ట్విన్ సిటీస్ సింగర్స్-1: చిత్రపు లక్ష్మీ పద్మజ

2
2

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన ‘గాయనిగా నా తొలి, తుది కోరిక ఒక్కటే. బాలు గారితో ఒక్కసారైన కలిసి వేదిక మీద పాడాలనీ!’ అనే ‘చిత్రపు లక్ష్మీ పద్మజ’ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్ దమయంతి. [/box]

[dropcap]నే[/dropcap]ను మొదటిసారిగా లక్ష్మీ పద్మజ గారిని త్యాగరాయ గానసభ వేదిక మీద చూసి, ‘ ఎవరీ గాయనీ!! శృతి, లయ, తాళం తప్పకుండా ఎంత శ్రద్దగా, మధురం గా పాడుతున్నారు!?’ అని మనసులోనే మెచ్చుకున్నాను.

అలా మెచ్చుకోడానికి గల కారణాలు ఏమిటంటే – పాటని ప్రెజెంట్ చేసేటప్పుడు అమె దృష్టి అంతా స్క్రిప్ట్ మీద వుంది. పల్లవి తర్వాత బిట్ అంచున తను అందుకోబోయే చరణం మీద మనసు కేంద్రీకరించి వుంది. పాట చివరి వరకు అనుసరించిన క్రమశిక్షణకి ఆశ్చరమేసింది.

మంచి గాయని అనిపించుకోడానికి గల అర్హతలివి. అందుకే, పదిమంది పెద్దల ఆశీస్సులను అంది పుచ్చుకుని, ఈనాడు సినీ నేపధ్య గాయనిగా ఎదిగారు – లక్ష్మీ పద్మజ. అయితే, ఈ విజయం ఒక్కరోజులో సాధించింది కాదు. దీని వెనక ఆమె చేసిన కృషి వుంది. పట్టు వదలని దీక్షా, సాధనలతో గాత్రాన్ని మెరుగుపరుచుకున్న నైపుణ్యం కానొస్తుంది. అందుకే ఈ గాయని ప్రత్యేకమైన గుర్తింపునీ, గౌరవాన్ని పొందారు. త్యాగరాయ గాన సభ ప్రేక్షకులు ఈ గాయనిని ఎంతగానో అభిమానించడం నాకు తెలుసు.

‘ట్విన్ సిటీస్ సింగర్స్’ సిరీస్ లో నేను మీకు పరిచయం చేయబోయే మొట్టమొదటి గాయని – శ్రీమతి చిత్రపు లక్ష్మీ పద్మజ గారితో నే జరిపిన ఇంటర్వ్యూ లో ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు వెలుగుచూసాయి. వాట్ని సంచిక పాఠకులైన మీతో పంచుకోవడం ఎంతైనా ముదావహం.

 * తెనాలి లో శ్రీ మార్టూరి వెంకటేశ్వర్లు గారి దగ్గర కొంత వరకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. ‘సంగీతం లో నాకు పునాది వేసిన తొలి గురువు వీరే ‘ అని పూజ్య భావాన్ని వెలిబుచ్చారు ఆ తర్వాత – శ్రీ జి.వి.ప్రభాకర్ గారి దగ్గర లలిత సంగీతం లో పొందిన శిక్షణ వల్ల సినీ గీతాలాపనలో గల రహస్యాలను తెలుసుకోవడం, ఎన్నో మెలకువలు నేర్చుకోవడం జరిగిందంటారు.

 ఈ గాయని – ఆకాశవాణి బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా ప్రసిధ్ధి చెందారు. విజయవాడ కేంద్రం లో వెలువడే యువవాణి రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్న అనుభవం వుంది.

‘స్వర సరోజ’ గా బిరుదు ని పొందిన లక్ష్మీ పద్మజ గారు తాను బాల్యం నుండే పాట పట్ల ఆకర్షితులయ్యారని చెబుతారు. ‘అదొక ఎనలేని ప్రేమ, మోహం’ అంటూ తన ఆరాధనని వ్యక్తపరిచారు.

