ట్విన్ సిటీస్ సింగర్స్-10: ‘సంగీత మహా సముద్రంలో నేనొక బిందువుని మాత్రమే….’ – శ్రీ నేమాని సూర్య ప్రకాష్ – 3వ భాగం

0
2

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – స్వర కర్తగా, గాయకునిగా, కర్నాటక శాస్త్రీయ సంగీత వోకలిస్ట్‌గా, తబలిస్ట్‌గా, కొన్ని చిత్రాలకు తానే సంగీత దర్శకులుగా పనిచేసి కూడా తానింకా విద్యార్ధినే అనే శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

యువతకి నా సందేశంగా చెప్పేదొకటే: పుస్తకాలలో సబ్జెక్ట్స్ చదివి ఎలా ఆకళింపు చేసుకుంటున్నారో, ఫిజిక్స్, బయోలజీ, కెమిస్ట్రీ, మాత్స్ వంటి క్లిష్టతరమైన అంశాలలో ఎంత లోతైన విశ్లేషణా తత్వాన్ని పట్టుబట్టి వొంటపట్టించుకుంటున్నారో.. అంతే పట్టుదలతో సంగీత అధ్యయనానికి కట్టుబడి వుండాలి. శ్రద్ధా భక్తులతో, అంకిత భావంతో నేర్చుకోవాలి. దీక్షతో కష్టపడాలి. కఠిన సాధన చేసి, రాగాలను శోధన చేయాలి. రాగాల విలువలు, నైపుణ్యాలు, ఏమిటీ, ఏ రాగాలు నేర్చుకోవాలి? ఏ ఏ రాగాలు పాడి విదుషీమణులుగా ఎవరెవరు ఎలా పేరు గాంచారు? వారు గానించిన ఆ రాగం యొక్క ప్రాముఖ్యత ఏమిటీ? ఎందుకు వారు ఆ రాగాన్ని ఎంచుకున్నారు? అందులో గల మాధుర్య మహిమలు ఏమిటి? అనే రహస్యాలను, అంశాలను పరిగణనలోకి తీసుకుని అన్వేషణ సాగించాలి. శోధన, సాధన, విచారణ, విశ్లేషణ.. చాలా అవసరం విద్యార్ధులకి. సముద్రంలో ఎన్ని ఆణిముత్యాలు దాగుంటాయో! సంగీతమనే మహా సముద్రంలో కూడా అంతే. అద్భుతమైన రాగ సంపద దొరుకుతుంది. ఎంత అన్వేషిస్తే అంత సంపదా సొంతమౌతుంది. సంగీతంలో నిష్ణాత పొందాలి అంటే, పేరు ప్రఖ్యాతులు గడించాలీ అనే కోరిక, ఆశయం వుంటే ఇంత – ఒక ప్రొఫెషనల్ కోర్స్‌కి ఎంత కష్టపడతారో అంతే శ్రమతో, నియమ నిబద్ధతలతో నేర్వాల్సిందే! అవును. సంగీతం అంత గాఢమైన సబ్జెక్ట్. ఎంత శోధించినా విషయం ఇంకా మిగిలే వుంటుందనేది నా ప్రగాఢ అభిప్రాయం.
ఇరవై నాలుగ్గంటలూ సంగీతాన్ని వింటుండాలి. కనీసపు అవగాహన కోసం రేడియోని వినండి. అలా అన్ని రాగాలు పరిచయమౌతాయి. విన్నదాన్ని ఆకళింపు చేసుకోవాలి. పర్యవేక్షించాలి. లేకపోతే ఫీల్డ్‌లో నిలబడటం కష్టమౌతుంది. చాలా మంది ప్రతిభ గల వారే అయినా, ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం చూస్తాం. మనకున్న రాగాల నించే ప్రయోగాలు చేసి, కొత్త రాగాలని కనిపెట్టగలగాలి. ప్రజారంజకంగా రాగాలని మలచగలిగి వుండాలి. అది క్రియేషన్ ‘ప్రయోగాల పుట్ట సంగీతం’ అని మరచిపోకూడదు. నీ సృజనకి ఆకాశమంత అవకాశాన్నిస్తుంది సంగీతం. ఇవన్నీ అనుసరించే సంగీత విద్యార్ధులకు – ఢోకా లేనే లేదు. సంగీతం అందరకీ అబ్బే విద్య కాదు. నేను – ఈ సంగీత సింధువు లో కేవలం ఒక బిందువుని మాత్రమే!

