Site icon Sanchika

ట్విన్ సిటీస్ సింగర్స్-2: ‘మధుర గాన కళ్యాణి ‘ బిరుదుకి తగిన గాయని – నాగేశ్వరి!

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన గాయని ‘మధుర గాన కళ్యాణి’ – రూపాకుల వెంకట నాగేశ్వరి గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్ దమయంతి. [/box]

[dropcap]శా[/dropcap]స్త్రీయ సంగీతమెరిగిన గళం. ఏ గీతంలో అయినా అలవోకగా వొదిగి, ప్రవహించగల కంఠ స్వరం ఆమె సొంతం. ఆమె – ఒక సుస్వర ఝరి. రాగ రస మంజరి. ‘మధుర గాన కళ్యాణి’ – శ్రీమతి నాగేశ్వరి! వీరి పూర్తి పేరు రూపాకుల వెంకట నాగేశ్వరి.

నెల్లూరులో పుట్టి పెరిగారు. విద్యనభ్యసించారు. సంగీతంలోనే కాదు, చదువులో కూడా వీరు ప్రతిభావంతురాలు. క్లాస్ ఫస్ట్. స్కూల్ మెరిట్. బికాం పూర్తి చేసి, సి.ఎ. చేస్తుండంగా, స్టేట్ బాంక్‌లో ఉద్యోగం రావడం, అక్కడితో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టల్సి రావడం జరిగిందంటారు.

 1986 లో శ్రీ గోపీ కృష్ణ గారితో వివాహమైంది. ఆయన వృత్తి రీత్యా స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో డి.జి.ఎం.గా ఉన్నత ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఇద్దరు పిల్లలు. – విజయకృష్ణ ప్రతాప (సిస్టం ఎనలిస్ట్), వినయకృష్ణ ప్రతాప. బి.టెక్.

28 సంవత్సరాలు బాంక్ ఉద్యోగినిగా తన బాధ్యతలు నిర్వహించి, జనవరి 2014లో పదవీ విరమణ చేశారు.

పువ్వు పుట్టగానే పరిమళించిన చందాన, నాగేశ్వరి పిన్న వయసు నించి పాటలు పాడుతుండేవారు. సంగీతంపై మక్కువతో చిన్నతనం నించి ప్రముఖ విద్వాసూరాలైన తల్లి సుభద్రమ్మ గారి వద్ద కర్ణాటక గాత్ర సంగీతం, ‘నెల్లూరు సంగీత నృత్య కళాశాలలో’ శ్రీ రమణారావు గారి వీణా వాద్యము అభ్యసించి, గాత్రమునందు, వీణ యందు, హైయ్యర్ సెర్టిఫికెటును పొందారు. అనేక ఇంటర్ స్కూల్ పోటీలలోనే కాక జిల్లా, రాష్త్ర స్థాయీ పోటీలలో కూడా పాల్గొని, ప్రథమ స్థానంలో నిలిచి, లెక్కలేనన్ని బహుమతులను గెలుచుకుని, గాన విజేతగా పేరు పొందారు.

పుట్టింది తెలుగు రాష్ట్రంలోనే అయినా, తల్లి గారు, తమిళ రాష్ట్రానికి చెందిన వారు కావడాన, తమిళం కూడా తనకు మాతృభాష వంటిదే అంటారు. ఇవి కాకుండా హిందీలో గట్టి పట్టు వుంది. ఈ మూడు భాషల్లోనూ ఉచ్చారణా దోషాలు లేకుండా అవలీలగా పాడేయగల ప్రజ్ఞాశాలి ఈ గాయని. పాటకి భావం ప్రధానం. భావానికి భాషా జ్ఞానం మూలం కదా!