ఇంకా ఏమంటారో ఈ ఇంటర్వ్యూ లో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

***

> ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనలండి.

* దేనికీ? (నవ్వుతూ)

> సినీ నేపధ్య గాయని గా మారి, కన్నడ తెలుగు – రెండు భాషలల్లోనూ మీ స్వరాన్ని అందించి. నూతన గాయనిగా విజయం సాధించినందుకు.

* (నా మాటలకు ఆనందంగా నవ్వారు.)

‘థాంక్సండి. నేపథ్య గాయని కావాలనేది చిన్నప్పట్నించి కంటున్న కల. అది ఈ నాటికి నెరవేరినా, ఇది తొలి మెట్టు మాత్రమే. ఆ శారదా దయ వల్ల ప్లేబాక్ సింగర్ అనిపించుకున్నానన్న తృప్తి కలిగింది. నూతన సంగీత దర్శకులు

శ్రీ సంజీవ్ మెగోటి గారు కన్నడ సినిమాలో పాట పాడే అవకాశాన్నిచ్చారు.

 ఆడిషన్స్ లో ఎంతో మంది పాల్గొన్నారు. చాలా పోటీ వున్నప్పటికీ నా వాయిస్ బావుందని పాడే అవకాశాన్ని నాకే ఇచ్చారు. అందుకు వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

> కన్నడ సినిమా పేరేమిటండీ?

* దండు. తెలుగుసినిమా పేరు కూడా అదే. – దండు. ఈ ఫిల్మ్ లో రెండు పాటలు పాడాను.

 > వేదికల మీద వందల కొద్దీ సినీ గీతాలు ఆలపించారు కదా? అసలు సినీ గీతాలు పాడాలనే ఆసక్తి మీకెలా కలిగింది? మీకు స్ఫూర్తి, ప్రేరణలను కలగచేసిందెవరు?

* స్ఫూర్తి అంటే మా అమ్మ – శ్యామలా దేవి గారే. ఆవిడ కూడా గాయనే కాబట్టి, ఆమె పాడే పాటలన్నీ విని నేర్చుకుని పాడేదాన్ని. కొన్ని వింటున్నప్పుడే నోటికొచ్చేసేవి. గాఢంగా మనసులో నాటుకుపోయేవి. సంగీతం పట్ల నాకున్న ఆసక్తిని గమనించి అమ్మ నాకు సంగీతాన్ని నేర్పించారు. అంతే కాదు, ఇటు చదువు, అటు సంగీతంతో బాటు పెయింటింగ్స్, డాన్స్ కూడా నేర్పించారు.

ప్రేరణ మాటకొస్తే నా చిన్నప్పుడు రేడియోలో వచ్చే సుశీల గారి పాటలు ప్రతీ రోజూ వినాల్సిందే. లేకపోతే నిద్ర పట్టదు. ఇప్పటికీ అంతే. అంతగా ప్రేమిస్తాను ఆ మధుర గాత్రాన్ని. అలా విని ఆనందిస్తున్న తరుణంలోనే నాలో ఒక ప్రేరణ కలిగింది. నేనూ ఆమెలా పాడాలని! అలానే, శోభా రాజు గారి గారి అన్నమయ్య కీర్తనలు విన్నప్పుడు కూడా భక్తి ఆవేశం కలిగించి, ఆ గీతాలను ఆలపించాలని ప్రేరణ కలిగించింది..

ఈ రెండూ ఆశలు నన్ను గాయనిగా మార్చిన వైనాలు, ప్రేరణలు, ఇన్‌స్పిరేషన్స్ అని చెప్పక తప్పదు.  ఈ నాటి నా గాయని ప్రస్థానానికి మూల కారకులు ఈ ముగ్గురు స్త్రీ మూర్తుల ప్రభావం నా పైన ఎంతైనా వుందని – సగర్వం గా చెబుతాను.

 > వీరి పాటలు పాడేటప్పుడు వీరిని అనుకరిస్తారా?

