[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ పడవకెంత దిగులో..:
ఆ రాత్రి టైమ్ తెలియడం లేదు. చేతికి వాచీ కూడా లేదు. కొత్త చోటు కావడంతో నిద్ర రావడం లేదు. సముద్రపు గాలి ఈడ్చి తంతున్నట్లుంది. అలల ఘోషకి చెవులు చిల్లులు పడతాయేమో అనిపిస్తోంది.
అసలు, నేనెందుకు ఇక్కడి వచ్చాను? చీకటి పడక ముందే వెళ్లకుండా ఎందుకిక్కడే ఉండిపోయాను?
గాలి బాగా వీస్తుండటంతో చమట పట్టకపోయినా శరీరమంతా ఏదో ఉప్పులో నానబెట్టినట్లు అయిపోయింది. పైగా చేపల వాసన గుప్పుమంటోంది. ఇది గతంలో నాకెప్పుడూ అలవాటైన వాసన కాదు. ఇంటి పై కప్పు వైపు చూశాను. తాటాకుల పాక అది. పాకకు ఒక్కటే ద్వారం. తలుపులు, గడియలు లేవు. ఏదో పాత చీర అడ్డు తెరగా కట్టినట్లున్నారు. అది కాస్తా ఈదురు గాలికి పైకి క్రిందకీ ఎగిరెగిరి పడుతోంది. అలా తెర లేచినప్పుడల్లా ఆకాశం నాకు కనబడుతూనే ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. శుక్లపక్ష ఏకాదశి చంద్రుడు లేత మేఘాల నడుమ ఆడుకుంటూ పరిగెత్తుతున్నాడు. పరిగెత్తే ఆలోచనలు నిద్రని రానివ్వడంలేదు.
తప్పు చేశానా?
ఇలా ఒంటరిగా వచ్చి
తప్పు చేశానా??
అప్పటి వరకు జరిగిందంతా సినిమా రీల్ వెనక్కి తిప్పినట్లు కళ్ల ముందు కనబడుతోంది.
అదో మత్స్యకారుల పల్లె. విశాఖకి చేరువలోనే ఉన్నదది. గంగపుత్రుల వ్యథలకు ప్రత్యక్ష సాక్షి.
అది 80వ దశకం తొలినాళ్ళు. బోటనీలో పిజీ పూర్తి చేసుకుని బొంబాయి నుంచి నందిగామ వచ్చేశాను. రీసెర్చ్ చేయాలన్నది నా తపన. అలా అని బొంబాయి మళ్ళీ వెళ్లాలనిపించలేదు. అందుకే ఆంధ్రా యూనివర్శిటీలో ప్రయత్నాలు మొదలెట్టాను. ఆ సమయంలోనే ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్‌కి రమ్మనమని పిలుపు వచ్చింది. దారం దొరికింది. అదే చాలని విశాఖ వెళ్ళాను. అలా కొంత కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగింది. మత్స్యకారుల పల్లెలో గంగపుత్రులతో మాట్లాడుతుంటే టైమ్ తెలియలేదు. వారి కష్టాలు చూసి నా మనసు కరిగిపోయింది. విశాఖ తీరం వెంబడి ఇలాంటి పల్లెలు చాలానే ఉన్నాయి. వాటి పేర్లు కూడా చిత్రంగానే అనిపించాయి. వాటిలో ఒక పల్లెకి నేనూ నా మిత్రుడితో కలిసి రావడం ఓ అలవాటుగా మారింది. ఎందుకంటే.. రీసెర్చ్ పని కూడా ఆ పల్లెలతో ముడిపడి ఉంది కనుక.