విద్యార్ధి దశలో తన అనుభవాన్ని సంచికతో పంచుకుంటూ – “ప్రముఖ గాయని ఎస్పీ శైలజ కూడా నా సహ విద్యార్ధిని. మేమిద్దరం కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలలలో పాలు పంచుకున్నాము.’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇదే సమయం వారి అనుభవాలను అక్షరానికెక్కించడానికన్నట్టు వెంటనే నా ఇంటర్వ్యూ ప్రారంభించాను. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సేకరించాను. ఎలా అంటే, ఇలా..

> శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రావీణ్యత సాధించిన మీరు సినీ సంగీతం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

* మా అన్నయ్య శ్రీ నాగరాజు నెల్లూరులోనూ, ఒంగోలు లోనూ సాంస్కృతిక సంస్థలు స్థాపించి కళా సేవ చేస్తుండేవారు. ఆ కార్యక్రమాలలో నేను పాల్గొనడం, సినీ గీతాలు ఆలపీంచడం తప్పని సరిగా జరిగేది. సినీ గీతాలే కాకుండా, లలిత గీతాల్ను పాడేదాన్ని. అప్పట్లో నేనూ, మా అక్కయ్య – అనూరాధ కలిసి విజయవాడ, హైదరాబాద్ ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ వుండేవాళ్ళం.

 > మీ సోదరుని కళా సంస్థ లో కాకుండా, మీ తొలి సినీ విభావరి ఎక్కడ శ్రీకారం చుట్టుకుంది?

* (నవ్వుతూ) ఇది చెప్పాలంటే, చాలా యేళ్ళ వెనక్కి వెళ్ళాలి. మా నాన్న గారు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. మా గురించి తెలిసిన ‘ముదివర్తిపాళెం స్కూల్’ హెడ్ మాస్టారు గారు వారి స్కూలు వార్షిక దినోత్సవానికి నన్నూ, మా అక్కయనీ కలిసి పాడమని అడిగారు. కార్యక్రమం జనమనోరంజకంగా వుండాలనే తపనతో సినీ సంగీత విభావరి చేశాం. ప్రేక్షకులు చప్పట్ల వర్షంలో తడిసి మునిగాం అని చెప్పాలి. ఆనాటి ప్రోగ్రాం జయప్రదం అయినందుకు స్కూలు వారు సంతోషంతో చేసిన ఆ అపురూప ఆత్మీయ సత్కారం మాకొక దైవ ఆశీర్వాదం వంటిదని చెప్పాలి. మరపురాని జ్ఞాపిక. వారి ఆదరణాభిమానాలు ఎంత విలువైనవంటే, వెలకట్టలేనంత!

> తొలి ప్రదర్శనే ఘనవిజయం సాధించిడం ఏ కళాకారిణి కైనా మరపురాని అనుభవం కదూ?

* నిజమండి. ఆ అనుభవం మాటలకందని వర్ణనాతీతం. ఆ క్షణంలో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాం. కానీ ఆ అవకాశాన్నికల్గించిన వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే.

> మీ కార్యక్రమాలు స్వయంగా చూసిన దాన్ని కనక అడుగుతున్నాను. మీకు శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యత వుంటం మూలాన, సినీ గీతాలు అంత అందంగా పాడగలుగుతున్నారని నా అభిప్రాయం. మీరు చెప్పండి, సినిమా పాటలు పాడటానికి సంగీత పరిజ్ఞానాన్ని కలిగి వుంటం అవసరమంటారా? వుంటే, అదెలా తోడవుతుంది? తోడ్పడుతుంది?

* చాలామంది అనుకుంటారు. సినీగీతాలు పాడటానికి సంగీతం అవసరం లేదని. శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు మన తెలుగు వారి పుణ్యం కొద్దీ ఈ గడ్డమీద పుట్టిన గంధర్వుడు అని ఒప్పుకోక తప్పదు. ఆయన సంగీతం నేర్చుకోకున్నా స్వరజ్ఞాని. అత్యంతద్భుతంగా పాడేయగలరు. సామాన్యులకందరకీ అలా సాధ్యమౌతుందా! సాధ్యం కాదు. – ఏ సినిమా పాట పాడటానికైనా గాయకులకు శాస్త్రీయ సంగీతంలో కనీసపు మూలాధారాలు, బేసిక్స్ అయినా తెలిసిఉండాలి. అప్పుడే శృతిలో పాడటం, లయ తప్పకుండా పాటను పూర్తి చేయడం వీలౌతుంది.

