Site icon Sanchika

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-32

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

షిర్డీ పాదయాత్ర మహిమ:

[dropcap]జీ[/dropcap]వితం ఎప్పుడూ సాఫీగా మనం కోరుకున్నట్లే సాగదు. అనుకోని కష్టాలు, అవాంతరాలు వస్తుంటాయి. మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. దారీ తెన్ను కనబడదు. గమ్యం లేని పయనం.

‘చీకటిలో కారుచీకటిలో

కాలమనే కడలిలో

శోకమనే పడవలో

ఏ దరికో, ఏ దిసెకో..’

దూరంగా శ్రీశ్రీ గారి పాట ఘంటసాల గొంతులో వినిపిస్తోంది. తలచుకుంటే నా పరిస్థితి అంతే. ఉన్న ఉద్యోగం గాలికి రెపరెపలాడుతోంది. పిల్లలు పైచదువులకు వచ్చారు. ఊరేమో కొత్త. ఆదుకుంటారనుకున్న బంధువులు దూరం జరిగారు. ఈ గండం నుంచి బయటపడేదెలా..??

నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు అనుకోని రీతిలో యాజమాన్యం మారింది. కొత్త యాజమాన్యం పద్ధతలు నాకు అంతగా నచ్చలేదు. దీనికి తోడు నా పై అధికారికి నేనెందుకో నచ్చలేదు. అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ మంచి మిత్రుడితో నీవు మాట్లాడటం మానేస్తే నీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తాన్నారు ఆ పై అధికారి. అంటే దాని అర్థం, ఆయనతో స్నేహం మానేస్తే ఇబ్బంది పెట్టను అనే అర్థం ధ్వనించింది. స్వేచ్ఛ రోజురోజుకీ తగ్గిపోతున్నది. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి? ఎటు పోవాలి? నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? పిల్లల ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగా వారికి సపోర్ట్ ఇవ్వగలనా..? సమాధానాలు దొరకని ప్రశ్నలు.

అది 2006వ సంవత్సరం దీపావళి పండుగ రాబోతున్నది. ఇంట్లో మాత్రం పండుగ వాతావరణం లేదు. నా మనసులోని చీకట్లను తరిమి వేసే శక్తి ఏది? ఎక్కడుంది? మా ఇంట నూతన కాంతులతో ఆనంద దీపావళి మళ్ళీ వస్తుందా? అప్పుడు జరిగింది ఓ సంఘటన. అది నా కష్టాలనే కాదు, నా జీవితాన్నే మలుపు తిప్పింది.

మా అబ్బాయి రాజేష్ అప్పట్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాడి స్నేహితుడు వినయ్ ఓ రోజున మాటల్లో – అంకుల్ షిర్డీ వెళతారా.. మా మామయ్య వెళుతున్నారు – అన్నాడు.

సూదంటు రాయి:

వినయ్ అలా ఎందుకు అడిగాడో నాకు అర్థం కాలేదు. కానీ ఈ మాటలు ఊరట కల్పించేవిలా అనిపించాయి. మనశ్శాంతి కోసం వెతుకుతున్న మనిషికి కొన్ని మాటలు ‘సూదంటు రాయి’లా ఆకర్షిస్తుంటాయి. అదే జరిగింది.

‘సరే’ – అన్నాను.

వెంటనే వాడు – తన మేనమామ ప్రసాద్ గారితో ఫోన్‌లో మాట్లాడాడు. నాతో మాట్లాడిచ్చాడు. అంతే, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను. షిర్డీ వెళ్ళాలని. అలా నిర్ణయం తీసుకోవడం వెనుక దాగున్న శక్తి ఏమిటో అప్పుడు తెలియలేదు. సరే, ఇంట్లో వారు సైతం వెళ్ళండని ఆమోదం తెలిపారు. ప్రసాద్ గారు రైలు టికెట్టు బుక్ చేస్తామన్నారు. సరే అన్నాను. అలా నాకు తెలియకుండానే షిర్డీ పాదయాత్రకు తొలి అడుగు పడింది.

భారం నీదే బాబా:

షిర్డీ వెళ్లడం మొదటి సారి కాదు. అంతకు ముందు ఫ్యామిలీతో రెండు సార్లు వెళ్ళాము. అయితే ఈసారి పిల్లల చదువుల వల్ల మా ఆవిడ (శ్రీదేవి) పిల్లలు రాలేమన్నారు. దీంతో ప్రసాద్ గారి కుటుంబ సభ్యులతో వెళ్ళాలనుకున్నాను. ఆయనతో ‘ఒకే’ – అనేశాను. టికెట్ బుక్ చేశాక ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి వివరంగా చెప్పినప్పుడు అసలు సంగతి తెలిసింది. పూణె నుంచి బస్సు కాదట. భక్తులంతా కలిసి పాదయాత్రగా షిర్డీకి చేరాలట.

పూణె నుంచి చాలా మంది సాయిబాబా భక్తులు పాదయాత్రగా నడచి వెళుతూ – ఏడో రోజు నాటికి షిర్డీకి చేరతారట. ప్రసాద్ గారు గతంలో ఒకటి రెండు సార్లు పాదయాత్ర చేశారు. అందుకే ఆయన చాలా విశేషాలు చెప్పారు.

పూణె నుంచి షిర్డీకి ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు. పాదయాత్ర అనగానే నామీద నాకే సందేహం వచ్చింది. ఇంట్లో వాళ్లు మొదట్లో ఇదే డౌట్ వ్యక్తం చేశారు. కానీ అప్పటికే కమిట్ అయ్యాను. టికెట్ కూడా బుక్ చేశారు. ఇక వెనక్కి తగ్గకూడదు. భారం అంతా షిర్డీ సాయినాథుని మీదనే వేసి ప్రయాణానికి సిద్ధమవుతున్నాను. దీపావళి పండుగ కాగానే ప్రయాణం మొదలైంది.

