తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-36

0
2

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

నెట్టుకుంటూ అలా.. అలా:

[dropcap]రా[/dropcap]తియుగం – ఇంటర్నెట్ యుగం మధ్య మానవ జీవన వికాసాల నడుమ చాలా అంతరం ఉంది. జాతిగా చూస్తే మానవులంతా ఒకటే కావచ్చు, కానీ – సులువైన జీవనం కోసం ఏం చేయాలన్న విషయంలో పెరుగుతున్న జిజ్ఞాసే – ఆది మానవున్ని ఆధునిక మానవునిగా తీర్చిదిద్దింది. కొత్త సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకున్నప్పుడల్లా మానవ జీవన ప్రగతిలో పెను మార్పులే చోటుచేసుకున్నాయి. ఇదంతా ఒక కోణం. కానీ, మార్పు వస్తున్నప్పుడల్లా అంతే స్థాయిలో ఇబ్బందులు, కష్టాలూ సమాజంలో తప్పలేదు. కొత్త కాంతి వైపు అందరూ పరుగులు పెడుతుంటే, కొంత మంది మాత్రం పాత అనే చీకటిలోనే ఉండిపోతుంటారు. వారు కొత్తని వెంటనే స్వాగతించలేరు. మానవ చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. భూమి గుండ్రంగా ఉన్నదని అంటే కాదనే వారూ, మనిషిని దేవుడు సృష్టించలేదు జీవపరిణామ క్రమంలో ఈ జాతి ఆవిర్భవించిందని చెబితే వినని వారూ, గ్రహణాల గుట్టు విప్పితే నమ్మని వారు ఆనాడే కాదు ఈనాడూ ఉన్నారు.

పెను మార్పులు:

1984 నుంచి నాలుగు దశాబ్దాల నా జర్నలిజం కెరీర్‌లో అనేక సాంకేతిక పరమైన మార్పులు చూశాను. మీడియాలో నిలదొక్కుకోవడం ఇక కష్టమే అనుకున్నాను. నా కళ్ల ముందు అనేక మంది ఈ వృత్తిని వదిలేసి వెళ్ళిపోయారు. మరెంతో మందికి ఉద్యోగాలు పోయాయి. సాంకేతిక మార్పులను పెను భూతంగా అనుకుంటున్న వారు ఇప్పటికీ ఉన్నారు. మానవ జీవనయానం టెక్నికల్‌గా మారుతున్నప్పుడల్లా ఎన్నో ఇబ్బందులు, అవస్థలు తప్పలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. చిత్రమేమంటే, సాంకేతికంగా పెను మార్పులు రానంత వరకు వారంతా సంతోషంగానే జీవనం గడిపారు. ఎందుకంటే ఇంత కంటే మెరుగైన జీవితం తమకు ఆధునిక సాంకేతికత అందించబోతుందన్న ఆలోచన వారికి లేదు కనుక.

ఈ మధ్య ఓ ఎనిమిదేళ్ల బాలుడు నన్ను అడిగాడు.

‘మీ చిన్నప్పుడు మొబైల్ పోన్స్ లేవా? ఇంటర్నెట్ లేదా? టీవీలు లేవా?’

‘లేవు’.

‘మరి మీరంతా సంతోషంగా ఉన్నారా?’

‘ఉన్నాము’

వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇవన్నీ వాడి జీవితంలో ప్రధానమైనవి కాబట్టి. కానీ అవేవీ తెలియవు కనుక మాకు అప్పటి జీవనమే పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఎప్పటికప్పుడు మానవుడు తనకున్న జ్ఞానంతోనే సంతృప్తి పొందుతుంటాడు. కొత్త విషయం వెలుగు చూస్తేనే కదా పోల్చుకోవడానికి.

చక్ర మహిమ:

మానవ జాతి వికాసానికి సంబంధించి నేనో పుస్తకంలో చదివాను. అందులో ఒక చోట..