* లేదు. అస్సలు అనుకరించను. వారిని ఏ సింగరూ అనుకరించలేరు. కేవలం స్ఫూర్తి గా మాత్రమే తీసుకుని, నా పంథాలో నా సొంత గాత్రంతో పాడతాను. అనుకరించడం వల్ల సింగర్ తన ఒరిజినాలిటీని కోల్పోతారని బాలు గారు చెబుతారు చూసారూ, అది నూటి కి నూరుపాళ్ళు నిజం.

 > మీకిష్టమైన నేపధ్య గాయనీమణులు ఎవరు?

* అందర్నీ ఇష్టపడతాను. ప్రధానంగా సుశీల గారు అంటే నాకత్యంత అభిమానం. ఆనాటి సావిత్రి కాలం నించి నిన్నా మొన్నటి మీనా, ఇంకా ఎందరో వర్ధమాన తారలకు సైతం గాత్రాన్ని అందించడంలో గొప్ప ప్రతిభని చూపిన ఏకైక గాయనీమణి సుశీల గారు.

పూవులోని తావిలా కేవలం గాత్ర మాధుర్యమే కాకుండా భావ సౌరభాలనీ గుప్పించడంలో ఆమెకి ఆమే సాటి అని చెప్పాలి. సుశీల – తన గాత్రం లో అన్ని రస ప్రధాన భావాలనూ అలవోకగా వొలికించగల ప్రతిభావంతురాలు. పాడే ఏ పాటకయినా సరే పూర్తి న్యాయాన్ని చేకూరుస్తారు. అన్ని విభిన్న భావాలనెలా పలికించగలరో! అని అబ్బురపోతుంటాను. చెప్పలేనంతగా విస్మయం గా వుంటుంది. ఇంకా చెప్పాలంటే, – ఆమె పాడిన పాటల వల్లే ఒక జెనరేషన్ హీరోయిన్లు – ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర గా నిలిచారంటే అతిశయోక్తి లేదు.

 నాకు మెలొడీస్ అంటే ప్రాణం. నా ప్రాణప్రదమైన గీతాలన్నీ అధిక శాతం – సుశీల గారి పాడిన పాటలే వుంటాయి.! అందుకే నాకు ఆ గాయని అంటే ప్రత్యేక గౌరవం. ఎనలేని అభిమానం. అత్యంత ఆదర్శ వంతమైన గాయని ఎవరంటే ముందుగా సుశీల గారి పేరునే పేర్కొంటా.

ఇంకా జానకి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. భక్తి పరంపర గీతాలలో శోభారాజు గారు. పర భాష మాటకొస్తే – లత గారి పేరు ముందుంటుందని వేరే చెప్పనవసరం లేదనుకుంటా కదా! (అంటూ నవ్వారు)

> మరి మీరింతగా ఆరాధించే గాయనీ మణుల గీతాలను ఆలపించేటప్పుడు మీరెలాటి జాగ్రత్తలు తీసుకుంటారు?

* మీరు నమ్ముతారో లేదో ప్రతి పాటని నేను వంద సార్లు తక్కువ కాకుండా ప్రాక్టీస్ చేసి కానీ, వేదిక మీదకి రాను. ఎందుకంటే రికార్డింగ్ సమయంలో గాయనీ గాయకులకు వుండే వెసులుబాట్లు వేదిక మీద లైవ్‌లో మాకు వుండవు. పొరబడితే తప్పుని సరిదిద్దుకునే అవకాశం వుండదు అనే సత్యం నాకు తెలుసు. అందుకే నా వరకు నేను ఏ గీతాన్నయినా సరే ప్రొఫెషనల్‌గా తీసుకుంటాను. పర్‌ఫెక్షన్ కోసం తాపత్రయ పడతాను. వేదిక మీద పాట పాడే అవకాశం కలగడమే ఒక మహాభాగ్యం గా భావించి, అంకిత భావంతో మసలుకుంటాను.

> మీరు చెబుతోంది నిజమని చెప్పడానికి రుజువుగా..సమతగోపాల్ ఆడిటోరియంలో ఆరోజు ప్రోగ్రాం నాడు మీ గీతాలని విని ఫిదా అయిపోయాను. వెంటనే మైకందుకుని మిమ్మల్ని అభినందించాను.. గుర్తుందాండీ?

