ట్విన్ సిటీస్ సింగర్స్-5: ‘నా పాట నాకు ప్రాణం. అది నా రాధకే అంకితం’ – కె.మోహన్!

0
1

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన ‘నా పాట నాకు ప్రాణం. అది నా రాధకే అంకితం’ అనే బహుగళ గాయకులు శ్రీ కె.మోహన్ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

ఈ గాయకుని పేరు మోహన్. పేరుకు తగినట్టే, సినీ గీతాలను మోహనంగా ఆలపించి, ప్రేక్షకుల మనసులను రంజింపచేయడంలో, ఈ గాయకులు తనదైన ముద్రను కలిగివున్నారని చెప్పక చెప్పాలి. ఏ ఇతర గాత్రాన్ని, గాయకుణ్ణీ అనుసరించరు. ఫలానా సింగర్‌లా పాడాలని తహతహలాడరు.

తెలుగు హిందీ చిత్రాల నేపథ్య గాయనీ గాయకులందరి పాటలను అలవోకగా పాడతారు. అన్ని తరహాల గానాలను తన గళానికెత్తుకుంటారు. మోహన్ గారిదొక ప్రత్యేకమైన స్వరం. అందుకు తగినట్టు అనుసరించే విధానమూ నూతనం. మొత్తం వెరసి, వారిదొక అరుదైన స్టైల్. అది ఆయనకే సొంతం అని చెప్పాలి. గళంలో ఎప్పటికప్పుడు ఒక నూతనత్వాన్ని నింపుకోవడం అనే ప్రక్రియ ఎలాటిదంటే, ఈ గాయకుడు చేస్తున్న నిరంతర సినీ గాన సాధనకి ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పాలి.

వృత్తి పరంగా ఒక కంపెనీలో సి.ఇ.ఓ.గా బాధ్యతాయుతమైన ఉన్నత పదవిలో వున్నారు. అధికారికంగా బరువు బాధ్యతలు నిర్వర్తిసూ, మరో వైపు చలన చిత్ర గీతాలతో కూడిన సంగీత విభావరులలో విరివిగా పాల్గొంటూ, తన ప్రతిభని చాటుకుంటూ… రోజులో ప్రతి క్షణం బిజీ బిజీగా గడిపేస్తుంటారు. అయినా, ఆ మోవిలో ఎక్కడా టెన్షన్ కనిపించదు. పైగా, చెక్కు చెదరని నవ్వు తన సొంత చిరునామాలా నవ్వుతూ కనిపిస్తారు. ఎదుటి వారితో స్నేహపూర్వకమైన పలకరింపు, హృదయపూర్వక కరచాలనం, సహ గాయనీ గాయకులతో కలిసిమెలిసి హాస్యాన్ని రంగరిస్తూ కబుర్లు చెబుతారు. అడిగితే, పాటకి సలహాలు ఇస్తారు. కో సింగర్స్ పాటలని ఆలకించడం, ఆ ఆనందాన్ని అభినందనల ద్వారా అందచేయడం, కొత్త వారికి సాదర స్వాగతం పలకడం, ఈ కళాకారునిలో నేను కనుగొన్న సంస్కారాలు. తన చుట్టూ వున్నవాళ్ళందరూ తన వాళ్ళే అనే భావం మెండు.

మోహన్ గారికి త్యాగరాయ గాన సభలో అభిమానులకు కొదవలేదు. ‘అన్నా అంటూ పిన్నలు, తమ్ముడూ అంటూ పెద్దలు, మోహన్ అంటూ స్నేహితులు, మోహన్ గారూ అంటూ తెలిసిన వారు ఎంతో ఆనందంగా ఆయన చుట్టూ చేరతారు. విష్ చేస్తారు. వేదిక మీద ఆయన పాట కనుగుణంగా ప్రేక్షకుల స్పందన వుంటుంది. చప్పట్లకి కొదవే వుండదు. ఈలలు, వన్స్ మోర్ కేరింతలూ ఆయన పెర్ఫామెన్స్‌కి ప్రేక్షకులు ఇచ్చే బహుమానాలు. ‘సింగర్ కి ఇంతకు మించిన విజయం ఏం వుంటుంది? ఇంతకు మించిన ఆత్మ తృప్తి ఎవరివ్వగలరు? ప్రేక్షక దేవుళ్ళు తప్ప’ అని అంటారు మోహన్, నిండుగా నవ్వుతూ.

