తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-8

3
2

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రాణ రక్షకుడు:

లేత కుర్రాడొకడు ఏటిలో ఈత కొడుతున్నాడు. నిజానికి అతగాడికి ఈత కొట్టడం పూర్తిగా రాలేదు. తోటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఏటి దగ్గరకు వెళ్ళాడు. వచ్చీ రానీ ఈతతో ‘సాహసం చేయరా డింభకా’ అనుకున్నాడు. ఏటిలో నీరు బాగా ఉంది. కుర్రాడు హుషారుగా ఏటి నీటిలోకి దిగాడు. నీటి ప్రవాహం లేని చోటు, అంటే నిలకడగా నీరు ఉండే చోటునే ఈత కోసం ఎంచుకున్నారు. ప్రవాహంలో కొట్టుకు పోకూడదన్నది వీరి ఆలోచన. ఫ్రెండ్స్‌తో పాటు ఏట్లో అంతా కేరింతలు కొడుతున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

కానీ, ఈ కుర్రాడికి తెలియదు, మరి కాసేపట్లోనే మునిగిపోబోతున్నానని.

అప్పటి వరకు ఈత కొడుతున్నప్పటికీ నీటి క్రింద నేల తాకుతూనే ఉంది. నేలను కాలితో బలంగా తన్ని నీటి పైకి వచ్చేస్తున్నాడు. మళ్ళీ మునుగుతున్నాడు. అంతలో మళ్ళీ నేలను తన్ని పైకి వస్తున్నాడు. ఇదంతా ఆటగా ఉంది. పైకి వచ్చినప్పుడల్లా ‘చూశావా, నాకు ఈత వచ్చేసిందిరో’ అన్నట్లు ఫోజులు కొడుతున్నాడు. కానీ.. అంతలో కాళ్లకు నీటి క్రింద నేల తగలడం లేదు. నేల తాకే ప్రాంతం నుంచి పక్కకు వచ్చేసినట్లున్నాడు. అక్కడేదో గుంట ఉన్నట్లుంది. లోతు పెరిగిపోయింది. ఈ కుర్రాడు వచ్చీరానీ ఈతతో ఇబ్బంది పడుతున్నాడు. లోతైన గుంట నీటిలో మునిగిపోతున్నాడు. చేతులు నీటిపైకి ఎత్తి ‘రక్షించండ్రా’ అన్నట్లు సైగలు చేస్తున్నాడు. నీటిలో కాళ్లు తప తపా లాడిస్తున్నాడు. ఎక్కడైనా పట్టు చిక్కుతుందేమోనని ప్రయత్నిస్తున్నాడు. పైకి తేలలేక పోతున్నాడు. నీళ్లు మింగేస్తున్నాడు. ఇక అంతా అయిపోయిందనే అనుకున్నాడు. కానీ విధి విచిత్రమైనది. ఈ లేత కుర్రాడి చేత భవిష్యత్తులో ఎన్నో పనులు చేయించాలన్నది ఆ దేవ దేవుని సంకల్పం. దేవుడు నేరుగా వచ్చి రక్షించే కాలం కాదు కదా ఇది. మానవ రూపంలో వచ్చి కాపాడుతుంటాడు. అక్షరాలా అదే జరిగింది, ఇక్కడ.

సరిగా, అప్పుడు ఓ చేయి బలంగా ఈ బలహీనమైన కుర్రాడి చేతిని ఒడుపుగా పట్టుకుంది. బలంగా ఒడ్డుకి లాక్కెళ్ళింది.

జలగండం నుంచి బయటపడ్డ ఆ లేత కుర్రాడిని నేనే. ఆ బలమైన చేయి నా స్నేహితుడిది. అతను బంధువు కూడా. పేరు కస్తల విజయబాబు. ఈ సంఘటన జరిగింది 70వ దశకం తొలినాళ్లలో.

ఇదే ‘చేయి’ ఆ తర్వాత చాలా ఏళ్లకి అంటే 2020లో కరోనా వచ్చినప్పుడు, ఈ కుర్రాడే వృద్ధుడయ్యాక, షష్టిపూర్తి చేసుకుని ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు మరో గండం ఎదురైనప్పుడు.. సరిగా అప్పుడు కూడా ఆదుకుంది. అందుకే ఈ చేయి నా జీవితంలో ప్రత్యేకమైనది. పేరుకు విజయుడే అయినా నాకు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మాట అతను అంగీకరించడు. అది నాకు తెలుసు. నా తృప్తి కోసం రాశాను.

2020లో నేనూ నా శ్రీమతి (శ్రీదేవి) నందిగామలో ఓ అద్దె ఇంట్లో ఉండే వాళ్లం. ఓ రోజున పొద్దున వాకింగ్ చేస్తున్నప్పుడు సన్నటి గుండె నొప్పి. ఆ మర్నాటికి నొప్పి తీవ్రమైంది. స్నేహితుడు గోపు సుబ్రహ్మణ్యం సాయంతో విజయవాడ హాస్పటల్ చేరాను. నాలుగు చోట్ల బ్లాక్ అయిందంటూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. ఆ సమయంలో నా భార్యా, కుమార్తె, కుమారుడితో పాటు నిరంతరాయంగా విజయబాబు కూడా మాట్లాడుతూ మంచి హాస్పటిల్, మంచి సర్జెన్ కుదర్చడంతో పాటుగా ఆస్పత్రి సిబ్బందితో స్వయంగా మాట్లాడుతూ నన్ను క్షేమంగా గండం నుంచి బయటపడేయడంలో తన పాత్ర పోషించాడు. సందర్భం వచ్చినప్పుడు ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయులో ఉంటూ నాలో నేను ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నంలో పాత పాటలను అంత్యాక్షరిగా పాడుకోవడం, యుట్యూబ్ ఛానెల్‌కి పేరు ప్రతిష్ఠలు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలు వంటి సంఘటనలను చెబుతాను.