అది రాతియుగం. మానవునికి చక్రం అంటే తెలియని రోజులవి. బండిని లాక్కెల్లడానికి నలుపలకల చెక్కనో, లేదా రాతినో బండి ఇరుసుకు చక్రాలుగా బిగించేవారు. ఆ సమయంలోనే ఒకానొక చోట గుండ్రటి రాయి ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుంచి వేగంగా, దొర్లడాన్ని కొంత మంది యువకులు గమనించారు. వీల్ తయారు చేయడానికి ఓ ఆలోచన మెరిసింది. ఫలితంగా బండికి గుండ్రటి చక్రాలు అమిరాయి. దీంతో బండి వేగంగా సునాయాసంగా వెళ్లగలిగింది. పని సులువైంది. అయితే, ఊహకు కూడా అందని ఈ మార్పుని మిగతా వాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాత పద్ధతే మంచిదన్న వాదన నుంచి బయట రాలేక పోయారు. పైగా చక్రం వాడుతున్న యువకులను ఎగతాళి చేశరు. ‘మా పనికి అడ్డు రాకు’ అంటూ విసుక్కున్నారు. కానీ మార్పు ఆగలేదు. ఈ లోగా కొత్త మార్పును మరికొంత మంది స్వాగతించారు. నెమ్మదిగా చక్రం వాడకం పట్ల మోజు పెరిగింది. సునాయాసంగా పని అవుతుంటే కష్టపడటమెందుకన్న భావన మొలకెత్తింది. ఫలితంగా సమాజంలో చక్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రింట్ మీడియా పెను మార్పులకు గురైనప్పుడు ఇంచుమించు కథ ఇలాగే నడిచింది. ఈ మార్పులకు కంప్యూటర్ కారణమైంది. మొదట్లో ఇది మా పాలిట పెనుభూతం. ఎందుకంటే మీడియా రంగంలోకి కంప్యూటర్ ప్రవేశించడంతో ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి. బతుకులు భారమయ్యాయి. ఉన్నట్లుండి ఆఫీస్ వాతావరణం మారిపోయింది.

కంప్యూటర్ తెచ్చిన కలకలం:

నేను 1984లో విజయవాడ ఆంధ్రప్రభ ఆఫీస్‌లో సబ్ ఎడిటర్‌గా చేరినప్పుడు ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం రావడానికి కంప్యూటర్ రంగప్రవేశమే ప్రధాన కారణం. 1990వ దశకం మధ్యలో అనుకుంటా – కంపోజింగ్ సెక్షన్ వారి కోసమే అన్నట్లు కంప్యూటర్లు దిగాయి. అప్పటివరకు హ్యాండ్ కంపోజింగ్, లైనో టైప్ కంపోజింగ్ వంటివి ఉండేవి. ఎప్పుడైతే కంప్యూటర్లు దిగాయో హ్యాండ్ కంపోజింగ్ సెక్షన్‌లో కలవరం. మద్రాసు నుంచి లారీల్లో డెస్క్‌టాప్‌లు, సీపీయులు ఇంకా అనుబంధ పరికరాలు దిగాయి. ఆఫీస్ లోకి కంప్యూటర్లు రావడంతో కొత్త సౌకర్యాలు వచ్చేశాయి. మా కోసం కాకపోయినా కంప్యూటర్ల కోసం ఆఫీస్‌లో కొంత భాగం ఏసీ చేయించారు. ఎందుకంటే పాపం కంప్యూటర్లకు ఎప్పుడూ చల్లగాలి తగులుతుండాలట. లేకపోతే అవి వేడెక్కి పనిచేయడానికి మొరాయిస్తాయట. అప్పుడే ఒక విషయం అర్థమైంది. మనుషుల కంటే యంత్రాలకే విలువ పెరిగే రోజులు వచ్చాయన్న సంగతి. వాటి కోసం అందమైన ఛాంబర్స్ కట్టించారు. గాజు తలుపులు పెట్టించారు. చెప్పులు విప్పే లోపలకు అడుగు పెట్టాలి. అదేదో గుడిలాగా.. విజయవాడలో ఎప్పుడూ ఎండలే, చమటలే. దీంతో మాకు కంపోజింగ్ సెక్షన్ కాశ్మీరంలా అనిపించేది. చమట పట్టినప్పుడల్లా వెళ్ళి కాసేపు కంపోజింగ్ సెక్షన్ లోకి దూరేవాళ్లం. ఈ విషయం యాజమాన్యం గమనించి ‘బయట వాళ్లు’ – అంటే వేరే సెక్షన్ల వాళ్లు ఈ ఏసీ ఛాంబర్లలోకి వెళ్లడం పై రూల్స్ పెట్టారు. అయితే సబ్ ఎడిటర్స్‌కి కొంత మినహాయింపు ఉండేదనుకోండి. ‘కంప్యూటర్ల సెక్షన్లలో పనేచేవారికి అందుతున్న రాజ భోగం (ఏసీ భోగం) సామాన్య సెక్షన్లలో ఉన్న మా బోటి వారికి కూడా అందితే ఎంత బాగుణ్ణో’ అని అనుకునే వాళ్ళం. ఆ కోరిక మరో రకంగా తీరింది. యాజమాన్యం ఓ సారి పిలిచి, సబ్ ఎడిటర్స్‌కి కూడా కంప్యూటర్ల పైనే మేటర్ కంపోజింగ్ చేస్తే బాగుంటుందన్న ప్రపోజల్ తీసుకు వచ్చారు. అది ప్రపోజల్ కాదనీ, నిర్ణయమేనని తెలియడానికి ఆట్టే కాలం పట్టలేదు. మద్రాసు నుంచి తెలుగులో కంపోజింగ్ నేర్పడానికి ఓ మనిషిని పంపారు. అతగాడి రాకతో మా ఎడిటోరియల్ సెక్షన్‌లో కలకలం. అప్పటికే హ్యాండ్ కంపోజింగ్ సెక్షన్ కంప్యూటర్ల ప్రవేశంతో డమ్మీగా మారింది. వారిలో చాలా మందిని వేరే సెక్షన్లకు బదలీ చేశారు. మరి కొంత మందిని ఉద్యోగం వదిలేసి వెళ్ళి పోయారు. కంప్యూటర్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ భారీ మార్పులు తప్పడం లేదు. వద్దని ఎంతగా వారించినా ఈ మార్పు చాపక్రింద నీరులా సాగిపోతూనే ఉంది.