కుదిరిన గురి:

షిర్డీ సాయినాథుని మీద మొదట్లో నాకు అంతగా విశ్వాసం, గురి కుదరలేదు. పెళ్లయ్యాక శ్రీదేవితో కలిసి సాయిబాబా మందిరానికి వెళ్ళాను. పెళ్లైన కొత్తల్లో అత్తగారి ఊరు గుంటూరు వెళ్ళినప్పుడల్లా జాలయ్య కాలేజీ ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికో లేదంటే అరండల్ పేటలోని సాయిబాబా గుడికో తను తీసుకు వెళ్లేది. సాయిబాబా అంటే ఆమెకు చాలా గురి. జీవితంలో ఎదురయ్యే కష్టాలనుంచి బాబా వారు బయటపడేస్తారని చెబుతుండేది. బాబా వారి ఏకాదశ సూత్రాలను చదివి వినిపిస్తుండేది. బాబా వారి వైపు చూపు నిలపమనేది. నెమ్మదిగా ఆమెలోని భక్తిని అర్థం చేసుకోగలిగాను. బాబా వారి రూపాన్ని మదిలో ప్రతిష్ఠించుకోవడం మొదలు పెట్టాను.

బదిలీ బాధ:

విజయవాడలోనే పనిచేస్తున్న రోజుల్లో మద్రాసు ఆంధ్రప్రభ వారు ఇంటర్నెట్ ఎడిషన్ తీసుకురావాలనుకున్నారు. ఆ రోజుల్లో ఇదో సంచలనం. ఇంటర్నెట్ అన్న పదం తెలిసినా దాని ద్వారా వార్తలను అందించవచ్చన్న సంగతి చాలా మందికి తెలియని రోజులవి. ఇంటర్నెట్ పట్ల ఆసక్తి ఉన్న జర్నలిస్టులను deputation మీద పంపించారు. వారిలో నేనూ ఒకడ్ని. నాతో పాటుగా విశాఖ ఎడిషన్ నుంచి కునిశెట్టి ప్రసాద్ కూడా మద్రాసు వచ్చాడు. కొద్ది రోజులు గడిచాయి. యాజమాన్యం ఆలోచన కూడా తెలిసింది. నెమ్మదిగా ట్రాన్సఫర్ చేసి మద్రాసులోనే ఉంచాయాలన్నది వారి ఆలోచన. ఇక తప్పదనే అనుకున్నాను. యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే తిరుగేముంటుందని సరిపెట్టుకున్నాను. ఇంట్లో వాళ్లు కూడా ఇక తామంతా మద్రాసులోనే ఉండిపోవాలని ప్రిపీర్ అవుతున్నారు. మా అబ్బాయి రాజేష్ అయితే ‘30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా’ అన్న పుస్తకం కొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మాయి దివ్య చిన్న పిల్ల. ఎవరు కనిపించి పలకరించినా ‘మేము మద్రాసు వెళుతున్నాం’ – అంటుండేది. మద్రాసులోనే ఉండే మా అక్కావాళ్లేమో మా కోసం ఓ ఫ్యామిలీ పోర్షన్‌ని వారింటికి దగ్గర్లోనే దాదాపు ఖరారు చేసేశారు. మద్రాసు ఆంధ్రప్రభ ఆఫీసేమో మౌంట్ రోడ్‌లో ఉండేది. అక్కావాళ్లుండేది వడపళనికి దగ్గర్లోని దశరథపురంలో. దూరమైనా అక్కా వాళ్లింటికి దగ్గర్లోనే ఉందామనుకున్నాము. మొత్తానికి ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఆ సమయంలో శ్రీదేవి ఓ మాట అంది, ‘ఎందుకోనండి, మనమంతా మద్రాసు వెళ్ళడం నాకిష్టం లేదండి. జీతం ఓ వెయ్యి పెరిగితే పెరగవచ్చు, కానీ అలవాటైన ఊరు, పిల్లలు కూడా అలవాటు పడ్డారు. వీలుగా ఉంటే ట్రాన్సఫర్ ఆగిపోయేలా చూడండి.’

ఈ మాటలతో ఆలోచనలో పడ్డాను. నేను విజయవాడ ఆంధ్రప్రభ కార్యాలయంలో వర్కర్స్ యూనియన్ (ఆంధ్రప్రభ – ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్)కి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తుండే వాడ్ని. ఇప్పుడు నాకే సమస్య వచ్చింది. సరే, ప్రయత్నిద్దాం – అనుకున్నాను. పైగా ఆ సమయంలోనే ఆంధ్రప్రభలో ‘కులాసా’ పేరిట వారం వారం ఓ పుల్ అవుట్ తీసుకువస్తున్నాము. ఇది ఆరోగ్య సలహాలు సూచనలకు సంబంధించిన పుల్ అవుట్. దీని కోసం వైద్యుల వ్యాసాలు కావాల్సి వచ్చింది. నేను పర్సనల్‌గా డాక్టర్లను కలిసి వారితో రైటర్స్ ప్యానెల్ తయారు చేశాను. ‘కులాసా’ పేజీ బాగానే నడుపుతున్న సమయంలో ఇదిగో ఈ ఇంటర్నెట్ ఎడిషన్, మద్రాస్ ప్రయాణం వచ్చిపడ్డాయి.

