ట్విన్ సిటీస్ సింగర్స్-10: ‘సంగీత మహా సముద్రంలో నేనొక బిందువుని మాత్రమే….’ – శ్రీ నేమాని సూర్య ప్రకాష్

2
2

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – స్వర కర్తగా, గాయకునిగా, కర్నాటక శాస్త్రీయ సంగీత వోకలిస్ట్‌గా, తబలిస్ట్‌గా, కొన్ని చిత్రాలకు తానే సంగీత దర్శకులుగా పనిచేసి కూడా తానింకా విద్యార్ధినే అనే శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

***

[dropcap]భ[/dropcap]క్తి సంగీత సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహరాజు. మేటి అయిన రాగాలతో, అమృతమయ స్వరాలను సమకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. కర్నాటక శాస్త్రీయ సంగీతంలో మంచి పరిజ్ఞానం గల ప్రతిభావంతులు కాబట్టి, వారి భక్తి గీతాల నిండా సంగీత సరస్వతి నదిలా ప్రవహిస్తుంది. తత్ఫలితంగా, గీతాలలో భకి భావం పొంగి పొర్లుతుంది. దివ్యంగా ధ్వనిస్తుంది. దేవుని కొండమీంచి వీచిన తెమ్మెరలా మనసుని స్పృశించి భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది.

‘నారాయణ నారయణ జయ గోవింద హరే..’ అంటూ ప్రియా సిస్టర్స్ గాత్రం మృదువుగా వినిపించినా,

‘అన్ని మంత్రములు ఇందే ఆవహించెనూ’ అంటూ నిత్య సంతోషిణి స్వరం లో అన్నమయ్య పదం కొత్త పుంతలు తొక్కినా..

‘భజరే భజరే శ్రీ గణ నాధం..’అంటూ గానించిన వాణీజయరాం గీతంలో రసాత్మకమైన రసాళి రాగం లో తత్వాన్ని పొంగించినా..

అదంతా – శ్రీ నేమాని సూర్యప్రకాష్ గారి సంగీత స్వర కల్పనా సంకల్పనలో గల వైశిష్ట్యం.

వెయ్యికి పైగా ఆల్బమ్స్ చేసి, వేల గీతాలకు సంగీతం సమకూర్చి, 500 పై చిలుకు గీతాలు ఆలపించి, స్వర కర్తగా, గాయకునిగా, కర్నాటక శాస్త్రీయ సంగీత వోకలిస్ట్‌గా, తబలిస్ట్‌గా, సినిమా ఇండస్ట్రీలో సైతం – ఎన్నో భారీ చిత్రాలకు సంగీతం సమకూర్చిన హేమా హేమీ సంగీత దర్శకుల దగ్గర సహాయకునిగా, మరి కొన్ని చిత్రాలకు తానే సంగీత దర్శకులుగా పనిచేసిన ఈ ప్రతిభా మూర్తి ‘తానింకా విద్యార్ధినే ‘ అని అంటారు ఎంతో వినమ్రపూర్వకంగా!

సముద్రమంత సంగీత సాగరంలో తానొక బిందువుని మాత్రమే అంటూ తనని తాను పరిచయం చేసుకునే మహోన్నతులు. ఆయనే శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారు.

ఈ సంగీత స్రష్టను కలిసి, సంభాషించే అవకాశం కలగడం, ఆ విశేషాలను సంచిక పాఠకులయిన మీతో పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ… ఇంటర్వ్యూ లోకి వెళ్దాం.

***

♣ నమస్కారమండి.

* నమస్తే! (నవ్వుతూ.. ఆహ్వానించారు)

♣ మిమ్మల్ని కలిసి మాట్లాడాలని వచ్చాను.

 * ఫర్వాలేదు. ప్రశ్నలూ వేయొచ్చు. ( నవ్వుతూ)

♣ థాంక్సండి. అయితే, మీ అనుమతితో ఇక అన్నీ ప్రశ్నలే వేస్తాను. సార్, మీరు పుట్టింది కాకినాడ అని విన్నాను. మద్రాస్‌కి ఎలా చేరువయ్యారు?

