ట్విన్ సిటీస్ సింగర్స్-4: ‘కాసు కంటెనూ, పాటపాడే అవకాశమే నాకెంతో విలువైనది’ – నళిని!

0
1

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన ‘కాసు కంటెనూ, పాటపాడే అవకాశమే నాకెంతో విలువైనది ‘ – అని చెప్పే గాయని నళిని గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

[dropcap]జం[/dropcap]టనగరాలలో జరిగే భక్తి సంగీత కార్యక్రమాలలో తరచూ వినిపించే, కనిపించే గాయని – శ్రీమతి నళిని. ఈమె – ప్రఖ్యాత గాయకులు, భక్తి గీతాల సంగీత దర్శకులు అయిన శ్రీ నేమాని సూర్యప్రకాష్ గారి శిష్యురాలు. వీరిరువురూ కలిసి అనేక భక్తి గీతాలను ఆలపించారు. అనేకానేక పాటల కార్యక్రమాలలో కలిసి పాడుతుంటారు. నళిని గారి గురించి చెప్పాలంటే వైవిధ్యభరితమైన గాత్రం ఆమె సొంతం. ముఖ్యంగా అయ్యప్ప పడి పూజలలో మేల్ సింగర్ లేకపోయినా, ఆ లోటు ఏ మాత్రం కనిపించనీకుండా తన ఏక కంఠంతో మొత్తం ప్రోగ్రాంని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి శభాష్ అనిపిస్తారు. నాలుగు భాషల్లోనూ భక్తి గీతాలను అవలీలగా ఆలపించి ఔరా అనిపిస్తారు. ప్రతిభతో బాటు, మంచి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్న గాయని శ్రీమతి నళినితో జరిపిన ఇంటర్వ్యూని మీకందిస్తున్నాను.

***

♣ హలోండి నళిని గారు, నమస్తే. ఎలా వున్నారు?

* హలోండి. నమస్తే. బావున్నా. (నవ్వుతూ)

♣ మొన్న మన శారద మీ గురించి చెబుతుంటే అన్నానూ, నళిని ఒక్కరుంటే చాలు. మేల్ సింగర్స్‌తో పని వుండదు. ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా ఇట్టె సక్సె‌స్‌ఫుల్‌గా నడిపించేస్తారు ప్రోగ్రాం అని. (నవ్వులు.)

* అంతా, మీ అభిమానం అంతే.

♣ అభిమానం మాత్రమే కాదు, అబధ్ధం కాని నిజం కూడా. (నవ్వుతూ అన్నాను)

* (ఆనందంగా నవ్వుతూ..) థాంక్సండి . అంతా దేవుని కృప కటాక్షాలుగా భావిస్తాను. నేను నిమిత్తమాత్రురాలిని మాత్రమే కదా!

♣ దైవ కృపతో పాటు మీ కృషి కూడా వుండి వుండాలి కదూ? ఒక ప్రోగ్రాంలో మీ వాయిస్ కల్చర్ని చూసాను కాబట్టి అడుగుతున్నాను. మేల్ సింగర్‌తో సమానంగా ధీటుగా అంత శృతిలో, గంభీర కంఠంతో గానం చేయడం ఎలా సాధ్యమౌతుంది మీకు? ఒక పక్కన మృదువైన భక్తి గీతాలు పాడుతూనే మరో వైపు హోరెత్తే గళాన్ని కురిపించడం వెనక ఏమైనా టెక్నిక్ వుందా? ఇమిటేషన్.. అనుసరణ, అనుకరణ వల్లనా? లేక సాధన వల్ల సాధ్యమైందా? కాదూ, శాస్త్రీయ సంగీతంలో మీకున్న పట్టు వల్ల మార్గం సుగమమైందా?

* పెద్ద ప్రశ్నే వేశారు. నిజం చెప్పాలంటే, సింగర్ ఎలాటి ప్రయోగాలు చేయాలన్నా శాస్త్రీయ సంగీతం బేస్ చేసుకుని వుంటుంది. నా విషయానికొస్తే, నాకు పరిశీలనా తత్వం ఎక్కువ. నా పక్కన ఎవరు కూర్చుని పాడుతున్నా, ఆ సింగర్స్‌ని గమనిస్తుంటాను. బాగా పాడేవాళ్ళుంటారు. వాళ్ళ నించి నేర్చుకుంటాను. బాగా పాడని వాళ్ళుంటారు. వాళ్ళ నించీ నేర్చుకుంటాను. అలా పాడకూడదని.. ( నవ్వులు) మరో సంగతి కూడా వుంది. ఎవరు ఎలా పాడటం వల్ల – ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతున్నారో అనేది పసిగడ్తాను. బహుశా ఈ అబ్జర్వేషన్ వల్లనేమో, గళంలో వైవిధ్యాన్ని గుప్పించగలిగే వీలు చిక్కిందనుకుంటున్నాను.

♣ ఈ ప్రయోగానికి ఎప్పుడు నాంది పలికారు?

