Site icon Sanchika

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-27

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

పాడు వారు..:

[dropcap]కా[/dropcap]లేజీలో చదువుకుంటున్న రోజులు. నందిగామ కేవీఆర్ కాలేజీలో ఇంటర్మీడియేట్, బీఎస్సీ వెలగబెట్టాను కదా. అంటే 1973 నుంచి 78 వరకు సాగిన కాలేజీ లైఫ్‌లో మా మిత్రబృందంతో కలిసి అనేక చిలిపిచేష్టలే కాదు, హీరోగా అనిపించుకోవాలన్న తపన కూడా ఎక్కువైంది. ఒక రోజున క్లాస్‌లో మాష్టారు పాఠం చెబుతుంటే అటెండర్ వచ్చి నోటీస్ ఇచ్చి నిలబడ్డాడు. అంటే, మాష్టారు ఆ నోటీస్‌లో ఉన్నది బిగ్గరగా చదివి ఆ కాగితం ముక్కను తిరిగి ఇచ్చేదాకా వాడు కదలడన్నమాట. ఒక్కోసారి పాఠం యమజోరుగా సాగుతున్నప్పుడు, క్లాస్‌లో మేమంతా శ్రద్ధగా వింటున్నప్పుడు అటెండర్ గాడు పానకంలో పుడకలా వచ్చేస్తుంటాడు. పైగా మాలాగా వాడు లోపలకి వచ్చేటప్పుడు – ‘మై ఐ కమిన్ సార్’ అంటూ మర్యాదగా అడగడు. ‘సార్.. సార్..’ అంటూ బిగ్గరగా అరుస్తూ వస్తుండేవాడు. మాష్టారు వాడివైపు కోపంగా చూసినా వాడేమీ ఇలాంటివి ఖాతర్ చేయడు. ‘ఇలాంటి మాష్టార్లను నా సర్వీస్‌లో ఎంతోమందిని చూడలేదూ..’ అన్నట్లు ఉంటుంది వాడి నిర్లక్షపు చూపు. వాడినో మాట అంటే కాలేజీ అంతా పాకిపోతుందనీ, చివరకు అది ప్రిన్సిపాల్ దాకా వెళుతుందనీ, ఆ పెద్దాయన మెత్తమెత్తగా తననే మందలిస్తాడన్న సంగతి తెలిసిన వారగుటచే, మాష్టారు వాడి చేతిలోని కాగితం తీసుకుని, బిగ్గరగా చదివి ఓ సంతకం పెట్టి కాగితం ముక్కని వాడి ముఖాన కొట్టినంత పనిచేశాడు. వాడేమో అదే నిర్లక్షపు చూపుతో ఆ ముక్కని తీసుకుని ప్రక్క క్లాస్ రూమ్ వైపుకి విసురుగా వెళ్ళాడు. వెళుతూ వెళుతూ మా వైపు అదోలా చూస్తూ నవ్వేవాడు. అందులో ఎన్నో అర్థాలున్నాయని నా బెస్ట్ ఫ్రెండ్ చెబుతుండేవాడు.

ఇంతకీ ఆ నోటీస్‌లో ఏమున్నదో మాష్టారి నోట విన్నాక నాకో చక్కటి ఆలోచన తట్టింది. అంతే కాదు, కాలేజీలో హీరోగా లేదా అధమం- వన్ ఆఫ్ ద హీరోస్‌గా నిలబడాలంటే ఏం చేయాలో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఎస్.. ఇదే సరైన మార్గం అనుకున్నాను. దీన్ని అమలు చేయాల్సిందే అని ఫ్రెండ్ గాడికి చెబితే, ‘ఇంత తొందరెందుకురా, నిదానంగా ఆలోచించు, ఇలాంటి పనులు నీకూ నాకూ అవసరమా’ అని హితబోధ చేశాడు. అబ్బే, మనం ఊరుకుంటామా ఏంటీ, నో.. ఈ ఛాన్స్ మిస్సయితే నాలోని హీరోయిజం ప్రదర్శించే అవకాశం మరొకటి రావద్దూ.. అప్పటి దాకా వేచి ఉండడటమా.. నో..

