[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
రంగుల వలయం:
[dropcap]జీ[/dropcap]వితం ఒక రకంగా చూస్తే చాలా స్వల్పంగా అనిపిస్తుంది. మరో రకంగా చూస్తే ఓ సాగరంలాగా విశాలంగా ఉంటూనే ఎంతో లోతైనదిగా కనబడుతుంటుంది. జీవితంలో గెలుపు ఓటమిలు ఈ సమాజంలో మనిషి యొక్క స్థాయిని నిర్దేశిస్తుంటాయి. కేవలం తెలివితేటలు మాత్రమే ఎల్లవేళలా అక్కరకు రావు. అలాగే అదృష్టం కూడా. మనమెక్కిన జీవన నౌక సాఫీగా సాగుతున్నంత కాలం జీవితం యొక్క విలువ తెలియదు. అలాంటి వ్యక్తులకు ‘జీవన పోరాటం’ అన్న పదాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. నా జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగానే ఉన్నాయి. అనుకోని సమస్యల వలయాలు చుట్టుముట్టేవి. మనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల వల్ల కష్టాలు కడగల్లు తప్పలేదు. అడుగడుగునా జీవన పోరాటంతోనే కాలం దొర్లిపోయింది. ‘నా’ అనుకున్న వాళ్లే అన్యాయాలు చేయడం నన్ను ఎంతో బాధించింది. ఒక దశలో స్నేహితులు, బంధువులు దూరం అయ్యారన్న భావన కలిగేది. అసలు ఈ సమాజంలో నేను ఒంటరినేమో.. భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ జన్మకు సార్థకత ఏమిటి? చాలా మందిలా నేను ఎందుకని జీవనయాత్రను సాఫీగా సాగించలేకపోతున్నాను. ఎక్కడుంది లోపం..? దీనికి పరిష్కారం ఏమిటి?
పీడకల – వాస్తవం:
నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో అప్పుడప్పుడు ఓ కల వస్తుండేది. అది వచ్చినప్పుడల్లా ముచ్చెమటలు పట్టేవి. హఠాత్తుగా ఉలికిపాటుతో నిద్రమెలుకువ వచ్చేది. ఆ కలలో దయ్యాలు రాలేదు. భూతాలు అంతకన్నా భయపెట్టలేదు. మరి ఆ కల ఏమిటి??
అది ఒక నిర్జన ప్రాంతం. దగ్గర్లోనే ఎత్తైన కొండ ఉంది. అది పైకి ఎక్కాలి. తప్పదు. మెట్ల దారిలోనే పైకి ఎక్కాలి. ఏదో తెలియని మొండి ధైర్యం. ఎవ్వరూ తోడు రావడం లేదు. వస్తామన్న వారు కనుచూపు మేరలో లేరు. నా అనుకున్న వాళ్ల ఆనవాలు లేనేలేదు. మరి ఈ ఒంటరి ప్రయాణం చేయలగలనా..? ఏమో..
మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. చాలా తొందరగా ఎక్కేయాలట. అలా అని ఎవరు ఆదేశించారో కలలో స్పష్టత లేదు. ఆదేశాన్ని పాటించాలి. వడివడిగా మెట్లు ఎక్కుతున్నాను. మెట్లు ఎక్కుతుండగానే ఆకాశం కారు మేఘాలతో నల్లబడింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, జోరు వాన.. ఒక్కసారిగా భయం ఆవహించింది. కొండ పైకి చేరగలనా? అసలు నాకు అండగా నిలిచేవాళ్లు ఏరీ? కనుచూపు మేరలో కనిపించరేం!! ఎడతెగని ఆలోచనలు. అంతలో కాలు జారింది. వర్షానికి మెట్లు బాగా జారుడుగా మారినట్లున్నాయి. దీంతో కాలు పట్టుతప్పింది. ఉన్నట్లుండి నాలుగు మెట్లు క్రిందకు జారిపోయాను. ఓపిక తెచ్చుకుని లేచి ఎక్కసాగాను. కానీ ఓ పదిమెట్లు ఎక్కేసరికి మళ్లీ క్రిందకు.. ఈ సారి పెద్ద ఆఘాతంలో పడిపోయినట్లున్నాను. అంతే చమటలు పట్టేశాయి. భయంతో ఉలిక్కిపడి లేచాను. మంచం అంచులో ఉన్న నేను ఏ క్షణంలోనైనా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదంతా కల అని తెలుసుకుని శరీరం, మనసు సర్దుకోవడానికి ఓ పావుగంట పట్టింది.