* ఇది నా చిన్నప్పట్నించీ జరుగుతున్న సన్నివేశం అని చెప్పాలి. ఎప్పుడైనా మేల్ సింగర్ రాలేకపోయినప్పుడు ఆర్గనైజర్స్ నిరాశపడుతుండేవారు. ఒకసారి ఇలానే జరిగింది, ఆ రోజున ఆ నిర్వహణాధికారి నిరాశపడుతూ… ‘ఇప్పుడెలా?’ అనుకుంటూ అడిగారు నన్ను – ‘నువ్వు పాడతావా మేల్ సింగర్ పాటలు ప్లీజ్?’ అని. అడిగిందే ఆలస్యంగా (నవ్వులు) వెంటనే తలూపాను. ఎందుకంటే – నేనప్పటికే ఆ పాటలన్నిట్నీ సాధన చేసి వుంటం మూలాన, ఎలాటి బెదురు లేకుండా పాడేసాను. విన్న ప్రేక్షకులు అమితమైన హర్షాన్ని చప్పట్ల ద్వారా తెలియచేసారు. ఇక ఆర్గనైజర్స్ అయితే తెగ సంబరపడిపోయారు నా వాయిస్ విని. అలా అలా… మేల్ సింగర్స్ పాటలు కూడా యధేచ్చగా పాడేయడం జరుగుతోంది.

♣ ఇందుకు సాధన అనేది ఎంతవరకు సాయపడుతుంది?

* ఇందుకు కావలసినదే సాధన. నాకు నచ్చిన ప్రతి పాటని సాధన చేస్తాను. పాడిందని ఎవరన్నది చూడను. అది మేల్ పాట కదా నాకనవసరం అని వూరుకోను. నేర్చుకోవాలనుకున్న పాటని ఎంత కష్టమైనా సరే నేర్చేసుకుంటాను. అది ప్రోగ్రాంకి అవసరమున్నా లేకున్నా సాధన చేసి సిధ్ధంగా వుంచుకుంటా. అవసరం పడ్డప్పుడు, ఏదేని, అనివార్య కారణాల వల్ల మేల్ సింగర్స్ ప్రోగ్రాంకి రాలేకపోయినప్పుడు ఆ పాటలు చాలా ఆదుకుంటాయి కార్యక్రమాన్ని.

♣ మీరన్నట్టు అబ్జర్వేషన్ అనేది కళాకారులకి ఎంతో నేర్పిస్తుంది. మీ వయసు అడిగేస్తున్నా ధైర్యం చేసి. (నవ్వులు) గాయనిగా ఎన్నాళ్ళ నించి పాడుతున్నారు?

* పదిహేనేళ్ల నించి నేను ఈ ట్విన్ సిటీస్‍లో పాడుతున్నానండి.

♣ మీ చిన్నప్పుడు అమ్మగారితో కలిసి ప్రోగ్రాంస్‌కి వెళ్తుండేవారని అన్నారు..?

* అమ్మకి శాస్త్రీయ సంగీతం రాదు కానీ, పాటలకు ట్యూన్స్ కట్టేవారు. ఆశ్చర్యంగా వుంటుంది కానీ ఇది నిజం. రాగయుక్తంగా పాడేవారు. అప్పట్లో అంతగా గుర్తింపు వుండేది కాదు, స్త్రీ కళాకారులకి అనుకుంటున్నా.. నాలుగు గోడల మధ్యే వుండిపోయేవారు. నాకు పాటలన్నా సంగీతమన్నా చాలా ఇష్టం. చిన్నప్పట్నించీ నాకు మక్కువెక్కువే. అయితే సరైన గురువు దొరకలేదో, ఆ దిశగా మా వాళ్ళెప్పుడూ ఆలోచించలేదో తెలీదు కానీ.. ఎలా అయితేనేం వీణ నేర్చుకున్నా. అయితే – కచేరీలు, వేదిక మీద ప్రదర్శనలు లాంటి ముచ్చట్లు లేవు. విద్య వృధా అయిపోతుందన్న దిగులూ లేదు. పెళ్లయింది. అత్తవారింటికొచ్చేసాను.

♣ మద్రాస్ కదూ?

* అవును. ఆయన తమిళియన్.

♣ మీరు?, కాదా?

* (నవ్వి) కాదు. నేను కర్నూల్ అమ్మాయిని. అచ్చమైన పదహరణాల తెలుగమ్మాయిని.

♣ మీరు తమిళులనుకున్నా, తమిళ పాటలు పాడటం చూసి! లవ్ మేరేజ్ అన్నమాట. (నవ్వులు)

* అవునండి. ఆయన మా అన్నయ్య ఫ్రెండ్. నేను కాపురానికొచ్చాక, సంగీతం పట్ల నాకున్న ఆసక్తిని గమనించి మా అత్తగారు నన్ను మ్యూజిక్ కాలేజ్‌లో జేర్పించారు. మా అత్తింటి వారి ప్రోత్సాహం చాలా వుంది. ప్రధానంగా మా అత్త గారి ఎంకరేజ్‌మెంట్ మరచిపోలేను.

♣ ఎంత మంచి అత్తగారూ!

*అవును. చాలా మంచి మనిషి. ఆమె డి.కె.పట్టమ్మాళ్ గారి శిష్యురాలు. పాటలో గమకాలు అలా దొర్లిపోయేవి. పులకింతలు పుట్టించేవి. సంగీతం విలువ తెలిసిన వ్యక్తి ఆమె. నేను అలా ఉత్తిగా పాట పాడుకుంటున్నా సరే ఇంట్లో ఎవర్నీ శబ్దం చేయనిచ్చేవారు కాదు. మాట్లాడించబోతే కేకలేసేవారు. ఆమె సాధనలో ఉంది. డిస్టర్బ్ చేయొద్దనే వారు. అంతగా నన్ను సంగీతం వైపు నడిపించారు. మా అత్తగారి వల్లే నేను సంగీతాన్ని నేర్చుకోగలిగాను నిర్విఘ్నంగా!