మొత్తానికి ఆ రోజు మున్నేరులో (దీన్నే మునేరు అని కూడా పిలుస్తుంటారు) జలగండం నుంచి బయటపడ్డాను. ఇంత జరిగినా మేము ఏమీ జరగనట్టే ఇంటికి చేరాము. ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ఇప్పటికీ ఈ విషయం తెలియదనే అనుకుంటున్నాను.

చెలమలు:

ఎండా కాలం ఏటిలో నీళ్లు లేనప్పుడు కాసిని నీళ్లైనా దొరుకుతాయోమోనని చెలమలు తవ్వతుంటారు. ‘చెలమ’ అంటే నీటి ఎద్దడి వచ్చినప్పుడు, నీటి ప్రవాహం పక్కన ఉండే ఇసుక తెన్నులో ఊటల కోసం గుంటలు తవ్వడం. అలా తవ్వుతున్నప్పుడు నీటి ఊటలు ఒక్కోసారి బయటపడతాయి. ఒక్కోసారి పడవు. మా ఊరి ఏటి ఒడ్డున ఇలాంటి చెలమల కోసం తీసిన గుంతలు అక్కడక్కడా కనబడుతుంటాయి. ఈ చెలమల్లోని నీటిని కడవల్లో నింపుకుని తీసుకువెళుతుంటారు. ఆ గోతులను మళ్ళీ ఇసుకతో పూడ్చరు. ఆ తర్వాత వర్షాకాలంలో ఏటికి నీరు బాగా వచ్చినప్పుడు ఈ చెలమలు పైకి కనబడవు. ఇందాక నేను జలగండాన్ని ఎదుర్కోవడానికి తీసిన గుంట కూడా ఇలాంటిదే.

వరద ఫోటోలు:

70వ దశకంలోని ఓ ఏడాది బాగా వర్షాలు పడ్డాయి. నదులు, ఏరులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామకు ఆనుకునే మున్నేరు ఉంది. వానా కాలం మున్నేరు ప్రవాహం జోరుగానే ఉంటుంది. ఓ సారి జోరు వానలతో ఏరు పోటెత్తింది. నందిగామ – విజయవాడ రహదారిపైన అంబారు పేటకు దగ్గరైతే వరద నీరు రోడ్డుని కోసేసింది. ఈ వార్త తెలిసి మా గ్యాంగ్ చూడటానికని సైకిళ్ల మీద బయలుదేరాము. ఇంట్లో వాళ్లకు చెబితే మామూలుగానే భయంతో వద్దని అంటారని తెలుసు కనుక, మేమూ మామూలుగానే చెప్పకుండా హైవే మీదకు వెళ్ళాము.

వరద నీటితో రోడ్డు చాలా చోట్ల కోసుకుపోయింది. మా ఫ్రెండ్స్ లో ఒకడికి (విష్ణుకి) క్లిక్ థర్డ్ కెమేరా (చూ. 12) ఉండేది. వాడు దాన్ని సైకిల్ హ్యాండిల్‌కి తగిలించి తీసుకొచ్చాడు. ఒకటి రెండు ఫోటోలు తీశాడు. వరద ఫోటోలు అలా తీయడం వాడికే కాదు మాకు కూడా ఏదో గొప్ప పని చేశామన్న ఫీలింగ్ వచ్చేసింది. రోడ్డుకి ఒక పక్కన కారొకటి వరద నీటిలో కొట్టుకుపోతున్నది. ఒక ట్రాక్టర్ – రోడ్డు మీదనే నీటి మధ్యలో ఇరుక్కుపోయింది. రక్షించమంటూ ట్రాక్టర్‌లో ప్రయాణం చేస్తున్న వారు భయంతో అరుస్తున్నారు. నిస్సహాయంగా చూడటం తప్ప నేనూ నా స్నేహితులు ఏమీ చేయలేకపోయాము. చాలా సేపటి తర్వాత రెస్క్యూ టీమ్స్ వచ్చి వారిని రక్షించాయి. కానీ కారు, అందులో ప్రయాణిస్తున్న వారు గల్లంతయ్యారని తర్వాత తెలిసింది. మాకు ఏడుపు ఆగలేదు.

ఆ దృశ్యం గురించి ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత గుర్తు తెచ్చుకుని రాస్తున్నా నా కళ్లు చెమ్మగిల్లుతునే ఉన్నాయి.

సరే, కాస్తంత మూడ్ మార్చుకుందామే.. అప్పుడు మా ఫ్రెండ్ తీసిన ఫోటో చాలా కాలం నా దగ్గర భద్రంగా ఉండేది. ఇలాంటి సంఘటనలే ప్రేరణగా నిలిచి నన్ను ఓ జర్నలిస్ట్‌గా తీర్చి దిద్దుతాయని అప్పట్లో అనుకోలేదు. వార్త ఎంత రాసినా, దానికి పోటో జోడిస్తేనే సమగ్రత వచ్చేదని మా న్యూస్ ఎడిటర్ ఒకాయన నేను ఆంధ్రప్రభలో ఎడిటోరియల్ డెస్క్‌లో పనిచేస్తున్నప్పుడు అనేవారు.

మరో విషయం చెప్పదలచుకున్నాను. నేను జర్నలిస్ట్‌గా స్థిరపడటానికీ సముద్ర ఆటు పోటులకు సంబంధం ఉందన్నది. గంగ పుత్రుల పల్లెలు, వారి జీవన విధానం, నాటు పడవలు వంటివి నాలోని జర్నలిస్ట్ ను మేల్కొలిపాయంటే చదువుతున్న మీకు కాస్తంత ఆశ్చర్యం కలగవచ్చు. జర్నలిజానికీ వీటికీ పొంతన ఏమిటని ఆలోచనలో పడవచ్చు. అక్కడా క్లిక్ థర్డ్ కెమేరానే క్లిక్ క్లిక్ మంది.