కలల లోకంలో..:
అసలు, కలలు ఎందుకు వస్తాయో ఆ రోజుల్లో తెలియలేదు. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదివినప్పుడు కలలు ఎందుకు వస్తాయో అర్థమైంది. పైన చెప్పిన ఈ కల రావడానికి ప్రధాన కారణం – అభద్రతా భావం. ఇది ఏ రూపంలోనైనా రావచ్చు. మనం చేస్తున్న ఉద్యోగం, మన సంసారం, ఆర్థిక సమస్యలు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విచిత్ర పోకడలు.. ఇలా అనేక కారణాల వల్ల మెట్ల మీద నుంచి జారిపడిపోతున్నట్లుగానో, మేడమీద నుంచి జారి పడిపోతున్నట్లుగానో కలలు వస్తాయట. ఒక్కోసారి మనం ఎక్కాల్సిన మెట్లు మధ్యలోనే కనబడకుండా పోతాయి. పైకి ఎక్కలేము, అలాగాని క్రిందకూ దిగలేము. ఇదో విచిత్ర పరిస్థితి. కలలో ఇలాంటి దృశ్యాలు ఎవరో మహా రచయిత స్క్రిప్ట్ రాసినట్లుగా బలంగా కనిపిస్తాయి. కొన్నిటికి లాజిక్ ఉంటుంది. మరికొన్నిటిని మ్యాజిక్కే అనుకోవాలి. కలలో వచ్చే కథను సిద్దం చేసి, నేర్పుగా దృశ్య రూపంలోకి మలచిన ఆ మహా దర్శకుడు ఎవరు ? అతగాడు మరెవరో కాదు మన మెదడే. టివీ5లో పనిచేస్తున్నప్పుడు ‘కలల లోకంలో..’ అన్న టాపిక్ మీద ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించాను. దీని కోసం స్టడీ చేస్తున్నప్పుడు ఇలాంటివే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలిగాను.
ఏదీ భద్రత?
అభద్రతా భావం తొలగాలంటే ఏం చేయాలి? జీవనపోరాటంలో గెలవాలి. పట్టుదల ఉండి, అందుకు తగ్గట్టుగా నూతన మార్గాలను అన్వేషించుకుని ముందుకు సాగాలి. జీవితం చాలా చిత్రమైనది. కొందరికి వడ్డించిన విస్తరి. మరికొందరికి దినదిన గండం. ఉద్యోగ వేటలోనే అనేక అవస్థలు పడ్డ నేను చివరకు జర్నలిస్ట్‌గా స్థిరపడ్డాను. నిజం చెప్పాలంటే ‘స్థిరపడ్డాను’ అన్న మాట తప్పేమో. ఎందుకంటే, జర్నలిజం అన్నది నిత్య సవాళ్లతో కూడిన వృత్తి. జర్నలిస్టు అంటే అసలు ఉద్యోగం కాదు. కేవలం జీతం రాళ్ల కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటే నిజమైన జర్నలిస్ట్ కాలేడు. నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడే సవాళ్లు ఎదుర్కున్నాను. ‘ఎమ్మెస్సీ చేసిన వాళ్లు జర్నలిజం లోకి ఎందుకు వస్తారయ్యా, పేపర్‌ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నారా..’ అంటూ పై అధికారి ఒకరు గర్జించారు. నిజానికి నాతో పాటు చేరిన వారిలో చాలా మందికి ఆ వృత్తి కొత్త. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇదేదో గౌరవప్రదమైన వృత్తి అని ప్రవేశించిన వారే ఎక్కువ. నాలుగు ఆర్టికల్స్ వ్రాసేసి అచ్చులో చూసుకుని గొప్ప జర్నలిస్ట్ అయిపోయామనుకునే అమాయకపు బ్యాచ్. నేర్పుగా నేర్పాల్సిన చోట ఈటెలు, బాణాలు విసిరే మనస్తత్వం ఉన్న పై అధికారులు దాదాపు అన్ని సంస్థల్లోనూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల మన మనసు అనేక సార్లు గాయపడవచ్చు. రిజిగ్నేషన్ లెటర్ జేబులో ఉంచుకుని తిరిగిన రోజులూ ఉన్నాయి. ఇలాంటి వారి వల్ల కన్న కలలు చెదిరిపోతున్నాయన్న భావన కలిగేది. కలలో చూసినట్లు జారుడు మెట్ల మీద నుంచి జారిపడిపోతున్నట్లు అనిపించేది. అయితే, ఓటమిని ఒప్పుకోకూడదు. ఏ జర్నలిజంలో పనికి రావని అన్నారో, అదే జర్నలిజంలో ఎదగాలి.. ఎంతగా అంటే, కలలో కనిపించిన ఆ కొండ శిఖరం ఎక్కి విజయ కేతనం ఎగురవేయగలిగేటంతగా. ఎస్.. ఆత్మబలం పెంచుకోవాలి. తెలివితేటలు ఉన్నాయి. రాణించాలన్న పట్టుదల వీక్‌గా ఉంది. లక్ష్యాన్ని చేరేదాకా విశ్రమించకూడదు. ఈ సంకల్ప బలమే నన్ను ఈ రోజున జర్నలిస్ట్‌గా నిలబెట్టింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు వచ్చేలా చేసింది.
దారి చూపిన ‘గీత’:
జీవితంలో మనం నడిచే దారి మూసుకుపోతున్న భావన కలగగానే మరో దారి వెతుక్కోవాలి. ఇందుకోసం నలుమూలలా వెతకాలి.
నీరు లేని ఎడారిలోనైనా కన్నీరు తాగి బతుకుతూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ సమాజ స్వరూపం చాలా చిత్రమైనది. నేను ఈనాడు జాబ్ నుంచి తప్పుకుని మరో దారి చూసుకున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు – వీడెక్కడా నిలకడగా జాబ్ చేయలేడు – అంటూ నాకు వినిపించేలాగానే కామెంట్ చేశాడు. ఇలాంటి సూటిపోటి మాటల గారడీ మనమీద పనిచేస్తుంటుంది. ఒక రకమైన భ్రాంతిలోకి వెళ్ళిపోతాము. నిజంగానే మనం ఏ ఉద్యోగానికీ సరిపోమా, జీవితంలో ఎదగలేమా? అన్న నిరాశ, నిస్పృహలు అలుముకుంటాయి. అలాంటప్పుడే నాకు ఎవ్వరు తోడుగా నిలవకపోయినా ‘భగవద్గీత’ నిలిచింది. నేను ఉన్నాను. నేను అందిస్తున్న శ్లోకాలు చదువు, నీ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుందని గీతాచార్యులు చెప్పినట్లు నాకు అనిపించేది. ఇప్పటికీ అంతే.. ఏదైనా జఠిలమైన సమస్య తలెత్తితే, భగవద్గీత చదువుతుంటే ఉన్నట్లుండి ఆకాశంలోని మెరుపు మెరిసినట్లు, ఆ వెలుగులో కొత్త దారి కనబడినట్లు అనిపించేది. ఒక శక్తి మనల్ని నడిపిస్తున్నది. ఆ శక్తినే దేవుడని అంటాము. లేదా సైన్స్ చెబుతున్న శక్తి కావచ్చు. ఏమైనా అనుకోండి, మన జీవితాలను శాసించేది ఆ శక్తే. అంతే కానీ ఈ సమాజం కాదు, నీవు భయపడుతున్నట్లు ఈ శత్రు మూకలు అంతకన్నా కావు. మంచి ప్రక్కన చెడు ఉంటుంది. రెంటినీ సృష్టించేది, నడిపించేది ఆ శక్తే.