కంప్యూటర్లపై తెలుగు కంపోజింగ్ నేర్చుకోవడమా? లేక మరో ఉద్యోగం చూసుకోవడమా ?? ఇవే ప్రశ్నలు. ఇంత గడ్డు పరిస్థితిలోనూ నాకు ఆ దేవుడు కోరని వరం ఇచ్చినట్లు భావించాను. కంప్యూటర్ కంపోజింగ్‌తో నాకు అప్పటి వరకు ఉన్న అతి పెద్ద ఇబ్బంది తొలిగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని అనిపించింది. అందుకే మేనేజర్ గారు అడగ్గానే ‘నేర్చుకుంటానంటూ’ చేయి పైకెత్తాను.

ఇది తెలుగా.. కన్నడమా?

ఆంధ్రప్రభలో చేరినప్పటి నుంచి రోజూ చాలా వార్తలు వ్రాయాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఆఫీస్ లోకి నా సీట్ దగ్గర కూర్చోగానే అటెండర్ తెల్ల కాగితాల బొత్తి ఇచ్చేవాడు. కుర్చీ ఎదురుగా ఓ బల్ల ఉండేది. ఆ రోజుల్లో గుమాస్తా గిరి వెలగబెట్టేవారు కుర్చీకీ బల్లకి మధ్యలో పెద్ద అట్ట వాల్చి పెట్టుకుని కాగితాలమీద వ్రాసేవారు కదా. అలాగే మాకు ఆ సౌకర్యం ఉండేది. కూర్చోగానే పెద్ద అట్టను బల్ల మీద నుంచి కుర్చీ చేతుల మీదకు వాల్చుకుని అటెండర్ ఇచ్చిన తెల్ల కాగితాల బొత్తిని సరి చేసుకుని జేబులోని పెన్ను తీసుకుని ఇష్ట దేవత పేరును ఓ మూడు సార్లు వ్రాసుకున్నాక అసలు పని మొదలు పెట్టేవాడ్ని. ఆఫీస్ లోని ఎడిటోరియల్ సెక్షన్‌లో అనేక ఉప విభాగాలుండేవి. వాటిలో ప్రధానమైనవి జనరల్ డెస్క్, ఎడిటోరియల్ డెస్క్. వీటికి అనుబంధంగా బిజినెస్ డెస్క్, రీజనల్ డెస్క్, స్పోర్ట్స్ డెస్క్, సినిమా డెస్క్ వంటివి ఉండేవి. ప్రాంతీయ వార్తలు విలేఖరుల నుంచి నేరుగా ఆఫీస్‌కు చేరేవి. ఇందుకోసం బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద డబ్బాలు పెట్టేవారు. విలేఖరులు తమ వార్తలను కవర్‌లో పెట్టి వాటిని బస్సు డ్రైవర్‌కో, లేదా ప్రయాణీకునికో ఇచ్చి డబ్బాల్లో వేయమని చెప్పేవారు. అలా చాలా ఊర్ల నుంచి వార్తలు డబ్బాల్లో పడుతుండేవి.