***

[dropcap]స[/dropcap]ముద్రమంత సంగీత సాగరంలో తానొక బిందువుని మాత్రమే అంటూ తనని తాను పరిచయం చేసుకునే మహోన్నతులు శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారు. ఈ సంగీత స్రష్టను కలిసి, సంభాషించే అవకాశం కలగడం, ఆ విశేషాలను సంచిక పాఠకులతో పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ… ఇంటర్వ్యూ 3వ భాగం లోకి వెళ్దాం.

***

♣ షిరిడీ హారతులు పాటల ప్రత్యేకత గురించి తెలుసుకోవాలనుంది.

* షిర్డీ హారతులు నేనే మొట్టమొదటి సారిగా చేసాను. నలుగురు సింగర్స్తో పాడించాను. అన్నీ హిట్ అయినవే కానీ, వాణీ జయరాం పాట మాత్రం చాలా ప్రజాదరణ పొందింది. ‘జయ జగదీశా.. జగన్నివాశా.. మనసే హారతీ..” అనే ఈ గీతం పాపులర్ అయింది. చాలా మంది భక్తిగా పాడుకునే పాటగా మిగిలిపోయింది.

*నళిని శ్రీదేవి: ఈ పాట తను చేసినట్టు గురువు గారే మరచిపోయారు (నవ్వులు). నేనొక ప్రోగ్రాంలో పాడుతుంటే గురువు గారు విని ‘ఈ పాట నాకు బాగా తెలిసిన పాటలా వుంది.. ఎక్కడో విన్నానే!? ‘ అని సందేహంగా అనుకున్నారట. ప్రోగ్రాం అయ్యాక, నేను ఇంటికొచ్చి కాసెట్ మీద పేరు చూసి, అమ్మో ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తోనా!! నేను కలిసి పాడాను!?- అని ఆనందపడిపోయాను.

*నేమాని సూర్య ప్రకాష్ గారు: ఆ పాటతో నాకు గల అనుబంధం గొప్పదని చెప్పాలి. ఆ సాంగ్ ట్రాక్ చేసి రెడీ చేసాను. ఆ రోజు రికార్డింగ్ మధ్యాహ్నం రెండింటికి. సరిగ్గా రెండు నిముషాల ముందుగానే వచ్చారు వాణీ జయరాం గారు. నోట్స్ రాసుకున్నారు. పాట నేర్చుకున్నారు. పాడారు. రికార్డ్ చేసాం. రిలీజైపోయింది. ఈ ఆల్బంలో ఈ పాటే చాలా హిట్ అయింది.

♣ మీరు ముందే ఊహించారా, ఈ హారతి ఇంతలా మారుమోగిపోతుందని?

* అలా అనుకోలేదు. ట్యూన్ చేసి, రికార్డ్ చేసి, విడుదలయ్యే దాకా ఏ పాట హిట్ అవుతుందో చెప్పలేం. సుశీల గారు కూడా పాడారు అదే ఆల్బంలో అది కూడా చాలా మంచి పాట.

♣ ఏ రాగంలో వుంది సార్ ఈ పాట?

* పిలూ లో చేసాం. దాంట్లో కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సి వచ్చింది.

♣ ఒకసారి వాణీ జయరాం గారు ట్రాక్ విని ఇది ఏ రాగం అని అడిగి తెలుసుకున్నారని చెప్పారు?

* అవును. రసాళి రాగం! ఆ నాటి సీనియర్స్ సంగీత దర్శకులు కూడా చేయనటువంటి రాగాన్ని తీసుకుని గీతాలుగా మలిచాను. అద్భుతమైన స్పందన లభించింది. వాణీ జయరాం గారికి ఈ పాట వినిపించాను. ‘భజరే భజరే శ్రీ గణ నాథం…భజరే భజరే అనాథ నాథం..’ ఆవిడ పాట వినంగానే ఎంతో ఆసక్తిగా రాగం పేరు అడిగి తెలుసుకున్నారు.

♣ అంత గొప్ప రాగాన్ని నేర్పిన మీ గురువు గారి గురించి తెలియచేస్తారా?

* మహా విద్వాంసులు – శ్రీ అల్లం రాజు సోమేశ్వర రావు గారు. మా అక్క శాంతాదేవి గారికి, నాకు కూడా వారే గురువులు. నాకు తొలి గురువు మా అక్క గారే. మా గురువు గారు కాకినాడలో వున్నారు. వారి వయసు 96 సంవత్సరాలు. ఆ తర్వాత మద్రాస్‌లో ఘంటసాల గారింట్లో నాలుగైదేళ్ళు వుండి సంగీతంలో మరి కొన్ని మెళకువలు నేర్చుకున్నాను.