బావిలో కప్ప:

నా చిన్నప్పుడు, మా ఊర్లో వరదల వల్ల పొంగిన వాగుని చూసి సముద్రమంటే ఇదేనేమో అనుకునేటంతటి అమాయకత్వం ఉండేది. చాలా పెద్దయ్యాక మద్రాసులో అపార జలరాశి చూసేదాకా తెలియదు ‘ఇదిరా అసలు సముద్రం’ అని. పెరిగిన ఊరు (నందిగామ)లో ఏరు, పుట్టిన ఊరు (అడవి రావులపాడు)లో వాగు మాత్రమే తెలిసిన నా బోటి ‘బావిలో కప్ప’కు సముద్రం చూడగానే కళ్లు బైర్లు కమ్మాయి. అప్రయత్నంగా నోటి నుంచి ‘అమ్మో’ అన్న ఆశ్చర్యకర శబ్దం వచ్చేసింది. చాలా చిన్నప్పుడు మా ఊర్లో వాగు పొంగడం చూసి కూడా ఇలాగే బోలెడు ఆశ్చర్యపోయాననుకోండి.

ఆ తర్వాత అడపాదడపా సముద్రం నాకు కనిపిస్తూనే ఉంది. కాదు, కాదు సముద్రానికే నేను కనబడుతునే ఉన్నాను. ఇది కరెక్ట్.

ఆ తర్వాత బొంబాయిలో మేముండే హాస్టల్ సముద్రానికి అతి చేరువులోనే ఉండేది. కనుక, తరచుగా బీచ్‌కి వెళ్ళి కూర్చునే వాళ్లం. అలాగ సముద్రుడేదో మాకు ఫ్రెండ్ అయినట్లు ఫీలయ్యే వాళ్లం.

వాగొచ్చె వరదొచ్చె:

ఓసారి వేసవి సెలవులకు మా ఊరు వెళ్లడం వల్ల వాగు పొంగు గురించి తెలిసింది. వేసవే అయినా ఒక్కోసారి ఏప్రిల్, మే నెలల్లో కూడా తుపాన్లు వచ్చేవి. జోరు వానలతో వాగులు పొంగేవి. మా ఊరికి పక్కనే వాగు ప్రవహిస్తుంటుంది. మామూలు రోజుల్లో అయితే అక్కడో వాగు ఉన్నట్లు గుర్తించే లోపే వాగు దాటేస్తుంటాము. అదే వాగు పొంగితే మాత్రం సమీపంలోని పట్టణానికీ ఈ పల్లెటూరుకీ మధ్య సంబంధాలు కట్ అయిపోతాయి. అలా మేము అక్కడ ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు జరిగింది కూడా. వంతెనలు లేని రోజుల్లో వానాకాలంలో ఒక ఊరి నుంచి మరో ఊరు వెళ్లాలంటే చాలా కష్టమే. మరీ ముఖ్యంగా మధ్యలో వాగులూ, ఏర్లు, నదులు ఉంటే ఎక్కడి వాళ్లు అక్కడ గప్‌చుప్.

అలా వాగుకి వరదొచ్చినప్పుడు ఊర్లోని పిల్లలతోపాటు నేనూ చాలా దగ్గరి దాకా వెళ్ళి చూశాను. ‘అమ్మో’ అంటూ ఆశ్చర్యపోయాను. ఎటు చూసినా నీళ్లే. ఊర్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని ఇళ్లు మునిగాయని చెప్పేవారు. ఏ అర్ధరాత్రో నీటి ప్రవాహం ఉర్లోకి వచ్చి, ఊరంతా మునిగిపోతుందన్న భయం వ్యాపించేది. అసలే రకరకాల భయాలతో కాలం వెల్లబుచ్చుతున్న నాబోటి పిల్లలకు ఈ వరద భయం రాత్రిళ్లు నిద్ర పోనిచ్చేది కాదు.

అలాంటప్పుడు మరో ఇబ్బంది కూడా ఎదురయ్యేది. వానలు, వరదలు రానంత వరకు ఆరుబయటనే మంచాలు వేసుకుని పడుకునే వాళ్లం. ఇప్పుడేమో వరదొచ్చిందాయె, పైగా ఏ రాత్రికో వరద నీరు ఇంటి దాకా వస్తే మంచాలతో సహా కొట్టుకుపోమూ.. అదీ మా భయం. అందుకే ఇంట్లోనే గుడ్డి దీపాల వెలుగులోనే బిక్కుబిక్కు మంటూ పడుకునే వాళ్లం. తెల్లారిన తర్వాత ‘అమ్మయ్యా, బతికే ఉన్నాం’ అనుకుంటూ ఊపిరి పీల్చుకునే వాళ్లం.