మాష్టారు నోటీస్ చదువుతూ అన్న మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.

‘డియర్ స్టూడెంట్స్.. ఘంటసాల జయంతి సందర్భంగా పాటల పోటీలు ఉంటాయి. ఆసక్తి ఉన్న సింగర్స్ పేర్లివ్వచ్చు’

మా ఫ్రెండ్ చెవిలోని జోరీగలా హితవు పలుకుతున్నాడు..

‘ఒరే, సింగర్స్‌ని కదరా పేర్లు ఇమ్మన్నారు. నువ్వు సింగర్ కావుకదా. నీకెందుకు ఈ పోటీ. అదే డిబేట్ అంటే నువ్వు పేరిచ్చినా నేను ఊరుకుంటాను. డ్రాయింగ్ పోటీలు, సింగింగ్ పోటీలు మనకెందుకురా..’ ఇది వాడి మాటలు.

మాములుగా ఐతే నేను వాడి మాటలు వింటాను. ఆలోచిస్తాను. కానీ ఈసారి అలా చేయదలచుకోలేదు. ఎందుకంటే..

స్కూల్లో చదివే రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ, కాలేజీలో చేరాక ఓ విషయం బాగా అర్థమైంది. కాలేజీ మొత్తం మీద బాగా పాటలు పాడే వాళ్లు ఓ నలుగురైదుగురు అబ్బాయిలు ఉంటారు. అలాగే అమ్మాయిలూ ఉంటారు. ఎప్పుడు ఏ అకేషన్ వచ్చినా సందు చూసుకుని మైక్ పట్టుకుని వీళ్ళే తెగ పాడేస్తుంటారు. పైగా సింగర్స్ లేడీస్ గ్రూప్‌తో ఈ మొగ సింగర్స్ బ్యాచ్ తెగ చనువుతో ఉండేది. ఇకఇకలు, పకపకలు. ఏదో వారు గ్రేట్ అయినట్లు, అక్కడికి మేమేదో అధములమైనట్లు బోడి ఫీలింగ్ ఒకటి. ఈ అసమానత్వ పోకడ మీదనే నా పోరాటం. అందుకే నా యీ శంఖారావం. సింగర్స్ ఆధిపత్యం చాలా దూరం వెళ్ళిందని పసిగట్టాను. పరీక్షలకు ముందు, పరీక్షలు వ్రాశాక వీళ్లు లెక్చరర్స్ చుట్టూ తిరగడాలు, మచ్చిక చేసుకోవడాలు, మార్కులు ఎక్కువ పడేలా చూసుకోవడాలు ఇవన్నీ వారి కుట్రలో భాగాలే. అంతేనా, వారి కుట్రలు ఇంకా మితిమీరాయి. అమ్మాయిల వద్ద తెగ ఫోజులు కొడుతుండేవారు. అమ్మాయిలు, పాపం అమాయకులు కదా.. వారి మాటలకు తల ఊచేవాళ్లు. వారిలో కొందరు ప్రేమలో పడిపోవడం కూడా చూశాను. పాటలతో పడేయడం అంటే ఇదేనేమో. ఇలాంటి సింగర్స్‌ని హీరోలుగా భావించడంలో ఈ ఆడపిల్లలకు కులం, మతం వంటివి అడ్డు వచ్చేవి కావు. ఒక్కోసారి ఈ హీరో ఫాలోయింగ్ కారణంగా ప్రేమ మత్తు ఆవహించడం, కొన్ని సార్లు ఇంట్లో వాళ్లతో గొడవలు జరగడం వంటి సంఘటనలు మా ఊర్లోనే కొన్ని చూశాను.