ఇవన్నీ ఇప్పుడు చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో వాట్సప్ ద్వారానే వార్తలు, ఫోటోలు పంపుతున్నారు. వాటిని డెస్క్ వాళ్లు కాపీ చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. అసలు కంపోజింగ్ విషయంలోనూ ఇప్పుడు భారీగా మార్పులు వచ్చాయి. టైప్ చేయకుండానే మాట్లాడితే చాలు, ఆ పదాలు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతున్నాయి. కొద్ది పాటి మార్పులు, చేర్పులు చేస్తూ వార్తలను పంపే విలేఖరులను చూసి నేను ఆశ్చర్యపోయాను. అలాగే ఇంగ్లీష్‌లో వచ్చిన వార్తలను తెలుగులోకి అనువదించే విషయంలో కూడా అనేక టూల్స్ వచ్చేశాయి. ప్రాథమికంగా అవి అనువదిస్తే కొద్దిగా బుర్ర ఉపయోగించి మార్పులు చేస్తే చాలు ఇంగ్లీష్‌లో ఉన్న వార్త తెలుగులోకి వాడుకునే పరిస్థితి వచ్చేసింది.

కానీ, ఆ రోజుల్లో అలా డబ్బాల్లో పడిన వార్తల కవర్లను ఒక బాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఎడిటోరియల్ సెక్షన్‌కి అందించేవాడు. ఇదంతా ఓ ప్రాసెస్. సంబంధిత డెస్క్ సబ్ ఎడిటర్స్ ఆఫీస్‌కి వచ్చేలోగానే చాలా వార్తలు డెస్క్ ముందు ఉండేవి. వచ్చే వార్తల్లో ఏది ముఖ్యమైనదన్నది చూడటం ఎడిటోరియల్ సెక్షన్ ప్రధాన విధి. సబ్ ఎడిటర్ పైన సీనియర్ సబ్ ఎడిటర్, ఆ పైన ఛీప్ సబ్ ఎడిటర్, ఇంకా డిప్యూటీ న్యూస్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటర్ ఇలా పై అధికారులు ఉండేవారు. ఎవరి పనులు వారివి. సబ్ ఎడిటర్‌గా శిక్షణ ముగిశాక వార్తల పట్ల అవగాహన వస్తుంది కనుక వార్తల ఎంపిక విషయంలో వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకోవాలి. మరీ ముఖ్యమైన విషయమైతేనే పై అధికారిని సంప్రదించాలి. తెలుగులో వచ్చే వార్తలను సరిచేయాలి. అంటే వాక్యాల్లో దోషాలు లేకుండా చూడాలి. దీంతో పాటుగా వార్త యెక్క ప్రాధాన్యతను బట్టి దాని నిడివి ఎంత ఉండాలో నిర్ణయుంచుకోవాలి. విలేఖరి ఒక్కోసారి ఏ కారణంగానైనా ఎక్కువ నిడివితో వ్రాస్తే దాన్ని పసిగట్టి తగ్గించాలి. ఒక రకంగా చెప్పాలంటే, వార్త ప్రాధాన్యతను బట్టే వార్త నిడివి ఉండాలి. ఒక వేళ ఎడిటోరియల్ సెక్షన్ నుంచి అనవసరమైన వార్త ఏదైనా కంపోజింగ్‌కి వెళితే అదే వార్త ప్రింట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఎడిటోరియల్ సెక్షన్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అందుకే సబ్ ఎడిటర్ పోస్ట్ అన్నది ఒక రకంగా న్యాయమూర్తి పోస్ట్ లాంటిది. ఏ వార్తకు అన్యాయం జరగకూడదు. అలా అని ఏ వార్తను అనవసరంగా మోయకూడదు. అందుకే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం డెస్క్ ఇంఛార్జ్ పని. నేను జనరల్ డెస్క్, రీజనల్ డెస్క్ లతో పాటుగా స్పోర్ట్స్ డెస్క్‌లో కూడా పనిచేశాను.