> శాస్త్రీయ సంగీతానికీ సినిమా సంగీతానికీ మధ్య గల పోలిక ఎలాటిదంటారు?

* శాస్త్రీయ సంగీతం పాడేటప్పుడు అక్షరాలను కానీ గమకాలను కానీ పెర్ఫెక్ట్‌గా పాడితే చాలు. కానీ, సినిమా పాటలో అక్షరాలు ఉచ్చరించేటప్పుడు అవరోహణకు వచ్చేసరికి చాలా సున్నితంగా అందంగా మృదువుగా పాడాల్సి వుంటుంది. శాస్త్రీయ సంగీతంలో ఒకసారి ఒక సంగతి పలకపోతే, రెండోసారి అదే సంగతిని క్షుణ్ణంగా సృజించే అవకాశం పుష్కలంగా వుంటుంది. ఆ వెసులుబాటు సినిమా పాటలో దొరకదు. పాట రికార్డింగ్ లో ఎన్ని సార్లు గమకం వుంటుందో అన్ని సార్లే అనుసరించాల్సి వుంటుంది.

> మీరు చెప్పినట్టు సంగీతం తెలిసి వుంటం చాలా అవసరమే. అయితే, శాస్త్రీయ సంగీతాన్ని రోజూ సాధన చేస్తుండాలి, లేకపోతే మరచిపోయే ప్రమాదముందని అని అంటారు కదా? నిజమేనా?

* అవునండి. నిజమే. సినీ గానం కూడా సంగీతం లానే రోజూ ప్రాక్టీస్ చేస్తుండాలి.

 > మీరు ఎంత సమయం సంగీత సాధనకి కేటాయిస్తుంటారు?

* కనీసం రెండు గంటలు తక్కువ కాకూండా సాధన చేస్తాను. ప్రస్తుతం నేను ఆన్లైన్ సంగీత పాఠాలు చెబుతున్నాను. నా స్టూడెంట్స్ – వర్ణాల వరకు వచ్చారు. అదే నాకు పెద్ద అభ్యాసం.

ఇది కాకుండా, నేను రోజంతా పని చేసుకుంటూ, వంట చేస్తూ గాన సాధన చేస్తూనే వుంటా. వాకింగ్ కెళ్తూ.. కూడా పాటలు వింటూనో, లోలోన హమ్మింగ్ చేసుకుంటూనో సాధన్లోనే వుంటాను. ఇదంతా మ్యూజిక్ ప్రాక్టీసే!

>ప్రాక్టీస్‌కి టైం దొరకడం లేదనే వారికి మీ మాటలు ఒక మంచి మార్గాన్ని సూచిస్తున్నాయి. గొప్ప ఉపాయమే చెప్పారు.

(నవ్వులు)

> మీరింత సాధనలో వున్నారు కదా. అయినా, ఇప్పటికీ ఈ సినిమా పాట పాడటం కష్టంగా వుంది అని అనిపించేంత కష్టతరమైన పాట ఏదైనా వుందా?

* వుందండి. భలే అమ్మాయిలు చిత్రంలో – ‘గోపాల జాగేలరా..’ లీల, ఎం.ఎల్. వసంతకుమారి గారు ఆలపించిన ఆ గీతం నిజంగానే అతి క్లిష్టమైన కంపోజిషన్. వేదిక మీద నాకెప్పుడూ ఈ పాట ఒక చాలెంజే.

> అలాగే, ప్రతి ప్రొగ్రాం లోనూ మీరు తప్పని సరిగా పాడాలనుకునే సినిమా పాట వుందా?

