టర్నింగ్..

0
2

[dropcap]“ఒ[/dropcap]రేయ్! సూర్యా! మా నాన్న ఫాక్టరీ నుండి వచ్చేస్తారు. టైంకి ఇంట్లో లేకపోతే చిక్కొడతారు. నేను వెళ్తున్నానురా!” బేటు బాలు అక్కడ పడేసి పరిగెత్తాడు ప్రసాద్.

“ఒరే! ప్రసాదు, నేను వస్తానాగరా! మా అమ్మ కూడా, తనొచ్చే సరికి నేను ఇంట్లో లేకపోతే ఏడుస్తుంది. ఫదరా” అని వెంట పడ్డాడు సూర్య.

“ఓరే, వేణూ! నువ్వూ రారా. మీ అమ్మగారు మమ్మలిని నీ గురించి అడుగుతారు.” అన్నాడు సూర్య.

“మీరెళ్ళండిరా, కొంచంసేపు ఆడుకొనివస్తానని చెప్పండి” అని ఆటలో మునిగిపోయాడు వేణు.

“పొండిరా బాబూ! ఈళ్లుత్తి పిరికోళ్ళురా.. ఈడిని వీళ్ళమ్మ.. వాడిని వాళ్ళ నాన్న చితగ్గొట్టేస్తారు” అన్నాడు వేణు.

“ఒరే! సూరిగాడి నాన్న, వీడు టైంకి మందు సీసాలందించకపోతే మక్కెలిరగదంతాడు” పకపకా నవ్వాడు గంగు..

“అల్లాగ అందించినా వాడు ప్రసాదూ, మన కాలనీ మొత్తానికి బాగా చదువుతారు గదరా! నీలాగ కాదు” అన్నాడు వేణు మళ్ళీ.

“నన్నడిగే ఓల్లే లేరు లేరా! మా అయ్య ఏ రాత్రికో తాగుతూ ఊగుతూ వచ్చి వాగి వాగి పడుకుంటాడు.” గొప్పలా అన్నాడు గంగు.

“అవున్రోయ్, తాగిసి అరచేతితో ఆకాశం పడిఫోకుండా ఆపేస్తానని, భూమిని బలంగా బురదలోకి తొక్కేస్తానని గొప్పలు చెప్తాడు” వెటకారంగా అన్నాడు వేణు.

“మా నాన్నని, నువ్వు ఎక్కిరించక్కర్లేదు. ముసలమ్మని కింద పడేసి ఆ ముసల్దాని పట్టిమంచం, షరాబుకి అమ్మసి మీ నాన్న పేకాట ఆడేడుట” రోషంగా అన్నాడు గంగు…

“మీ నాన్న రోజూ మీ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులు చితగ్గొట్టి లాక్కుపోతాడటగదా తాగడానికి” అన్నాడు వేణు.

“మరి మీ నాన్న ఎవుడి జేబులో డబ్బులు చూసినా ఎంబడించి, దేవురించి, ఆ డబ్బులతో పేకాటాడేస్తాడట గదా” అన్నాడు గంగు.

“మీ అమ్మ చిల్లర సరుకులమ్మి కమీషన్లు కొడతాదిటగదా!” వేణు మాట పూర్తికాకుండానే ,

“మా అమ్మనంటే మర్యాదగుండదు” అని, ఏదోభాగం విరిగి పోయేట్టు క్రికెట్టు బేటుతో బలంగా కొట్టాడు గంగు.

“చచ్చిపోయాన్రో బాబో! చంపేసేడు” అని పెద్దగా ఏడుస్తూ కూలబడి పోయాడు వేణు.

అంత దెబ్బ తగులుతుందని ఊహించని గంగు పోలీసులు జైల్లో పెడతారని భయపడి క్రికెట్టు బేటక్కడే పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి, పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న మెయిలు ఎక్కేసాడు.

***

ఇక్కడ పెద్ద వాళ్ళు పెద్దగా గొడవ పడ్డారు. వేణు తండ్రి పోలీసు కేసు పెట్టాడు. “వీడేం చేసాడో నా కొడుకు కొట్టాడు, వీడి వల్లే నా కొడుకు కనబడలేదు” అని గంగు వాళ్ళు కేసు పెట్టారు.