♣ నేను పుట్టి పెరిగిందీ, చదివిందీ, సంగీతం నేర్చుకున్నదీ – అంతా కాకినాడలోనే. 1974లో మద్రాస్‌కి మకాం మార్చాను. అప్పట్నించి 2002 వరకు చెన్నై లోనే వున్నా. అంటే దరిదాపు 38 సంవత్సరాలు సంగీత విభాగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. ఒక సహాయ సంగీత దర్శకునిలా, ఒక మ్యుజీషియన్‌గా, ఒక ప్లే బాక్ సింగర్‌గా విశేషానుభవాన్ని సాధించింది అంతా మద్రాస్ లోనే.

♣ మరి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవడానికి గల కారణం?

* చంద్రబాబు నాయుడు గారు చెన్నై లోని తెలుగు కళాకారులందరూ ఇటు వైపు రావాలని ఆహ్వానించడంతో హైదరాబాద్‌కి వచ్చేయడం జరిగింది.

♣ సముద్రం లాటి కళా ఓషన్‌ని వదిలి వచ్చేస్తుంటే ఏమనిపించింది?

*నిజమే సముద్రం వంటిదే. భగవంతుని దయ కూడా అలాటిదే. ఆయన కృపతో నను ఆశీర్వదించాడు. అందుకే పెద్ద పెద్ద విద్వాంసులతో, ప్రతిభామూర్తులైన గాయనీ గాయకులతో పరిచయాలు కలిగాయి. టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి పని చెసే అవకాశాలు అందిపుచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా, పి సుశీల, బాలు, వాణీజయరాం వంటి సీనియర్ సింగర్స్‌తో పాడిస్తూ, కలిసి పాడే సదవకాశాలు కలిగాయి.

అసిస్టంట్ మ్యూజిషియన్‌గా నా అనుభవాలు అన్నీ అపూర్వాలు. మా గురువు గారు ఎస్.రాజేశ్వర రావు గారితో బాటు ఆదినారాయణ రావు గారు, పెండ్యాల గారు.. ఇలా అందరి డైరెక్టర్స్ దగ్గర పని చేసాను. ఫైనల్‌గా బాలు గారి దగ్గర కూడా వర్క్ చేసాను. అలా వర్క్ చేస్తుండంగానే మూడు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం కూడా జరిగింది. ఆ తర్వాతే – భక్తి గీతాల వైపుకి మనసు దారి తీసింది.

♣ మీరు రూపకల్పన చేసిన్న మొట్ట మొదటి ఆల్బం సార్?

* శ్రీ రామానామ గానం. అయితే, నేను మొట్టమొదటి ఆల్బం చేసినప్పుడు అనుకోలా! ఇన్ని ఆల్బంస్ చేస్తానని! భగవంతుడు ఇంతలా ఏర్పాటు చేస్తాడనీ అనుకోలా!! (ఎంతో కృతజ్ఞతా భావం నిండిన స్వరంతో అన్నారు)

♣ ఎన్ని ఆల్బమ్స్ చేసారు ఇప్పటిదాకా?

* దరి దాపు వెయ్యి చేసుంటాను.

♣ ఇది ఎన్నేళ్ళ కృషి ఫలితమో!

* అవునండి. నలభై యేళ్ళ సంగీత ప్రయాణంలో చేసినవివి.

♣ ఇదొక గొప్ప విజయం. వింటున్న మాకే ఎంతో ఆశ్చర్యంగా వుంటుంది.

* చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదే జర్నీ జరుగుతోంది ఇంకా..

♣ మీరు మాటల్లో అన్నారూ, ఇన్‌స్ట్రుమెంట్ సహకారాన్ని అందించే వారని అన్నారు?

* అవును. తబలా ప్లే చేసేవాణ్ణి.