తువ్వాయి తువ్వాయి:

తుపాను వర్షంతో పల్లె వణకిపోతున్నది. ఎవ్వరూ బయటకు వెళ్లే వీలు లేదు. పశువుల కొష్టంలో ఆవులు, ఎద్దులు కూడా బిక్కుబిక్కు మంటూ చూస్తుండేవి. మాకు ఓ పదకొండు దాకా ఆవులు ఉండేవి. రెండు జతల ఎద్దులు, చిన్న చిన్న కోడె దూడలు కూడా ఉండేవి. వాటన్నింటినీ కొష్టం కట్టేసే వారు. కొష్టం పెద్దదే అయినా అన్నిపశువులు హాయిగా పడుకోవడానికి జాగా సరిపోయేది కాదు. అందుకే ఆరు బయట కూడా గుంజలు పాతి వాటిని కట్టేసేవారు. ఒక ఆవు ఆ మధ్యనే ఈనింది. దానికి బుల్లి దూడ పుట్టింది. అది ఎంత ముద్దుగా ఉండేదో. ఛంగు ఛంగున ఎగిరేది. నేనూ దానితో పాటు గెంతేవాడిని. నన్ను కవ్వించేది. చేతికి చిక్కేది కాదు. కానీ అంతలోనే నా దగ్గరకు వచ్చేది. ఇలా అది నాకు మంచి ఫ్రెండ్ అయింది. దీంతో ఆడుకోవడం నాకెంతో ఇష్టం. పగటి పూట ఆ దూడని కట్టేసిన చోటనే మంచం వాల్చుకుని పడుకునే వాడ్ని. ఎందుకో తెలియదుగానీ ఆ తువ్వాయికీ నేనంతే అంతే ఇష్టం. అది తన ప్రేమను చాటడానికి మంచం మీద పడుకుని ఉంటే నా కాలుని పదేపదే నాకుతుండేది. దీంతో నాకూ దాని మీద బోలెడు ప్రేమ కలిగేది.

తుపాను హోరు. జోరు వాన. ఆ రోజున.. నా ఫ్రెండ్ తువ్వాయి కొష్టంలోనే ఉన్నా తడిసి ముద్దయి, చలికి వణకిపోతున్నది. అది జాలిగా నా వంకే చూస్తున్నట్లనిపించింది.

దాన్ని ఎలాగైనా సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నది నా ప్లాన్. సురక్షిత ప్రాంతం వంటి పదాలు అప్పట్లో నాకు తెలియకపోయినా దాన్ని గాలి వాన నుంచి కాపాడాలనుకున్నాను. ఇదే విషయం ముందుగా బామ్మకు చెప్పాను. బామ్మ నవ్వి ఊరుకుంది. అమ్మకు చెబితే జీతగాడికి చెప్పమంది. వాడికి చెబితే ‘కుదరదబ్బాయి గారూ’ అంటూ సున్నితంగా నా ప్లాన్‌కి బ్రేక్ కొట్టాడు. నాకు బాధేసింది. వీడికి నా ఫ్రెండ్ తువ్వాయి మీద ఏ మాత్రం జాలి లేదని డిసైడ్ అయిపోయాను. ‘వీడికి తువ్వాయి మీద ప్రేమ లేదు, వీడో విలన్ గాడు’ – అనుకున్నాను. ఎలాగైనా నా ఫ్రెండ్ ని రక్షించాలి. అంతే..

పగలంతా ఎలాగో కొష్టంలో ఉన్నా రాత్రి పూటైనా దాన్ని మనతో పాటుగా ఇంట్లో నేను పడుకునే మంచం పక్కనే ఉంచుకోవాలన్నది నా లక్ష్యం. ఇదే జీవితాశయం అన్న లెవల్‌లో ఆలోచించడం మొదలెట్టాను. ఎవరి మాట వినదలచుకోలేదు. సాయంత్రం ఏడు కాగానే ఆ మసక వెలుతురులో కొట్టంలోకి వెళ్ళాను. దాదాపుగా ఆవులు, కోడె దూడలు.. అన్నీ గాలి వానకు తడిసిపోయాయి. పెంకులు కప్పిన కొష్టమే అయినా చుట్టూ గోడలు ఉండవు కనుక వానకు గాలి కూడా తోడైతే నేలంతా బురద బురద అయ్యేది. ఆ బురదలోనే పాపం ఆవులు, ఎద్దులు, మా తువ్వాయి వంటివి పడుకునేవి. నేను కొష్టంలోకి అడుగు పెట్టగానే నా ఫ్రెండ్ తువ్వాయి తన సన్నటి గొంతుతో ‘అంబా’ అన్నాడు. అది నన్నే ఆర్తితో పిలుస్తుందన్న ఫీలింగ్ వచ్చి ఒళ్లు పులకించింది. తువ్వాయిని కట్టేసిన తాడుని గుంజ వైపున విప్పి, దాన్ని నెమ్మదిగా ఇంటి ముందున్న మెట్లు ఎక్కించి ఇంట్లోని ఓ గదిలోకి తీసుకు వచ్చాను. అది కూడా నా పట్ల బోలెడు నమ్మకం పెట్టుకున్నట్లుంది. నేనేదో దాని రక్షకుడినన్నట్లు నా వెంట వచ్చేసింది. ఇంట్లోకి తీసుకు వెళ్ళి మంచం కోడుకి దాన్ని కట్టేశాను. ‘హమ్మయ్యా..’ ఊపిరి పీల్చుకున్నాను.

అప్పుడు కలిగిన సంతృప్తిని ఇప్పటికీ నేను మరచిపోలేను. ఏదో విజయం సాధించానన్న తృప్తి. ఆనందంతో పడుకున్నాను. కళ్లు మూతలు పడుతున్నాయి. మధ్యమధ్యలో తువ్వాయి నా కాలు నాకుతున్నట్లు తెలుస్తూనే ఉంది. అంతలో నిద్ర పట్టేసింది. తెల్లవారింది. లేచి చూస్తే తువ్వాయి నా మంచం దగ్గర లేదు. నేను కంగారుగా మంచం దిగి అటూ ఇటూ చూశాను. ఆ తర్వాత తెలిసింది, మనం ఇలా పడుకోగానే అలా జీతగాడు వచ్చేసి దాన్ని విడిపించి కొష్టం లోకి వదిలేశాడని. ‘వాడెందుకు అలా చేశాడు? తువ్వాయినీ నన్ను వేరు చేసిన వీడిని వదిలిపెట్ట కూడదు. పెద్దయ్యాక బోలెడు బలం వస్తుందిగా, అప్పుడు వాడ్ని చితక్కొడతాను’ అనుకుంటూ బక్క చేతులకి బాగా బలం పట్టాలని దేవుడిన్ని కోరుకున్నాను.