ఈ పాటగాళ్ల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నప్పుడే ఈ నోటీస్ రావడం, నా మెదడులో మెరుపు మెరవడం తటస్థించాయన్న మాట.

ఏం చేయాలో అర్థమైంది. మర్నాడు నేరుగా ఆఫీస్ రూమ్‌కి వెళ్ళి సింగింగ్ కాంపిటేషన్‌లో పాల్గొంటున్నాను అని చెప్పాను. అక్కడ ఉన్న క్లర్క్ నన్ను ఎగాదిగా చూశాడు. ‘నువ్వు ఎనాడూ పాడి ఎరుగవే, నీకెందుకురా ఈ పాటల పోటీ’ అన్నట్లు ఉండేది ఆయన గారి చూపు. ఆయనా నాకు బంధువే అవుతార్లేండి. కానీ ఏం లాభం.. ఈ బంధువులున్నారే వాళ్లే నాలోని ఉత్సాహాన్ని అణచివేసేది. ఈ విషయం చాలా సందర్భాల్లో అర్థమైంది. అయితే ఇలాంటి వాళ్ల మాటలు నేను పట్టించుకోదలచుకోలేదు. ఎందుకంటే అప్పటికే కీలక నిర్ణయం తీసుకోవడం అయిపోయింది కదా. ఇక ఆచరణ ఒక్కటే మిగిలింది.

సింగింగ్ పోటీలకు పాల్గొనే పాటగాళ్ల జాబితాలో నా పేరు ఎక్కింది. కొంత మంది మాష్టార్లు సైతం ఖుంగుతిన్నారు. తినరా మరి, కాలేజీ స్టేజ్ మీద నేను ఎప్పుడూ పాడలేదు. అలా అని స్టేజీ ఫియర్ ఉన్నదని అనుకునేరు. అదేమీ కాదు. అడపదడపా మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడ్ని. అప్పుడప్పుడూ డిబేట్స్‌లో కూడా పాల్గొనే వాడ్ని. అంతదాకా ఎందుకు వార్షికోత్సవ వేడుకల్లో నాటికలు వేయించాను. పాత్రలు పోషించాను. దర్శకత్వం వహించాను. (ఇవన్నీ ‘తొలి వేషం’ అన్న భాగంలో చెప్పాను కదా) కనుక భయపడటం అనేదీ లేదు. తగ్గేదే లేదు. కాకపోతే పాడువాడ్ని కావడమన్నది ఓ కొత్త అవతారం. అందుకే కాలేజీలో ఈ అలజడి.

నిజానికి అప్పటికే పాటలు పాడాలని చాలా సార్లు అనుకున్నాను. ఎందుకో ‘రాగ భయం’ ఉండటంతో సాహసించలేదు. రాగాల గురించి అవగాహన లేకుండా పాడితే అభాసు పాలవుతానన్నది నా అభిప్రాయం. ఓ సంగీతం మాష్టారు దగ్గరకు రెండు మూడు రోజులు వెళ్ళాను. హార్మోనియం పెట్టె ముందు కూర్చున్న ఆ మాష్టారు, సా.. రీ.. గా.. మా.. అంటూ దీర్ఘాలు తీయడంతోనే మూడు రోజులు గడిచిపోయాయి. ఇక ఆ ప్రయత్నం విరమించి రేడియో పెట్టెలో నుంచి వచ్చే జనరంజని పాటలు శ్రద్ధగా వినడం మొదలుపెట్టాను. వాటిలో ఘంటసాల గారి పాటలు నాకు బాగా నచ్చేవి. నాకేమిటీ మా కాలేజీలో లెక్చరర్స్ మొదలు స్టూడెంట్స్ వరకు చాలా మంది ఆయన అభిమానులే. అందుకేగా ఘంటసాల జయంతి రోజున సింగింగ్ కాంపిటేషన్ ఏర్పాటు చేసింది.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం (1974) చదువుతున్నప్పుడు ఫిబ్రవరి 11న క్లాస్ మధ్యలో ఓ నోటీస్ వచ్చింది. మాష్టారు చదివి కంట తడిపెట్టుకున్నారు. అది విన్న మాకూ హృదయం బరువెక్కింది. ఆ నోటీస్ సారాంశం ఏమిటంటే, ఘంటసాల మాష్టారు స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కాలేజీ మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నది. ఆయనకు సంతాప సూచకంగా కాలేజీకి ఈ రోజు సెలవు ప్రకటిస్తున్నాము. రేపు సాయంత్రం సంతాప సభ ఉంటుంది.