మనసుని పాటతో ఆకర్షించి, మనిషిని మాటతో ఆకట్టుకుంటూ మంచి హృదయం గల గాయకునిగా గుర్తింపు పొందిన బహుగళ బిరుదాంకితులైన ప్రఖ్యాత గాయకులు శ్రీ కె. మోహన్ గారితో నే జరిపిన మాటా మంతీ అంతా ఈ ఇంటర్వ్యూ ద్వారా అందిస్తున్నాను.

> మన ట్విన్ సిటీస్ సింగర్స్ కోసం ప్రభుత్వం ఎలాటి సాయం అందిస్తే బావుంటుందని భావిస్తున్నారు?
* బానర్స్‌కి, ప్రోగ్రాంకి ఆర్ధిక సాయం చేస్తే బావుంటుందనుకుంటున్నాను. గ్రాంట్ ఇస్తే, నిర్వాహకులు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. తద్వారా, సింగర్స్ కూడా ఎక్కువ పాటలు పాడుకునే అవకాశం దొరుకుతుంది. ప్రతిభ రాణిస్తుంది. అలానే, గవర్నమెంట్ – ఒక లెర్నింగ్ స్కూల్ ప్రారంభించి ట్రాక్స్ మీద పాటలని సాధన చేయించే ఒక ఫాకల్టీతో స్కూల్ వుంటే బావుంటుంది. పాడాలనుకునే వారందరకీ ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తే చాలా బావుణ్ణు కదాని నా ఆశ!
***
> ఆనాటి సినిమా పాటలకీ ఈనాటి పాటలకీ మధ్య గల దూరం ఎంతని భావిస్తున్నారు?
* సాహిత్యంలో చాలా దూరం పెరిగింది. పాటకి సంగీతం కూర్పు ఎంత బావున్నా, ఆనాటి సాహిత్యపు విలువల్ని మనం కోల్పోతున్నాం. ఇదెంతైనా విచారించదగినదని నా వ్యక్తిగత భావన.

***

> మోహన్ గారూ, త్యాగరాయ గాన సభలో మీకూ మీ పాటకూ వున్న క్రేజ్ గురించి మీరేమనుకుంటున్నారు?

*మీరు క్రేజ్ అన్నారు. బావుంది కానీ, నిజానికి అది నా అభిమానుల నాపై కురిపిస్తున్న అభిమానం అని చెప్పాలి, ఒప్పుకోవాలి నేను పాడే తీరు, వాయిస్ కల్చర్ వారికి చాలా నచ్చుతుందని చెబుతుంటారు. నేనెవర్నీ ఇమిటేట్ చేయకుండా నాలానే పాడటం వల్లే నేనెక్కువ మంది అభిమానుల్ని ఆకట్టుకుంటోందని నా నమ్మకం. నా చుట్టూ వున్నవారందర్నీ ఆప్యాయంగా పలకరించడం, సరదాగా నవ్వుతూ మాట్లాడటం.. అది నా స్వభావం. బహుశా నా ఈ వ్యక్తిత్వం వల్ల ఎక్కువమంది మిత్రుల్ని, అభిమానుల్నీ సంపాదించుకోగలిగానేమో! క్రేజ్‌కి కారాణాలివే అని నా అంచనా.

> దరిదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రోగ్రాంలో పాట పాడుతుంటారు కదా, ప్రొఫెషనల్‌గా ఎంతో వొత్తిడి గల ఉన్నత అధికారి అయి వుండీ కూడా పాటలు కోసం టైం కేటాయించడం ఆశ్చర్యంగా వుంటుంది. పాత పాటలు వింటానికీ, కొత్త పాటలని నేర్చుకోడానికి మీకు టైమెలా దొరుకుతుంది?

