Site icon Sanchika

తుర్రెబాజ్ ఖాన్ – పుస్తక పరిచయం

[dropcap]క్రీ.[/dropcap]శ.1857లో ఆనాటి నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన హైదరాబాద్ వీరుని గాథ ఇది. ఈ గాథని యస్.డి.వి.అజీజ్ రేడియో నాటకంగా మలిచారు. ఇది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ధారావాహికంగా ప్రసారం చేయబడింది.

***

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి! అందులో కులమతాలకు అతీతంగా ఎందరో పాల్గొని అసువులు బాసి అమరులయ్యారు. అలాంటివారిలో తుర్రెబాజ్ ఖాన్ ఒకరు! – అతని పోరాటం నాడే కాదు నేటికీ స్ఫూర్తిదాయకం.

1857 నాటి దేశ పరిస్థితి, హైదరాబాద్ రాజకీయ, సామాజిక పరిస్థితులు, తుర్రెబాజ్ ఖాన్ నాటి బ్రిటిష్ వారిపై, నిజాం నవాబ్ పై జరిపిన పోరాటం గురించి కళ్ళకు కట్టినట్టుగా ఈ రచనలో చిత్రీకరించడమైనది!

***

ఈ నాటకంలోని ఓ సన్నివేశం:

కర్మత్ ఆలీఖాన్ : బ్రిటీష్ వారంటే ఎందుకు ద్వేషం?

తుర్రెబాజ్‌ ఖాన్ : వారు ఈ దేశాన్ని తమ మాతృదేశంగా భావించటం లేదు. కేవలం వలస వాద దేశంగా చూస్తున్నారు. ఇక్కడి సంపద కొల్లగొట్టి, పేద దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వదేశీ రాజ పాలనను, అంతమొందించి తమ పాలనకు కుట్రలు పన్నుతున్నారు. ఈ పరిస్థితిలో, ఈ దేశంలోని ప్రతి స్వదేశీ పాలకుడు, ప్రతిపౌరుడు, వారిని ఎదురించాలి. లేదంటే, ఆసేతు హిమాచలం వారి పాలనే విస్తరిస్తుంది. దేశంలోని ముఖ్యులు, పౌరులు వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వుంటే, నిజాంగారు మాత్రం దాసోహం అనటం పిరికితనమే తప్ప మరేం కాదు. నిజాం చెయ్యాల్సిన పని నేను చేశాను. ఆ అల్లా పేరు మీద, ఈ తిరుగుబాటుకు పూనుకొన్నాను. నేనే కాదు మీలాంటి న్యాయమూర్తులు కూడా, వారికి వ్యతిరేకంగా ఉద్యమించవలసిన అవసరం వుంది. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఊడిగం చేయటం ఏమిటి? ఈ దేశముఖ్యులను, ప్రజలను, బంధీ చేసి శిక్షలు విధించటమేమిటి? సిగ్గుపడాలి! ఈ పరిస్థితికి అందరూ సిగ్గుపడాలి. బ్రిటీష్ వారికి మద్దతు ఇస్తున్న వారు ఇంకా సిగ్గుపడాలి.

కర్మత్ ఆలీఖాన్ : ఓ న్యాయమూర్తి ముందు.. ఇచ్చవచ్చినట్లుగా మాట్లాడరాదు.

తుర్రెబాజ్‌ ఖాన్ : పాలకుడు చెవిటి వాడయినపుడు, కనీసం మీలాంటి న్యాయమూర్తుల ముందైనా మా ఆక్రోశం, ఆవేదన, వెలిబుచ్చుకోవాలిగా!

కర్మత్ ఆలీఖాన్ : బ్రిటీష్ రెసిడెంట్ పై దాడికి పూర్తి బాధ్యత నీదేనంటావు?

తుర్రెబాజ్‌ ఖాన్ : అవును.

కర్మత్ ఆలీఖాన్ : ఇక నువ్వు వెళ్ళొచ్చు!

***

పుస్తకం పేరు: తుర్రెబాజ్‌ ఖాన్

రచయిత: యస్.డి.వి.అజీజ్

పేజీలు: vi+74, వెల: ₹75

ప్రతులకు: రచయిత, 46/634,

బుధవారపేట, కర్నూలు – 518002

ఫోన్: 8106367175

 

Exit mobile version