సినిమాల్లో పాటలు పాడుకునే వ్యక్తి మరణిస్తే కాలేజీకి సెలవు ఇవ్వడం నాలో అంతర్మథనానికి దారితీసింది. అంటే, సింగర్‌కి చాలా వాల్యూ ఉన్నది. పాటలు పాడే వారిని మేము సరదాగా, ఎగతాళిగా ‘పాడు వారు’ అంటూ ఏడిపించేవాళ్లం. ఎంత తప్పు చేశాము. పాడే వాళ్లను పాడువారనడం, ఆడే వాళ్లను (నాట్యం చేసే వారిని) ఆడువారు అనడం అప్పటి నుంచి మానేయాలని మా ఫ్రెండ్స్ సర్కిల్ తీర్మానించింది. అంతే కాదు, అప్పటి నుంచి సింగర్స్ పట్ల గౌరవం పెరిగింది. ఈ గౌరవం ఎక్కడిదాకా వెళ్ళిదంటే, నేను రిటైర్ అయ్యాక ఛానల్ 5ఏఎంలో వందలాది మంది సింగర్స్‌తో కార్యక్రమాలు నిర్వహించడం వరకు. అలా పరిచయమైన సింగర్స్‌లో చాలా మంది నాకు మంచి మిత్రులయ్యారు. పాటల విషయంలో ఏదైనా సందేహం వస్తే వారి అడగుతుంటాను.

కానీ ఎందుకో తెలియదు కానీ, మా కాలేజీలో సింగర్స్ అని చెప్పుకునే ముఠా యొక్క ఆధిపత్యాన్ని మాత్రం క్షమించలేకపోయాను. అందుకే ఈ తిరుగుబాటు. ‘వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రా.. ముల్లును ముల్లుతోనే తీయాలిరా’ అని మా విష్ణుగాడు చెప్పిన సలహా బుర్రకెక్కింది. అందుకే మిగతా ఫ్రెండ్స్ వెనక్కి లాగినా నేను పాటల పోటీకి పేరిచ్చాను.

పేరిచ్చానే కానీ, ఏ పాట పాడాలి? మిగతా వాళ్లలా ఏ సినిమా పాటో పాడవచ్చు. కానీ అందుకు భిన్నంగా పాటని ఎంచుకోవాలి. అప్పుడు తేలిగ్గా గుర్తింపు వస్తుంది. ఇది నా ప్లాన్. ఎప్పుడూ వినే పాట అయితే రాగం తప్పిందనో, తాళం లేదనో వంక పెట్టి జడ్జ్‌లు నన్ను ప్రక్కన పెట్టేయవచ్చు. అదే ఎవ్వరికీ తెలియని పాట అయితే నేను పాడిందే పాట అవుతుందన్నది నా వ్యూహం. అప్పుడు జడ్జ్‌లు కూడా బుట్టలో పడతారన్నది నా ఆలోచన.

నండూరి ఎంకి పాటలు:

కొద్ది నెలల ముందే విశాలాంధ్ర బుక్స్ అమ్మే వ్యాన్ నందిగామ రావడం, నేను వ్యాన్ ఎక్కి పుస్తకాలు చూస్తుంటే అందులో నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటల పుస్తకం కళ్లబడింది.

అందులో..