 * వుంది. భానుమతి గారి పాట ‘శ్రీకర కరుణాల వాల, ‘ తుషార శీతల సరోవరాన, మీరజాలగలడా..’ ప్రత్యేకతని సంతరించుకున్న ఈ గీతాలను ప్రతి ప్రోగ్రాంలో పాడాలని ఉవ్విళ్ళూరుతాను. కనీసం ఒకటైనా పాడకుండా వూరుకోలేను.

> సినీ గీతాల కోసమని ప్రత్యేక శిక్షణ తీసుకోవడం గానీ జరిగిందా?

* ప్రత్యేకించి శిక్షణంటూ ఏమీ తీసుకోలేదు కానీ, నన్ను పొగిడే వారి కన్నా విమర్శించే వారి నుంచే నేను చాలా నేర్చుకుంటుంటాను. పాడే విధానంలో నేను ఎక్కడెక్కడ పొరబాట్లు చేసానో సరి చూసుకుని, ఎలా నన్ను నేను మెరుగు పరచుకోవచ్చో తెలుసుకుంటాను. అదే ‘ పెద్ద శిక్షణ’ అని నాకు అర్థమైంది. ఆ విధానమే గాయనిగా నాకెంతో దోహదపడింది అని చెప్పాలి.

> సినిమా పాటలని పెర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తారు. మీకు ఆ ప్రత్యేకమైన గుర్తింపు వుంది ప్రేక్షకుల్లో.

* (ఆనందంతో మెరిసిపోతూ) చాలా థాంక్సండి మీ కాంప్లిమెంట్‌కి.

 > ఇందుకు మీరెలాటి జాగ్రత్తలు తీసుకుంటారు?

* ఒక పాటని స్టేజ్ మీద పాడి, ప్రెజెంట్ చేసి, ప్రేక్షకుల మనసులను రంజింపచేయాలీ అంటే అందుకు సాధన, దీక్షతో బాటు క్రమశిక్షణ చాలా అవసరం అని నమ్ముతాను. ఒకో పాటని నేనందుకే – కనీసం ముప్ఫై నలభైసార్లు అయినా ప్రాక్టీస్ చేశాకనే స్టేజ్ ఎక్కుతాను.

యూట్యూబ్‌లో పాటని అప్‌లోడ్ చేసేముందు కూడా శృతి స్థాయి, తాళం, సరిగా ఉన్నాయా లేదా అనీ ఒకటికి పది సార్లు సరి చూసుకొని కానీ, పాటను రికార్డ్ చేయను. అది నాకు చిన్నతనం నిండి వస్తున్న క్రమశిక్షణ. అభ్యాసంతో అది అలవాటు గా మారిపోయింది.

> అవునండి నాగేశ్వరి. మీ క్రమశిక్షణా విధానాన్ని నేనెప్పుడోనే పసిగట్టానులెండి. అప్పుడే మిమ్మల్ని మనఃస్ఫూర్తి గా అభినందించాను గుర్తుంది కదూ? అంటూ ఆ నాటి సంఘటనని గుర్తు చేసాను.

* అవునవును. ( అంటూ బిదియంగా నవ్వారు.)

 > సరే, సినీ విభావరి గాయనిగా మీ జర్నీలో మరపురని అనుభవం గురించి చెబుతారా?

* ఊఁ! మరపురాని సంఘటనలు చాలానే ఉన్నాయండి. విజయవాడ ఘంటసాల నృత్య కళాశాలలో జరిగిన మెగా ప్రోగ్రాం. వేలమంది ప్రేక్షకులు విచ్చేసారు. వారి ముందు ఆ నాటి నా సినీ విభావరి గాన ప్రదర్శన నా జీవితంలోనే ఒక మైలురాయి లాంటిదని చెప్పాలి.