ఇంటికి రాగానే విషయం తెలుసుకున్న సూర్య తల్లి వాళ్ళతో ఆడిన కొడుకుని పోలీసులు ప్రశ్నలడిగి ఏమి ఇబ్బంది పెడతారో! అని ఎవరికీ చెప్పకుండా, పిల్లాడిని తీసుకొని మద్రాస్ వెళ్ళిపోయింది తన అక్క దగ్గరికి…

ఫ్రసాద్ వాళ్ళు కాలనీ వదిలి క్వార్టర్స్ లోకి వెల్లి పోయారు.

***

ఫదిహేనేళ్ళ తర్వాత… తన షెడ్డు ముందు పెద్ద కారాగడంతో తన స్వంత మెకానిక్ షెడ్డు నుండి రాజస్తాన్ పెట్టుడు కాలు సాయంతో కొంచం కుంటుకుంటూ బయిటకు వచ్చాడు వేణు.

“ఇది చిన్నషెడ్డు సర్. రెండు వీధులవతల పెద్ద గేరేజ్ ఉంది” వేణు అంటుండగానే…

“ఈ షెడ్డునే వెతుక్కుంటూ వచ్చాం సార్” అంటూ వచ్చి, ఒక అమ్మాయితో అబ్బాయితో, “వేణు మామకి నమస్తే చెప్పండి” అన్నారు కారు దిగి నిల్చున్న ఖరీదైన దుస్తులతో ఉన్న వ్యక్తులిద్దరు.

“మీరు మా సూర్య, ప్రసాదులు కదూ” అంటుండగానే, “అబ్బ! ఎంత తొందరగా గుర్తు పట్టావురా, బాబూ!” అని తమవారిని పరిచయం చేసారు సూర్య, ప్రసాద్.

ఆనందంతో “చాలా సంతోషం రా. నన్ను వెతుక్కుంటూ వచ్చారు. రండి, మా ఇంటికి” అని తీసుకు వెళ్లాడు వేణు.

రెండు గదుల పెంకుటిల్లు. ఇంటిముందు రకరకాల మొక్కలు. కారు గేటు వరకూ వచ్చి ఆగింది. సాదరంగా ఆహ్వానించించింది వేణు భార్య వెన్నెల.

వేణు తన స్నేహితులకు ఆమెను పరిచయం చేసాడు. వినయంగా నమస్కరించింది.

వంట చేస్తున్న తల్లి దగ్గరకు తీసుకెళ్ళాడు. “అమ్మా! సూర్య, ప్రసాద్ వచ్చారు” అని పొంగిపోతూ సంతోషంగా చెప్పాడు వేణు.

“కుచేలుడిని వెతుక్కుని కృష్ణులిద్దరూ వచ్చారా? సంతోషం రా బాబూ” అని దగ్గరకు తీసుకొని, పిల్లల్ని పిలిచి, “పిల్లలూ, నేనూ మీకు నాన్నమ్మనే రండి” అని చేరదీసారు వేణు తల్లి.

సూర్య, ఫ్రసాద్ ఆమెకు నమస్కరించి, “రాఘవయ్య మాష్టారి ఆశీర్వాదం తీసుకుందామని, పిల్లలకు మేము పుట్టి పెరిగిన ఊరు చూపిద్దామని, వచ్చామమ్మా!.. మాష్టారు వేణు ఇక్కడిన్నాడని చెప్తే వెంటనే వచ్చాం. మీరు బాగున్నారా అమ్మా? నా కూతురు అరవింద పదో తరగతి. ప్రసాద్ కొడుకు అవినాష్ ఎనిమిదో తరగతి.” అని పరిచయం చేసాడు సూర్య.

సరిగా ఆ సమయంలో వచ్చారు వేణు కూతురు ఉష. కొడుకు ఉజ్వల్.

సంతోషంగా అన్నాడు వేణు “మా పిల్లలు గవర్నమెంటు బడి లోనే చదువుతున్నారురా. మీ పాప లాగానే మా అమ్మాయి పదో తరగతి, ప్రసాద్ కొడుకులా నా కొడుకు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూలవ్వగానే మిగతా కళలు నేర్చుకుంటారు. ఈ రోజు సెలవని క్లాసు ముందే అయింది. పాప కరాటే క్లాసుకి, వీడు తబలా క్లాసుకి వెళ్ళి వస్తున్నారు. క్లాస్ ఫస్ట్ ఎప్పుడూ వీరిద్దరిదే… ఏదో! నాలా కాకూడదని వాళ్ళమ్మ చాలా కష్టపడుతుంది.” అని చెప్పి, “పిల్లలూ వీళ్ళే నేనెప్పుడూ చెప్పే, సూర్య ప్రసాద్ మామలు. వీళ్ళు వీరి పిల్లలు” అని సంబరపడిపోతూ పరిచయం చేసాడు వేణు.