‘ఎంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్

మెళ్లో పూసల పేరు

తల్లో పువ్వుల సేరు’ –

చదివాక, ఆ పాట నాకెంతో నచ్చేసింది. నండూరి ఎంకి పాటల గురించి తెలుసు కానీ, ఆ పాటల రచయిత గురించి పెద్దగా తెలియదనుకోండి. ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఓ సాహితీ మిత్రుడి పరిచయం వల్ల నండూరి సుబ్బారావు గారి గురించి తెలుసుకోగలిగాను.

నండూరి గారి పూర్తి పేరు నండూరి వెంకట సుబ్బారావు. 1918లో మద్రాసు (చెన్నై) క్రైస్తవ కళాశాలలో చదువుతున్నప్పుడు ఎంకి పాటలు వ్రాయడం మొదలుపెట్టారు. బసవరాజు అప్పారావు గారు, పాటిబండ అప్పారావు గారి సాహితీ ముచ్చట్లకు ఆశ్చర్యపోయిన నండూరి గారు సాహిత్యం పట్ల ఆకర్షితులయ్యారట. ఒకసారి ట్రాం బండిలో వెళుతుండగా గొంతులో నుంచి ఓ సన్నటి రాగం బయలుదేరిందనీ, అది పాటగా మారిందని – ‘ గుండె గొంతుకలోన కొట్టాడుతాది’- అన్న పల్లవిగా మారిందనీ, ఇదే తాను వ్రాసిన మొదటి పాటని నండూరిగారు చెప్పేవారటని మా ఆంధ్రప్రభ మిత్రుడు లంకా వెంకట రమణ చెప్పినప్పుడు ఆ కబుర్లు చాలా ఆసక్తిగా విన్నాను.

గమ్మత్తేమిటంటే, నేను ఇప్పుడు 70వ దశకానికి చేరువ అవుతున్నా, ఈ ఎంకి మాత్రం నిత్య యవ్వనే. నండూరి వారు ఎంకిని సృష్టించి వందేళ్లు దాటినా ఇప్పటికీ పల్లెల్లో గెంతులు పెట్టే పడుచమ్మాయే.

ఎంకి పాటల పుస్తకం నాలోని సింగర్‌ని తట్టిలేపింది. ‘లే.. లే.. పాట నేర్చుకో.. వెళ్ళి పాడు’ – అన్న ధైర్యాన్ని నింపింది. ఈ పుస్తకంలో నుంచి ఒక పాట సెలెక్ట్ చేసుకున్నాను. అది –

‘లేపకే నా యెంకి

లేపకే నిదురా.

ఈ పాటి సుకము

నేనింతవరకెరుగనే..’

ఈ పాటకు ట్యూన్ కట్టాలి. ఇంట్లో వాళ్ల వల్ల కాలేదు. కాలీజీలో సింగర్స్‌మని చెప్పుకునే వాళ్ల దగ్గరకు వెళ్ళి అడగకూడదు. ఎందుకంటే, నా దగ్గరే ఈ పాట పాడటం నేర్చుకున్నాడంటూ ప్రచారం చేస్తే నా పరువు ఏం కాను. అందుకే అటుగా పోలేదు. పోనీ అప్పటికప్పుడు సంగీతం మాష్టారు దగ్గరకు వెళ్ళి నేర్చుకుందామంటే, సరిగమల నుంచి నేర్చుకోమంటూ క్లాస్ పీకుతారాయె. ఇక లాభం లేదు. అంతలో విష్ణుగాడొచ్చి..

‘మిత్రమా సమయం లేదు. పాడతావా.. పారిపోతావా?’