శక్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అది నీకు చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ నమ్మకం నాకు బలాన్ని ఇచ్చింది. జీవనపోరాటంలో వెనక్కి తగ్గకూడదు. అలా తగ్గామో నిన్ను విమర్శించేవారూ, ఎగతాళి చేసేవారూ విరుచుకుపడతారు. నీకు నీవే గురువు. నీవే శిష్యుడివి. నీవే దేవుడివి.. నీవే భక్తుడివి. ఈ తరహా ద్విపాత్రాభినయనం సాధన చేయాలి. అప్పుడే సాంత్వన చిక్కుతుంది. మనసు తేలిక పడగానే పరిష్కారమార్గం కళ్ల ముందు కనబడుతుంది. ‘ఈనాడు’ వదలగానే నాకు ‘ఆంధ్రప్రభ’ ద్వారాలు తెరుచుకున్నాయి. అక్కడ ప్రయాణం సాఫీగా సాగుతున్నప్పుడు ఓ దశలో అభద్రతా భావం పొడచూపసాగింది. ఆంధ్రప్రభ ఎన్నాళ్లు ఉంటుందన్న సందేహం వచ్చింది. ఒక మార్గంలో అందునా సులువైన మార్గంలో ప్రయాణం సాగుతున్నప్పుడు ఇతర దారులు మనకు కనబడవు. ఒక వేళ కనిపించినా పట్టించుకోము. ఇక్కడా అదే జరిగింది. ఈలోగా వయసు పైబడుతున్నది. సంసార బాధ్యతలు పెరగసాగాయి. బాచిలర్‌గా ఉన్నప్పుడిలా ఇప్పుడు కొత్త దారులను తేలిగ్గా తొక్కలేను. ఆచి తూచి అడుగు వేయాలి.
సమ్మె సైరన్:
ఒక సారి విజయవాడ ఆంధ్రప్రభ సిబ్బంది సమ్మెకు దిగింది. ఆ సమ్మె సుదీర్ఘ కాలం నడిచింది. ప్రారంభంలో ఉన్న పట్టుదల సడలిపోసాగింది. చాలా మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడే స్థితి వచ్చింది. ఆ సమయంలో అభద్రతా భావం మరీ ఎక్కువైంది. దాదాపు రెండు నెలల సమ్మె తర్వాత పరిస్థితి చక్కబడింది. జీవితాలు మళ్ళీ గాడిలో పడ్డాయి. ఆంధ్రప్రభలోని నా కెరీర్‌లో కష్టాల కంటే ఆనందాలే ఎక్కువ. అందుకే ఇప్పటికీ ఈ సంస్థ అంటే నాకు బోలెడు ఇష్టం. ఇక్కడే అందర్నీ కలుపుకుపోయే తత్వం అలవడింది. ఉగాది వేడుకల పుణ్యమా అని అందరం కలిసిపోయే వాళ్లం. మా మధ్య స్నేహం ఇప్పటికీ అలాగే ఉండటానికి ఈ సాంస్కృతిక బంధమే ప్రధాన కారణం.
ఆంధ్రప్రభ యాజమాన్యం ఉన్నట్లుండి మారింది. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది. అప్పటి వరకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు కూలిపోగానే ఎక్కడి పక్షులు అక్కడ ఎగిరిపోయాయి. ఎవరి అదృష్టం వారు చూసుకుంటూ కొత్త దారులు వెతుకున్నారు. నేను కొత్త యాజమన్యం క్రింద కొంత కాలం పనిచేశాక – ఒక వెబ్ సైట్‌కి మారాను.