* (నవ్వుతూ) గుర్తు లేకపోవడమేమిటీ, ఎంతో బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం అది. మీ ప్రశంసలు నన్నెంతగానో ముగ్ధురాల్ని చేసాయి. ఆ రోజు మీరు వింటం, నా అదృష్టం అని అనుకుంటా..

>..అని కాదు కానీ, పాట అంటే మీకు గల అంకిత భావం నన్ను ఆకట్టుకున్న మాట వాస్తవం.

* ధన్యవాదాలండి. అంతా ఆ అమ్మ కృప. ఆ శారదా దేవి కరుణగా భావిస్తాను. మా నాన్న గారు నా చిన్నప్పుడే కాలం చేసారు. అయినా, ఆ లోటు కనిపించకుండా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి, విద్యా బుధ్ధులు నేర్పించి..ఇంత దాన్ని చేసారు. ఇదంతా మా అమ్మ గారి దీవెన గానే భావిస్తాను.

> మీరిప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి వుంటారు?

* ఇప్పటి వరకు వంద పైని ప్రోగ్రామ్స్ ఇచ్చానండి! 2000 సంవత్సరం లో ప్రపంచ తెలుగు మహాసభలో కూడాపాల్గొని  నా గానాన్ని వినిపించే అదృష్టం కలిగింది.

* అలాగే, తిరుపతి, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలలో జరిగిన సంగీత విభావరీలలో ఎన్నోసార్లు పాల్గొన్నాను.

> అంటే, కమర్షియల్ ప్రోగ్రామ్స్ చేస్తారా?

* చేస్తాను. సంప్రదించదలచిన వారు ఈ సెల్ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. – 9849541420.

ప్ర. > మీ గీతాలను ఎంపిక చేసుకునే స్వేచ్చ వుంటుందా మీకు?

* వుంటుంది. ఎక్కువగా మెలొడీస్, హుషారైనవి, సాహిత్య ప్రధానమైనవే ఎంచుకుంటాను. అప్పుడప్పుడు…లేటెస్ట్ సినిమాలలో వస్తున్న గీతాలనూ ఆలపించక తప్పదు.

> అంటే బీటూ, గోటూ, వాయిద్యాల హోరూ వున్నవా? (నవ్వులు)

* తప్పదు మరి! ప్రేక్షకుల కోరినప్పుడు, ఈవెంట్స్ నిర్వాహకుల డిమాండ్ అయినప్పుడు – పాడాల్సిందే కదా!!

> పాటలో సాహిత్య పరమైన ఇబ్బందిని ఎదుర్కున్న సందర్భాలున్నాయా?

* లిరికల్ గా కొంత మినహాయింపు వున్నా, సంగీత పరంగా అది హిట్ సాంగ్ అయినప్పుడు – ఏ సింగరూ పాడేందుకు వ్యతిరేకించలేరు. మరీ అసభ్యకరమైనవి అస్సలు పాడను. రొమాంటిక్ సాహిత్యానికి, వెగటుగా వుండే సాహిత్యానికి మధ్య ఒక చిన్న సరిహద్దు రేఖ వుంటుంది. అది నేనెప్పుడూ దాటను. దాటలేను. తప్పని సరి గనక అంటే – నేను ఆ ప్రోగ్రామ్‌నే కాన్సిల్ చేసుకుంటాను తప్ప, చౌకబారు సాహిత్యాన్ని నా గాత్రం లోకి చొరబడనీయను.

> మీరు ఎక్కువగా ఏ ఏ సంగీత సాంస్కృతిక సంస్థలలో పాల్గొంటారు?

* త్యాగరాజు సభలో ఎన్నో సంస్థల వారు సినీ విభావరీలు నిర్వహిస్తుంటారు. ప్రముఖంగా ఐతే యువకళా వాహిని, జి పి. ఆర్ట్స్, జనప్రియ, శారదా మ్యూజిక అకాడెమీ, శృతిలయ.. ఇంకా ఎన్నో పేరున్న, ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పాడుతుంటాను.