అంటూ రెచ్చగొట్టాడు. దీంతో నాకు పట్టుదల తన్నుకొచ్చింది. పాటల పుస్తకం తీసుకుని వాడూ నేనూ పొలం గట్టుమీదకు వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాము. ఎందుకైనా మంచిదని వాడు పుచ్చకాయ కొని ముక్కలుగా కోయించి తీసుకొచ్చాడు. పాట ప్రాక్టీస్‌లో అలసిపోయి, గొంతు ఎండిపోతే పనికొస్తుందన్నది వాడి ఆలోచన. మిత్రుల వల్ల ఇలాంటి లాభాలు ఉంటాయి మరి. విష్ణుగాడికి సహనం ఎక్కువ. నాకు తట్టిన రీతిలో పాడాను. వాడేమో – ‘బాగుంది రా’ అన్నాడు. నాకేమో ‘ఇక అంతిమ విజయం మనదే’ అన్నంత బలం వచ్చేసింది.

నాలుగు రోజులు ప్రాక్టీస్ గట్రా అయ్యాక ఐదో రోజున పోటీ. ‘నేను సిద్ధం. వినడానికి మీరు సిద్ధమేనా?’ అన్నట్లు ఉంది నా చూపు. ఇంతలో నా పేరు పిలిచారు. ఈ పోటీకి జడ్జ్‌లు అంతా మాకు తెలిసిన మాష్టార్లో, గుమాస్తాలో.. అంతే. మరేం భయం లేదు. వారిలో ఒకరైతే నాకు బంధువే. ఇదో బలం అనుకున్నాను. కానీ, తర్వాత నాకర్థమైంది ఏమంటే, అదే నన్ను బలహీనపరిచిందని.

ఇంతలో పేరు పిలిచారు. కొత్త ప్రయోగానికి తెరలేస్తున్నది. శ్రీహరి కోట నుంచి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైనట్లుంది.

మొత్తానికి ఎంకి పాట పాడాను. వింటున్న ప్రేక్షకుల్లో ఒక్కడూ తప్పట్లు కొట్టలేదు. నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత విష్ణుని అడిగాను. వాడేమో నవ్వుతూ- ‘నేను ముందే చెప్పాను గదరా, నువ్వు పాడు వాడివి కాలేవని’ అన్నాడు.

కలగ కృష్ణమోహన్

ఇదేదో శాపంలాగా ఉంది. ఇప్పటికీ సింగర్‌ని కాలేకపోయాను. అయితే, 2024లో ఓ గమ్మత్తు జరిగింది. తానా ప్రపంచ సాహితీ వేదిక మీద డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు – అనుకోకుండా నా గొంతులో నుంచి రెండు మూడు పాటల పల్లవులు వచ్చేశాయి. అవి కూడా రాగయుక్తంగానూ.. అదే సభలో కలగ కృష్ణమోహన్ వంటి సంగీత జ్ఞానులు కూడా ఉన్నారు. రాగయుక్తంగా హాయిగా పాడగల సత్తా ఉన్న గాయనీ గాయకులు కూడా ఉన్నారక్కడ. కానీ ఏదో తెలియని ఆవేశం నాచేత పాటలు పాడించింది. లలిత సంగీత చక్రవర్తి కలగ కృష్ణమోహన్ గారు మందలిస్తారేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నా ప్రసంగం మొత్తంగా బాగున్నదని ప్రశంసించారు. ప్రసంగం మధ్యలో పాటెందుకు పాడావోయ్ – అని అనకపోవడంతో ధైర్యం వచ్చింది. ఇకపై నేనూ పాడవచ్చేమో అన్న ఆలోచన మొగ్గ తొడిగింది.

కలగ కృష్ణమోహన్ గారు రేడియోలో లలిత, భావగీతాలకు అద్బుతంగా స్వరాలు అల్లి, లలిత గీతాలు వ్రాసి, ఆలపించి సంగీత సరస్వతికి సేవచేస్తున్న వీరికి సినారెతో సాంగత్యం ఉందని తర్వాత నాకు తెలిసింది. అలాంటి మహోన్నత వ్యక్తి పాల్గొన్న సమావేశంలోనే నేను సినారె గురించి చెప్పడం నా మటుకు నాకు గొప్పే మరి.