వార్తల్లో కొన్ని యుఎన్ఐ, పీటీఐ వంటి వార్తా సంస్థల నుంచి వచ్చేవి. మరి కొన్ని ఇతర సోర్స్‌ల నుంచి వచ్చేవి. వాటన్నింటినీ గమనించి పాఠకునికి అవసరమైన వార్తలను ఎంపిక చేసుకుని తెలుగులోకి అనువదించాలి. ఆంగ్లంలో వచ్చే వార్తలను అనువదించడంలో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, మక్కీకి మక్కీగా అనువదించకూడదు. అలా అని మన సొంత భావజాలాన్ని కుమ్మరించకూడదు. అందుకే నార్ల గారు ఒక మాట అనేవారట.

‘వార్త పవిత్రం.

వ్యాఖ్య నీ ఇష్టం.’

మంచి జర్నలిస్ట్‌గా ఎదగడానికి ఇలాంటి సూక్తులు మాకు ఉపయోగపడేవి. ఇప్పటి జర్నలిజం గురించి నేను ప్రస్తావించదలచుకోలేదు. ఓ మంచి యుగంలో జర్నలిస్ట్‌గా పనిచేశానన్న తృప్తి మిగిలింది. అది చాలు.

సరే, ప్రతి రోజూ అనేక వార్తలు వ్రాస్తుండటంతో బాల్ పెన్‌లో రీఫిల్స్ అయిపోతుండేవి. అందుకే ఆఫీస్‌లో రీఫిల్స్ ఇచ్చేవారు. అలా వ్రాసి వ్రాసి నా కుడిచేయి మధ్య వేలు పై కనుపు వద్ద ఒక బుడిపి వచ్చింది. ఒక దశకు వచ్చేసరికి అది వాచి నొప్పి పుట్టేది. అలా అని వ్రాయడం మానలేను కదా. ఈ ఇబ్బంది తొలగడానికి ఇప్పుడు – అదేనండి, కంప్యూటర్ల సాయంతో కంపోజింగ్ చేసే మార్గం వచ్చిందన్నదే నా సంతోషానికి కారణం. మరో కారణం కూడా ఉంది. నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగోదు. కోడి – గింజలను కెలికినట్లు ఉండేదని అనేవారు. చిన్నప్పుడు అక్షరాలు దిద్దేటప్పుడు శ్రద్ధ పెట్టలేదనుకుంటా. నా చేతి రాత ఒక్కోసారి మా న్యూస్ ఎడిటర్ గారికి చిరాకు పుట్టించేది. ఇంకొన్ని సార్లు నవ్వు పుట్టించేది. అది ఆయన గారి మూడ్‌ని బట్టి అన్నమాట. ఓ సారి మూడ్ బాగున్నప్పుడు నేను వ్రాసిన కాగితాలతో నా దగ్గరకు వచ్చి నా ఎదురుగా కూర్చుని నవ్వుతూ..

‘ఏమోయి నిన్ను బెంగుళూరు ట్రాన్సఫర్ చేయిద్దామనుకున్నానోయ్. కానీ ఈ ఆలోచన మానుకున్నాను. ఎందుకంటే ఇదిగో నీవిలా వ్రాస్తే అది కాస్తా రేపు కన్నడ ప్రభలో ప్రింట్ అవుతుందని.. హ్హాహ్హాహాహా..’ అంటూ నవ్వేశారు.