సైన్స్ పరంగా రీసెర్చ్ చేయడానికని వెళ్ళినవాడిని గంగపుత్రుల వ్యథలకు చలించిపోయాను. రెండు సార్లు నాతోపాటు వచ్చిన మిత్రుడి దగ్గర ఓ కెమేరా ఉండేది. అది గొప్పదేమీ కాదు. క్లిక్ థర్డ్ కెమేరానే. నా దగ్గర అది కూడా లేదు. అతణ్ణి బతిమాలి నా వెంట తీసుకువచ్చి మత్స్యకారుల జీవన స్థితిగతులను కెమేరాలో బంధించే ప్రయత్నం చేశాను.
మూడోసారి మిత్రుడు రాలేదు. నేనే ఒంటరిగానే ఆ పల్లెకి చేరుకున్నాను. చూస్తుండగానే సూర్యుడు అస్తమించాడు. అప్పటికే రెండు సార్లు అదే పల్లెకు రావడం వల్ల అక్కడి వాళ్లు నాతో ప్రేమగానే మాట్లాడటం మొదలెట్టారు. వారి కష్టసుఖాలు చెప్పారు. రోజూ బోలెడన్ని చేపలు పడుతున్నా మీ బతుకులు ఎందుకిలా ఉన్నాయన్న ప్రశ్నకు వారేదో చెప్పారు. వారి యాస నాకు సరిగా అర్థమయ్యేది కాదు. అయినా శ్రద్ధగా విన్నాను. వారి బాధలు అర్థం చేసుకోవడానికి కొద్ది రోజులు పట్టింది. వారి జీవన చిత్రం ఛిద్రమవ్వడంలో జూవాలజీ, బోటనీ ‘విలన్’ పాత్రలు పోషిస్తున్నాయన్నది అర్థమైంది. దీంతో మా ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం కూడా అర్థమైంది. మత్స్యకారుల జీవన స్థితిగతులు దుర్భరంగా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ కనుక్కోవడమే మా లక్ష్యం.
చిల్లులు పడిన పడవల నుంచి శాంపిల్స్ సేకరించి పడవలు జల్లెడగా మారడానికి కారణాలు ఏమిటీ? అలా జరగకుండా ఆపడం ఎలా? అన్నది మేము చేయాల్సిన పని. కానీ నేను ఈ శాంపిల్స్ కలెక్షన్, వాటిని మైక్రోస్కోప్ క్రింద ఉంచి స్టడీ చేయడాలు వంటి వాటి కన్నా ఆ పల్లెవాసుల కష్టాలు, వారి ఆచారాలు తెలుసుకోవడం వైపు ఎక్కువగా మొగ్గు చూపాను. అందుకే సాయంత్రం వేళల్లో తీరిక చేసుకుని సముద్ర తీరం చేరుకుని మత్స్యకారులను కలుసుకునే వాడ్ని.
ఇప్పుడూ అదే జరిగింది. మూడోసారి ఒంటరిగా మత్స్యకారుల పల్లెకు చేరిన నేను చీకటి పడటం గమనించలేదు. వారితో మాటలు ఆగలేదు. నాకు ఆకలేస్తోంది. అది వారు గ్రహించినట్లున్నారు. పచ్చి ఉల్లిపాయ, మిరపకాయ, అన్నం కలిపిన మజ్జిగ వంటివి ఇచ్చారు. చేపల పులుసు వంటివి ఉన్నాయని వారు చెప్పలేదు. ఎందుకంటే వారికి అప్పటికే తెలుసు. నేను శాకాహారినని. పైగా బ్రాహ్మాణ కుటుంబం నుంచి వచ్చానని తెలిసి వారు నా పట్ల మరింత మర్యాద పూర్వకంగా ఉండేవారు. ఆకలి దంచికొట్టడంతో మజ్జిగ అన్నం తిన్నాను. ఆకలికి – మతం, కులం లేవన్న సంగతి అర్థమైంది. ఉల్లిపాయ నంజుకోలేదు. పచ్చి మిరపకాయ కొరకలేదు. కానీ ఉప్పు కలిపిన మజ్జిగ అన్నం తిన్నాను. నిజానికి ‘తిన్నాను’ అనే దానికంటే ‘తాగాను’ అన్న పదం కరెక్ట్. అలా నేను అన్నం తాగున్నంత సేపూ పల్లె పిల్లల్లో కొంత మంది నా చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోట లోని రాకుమారుడెవరో తప్పిపోయి పేటలోకి వచ్చాడన్నట్లు. వాళ్లలో ఒకడైతే రెండు పెద్ద చేపలను సన్నటి తాడుకి దండగా గుచ్చి ఆ చేపల దండను అదేదో పూల హారంలా మెడలో వేసుకుని మురిసిపోతున్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే ‘నీ మెడలో వేయనా’ అన్నట్లు మీదకు వంగాడు. చేపల వాసన ముక్కు దగ్గరకు రావడంతో వాంతి వచ్చినట్లయింది. ఇంతలో ఓ పెద్దాయన పిల్లాడ్ని మందలించి బయటకు తోలాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను.