ఓ సారి ఎడిటర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి, మీలో ఎవరికి ఇంటర్నెట్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉందని మీటింగ్‌లో అడిగితే, నేను అందరిలా కామ్‌గా ఉండవచ్చు కదా.. నేనేదో ఇంటర్నెట్ పాండిత్యం ఔపోసన పట్టిన వాడిలాగా చేయి పైకెత్తాను. దాని పర్యవసానమే ఈ మద్రాసుకి deputation మీద పంపడం.

శ్రీదేవి మాటలు విన్న తరువాత నేను నాకు ట్రాన్సఫర్ ఇష్టం లేదన్న విషయం యూనియన్ పెద్దలకు, నా పై అధికారులకు తెలియజేశాను. అయితే మద్రాస్ యాజమాన్యం అప్పటికే నిర్ణయం తీసుకోవడంతో పని అవుతుందా లేదా అన్నది అనుమానమే. నేను ఓ నాలుగు రోజులు సెలవు పెట్టి మద్రాసు నుంచి విజయవాడ వచ్చాను. నాలుగో రోజు రాత్రి పది గంటలకు మద్రాస్ రైలు ఎక్కాలి. ఇంట్లో వాళ్లు అన్యమనస్కంగానే నా సూట్‌కేస్ సర్దుతున్నారు. మా పిల్లలైతే బిక్కమొహాలేసుకుని చూస్తున్నారు. శ్రీదేవి నా దగ్గరకు వచ్చి,

‘అంతా బాబా వారు చూసుకుంటారు. ఆయనను స్మరించండి’ –

ఆ మాట వినగానే షిర్డీ సాయిబాబా చరిత్ర చదవడం మొదలుపెట్టాను. అలా చదువుతుండగానే సమయం సాయంత్రం నాలుగు కావస్తున్నది. అంటే మరి కొన్ని గంటల్లోనే మద్రాసు రైలెక్కాలి. నేను ధ్యానంలో ఉన్నాను. అప్పటికే ఆఫీస్ వాళ్లు నాకు ల్యాండ్‌లైన్ ఫోన్ ఫెసిలిటీ ఇచ్చారు. ఉన్నట్లుండి ఫోన్ మ్రోగింది. రిసీవర్ ఎత్తాను.

నాతో పాటు మద్రాసుకి వచ్చిన మిత్రుడు ప్రసాద్ చెప్పుకుపోతున్నాడు.

‘మిత్రమా, మీరు మద్రాసు రానక్కర్లేదు. మీ ట్రాన్సఫర్ ఆగిపోయింది. మిమ్మల్ని విజయవాడలోనే రిపోర్ట్ చేయమన్నారు’

ఇది సారాంశం.

కలయో, వైష్ణవ మాయయో – అన్నట్లుంది నా పరిస్థితి. సమస్య పరిష్కారమవడంతో మనసు తేలిక పడింది.

విషయం తెలుసుకున్న శ్రీదేవి వెంటనే బాబా వారి పటం వద్ద హారతి ఇచ్చింది. బాబా వారి విబూది నా నుదుట దిద్దింది.

మరి కాసేపట్లో మద్రాసు రైలు ఎక్కాల్సిన వాడ్ని తిరిగి విజయవాడలోని ఆఫీసుకే బయలుదేరాను. బాబా వారి లీలలు ఇలాగే ఉంటాయని నాకనిపించింది. ఆఫీస్‌కు వెళ్లగానే నా మునుపటి డ్యూటీ నాకే అప్పగించారు. ‘ప్రమోషన్ మీద ట్రాన్సఫర్’ అన్న ఈ అంకం అక్కడితో ముగిసింది. ఆ తర్వాత నేనే ఏరి కోరి హైదరాబాద్‌కి ట్రాన్సఫర్ పెట్టుకున్నాను. ఈ ట్రాన్సఫర్ విషయం సజావుగా సాగేలా మంచి మిత్రులు పి. విజయబాబు గారు హెల్ప్ చేశారు. వీరే తర్వాత ఆంధ్రప్రభ ఎడిటర్‌గా పనిచేయడమే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సమాచార హక్కు (ఆర్.టి.ఐ) కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇప్పటికీ వారితో నా స్నేహబంధం అలాగే కొనసాగుతున్నది.

బాబా సంకల్ప బలం:

అలా బాబా వారి గురించి నమ్మకం కలిగిన నాకు ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం వచ్చింది. శరీరం బలహీనంగానే ఉండవచ్చు. పట్టుమని రెండు కిలోమీటర్లు వాకింగ్ చేసిన అలవాటు ఉండకపోవచ్చు. కానీ ఈ బలహీనతల కంటే బాబా వారి సంకల్పం బలం చాలా గొప్పది. ఈ విషయం పాదయాత్రలో అడుగడుగునా కనిపించింది.

బాబా భక్తులమంతా సికింద్రాబాద్‌లో రైలెక్కి మర్నాడు పొద్దున్నే పూణె చేరాము. రైలెక్కాక మాటల్లో ‘పూణె బాబా’ గారి ప్రస్తావన వచ్చింది. అచ్చు బాబాగారిలాగానే ఆహార్యంతో తిరగాడుతూ షిర్డీ బాబా వారికి మనసా కర్మనా చేరువైన వ్యక్తి వారు. అలాంటి పూణె బాబా వారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది. పూణె స్టేషన్ నుంచి మాలో కొందరం పూణె బాబా వారిని కలవడానికి వెళ్ళాము. ఓ చిన్న ఇంట్లో సాధారణ వ్యక్తిలా ఉన్నారు ఆయన. బట్టలకు ఇస్త్రీ పెట్టడం వారి వృత్తి. ఇంటి ఆవరణలోనే ఓ చిన్న బాబా మందిరం ఉంది. ఆయనకు తెలుగు వచ్చు. ఆయన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి.