♣ మీరు గాయకులు మాత్రమే అనుకున్నా..

* (నవ్వులు) అవును గాయకుణ్ని కూడా. కర్నాటక సంగీతంలో ప్రావీణ్యత పొందాను. వోకల్ నేర్చుకున్నా.

♣ కర్ణాటక గాత్ర కచేరీలు కూడా ఇచ్చేవారా ?

* ఎక్కువ సార్లు ఇవ్వలేదు కానీ, నా భక్తి గీతాల నిండుగా శాస్త్రీయ సంగీతమే ప్రవహిస్తుంటుంది.

♣ రేడియోలో, టీవిలో మీ శాస్త్రీయ సంగీత కచేరీలను వినొచ్చంటారా?

* వాటికంటే ఎక్కువగా నేను డివోషన్ ప్రోగ్రామ్సే చేస్తాను. నే స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరచినవి కానీ, ఇతర్లవి కానీ, అధిక శాతం భక్తి గీతాల కార్యక్రమాలనే చేసాను. సంగీత స్వర కల్పన కూడా భక్తి గీతాలకే నా ప్రాముఖ్యత అయినా, ప్రాధాన్యత అయినా అని చెప్పాలి. భక్తి గీతాలకు సంగీతం సమకూర్చడంలో గానీ, గానించడంలో గానీ నేను పొందే ఆ దివ్యానుభూతి అనిర్వచనీయనీయమైనది!

♣ 74 లో చెన్నయ్ కి వచ్చినప్పుడు… పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు?

* నన్ను ప్రప్రథమంగా స్టేజ్‌కి పరిచయం చేసిన వారు – గాయకులు రామకృష్ణ గారు. ఆ తర్వాత జి. ఆనంద్ ట్రూప్‌లో నేను ప్రధాన సింగర్‌ని, తబలిస్ట్‌ని కూడా.

♣ ఎవరి పాటలు పాడుతుండేవారు?

* రామకృష్ణ గారు – ఘంటసాల గారి పాటలు పాడుతుండేవారు, నేను బాలు గారి పాటలు పాడుతుండేవాణ్ణి.

♣ ఏ ఏ పాటలు పాడేవారు?

* (నవ్వుతూ) సినిమా పాటలంటే నాకప్పట్లో మోజు వున్న మాట వాస్తవం. ఘంటసాల గారి పాటలు పాడుతుండేవాణ్ణి. మా వూళ్ళోని వేదికల మీద కూడా.. అయితే, ఈ ట్రూప్స్‌లో వారు పాడమన్న పాటలే పాడేవాణ్ణి. బాలు గారి పాటలు ఇస్తుండేవారు. తూర్పు పడమరలో ‘శివరంజని నవ రాగిణీ’, తర్వాత, సత్యం గారు చేసిన దివ్యమైన పాట – ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’, ఫిమేల్ సింగర్ తో కలిసి ‘ఇది తీయని వెన్నెల రేయి’ ఇంకా ఇలా ఎన్నో, ఇంకెన్నో క్లాసిక్ టచ్ వున్న సాంగ్స్‌ని పాడించేవారు.

♣ వాళ్ళతో కలిసిపనిచేస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యేవారు?

* వాళ్ళు అప్పటికే సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన సెలెబ్రెటీ సింగర్స్. నిజానికి నాకు కేటాయించిన ఈ పాటలు అన్నీ వాళ్ళే పాడేసుకోగల ప్రతిభావంతులు. అయినా సరే, నాకు వేదిక మీద పాడే అవకాశాన్ని కల్పించే వారు అంటే… అది ఆ గాయకుల నిరాడంబరతకి, నిష్కల్మషమైన కళా హృదయానికి నిదర్శనం.

♣ ప్రోగ్రామ్‌లో ఎన్ని పాటలిచ్చేవారు?