♣ మీరు దరిదాపు 11 సంవత్సరాలు సంగీత శిక్షణ లో గడిపారు కదూ? ఎంతో కృషి సలిపారు ఔనా?

* కృషి అనేది పెద్ద మాటేమో! నేను కావాలని చేసిన కృషిగా అనిపించదు. నా మైండ్ సెట్ ఎలా వుంటుందంటే, నా దారిలో ఏది వస్తే అదే రానీయిలే, అని అనుకుంటాను. వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోను. నూటికి నూరు శాతం సద్వినియోగ పరచుకున్నానేమో.. ఇప్పటి వరకు కూడా – నా అంతట నేను ఔట్ ఆఫ్ వే వెళ్ళీ ఏదీ ప్రయత్నించలేదు. ఒక గోల్ అంటూ ఏమీ వుండదు. దేని కోసమూ కృషి చేయలేదు. అంతా దైవానుగ్రహంగా అనిపిస్తుంది. ఆయన ఇచ్చిన ప్రసాదం అని పవిత్రమైన భావనతో ముందుకు సాగుతున్నాను.

♣ సంగీత సాధనానంతరం.. గాయనిగా మీరిప్పటిదాకా ఎన్ని ప్రోగ్రాంస్ ఇచ్చి వుంటారు?

* అబ్బో లెక్క కట్టలేదు…

♣ సుమారు వెయ్యుంటాయా?

* ఇంకా ఎక్కువే వుంటాయండి.

♣ రోజూ ప్రోగ్రాంస్ వుంటాయా?

* ఆల్మోస్ట్ అల్ల్ అనుకోవచ్చు. సీజనల్‌గా ఎప్పుడూ బిజీ గానే వుంటాను దేవ్వుని దయ వల్ల. లైవ్ ప్రోగ్రాంస్, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, వేదికల మీద సంగీత విభావరీలు, రికార్డింగ్ పనులు, సీడీ రెలీజింగ్స్, ఇక పర్వదినాలలో – పండగలు, బోనాలు జాతరలు, బతుకమ్మ సంబరాలు ప్రభుత్వం వారి ప్రోగ్రాంస్ కూడా చేస్తుంటాను. దరిదాపు అన్నిరోజులూ బిజీగానే వుంటుంటాను. మీరన్నట్టు ‘మేల్ సింగర్స్ లేకపోయినా ఈమె లాగించేస్తుంది కార్యక్రమాన్ని’ అనే ధీమా అయితే ఆర్గనైజర్స్‌కి వుంది అని చెప్పాలి. ఇదే నా గళానికి వున్న అసెట్. (నవ్వులు)

♣ మీరు పాడే జానపదాలు కొత్త పుంతలు తొక్కుతాయని అంటారు.. జానపద గీతాలలో ప్రత్యేక శిక్షణ పొందటం జరిగిందా..?

* ప్రత్యేకించి శిక్షణ అంటూ ఏమీ తీసుకోలేదు కాని వినికిడి జ్ఞానం అని చెప్పాలి. అయ్యప్ప భక్తి గీతాలు, భజనలు, కూడా విని, గమనించి, నేర్చుకున్నవే. ఒకటికి పది సార్లు సాధన చేస్తాను.

♣ భక్తి గీతాలలో, వాగ్గేయకారుల కీర్తనలలో గల సాహిత్య ప్రభావం ఎంతవరకు మీకు స్ఫూర్తినిస్తుందని భావిస్తారు?

* చాలా వరకు ఆ ప్రభావం వుంటుందండి. ఉదాహరణకు సుబ్బలక్ష్మి గారి తమిళ గీతం,

కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్న ,

కురై ఓన్రుం ఇల్లై కన్నా

కురై ఓన్రుం ఇల్లై గోవిందా

కన్నుక్కు తెరియామల్ నిర్కిన్రాయ్ కన్నా

కన్నుక్కు తెరియామల్ నిన్రాలుమేనక్కు

కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్నాఅప్పట్లో నాకు .. ఈ పాట కి పూర్తిగా అర్ధం తెలియకున్నా, పాడుతుంటె కన్నీళ్ళొచ్చేవి. భక్తి పారవశ్యంతో.

దుర్గమ్మ తల్లి గీతాలు, మహంకాళి జాతర పాటలు, బతుకమ్మ సాంప్రదాయగానాలు, భక్త రామదాసు,అన్నమాచార్య త్యాగయ్య కీర్తనలు ఒక ఎత్తుగా వుండే సాహిత్యమైతే – అయ్యప్ప పూజల్లో పాడే పాటలు ఒక ఎత్తు. అందులో – కన్నె సాములు ఆటలు, స్వామి అభిషేకాల పాటలు, దిగు దిగు నాగన్నలు మరొక ఎత్తుగా పాడగలిగి వుండాలి. పళ్ళిం కట్టు శబరిమలైక్కు కల్లుం ముళ్ళుము… కాలికిమెత్తై.. స్వామియో అయ్యప్పో అయ్యప్పో స్వామియో.. నెయ్యాభిషేకం స్వామిక్కే సాహిత్యంలో మమేకమై పాడుతుంటాను.