♣ జానపదం సంగీత బాణీలో కూడా మీరు ఆల్బం చేసినట్టు గుర్తు!

* అవునవును. చేసాను. ఎల్ ఆర్ ఈశ్వరి గారి చేత పాడించాను. – అమ్మ వారి మీద పాట. ‘అమ్మలగన్న అమ్మ వే… కలకత్తా కాళీ మహం కాళి వే..’ (పల్లవి పాడి వినిపించారు). జానపద బాణీ లో చేసాను. ఎంతో చక్కగా పాడారు ఆ గాయని. బాగా హిట్ అయింది. అయితె జానపదం లో తక్కువ సాంగ్స్ చేసాను.

♣శాస్త్రీయమైనా, జానపదమైనా పదసాహిత్యం సంగీతాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారా?

* తప్పకుండా నమ్ముతాను. సంగీత సాహిత్యాలు రెండూ పక్క పక్కనే వుంటాయి కాబట్టి, సాహిత్యాన్ని బట్టి సంగీతం ప్రకాశిస్తుందని నిశ్చయంగా చెబుతా. అందుకు నా ఆల్బమ్సే సాక్షి. నేను ఎంతో కష్టపడి సంగీతాన్ని కూర్చిన ఆల్బమ్స్ సంగీత పరంగా ఎంత బావున్నా సరైన సాహిత్యం సమకూరని కారణం చేత అంతగా వెలుగులోకి రాలేకపోయాయి.

♣ ఎందుకిలా జరుగుతుంది?

* ఎందుకిలా అంటే, ‘చేయనని’ చెప్పలేకపోవడం వల్ల జరుగుతుంది. (నవ్వులు). అవునండి. నేను చేయకపోతే మరొకరితో కంపోజ్ చేయించుకుంటారు కానీ ప్రొడ్యూసర్ ఆగరు కదా.

♣ చాలా పాపులర్ అయిన మరి కొన్ని మీ ఆల్బంస్ చెబుతారా?

* తమిళంలో కూడా బాగా హిట్ అయినది ‘రామకృష్ణ గోవింద నారాయణా.. నారాయణ హరి..’ అనే ఆల్బం. మాల్గుడి శుభ గానం చేసిన ‘ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం.. బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం..’ ఇది హోరెత్తిపోయిన హిట్‌గా అభివర్ణించారు.

♣ భక్తి కాకుండా ఇతర అంశాలను ప్రధానం గా తీసుకుని ఆల్బంస్ ఏమైనా చేసారా?

* చేసానండి. పెళ్ళి చూపులు, శ్రీమంతం, పుట్టినరోజు పాటలు చేసాను.

♣ మీకు సంబంధించింది కాకపోయినా, అడుగుతున్నానండి. గీతాల రీ మిక్సింగ్ మీద అభిప్రాయం?

* నేనెక్కువగా వాటి జోలికి పోను. (నవ్వులు). … రీమిక్సింగ్ వల్ల సాహిత్య విలువలు చెదిరిపోతాయి.

♣ ఈ నేపథ్యంలో వస్తున్న మార్పు హర్షించదగినదే అని అనుకోగలమా?

* ఎవరైనా మార్పుని ఒప్పుకోవాల్సి వస్తుంది. తప్పదు. వ్యతిరేకించలేం. నాకీ పాట నచ్చలేదంటే.. మనల్ని తీసేసి వేరే వాళ్లతో ప్రోగ్రాం చేయించుకుంటారు. అంతేగా తేడా!

♣ సాహిత్యం లోని లోపాలకు సాధారణంగా ఎవరు బాధ్యత వహించాల్సి వుంటుంది?

* మ్యూజిక్ దర్శకులేమీ చేయలేరు. కానీ, సాహిత్య పరమైన దోషాలకి మాత్రం ప్రొడ్యూసర్‌దే బాధ్యత. ఆయనకిష్టం లేకపోతే ఏదీ జరగదు. అయితే ఇది భక్తి రాజ్యంలో నాకెప్పుడూ ఎదురు కాలేదు.

♣ మీ స్థాయిలో శిష్యులను తయారు చేస్తున్నారా? అందుకు తగిన శిక్షణనివ్వడం జరుగుతోందా?

* ఇదిగో ఉదాహరణగా నళిని గారు..

