అవకాశం నాకిచ్చారు. నేను ఆ పని చేసినందుకు ఆ రోజుల్లో రెండువేల రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా బ్లాక్ వైట్ టీవీ (ఒనిడా కంపెనీ) పోర్టబుల్ సెట్ కొన్నాను. అది మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే కాదు, ప్రక్క ఇళ్ల వాళ్లలోనూ ఉత్సాహం వెల్లివిరిసింది. ఒనిడా టీవీ వాడి యాడ్ చాలా పాపులరైంది. అది ఇలా ఉండేది..

‘Neighbour’s envy,

Owners pride’

ఈ ప్రకటన టివీలో వచ్చేటప్పుడు ఓ డెవిల్ ప్రత్యక్షమయ్యేది. గుండుతో ఉండే భూతానికి రెండు కొమ్ములు కూడా ఉండేవి. కాస్తంత వింతగానూ, ఆసక్తి కలిగించేదిగానూ ఈ యాడ్‌ని రూపకల్పన చేయడంతో 80వ దశకంలో ఒనిడా టీవీ పాపులర్ అయింది.

బ్లాక్ అండ్ పోర్టబుల్ టివీ ఇంటికి రాగానే ఇంట్లో పిల్లలకు అందకుండా ఎత్తైన చోట పెట్టాలని అనుకున్నాము. దాని కోసం ప్రత్యేకంగా గోడకు చెక్క ప్లాట్ ఫామ్ బిగించడం కుదరలేదు. ఎందుకంటే ఇంటి ఓనర్ చాలా కఠినాత్ముడు. పైగా అతగాడి కళ్లు, చెవులు ఎప్పుడూ అద్దెకున్న వారిమీదనే కేంద్రీకృతమయ్యేవి. గోడకు మేకు కొట్టాలన్నా భయం. దీంతో అప్పటికే గోడకు బిగించి ఉన్న షో కేస్ లోనే మా బుజ్జి టీవీని దూర్చేసి ఊపిరి పీల్చుకున్నాము. అయినా మా పిల్లోడో, ప్రక్కింటి పిల్లలో ఎవరన్నా బంతి విసిరితే టివీ ఏమైపోను అని మా ఆవిడ అనగానే నాకూ అదే డౌట్ వచ్చింది. అందుకే టివీ చూడనప్పుడు ఆ షోకేస్ తలుపులు వేస్తే, టివీకి రక్షణ వచ్చేస్తుందని చెప్పాను. ఆ రోజుల్లో టివీ రాగానే దానికో అందమైన పెట్టే కూడా ఏర్పాటు చేసుకునేవారు. దానికి స్లైడ్ చేసే డోర్ ఉండేది. ఇంకొందమంది సినిమా హాలు తెరకు కర్టెన్ పెట్టినట్లుగా ఇంట్లో టీవీకి ఒక మంచి క్లాత్ తో తెర ఏర్పాటు చేసేవారు. ఇంట్లోకే సినిమా హాలు వచ్చినట్లు సంబరపడేవారు. కొంత మందైతే టివీ సెట్ రాగానే గుమ్మడి కాయతో దిష్టి తీసేవారు. బొమ్మ కనబడగానే అగరబత్తి వెలిగించి, హారతులు ఇచ్చేవారు. ఇదంతా అమాయకత్వం అని ఇప్పుడు అనిపించినా, ఆ రోజుల్లో టివీ పట్ల ఉన్న మోజుకి, ప్రేమకి ఈ చర్యలు నిదర్శనమనే చెప్పాలి.

కుటుంబం ఎదుగుతున్నట్లుగానే టివీ సెట్ లోనూ సాంకేతిక పరమైన ఎదుగుదల చోటుచేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ స్థానంలో టిసీఎల్ కలర్ టీవీ వచ్చేసింది. దశబ్దాలు దొర్లుతున్న కొద్దీ ఇంట్లోకి స్మార్ట్ టివీ వచ్చేసింది. ఇలా మన ఎదుగుదలకు సూచికగా టివీలో మార్పులు చోటు చేసుకున్నాయి.

దూరదర్శన్‌లో ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు రావు కనుక, కొంత మంది వీసీఆర్ (వీడియో రికార్డ్ ప్లేయర్) లేదా వీసీపీ (వీడియో క్యాసెట్ ప్లేయర్)లాంటివి ఏర్పాటు చేసుకునేవారు. ఈ సౌకర్యం రావడంతో వీడియో క్యాసెట్ల అమ్మకాలు ఊపెక్కాయి. అంతకు ముందు టేప్ రికార్డర్లలో టేప్ క్యాసెట్లు పెట్టి సినిమా డైలాగ్‌లు, పాటలు వినడం అలవాటైంది. అదే ఇప్పుడు ఆడియో నుంచి వీడియోకి రూపాంతరం చెందిందన్న మాట. ఆ రోజుల్లో నేనెప్పుడు విజయవాడ లెనిన్ సెంటర్‌కి వెళ్లినా అక్కడ కుప్పలతెప్పలుగా ఈ ఆడియో క్యాసెట్లు, ఆ తర్వాత వీడియో క్యాసెట్లు అమ్మేవారు.