పాటంటే ఇష్టం:

పాట అంటే నాకు మొదటి నుంచీ ఇష్టమే. కాలేజీ సింగర్స్ ముఠాతోనే ఇబ్బంది తప్ప, ఇతరత్రా ఎవరూ పాడినా నాకు బాగా నచ్చేది. ముఖ్యంగా సినిమా పాటలంటే చెవికోసుకునేవాడ్ని. ఘంటసాల వీరాభిమాని అన్నట్లు ఉండేది నా తీరు. మా ఇంట్లో అందరికీ ఘంటసాల పాటలు బాగా ఇష్టం. ఆ రోజుల్లో ఓసారి..

నేనూ నా స్నేహితులతో వీధివెంట పోతుంటే, 1969లో రిలీజ్ అయిన ఏకవీర సినిమా పాట –

‘ప్రతి రాత్రి వసంత రాత్రి

ప్రతి గాలి పైర గాలి..’

మా చెవుల సోకింది. ఘంటసాలతో పాటుగా మరో కొత్త గొంతు వినబడటంతో పాట మీద శ్రద్థ పెట్టాము. తర్వాత తెలిసింది, ఘంటసాలతో పాటుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే కుర్రాడు కూడా పాడాడని. నాకెందుకో ఎస్పీ బాలు గొంతు నచ్చలేదు. ఘంటసాల ఎక్కడా? బాలు ఎక్కడా?? అంటూ వాదనకు దిగేవాళ్లం. మిమిక్రీలో ఆ తేడాను ఎత్తి చూపుతూ ఎగతాళి చేసేవాడ్ని. కానీ అప్పటికే బాలు గొంతుని ప్రేమించే వాళ్లూ తయారయ్యారు.

ఎవరీ బాలు అని ఆరా తీస్తే, ఎస్పీ కోదండపాణి వారి ప్రోత్సాహంతో 1966లో వచ్చిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఈ బాలు తొలి పాట పాడారనీ, కోదండపాణికీ బాలుకీ బంధుత్వం ఏదో ఉన్నదనీ, అందుకే ఇతగాడ్ని ప్రోత్సహించాడని చెప్పుకునేవారు. అయితే ఈ కుర్రాడిలోని చాలాకీ తనం, గొంతులోని మాధుర్యాన్ని ఆంధ్ర సినిమా ప్రేక్షకులు నిదానంగా గుర్తించారు. బాలు పాడిన కొన్ని పాటలు నాకూ నచ్చేవి.

‘మేడంటే మేడా కాదు,

గూడంటే గూడు కాదు..

పదిలంగా అల్లుకున్నా

పొదరిల్లు మాది..’

ఈ పాట 1968లో వచ్చిన సుఖదుఃఖాలు సినిమాలోది. దీనికీ కోదండపాణే సంగీత దర్శకుడు. ఆ తర్వాతి కాలంలో బాలు సొంతంగా ఎదగడం మొదలుపెట్టాడు. మిమిక్రీ వాయిస్ కావడంతో రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి వారికి పాడిన పాటలు భలే నవ్వు పుట్టించేవి.

ఘంటసాల పాటంటే.. :