వెంటనే అందుకుంటూ నళిని: వొద్దు వొద్దు. వారి స్థాయి ని నేనెప్పటికీ అందుకోలేను. పోల్చడం కూడా సరి కాదు. నేను వారి అసిస్టెంట్‌ని మాత్రమే. నాకిది చాలు. ఈ పోస్ట్ చాలు. ఇదే నాకు మహాభాగ్యం. గురువుగారు అభిమానంతో అలా అంటారు కానీండీ, నేను కొన్ని జన్మలెత్తాలి. గురువు గారి స్థాయి ని చేరాలంటే.. (నవ్వులు)

* సార్, మీ చేత ప్రోగ్రామ్స్ చేయించుకోవాలనుకునే వారికి మీరు అందుబాటులో వుంటారా?

* నా ఆశయమే అందరకీ అందుబాటులో వుండాలని, వీలైనంత అధిక సంఖ్యలో సంగీత సేవలను అందించాలనే సంకల్పంతో ముందుకునడుస్తున్నా.

♣ అందుకున్న వారికి అందుకున్నంత అవకాశమని చెప్పొచ్చు!?

* తప్పకుండా ( నవ్వులు).

* నళిని : హిటయిన అయ్యప్ప స్వామి పాటలు మరచిపోయారు గురువుగారు! (నవ్వులు)

* నేను చేసిన ఆల్బమ్స్ గురించి నాకంటే నా శిష్యులకే బాగా గుర్తు. ‘మేలుకోవయ్యా తూరుపు తెలవారే.. కస్తూరి గంధాలు నీ కోసమే..కావళ్లల్లో నెయ్యి నీ కోసమే..’ – జి. శ్రీనివాస్ గారు అద్భుతంగా పాడారు.

♣ ఇప్పటికి ఎన్ని గుర్తు చేసారో నళిని గారు.. చాలామంది ఒకటికి రెండు చేసి చెప్పుకుంటారు. మీరు చేసిన ఆల్బమ్స్ కూడా మరచిపోతున్నారు? ఎందుకని? (నవ్వులు)

*ఎందుకంటే ఆల్బం చేయడానికి ముందున్న అంకిత భావం, శ్రధ్ధ, స్వరాల కూర్పుల శ్రమ, అన్నీ కూడా పాటల రికార్డింగ్ అయాక, రిలీజై విజయాన్ని పొందాక ఇక రిలీఫ్ వచ్చేస్తుంది. నా బాధ్యత పూర్తయింది అని సంతృప్తిగా నిట్టూర్చడంతో ఇక ఆ విషయాన్ని మరచిపోతా. ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ రావడం, ఒప్పుకోవడం మళ్ళా రాగాల అన్వేషణ, కూర్పుల సమ్మేళనలలో .. ఈ రిలీజైన ఆల్బమ్స్ నా మెమరి కార్డ్ లోంచి డిలీట్ అయిపోతుంది. అదీ సమస్య. (నవ్వులు).

♣ భక్తి గీతాలలోకూడా దేవతల పేర్ల మీద, అవతారాల మీద మాత్రామే కాకుండా వాగ్గేయకారుల కీర్తనలని కూడా క్లాసికల్ ఆల్బమ్స్ గా తీసుకు రావడం జరిగిందా?

* అన్నమాచార్యుల కీర్తనలు, రామదాసు కీర్తనలు, అవే ట్యూన్స్ తో చేసాను. మంచి స్పందన వచ్చింది.

♣ కానీ, సాంప్రదాయ పధ్ధతిలో బ్రహ్మ కడిగిన పాదం, అలాగే వందేమాతరం ట్యూన్స్ విభిన్న రాగంలో కూడా చేసారు కదూ?

* అవునండి బ్రహ్మ కడిగిన పాదము మా గురువు గారు ఎస్ రాజేశ్వర రావు గారు చేసారు. ఇప్పుడు వెలుగులో వున్న ముఖారి రాంగలో వున్న కీర్తన శ్రీ నేదూరి కృష్ణమూర్తి గారు చేసారు.

♣ ఈ రోజుల్లో పేరెంట్స్ మీ నాన్నగారిలా ధైర్యం చేయలేపోతున్నారనిపిస్తుంది. చదువుకి మాత్రమే ఇంప్రార్టన్స్ ఇవ్వడం జరుగుతోంది కదా, దీని పై మీరెలా స్పందిస్తారు?