ఆ రోజు గురువారం. షిర్డీకి పాదయాత్ర బృందం బయలుదేరిన రోజు. వారం రోజుల నడక. సుమారుగా 204 కిలోమీటర్ల నడవాలి. దాదాపుగా మా బృందంలో 70 మంది దాకా ఉన్నారు. వారిలో కొంత మంది నాలా మొదటిసారిగా వచ్చారు. ఇంకొంత మందేమో ఇప్పటికే రెండు మూడు సార్లు పాదయాత్ర చేసిన వాళ్లే. ఇలాంటి వారు తమ అనుభవాలు చెప్పేవారు. నడక సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు.

మా బృందంతో పాటుగా బాబా వారి విగ్రహం ఉంచిన పల్లకీ కూడా ఊరేగింపుగా బయలుదేరింది. ఈ పల్లకీ మాతో పాటే షిర్డీ చేరుతుందనీ, అప్పటి వరకు బాబా భక్తులు దీన్ని మోసుకుంటూ తీసుకు వెళతారని చెప్పగానే నాకు ఆశ్చర్యమేసింది. నడవడమే ఇబ్బంది అనుకుంటుంటే, పల్లకీ మోత కూడానా..

తొలి అడుగులు:

బాబా సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని ధైర్యాన్ని కూడదీసుకుని పాదయాత్ర బృందంలో నేనూ ఒకడిగా అడుగులు వేయడం మొదలుపెట్టాను. పాదయాత్ర ప్లానింగ్ అంతా ముందే జరిగిపోయింది. ఏ రోజు ఎంత దూరం నడవాలి.. ఎక్కడెక్కడ మజిలీలుంటాయి. అల్పాహారం, భోజన ఏర్పాట్లు, అత్యవసరమైతే తరలించడానికి అంబులెన్స్ లాంటి వాహనం.. ఇలా చాలా పకడ్బందీగా పాదయాత్ర సాగిపోతున్నది.

మొదటి రోజు:

అడుగులు చాలా ఉత్సాహం పడుతున్నాయి. బాబా వారి నామస్మరణ చేస్తూ సాగిపోతున్నాను. ఓ పది కీలోమీటర్లు నడక కాగానే కాళ్లు పట్టేశాయి. పాదయాత్ర చేస్తున్న వారిలో కొందరేమో వేగంగా నడిచిపోతుంటే, ఇంకొందరు నాలాగా నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాల వారి మధ్య దూరం రానురానూ పెరిగిపోతున్నది. అల్పాహారం ఎక్కడ పెడతారో తెలియదు. భోజనం ఎక్కడో అంతకన్నా తెలియదు. ఇవన్నీ ప్లానింగ్ చేసే వారికి తెలుస్తాయి, కానీ వారు ప్రతి యాత్రికునికి చెప్పలేదు. ఎవరి హడావిడి వారిది. ఎప్పుడెప్పుడు బాబా వారిని చూద్దామా అని తొందర. నాకేమో కాళ్లు ముందుకు సాగనంటున్నాయి. ఒక మిత్రుడితో అన్నాను – ‘నేను నడవలేకపోతున్నాను. పూణె బాబావారికి నా గురించి చెప్పండి. నేను వెహికల్ ఎక్కేస్తాను..’

‘అరే, ఇప్పుడేగా మొదలుపెట్టింది. కంగారు పడకు. నిజంగా ఆ పరిస్థితి వస్తే బాబా వారికి తెలుస్తుందిలో. వారే వెహికల్ పంపిస్తారు. ఇలా కొంత మంది విషయంలో జరిగింది. నీవు నడవగలవు. నడుస్తావు. బాబా వారిమీద భారం వేయి..’ అంటూ ఏదేదో చెప్పుకుపోతున్నాడు.

ఇతని మాటలు నాలో కాస్తంత ఉత్సాహాన్ని నింపాయి. చలికాలం కావడంతో సాయంత్రం ఆరు గంటలకే పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేశారు. కానీ మేము చాలా వెనకబడిపోవడంతో మేము ఆ రాత్రి బసకు చేరడానికి మరో అరగంట ఎక్కవే పట్టింది. పూణె బాబా వారు అందర్నీ పలకరించారు.

‘ఏమండీ, జర్నలిస్ట్ గారు, బాగా అలసిపోయినట్లున్నారు. ఇదిగో ఈ ప్రసాదం తినండి. రేపు ఉత్సాహం నడుస్తారు..’

అదే చిత్రం, పూణె బాబా వారు ఏం మాట్లాడినా నాలో ఉత్సాహం రెట్టింపు అవుతుండేది. రేపు బాగానే నడుస్తానన్న నమ్మకం కుదిరింది.

మొదటి రోజు రాత్రి బస – అంటే అదేదో హోటల్‌లో రూమ్ లని అనుకునేరు. అవేవీ కాదు. ఏదో ఒక దేవాలయమో, మరేదో సత్రం లాంటి చోటునే ‘రాత్రి బసలు’ ఉంటాయని తెలిసింది. సామాన్లు మోసుకువచ్చిన వాహనం నుంచి మా దుప్పట్లు తీసుకున్నాము. నేను ఓ మూలగా పడుకున్నాను. కటిక నేల మీద, అది కూడా ఏ మాత్రం పరిచయం లేని ఆరుబయట ఇలా పడుకోవాల్సి వచ్చింది. అయినా నేను దాని గురించి ఆలోచించడం లేదు. నా ఆలోచనలు వేరేగా ఉన్నాయి..