జీత గాడి మీద అమ్మకు ఫిర్యాదు లాంటిది చేస్తే అమ్మ ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. కానీ నా తల నిమిరింది ప్రేమగా. దీంతో నాలో కోపం మటుమాయమైంది. అమ్మని ప్రేమతో చుట్టేశాను. సరిగా అప్పుడే కొట్టంలో తువ్వాయి కూడా వాళ్లమ్మ దగ్గర గారాలు పోతూ పాలు తాగుతూ కనిపించింది. తల్లి ఆవు కూడా దూడని ప్రేమగా నాకుతూ కనిపించింది. ఆ దృశ్యం ఇప్పటికీ నేను మరచిపోలేదు. జీతగాడు ఎందుకు తువ్వాయిని వదిలేశాడన్నది అప్పుడు ఆ చిన్న వయసులో అర్థం కాలేదు. కానీ తువ్వాయిలు అమ్మ చాటునే ఉండాలి. అమ్మ లోకమే వాటికి సురక్షితమన్న సంగతి ఆ తర్వాత నాకు అర్థమైంది.

‘ఛంగు ఛంగున గెంతులు వేయండి.

ఓ జాజి వన్నె బుజ్జాయిల్లారా..

నోరు లేని తువ్వాయిల్లారా..’

పాత సినిమాలోని ఈ పాట అంటే అందుకే నాకిష్టం. అసలు తువ్వాయి అన్న పదం నాకెంత ఇష్టమంటే మా అమ్మాయిని ఇప్పటికీ తువ్వాయి అని పిలిచేటంత.

వరదలు – పెళ్ళిళ్ళు

నదులు, ఏరులు, వాగులను దాటడానికి వంతెనలు చాలా చోట్ల లేని రోజులవి. ఒక ఊరికీ, మరో ఊరికీ మధ్య ఏరులూ నదులు లేదా వాగులూ వంకలు అడ్డం వస్తే వానా కాలంలో ప్రయాణం చాలా కష్టం. చాలా చోట్ల పడవలు తిప్పే వారు కాదు. ఒక వేళ పడవ సౌకర్యం ఉన్నా చాలా ప్రమాదకరంగా ప్రయాణం సాగేది. ఈ తరహా అడ్డంకుల వల్లనే ఆచార వ్యవహారాలు కూడా ఒక ఊరికీ దాని పక్కనే ఉన్న మరో ఊరికీ చాలా తేడాలు రావడానికి కారణమై ఉంటుందని అనుకునే వాడ్ని. చదువు కోసమో పెళ్ళి సంబంధాల కోసమో నదులు ఏరులు దాటడానికి పెద్ద వాళ్లు ఇష్టపడేవారు కారు. దీంతో ఊర్లో ఉన్న బడి తోనే చదువు ఆపేయాల్సి వచ్చేది. ఇక పెళ్ళి సంబంధాలు కూడా ఆ ప్రాంతానికే పరిమిత మయ్యేవి. ఈ కారణంగానే దగ్గరి సంబంధం చేసుకోవడమే మంచిదన్న సంప్రదాయం వచ్చిందని నాకు ఆ తర్వాత కాలంలో అనిపించేది. ఆ రోజుల్లో మేనరికాలు బాగా జరిగేవి. చాలా చోట్ల దగ్గరి బంధువులంతా ఒకే ఊర్లో ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలసి మెలసి ఉండటం వల్ల బావా మరదల్ల మధ్య అనురాగ బంధం ఏర్పడుతుండేది. ఇది ప్రేమ – పెళ్ళికి దారి తీస్తుండేదని చెప్పేవారు. తెలిసిన సంబందం అయితే ఆ జంట మన కళ్లెదుట ఉంటారన్న అభిప్రాయం ఆ రోజుల్లో బాగా ఉండేది.

‘దూరం’ సంబంధం చేసుకుంటే వచ్చే కష్టాలు ఇన్నీ అన్నీ కావని అభిప్రాయ పడేవారు. దూరం అంటే వాగులు, ఏరులు, నదులు దాటి వెళ్ళేటంతటి దూరం అని చెప్పేవారు. ఏటవతల లేదా నది ఆవల సంబంధాలు వద్దనే వారు. వరదలొచ్చి రెండు ఊర్ల మధ్య సంబంధాలు తెగిపోతే కనీసం క్షేమ సమాచారం కూడా తెలిసేది కాదు. వరదలొచ్చినప్పుడు పోస్ట్ కూడా వారం పది రోజుల తర్వాతగానీ వచ్చేది కాదు.

ఓసారి, పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయింది. పెళ్ళి కొడుకుదేమో గుంటూరు జిల్లా. పెళ్ళి కూతురేమో కృష్ణా జిల్లాలోని ఓ మారు మూల గ్రామం. ఇలాంటప్పుడు పెళ్ళి సవ్యంగా జరిగేదాకా, పెళ్ళి కూతురు కాపురానికి అత్తవారింటికి క్షేమంగా చేరే దాకా అమ్మాయి వైపు వారికి దిగులు పడటం నేను ప్రత్యక్షంగా చూశాను. పెళ్ళి సంబంధం కుదిరినప్పటి నుంచీ వరదలు రాకుండా చూడమని మొక్కుకునే వారు. పెళ్ళికని బండ్లు కట్టుకుని బయలుదేరిన వారు వరద నీటిలో గల్లంతయ్యారన్న వార్తలు ఆ రోజుల్లో తరచూ వినబడుతుండేవి. ఆనకట్టలు, వంతెనలు వచ్చాక క్రమక్రమంగా పరిస్థితి మారింది. దూరం సంబంధాలు ఇచ్చి పుచ్చుకోవడం మొదలైంది. చివరకిది ఖండాంతర సంబంధాలు చేసుకునే దాకా వెళ్ళిందనుకోండి.