ఆంధ్రప్రభ – ఇది ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పేపర్. గ్రూప్ పేపర్ కావడంతో అందరికీ జీతభత్యాలు, బోనస్ విషయాల్లో ఒకే విధానం ఉండేది. దీంతో బయట కూడా ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎంప్లాయిగా మంచి గౌరవం దక్కేది. బెంగుళూరు నుంచి ‘కన్నడ ప్రభ’ వస్తుండేది. తెలుగు భాష, కన్నడ భాషల లిపిలో చాలా పోలికలు ఉంటాయి కదా. నన్ను ఒకవేళ బెంగళూరు ఆంధ్రప్రభకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, నేను వ్రాసిన తెలుగు వార్తను అటెండర్ పొరపాటున కన్నడ కంపోజింగ్ సెక్షన్‌కి ఇచ్చేస్తే, అది అక్కడే కంపోజ్ అయి చూసి చూడకుండా, కన్నడ ప్రభ పేపర్లో ప్రింట్ అయితే.. ప్రమాదమే కదా. అందుకని నన్ను ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేస్తాము కానీ, బెంగుళూరుకి మాత్రం చేయమన్నది సదరు న్యూస్ ఎడిటర్ గారి వెటకారంలోని వాస్తవం అన్న మాట. ఇలాంటి అవమానాలు ఎదుర్కుంటున్న సమయంలోనే ఇదిగో కంప్యూటర్ గారు ఆఫీస్ లోకి ప్రవేశించారు. ఇప్పుడేమో సబ్ ఎడిటర్స్‌ని కూడా కంప్యూటర్ లోనే మీమీ వార్తలను తెలుగులో ఎంచక్కా టైప్ చేసుకోవచ్చని యాజమాన్యం అంటున్నది. మిగతా వాళ్ళకు ఇది రుచించలేదు. వారు గుమాస్తాగిరి లాగా హాయిగా కుర్చీలో కూర్చుని వార్తలు వ్రాసే పద్దతికి బాగా అలవాటు పడ్డారాయె. పైగా మరో సౌకర్యం కూడా ఉండేది. స్మోకింగ్ అలవాటైన ప్రాణులు అక్కడే పనిచేసుకుంటూనే స్మోక్ చేయవచ్చు. అదే కంప్యూటర్ మీద కంపోజింగ్ అనగానే ఏసీ రూమ్స్‌లో పనిచేయాలి కాబట్టి, అక్కడ నో స్మోకింగ్ కాబట్టి – ఇలాంటి ప్రాథమిక సౌకర్యాలు పోతాయోమోనని వారి భయం. వ్రాయడానికి అలవాటు పడిన చేతులతో ఏదో కంపోజిటర్స్ వాళ్ల లాగా కంపోజ్ చేయడమా అన్న చిన్న చూపు కూడా ఉండేది. మనసులోని ఆలోచనలను కాగితం మీద చకచకా పెట్టెగలిగే నేర్పు ఉన్న ఇలాంటి వారికి – ఇటు టైపింగ్ మీద శ్రద్ధ పెడుతూనే మరో ప్రక్క వార్త ఏం వ్రాయాలన్న ఆలోచనలను కంప్యూటర్ స్క్రీన్ మీదకు ఎక్కించడమా? అన్నది సమస్య. ఇందులో టెక్నికల్, సృజనాత్మకత రెండూ ఉంటాయి కదా, ఈ రెంటినీ కలపడం సాధ్యమేనా అన్నది ప్రశ్న. ఇది నాకూ ఇబ్బందే. కానీ జరిగిన అవమానాలను తలుచుకుని పట్టుదలతో టైప్ పట్ల పట్టు సంపాదించగానే ఆలోచనలను చాలా తేలిగ్గానే కంప్యూటర్ తెరమీద నిక్షిప్తం చేయగలుగుతున్నాను. ఆనాటి ఆ పట్టుదలే ఈనాటికీ నాకు అక్కరకు వస్తున్నది. ఆంతే కాదు ఆనాడు నేర్చుకున్న ఇన్‌స్క్రిప్ట్ పద్ధతిలోనే నేను మనసులోని భావాలకు తగ్గట్టుగా తెలుగు చకచకా టైప్ చేయగలుగుతున్నాను.

మారని మనుషులు తెరమరుగయ్యారు. మార్పుని గుర్తించి, మోల్డ్ అయిన వారు గుర్తింపు పొందారు. ఇది ఒక్క మీడియాలోనే కాదు ఆ తర్వాత అనేక ఉద్యోగాల్లోనూ జరిగింది.