 అయితే – నన్ను గాయనిగా వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం వంశీ రామరాజు గారి – ‘వంశీ సంస్థ’ అనే చెప్పాలి. వారి శ్రీమతి సుధ గారు కూడా నన్నెంతగానో ప్రోత్స హించారు. వంశీ సంస్థలో పాడటం వల్ల నాకు గొప్ప గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా – మన సంచిక పత్రిక ద్వారా వారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

> త్యాగరాయ గాన సభ ప్రధాన హాల్‌లో ఎక్కువగా సినీ సంగీత విభావరులే జరుగుతుంటాయి. నిజానికి నెలలో 28 రోజులు అని చెప్పాలి. వాస్తవంగా చూస్తే ఈ సాంస్కృతిక సేవా సంస్థలు ఎన్నో వ్యయప్రయాస లకు ఓర్చి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తుంటాయి. ఆ భారం ఒక్కో సారి సింగర్స్ కూడా పంచుకోవడం కద్దు అని విన్నాను.

* అవునండి. లేకపోతే అంత భారమూ ఆర్గనైజ్జెర్స్ నెత్తి మీద మోయలేని భారమౌతుంది. స్పాన్సరర్స్ లేనప్పుడు అంత బరువు మోయడం ఎంతకష్టం కదా!! అందుకని సింగర్స్ కూడా ఖర్చుని పంచుకోవడం తమ నైతిక బాధ్యత గా భావిస్తారు. లేకపోతే సంస్థలు మూతపడిపోవా? అలా గాయనీ గాయకులు కళారాజ పోషకుల పాత్ర కూడా పొషిస్తున్నారు. ముఖ్యం గా త్యాగరాయ గాన సభలో!

> ఈ పరిస్థితుల మీద మీ అభిప్రాయం?

*…బాధాకరమైన విషయమే కానీ సింగర్స్‌కి సపోర్ట్ ఇచ్చేవాళ్లెవరున్నారు? అందరకీ కాకపోయినా, బాగా పాడగలిగే వాళ్లకైనా దాతల నించి ఫైనాన్షియల్ సపోర్ట్ వుంటే బావుణ్ణు అనిపిస్తుంది. అలానే ప్రోగ్రామ్‌కి అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు కూడా సంస్థలకి సాయం చేయాలని కోరుకుంటాను. అప్పుడు ప్రతిభ గల వారికి వేదికల మీద ఉచితంగా పాడే అవకాశాలు మెండుగా వుంటాయి.

> ఆ అవకాశం కొందరికే సొంతం కాకుండా అందరికీ అందుబాటులో వుండాలని, ఆ శుభ దినం వెంటనే రావాలని కోరుకుందాం.

అయితే, ‘ట్రైనెట్ టీవీ లైవ్’ లో సినీ చిత్ర గీతాలతో కూడిన కార్యక్రమాలు చూస్తూ చాలామంది ప్రేక్షకులు తమ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. – గాయనీ గాయకులు తమ పెర్ఫార్మెన్స్‌ని మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని అంటున్నారు. ఆ కామెంట్స్ గురించి..మీరేమంటారు?

* కొత్త గా వస్తున్న సింగర్స్‌కి నేనొక్కటే మాట చెబుతానండి. ప్రాక్టీస్..ప్రాక్టీస్..ప్రాక్టీస్. – అంతే! మరో మాటకి తావీయొద్దు. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా వుంటాయి. అందులో ముఖ్యం గా శృతి లయ తాళం వీటి ప్రాముఖ్యత పాటకి ఎంత ప్రాణమో చాలా మంది గ్రహించడం లేదు. కనీసం బేసిక్స్ అయినా, గురు ముఖం గా నేర్చుకుని వస్తే బావుంటుందని కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