* సమయం అన్నది మన చేతిలోనే వుంటుందండి. మనకు నచ్చిన, మనసు మెచ్చిన పని చేయడానికి టైం అనేది ఎప్పుడూ ఒక అడ్డు గోడ కానే కాదు. పాట నా ఊపిరి. పాట నా శ్వాస. పాట వినడం, పాడటం, నేర్చుకోవడం అనే ఈ మూడు ముఖ్య పనులు నా దినవారీ చర్యలలో ఒక భాగం. అందుకే, టైం చూడను. పట్టించుకోను. నిరంతరం పాటలు వింటూనే వుంటాను.. పాడుతూనే వుంటాను. పాటలు నేర్చు కోడానికి టైం లేదన్న మాట నా డిక్షనరీ లోనే వుండదు.

> పాట మీద మీకింత ప్రేమా, మోజు ఎలా కలిగింది? ఎప్పట్నించీ పాడుతున్నారు వేదికల మీద?

* చిన్నప్పటి నుండీ, రేడియోకి అతుక్కుపోవడం, అవకాశం వొస్తే చాలు పాడటం అలవాటు. ఇక వేదికల మీద పాడటం నా అయిదవ తరగతి నించే మొదలైంది. నేను 1967 నుండి పాడుతున్నాను. స్కూల్ రోజుల్లో ప్రతి పాటల సందడిలోనూ మొదటి బహుమతి ఎప్పుడూ నాదే!

> ఎన్ని ప్రోగ్రాంస్ ఇచ్చి వుంటారు ఇప్పటి దాకా?

* లెక్కంటూ లేదు గానీ, కొన్ని వందలనే చెప్పాలి. మోర్ దాన్ 250 మంది గాయనీ మణులతో పాడాను ఇప్పటి దాకా!

> ఏమనిపిస్తుంది, ఇంతమంది సింగర్స్‌తో కలిసి పాడినందుకు?

* చాలా గర్వంగా వుంటుంది. రికార్డ్ బ్రేక్ కదా మరి (నవ్వులు).

> మీరు అంతర్రాష్ట్రాలలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ పాటలు పాడారు కదా, వాటి అనుభవాలను పంచుకోగలరా?

* ప్రేక్షకులు కానీండీ, శ్రోతలు కానీండీ.. సింగర్‌లో మొదట చూసేది శృతి. లయ. తాళం. వాయిస్ కల్చర్. ఈ లక్షణాలే వాళ్ళని ఆకట్టుకుంటాయి. ఈ అర్హతలని సొంతం చేసుకుని వుంటే ఏ గాయకుడు అయినా సరే, ఎన్ని రాష్ట్రాలనైనా, దేశాలనైనా కార్యక్రమాలను జయించుకుకొచ్చేస్తాడు. నా మెలొడీస్ ని ఇష్టపడే ప్రేక్షకాభిమానులు నాకు విదేశాల్లోనూ వున్నారని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.

> మీ ఎవర్ గ్రీన్ సోలో? డ్యూయెట్?

* ఒక్క పాటలో చెప్పాలంటే ఎలా? (నవ్వులు). నేను పాడిన వేల పాటల్లో అలాటివి ఎన్నో వున్నాయి. అయినా, చెప్పాలంటే – మూడేళ్ళ కిందట పాడిన ‘నిజమైనా కల అయినా నిరాశలో ఒకటేలే.. ‘ అనే పాట ఇప్పటికీ, ఎప్పటికీ నా ఫేవరేట్ సోలో. ఇక యుగళ గీతం అంటారా… చెప్పనా? (నవ్వుతూ) మీతో కలిసి పాడిన ‘నీలి కన్నుల నీడల లోన..’; పీబి శ్రీనివాస్, సుశీల పాడిన పాటంటే చాలా ఇష్టం. ఎన్నో యేళ్ళనించి ఆ పాట అలా నా ఫేవరేట్ సాంగ్‌గా నిలిచిపోయింది.

> మీ అభిమాన సింగర్స్ ఎవరు? ఎందుకు? ఎలా?