* నా అదృష్టమేమో కానీ, పాటల సంఖ్యల జోలికి వెళ్ళేవాణ్ణి కాను. ఎన్ని పాటలివ్వనీండీ, – గీతాన్ని అంకిత భావంతో పాడటమే నాకు తెలుసు. ఒక్క పాటే అయినా సరే ఏ గాయకుడు కానీ, అదొక వరంగా భావించాలి అంటాను. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమెలానో ఆలోచించాలి. ఒక్క పాట అయినా చాలు. ప్రేక్షకుల హృదయాలను దోచుకునేందుకు. గెలుచుకునేందుకు. వేదిక మీద పాట పాడే అవకాశమే దేవుడు కలగచేసే ఒక మహాద్భాగ్యంగా స్వీకరించాలి.

♣ మీ మాటల్లో రామకృష్ణ గారి పట్ల మీకు గల అభిమానం మరవలేనిదనిపిస్తోంది.

* అవునవును. అందుకు కృతజ్ఞత అనుకోండి అభిమానం అనుకోండి, నా మొట్టమొదటి పాటల ఆల్బమ్‌లో రామకృష్ణ గారికే అవకాశం ఇచ్చాను. అంతే కాదు, నేను సంగీత దర్శకత్వం వహించిన సినిమాలో కూడా, ప్రప్రథమంగా రామకృష్ణ గారికే అవకాశం ఇచ్చాను. ఆ తర్వాత – చాలా మంది చేత పాటలు పాడించాను. శ్రీమతి సుశీల గారు, చిత్ర, వాణీ జయరాం, నిత్య సంతోషిణి.. ఇంకా అనేకమంది గాయనీ గాయకులున్నారు. అయితే, బాలు గారితో నాకు గల అనుబంధం మరింత ప్రత్యేకం అని చెప్పాలి.

♣ ఆల్బమ్స్ చేయడం కంటే ముందు మీరు తబలా ఆర్టిస్ట్ కదూ?

* అవును!

♣ మీరు తబలా సహకారం అందించిన సినీ గీతాల గురించి చెబుతారా?

* చాలా చిత్రాలున్నాయి. మా గురువులు శ్రీ ఎస్ రాజేశ్వర రావు గారు, పెండ్యాల నాగేశ్వర రావు గారి మ్యూజిక్ కంపోజిషన్స్‌కి ప్లే చేసాను.

♣ తబలా ఆర్టిస్ట్ నించి, మ్యూజిక్ అసిస్టంట్‌గా ఎలామారారు?

* మా గురువు గారు ఎస్. రాజేశ్వర రావు గారు నాకు లిఫ్ట్ ఇచ్చారు. వారి ఎన్నో చిత్రాలకు తబల సహకారాన్ని అందచేస్తుండేవాణ్ణి.. తాండ్ర పాపా రాయుడు సినిమాకి నన్ను అసిస్టంట్‌గా వుండమన్నారు. అప్పటిదాకా తబలా కళాకారునిగా వున్న నాకు మంచి ప్రొమోషన్ ఇచ్చి నన్నెంత గానో ప్రోత్సహించి, ఆశీర్వదించింది – మా గురువు గారు రాజేశ్వర రావు గారు. అలాగే, బహుముఖ ప్రజ్ఞా వంతులైన శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారితో కలిసి మూడు నాలుగు సినిమాలు చేసే భాగ్యమూ దక్కింది. ఆదినారాయణ రావుగారితో కలిసి ఆల్బమ్స్ చేసాను.

ఆ తర్వాత బాలు గారి దగ్గర కొచ్చే సరికి రికార్డింగ్ వున్నప్పుడు – ఆయన సాంగ్స్ నాకిచ్చేసేవారు. స్వరం – నోట్స్ రాసేవాణ్ణి. ఒక్కోసారి – ట్యూన్‌కి లిరిక్స్ వుండవు. అప్పటికి తయారవ్వవు. అప్పుడు ఆ ట్యూన్ ని పాడుతుండాలి.

♣ నాకు తెలీక అడుగుతున్నా సార్. బాలు గారికి మీరు పాడి వినిపించేవారా?