పందిట్లో పెళ్ళవుతున్నాది..:

నేను బాగా చిన్నప్పుడు చూసిన ఓ పెళ్ళి సందడి ఇప్పటికీ గుర్తుంది. మా పల్లెటూరులో మా నాన్నగారి ఆధ్వర్యంలో జరిగిన పెళ్ళి తంతు ఇది. దగ్గరి బంధువు తన కూతురు పెళ్ళికి సాయం చేయాలని కోరడంతో ఆ బరువు బాధ్యతలను నాన్నగారు తీసుకున్నారు. ఎండాకాలం పెళ్ళి అది. పల్లెలోని మా ఇంటి ముందు ఉన్న విశాల ఆవరణలో తాటాకులతో చలువ పందిరి వేయించారు. దీని కోసం ఓ బండెడు తాటాకులు తీసుకొచ్చారు. అవన్నీ ఇంటి ఆవరణలో ఓ మూల గుట్టగా పోశారు. వాటి మీద నీళ్లు జల్లారు. ఈ లోగా గుంజలు పాతారు. చూస్తుండగానే తాటాకు పందిరి తయారై పోతున్నది. తాటాకుల నుంచి వచ్చిన అదో రకం వాసన పీలుస్తూ మేమంతా కొత్త అనుభూతికి లోనయ్యాం. తాటాకులతో బొమ్మలు చేయమని అమ్మ చుట్టూ గుమిగూడాము. అమ్మేమో తాటాకులతో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు బొమ్మలు తయారు చేసి నాకొకటి, మా అక్కకొకటి ఇచ్చింది.

ఈ పెళ్ళి జరిగే సమయానికి ఇంట్లో కరెంట్ వచ్చింది. కానీ ఇప్పట్లో లాగా ఇళ్లలో ట్యూబ్ లైట్స్ ఉండేవి కావు. మామూలు లైట్లే ఉండేవి. అవి కూడా ఒకటో రెండో ఉండేవి. రాత్రి పూట జీరో క్యాండిల్ బెడ్ లైట్ ఉండేది. ‘ఎక్కువ లైట్లు వెలిగిస్తే కరెంట్ బిల్లు పెరిగిపోతుంది, ఆపేయండిరా’ అని మా బామ్మ అరుస్తుండేది. అలాంటప్పుడు ఉన్నట్లుండి తాటాకు పందిరికి పాతిన గుంజలకు ట్యూబ్ లైట్లు వెలిగాయి. నాకైతే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. బోలెడు ఆశ్చర్యం. దాదాపుగా ప్రతి గుంజకీ ఒక ట్యూబ్ లైట్ బిగించారు. కొన్ని లైట్లకు ఎరుపు మరికొన్నింటికి పసుపు ఇంకొన్నిటికి ఆకు పచ్చ రంగుల్లోని పలచటి కాగితాలను చుట్టారు. దీంతో రకరకాల రంగుల్లో ట్యూబ్ లైట్లు వెలగ్గానే మా పిల్ల గ్యాంగ్ కేరింతలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గుంజల మధ్య తిరుగుతూ రాత్రి పొద్దుపోయేదాకా ఆటలే ఆటలు. మర్నాడు పెళ్ళనగా ముందు రోజు రాత్రికే పందిరంతా మామిడి తోరణాలు కట్టేశారు. ఒక వైపున పెద్ద బల్ల వేశారు. దాని మీదనే పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు కూర్చుని పెళ్ళి చేసుకుంటారని తెలిసింది. ‘పెద్దయితే నీకు అలాగే పెళ్ళి చేస్తారులేరా’ అంటూ నా ఫ్రెండ్ ఒకడు అన్నప్పుడు నాకు నేను హీరోగా ఫీలయ్యాను. అయితే అప్పుడు నా హీరోయిన్ ఎక్కడుందో తెలియదనుకోండి. ఇలాగే బల్లమీదనే పెళ్ళి చేసుకోవాలని మాత్రం గట్టిగా అనుకున్నాను. కానీ అలా జరగలేదు. గుంటూరు కృష్ణనగర్ బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది మా పెళ్ళి. మా ఊరి పెళ్ళి తంతు దగ్గరకే మళ్ళీ వెళదాం..

తీరని దుఃఖం:

పెళ్ళి అవగానే అప్పగింతలన్నారు. పెళ్ళి కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందట. దీన్నే అప్పగింతలు అంటారని చెప్పారు. ఉన్నట్టుండి ఏడుపులు వినబడుతున్నాయి. మగవాళ్లు ఆడవారిని ఓదారుస్తున్నారు. ఇదంతా చూసి నాకూ దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీరు కారుతోంది.

కానీ ఇంతకు మించిన దుఃఖం ఆ తర్వాత రెండో రోజున వచ్చింది. కళ్ల ముందు ఘోరం జరిగిపోయింది. ఉన్నట్టుండి పందిరి కోసం వేసిన తాటాకులు లాగేస్తున్నారు.. పందిరి పీకేస్తున్నారు. గుంజలు గుంజేస్తున్నారు. అప్పటి దాకా నన్ను మురిపించిన నా ప్రియమైన ట్యూబ్ లైట్లును నిర్దాక్షిణ్యంగా ఊడదీయడంతో నా ముఖంలో వెలుగు మాయమైంది. చూస్తుండగానే తాటాకులు, గుంజలు తాళ్ళు అన్నీ ఎడ్ల బండి ఎక్కేశాయి. అప్పటి దాకా కళకళ లాడిన ఆవరణ బోసిపోయింది. అప్పుడొచ్చింది, బోలెడు దుఃఖం. అమ్మ ఒక వైపు, బామ్మ మరో వైపు చేరి ఒకరేమో తల, మరొకరేమో వెన్ను నిమిరారు.