* నన్ను అందరూ మెలొడీ అండ్ మెలంకొలీ సింగర్ అని పిలుస్తారు. ఎందుకంటే నేనెక్కువగా హిందీలో ముకేష్‌ని చాలా చాలా ఇష్టపడతాను. ఆ ప్రభావం బహుశా నా గాత్రంలో ప్రతిధ్వనిస్తూండవచ్చు. అందుకే నన్నలా పిలుస్తారని భావిస్తుంటాను. రసరమ్యంగా పాడే ప్రతి గాయకుని స్వరమూ నాకు ఆరాధ్యమే. అభిమానమే.

> హిందీ పాటలు కూడా బాగా పాడుతుంటారు? ముఖ్యంగా డిక్షన్ – చాలా బావుంటుంది. హిందీ రాష్ట్రాలలో నివాసముండేవారా?

* లేదండి. నేను ఆంధ్రా లోనే పుట్టి పెరిగాను. తెలుగు నా మాతృభాష. టెంత్ క్లాస్ దాకా హిందీ చదువుకోవడం మూలాన, హిందీ చదవడం రాయడం వచ్చేసింది. ఆ పైన మా ఫామిలీ అందరం కలిసి హిందీ పాటలు పాడుకుంటూ వుండేవాళ్ళం. అలానే వివిధ్‌భారతి లో ప్రసారమయ్యే హిందీ పాటల ప్రోగ్రామ్స్‌ని మిస్సవకుండా వింటుండేవాణ్ణి. దాంతో నాకు హిందీ పట్ల మంచి అవగానే కలిగింది. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా, హైదరాబాద్‌లో సెటిల్ అవడం, హిందీ మాట్లాడే వివిధ ప్రాంతాల కొలీగ్స్ వారితో కలిసి పనిచేయడం, వారితో మాట్లాడటం వల్ల కూడా, హిందీ నాకు రెండో తెలుగు భాషలా మారిపోయింది (నవ్వులు). అయినా, సింగర్స్‌కి భాషా భేదాలుండవు కదా! (నిజాయితీ నిండిన స్వరంతో చెప్పారు).

> నిజమేనండి. భాషా భేదాలు వుండవు. మీరు ఇప్పటి దాకా పొందిన అవార్డ్స్, బిరుదులు, ప్రశంసా పత్రాలు గురించి తెలుసుకోవాలనుంది.

* అవి నా పాటకి మాత్రమే కిరీటాలు అని నా భావం. చిన్నపట్నుండీ స్కూల్, కాలేజ్, పీజీ యూనివర్శిటీస్‌లో – ఇలా స్థాయీల వారీగా పాటల పోటీలలో, బహుమతులు గెలుచుకుంటూ వుండేవాణ్ని. మీకో మాట చెప్పనా!? – ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్ ట్రాఫీస్ అన్నిట్లోనూ ప్రైజులు నావే. యెస్. బిరుదులూ వున్నాయి. ప్రముఖంగా చెప్పాలంటే ‘బహుగళ గాయక రత్న’, ‘స్వర వెన్నెల’, ‘స్వర భూషణ’ లను పేర్కొనాలి. అలానే, మరపురాని పురస్కారం మాటకొస్తే, నాకు ప్రత్యేకంగా అందిన – ‘ఘంటసాల పురస్కారం’ అని చెప్పాలి. ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నా పేరు మెరవడం, నా పాటకి నేను అలంకరించిన ఒక కాంతివంతమైన మణికిరీటం లాటిదని గర్వంగా ప్రకటిస్తాను. ఈ బిరుదులూ, సత్కారాలు, పురస్కారాలు, అవార్డ్స్, ప్రశంసలు, పొగడ్తలు ఏవీ నాకు చెందినవి కావు. నా పాటకి నేను తెచ్చిపెడుతున్న పరువు ప్రతిష్ఠలు. కీర్తి కిరీటాలు. నా ఆరాధ్య దేవతకి అలంకార ఆభరణాలు అని నేను భాస్తాను.

> ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ వుంటుందంటారు? మరి – మీ నిరంతర గాన ప్రస్థానం వెనక మీ విజయాల వెనక మీకు వెన్నుదంటుగా నిలిచిన స్త్రీ ఎవరు?