ఒకో దేవతా రూపం వేరైనట్టే, తత్వమూ, కీర్తనా విధానాలూ భిన్నమనే అవగాహన కలిగింది. అన్నమయ్య పదాలనే ఉదాహరణగా తీసుసుకుంటే, బ్రహ్మ కడిగిన పాదము ఎలా పాడతామో, బ్రహ్మమొకటె పరబ్రహ్మమొక్కటే.. అనే కీర్తనని అంతే సౌమ్యంగా పాడలేం. ఆ యా సాహిత్య సంగీతాలను అనుసరించి గాయని గాత్రం ఒరవడి మారుతుంటుంది. ప్రతి గాయనికి – ఈ అవగాహన వుంటుంది. వున్నప్పుడే ఆ గాయని రాణిస్తుందని నా అభిప్రాయం.

♣ మీ కెరీర్‌లో మరపురాని మైలురాయి వంటి సంఘటన కానీ సన్నివేశం కానీ..?

* వుంది. మా గురువు గారు శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారిని కలవడం ఒక మరపురాని సంఘటన. బ్రహ్మోత్సవాల వేదిక మీద గురువు గారిని కలుసుకున్నాను. అదే వేదిక మీద వారు కూడా పాడుతున్నారు. నేను శివుడి పాట పాడుతుంటే గురువు గారు కోరస్ ఇచ్చారు. వీరు కంపోజ్ చేసి పాడిన పాటలంటే నాకు చాలా ఇష్టమన్న మాట. అప్పట్లో గురువు గారి పాటలను పాడి ఎక్కువ ప్రాచుర్యాన్నిచ్చింది నేనేనేమో! (నవ్వులు) కానీ ఈయనే నేమాని సూర్యప్రకాష్ గారని నాకు తెలీదు. ఇంటికొచ్చి కేసెట్స్ మీద చూస్తే అన్ని కేసెట్స్ మీదా ఆయన పేరే వుంది. ఇంత గొప్ప ప్రతిభామూర్తి ని కదా నేను వేదిక మీద చూసిందని, పట్టలేని ఆనందంతో వొణికిపోయానంటే నమ్మండి. ఆనాటి ఆ అనుభవం నిజంగా మరచిపోలేనిదని చెప్పాలి. ఆ మర్నాడు గురువు గారిని వెళ్ళి కలవడం, నా అభిమానమంతా వెలిబుచ్చడం జరిగింది. వారు నన్ను తన శిష్యురాలిగా స్వీకరించారు. గానాలాపనలలో ఎన్నో మెలకువలు నేర్పారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నో సిడిలలో పాడించారు. రికార్డింగ్, రీ రికార్డింగ్స్‌లో ఆయనకు నా సహకారాన్ని అందించే అద్భుతమైన అవకాశాన్నిచ్చి నన్నెంతగానో ప్రోత్సహించారు. అప్పటి దాకా నేనొక రా మెటీరియల్ ని మాత్రమే. గురువు గారి గైడన్స్‌తో నాలోని గాయని ఒక ఆకృతిని దాల్చిందని ఒప్పుకుంటాను. గాయనిగా నా వాయిస్ మాడ్యులేషన్‌లో మార్పు వచ్చిందంటే అదంతా గురువు గారి బోధనల వల్లే. ఇంకా ప్రాక్టీస్ కావాలంటున్నారు. సాధన చేస్తున్నాను.

♣ ఇంత గొప్ప అవకాశం మీకు కలగడం యాదృచ్ఛికమే అయినా.. తలచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది?

* నేను దైవాన్నే నమ్ముకునున్నాను కాబట్టి ఆయనే నా దగ్గరకు మంచి మంచి వ్యక్తులని పంపిస్తున్నాడు అనిపిస్తుంది. ఇందుకు ఆ దైవానికి సదా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వుంటాను.

♣ ఇప్పటి దాకా మీరు పాడిన ఎన్ని సిడీలు రిలీజ్ అయ్యాయి?

* వంద పైనే వుంటాయి.

♣ మీ గురువు గారు కూడా అంటుంటారు… నళిని సహకారం వల్ల నా సిడీ రికార్డింగ్ వర్క్ సులువుగా పూర్తవుతోంది అని. ..

* గురువు గారి ఆశీస్సులుగా భావిస్తాను వారి ప్రశంసలని! వారు నిర్వహించే అనేక ప్రాజెక్ట్స్‌కి పని చేసానండి. గీతాలకు నోట్స్ రాసుకోవడం, ఫెయిర్ చేయడం, రికార్డింగ్, రీ రికార్డింగ్స్‌లో మెలకువలు తెలుసుకోవడం, ఒకోసారి మెరుగైన గాత్రాలకై, తగిన సలహాలు సూచనలివ్వడం వరకు అనుభవాన్ని సంపాదించాను. ఒక పక్కనవారి దగ్గర పని చేస్తూ, ప్రతిఫలాన్ని పొందుతూ, మరోపక్కన వర్క్ క్వాలిటీని పెంచుకుంటూ, టెక్నికల్ అనుభవాన్ని సంపాదించడం అందరకీ దక్కే అదృష్టం కాదు. ఇదొక అరుదైన అవకాశం నన్ను వరించిందని చెప్పాలి.

♣. టెక్నికల్ నాలెడ్జ్ అంటే?