వాళ్ళు నమస్కారం పెట్టి వింతగా చూస్తుంటే, “ఈయన ఎప్పుడూ తనని తాను చాలా తక్కువ చేసుకుంటారన్నయ్యా.. నాదేముంది.. పట్టుదలగా చాలా కష్టపడి పిల్లలను సెంట్రల్ స్కూల్ లోనే చదివిస్తున్నారు.. తెలియాలి కదా! తల్లిదండ్రులు తమకోసం ఎంత కష్టపడుతున్నారో?” అని అంది వెన్నెల.

చివ్వున తలెత్తి చూసాడు ప్రసాద్ కొడుకు, తన తండ్రి డైలాగ్ ఈమె చెప్తున్నదేమిటా అని.. గమనించింది వెన్నెల. తను చైల్డ్ సైకాలజీ చేసిన మంచి టీచరు.. అందుకే అంది “వాళ్ళ నాన్నగారు ఎంత వ్యసనపరుడైనా ఈయన బాగానే చదువుకున్నారన్నయ్యా.. ఏదో చిన్నప్పుడు జరిగిన గొడవ. అవిటితనం వచ్చిందంతే!.. వాళ్ళ అమ్మని నన్ను పిల్లలను బాగా చూసుకుంటారు. ఇప్పటికీ ప్రతిరోజూ చదివి ఆ మెకానిజంలో సులువులు తెలుసుకుని. మంచి పేరు తెచ్చుకున్నారు. చదువంటే తపన. పిల్లలు బాగా చదువుకోవాలని, చెడు స్నేహాలు చేయకూడదని ఆయన బాధ” అంది.

“పిల్లలూ నలుగురూ ఆ పిల్లల గదిలో కూర్చోండి. ఫెద్దవాళ్ళ మాటలు మీకెందుకు?” అంది వెన్నెల.

ఆ గదిలోకి వెళ్లారు పిల్లలు. తర్వాత వెళ్ళిన వేణు, ప్రసాద్ ఆశ్చర్య పోయారు. వ్యర్థ పదార్థాలతో వేణు కూతురు చేసిన రకరకాల అందమైన వస్తువులు.. వేణు కొడుకు వేసిన అందమైన పెయింటింగులు. ఆర్టు గేలరీలా అందంగా అమర్చిన గది.

పిల్లల టాలెంటు చూసి మురిసిపోయి వద్దన్నా పిల్లలకు బహుమతులిచ్చి వచ్చారు సూర్య, ప్రసాద్‍లు.

వారిని ఆనందంగా సాగనంపారు వేణు కుటుంబ సభ్యులు .

కార్లో “డబ్బు ఆడంబరాలనిస్తుంది జ్ఞానాన్ని కాదు. బాగా చదువుకోవాలని తపన ఉండాలి. ఆ పిల్లలను చూశారుగా. చదువు, దానితో పాటు అదనపు కళలు” అన్నాడు ప్రసాద్ . “నిజమే!” అన్నాడు సూర్య తన కూతురి వైపు చూస్తూ.

“మాకర్థమయ్యింది డాడీ, మీరందుకే అక్కడికి తీసుకెళ్ళారు” అంది సూర్య కూతురు, వేణు కూతురు స్వయంగా చేసిచ్చిన ఫ్రెండ్షిప్ బేండ్ చూసి మురిసిపోతూ.

ప్రసాదు కొడుకు వేణు కొడుకిచ్చిన తన ఇష్టమైన క్రికెటర్ పెయింటింగ్ చూస్తూ, “వాళ్ళని హాలిడేస్‌లో మనింటికి ఇన్వైట్ చేద్దాం డాడ్. ఈలోగా పెయింటింగ్ నేర్చుకుంటాను. బాగా చదువుకుంటాను. వాళ్ళొస్తే అందరం కలసి ఎంజాయ్ చేద్దాం. ఉయ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యు నో” అన్నాడు మెరిసే కళ్ళతో తండ్రిని చూస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here