ఈ రోజుకి నేను నడవగలిగాను. ఎస్, రేపూ నేను నడుస్తాను. (ఈ మాటల్లోని ‘నేను..’ అన్న మాటని గుర్తుపెట్టుకోండి)

తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకే నిద్ర లేపారు. కాలకృత్యాలు తీర్చుకోగానే పూజ మొదలైంది. పల్లకీలో తీసుకువచ్చిన బాబా వారికి పూజలు చేశారు. ఆ తర్వాత పాదయాత్ర మొదలైంది.

రెండవ రోజు:

నడుస్తున్నాను. నిన్నటి కాళ్ల నొప్పులు కాస్తంత తగ్గాయి. ఉత్సాహంగానే అడుగులు పడుతున్నాయి. మార్గమధ్యంలో బాబా భక్తులు రోడ్డు ప్రక్కన నిలబడి జామపండ్లు, అరటి పండ్లు ఇస్తున్నారు. నా చేతిలో రెండు అరటి పండ్లు, ఒక జామకాయ పడ్డాయి. వాటిని తింటూ తోటి యాత్రికులతో మాట్లాడుతూ నడుస్తున్నాను. బాబా వారి లీలలు నా మిత్రులు చెబుతుంటే నేనూ నా అనుభవాలు పంచుకున్నాను. నేను జర్నలిస్ట్ అని పూణె బాబా వారికి ముందుగానే తెలియడంతో అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడుతూ నా వృత్తిలోని ఇబ్బందులను అడిగేవారు. నేను ఇబ్బంది పడుతున్నాని వారికి చెప్పనే లేదు. కానీ వారు గ్రహించినట్లు నాకు అనిపించింది. ఓ సారి –

‘ఈ ఇబ్బందులు శాశ్వతం కాదు. త్వరలోనే తొలిగిపోతాయి. నీవు జర్నలిస్ట్‌గా చాలా ఎత్తుకు ఎదుగుతావు’ – అని అన్నారు. ఆ మాట తర్వాత నిజం అయింది.

రెండవ రోజు సాయంత్రానికి బస చేరువ అవుతున్నప్పుడు – ‘నేను’- అన్న ఆలోచన తప్పని అర్థమైంది. ‘నేను నడవడం లేదు, బాబా వారే నన్ను నడిపిస్తున్నారు’- అన్న భావన మొగ్గ తొడిగింది. ఇదే విషయం పూణె బాబావారికి ఆ రాత్రి చెబితే,

‘నువ్వు, షిర్డీకి చేరేదాకా ఆ బాబా వారే నిన్న నడిపిస్తారు. ఆ తర్వాత నీ జీవితం మారిపోతుంది’ – అంటూ ఉత్సాహపరిచారు.

మూడవ రోజు:

పాదయాత్ర బయలుదేరింది. అల్పాహార వేళకి ఏవో పొట్లాలు అందాయి. లంచ్ వేళకు వేడివేడి భోజనం అందింది. ఇవన్నీ చూస్తుంటే ఈ బృహత్ కార్యక్రమం వెనుక ఎంత మంది ఉన్నారా? అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అంతే కాదు, ప్రతి పల్లెటూరు వాసుల్లో బాబా పట్ల ఉన్న నమ్మకం, అచెంచల భక్తి చాలా స్పష్టంగా కనిపించాయి. రోడ్డుకి ఇరువైపులా పల్లెవాసులు మా రాకను గమనించి దగ్గరగా వచ్చి నమస్కారం చేస్తున్నారు. పాదయాత్రీకులనే సాయిబాబాగా వారు భావిస్తున్నారని నాకు అర్థమైంది. ప్రేమగా పానీయమో, పళ్లో ఇస్తున్నారు.

లంచ్ వేళలో పూణె బాబా గారు ఎప్పటిలాగానే నా దగ్గరకు వచ్చి. –

‘మీకో విషయం తెలుసా.. మీరు గత ఏడు జన్మలలో ఇంత దూరం ఎప్పుడూ నడవలేదు. ఇది మీకు బాబా వారు ఇస్తున్న అనుగ్రహ ప్రసాదం’ అన్నారు.

నిజమే అనిపించింది. ఏడు జన్మల విషయం తెలియదు కానీ, ప్రక్క సందులోని షాప్‌కి వెళ్ళాలన్నా వెహికల్ తీస్తాను. ఇది నా పోకడ.

ఆ రోజుకి నడక పూర్తయ్యాక పాదాలు చూసుకున్నాను. పాదం మడమ భాగానికీ, అరికాళ్లకీ మధ్యన పుండ్లు వచ్చాయి. అవే పుండ్లు అరికాళ్ల మధ్యలో వచ్చి ఉంటే నా నడక దుర్భరమై ఉండేది.

నాలుగవ రోజు:

నడక నెమ్మదించింది. బాబా వారి మీద భారం మోపి నడుస్తూనే ఉన్నాను ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలియదు. గమ్యం వచ్చేదాకా నడవడమే మా పని. బాగా అలసట వస్తే చెట్ల క్రింద కాసేపు విశ్రాంతి. ఆ తర్వాత మళ్ళీ నడక. మధ్యలో పూణె బాబా వారు వచ్చి –

‘ఎలా ఉన్నారు. అరికాలులో పుండ్లు లేవుగా, మరేం ఫర్వాలేదు, నడకేమీ ఇబ్బంది ఉండదు, అంతా బాబా వారి మహిమ’ అన్నారు.