* నా స్వవిషయానికొస్తే నాకు నా తండ్రి గారి సంకల్పంతో బాటు ఆ భగవంతుడు చాలా సాయం చేసాడండి. మ్యూజిక్‌ని జీవనాధారంగా చేసుకుని బ్రతకడం అనేది చాలా అసాధ్యమైన పని. సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై యేళ్ళుగా సాధన చేస్తూ ఇప్పటికీ, రాణిస్తునాను అంటే , అదంతా భగవంతుని అనుగ్రహంగా భావిస్తాను.

♣ హార్ధికంగా ఆర్ధికంగా మీ ఫీల్డ్ మీకు సంతృప్తిని కలిగించిందా?

* ఓ యస్. బ్రహ్మాండంగా.సందేహమే లేదు. విశేషమైన ఆదరణాభిమానాలు, పేరు ప్రతిష్ఠలు సంగీతం వల్లనే లభించాయి అంటే అతిశయోక్తి లేనేలేదు. మ్యూజిక్ డైరెక్షన్ అంటే క్రియేటివ్ పవర్. ఈ సృజనాత్మకతకి సినిమా అనే కాదు ఏ రంగంలో వున్నా రాణించవచ్చు. . నేను భక్తి రసాన్ని ఎంచుకున్నా. ఆర్ధికంగా కూడా సంతృప్తి కరంగా వుంది. నా ఈ 68 యేళ్ల వయసులో, నలభై యేళ్ళుగా ..ఇంకా ఆర్ధికార్జన నడుస్తోందంటే ఇంతకన్నా సక్సస్ ఏం కావాలి? గవర్నమెంట్ ఉద్యోగం చెసి, రిటర్మెంట్ తర్వాత పెన్షన్ కన్నా అధిక మొత్తాన్ని అందుకుంటున్నాను. అంతకంటే ఏం కావాలి? భగవంతుని కృప వల్ల నాకు రిటైర్మెంటన్నదే లేదు. (పరిపూర్ణమైన సంతృప్తి ధ్వనించింది వారి మాటల్లో)

♣ భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్లాన్ చేస్తున్నారా?

* ప్రెజెంట్ ప్లాన్సే కంటిన్యూ అవుతుంటాయి. పాటలు కంపోజ్ చేసుకోవడం, రికార్డింగ్ చేసుకోవడం, ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పాడుకోవడం.. పాడుకుంటూ ముందుకు సాగిపోవడం.. చాలా సింపుల్ ప్లాన్స్. (నవ్వులు). అంతే కాదు, పిల్లలకి ప్రత్యేక సంగీత శిక్షణ ఇస్తున్నాను. కర్నాటక సంగీతంతో బాటు లలిత గీతాలు, సినీ గేయాలు నేర్చుకోవాలనుకునే వారికి, తగిన తర్ఫీదుతో బాటు, ఎలా మెరుగులు దిద్దుకోవాలో శిక్షణ నిస్తున్నాను. నా క్లాసులు మంచి ఫలితాలనిస్తున్నాయని చెబుతుంటారు పిల్లలు. సంతోషంగా వుంటుంది. ప్రత్యక్షం గా వచ్చి నేర్చుకునే వారూ వున్నారు, సమయం లేని వారి కోసం స్కైప్ ద్వారా క్లాసెస్ నిర్వహిస్తున్నా.

♣ ఇంటర్వ్యూ ద్వారా చాలా ఆసక్తికరమైన విషయాలు, విశేషాలను మన ‘సంచిక’తో పంచుకున్నందుకు చాలా సంతోషమండి.

* చాలా సంతోషమమ్మా. నాకు గుర్తులేని సంగతులు కూడా నాతో చెప్పించుకునారు. (నవ్వులు) సంచిక సంపాదకులకి, మీకు నా ధన్యవాదాలు.

♣ ధన్యవాదాలు సార్. నమస్తే.

***

  

***

  1. Alarulu

  1. Thandanaana

  1. Jagnamatha Telugu Devotional Songs Jukebox || N.Surya Prakash ||

4 E Divilo Virisina Song | Nemani Suryaprakash Performance|Padutha Theeyaga|28th January 2018|ETV

  1. Sri Kasi Viswanath Suprabhatam | Music by N.Surya Prakash

6 Neelakandara || Sakaladevatala Sthuthi || Lord Shiva Sanskrit Devotional || N.Surya Prakash

8 Mangala Harathi

9 SIGARAM – TAMIL FILM SONGS – JUKEBOX || KJ YESUDAS, SP BALASUBRAHMANYAM || VIJAY MUSICALS

10 Nemani Suryaprakash – Listen to Nemani Suryaprakash songs/music online – MusicIndiaOnline
Listen

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here