పల్లెలోని మగవాళ్ళలో చాలా మంది గోచీలు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న మొగవాళ్లలో ప్యాంట్ షర్ట్ వేసుకున్నది నేనొక్కడినే.
నాకు చాలా మొహమాటంగా ఉంది. “నేను పోతానండి” అంటూ అప్పటికే నాలుగైదు సార్లు లేచాను. కానీ ప్రతి సారీ వారి ప్రేమకు బంధీనయ్యాను. అప్పుడే అర్థమైంది. కులం, మతం, పేద గొప్ప వీటన్నింటి కంటే మానవత్వం, ప్రేమ చాలా గొప్పవన్న సంగతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమగా పిలిస్తే ఎటువంటి భేద భావం చూపకుండా భోజనం చేయడం అలవాటైంది.
దీన్నే సమానత్వం, సమాధరణ అంటారని అప్పుడు ఆ పల్లెలోని ఆ పూరి గుడిసెలో వారితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు నాకు తెలియదు.
కర్ణ సినిమా కోసం సినారె వ్రాసిన ఈ పాట గుర్తుకొచ్చింది.
గాలికి కులమేదీ?
ఏదీ, నేలకు కులమేది?
నీటికి మరుగేది?
ఏదీ, కాంతికి నెలవేది?
మళ్ళీ నిద్ర రాని ఆ రాత్రి దగ్గరకు వెళదాము..
“నిద్ర రావడం లేదా అయ్యోరు?” అడిగాడు నా అవస్థ చూసిన పల్లె పెద్ద తనదైన యాసలో.
“లేదు, రావడం లేదు”
“అంతే అయ్యోరు. రాదు లేండి. మిద్దెల్లో హాయిగా పడుకునే మా రాజులు మీరు. మా పట్ల ప్రేమతో వచ్చారు కానీ అసలు ఈ పల్లెకు మీరు రావలసిన అవసరం ఏముంటుంది చెప్పండి”
“అవును. ఉండదు” ముక్తసరిగా సమాధానమిస్తూనే, “అది సరే మీ జీవితాలు ఎందుకిలా తయారయ్యాయి?” అసలు పాయింట్‌కి వచ్చాను.
“ఏం చెప్పమంటారు సామి. అప్పులు చేసి వేలకు వేలు పోసి పడవ కొంటామా. ఈ నాటు పడవలేమో కొన్న ఐదేళ్లకే జల్లెడలా మారిపోతున్నాయండి. చేసిన అప్పులు తీర్చే లోపే ఈ పడవ చిల్లులు పడి జల్లెడగా మారిపోతున్నదాయె. మరమ్మతులకు చేసిన అసలు తీర్చలేక, వడ్డీలు కట్టలేక కొత్తవి కొనలేక మా బతుకులు ఇలా అయిపోతున్నాయి బాబు” యాసలో చెప్పుకుపోతున్నాడు. నాకు కొన్ని పదాలు అర్థం కాకపోయినా అతని గుండె చప్పుడు అర్థమైంది.