ఆ తర్వాత –

 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే. వేదిక మీద ప్రాక్టీస్ చేయ కూడదు. అంటే – సాధ నకి స్టేజ్‌ని ఉపయోగించుకోవడం ఎంతైనా కూడని చర్య. వేదిక ఒక పవిత్రమైన స్థానం. అంకిత భావంతో పాటని ప్రెజెంట్ చేయాలి. పాట పాడడాన్ని ప్రొఫెషనల్‌గా తీసుకోవాలి. సీరియస్‌గా తీసుకోవాలి. ఎంతో నిజాయితీ గా నేర్చుకుని, నిబధ్ధతతో నడుచుకోవాలి. అప్పుడే – ప్రేక్షకుల నించి మంచి స్పందన వస్తుంది. లేదంటే, ఇదిగో ఇలాటి విమర్శ లనే ఎదుర్కో వలసి వుంటుంది. బాధ పడినా, భరించక తప్పదు.

జూనియర్ సింగర్స్ అనే కాదండి సీనియర్స్ కూడా నిత్యం సాధన చేస్తుండాల్సిందే. సక్సస్‌ఫుల్ సింగర్ అయినా కాకున్నా సాధన అనేది గాయని కి వుండవలసిన మొదటి లక్షణం. అది ఒక ప్రాధమిక బాధ్యత! అని మరచిపోకూడదనేది నా సలహా.

> చాలా బాగా చెప్పారు లక్ష్మీ పద్మజ గారు అయితే, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతానికి శిక్షణా కేంద్రాలున్నట్టే, సినీ గీతాలకు కూడా ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ వుంటే ఔత్సాహికులకి ఒక గైడన్స్ దొరుకుతుంది కదా?

* ఈ ట్విన్ సిటీస్‌లో అలాటి శిక్షణా కేంద్రాలు చాలా వున్నాయండి. ప్రత్యేకించి కేవలం సినీ గీతాలకి మాత్రమే శిక్షణ నిచ్చే కేంద్రాలు చాలా నెలకొని వున్నాయి. కొత్త వారికి ఇవెంతో ఉపయోగపడతాయని నా అభిప్రాయం.

> గాయని గా మీ ప్రస్థానంలో మరపు రాని సన్నివేశాలేమైనా వుంటే చెబుతారా?

* వున్నాయండి. చాలా నే మంచి మంచి జ్ఞాపకాలున్నాయి. అందులో మరపు రానివంటే – ఊ..

శృతి లయ వారు నిర్వహించిన సినీ సంగీత విభావరికి – నేనెంతో ఆరాధించే గాన కోయిల సుశీల గారు విచ్చేసారు. వారి ఎదురుగా వారి పాటలను పాడటం అంటే ఆనందోద్వేగాలతో గుండె వొణికిందని చెప్పాలి. చెప్పలేనంత సంబరమైపోయింది మనసంతా.  నా పాటలు విని, నన్ను మెచ్చుకుని అభినందిస్తూ నన్ను సత్కరించడం – అదొక దివ్యాను భూతిని కలిగించిందని చెప్పాలి. మహా గాయని చేత అందుకున్న ఆ సత్కారం – నా జీవితంలో నేను సాధించిన ఒక విజయం గా భావిస్తాను.

* అక్కినేని గారి చేతుల మీదుగా అందుకున్న అభినందన సత్కారం ఎంతో అపురూపమైనది.

* వంశీ సంస్థ వారు ఎంతో వైభవంగా సభనేర్పాటు చేసి, నన్ను సత్కరించారు. ఆనాడు – ప్రఖ్యాత సినీ గాయనీ మణి అయిన శ్రీమతి భానుమతి పురస్కారాన్ని నాకంద చేసారు. ఆ అవార్డ్ ప్రదానోత్సవాన్ని నేనెన్నడూ జీవితం లో మరవలేని పర్వదినం గా అభివర్ణిస్తాను. వంశీ వారి గుర్తింపు పొందాలని చాలా మంది కళాకారులు కలలు కంటారు. అది చాలా త్వరిత దశలోనే నన్ను వరించిందని చెప్పాలి. ఆ నాటి కార్యక్రమంలో జస్టిస్ రామలింగేశ్వర రావు గారు పాల్గొనడం ఎంతైనా ముదావహం.