మరొక అపూర్వ సంఘటన ఏమిటంటే –

నేను శత చిత్ర గీత లహరి ప్రోగ్రాం చేసాను. అంటే వంద సినిమా పాటలను పాడుతున్న కార్యక్రమం నాడు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అంటే 12 గంటల పాటు ‘నిర్విరామ గానలహరి ‘అన్నమాట.అన్ని పాటలూ పూర్తి చేశాను. నూరవ పాటకు స్టాండింగ్ ఒవేషన్‌ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కార్యక్రమ నేను చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ‘మధుర గాన కళ్యాణి ‘ అనే బిరుదు ప్రదానం చేసి ఎంతో ఘనంగా సత్కరించారు. అద్వితీయమైన అనుభవం.

> కార్యక్రమాలన్నీ సజావుగా సక్సెస్‌ఫుల్‌గా జరగవు కదూ? అలా ఎప్పుడైనా మీకు చికాకు కలిగించిన ఇన్సిడెంట్ ఏమైనా వుందా?

* ఒక అనుభవం వుంది. ఆ రోజు – బోనాల జాతర కోసం మమల్ని పాటలు పాడటం కోసం ఆహ్వానించారు. అయితే ఆ స్టేజీ రోడ్డు పక్కన్నే ఏర్పాటు చేయడంతో – రహదారి మీద వాహనాల రణగొణ ధ్వనులతో గాల్లో పైకి లేస్తున్న దుమ్ముతో, చాలా ఇబ్బంది పడ్డాను. అతి కష్టమ్మీద ఎలాగో అలా ముగించాం. అనుకూల వాతావరణం లోపించినప్పుడు – పాట పాడటం గాయకులకు ఎంత కష్టమో నాకారోజు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

> గాయనిగా మీరెన్నో జ్ఞాపికలను అందుకున్నారు. బిరుదులను పొందారు. పలు సంగీత సాంస్కృతిక కళా సంస్థలనుండి సన్మానాలను సక్తాకారాలను స్వీకరించారు. మీ గురించి మీరు మీ మాటల్లోనే తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. ప్లీజ్ తెలియచేస్తారా? ప్లీజ్ అని ఎందుకంటున్ననంటె..మీరు పొగడ్తలకీ దూరం అని తెలుసు కాబట్టి, నేనడుగుతోంది సమాచారం కాబట్టి. 🙂 మిమ్మల్ని ఎప్పుడు అడిగినా పూర్తిగా చెప్పకుండా మాటలతో దాటేస్తుంటారు. కనీసం, ఇంటర్వ్యూ ద్వారా అయినా తెలుసుకుందామని.

(నవ్వులు.)

* తప్పకుండా చెబుతానండి.

* కర్నాటక గాత్ర సంగీతం లో, వీణా వాయిద్యంలోనూ డిప్లొమా తీసుకున్నాను.

* చిన్నప్పుడు మా అమ్మ గారితో కలిసి నెల్లూర్ లో సంగీత కచేరీలలో పాల్గొనేదాన్ని. ఎస్.పి.బాలు గారి తండ్రి గారైన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు నిర్వహించే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో అనేకానేక మార్లు పాల్గొని, త్యాగరాయ కీర్తనలు ఆలపించేదాన్ని.

* హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో గాత్ర సంగీత కచేరిలు చేసాను.

* శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, లలిత సంగీతం, సినీ గీతాలు ఇలా అన్నీ కలిపి మొత్తం 1000 కార్యక్రమాలు చేసిన అనుభవముంది.

 * అన్నమయ్య ప్రచార ప్రాజెక్ట్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి శ్రీవారి కీర్తనార్చన చేసి తరించగలిగాను.

* తిరుమల పుణ్యక్షేత్రంలో దివ్యంగా జరిగే దీపాలంకారణ, పద్మావతి పరిణయ వేదిక, బ్రహ్మోత్సవాలు, కార్తీక బ్రహ్మోత్సవాలలో శ్రీవెంకటేశ్వరుడిని కీర్తించే భాగ్యం కలిగింది.

* ఇవి కాక పరక, కాళేశ్వరం పుష్కరాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాస్కృతిక శాఖ వారు తలపెట్టే సంగీత కార్యక్రమాలలో పాల్గొని అనేక సార్లు పాల్గొనే దివ్యమైన అవకాశాలెన్నో పొందాను.