మబ్బు చాటున సూరీడు:

‘మబ్బులు పట్టాయి. ఎప్పుడైనా వర్షం పడుతుందిరా, తడిసేవి ఏవైనా ఉంటే లోపల పెట్టేయ్..’ అంటూ మా బామ్మ జీతగాడితో చెప్పడం చాలా సార్లే విన్నాను. మా బామ్మ తరచూ బయటకి వచ్చి సూర్యుడున్నాడా లేడా అని చూస్తుండేది. ఆమెకి ఇదో అలవాటనుకున్నాను. కానీ, సూర్యబింబం కనబడకపోతే ఆమె అన్నం తినదు. మిట్ట మధ్యాహ్నమైనా మబ్బుల్లో దాగిన సూర్యుడు కనబడక బామ్మ చీటికీ మాటికీ బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తుంటే మాకు బామ్మ మీద బోలెడు జాలి కలిగేది. ఆకాశం వైపు వేలు చూపిస్తూ – ఇదిగో బామ్మా సూర్యుడు ఇక్కడున్నాడంటూ అబద్ధం చెబుతుంటే, ‘ఎక్కడరా నాకు కనబడడే..’ అంటూ ‘ఆకలి బామ్మ’ ఆతురతగా చూసేది. మొత్తానికి సూర్యబింబం చూశాకనే ముద్ద ముట్టేది.

‘మనకు అన్నం, నీళ్లు ఆ సూర్యభగవానుడే అందిస్తున్నాడ్రా’ అని బామ్మ అంటుంటే నాకు ఆశ్చర్యమేసేది. సూర్యుడు వచ్చి అన్నం వండటం లేదు కదా, అలాగే బావిలోని నీరు తోడి ఇవ్వడం లేదు కదా. మరెందుకు బామ్మ ఇలా అంటుందో తెలిసేది కాదు. ఆ తర్వాత అప్పటి తరం వారి మాటల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉన్నదన్న విషయం అర్థమైంది.

పాఁతరలు – పల్లె సిరులు:

అడవి రావులపాడులో ఇంటి ముందు ఆవరణలో రెండు పాఁతరలు ఉండేవి. పాఁతర్లలోనే జొన్నలు, కందులు వంటివి నిలవ చేసేవారు. పంట బాగా పండినప్పుడు ఇంట్లో బస్తాల్లోనే కాకుండా ఏడాది పొడవునా నిల్వ ఉండేందుకు ఈ పాతర్లలో ధాన్యం పోసేవారు. ఇదంతా పెద్ద ప్రక్రియ. అసలు పాఁతరని నిర్మించడంలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నదని ఇప్పుడనిపిస్తోంది. భూమిలో పది నుంచి పదిహేను అడుగుల మేరకు గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యి గుండ్రంగా ఉండేటట్లు చూసుకుంటారు. ఆ తర్వాత లోపల రెండు మూడు వరసల్లో వరి గడ్డి తాళ్లతో చుడతారు. ఆ తర్వాత పాఁతరలో ధాన్యం పోస్తారు. అలా పోసిన ధాన్యం చెడిపోదు. ఇదీ దాని స్పెషాలటీ.

రెండు పాఁతర్లు మాకుండేవని చెప్పాను కదా. అందులో ఒకటి జొన్నల పాతర అయితే మరొకటి కందుల పాఁతరన్న మాట. మా ప్రాంతంలో వరి ధాన్యం ఎక్కువగా పండదు. దాదాపు అన్నీ మెట్ట పొలాలే. వాణిజ్య పంటలపై మోజు పెరగడానికి ముందంతా సాంప్రదాయ పంటల వైపే రైతులు మొగ్గు చూపే వారు. పాఁతర్లలో ధాన్యం నింపడం ఓ యజ్జ్ఞంలా సాగేది. ఎడ్ల బండి మీద నేరుగా పొలం నుంచి ఇంటికి ధాన్యం బస్తాలు చేరేవి. వాటిని పని వాళ్లు వొడుపుగా దింపి అంతే నేర్పుగా బస్తాల మూతులు విప్పి ఆ ధాన్యాన్ని పాఁతరలో పోసేవారు. పాఁతర లోపలకు ఒకరిద్దరు మనుషులు దిగి ధాన్యం ఒక పద్ధతి ప్రకారం పాతరలో నిండేలా చూసేవారు. పెసల పంట కూడా బాగానే పండేది. ఒక్కోసారి పెసలు కూడా పాఁతర లాంటిది ఏర్పాటు చేసేవారు. మొత్తానికి పాఁతర్లలోకి ధాన్యం ఎక్కించడం, అదంతా చూస్తుంటే నా బోటి పిల్లలకు భలే సరదాగా ఉండేది. నేను కూడా పాఁతర్లోకి దూకేసి వాళ్లకు సాయం చేయాలనుకునే వాడ్ని. కానీ నా ప్రయత్నాలు ఒక్కటి.. ఒక్కటంటే ఒక్కసారి ఫలించలేదు. పాఁతర దగ్గరకు వెళ్లకురా, జారి పడతావు.. అంటూ బామ్మ హెచ్చరించేది. మొత్తానికి పాఁతర్లలోకి ధాన్యం నింపడమూ, మళ్ళీ పాఁతర తవ్వి ధాన్యం తీయడం ఇంటి ముందు ఓ పండుగ వాతావరణాన్ని సృష్టించేది. అయ్యగారింట పాఁతర తీస్తున్నారన్న వార్త తెలియగానే పొలంలో పనిచేసే వారి దగ్గర నుంచి ఇంత కాలంగా పద్దు రాసుకుంటూ సరుకులు ఇచ్చిన చిల్లర కొట్టు వారి వరకు అంతా ఇంటి ముందు గుమిగూడేవారు. ఆ రోజుల్లో డబ్బులు (నోట్లు) ఇవ్వడం కంటే ఇలా వస్తు రూపంలోనే బాకీలు, జీతాలు ఇచ్చేస్తుండేవారు.