అలాంటి రోజుల్లోనే నందిగామ గాంధీ సెంటర్లో ఓ మినీ థియేటర్ వెలిసింది. రెండు షాపుల మందం ఉన్న హాల్‌లో ఒక వైపున టివీని పెట్టి దాని క్రింద వీడియో ప్లేయర్‌ని ఉంచి అందులో రకరకాల సినిమాలు వేస్తుండేవారు. ఈ సెట్‌కి ఎదురుగా సినిమా హాల్లో మాదిరిగా కుర్చీలు వేయించారు. చీకటి చేయడం కోసం కిటికీలకు, తలుపులకు మందపాటి కర్టెన్లు కట్టించారు. హాల్లో కాస్తంత ఫెర్ఫ్యూమ్ జల్లేవారు. దీంతో చూసేవారికి సినిమా హాల్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చేది. అలాంటి మినీథియేటర్‌లో నేను గాంధీ సినిమాను తొలిసారిగా చూశాను. వ్యాపారం రుచిమరగడంతో మినీథియేటర్ యజమాని రాత్రివేళ బ్లూఫిల్మ్‌లు వేయడం మొదలుపెట్టాడు. ఇది పోలీసుల చెవికి సోకింది. దీంతో రైడ్ చేసి మినీ థియేటర్‌ని మూసేయించారు. ఈ మధ్య విజయవాడ బస్టాండ్‌లో ఓ రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరో చెప్పారు. ఏసీ రెస్ట్ రూమ్ ఉందనీ, అందులో హాయిగా కూర్చుని సినిమా చూస్తూ టైమ్ గడిపేయవచ్చని. చూద్దామని వెళ్ళాను. పెద్ద హాల్లో సోపాలు వేసి ఉన్నాయి. ఏసీ గాలి తగలగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఎదురుగా టివీ సెట్‌లో సినిమా వేస్తున్నారు. అప్పుడు ఇందాక చెప్పిన నందిగామ మినీథియేటర్ సంగతి గుర్తుకువచ్చింది.

ఇంటింటా టీవీలు రావడంతో చాలా చోట్ల పాపం రేడియో సెట్లు అటకెక్కాయి. మా ఇంట్లో కూడా అదే జరిగింది. మహా ఉంటే ట్రాన్సిస్టర్ రేడియోతో సరిపెట్టుకునే వాళ్లం. పెద్ద పెద్ద రేడియో సెట్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడం, కార్యక్రమాలు వచ్చినప్పుడు దాని దగ్గరే కూర్చోవడం వంటి చేష్టలు కనుమరుగైపోయాయి. అప్పటి వరకు రోజూ పొద్దున్నే ఐదు గంటల 55 నిమిషాలకల్లా లేచి రేడియో సెట్ దగ్గరకు వచ్చి సెట్ ఆన్ చేసే ఇంటి పెద్దోళ్లు ఆ తర్వాత టివీ సెట్లను ఆన్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడైతే బోలెడన్ని ఛానెల్స్. ఇంట్లో పెద్దవాళ్లు లేచీలేవగానే టీవీ ఆన్ చేసి భక్తి ఛానెల్స్ పెట్టడం, ఆ సౌండ్‌కి ఇంట్లో కుర్రోళ్లు కసురుకోవడం అక్కడక్కడా కనిపించే నిత్య దృశ్యమే. రేడియో నాటి అలవాటు మానలేక ఇలా సర్దుకుపోతున్నారని కుర్రగ్యాంగ్ అర్థం చేసుకోరూ..

టీవీ ప్రాధాన్యత పెరగడంతో టివీ స్టేషన్ల సంఖ్య కూడా పెరగసాగింది. ప్రైవేట్ ఛానెల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బడాబడా వ్యాపారస్థులు తమ సొంత ఛానెళ్లు పెట్టుకోవడం మొదలెట్టారు. నెమ్మదిగా టివీ సంస్థల్లోకి రాజకీయ వాసనలు కమ్ముకోవడం మొదలైంది. ఛానెల్ పేరు చెప్పగానే అది ఏ పార్టీకి కొమ్ము కాస్తుందో ఇట్టే చెప్పేసే రోజులొచ్చేశాయి. ఒకప్పుడు రోజుకి మూడు నాలుగు సార్లు మాత్రమే వచ్చే వార్తా ప్రసారాలు ఇప్పుడు 24 గంటలూ వస్తుండటంతో క్రమంగా వార్తల నిబద్ధత, నిజాయితీ వంటి గుణాలు తగ్గిపోసాగాయి. చివరకు ఏది వార్తో, మరేది కాదో తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది.

ఎలక్ట్రానిక్ మీడియో మీద మోజు పెరగడంతో అప్పటి వరకు ప్రెస్ మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్‌లు టీవీ సంస్థల్లో చేరడం 90వ దశకం చివర్లో మొదలైంది. విజయవాడలో కంటే హైదరాబాద్‌లో టివీ సంస్థలు ఎక్కువగా ఉండటంతో జర్నలిస్టుల వలసలు మొదలయ్యాయి.

పోటీ పరీక్షలో ఓసారి – దూరదర్శని గురించి వ్యాసం వ్రాయమని ప్రశ్న ఇచ్చారు. నాతోపాటు చాలా మంది పరీక్ష వ్రాశారు. ఈ ప్రశ్నకు నేను దూరదర్శన్ గురించి మూడు పేజీల దాకా దంచి కొట్టాను. తీరా ఇంటికొచ్చాక, కొశ్చిన్ పేపర్ చూసిన మా అన్నయ్య, ఈ ప్రశ్నకు ఏమి వ్రాశావురా.. అని అడిగాడు. నేను డిడీ గురించి చెప్పాను. పప్పులో కాలేశావ్, వారు అడిగింది దూరదర్శని – అంటే టెలిస్కోప్ అన్నాడు. దీంతో నేను నీరుగారిపోయాను.

టివీ కబుర్లు చాలానే ఉన్నాయి. టివీ సంస్థలో చేరడం నా కెరీర్‌లో మరో మలుపు. టీవీ సంస్థలో చేరడమే కాదు, ఆ సంస్థకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు (నంది అవార్డు, యునిసెఫ్ అవార్డ్) అందించగలగడం నాకెంతో తృప్తినిచ్చింది. ఆ వివరాలు మరో సారి ప్రస్తావిస్తాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here