పల్లె పెద్ద కళ్లు తుడుచుకోవడం ఆ మసక వెలుతురులో నా చూపు నుంచి తప్పించుకోలేక పోయింది. నా మనసు చివుక్కుమంది.
అంతలో ఆ పెద్దాయన తమాయించుకుని “సర్లే బాబు, మీరు పడుకోండి. ఇంత వరకు ఎవ్వరూ మీలా మా ఇళ్లకు వచ్చి పడుకోలేదు బాబు” అంటూ అదే గుడిసెలో మరో పక్కన వొరిగి పడుకున్నాడు.
నేను ఆలోచనలో పడ్డాను. నిజమే మిద్దెల్లో పడుకునే వారికి ఈ పూరి గుడిసెలో అందునా సముద్ర తీరం పక్కనే ఇలా పడుకోవడం కష్టమే. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది? చీకటి పడకముందే వెళ్ళిపోవచ్చు కదా. కానీ వారితో సాగిన ముచ్చట్లు నా కాలు ముందుకు కదపనీయలేదు.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటే నిద్రకాస్తా జారిపోయింది. కళ్లు తెరిచి చూశాను. కాసేపటికి గాని నేను మత్స్యకారుల పల్లెలో ఉన్నానన్న సంగతి అర్థం కాలేదు. లేచి గుడిసె బయటకు వచ్చాను. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. చంద్రుడు పడమటి వైపు బాగా వొరిగిపోయాడు. తూర్పున ఆకాశంలో నలుపు విరిగిపోతున్నది. ఇంకా తెల్లవారలేదు. కానీ ఏమిటీ వీళ్ల హడావిడి.. అప్పటికే గంగపుత్రులు తమ పడవలను సముద్రం వైపుకు తరలిస్తున్నారు. ఆశగా, ఉత్సాహంగా కడలి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మంచి మంచి చేపలు, పెద్ద పెద్ద చేపలు తమ వేటకు చిక్కాలనీ, బతుకులు పండాలని గంగమ్మను వేడుకుంటూ ఏవో పాటలు లాంటివి పాడుతూ సాగుతున్నారు. నాకెందుకో ఈ పాట గుర్తుకు వచ్చింది..
ఆడుతు పాడుతు పని చేస్తుంటే,
అలుపు సులుపేమున్నది.
ఇద్దరమొకటై చేయి కలిపితే,
ఎదురేమున్నది,
మనకు కొదవేమున్నది..
కలిసి పనిచేస్తే కలిగే సంతృప్తినీ, ఆనందాన్ని కవి ఎంత చక్కగా వివరించారో కదా..
ఒలియో ఒలీ..
మత్స్యకారుల పాటలు వింటుంటే మా పల్లెటూరిలో పొలం పనులు చేయడానికి ముఖ్యంగా ధాన్యం తూర్పారబట్టేటప్పుడు పాడుకునే పాటలు గుర్తుకు వచ్చాయి.
ఒలియో ఒలి
పొలియో పొలి
రావేలుగలవాడా
రారా పొలి గాడ..
పొలం పనులు చేసేటప్పుడు స్త్రీలు చాలా చక్కటి పాటలు పాడేవారు. వారి పాటల్లో గంగమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ వంటి గ్రామదేవతలే కాకుండా సీతమ్మోరి కథ, చిన్ని కిష్టయ్య లీలలు.. వంటివి చోటుచేసుకునేవి. ఆ తర్వాత కాలం ఎంతోమారిపోయింది. ఎంతగా అంటే, ఇప్పుడు అలాంటి పాటలు వినబడటం లేదు. పాటల స్వరూపం మారింది. చాలా చోట్ల వారి బతుకుల్లో ఆచార వ్యవహారాల పరంగా నేపథ్యం మారింది. ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాక ఎవరికి వారు సెల్‌లో పాటలు పెట్టుకుని ఇయర్ ఫోన్లతో వినేస్తున్నారు. పొలాల్లో వ్యవసాయ కార్మికులు పాడుకునే ఈ పాటలు వినడం వల్లనే ఆ తర్వాత గ్రామ దేవతల గురించి తెలుసుకోవాలన్న తపన కలగడం, అది రకరకాల వ్యాసాలు వ్రాయడానికి దారి తీయడం జరిగి ఉంటుందని నాకిప్పుడు అనిపిస్తోంది.