నెత్తి మీద కత్తి:

కంప్యూటర్ మీద కంపోజింగ్ చేసుకోండని చెప్పిన యాజమాన్యం నిదానంగా మరో టెక్నాలజీని మా మీద రుద్దడానికి రంగం సిద్ధం చేసింది. అదే ‘పేజినేషన్’. అంటే పేజీలు కూడా కొత్త టెక్నాలజీతో మీరే పెట్టుకోవచ్చని అంది. పైగా ప్రూఫ్ రీడింగ్ బాధ్యతా మీదే అంది. దీంతో నెత్తిమీద కత్తి వ్రేలాడుతున్న భావన కలిగింది. ఇక్కడా అంతే, మార్పును స్వాగతించకపోతే వెనక్కి పోతామని గ్రహించిన నాబోటి వారు కొందరు పేజినేషన్‌ను శ్రద్ధగా నేర్చుకున్నారు. కానీ ఈ మార్పుల వల్ల ఆఫీస్‌లో నెమ్మదిగా పేజీలు పెట్టే మాన్యువల్ సెక్షన్, ఫ్రూప్ రీడింగ్ సెక్షన్ డమ్మీలుగా మారిపోయాయి. కొన్నాళ్లకు అదృశ్యమయ్యాయి. ఎడిటోరియల్ సెక్షన్‌లో కొంత మంది ఈ పెనుమార్పులు నచ్చక హుందాగా తప్పుకున్నారు. మరికొంత మంది విషయంలో యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.

కంప్యూటర్లు ఆఫీస్ లోకి వచ్చినప్పుడు వాటిని శీతల వాతావరణంలోనే ఉంచాలని ఏసీ ఛాంబర్స్ కట్టారు. ఆ తర్వాత వాటిని మామూలు వాతావరణంలో కూడా ఉంచడం మొదలుపెట్టారు. దీంతో ఏసీల సంఖ్య తగ్గించారు. మొత్తానికి ఒక విషయం అర్థమైంది. యాజమాన్యానికి కంప్యూటర్ల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద లేదని. సాంకేతిక మార్పులకు పెద్ద పీట వేసి ఉద్యోగుల కుర్చీలు ఎత్తేయడం మొదలైంది. టెక్నాలజీ వర్సెస్ మ్యాన్ పవర్ మధ్య జరిగిన యుద్ధంలో చివరకు టెక్నాలజీనే గెలిచింది. అందుకే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాల్సిందనేనన్న సూత్రాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తుంటాను. లేకపోతే ఈ 68 ఏళ్ల వయసులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ఆలోచించడమేమిటి చెప్పండి. సులువుగా పని చేయడం కోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలను (టూల్స్)ను ఉపయోగించాలన్న జిజ్ఞాసే నన్ను నడిపిస్తోంది.

కంప్యూటర్‌తో పాటు దాని సిస్టర్ ఇంటర్నెట్ అడుగుపెట్టింది. గూగుల్ అన్న మాట అప్పుడే విన్నాను. గూగుల్ సెర్చ్ ఇప్పుడున్నంత వేగంగా లేకపోయినా దాని ద్వారా అదనపు సమాచారం సులువుగా అందుకోవచ్చని తెలిసింది. తెలుగులో సమాచారం కోసం ప్రయత్నించినా అప్పట్లో పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. దీంతో ఇది కేవలం ఇంగ్లీష్‌కే పరిమితం అనుకున్నాను. ఆంగ్లభాష నుంచి తెలుగులోకి అనువాదం చేసే అలవాటు ఉండేది కనుక అదనపు సమాచారం ఇంగ్లీష్‌లో అందినా దాన్ని సందర్భోచితంగా నా వ్యాసాల్లో వాడుకునే వాడ్ని. ఈ విషయంలో మిగతా వారికంటే ముందడుగు వేయడంతో – ప్రత్యేక వ్యాసాలు వ్రాసే నేర్పు వీడికి ఉందన్న మార్క్ పడింది. పూర్వంలా వ్యాసం వ్రాయాలని అనుకోగానే లైబ్రరీకి వెళ్ళి రిఫరెన్స్ నోట్స్ ఇప్పుడు వ్రాసుకోనక్కర్లేదు. కంప్యూటర్ నుంచే ఆ మేటర్‌ని ప్రింట్ తీసుకోవడం మొదలుపెట్టాను. స్పోర్ట్స్ డెస్క్‌లో పనిచేస్తున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తాజా సమాచారం కోసం ‘క్రిక్ ఇన్ఫో’ వంటి వెబ్ సైట్లు ఓపెన్ చేసి మ్యాటర్ సేకరించి ప్రింట్ అవుట్లు తీసుకుని తాజా వార్తలను చకచకా తెలుగులో కంపోజింగ్ చేసేవాడ్ని. అయితే, ఆఫీస్‌లో ఉన్న అన్ని కంప్యూటర్లకు ఈ నెట్ సౌకర్యం ఉండేది కాదు. కేవలం ఇంజనీర్ల సెక్షన్‌లో మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. అక్కడకు వెళ్ళి కాసేపు కూర్చుని నాకు కావలసిన సమాచారం సేకరించేవాడ్ని. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలియకుండానే నేను అటు కంప్యూటర్లు, ఇటు ఇంటర్నెట్ వైపు ఆకర్షితుడనయ్యానని చెప్పడానికే.