* అలాగే, రామదాసు, సదా శివ బ్రహ్మేంద్ర స్వామి వంటి వాగ్గేయకారుల కీర్తనలతో బాటు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి భక్తి, తత్వ గీతాలను ఆలపించడమన్నా అంతే మక్కువెక్కువ. సినీ పాటలకు ధీటుగ భక్తి గీతాల కార్యక్రమాలలోనూ పాడాను.

*శాస్త్రీయ సంగీత కచేరీలలో కీర్తనలు, భక్తి గీతాల కార్యక్రమాలు గాయనిగా నాకెంతో తృప్తినీ అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తాయి అనడంలో ఎలాటి అతిశయోక్తి లేదు.

> నిండు కుండ తొణకదు అని అందుకే అంటారు పెద్దలు. హిందీ తెలుగు ఫిల్మ్ సాంగ్స్ లో మీరింత ప్రావీణ్యం సంపాదించారు. క్లాసిక్స్ పాడటంలో దిట్ట అనీ పేరు తెచ్చుకున్నారు కదా? మరి సినీ నేపధ్య గాయనిగా అవకాశాలు రావడం కానీ, లేదా మీరు ప్రయత్నం చేయడం కానీ జరిగిందా?

* అవకాశం వచ్చిందండి. ఒకసారి కోరస్‌కి వెళ్ళాను. కానీ, ఉదయం నించి, సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను ఒక రెస్పాన్సిబుల్ బ్యాంక్ ఉద్యోగిని. గృహిణిని. ఇద్దరు పిల్లల తల్లిని. ఇంటా బయటా నేను నిర్వహించాల్సిన బాధ్యతల నడుమ – ఇంతింత సమయాన్ని సినిమా పాట కోసం కేటాయించే అవకాశం నాకు లేదు. ఇక ఇది నాకు కుదరని పని అని నిశ్చయించుకున్నాను. అప్పుడే స్థిర నిర్ణయానికొచ్చేసాను. ‘నాకు అనుకూల వాతావరణంలో మాత్రమే పాటల కార్యక్రమాలలో పాల్గొనాలనేది’ నా అభీష్టానికి అనుగుణం గా నడుచుకున్నాను. అన్నిటా విజయాన్ని సాధించనన్న తృప్తి నాకుంది.

> ఇలాటి పరిస్థితుల్లోనే జీవితాన్ని బాలెన్స్ చేసుకోవాలి నిజమేనండి. అయితే, గాయని గా మీకున్న అపారమైన అనుభవాన్ని బట్టి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి . లైవ్ లో పాడటం అంటే ఇష్టమా? లేక కరోకె ట్రాక్ మీద పాడటాన్ని ఇష్టపడతారా? రెండిట్లో ఏదీ సులువు? ఏది కష్టం?

* క్లిష్టమైన ప్రశ్నే! (నవ్వులు)

రెండూ ఇష్టమైనవేనండి. పెద్ద తేడా ఏమీ వుండదు. అయితే, కరోకె లో పాడేటప్పుడు మ్యూజిక్ ట్రాక్‌ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ పాడాలి. అదే లైవ్‌లో అయితే మ్యుజిషియన్స్ చిన్న చిన్న పొరబాట్లున్నా, అందంగా సర్దేస్తారు. 🙂 లైవ్‌లో సింగర్‌కి ఇదొక గొప్ప సౌలభ్యం అని చెప్పాలి.

> మరి ఇన్ని కష్టనష్టాలకోర్చి, వేదికల మీద పాడే సినీ సింగర్స్‌కి అందుతున్న ప్రతిఫలం సంతృప్తిపరంగా వుంటుందా?