* నా విజయం వెనక కూడా ఒక స్త్రీ వున్నారు. ఆమె ఎవరో కాదు. నా భార్య రాధ! ఆమె నన్నెంతగా ప్రేమిస్తుందో, నా పాటనీ అంతకు మించి ప్రేమించే స్త్రీ! ఆమె ప్రేమ స్నేహం నాకు తోడుగా దొరకడం, నా అదృష్టంగా భావిస్తాను. నా పాటనే కాదు, ….. నా ఇరాటిక్ టైం ని ప్రోత్సహిస్తూ, నన్ను నా పాటల ప్రపంచంలో స్వేచ్చనిస్తూ, తనూ నాతో కలిసి పయనిస్తూ.. నన్ను మున్ముందుకు నడిపిస్తున్న మిత్రురాలు, నా నేస్తం – నా భార్య అని గర్వంగా చెప్పుకుంటాను. పాటలు విండానికీ, నేర్చుకోడానికీ రోజులో చాలా సమయాన్ని వెచ్చించాల్సి వుంటుంది. మరో పక్కన ఫుల్ టైం జాబ్. బాధ్యతాయుతమైన అధికార నిర్వహణలో నా విధుల్ని నిర్వర్తించడానికి – రెంటికీ సమయం చాలదు. మరి ఎలా సాధ్యమౌతుంది అంటే – ఆమె సహకారం వల్లనే అని చెప్పాలి.

పాటలకు మాత్రమే కాదు, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, ఇల్లూ, సంసారం, కుటుంబం బాధ్యతలను పంచుకోవడం, నాకెలాటి టెన్షన్స్ లేకుండా, నా వరకు రానీకుండా చూస్తుంది. నాకెంత గానో తన తోడ్పాటుని అందచేస్తుంది.

ఆమె నా పాటకి ఊపిరి. అందుకే పాట నా ఊపిరి అయింది. ఆమె వల్లే పాటలు పాడి ఎనలేని ఆనందాన్ని పొందగల్గుతున్నాను. ఈ పేరు, ప్రఖ్యాతి, ఈ సంతోషం, ఈ కీర్తి, – మీరన్నారు చూసారూ? విజయం అని.. అవునండి. నా విజయం వెనక రహస్యం రాధే (నిండుగా నవ్వేస్తూ..). ఆమె అంటే నాకు ఎనలేని గౌరవం. నాతో కలిసి నా అడుగులో అడుగుగా నడుస్తున్న నా రాధకి నా పాట అంకింతం.

> మీ దంపతులు – మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా మా అందరకీ సుపరిచయమే! ఆదర్శ దంపతులుగా మీరు గుర్తింపబడటం ఎంతైనా ప్రశంసనీయమని అనుకుంటారు అందరూ! మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళా?

* ప్రేమ వివాహమేనండి. తను నేనూ కలిసి బాంక్‌లో కలిసి పనిచేసాం. నా పక్క సీటే. అలా పరిచయం, మాటలు కలిసాయి. ఆ తర్వాత ఆమె 1983లో నా జీవన వనం లోకి వంసంతలా నడచి వచ్చేసింది (నవ్వులు). (ఆమె అందంగా సిగ్గుపడుతూ నవ్వారు, భర్త మాటలకి).

> మీ పాటని ముందుగా ప్రోత్సహించిన వారు ఎవరు?

* వున్నారు. మరో ఇద్దరు స్త్రీమూర్తుల గురించి కూడా చెప్పుకోవాలి. నేను అక్కా అని పిలుచుకొనే కమల సోదరి వున్నారు. ఆమెకి నా పాటంటే ప్రాణం. చిన్నప్పట్నుంచీ, నన్ను ప్రోత్సహిస్తూ నా చేత పాటలు పాడించుకుని వింటూ, వేదికలపై పాడిస్తూ, మెచ్చుకుంటూ, నా వెన్ను తట్టి నడిపించింది ఆ అక్కే. నేనొక పెద్ద గాయకుణ్ణి కావాలని, తన తమ్ముణ్ణి అందరూ మెచ్చుకుంటుంటే చూడాలని మురిసిపోతూ నన్ను ఎన్నో సార్లు ఆశీర్వదించింది. ఇప్పుడు నా పాటకు లభించిన ఈ గుర్తింపు చూసి చాలా సంతోషిస్తోంది. మా అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే వుంది. తను బెంగళూరులో వుంటోంది. నా ప్రోగ్రామ్స్, పాటలు, అన్నీ ట్రై నెట్, యూట్యూబ్ వీడియోస్ ద్వారా నా పాటలు ఎంతో శ్రధ్ధగా విని, తన ప్రశంసలను అందచేస్తూ వుంటుంది.