పాఁతర్లు ఏ ఇంట ఉంటాయే ఆ ఇంట ధన లక్ష్మి ఆనంద నాట్యం చేస్తుందనీ, పాఁతరలే పల్లె సిరులని మా అమ్మ అంటుండేది.

పాఁతర తీస్తున్నప్పుడు వర్షం పడితే ధాన్యం తడిసిపోతుంది. అందుకే వానాకాలం ఆ పని చేయరు. ఎండాకాలమైనా మబ్బులు గిబ్బులు పట్టని రోజు ఎంచుకునే వారు. అయినా ఒక్కోసారి అకాల వర్షాలు పడుతుండేవి. అలాంటప్పుడు పాఁతర తీసి ఉంటే అందరి కళ్లలో ఆందోళన కనిపించేది.

అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినా ధాన్యం తడవకుండా ఉండేందుకు పెద్ద పెద్ద పట్టాలు కప్పేవారు. ఆ హడావుడి అంతా ఇంతా కాదు. వాన తగ్గాక మళ్ళీ పాఁతరలోకి దిగేవారు.

అందుకే వాన చుక్క రాలుతుండగానే మా బామ్మ జీతగాడిని హెచ్చరిస్తుండేది. అలా ఓసారి చుక్కలు చుక్కలుగా పడటం మొదలైన వాన ఏకబిగిన వారం రోజుల పాటు కురిసింది. దీన్ని ముసురు అంటారని బామ్మ చెప్పింది.

తడిసిన బతుకులు:

ముసురు పడితే మేము బయటకు వెళ్ళి ఆడుకోవడం చాలా కష్టం. బయటంతా బురద బురద. పెంకిటిల్లు కావడంతో అక్కడక్కడా పై కప్పు మీదున్న పెంకులు కదలడంతో వాన నీరు ఇంట్లో పడుతుండేది. తడిసి పోతే ఎందుకూ పనికి రావనే వాటిని జాగ్రత్త చేయడం వంటి పనులు చకచకా జరిగిపోవాలి. పొయ్యి క్రింద మంట కోసం పెట్టే ఎండిన పుల్లలు తడిస్తే ఆ రోజు స్నానాలకీ వంటకి ఇబ్బంది మరి. రాత్రి పడుకోవడానికి మంచాలు వాల్చడమూ ఇబ్బందే. వాన కురవకుండా ఉండే చోటని మాకు మంచాలు వేసినా ఏ అర్థరాత్రో వాన నీటి చుక్కలు ముఖం మీద పడి లేచే వాళ్లం. ఇలాంటి ఇబ్బందులు ఆ రోజుల్లో దాదాపు ప్రతి పల్లెలో ఉండేవి.

వానలు – వరదలు గురించి చెబుతున్న నాకు ఇంకా ఎన్నో విషయాలు గుర్తుకు వస్తున్నాయి. మరి కొన్ని తర్వాత మీతో పంచుకుంటాను. వానలు వరదలతో మేము పడ్డ కష్టాలు నిజానికి కష్టాలే కావని నిత్యం నీటి మీద ‘తడిసిన బతుకులు’ వెళ్లదీస్తున్న వారి (మత్స్యకారుల) కష్టాలతో పోల్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ ఆలోచనే ఒక ప్రముఖ దిన పత్రికలో ఆ తర్వాత కాలంలో వ్యాసం రాయడానికి దారి తీసింది.

ఫుట్ నోట్:

12.క్లిక్ థర్డ్ కెమేరా:

డిజిటల్ విధానంలో ఫోటోలు తీయడం తెలిసిన ఈ రోజు పిల్లలకు ఒకప్పుడు క్లిక్ థర్డ్ కెమేరాలు ఉండేవంటే నమ్మక పోవచ్చు. 1960- 70 దశకంలో ఈ కెమేరాదే హవా. నా క్లోజ్ ఫ్రెండ్ (విష్ణు) వద్ద ఆ రోజుల్లోనే ఇలాంటి కెమేరా ఉండేది. వాడికెందుకో ఫోటోలు తీయడమంటే బాగా ఇష్టం. ఈ కెమేరాలో రీల్ ఎక్కించడం ఓ ఆర్ట్ అనే వాడు. ఎక్కువ ఫిల్మ్ లు వేస్ట్ కాకుండా నేర్పుగా ఫిల్మ్‌ని కెమేరాలో బంధించి మూత వేసేయాలి. ఫిల్మ్‌కి సూర్యరశ్మి సోకితే ఇక అది ఎక్స్‌పోజ్ అయిపోతుంది. డబ్బులు వేస్టే. కెమేరా గురించి చాలా విషయాలే అప్పట్లో చెప్పాడు. కానీ టెక్నాలజీ పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని నాకు వాడి మాటలు అర్థం అయ్యేవి కావు.

నా ఆలోచనలు వేరే రకంగా ఉండేవి. ఈ కెమేరాతో నాకు నచ్చిన ఫోటోలు తీయమనేవాడ్ని. పాపం వాడు తీసేవాడు. నందిగామ ఏరు పొంగినప్పుడు నా కోసం ఫోటోలు తీసింది వాడే. నీటి చుట్టూ తిరిగిన నా ఆలోచనలను నెమ్మదిగా నాటు పడవల వైపు మళ్ళిస్తాను. కదిలిస్తే పడవలు కూడా కథలు చెబుతాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here