అప్పుడు గమనించాను, నాతో పాటు నడుస్తున్న కొందరి పాదాలు చూస్తుంటే అరికాలులోనే పుండ్లు పడ్డాయి. దీంతో వారి నడక దుర్భరమైంది. బాబా దయతో నా పాదాల దిగువ పుండ్లు లేవు. మధ్యలో ఉండటంతో నడవడానికి ఇబ్బంది లేదు. పూణె బాబా వారి మాటల్లోని సారం నాకప్పుడు అర్థమైంది.

ఐదవ రోజు:

పాదయాత్ర సాగుతున్నది. మొదట్లో హుషారుగా నడిచిన వారిలో చాలా మందిలో నడక వేగం తగ్గింది. కొందరికి కాళ్లలో పుండ్లు రావడంతో పాటుగా మోకాలు నొప్పులు, వెన్ను నొప్పి వంటి కారణంగా మూలుగుతూ నడుస్తునారు. ‘బాబా, ఇంకెత దూరమయ్యా, మమ్మల్ని నీ దరికి చేర్చుకో బాబా’ – అంటూ బాబాను స్మరిస్తూ అడుగులు వేస్తున్నారు. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే..

అరికాలికి మడిమకి మధ్యలో పుండ్లు వచ్చాయి. ఆ నొప్పి ఉంది. నడకకి ఇబ్బంది లేదుకానీ. శరీరం బలహీన పడుతున్నది. పూణె బాబా వారు అందర్నీ పలకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఐదవ రోజు నుంచి భక్తుల్లో కొంత మంది అనారోగ్య ఇబ్బందులకు లోనవుతారని ఆయనకు తెలుసు. అందుకే మరింత శ్రద్ధగా, ప్రేమగా పలకరిస్తూ అవసరమైన వారికి ఉపచారం చేస్తూ బాబా లీలలను వర్ణిస్తూ ఉత్సాహపరుస్తున్నారు. వారిలోని నాయకత్వ పటిమ స్పష్టంగా కనిపించింది. మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బాబా వారు నా దగ్గరకు వచ్చారు. వారితో ప్రేమతో కూడిన చనువుతో ఇలా అడిగాను..

‘బాబా, నేను జర్నలిస్ట్‌ని కదా, ఆర్టికల్స్ అవీ బాగా రాస్తాను. ఈ పాదయాత్ర విశేషాలతో పుస్తకం వ్రాయమంటారా ?’

పూణె బాబా వారు నా మాటలు శ్రద్ధగానే విన్నారు. తల ఊచారు. అది అంగీకారమో, అనంగీకారమో అర్థం కాలేదు. అందుకే మళ్ళీ అడిగాను..

‘మీరు మంచిగా వ్రాస్తారు. ఆ విషయం బాబాకు తెలుసు. బాబాగారే మీచేత వ్రాయించుకుంటారు. అది ఎలా, ఎప్పుడు, ఏ రూపంలో అన్నది వారే చెబుతారు. పాదయాత్రతో మీరు బాబా వారికి మరింత చేరువ అవుతున్నారు. ఇంకా మీచేత బాబా వారు ఏం చేయంచబోతున్నారో..’

ఈ మాటలు విన్నప్పటి నుంచి బాబా వారి గురించి వ్రాయాలనీ, పాదయాత్ర విశేషాలు తెలపాలని అనేక మార్లు అనుకున్నాను. నేను అనుకుంటే సరిపోతుందా, అసలు ‘నేను’ నుంచి పూర్తిగా బయటపడాలి కదా– ఈ ఆలోచన రాగానే, పూర్తి భారం బాబా వారి మీదనే వేశాను. ఒక సారి నోట్ బుక్ ప్రత్యేకంగా కొని , ‘షిర్డీ పాదయాత్ర ‘ శీర్షికన వ్రాద్ధామని శ్రీకారం చుట్టాను. అంతే.. ఆ రచన ఆగిపోయింది. ఏవో అడ్డంకులు, మరేవో అవాంతరాలు. బాబా వారి అనుగ్రహం కాలేదని ఊరుకున్నాను.

ఇప్పుడు, ఇన్నాళ్లకు ఈ భాగ రచన చేయడానికి ముందు, ఇంట్లోని బాబా వారి చిత్రపటం దగ్గర నిలబడి, ‘బాబా పాదయాత్ర విశేషాలు కొన్నింటినైనా పాఠకులకు నాచేత అందజేయి..’ – అని మనసారా కోరుకున్నాను. నుదుట వీబూది పెట్టుకుని రచన ప్రారంభించాను. ఈ భాగం రచన ప్రారంభించే ముందు, పాదయాత్ర విశేషాలు ఒకటి రెండు పేరాల్లో ముగిద్దామనుకున్నాను. కానీ బాబా వారి సంకల్పం మరోలా ఉంది. రచన ముదలపెటింది ‘నేను’ కాదు, వ్రాస్తున్నదీ ‘నేను’ కాదు. ఎక్కడ ఆపాలన్న నిర్ణయమూ నాది కాదు. ఈ భావనతో వాక్యాలు కదులుతున్నాయి. అవి పేరాలుగా మారుతున్నాయి. అంతే..

ఐదవ రోజు పాదయాత్రలో ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. ఘాట్ రోడ్డు మీద నడక. చాలా కష్టంగా ఉంది. అయినా ఏదో శక్తి మమ్మల్నందరినీ నడిపిస్తున్నట్లు అనిపించింది.

ఆరవ రోజు:

‘దగ్గరకు వచ్చేసింది. మీరంతా త్వరలోనే షిర్డీ బాబా వారిని చూడబోతున్నారు. ఆ ఆనంద ఘడియలు అతి చేరువలోనే ఉన్నాయి’ – అంటూ పూణె బాబా వారితో పాటుగా ఆయన ప్రధాన శిష్యులు ఉత్సాహ పరుస్తున్నారు.