 * (నవ్వులు) చాలా గడ్డు ప్రశ్న వేశారు. ( మళ్ళా నవ్వులు)

ఎందుకంటే, నిజం చెప్పడానికి మనస్కరించదు. కారణం సంగీతం పట్ల నాకు గల ఆరాధనా భావం అంత గొప్ప ఉన్నతమైనది కావడం వల్ల! మీరడిగారు కాబట్టి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు వుందని చెబుతున్నానండి.. ఎక్కడైనా కానీ, సింగర్స్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా చాలా స్వల్పంగా వుంటుంది. పాపులర్ సింగర్స్‌కి తప్ప!

అయితే, అన్నమాచార్య ప్రాజెక్ట్, టిడిపి ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు తమ అనుసరణా పద్ధతుల ప్రకారం గాయనీగాయకులకి పారితోషికాన్ని తప్పక అందచేస్తారు.

ఇక సినీ గీతాల మాటకొస్తే, కళాకారులందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని, ఖర్చులని సరి సమానంగా పంచుకుని, కార్యక్రమాలను నడుపుకుంటున్నారు. ఇందులో కష్టనష్టాలున్న మాట వాస్తవమే.

ఇలాటి గడ్డు పరిస్థితుల్లో గాయనికి రెమ్యునరేషన్ ఇచ్చే ప్రసక్తి రాదు. వుండదు.

 > సినీ పాటలని ప్రొఫెషన్‌గా తీసుకోవాలనుకునే వారికి ఈ ఫీల్డ్ ఆశాజనకంగా వుంటుందా?

* ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టి పోటీని చూస్తుంటే. ..మనుగడ కష్టమేననిపిస్తోంది. సంపాదించిండానికి ఒక వృత్తిని చూసుకుని, సంగీతాన్ని హాబీగా చేసుకుని మనుగడ సాగిస్తే మంచిందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం.

> సంగీత కళని నమ్ముకుని బ్రతికే గాయనీ గాయకులకి ఎవరి అండ అవసరంగా వుందని భావిస్తున్నారు?

*సింగర్స్ ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాల్సిన అవసరం వుంది. లేదా, అందరూ కలిసి ఒక అసోసియేషన్‌గా కూడి, తమకు ఒక నిర్ణీతమైన పారితోషికం ఇస్తేనే పాడతాం అని ముందుకు రావాలి.

కానీ, సినీ గీతాలు పాడటం అనేది ఒక కళ మాత్రమే. వృత్తిగా స్వీకరిస్తే కష్టాలు తప్పవేమో. ఎందుకంటే మన దేశంలో 80% మంది అటు ఇటుగా పాటలు పాడేయగల సామర్థ్యమున్న వారు వున్నారు.

ఒక ఉదాహరణ చెబుతాను. ఇది నేను చూసిన సంఘటనే.

ఒక పెళ్ళిలో పాట కచేరీ ఏర్పాటు చేసారు. సింగర్స్ అడిగిన రెమ్యునరేషన్ ఎక్కువగా వుండటంతో అధిక భారంగా భావించి, ఆర్కెస్ట్రాని పెట్టుకుని, బంధువులందరూ కలిసి వాళ్ళే పాడుకున్నారు. ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది.

మరొక సంఘటన స్వీయానుభవం.

మా వారి ఉద్యోగ రీత్యా మేము మాల్దీవ్స్‌లో వున్నప్పుడు, మాల్దీవ్స్‌-ఇండియా ఫ్రెండ్షిప్ డే కి సినీ జూనియర్ సింగర్స్‌ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు లక్షల్లో డిమాండ్ చేయడంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని విరమించుకున్నారు. చివరకు, 500 డాలర్స్ ఇచ్చి, నన్ను ప్రధాన గాయనిగా చేసి, పాటలు పాడించుకున్నారు. బ్రహ్మాండమైన హిట్టు ఆ నాటి మా ప్రొగ్రాం. (నవ్వులు)

నాకు డబ్బు ప్రధానం కాదు కాబట్టి అంత గొప్ప అవకాశం నాకే దక్కిందని అర్థమైంది.