* ఆ. అవును ఎవరికైనా పాడి వినిపించాలి. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు అసిస్టంట్స్ బాధ్యత అదే కదా. ఆర్కెస్ట్రాతో పాడాలి. ట్రాక్ కూడా పాడాలి. నేను పాడాక విని, నా ట్రాక్ మీద వాళ్ళు అంటే సింగర్స్ పాడతారు. ఇదీ నా జాబ్.

♣ ట్రాక్ ముందు, ట్రాక్ మీద మీరేనన్న మాట. ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది కద సార్?

* అబ్బో. బ్రహ్మాండంగా పనికొస్తుంది. కాదు కాదు పనికొచ్చింది.

♣ ఐతే, వండి వడ్డించి విస్తట్లో పెట్టినట్టేనేమో కదా?

(నవ్వులు)

* ట్రాక్ మీద పాడింది విని శ్రధ్ధ గా నేర్చుకుంటారు సింగర్స్. ఐతే వారి గాత్ర మాధుర్యాలు వేరు కదా! దేవుడు ఒకొక్కరికి ఒకో విద్యని ప్రసాదిస్తాడు. ముఖే ముఖే సరస్వతి అని అంటారు అందుకే. మధ్యాహ్నం 2 నించి 9 వరకు రికార్డింగ్ వుండేది. మర్నాడు మళ్లా వెళ్లాలి. నా ట్రాక్ మీద ఆయన పాడుతుంటే అబ్జర్వ్ చేయాలి.

♣ బాలు గారికి మీరు పాడిన ట్రాక్ ఒకటి..

* వారి డైరెక్షన్‌లో ఒక అద్భుతమైన ట్యూన్ వుంది.

♣ ఏ సినిమా సార్?

* శిఖరం అని తమిళం లో వచ్చింది. తెలుగు లో కూడా అదే టైటిల్ అనుకుంటా…

♣ ఒకసారి పాడి వినిపించగలరా ప్లీజ్.

* వణ్ణం కొండు వెన్నెలయే.. (అడిగిన వెంటనే పల్లవి పాడి వినిపించారు. ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఎలాటి భేషజాలు లేని నిరాడంబర మేధావి.)

ఈ పాటకి వంద ఇన్‌స్ట్రుమెంట్స్ ఏర్పాటు చేసారు. కోదండపాణి స్టూడియోలో రికార్డింగ్. నా బాధ్యత – ఇన్‌స్ట్రుమెంట్స్ బిట్స్‌తో బాటు, సింగర్స్‌కి పాట నేర్పించడం కూడా వుంటుంది. ఆర్కెస్ట్రాతో రిహార్సల్, ఆర్కెస్ట్రా బాలన్సింగ్ తర్వాత వాయిస్ ట్రాక్ పాడాలి. సంగీత దర్శకులు ఎక్కడెక్కడ ఏమేం సూచనలు ఇస్తారో అవి అనుసరించుకుంటూ, ఫాలో అవాలి. నా ఉద్యోగం అదే. (నవ్వులు)

బాలు గారి దగ్గర వర్క్ చేయడం మరపురాని అనుభవం అని చెప్పాలి. అందుకు గుర్తుగా నాకీ పాట ఒక బహుమతిలా గుర్తుండిపోయింది.

♣ చాలా బావుంది సార్, ట్యూన్.

* అద్భుతమైన గీతం. వారి పాటలు ఒక ఎత్తు ఐతే, బాలు గారి సంగీత నిర్వహణలో వచ్చిన మధుర గీతాలు మరొక ఎత్తుగా నిలుస్తాయి.

♣ తనకి సంగీతం రాదు అని అంటారు మరి బాలు గారు?

* సంగీతం రాదంటారు కానీ, క్రియేటివిటీ వుంది. అది భగవంతుని వరం. గొప్ప గిఫ్ట్. అందరకీ ఆ మహావరం దక్కదు. దొరకని పెన్నిధి అంటుంటారు చూసారా అలా, మన బాలు గారికి ఆ అద్భుతమైన కళ అబ్బింది. దైవ ప్రసాదంగా!