* అలాగే జి.పి ఆర్ట్స్ వారు ‘స్వర సరోజ’ అని బిరుదునిచ్చి, సత్కరించడం ఒక మరపు రాని అనుభూతి ని కలిగించింది. సినీ నటులు శ్రీ సత్యనారాయణ గారి చేతుల మీదుగా బిరుదు ప్రదానం జరగడం ఎంతైనా గర్వనీయం!

> ఇటు ఇల్లూ, సంసారం పిల్లల చదువులు బాధ్యతలతో సతమతమయ్యే మీరు – ఇన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ గాయని గా రాణించడం ఎలా సాధ్యమైంది మీకు?

 * నిజం చెప్పాలంటే నేను గాయనిగా వెలుగులోకి వచ్చానంటే అందుకు కారణం మా వారు రఘు గారి ప్రోత్సాహం ఎంతో వుందండి. గాయని గా నా కెరీర్ పట్ల నా కంటే ఆయనకే శ్రధ్ధా భక్తులెక్కువ అని చెప్పాలి. ఆయన ప్రోత్సాహమే గనకే లేకపోతే గాయనిగా నా ప్రయాణం ఇంత దూరం వచ్చేది కాదు అని మాత్రం ఖచ్చితంగా చెబుతాను.

> అంటే, ఆయన కూడా గాయకులా?

* (నవ్వుతూ) కాదండి. సింగర్ కాదు. హైకోర్ట్ అడ్వొకేట్. వృత్తిలో ఆయనెప్పుడూ బిజీగానే వుంటారు. అయినా, సంగీతం అన్నా, సినీ గీతాలన్నా, వారికి చాలా ఇష్టం. ఆయన ప్రో త్సాహమే గనక లేకపోతే నేనింత దూరం ప్రయాణించేదాన్ని కాదు.

> గాయని గా కాకపోయుంటే..

* నేనూ అడ్వొకేట్ గానే స్థిరపడిపోయుండేదాన్ని.

> అవునా? మీరూ లా చదివారా?

* అవునండి. మాస్టర్ ఆఫ్ లా చేసాను.

> ప్రాక్టీస్ చేస్తే వచ్చే ఆర్జన కంటే గాయని గా మీరు పొందే తృప్తే ఎక్కువనుకున్నారా?

* బాగా చెప్పారండి. నిజం కూడా అదే. నా పాట విని తామెంతో సేద తీరామని చెబుతూ ప్రేక్షకులు స్వయంగా కలిసి అభినందిస్తున్నప్పుడు.. వారి ముఖాలలో వెలిగే ఆ ఆనందం చూసినప్పుడు కలిగే ఆత్మతృప్తి అనిర్వచనీయం అని చెప్పాలి. మనసు ఉప్పొంగే ఆ క్షణాల్లో అనిపిస్తుంది. నాకీ తృప్తి చాలు అనే సంతృప్తి కలుగుతుంది.

> అయితే మీ కల ఫలించినట్టేనేమో కదూ?

* లేదండి. ఒక్కటి మిగిలిపోయింది.

> ఏమిటది?

* ఒక్కసారైనా బాలూ గారితో కలిసి సినిమా కోసం పాడాలని… కనీసం వేదిక మీదైనా సరే.. ఒక్కసారైనా కలిసి పాడాలని గొప్పగా ఆశ పడుతున్నాను. గాయనిగా నా తొలి, తుది కోరిక అంటూ ఏదైనా వుంటే అది – బాలు గారితో కలిసి పాడటమొక్కటే అని చెబుతుంటాను. ఈ జీవితానికి అది చాలు. ఆ పైన దేవుడి దయ ఎలా వుందో, ఏమో! (ఆశ తీరని బరువేదో స్వరంలో వినిపించింది.)

> (నవ్వి చెప్పాను) మీ కోర్కె తప్పక నెరవేరుతుంది లేండి. ఈ ఇంటర్వ్యూ చూసి బాలు గారు స్పందించి, మీ కల నిజం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నానండి.