* రికార్దింగ్‌లో తబలా, ఇన్‌స్ట్రుమెంట్స్ బిట్స్ దగ్గర్నించీ, సిడీని నిర్వాహకులకు అందించే వరకు ప్రతి స్టెప్‌లోనూ నా ఇన్వాల్వ్‌మెంట్ వుంటుంది. ఒకప్పుడు గురువు గారు సినీ పరిశ్రమలో వుండంగా, సంగీత దర్శకుల దగ్గర తన సహకారాన్ని ఎలా అందించారో అదే పోస్ట్ నాకు గురువు గారి దగ్గర అందిపుచ్చుకున్నానని గర్వంగా చెబుతుంటాను. ఏ బిట్ దగ్గర – ఫ్లూట్ వుండాలి, ఎక్కడ వీణా వాయిద్యం అవసరం, కీ బోర్డ్ పై పలికించాల్సిన స్వరాలు అన్నీ నోట్స్ రాసుకోవడం,- హై ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటీ, అది లో అంటే ఏమిటీ, ప్లస్ మైనస్లు అంటే ఏమిటీ, మైనస్ 1 లో దాని లెవెల్ ఎలా హై అయిపోతుంది.. ఇలాటి టెక్నికల్ పరిజ్ఞానం అంతా నేను గురువు గారి నుంచి నేర్చుకున్నానను.

♣ మీరిద్దరూ కలిసి ప్రోగ్రాంస్ కూడా చేస్తుంటారు అని చెప్పారు..

* అవునండి. కలిసి ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటాం. అలానే కలిసి వేదికల మీద ప్రోగ్రాం ఇస్తుంటాం. వివాహాది, ఇతర శుభ కార్యక్రమాలన్నిట్లోనూ శాస్త్రీయ సాంప్రదాయ గీతాలూ పాడుతుంటాం. వివాహ సమయాలలో పాడే ఫిల్మ్ గీతాలలో ఎక్కువగా మిన్నేటి సూర్యుడు, శ్రీరస్తు శుభమస్తు, నన్ను దోచుకుందువటే, జిలిబిలిపలుకుల మైనా, కళ్యాణ వైభోగమే… వంటి క్లాసిక్స్ పాడతాం… తీన్మార్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంస్ చెయ్యం. వాటికి మేము చాలా దూరం.

♣ మీరు సాధించిన ఇతర విజయాల గురించి తెలియచేస్తారా?

* నేను సినిమాలో కూడా పాడాను. ‘రామసక్కనోడు’ అనే చిత్రంలో బాలూ గారితో కలిసి యుగళ గీతం పాడాను.

♣ అద్భుతమైన ఈ అవకాశమెలా కలిగింది?

* మా వారూ, కోటీ గారూ ఫ్రెండ్స్. అలా.. నాకు సినిమాలో పాట పాడే అవకాశం కలిగింది.

♣ సినిమాలలో కంటిన్యూ కాలేదెందుకనీ?

* అక్కడ చాలా సమయాన్ని కేటాయించాల్సి వుంటుందండి. పొద్దున వెళితే ఒక్కోసారి సాయంత్రం దాకా వేచి వుండాల్సి వచ్చేది. నాకు కుటుంబ బాధ్యతలతో వీలు కాలేదు అప్పట్లో. అయినా బాగానే ఆక్టివ్ గానే పనిచేసాను. రాజ్ కోటీ ఇద్దరిలో రాజ్ గారి దగ్గర రీరికార్డింగ్స్ లో పాడుతుండేదాన్ని. ఘంటాడి కృష్ణ గారి దగ్గర కూడా పాడాను. యదార్ధం అనే సీరియల్‌కి టైటిల్ సాంగ్ పాడాను. జెమినీ టివీలో ప్రసారమైంది.

♣ పాడుతా తీయగా లో పాల్గొనడం జరిగిందా?

* అప్పటికే యంగ్ జెనెరేషన్ వచ్చేసింది. చక్కగా రమ్యంగా పాడుతుంటే… మనమెందుకు అని ఊరుకున్నాను. కొత్త సింగర్స్‌కి మనం దారివ్వాలి. మధుర స్వరాలు వినాలి. కొత్త కెరటాలెప్పుడూ వస్తూనే వుంటాయి. ఎగసిపడి ప్రతి స్వర కెరటాన్నీ ఆహ్వానించి అక్కున చేర్చుకునేదే సంగీత సముద్రం.

♣ బాగా చెప్పారండి. బాలూ గారితో కలిసి పాడటం చాలామంది సింగర్స్‌కి ఒక డ్రీం కదా.. మరి మీరెలా ఫీలయ్యారు?

* నా కల తీరింది కదా! (నవ్వులు) నా కెరీర్‌లో అదొక మరపు రాని ఘట్టం.

♣ ఆ గొప్ప గాయకుని తో కలిసి పాడాక మీ అనుభూతి ఏమిటీ?

* బాలూ గారు నాకు దైవంతో సమానం. కొందరికి ఆయనతో కలిసి ఫోటోలు తీసుకునే సరదా వుంటుంది. లేదా బాలూ గారిని కలిసి తానెంత గొప్ప అభిమానో చెప్పాలని వుంటుంది… కానీ నాకు అలా కాదు. ఆయన నిలిచి వెళ్ళిన నేల మీద మట్టిని తీసుకుని, కళ్లకద్దుకునేంత పవిత్రమైన ఆరాధన నాది. బాలూ గారిని దూరం నించి చూసాను. అదే ఒక గొప్ప అవకాశం. ఆయన స్వరంతో నా గొంతు కలిపి పాడాను. అదింకా అద్భుతమైన అదృష్టం కదా. ఈ ఫీలింగ్ నాకెంతో తృప్తినిస్తుంది. అది చాలు నాకు! – బాలు గారితో గాయనిగా నాకు గల అనుబంధాన్ని, అనుభూతిని గురించి ఇంతకు మించి చెప్పేందుకు మాటలు లేవు.