మారిన ‘రంగు’:
ప్రింట్ మీడియా నుంచి వెబ్ మీడియాకు రావడంతో రంగుల వలయంలో మరో రంగు ప్రత్యేకతను సంతరించుకున్నట్లు అనిపించింది. తెలుగువన్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ యాజమాన్యం వారు నన్ను న్యూస్ ఎడిటర్‌గా తీసుకున్నారు. అక్కడ ఉన్నప్పుడే రికార్డ్ చేసిన తెలుగు వార్తలను ప్రతి రోజూ వెబ్‌లో ఉంచేవాళ్లం. ఇదో ఛాలెంజ్. వార్తలు చదవడం కోసం కాజువల్ న్యూస్ రీడర్లను తీసుకున్నాము. వార్తలు ఈజీగా చదవడానికి ప్రాంప్టర్లు లేవు. అందుకని ఏ-4 సైజు పేపర్ మీద పెద్ద సైజులో వార్తను ముద్రించి ఆ పేపర్లను న్యూస్ రీడర్ ఎదురుగా నిలబడి చేతుల్లో ఆ వార్త ఉన్న షీట్ ని పట్టుకుని నిలబడే వాళ్లం. అలా ఒక్కో వార్త చదివిస్తూ రీడీంగ్ పార్ట్ పూర్తి చేసేవాళ్లం. ముఖ్యమైన వార్తలకు సంబంధించిన బైట్స్, క్లిప్పింగ్స్ వంటివి యాడ్ చేస్తూ ఎడిటింగ్ చేయించి మొత్తం బులిటెన్‌ను వెబ్‌లో పెట్టేవాళ్లం. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. మధ్యమధ్యలో ఇంటర్వ్యూలు, ప్రసంగాలు పోస్ట్ చేసేవాళ్ళం. అలా వెబ్ లో పనిచేస్తున్నప్పుడే టివీ ఛానెల్‌లో పనికి సంబంధించిన ప్రాక్టీస్ వచ్చేసిందన్న మాట. తర్వాత నడచి దారిని అలా సిద్ధం చేసుకోగలిగాను.
టీవీతో ప్రయోగాలు:
టివీ మీడియాలో చేరాను. టివీ5 యాజమాన్యం చక్కటి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రయోగాత్మక కార్యక్రమాలను అందించగలిగాను. ఈ మధ్యలోనే రేడియో రూపకానికి జాతీయ ప్రతిభా పురస్కారం వచ్చింది. రేడియోలోని వార్తా విభాగంలో పనిచేయడం, రూపకాలు, నాటికలు వ్రాయడం – ఇదంతా మరో రంగుల వలయం.
టివీ5లో పని చేస్తున్నప్పుడు రెండు చక్కటి అవకాశాలొచ్చాయి. నేను వ్రాసిన ‘నిప్పు రవ్వ’ డాక్యుమెంటరీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారి బంగారు నంది అవార్డు దక్కింది. 2009లో టివీ-5 – డైలీమిర్రర్ కార్యక్రమం కోసం రోజూ ఓ అరగంట కార్యక్రమాలను రూపొందించాల్సి వచ్చేది. పగలు ఏ పదకొండు గంటలకో ఆఫీస్‌కు వెళ్ళేవాడిని. మధ్యాహ్నం వేళకు టాపిక్ డిసైడ్ చేసుకుని స్క్రిప్ట్ పని మొదలుపెట్టేవాడ్ని. డైలీమిర్రర్‌కు అప్పటికే మంచి పేరు వచ్చింది. దీంతో బాధ్యత మరింత పెరిగింది. సమకాలీన అంశాలు, ప్రత్యేక విజ్ఞాన అంశాలతో ముడిపెడుతూ డైలీమిర్రర్ కార్యక్రమాల రూపకల్పన సాగుతుండేది. డైలీమిర్రర్ కోసం తయారు చేసిన ఎపిసోడ్ – నిప్పురవ్వ. నిజానికి ఇది వ్రాస్తున్నప్పుడు దీనికి నంది అవార్డు వస్తుందని మేమెవరమూ ఊహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంట్రీలు పంపమన్నప్పుడు నేను ఈ ఎపిసోడ్ పంపమని సజెస్ట్ చేశాను. నిప్పురవ్వ డాక్యుమెంటరీ 2009 జులై 22వ తేదీన రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ చేశాము. బంగారు నందికి ఈ డాక్యుమెంటరీ ఎంపిక కావడానికి అందులోని సామాజిక, ఆరోగ్య, ఆర్థిక అంశాలతో ముడిపడిన సబ్జెక్ట్ ప్రధాన కారణంగా నిలిచింది.