మరో స్త్రీ మూర్తి మా అమ్మ. మా అమ్మ కైతే, నా పాటంటే ప్రాణం. ‘వస్తాడు నా రాజు ఈ రోజు’ అనేపాటని మరి మరి పాడించుకుని విని, ఆనందపడేది. ఇలా – నాకు స్ఫూర్తి నిచ్చిన స్త్రీ మూర్తులున్నారు.

అలానే మీరూ, నా పాటని చాలా సార్లు మెచ్చుకున్నారు. ఒక ప్రత్యేకమైన పోగ్రాం కూడా ఆర్గనైజ్ చేసారు. రాధకి ఆనాటి ప్రోగ్రాం చాలా నచ్చిందంటూ, మాటల్లో ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంది.

> అవును మోహన్ గారూ, మీ గళం విన్నప్పుడనిపించింది నాకు, మీ స్వరంలో బాలూ గారి పాటలతో పాటు, పిబీ, ఎ ఎం రాజా, రఫీ, తలక్ మహమూద్, పాటలు బాగా రాణిస్తాయని. అదే మాట మీతో అనడం, మీతో ఒక ప్రోగ్రాం చేస్తానని అడగడం మీరంగీకరించడం, అది అలా కార్య రూపం దాల్చి, జయప్రదం కావడం ఎంతైనా ముదావహం. ఆ రోజు మన టీమ్ అందరమూ కలిసి వేదికపై అభినందనలు అందుకున్నాం. మరోసారి మీకు కంగ్రాట్స్.

* మీకు కూడా నా థాంక్స్.

> పాటల కార్యక్రమాలలో లైవ్ మీద పాడటం ఇష్టమా? లేక కరఒకె మీద పాడటం సులువనుకుంటారా?

* యెస్. అలవాటైతే, కరఓకే కూడా ఈజీనే. అయితే లైవ్‌లో మనకుండే అడ్వాంటేజ్ ఏమిటంటే – ఇన్‌స్ట్రుమెంట్స్ సహకారం చాలా వుంటుంది – గాయకునికి. అదే, ట్రాక్ మీదైతే, అది మన మాట వినదు (నవ్వులు). అది మనకోసం ఆగదు. కదా మరి!

>. ఇన్ని వేల పాటలు పాడారు కదా, మరి మీరు పాటనెలా సెలెక్ట్ చేస్కోవడంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకుంటారు?

* పాడగలనా లేదా అని పాటని బాగా పరిశీలిస్తాను. అందుకు చాలా ఆలోచించి, నిర్ణయం తీసుకుంటాను. అంతకంటే ముందు ప్రేక్షకులకి, అధిక శాతం వారు ఇష్టపడే, పసందు గీతానికే ప్రాధాన్యత ఇస్తాను. ఆడియన్స్‌కి రీచ్ అవుతుందా లేదా అనేది నా ప్రయారిటీ! అదెంత మంచి పాటే అయినా, ప్రేక్షకులకు రీచ్ కానప్పుడు ఆ పాట కోసం సింగర్ ఎంత కష్టపడినా వృథానే అనేది నా అభిప్రాయం.

>. యంగస్టర్స్‌తో పోటీ పడి గెలవడానికి సీనియర్ సింగర్స్‌కి కావాల్సిన టెక్నిక్ ఏమిటంటారు?