♣ నళినీ! మిమ్మల్నొక సీరియస్ ప్రశ్న వేయాలి. 15 యేళ్ళ పాటు శాస్త్రీయ సంగీతం – వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో శిక్షణ పొంది, ప్రావీణ్యత సాధించి ఈ నాడు ట్విన్ సిటీస్‌లో పేరున్న గాయనిగా గుర్తింపు పొందారు. కానీ మీ విలువైన సమయాన్ని సంగీతాన్ని అభ్యసించడానికై వెచ్చించారు కదా మరి నేడు గాయనిగా మీరు ఆశించినంత మేర ప్రతిఫలాన్ని పొందుతున్నారా? ఈ కెరీర్ మీకు ఆర్థికంగా తృప్తినిస్తోందా?

* కొన్ని క్షణాలు ఆలోచిస్తూ… వుండిపోయారు..

ఆర్థికపరంగా అయితే లేదనే చెప్పాలండి. రెమ్యునరేషన్ విషయంలో అసంతృప్తి వున్న మాట వాస్తవం. చాలా మంది నిర్వాహకులు సింగర్స్‌కి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి వెనకాడతారు. ఇంకొందరు, కార్యక్రమం పూర్తయ్యాక ఒప్పందం ప్రకారం ఇవ్వరు. తక్కువ మొత్తాన్ని ఇస్తుంటారు. మరి కొందరు, కార్యక్రమం జయప్రదమయ్యాక, ముఖం చాటేస్తుంటారు. ఇలాటి సందర్భాలలో… బాధేస్తుంది. అయితే ఇచ్చే దగ్గర కొందరు ఎక్కువిచ్చే వాళ్ళూ లేకపోలేదు. అదొక ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. అందుకే ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది అంతా దైవేచ్ఛగా భావిస్తుంటాను. డబ్బు కంటే అవకాశామే గొప్పదని, విలువైనదని నా అభిప్రాయం. అత్యాశ లేనే లేదు కాబట్టి.. అందరకీ అందుబాటులోనే వుంటాను.

♣ మీ భవిష్యత్తు ప్రణాళికలు?

* ఇంకా బాగా నేర్వాలి. పాటని ఇంకా తీర్చి దిద్దుకోవాలి అని తపిస్తుంటాను. వాయిస్ మాడ్యులేషన్‍లో ఇంకా గొప్ప గొప్ప మెలకువలు తెలుసుకోవాలి. ఇంకా నేర్చుకుంటూ అన్వేషిస్తూ, ముందుకెళ్తుండాలి. అది చిన్న ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం అని చూడను. పట్టించుకోను. అది కాదు ముఖ్యం. నా పాట ఎక్కడ పాడినా, గొప్ప గా వినిపడాలనేదే నా ముఖ్యోద్దేశం. అదే నా ప్రణాళిక లోని ప్రధానాంశం. పబ్లిసిటీలకు నేను చాలా దూరం. పాటతో మాత్రమే ప్రేక్షకులకు దగ్గరవ్వాలనేదే నా సూత్రం. అదే నా ఆశయం కూడా!

♣ వాయిస్ మాడ్యులేషన్ అంటూ మీరు తరచూ చెబుతుంటే ఒక మాట చెప్పాలనిపిస్తోంది. నళిని గారు! ఈ మాడ్యులేషన్ కొరవడటం మూలాన చాలా మంది సింగర్స్ స్వరం బావున్నా, పాటని విన్లేకపోతుంటాం. అలాటి సింగర్స్‌కి మీ సలహాగా చెప్పండి. వాయిస్ మాడ్యులేషన్‌ని మెరుగుపరచుకునేందుకు ఏదైనా కొత్త సాధనం వుందా?

* వుందండి. అదే ప్రాక్టీస్. ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుండాలండి. పాడిన పాటని రికార్డ్ చేసుకుని వింటుంటే తెలిసిపోతుంది ఎక్కడ పొరబాటు చేస్తున్నామూ అని! అది గ్రహించి, తప్పుల్ని సరిదిద్దుకుంటూ పోవాలి. శాస్త్రీయ సంగీతంలో కనీస పరిజ్ఞానం అవసరం. రోజూ జంట స్వరాలు తప్పని సరిగా ప్రాక్టీస్ చేస్తే స్వరంలో మెరుపుని గమనించవచ్చు. ఉదాహరణకి చెబుతున్నా… సినీ సంగీత విభావరీలలో ప్రేక్షకుల కోరికపై నేను మరి మరి పాడే జానపద సినీ గీతం… మాయదారి సిన్నోడు… మనసే లాగేసిండు అని ఇలా పాడాలి. అదే సాయిబాబా సన్నిధిలో భక్తి గీతం పాడుతున్నప్పుడు.. ‘సాయి దేవా సాయి దేవా పరమ పదంగా దొరికెనులె..’ అంటూ కంఠంలో భక్తి రసాన్ని ఒలికించగలగాలి. (రెండు పాటలు పాడి వాయిస్ మాడ్యులేషన్‌లో ఆ తేడా ఎలా వుంటుంది వినిపించారు.)