తుమ్మల చేను:
అప్పట్లో నేను మా నాన్న మాట కదనలేక అప్పుడప్పుడు పొలంకి వెళుతుండే వాడ్ని. అయితే మనం ఎండ కన్నెరుగని సుకుమారులం కదా. ఒక వేళ పొలం వెళ్ళినా గట్టుమీద ఒ చెట్టు చూసుకుని నీడ పట్టున కూర్చునే వాడ్ని. గట్టు మీద విశాలమైన నీడ ఇచ్చే చెట్లు పెద్దగా ఉండేవి కావు. మా పొలంలో గట్టు మీద తుమ్మ చెట్లు ఉండేది. అందుకేనేమో దాన్ని ‘తుమ్మల చేను’ అనే వారు. పొలాలకు పేర్లు కూడా ఇలాగే చిత్రంగా ఉండేవి. చెరువు గట్టు చేను (చెరువు గట్టుకు పక్కన ఉండే చేను అన్న మాట), తోట చేను (తోటకి దగ్గరగా ఉన్న చేను), అలాగే కొండ చేను, దిబ్బ చేను..ఇలా పొలాలకు పేర్లు వచ్చేవి.
దోస వరుగు:
“ఒరేయ్, తోట చేన్లో దోసకాయలు విరగ కాచాయటగా, రేపు బండిలో వేసుకు రారా” – అనేది బామ్మ. జీతగాడు మర్నాడు బండెడు దోసకాయలు కోసి తీసుకొచ్చేవాడు. వాటిలో కొన్ని ఇంట్లో ఉంచుకుని మిగతావి, ఊర్లోని బంధువులకు, తెలిసిన వారికి పంచి పెట్టేది మా బామ్మ. ఎండాకాలం కూరగాయలు దొరికేవి కావు. అమ్మకానికి కూడా వచ్చేవి కావు. అలాంటప్పుడు దోస వరుగు, వంగ వరుగు బాగా అక్కరికి వచ్చేవి. మా ఇంట్లో దూలాలకు గుత్తులు గుత్తులుగా దోస వరుగు వేలాడుతుండేవి. దోసకాయలు బాగా పండినప్పుడు వాటిలో చాలా వాటిని నేర్పుగా లింక్‌లు ఉన్న చక్రాలుగా తరిగి వాటిని దూలాలకు, దండేలకు (దండెం అంటే బట్టలు ఆరేసుకోవడానికి, ఇతర అవసరాల కోసం వ్రేలాడదీసే కర్ర అన్న మాట) ఈ వరుగులను వ్రేలాడ దీసేవారు. అలా వ్రేలాడ దీయడంతో అవి గాలికి బాగా ఎండి పెళపెళలాడుతుండేవి. తాజా కూరగాయలు దొరక్కపోతే వెంటనే ఈ దోస వరుగు దండలు తెచ్చి వాటితో కూర చేసేవారు. అలాగే వంగ వరుగులు కూడా రెడీగా ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల దోస వరుగులు, వంగ వరుగులు దొరుకుతాయనుకుంటా. వాటిని ఇష్టంగా తినేవారు ఇప్పటికీ ఉన్నారు.