నిప్పు రవ్వ – సారాంశం:
సింగరేణి ఓపెన్ కాస్ట్ బాధితుల కన్నీళ్ల నుంచి పుట్టినదే నిప్పురవ్వ. ఒకరిది వ్యాపారం, మరొకరిది జీవనం. ఒకరివి లాభాలు, మరొకరివి కన్నీళ్లు, కష్టాలు. ఓపెన్ కాస్ట్ మైన్స్ రాకముందు ఆ ఊర్లు కళకళలాడుతుండేవి. మరి ఇప్పుడో అవి పేరుకే పల్లెలు, జీవకళ లేదు. ఊర్లను స్వాధీనం చేసుకుని బ్లాస్టింగ్ మొదలుపెట్టిన నాటి నుంచి అక్కడి పల్లెవాసుల గుండెలు బద్దలవుతున్నాయి. దీంతో జీవం లేని ఊర్లు కనబడుతున్నాయి. అక్కడ తిరగాడుతున్నది మనుషులే అయినా వారి కళ్లలో ఆనందం ఆవిరైంది. వారి కన్నీటి వ్యథల రూపొందించిన ప్రత్యేక కార్యక్రమే నిప్పురవ్వ. ఉత్తమ సామాజిక సంబంధిత చిత్రంగా నిప్పురవ్వను 2009 సంవత్సరానికి గాను బంగారు నంది అవార్డుకు సెలెక్ట్ చేశారు. ఆ వార్త రాగానే టివీ5 న్యూస్ డెస్క్ ఆనందంతో పొంగిపోయింది. ఈ ఆనంద ఘడియలను నా అభిప్రాయాలుగా టివీ5 న్యూస్ బులిటెన్‌లో నేను పంచుకోగలిగాను. అప్పుడెప్పుడో జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించడానికి ముందు మత్యకారుల పడవల మీద వ్యాసం వ్రాయడం, అది ఈనాడులో అచ్చవడం (చూ. ఈ పడవకెంత దిగులో..) ఆనందంతో రూట్ మార్చుకుని జర్నలిజం వైపు అడుగులు వేయడం వంటి సంఘటనలు ఈ నంది అవార్డు ప్రకటన రోజున గుర్తుకొచ్చాయి. నిప్పురవ్వ డాక్యుమెంటరీ తయారుచేయడమన్నది సమిష్టి కృషి. రచయితగా నేను వ్రాస్తే, విజువల్ ఎడిటింగ్ అంబటి కిరణ్ చేశాడు. ఈ వర్క్‌తో సంబధం లేకపోయినా చురుకైన కుర్రాడు చల్లగుల్ల హర్ష దగ్గర కూర్చుని ఎడిటింగ్ విషయంలో సలహాలు, సూచనలు చేశాడు. హర్ష ఇప్పుడు టివీ5 – హెచ్ ఆర్ – జనరల్ మేనేజర్‌గా ఎదిగారు. ఆయనను నా జీవనరాగాలు-1 పుస్తకావిష్కరణ సభకు రండని ఆహ్వానిస్తే, వారు ఎంతో ఆత్మీయంగా వచ్చారు. ఈ స్నేహబంధానికి ‘నిప్పురవ్వ’ ఎలా సహకరించిందో చెప్పారు. నిప్పురవ్వ కార్యక్రమానికి నిర్వాహణ బాధ్యతలను అప్పటి అవుట్‌పుట్ ఎడిటర్ ముసునూరి సోమయాజులు గారు తీసుకున్నారు. వీరు కూడా ఇప్పటికీ నాకెంతో ఆత్మీయులు.
మరణ మృదంగం:
టివీ5లో పనిచేస్తున్న రోజుల్లోనే బాలికలతో మరణ మృదంగం అన్న పేరిట నిర్వహించిన కార్యక్రమానికి యునిసెఫ్ అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఈ అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదగా స్వీకరించాను.