నెట్టింట్లో..:

ఆఫీస్‌లో ఉన్న కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని, పని సులువు అవుతుందని అనుకునేవాడ్ని. ఈ కోరిక విజయవాడలో ఉన్నంత కాలమూ తీరలేదు. హైదరాబాద్ వచ్చాక ఇంట్లోకి కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం వచ్చేశాయి. దీంతో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. కొన్ని వెబ్ సైట్ల వారికి తెలుగులో రాజకీయ విశ్లేషణలు, వ్యంగ్య రచనలు ఇవ్వడానికి వీలు చిక్కింది. ఒక దశలో రోజుకు నాలుగు ఆర్టికల్స్ టైప్ చేసి పంపేవాడ్ని. అంత బిజీగా ఉండేవాడ్ని.

మీడియా రంగంలో ఇన్ని రకాల మార్పులు వస్తాయని అనుకోలేదు. ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ వాడిన నేను తర్వాత లాప్‌టాప్ వాడటం మొదలుపెట్టాను. ఇంటర్నెట్‌తో నెట్టుకుంటూ వస్తున్న నాకు వెబ్ సైట్లు, బ్లాగ్‌లు ఆకర్షించాయి. బ్లాగ్ ఒకటి ఓపెన్ చేసి అందులో నా ఆలోచనలు పంచడం మొదలుపెట్టాను. ప్రింట్ మీడియాలో వ్రాసిన వ్యాసాల సంఖ్య కంటే వెబ్ సైట్స్, బ్లాగ్‌ల్లో వ్రాసినవే ఎక్కువ. ఫేస్‌బుక్ ద్వారా పాఠకులకు మరింత దగ్గర అవ్వచ్చని తెలిసింది. టివీ 5లో పనిచేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెడుతుండేవాడ్ని. ఈలోగా ఫోన్ల స్వరూపం మారింది. స్మార్ట్ ఫోన్లు రంగప్రవేశం చేశాయి. నేను తరంగా రేడియోలో పనిచేస్తున్నప్పుడు మొదటిసారి ఇలాంటి ఫోన్లు చూసి ఆశ్చర్యపోయాను. అనతికాలంలోనే స్మార్ట్ ఫోన్ నా చితికి చిక్కింది. వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా జర్నలిస్ట్‌గా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ ఉపయోగపడుతూనే ఉన్నాయి.

అక్కడితో ఆగలేదు. ఈ లోగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వచ్చేసింది. నా ఆలోచనలు అటు మళ్ళాయి. ఏఐని ఉపయోగించుకుంటూ ఒక జర్నలిస్ట్‌గా ఒక రచయితగా కొత్తకొత్త ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. చూద్దాం. ఈ జీవన యాత్రలో ఇంకెన్ని అద్బుతాలు చూడబోతామో, అవి మన జీవితాలను ఎలా మార్చబోతున్నాయో. సమాజంలో వచ్చే సాంకేతిక మార్పులను ఆపలేము. వాటికి తగ్గట్టుగా మనం మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఒక్క సారి వెనక్కి పోతే రాబోయే సమాజం నిన్ను అస్సలు పట్టించుకోదు. ఈ సత్యం గ్రహించే నా అడుగులు ముందుకు వేస్తూనే ఉంటాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here