చొప్ప గూడు:
సరే, పొలంలో నీడ పట్టున కూర్చోవడానికి గట్టు మీద చెట్లు లేకపోతే అప్పుడు పనివాళ్లు చాలా నేర్పుగా గూడు కట్టేవారు. జొన్న చొప్ప కట్టలను నేర్పుగా పేర్చి కట్టే గూడు భలే గమ్మత్తుగా ఉండేది. అది శంఖాకారంలో ఉండేది. ఆ గూట్లో క్రింద గడ్డి పరిచి మెత్త తయారు చేసేవారు. ఇంటి నుంచి తెచ్చిన దుప్పటి పరుచుకుని హాయిగా కూర్చోవచ్చన్న మాట. ఇదేదో బాగుందనుకునేవాడ్ని. పాపం పిల్లలు ఇబ్బంది పడతారని మా నాన్నగారే జీతగాడికి చెప్పి ఇలాంటి ఏర్పాట్లు చేయించారని ఆ తర్వాత తెలిసింది. నాన్న పట్ల గౌరవం పెరిగింది.
తొలి వ్యాసం:
మళ్ళీ గంగపుత్రుల దగ్గరకు వెళదాం. పూర్తిగా తెల్లవారింది. నాకు ఆతిథ్యమిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపి నడవడం మొదలుపెట్టాను. సముద్రపు ఒడ్డున అక్కడక్కడా మరమ్మతులకు నోచుకోని పడవలు కనిపించాయి. అవి నా వైపు దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. అప్పుడు నా చేతులు ఆ నాటు పడవలను ప్రేమగా నిమిరాయి. చిల్లులు పడవలవైపు నా చూపులు నిలిచాయి. అదే సమయంలో నా మదిలో ఒక వ్యాసానికి బీజం పడింది. వీటి దిగులు తీరాలి. గంగపుత్రుల కళ్లలో సంతోషం వెలగాలి. వారి ఇళ్లలో నిత్య దీపావళి కాంతులు నిండాలి. ఇలా అనుకుంటూ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్‌కి చేరుకున్నాను. ‘రాత్రంతా ఏమైపోయా’వంటూ నా ఫ్రెండ్స్ అడిగారు. సమాధానం చెప్పకుండా నోట్ పుస్తకంలో ఏదేదో వ్రాసుకోవడం మొదలెట్టాను.
ఈనాడు పత్రిక. ఇది 80వ దశకం తొలినాళ్లకే పాపులర్ అయింది. అందుకే నేను వ్రాసిన తొలి వ్యాసాన్ని వారికి పంపించాను. ఆ తర్వాత కొంత కాలానికి నేను నందిగామ చేరినప్పుడు పోస్ట్‌మాన్ నాకు ఒక కార్డు ముక్క ఇచ్చాడు. ఆ రోజుల్లో నందిగామలో ఉదయం 11 గంటల ప్రాంతంలో గాంధీ సెంటర్ లోని టీ స్టాల్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి టీ తాగడం అలవాటుగా మారింది. ఒక రోజు అలా టీ తాగుతుంటే ఫోస్ట్‌మాన్ వచ్చి అక్కడే కార్డు ముక్క చేతిలో పెట్టాడు. చదవగానే ఆనందం తాండవమాడింది. నేను వ్రాసిన వ్యాసాన్ని ఈనాడు వాళ్లు స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది. ఆదివారం సంచికలో ప్రచురిస్తామని కూడా రాశారు. మా ఫ్రెండ్స్ నన్ను ఓ ‘యండమూరి’లా చూశారు. ఫలితంగా ఆ రోజు టీ డబ్బులు నా చేతనే ఇప్పించారనుకోండి.