సంగీత దర్శకత్వ నిర్వహణకి – సంగీతం వచ్చి వుండాలి. నోట్స్ రాసుకోవాలి కాబట్టి. పాడేందుకు వినికిడి జ్ఞానం, గ్రాహణ శక్తి, గాత్ర మాధుర్యం వుంటే సరిపోతుంది. అందుకే, నాకు ట్యూన్ ఇచ్చే వారు. నేను నోట్స్ రాసుకునే వాణ్ణి. చాలామంది సంగీత దర్శకులకి సంగీతంలో లోతైన ప్రజ్ఞా ప్రావీణ్యతలు లేకున్నా మధుర గీతాలను సృష్టించారు. ఉదాహరణకి – చక్రవర్తి, చలపతి రావు గార్లనే తీసుకోండి. సంగీతం అంతగా రాకపోయినా ఎన్ని మధుర గానాలని మనకి అందించారో కదూ!

♣ పాటలు పాడాలనుకునే వారికి సంగీతం రాకున్నా ఫర్వాలేదంటారా?

* వచ్చి వుంటే అడ్వాంటేజ్ ఏమిటంటే, స్వరం రాసుకుని పాడేయొచ్చు. అలా సజావుగా, ఈజీగా, కష్టపడకుండా సుఖంగా పాడేయొచ్చు. బట్టీ పట్టి పాడిందానికీ, సంగీత పరిజ్ఞానంతో పాడిన గీతానికీ తేడా వినిపిస్తుంది. బాలూ గారికి సంగీతం రాదనుకోవడమూ పొరబాటు. ఆయన తెలుగు వారు గర్వించదగిన అద్భుతమైన గాయకులు. ఎలా అంటే, సంగీత దర్శకులు ఆయనకి పాట పాడి వినిపిస్తారు. కానీ ఆయన అది విని, అంతకంటే వెయ్యి రెట్లు అద్భుతంగా పాడి చూపిస్తారు. అది ఆయనకున్న స్కిల్. దేవుడిచ్చిన వరం. గాడ్ గిఫ్ట్. ఆరోజు నించి ఈ రోజు వరకు వారి స్వరం అలానే చెక్కు చెదరకుండా వుందంటే, అదంతా గొప్ప అదృష్టం. వారు చేసుకున్న పుణ్యం.

♣ గాయకులుగా వెలుగులోకి వచ్చాక, ఇన్‌స్ట్రుమెంట్‌ని వదిలేయాల్సి వచ్చినందుకు ఎపుడైనా వెలితిగా ఫీలయ్యేవారా?

* అదేం లేదు. ఎందుకంటే, గాయకునిగా నాకు మంచి మంచి అద్భుతమైన అవకాశాలు ముప్పిరిగొన్నాయి. అదీ కాకుండా, ఆ తర్వాతి కాలంలో నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి పాటల కంపోజిషన్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడంతో తబలిస్ట్‌గా నా కెరీర్ ని మిస్స్ అయ్యాననుకునే చాన్సే లేదు.

(మిగిలిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు.. తదుపరి భాగంలో)

***

    

***

నారాయణ నారాయణ జయగోవింద హరే | Narayana Narayana Jaya Govinda Hare by Priya Sisters

***

***

Paahi Ramaprabho || Bhaktha Ramadasu | Sung By Nemani Suryaprakash

***

Eethadu Tharaka Brahmam | Annamayya Keerthana | Nemani Suryaprakash | Annamayya Sankerrthanalu

***

Sri Kasi Viswanath Suprabhatam | Music by N.Surya Prakash

***

Sri Annamyya Keerthanalu – Veevela Roopala

***

Aa Yedu Kondala || Bhaktha Ramadasu || Lord Balaji Devotional

***

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here