అన్నమాచార్య కీర్తన గుర్తుకు వచ్చింది.

‘అదిగో, అల్లదిగో శ్రీహరి వాసము.

పదివేల శేషుల పడగల మయము..’

ఒక అర్భకుడు, బలహీనుడు, ఎలుక పిల్లలా పుట్టిన వాడు, వానకు తడిస్తే జలుబు, ఎండకు ఎండితో వడదెబ్బ తగులుతుందేమోనని భయపడేవాడు.., అర్భకుడు.. ఇలా ఇంత దూరం ఎలా నడుస్తున్నాడు? ఇంట్లోని వారు భయపడుతున్నారు. వారు నా సెల్ ఫోన్‌కి రోజుకోసారి చేస్తున్నప్పటికీ, ప్రతిసారీ కాల్‌కి ఎటెండ్ కాలేకపోయే వాడ్ని. కొన్ని చోట్ల సిగ్నల్స్ ప్రాబ్లెమ్. మరి కొన్ని సార్లు బాబా మహిమలు వింటుండటం వల్ల.

మాలో కొంత మంది ఆరోగ్యం బాగాలేదనీ, వారిని ప్రత్యేక వెహికల్‌లో షిర్డీకి తరలిస్తున్నారని తెలిసింది. ఐదు రోజుల పాదయాత్ర తర్వాత నా బలహీన శరీరం తూలిపోతున్నది. అడుగులు పడటం లేదు. నాతో పాటు వచ్చిన వారిలోని ఒక మిత్రునితో అన్నాను..

‘మిత్రమా, ఆరోగ్యం బాగా లేదని చెప్పి, మనం కూడా వెహికల్ ఎక్కేసి నేరుగా షిర్డీ వెళదామా..’

ఆ మిత్రుడు నన్ను ఎగాదిగా చూశాడు. నా బాధ ఏమిటో అర్థం చేసుకున్నాడు.

‘నిజమే చెప్పవచ్చు. కానీ ఇంత దూరం నడిచారు. ఈ రోజు నడక పూర్తి కావస్తున్నది. ఇక ఒక్క రోజు మాత్రమే. రేపు ఈ వేళకి మనం బాబా సన్నిధిలో ఉంటాము. మీకో విషయం తెలుసా.. చివరి రోజు యాత్రలో మనమంతా దగ్గరి దారిలో నడుస్తామట. అలా కొంత దూరం తగ్గుతుంది, మనకు ఊరటా కలుగుతుంది. ఆలోచించండి’

‘సరే’ – అన్నాను నీరసంగా. అలా అన్నానే కానీ దారి వెంట ఏ వెహికల్ పోతున్నా, అందులోకి దూరేస్తే ఇట్టే షిర్డీకి వెళ్లవచ్చు కదా అన్న ఆశ మాత్రం మనసులో ఇంకిపోలేదు. ఈ బలహీనత పోవడానికా అన్నట్లు మర్నాడు, అంటే చివరి రోజున ఓ అద్భుతం జరిగింది.

ఏడవ రోజు:

మిత్రుడు చెప్పినట్లే చివరి రోజు పాదయాత్రలో జాతీయ రహదారి వెంట కొంత దూరం నడిచాక మా యాత్రా మార్గం మారింది. చిన్న దారుల్లో నడక సాగుతోంది. పల్లెవాసులు మా వద్దకు వచ్చి వారి వద్ద ఉన్న పండ్లు, పానీయం వంటివి ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు.

ఇక కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే షిర్డీ. అనేక గ్రామాలను దాటుకుంటూ పోతున్నాము. వారిలో చాలా మంది నేను అప్పటికే చూసిన శ్రీ షిర్డీ సాయిబాబా మహత్మ్యం సినిమాలో వారిలా కనిపించారు. వారి వేషభాషలు అలాగే ఉన్నాయి. అభివృద్ధిలో ఈ పల్లెలు చాలా వెనుకపడ్డాయని అనిపించింది. కానీ బాబా వారి పట్ల శ్రద్ధా భక్తులు మాత్రం నిండుగానే ఉన్నాయి. ఈ పల్లెలు ఎంత అదృష్టం చేసుకున్నాయో అని అనిపించింది.

చలికాలమే అయినా మధ్యాహ్నం ఎండ అదరగొడుతున్నది. వొంట్లో నీరసంగా ఉంది. ఒక మిత్రునికి చెబితే,

‘అదిగో చెట్టు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాము. మిత్రమా షిర్డీ ఇక కేవలం పదో పన్నెండో కిలోమీటర్ల దూరంలోనే ఉందట, బాబా వారు మనల్ని అనుగ్రహించబోతున్నారు. ఈ రాత్రి బాబా వారి ఆరతి చూడబోతున్నాము, రేపు మరోసారి దర్శనం చేసుకుంటే తిరుగు ప్రయాణమే’ – ఇలా చెప్పుకుపోతున్నాడు ఆ మిత్రుడు.

అతని మాటలు వింటున్న నేను గమనించలేదు. ఎప్పుడు వచ్చిందో ఏమో.. ఒక కుక్క మా ప్రక్కనే నీడ పట్టున పడుకుని ఉంది. తెచ్చుకున్న బిస్కెట్లలో నుంచి రెండు బిస్కెట్లు తీసి దాని నోటికి అందించాను. నాకు మూగజీవాలంటే ఇష్టం. ఈ విషయం ఇదే రచనలోని కొన్ని భాగాల్లో చాలా సార్లు ప్రస్తావించాను. అందుకే ఈ కుక్కవైపు తదేకంగా చూశాను. అది నా ప్రేమ పూర్వక చూపుకు తగ్గట్టుగా తోక ఆడించడం మొదలుపెట్టింది. మేము కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, మళ్లీ నడక..