అప్పటి నుంచి ప్రతి ఆదివారం ఉదయాన్నే సెంటర్‌కి వెళ్ళి ఈనాడు పేపర్ కొనడం, వ్యాసం రాలేదని దిగాలు పడటం.. అలా కొన్ని వారాలు గడిచాక, ఓ ఆదివారం ప్రత్యేక సంచికలో నా వ్యాసం ప్రచురితమైంది. ఆ రోజుల్లో ఆదివారం సంచిక బుక్ సైజ్‌లో వచ్చేది కాదు. బ్లాక్ అండ్ వైట్ లోనే బ్రాడ్ షీట్స్‌లో వచ్చేది. నా వ్యాసం మొదటి పేజీలో మొదలై తరువాయిగా లోపలి పేజీలు కూడా ఆక్రమించింది. నేను నా ఫ్రెండ్ చేత తీయించిన ఫోటోలు కూడా వారు ప్రచురించడం వాడికీ బోలెడు సంతోషమేసింది. ఆ రోజు రాత్రి నేను పెద్ద రచయితనై పోయినట్లు కలలు వచ్చాయి.
గొప్ప రచయితనైతే కాలేదు కానీ ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న జర్నలిస్ట్‌గా మారడానికి ఈ వ్యాసం దోహద పడిందనే చెప్పాలి.
పడవ కష్టం – శాస్త్రీయ కోణం:
నాటు పడవలు నాలుగైదేళ్లకే జల్లెడగా మారడానికీ జంతు-వృక్ష శాస్త్రాలకు లింక్ ఉన్నదని చెప్పాను కదా. పూర్తి వివరాలు చెప్పాలంటే అదో పెద్ద కథే అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే..
నాటు పడవలు చెక్కతో తయారవుతాయి కదా. ఆ చెక్క పడవలే సముద్ర జలాల్లో రోజూ తేలియాడుతుంటాయి. అలా సముద్ర జలాల్లోనే ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిని మొలస్కలనే గవ్వల్లాంటి జీవులు పడవలను ఆశ్రయిస్తాయి. సముద్ర జలాల్లో నానినాని మెత్తబడిన పడవల క్రింద భాగం ఈ జీవులు గుంపు గుంపులుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలక్రమేణ చెక్క మరింత మెత్తబడి చివరకు చిల్లులు పడే పరిస్థితికి చేరుకుంటుంది. చివరకు పడవ క్రింది భాగం జల్లెడగా మారిపోతుంది. ఇలా పడవ మెత్తబడటానికి ఈ తరహా జంతువులకు తోడు వృక్షశాస్త్రానికే చెందిన ఫంగస్ (శిలీంద్రం) ఈ పడవలను ఆశ్రయించి దాన్ని మెత్తబరుస్తుంటాయన్న సత్యం పరిశోధనల్లో తేలింది. ఫలితంగా నాటు పడవ కొన్న ఐదారేళ్లకే పడవ క్రింద భాగం జల్లెడగా మారడంతో జాలర్ల బతుకులు ఛిద్రమవడం మొదలవుతుంది. ఇలా శాస్త్రీయ, సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశం కావడంతో ఈనాడు వాళ్లు నా వ్యాసానికి పెద్ద పీట వేశారనీ, అంతే కానీ నేనేదో గొప్పగా రాయడం వల్ల కాదన్న సంగతి ఆ తర్వాత తెలిసింది.
ఏదైతేనేం లేండి, మొత్తానికి నా వ్యాసం కొంతలో కొంత చైతన్యం కలిగించింది. గంగపుత్రుల పరిస్థితులు తర్వాత కాలంలో మారాయి. శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా (ఉడ్ ప్రిసెర్వేటర్స్ వంటివి రావడం వల్ల) ఇబ్బందులను ఎదుర్కునే శక్తి గంగపుత్రులకు వచ్చింది. మహా వారధి నిర్మాణంలో ఉడతలాగా నేనూ సాయం చేశానన్న తృప్తి మిగిలింది. మరో ప్రక్క జర్నలిజం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రాజెక్ట్ వర్క్ మధ్యలోనే ఆపేసి ఈనాడు సంస్థలో చేరాను. అక్కడి నుంచి జర్నలిస్ట్‌గా నా ప్రయాణం ఆంధ్రప్రభకు చేరింది. ఆంధ్రప్రభలో నా ప్రయాణం ఓ పెద్ద కథ.
(మళ్ళీ కలుద్దాం)