సామాజిక స్పృహతో కార్యక్రమాలను మలిస్తే వాటికి తప్పకుండా ఆదరణ, ప్రశంసలు దక్కుతాయని మరోసారి రుజువైంది. సర్కస్ కంపెనీల వాళ్లు వేరే దేశాల (నేపాల్ వంటి చోట్ల) నుంచి మైనారిటీ వీడని పిల్లలను తీసుకు రావడం, వారి జీవితాలతో ఆడుకోవడం వంటి దుశ్చర్యలను ఖండిస్తూ చేసిన కార్యక్రమం ఇది.
‘జీవితమే రంగుల వలయం/దానికి ఆరంభం సూర్యుని ఉదయం’ – అని దాసరి ఓ సినిపాటలో అన్నట్లుగా ఏ రంగు ఎలా వస్తుందో, అది ఎంత కాలం ఉంటుందో, ఆ రంగే మరో రంగుగా ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
ఆనంద ‘తరంగం’:
టివీ 5 నుంచి తరంగా రేడియో స్టేషన్ (ప్రైవేట్) వారు ఉన్నతి పదవి (ప్రొగ్రామ్ డైరెక్టర్) గా నన్ను తీసుకున్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత అవకాశం చిక్కినట్లు ఫీలయ్యాను. రంగుల వలయంలో మరో రంగు ప్రవేశించింది. ఈ రంగు ప్రకాశవంతంగా వెలుగులు చిమ్మింది. అప్పటికే 60 వడికి చేరువు అవుతున్నాను. తరంగా రేడియోలో పనిచేస్తున్నప్పుడే అనేక మంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. గుర్తుకొచ్చినవి ప్రస్తావిస్తున్నాను. రావి కొండలరావు గారితో అనేక ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాను. వారిని ఇంటర్వ్యూ కూడా చేశాను. అలాగే జయసుధ, మురళీమోహన్, జీవిత రాజశేఖర్, అనంత్ శ్రీరామ్, సి. నారాయణ రెడ్డి, మాదవపెద్ది సురేష్ వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి.
రేడియో తరంగా పేరిట భారతీయ సినిమాకు మేము అందించిన మెగా ఈవెంట్‌కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. చాలా సంతోషమేసింది. ఎక్కడ ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ నుంచి ప్రశంసా పత్రాలు అందుకోవడం వెనుక నాలోని పట్టుదల, కృషి, సంకల్పబలం కారణమని నేను అనుకుంటూ ఉంటాను. ఇక రిటైర్ అయ్యాక ఏం చేస్తాములే అనుకుంటున్న వేళలో కూడా నాకు భగవంతుడు అనేక అవకాశాలు కల్పించాడు. ఇప్పటికీ కల్పిస్తూనే ఉన్నాడు.
హార్ట్ ఆఫరేషన్ అయ్యాక 60 పదులు దాటిన వయసులో నా సొంత ఛానెల్‌లో అనేక విశేష కార్యక్రమాలు అందజేశాను. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ వారు – ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు భాషా వికాసానికి సోషల్ మీడియా ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై ఆంధ్రా విశ్వకళాపరిషత్‌లో ప్రసంగించాను. తెలుగు భాషాభివృద్ధికి ఓ జర్నలిస్ట్‌గా సేవలందించాను. ఈ విశేషాలు మరోసారి చెబుతాను.
తిరిగే రంగుల చక్రం:
కష్టాలు పడ్డాను, అవమానాలు ఎదుర్కున్నాను. బాధలు చవిచూశాను. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జర్నలిస్ట్ గానే చేతనైన పనులు చేస్తూనే ఉన్నాను. జీవనపోరాటాల నుంచి జీవన సాఫల్యత వైపు నడిచిన నా ఈ సుదీర్ఘ ప్రయాణం ఏ కొద్ది మందికైనా ఆదర్శంగా నిలిస్తే చాలు. భగవంతుడు ప్రసాదించిన ఈ కాలమనే రంగుల చక్రంలో ఇంకా ఎన్ని రంగులు మిగిలి ఉన్నాయో ఎవరికి తెలుసు. చూద్దాం..
(మళ్ళీ కలుద్దాం)