* అవునా! అదేనిజమైతే నా అంత అదృష్టవంతురాలెవరూ వుండరేమో నండి.( అంటూ నవ్వారు సంతోషంగా.)

> బాలూ గారంటే మీకింత ఎనలేని అభిమానం వుంది కదా, మరి పాడుతా తీయగా లో పాల్గొనే ప్రయత్నం చేయలేదా ఎప్పుడూ?

* అబ్బో!! చాలా ప్రయత్నించానండి. నా ఫేవరేట్ ప్రోగ్రాం విడవకుండా చూస్తాను. అయితే ప్రోగ్రాం లో పాల్గొనే అవకాశం వచ్చినా ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల అలా.. తప్పిపోయింది. అందుకు కొన్నాళ్ళు బాధపడ్డాను.

> ఎందరో కళాకారులకు జన్మనిచ్చి, పెంచి, వృధ్ధిలోకి తీసుకొస్తున్న త్యాగరాయ గాన సభ పై మీ అభిప్రాయం?

* గానసభ అంటేనే ఎందరో కళాకారులకి శ్వాస వంటిది. ఆశ వంటింది. ఆర్టిస్ట్స్ కి ఇక్కడ దొరికే గుర్తింపు మరెక్కడా ఏ కళాకారునికీ దొరకదు అని మాత్రం ఖచ్చితం గా చెప్పాలి. శ్రీ జనార్దన మూర్తి గారు – గాన సభ బాధ్యతలు చేపట్టాక చాలా సంస్కరణలు జరిగాయి. వినూత్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. త్యాగరాయ గాన సభ వైభవం ద్విగిణీకృతమైంది అని చెప్పాలి. చాలా అభివృధ్ధి లోకి తీసుకొచ్చారు. 5 కళా నిలయాలతో త్యాగరాయ గాన సభ ప్రాంగణమంతా కళ కళ లాడుతూ కళలతో విరాజమానం గా విలసిల్లుతోంది. సంగీత సరస్వతి నాట్యం చేస్తోందన్న భావన తలపిస్తుంది.

 > నిజమేనండి. మినీ హాల్స్‌ని పునర్నిర్మాణం చేసి, అందమైన వేదికలు ఏర్పాటు చేసి, హాల్స్‌ని ఉచితం గా ఇస్తున్నారు. ఎంతైనా అభినందనీయం.

చాలా విషయాలు మాట్లాడుకున్నాం పద్మజ గారు.

మీరు మరిన్ని కార్యక్రమాలలో పాల్గొని మరింత పేరు ప్రఖ్యాతులు గాంచాలని, గాయని గా మరెన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకోవాలనీ , బాలూ గారితో కలిసి పాడాలనే మీ స్వప్నం నెరవేరాలని కోరుకుంటున్నానండి.

* మీకు కూడా నా ధన్యవాదాలండి.

 ‘ట్విన్ సిటీస్ సింగర్స్’ లో తొలి గాయని గా నన్ను ఎంచుకుని, నా ఇంటర్వ్యూని పబ్లిష్ చేస్తున్న సంచిక వారికి, సంపాదకులు శ్రీ మురళీ కృష్ణ గారికి పత్రిక ద్వారా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి.

పాఠకులందరికీ నా నమస్సులు!

> థాంక్సండి. బై ఇప్పటికి.

***

ఇదండీ, మన సినీ నూతన గాయని శ్రీమతి చిత్రపు లక్ష్మీ పద్మజ గారితో జరిపిన మాటా మంతీ! ప్రియమైన సంచిక పాఠకులు – ఈ ఇంటర్వ్యూ చదివి , మీ స్పందనలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ శీర్షికన – మరో సింగర్ ఇంటర్వ్యూ తో వచ్చే వారం తప్పక కలుద్దాం.

శలవిక!

ఎందరో మహానుభావులు అందరకీ వందనములు.

Kanulalo nee roopam song by Lakshmi Padmaja & Ramana on 29th April 2018

వంశీ ఇంటర్నేషనల్ | ప్రజానటి జమున గారికి కనకాభిషేకం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here