♣ మీ కుటుంబంలో సంగీత వారసుల్ని తయారుచేస్తున్నారా?

* వున్నారు కానీ, మా పెద్దబ్బాయి వెస్టర్న్ మ్యూజిక్ వైపు ఆకర్షితుడయ్యాడు. గిటార్ ప్లే చేస్తాడు.

♣ పాశ్చాత్య సంగీతాన్నీ ఆస్వాదిస్తుంటారా?

* మెలొడీ వరకు ఓకే కానీ రాప్, పాప్ అంటే చికాకే. భరించలేను. (నవ్వులు)

♣ ఎందుకనో కానీ, మనం వెస్టర్న్ సంగీతాన్ని ఆస్వాదించలేకపోడానికి కారణమేమిటంటారు?

* మన సంగీతంలో దైవత్వం గోచరిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమా! (నవ్వులు.)

♣. పెద్దబ్బాయి గిటారిస్ట్. సరే, రెండో అబ్బాయికి సంగీతంలో ప్రవేశమేమైనా వుందా?

* చిన్నప్పట్నించి ఇంట్లో సంగీతం విని వినీ విరక్తి కలిగిందో ఏమో.. అసలు సంగీతం ఊసే ఎత్తడు. (నవ్వులు)

♣ మీ వారికి?

* ఆయనకీ అంతగా ఆసక్తి లేదండి. ఐతే నాకు స్వేచ్చనిస్తారు. ప్రోగ్రాంస్ చేసుకునే వీలుని కల్పిస్తారు. కామెంట్ చేయరు.

♣ గురువు గారు ప్రశంసిస్తుంటారా ?

* ఎప్పుడూ మెచ్చుకోరు. ఎప్పుడైనా క్లుప్తంగా బావుంది అని మాత్రం అంటారు. కట్ చేసే చోట కట్ చేస్తారు. విమర్శించాల్సి వస్తే విమర్శిస్తారు. సలహాలు సూచనలు ఇస్తారు. తప్పుల్ని కరెక్ట్ చేస్తారు. అదే గొప్ప ప్రశంస నాకు. (నవ్వులు)

♣ గాయనిగా మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏదైనా జరిగిందా?

* వుందండి. ఒక సారి షిర్డీ వెళ్లాం. భక్తి గీతాలను ఆలపించడం కోసం. మమ్మల్ని తీసుకెళ్ళిన కార్యక్రమ నిర్వహణాధికారి, ఒక హిందీ సాంగ్ లిరిక్స్‌ని అందించి పాడమన్నారు. నేనప్పటికే తెలుగులో ఉన్న పాటను పాడుతున్నాను. అది విని ఆయన తన లిరిక్స్‌ని తెలుగులోకి అప్పటికప్పుడు అనువదించి పాడాననుకుని పొంగిపోయారు. రెండు సాహిత్యాలూ ఒకటే కావడం దైవ సంకల్పం. ఆ ఆనందంలో వాళ్ళు నన్ను గులాబీపూలను గంపలతో నాపై గుమ్మరించి సన్మానించిన ఆ వైనం నిజంగా నా జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది. ఆ మధురానుభూతిని మాటల్లో వివరించలేను! ఎప్పుడు తలచుకున్నా, ఆ జ్ఞాపకం తాజా గులాబీల అత్తరులా మనసంతా పరిమళంతో నిండిపోతుంది.

అలాగే మరో సారి ఏమైందంటే – కీసరగుట్ట లో శివరాత్రి జాగారం సందర్భంగా జానపద గీతాన్ని పాడుతున్నా.. కుయ్యీ కూయంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయానంటదే.. ఆ మాట అంటదే… (పాడి వినిపించారు)

ఈ పాట విని, ఒక ప్రొడ్యూసర్ వేదిక మీదకి వచ్చి, తన ఆల్బంలో నన్ను పాడాల్సిందిగా కోరారు. అలా ఆ ఆల్బం వెలుగులోకి వచ్చింది. మంచి పేరుని తెచ్చిచ్చింది.

♣  మీ అభిమాన గాయనీ ఎవరు?

* అందరూ అభిమాన గాయనీ గాయకులే. జానకి అంటే మరి మరి అభిమానం. వ్యక్తిగతాభిమానమూ వుంటుంది. సింగర్స్ సత్ప్రవర్తన, సద్గుణ సంపద కూడా అభిమానానికి తోడై, ఎనలేని ఆత్మీయతని పెంచుతుంది. అలాంటి గాయనీమణుల్లో సురేఖా మూర్తిని పేర్కొనాలి. ఈ గాయని అంటే నాకు చాలా ఇష్టం. గురువు గారి ఆధ్వర్యంలో సురేఖా మూర్తితో కలిసి రికార్డింగ్‌లో పాల్గొనడం జరిగింది.