కాసేపు నడక.. మళ్లీ రెస్ట్. ఈ సారీ అదే కుక్క కనిపించింది. మిత్రుడితే అంటే, ఇది మన వెంటనే వస్తున్నట్లుందని అన్నారు. అప్పటి నుంచి దాన్ని గమనిస్తున్నాను. ఇప్పుడు మా బ్యాచ్‌లో అది కూడా చేరిపోయింది. అప్పటి వరకు ఈ బ్యాచ్‌లో మేమిద్దరం. మిగతా వాళ్లంతా షిర్డీ దగ్గరకు వచ్చేస్తున్నదంటూ వడివడిగా ముందుకు సాగిపోతున్నారు. మేమిద్దరం పూర్తిగా వెనకబడ్డాము. నడుస్తూ, చెట్ల క్రింద కూర్చుంటూ, మళ్ళీ లేచి నడుస్తూ.. సాగుతోంది మా నడక. ఇప్పుడు కుక్క కూడా చేరింది. దీంతో మా బ్యాచ్ ‘బలం’ పెరిగిందన్న మాట. కాసేపు అయ్యాక కుక్క మాకు దారి చూపిస్తున్నట్లంగా మాకంటే ఓ నాలుగైదు అడుగుల ముందే నడుస్తున్నది. మధ్యమధ్యలో వెనక్కి చూసి మా రాకను గమనిస్తున్నది.

ఇక కేవలం కొద్ది దూరంలోనే షిర్డీ.. తెలియకుండానే నడక వేగం పెరిగింది. అంతలో మిత్రుడు అన్నాడు..

‘మిత్రమా, అదిగో, అల్లదిగో షిర్డీ.. జాగ్రత్తగా చూడు, మందిర శిఖరం కనబడుతోంది. జెండాలు రెపరెపలాడుతున్నాయి’

నేను జాగ్రత్తగా చూశాను. నిజమే షిర్డీ బాబా వారి మందిర శిఖరమే. జెండాలు మమ్మల్ని స్వాగతిస్తున్నట్లు రెపరెప లాడుతున్నాయి.

ఆనందంతో నా మనసు పొంగిపోయింది.

నా నోటి నుంచి – ‘బాబా.. బాబా.. కరుణించావా.. బాబా..’ తన్మయత్వంతో మనసులో అనుకుంటున్న మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. కళ్లవెంట నీరు. కళ్ల ముందు బాబా రూపు తప్ప మరేదీ కనబడని స్థితి.

ఈ స్థితిలో ఒకరి గురించి మరచిపోయాను. అదే.. కుక్కని. చటక్కున గుర్తుకు వచ్చి ముందూ వెనక చూశాను.

అప్పటి వరకు మమ్మల్ని ఫాలో అయిన కుక్క కనిపించడం లేదు. ఇదే మిత్రుడుతో చెప్పాను.

‘అంతా బాబా వారి లీల..’ అన్నాడతను.

‘అవును, బాబా వారి లీలే. మనకు మార్గం చూపింది. ఇప్పుడు తాను తప్పుకుంది’ – అన్నాను .

బాబా వారి సన్నిధికి చేరాము. మాతో పాటు వచ్చిన పల్లకీని ద్వారకామాయిలో ఉంచారు. పూజాదికాలు అయ్యాక పల్లకీని బాబా వారి మందిరం చుట్టూ మూడు సార్లు తిప్పారు. పల్లకీని మూసే అవకాశం వస్తుందా రాదా అని అనుకుంటడగానే పూణె బాబా వారు పిలిచి పల్లకీ మోయమన్నారు. ఆహా నా జన్మధన్యమైంది.

బాబా వారిని నిండుగా దర్శించుకుని మర్నాడు మరో దర్శనం చేసుకుని హైదరాబాద్ బస్సు ఎక్కాము.

బస్సులో వెళుతుంటే, పూణె బాబా వారి మాటలు గుర్తుచేసుకున్నాను.

‘ఈ పాదయాత్ర మహిమ ఏమిటో మీరు త్వరలో తెలుసుకోగలుగుతారు. బాబా మీద దృష్టి నిలిపి ఉంచండి. మీ కష్టాలన్నీ తొలిగిపోతాయి’

వారం రోజుల నడక తెచ్చిన బడలికతో కళ్లు మూతలు పడ్డాయి. లేచే సరికి బస్సు హైదరాబాద్ కి చేరువ అవుతున్నది.

ఇంటికి చేరాను. శ్రీదేవి నన్ను చూసి ఒకటే మాట అంది..

‘మీ ముఖం వెలిగిపోతున్నది. బాబా వారి అనుగ్రహం మీ మీద పడింది’

ఈ మాటలు నిజమే. ఆ తర్వాత కొంత కాలానికే, ఆర్థికంగా నలిగిపోయిన నాకు సరైన ఉపాధి మార్గాలు దొరికాయి. ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. సాయితత్వం బోధపడింది. ఆత్మ శక్తిని పరమాత్మ శక్తికి చేరువ చేసేందుకు ‘మహా గురువు’ లభించినట్లు అనిపించ సాగింది. భవిష్యత్తులో సాగించే ఆధ్యాత్మిక జీవనానికి ‘బీజం’ పడింది.

ఈ విశేషాలు మరోసారి చెబుతాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version