బాలు పాటలు వినేవాళ్లం. కానీ ఘంటసాల మాష్టారి పాటలంటే చెవికోసుకునే వాళ్లం. ఇదీ తేడా. ఇంతకు ముందు చెప్పాను కదా, మా కాలేజీలో చాలా మంది ఘంటసాల అభిమానులే. ఘంటసాల భగవద్గీత వింటుంటే జీవితం విలువ తెలిసేది. ఏరుకోవాలే కానీ ఎన్నో విలువైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక సూత్రాలను శ్లోకాల్లో భద్రపరిచారని నాకు అనిపించేది. మా ఇంట్లో ఎప్పుడూ భగవద్గీత పుస్తకం ఉండేది. నేను గుంటూరులో మాజేటి గురవయ్య హై స్కూల్‌లో చదివే రోజుల్లో దాదాపు ప్రతి రోజూ భగవద్గీత శ్లోక పఠనం ఉండేది. అలా భగవద్గీత పట్ల ఆకర్షితుడనయ్యను. ఘంటసాల భగవద్గీతకు ఓ ప్రత్యేకత కనిపించింది. కేవలం శ్లోకాల పఠనంలా కాకుండా ఇది ఒక రూపకంలా సాగింది. నాటకీయత జోడిస్తూ భగవద్గీత శ్లోకాలు పాడి మెప్పించిన ఘనుడు ఘంటసాల.

ఆ రోజుల్లో తెలుగు సినిమా రంగానికి రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్నారు భాసిల్లారు. అయితే మూడో కన్ను ఘంటసాల అన్నది మా కచ్చితాభిప్రాయం. అగ్రహీరోలే పాడారా అన్నట్లు ఘంటసాల పాటలు ఉండేవి. ఘంటసాల గురించి గంటల తరబడి కబుర్లు చెప్పుకునే వాళ్లం. సింగర్‌ని కాలేకపోయనా ఇప్పటికీ రోజులో నాలుగైదు ఘంటసాల పాటలన్నా ఇంట్లో పాడుకోవడం ఓ అలవాటు. కష్టసుఖాల్లో ఘంటసాల పాట నాకు తోడూ నీడ. కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడే అంటే 2020లో గుండెకు ఆపరేషన్ అయ్యాక నా సొంత ఛానెల్ (Channel5am) లో ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి నెలంతా రోజుకో కార్యక్రమం ప్రసారం చేశాను. అయితే ఎస్పీ గారిని విస్మరించలేదు.

కరోనా సమయంలోనే బాలు గారు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ తర్వాత, వారి జయంతి సందర్భంగా కూడా నెలంతా ఇలాగే కార్యక్రమాలు నిర్వహించి అనేక మంది ఔత్సాహిక గాయనీ గాయకులను ప్రోత్సహించాను. ఈ తృప్తి చాలు. నేను సింగర్‌ని కాలేకపోయినా, పాటలతో కూడిన అనేక కార్యక్రమాలు చేయగలిగాను. టివీ 5లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాత్మకంగా సినీ పాటల రాగాలపై ఓ కార్యక్రమం అందించాను.

పాడలేక పోవచ్చు.

కానీ పాట నా ప్రాణం.

రాగ జ్ఞానం లేకపోవచ్చు,

కానీ రాగం నా గుండె బలం.

అందుకే నా యీ జీవనరాగాల్లో పాటకు పెద్దపీట వేస్తునే ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడల్లా పాటలను గుర్తుచేసుకుంటూనే ముందుకు సాగుతున్నాను.

సాహిత్యంతో పాటకు రూపం వస్తే, రాగంతో పాట పండిత పామరుల నోట నర్తిస్తుంటుంది.

గానానికి ఎంతటి శక్తి ఉన్నదో 1960లో వచ్చిన పెళ్ళికానుకచిత్రంలోని ఓపాట చక్కగా తెలియజెప్పింది. ఏఎం రాజా సంగీతంలో జిక్కి పాడిన కమ్మనైన పాట ఇది.

‘పులకించని మది పులకించు

వినిపించని కథ వినిపించు

అనిపించని ఆశలు వించు

మనసునే మరిపించు గానం’

పాటల గురించి, పాటలు పాడే వారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. సరే, మరోసారి సందర్భం వచ్చినప్పుడు ఘంటసాల గురించి ఇతర గాయనీగాయకుల గురించి గుర్తుచేసుకుంటూ జీవనరాగాలు పలికిస్తూనే ఉంటానని మీకు మాట ఇస్తూ ఈ భాగ రచన ముగిస్తున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version