కళారాధన వల్ల మనకు ఇలాటి అనుకోని అమూల్య ప్రతిఫలాలు వుంటాయి. ఆత్మ తృప్తిని కలిగిస్తాయి.

> మీ మాటల్ని బట్టి అర్ధమౌతోందేమిటంటే సింగర్స్ వున్న శాతంలో మనకు సంగీత కార్యక్రమాలు వుండటం లేదు అని. కదూ?

* అవుననే చెప్పాలి. పాడుతా తీయగా, సరిగమ, సూపర్ సింగర్స్, ఇలా దరిదాపు ట్విన్ సిటీస్ లోనే 2000 మంది అద్భుతమైన గాయనీ గాయకులున్నారు. అందరికి వేదికల మీద అవకాశాలు వస్తే రావచ్చు గాక! కానీ, వృత్తిగా తీసుకుంటే బ్రతకడానికి సరిపడ ఆదాయం కలుగుతుందా అనేది సందేహమే.

అందుకే నేనేమంటున్నానంటే, ఒక ఆర్గనైజ్డ్ సంస్థని ఏర్పాటు చేసుకుని, రిజిస్టర్ చేయాలి. అందులో సభ్యులకు ప్రభుత్వ తరఫున జరిగే కార్యక్రమాలలో అవకాశాలు కలిగించాలి. అయితే ఆ స్థాయి సింగర్స్‌కి మాత్రమే ఈ సంస్థలో సభ్యత్వాన్ని ఇవ్వాలి. అప్పుడు ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం సింగర్స్ అనార్గనైజ్డ్ సెక్టర్‌గా వున్నారని చెప్పక తప్పదు.అందుచేత ప్రభుత్వానికి రెప్రెజెంట్ చేసుకోలేరు. అందరూ రికగ్నైజ్డ్ అసోసియేషన్ కింద సింగర్స్ నమోదు అయితే, వ్వాళ్ళకు వాయిస్ వుంటుంది డిమాండ్ చేసే హక్కు కలుగుతుంది.

> బేబీ సింగర్ మీద మీ అభిప్రాయాన్ని వున్నదున్నట్టు వ్యక్తీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు? కామెంట్ ప్లీజ్.

* ఆ గాయనికి దొరికిన గుర్తింపు హర్షణీయమే. హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ, పెద్దలిస్తున్న ఈ ప్రోత్సాహం తాత్కాలికం కాకూడదు. అలా జరగకూడదని కోరుకుంటూ ఆమె అభివృధ్ధిని ఆశిస్తున్నాను. సంచిక ద్వారా అభినందనలు తెలియచేసుకుంటున్నాను.

> 🙂 మీరు ఆశిస్తున్న మార్పులు చోటు చేసుకుని, సినీ సంగీత సింగర్స్‌కి గొప్ప గొప్ప అవకాశాలు కలగాలని, ఆర్థికంగా కూడా ఎదగాలని ఆశిద్దాం.

పాటల గురించి ఎన్నో తెలీని విషయాలను ‘సంచిక’తో పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. మీకు పత్రిక తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నాగేశ్వరి గారు!

* 🙂 మీకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్ననండి. నా మనోభావాలను పంచుకునే అవకాశాన్ని కలిగించినందుకు సంచిక పత్రిక సంపాదకులు శ్రీ మురళీ కృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సంచిక పాఠకులను కలుసుకుంటున్నందుకు నిజంగా సంతోషంగా వుందండి. శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు అందరకీ వందనములు.

******

 

 గాయని నాగేశ్వరి గారు ఆలపించిన గీతాలు మీరిక్కడ వినొచ్చు.

  1. https://www.youtube.com/watch?v=qMsg2tB_eZs
  2. https://www.youtube.com/watch?v=jSaIDLWjN_o
  3. https://www.youtube.com/watch?v=JBkufMY-OLM
  4. https://www.youtube.com/watch?v=PHtRAmCVSgM
  5. https://www.youtube.com/watch?v=YGMo_Tl7yXY

Exit mobile version