ఆ రోజు క్రిస్టియన్ పాటలను రికార్డింగ్ చేస్తున్నాం. అక్కడ్నించి అనాథ పిల్లలు పదిపన్నెండుమంది వచ్చారు – కోరస్ పాడటం కోసం! సురేఖా మూర్తి గారు, నేనూ ప్రధాన గాయనీమణులం. ఆమె అంత పెద్ద పేరున్న సింగర్ అయినా, తాను సీనియర్‌ని అన్న భావమే లేకుండా పిల్లలని తన దగ్గర కూర్చోబెట్టుకుని వారికి ప్రేమతో సూచనలు సలహాలిస్తూ ప్రోత్సహిస్తూ, పాడించిండం చూసినప్పుడు ఆమె మీద గల నా అభిమానం రెట్టింపు అయిందని చెప్పాలి. స్వరార్చనలో కూడా నేను వారి గురించి చెప్పాను. ఉత్తి ప్రతిభ మాత్రమే కాదు, గాయనీమణుల ఉన్నత వ్యక్తిత్వం కూడా మనలని కదిలిస్తుంది. అనిర్వచనీయమైన అభిమానాన్ని కలిగిస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా చెబుతుంటాను.

గురువు గారి సంగీత దర్శకత్వంలో ఒక పాటలో క్లిష్టమైన ఆలాపన వుంది. సురేఖ మూర్తి గారు అంత అనుభవమున్న గాయని, ఏ వన్ రేడియో ఆర్టిస్ట్ అయినా కూడా ఆమె భయపడుతూ అన్నారు.. ‘నేనీ ఆలాపన చేయగలనో లేనో’ – అని అంటుంటే అనిపించింది. పాట పట్ల వారికున్న గౌరవం ఎంత గొప్పదో కదా అని. ‘నా పాటలో తప్పులుంటే చెప్పి, మళ్ళీ పాడించండి’ అంటూ మా గురువుగారిని అభ్యర్ధించడం విన్నాక ‘ఎంత హంబుల్..’ అని ఆశ్చర్యపోయాను. మరోసారి ప్రోగ్రాంలో కళాకారులం అందరం కలిసి లంచ్ చేస్తున్నాం, ఆమె మా అందరితో కలిసి నేల మీద కుర్చుంటుంటే, వొద్దు వొద్దు అంటూ వారించబోయాం. కానీ ఆమె విన్లేదు. ఒక సాధారణ వ్యక్తిలా మా అందరిలో కలిసిపోయి, కబుర్లు చెబుతుంటే ఎంతో ఆనందమేసింది. ఎంత నిగర్వి! భేషజమే లేదు.

అలానే చిత్ర గారు అంటేనూ ఇష్టం.

♣ గాయకులలో – మీ అభిమాన గాయకులు?

* నిస్సందేహంగా బాలు గారే. చిన్నప్పట్నించీ కూడా అదేమిటో మేల్ సింగర్స్ పాటలు పాడుతుండేదాన్ని. అలా బాలు గారి పాటలనేకం వింటూ, ప్రాక్టీస్ చేస్తూ వుంటం వల్ల, ఆయన గాత్రం అంటే నాకు మహ ప్రియం.

♣ మీరు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ గీతాలు కూడా అలవోకగా పాడుతుంటారు. ఈ భాషలని ఎలా నేర్చుకున్నారు?

* మా ఇంట్లో తమిళం, కన్నడం, మిక్స్ చేసి మాట్లాడుతుండేవాళ్ళం. అలా వచ్చేసాయి.

♣ పర భాష తెలిసి వుంటం వల్ల, గాయని పొందే విజయం ఏమిటంటారు?

*సాహిత్యంతో సాన్నిహిత్యం కలిగుతుంది. తద్వారా గానం ప్రేక్షకుల మనసులని అలరిస్తుంది. కన్నడంలో ఒక పాటుంది. ఒక గుడ్డి కుక్క సంత కొచ్చింది అంటూ.. అలానే హిందీలో నా మూరత్ మె నా మె వ్రత్ మె..’ అర్ధం తెలిసి పాడటంలో మనకి ఇన్వాల్మెంట్ వుంటుంది. పాటతో కనెక్ట్ అయివుంటాం. వినేవారికి వినసొంపుగా వుంటుంది. భావమెరిగి పాడే ప్రతి పాటా అద్భుతంగా రాణిస్తుంది.

♣ నళిని గారు! మీ పాట లానే మీ మాటలూ మమ్మల్నెంతగానో అలరించాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినందుకు ధన్యవాదాలు. ఇలానే మీరు ఇంకా ఇంకా.. ఎన్నో ఎన్నెన్నో కీర్తి శిఖరాలనధిరోహించాలని కోరుకుంటూ మా సంచిక తరపున మీకు నా ధన్యవాదాలు అందచేస్తున్నాను.

* నా మనో భావాలను మీ అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా వుందండి. అందుకు – మీకు, సంచిక సంపాదకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి! అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

***

నళిని సెల్ : 9392484392

 

*******

  1. రామ రామ ఎల్లమ్మకు.. | Rama Rama Yellammaku Folk Song | #Bonalu Folk Songs 2018 | Bhakthi TV

         https://www.youtube.com/watch?v=Wi08Whb2k98

  1. Goddess Sri Laxmi Devi || Telugu Devotional Songs || N.Surya Prakash, Nalini
  1. Swararchana Special Program with Singer Smt. Nalini Sridevi – Part 03

 https://www.youtube.com/watch?v=mEWjk4m3vKU

  1. https://www.youtube.com/watch?v=mEWjk4m3vKU
  1. Music Director and Lyricist Kasarla Shyam Special – Swararchana

https://www.youtube.com/watch?v=tmH9VMYMa7A

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here