* బాడీ లాంగ్వేజ్ – కెమిస్ట్రీ! ముఖ్యంగా మనం మన సహ గాయనీ గాయకులు ఎవరు కానీండీ, కంఫర్ట్‌ని ఇవ్వాలి. మన పాటని వాళ్ళూ ఎంజాయ్ చేయగలిగి వుండాలి. అందుకే కావొచ్చు, – సీనియర్, జూనియర్ గాయనీ గాయకులు అందరూ – నాతో పాడాలని, కోరుకుంటారని, ముందుకొస్తారని చెప్పేందుకు సంతోషంగా వుంధి.

> ట్విన్ సిటీస్‌లో మీకిష్టమైన అభిమాన గాయని?

* అయ్యో. మళ్ళీ కష్టమైన ప్రశ్న వేశారు. ఎందుకంటే, నేనే పాటల బడిలో ఎల్‌కేజీ నుండి, ఇప్పుడే యూకేజీలోకి వచ్చాను (నవ్వులు). సింగర్సందర్నీ అభిమానిస్తానండి. నేనందర్నీ అభిమానిస్తూనే ముందుకి వెళ్తాను. లాంగ్ వే. బట్ లైఫ్ ఈజ్ షార్ట్.

> మోహన్ గారూ, మీరు కూడా బాలూ గారిలా ఫిమేల్ సింగర్స్ పాటలు పాడేవారని చెప్పారు? ఎలా పాడేవారు?

* ఎలా అంటే, నా గొంతుతోనే. బాలు గారిలా ఫిమేల్ వాయిస్‌తో పాడేవాడిని కాదు. కానీ ఫిమేల్ పాడిన పాటలని మేల్ వాయిస్‌తో పాడేవాడిని.

> నాదొక సందేహం! ఫిమేల్ సింగర్స్ సోలో పాటల్ని – మేల్స్ ఎందుకు పాడరు? మీరెప్పుడైనా ఒక ప్రయోగంగా పాడారా వేదికలమీద?

* చాలా ఫిమేల్ ఏక గళ గీతాలను పాడానండి (నవ్వులు). ఇంకా పాడుతూనే వున్నా. నన్ను ఈ హైదరాబాద్ వేదికకి పరిచయం చేసింది అద్భుతమైన ఆ గాయనీ మణి పాటే. 🙂 మణి పూస వంటి గానం. సుశీలమ్మ పాడారు. ఆడబ్రతుకు సినిమాలో. నేనొకసారి 2003లో ఈ అరుదైన పాటని ఎంచుకుని పాడాను. ‘పిలిచే నా మదిలో వలపే నీవు సుమా.. రారాజు ఎవరైనా కాని నా రాజు నీవే సుమా..’ అని పాడిన నా పాట ఒన్స్ మోర్ అంటూ చప్పట్లతో కూడిన మెప్పులను అందుకుంది. ఎప్పుడు పాడినా ఆ పాటకి జనాదరణ పొందుతూనే వుంది. వుంటుంది కూడా. సుశీల గానామృతం అలాటిది. సంగీత దర్శకుల ప్రతిభకి పట్టం కట్టిన గానం మరి!

> అలా పాడకూడదన్న రూలేమీ లేదన్న నా వాదనతో మీరూ ఏకీభవిస్తున్నందుకు సంతోషంగా వుందండి. ఆ పాటల్ని పాడకపోవడం వలన అద్భుతమైన మెలొడీస్ మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది. మీరేమంటారు?

* పూర్తిగా నేనూ మీతో ఏకీభవిస్తానండి. ఫిమేల్ సోలోస్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ వున్నాయి. ఇటు తెలుగులో, అటు హిందీలో కూడా! అందుకే ఆ పాటలను వేదిక మీద ప్రెజెంట్ చేసే ఒక నూతన ప్రక్రియకు నేనెప్పుడో శ్రీకారం చుట్టాను. ఆ సాంప్రదాయాన్ని నేనిప్పటికీ కొనసాగిస్తూ నే వున్నాను. ఇటీవల నా ప్రోగ్రాంలో లత పాడిన ‘లగ్ జా గలే కి ఫిర్ యే హసీ రాత్ హో న హో..’ పాడాను. ప్రేక్షకుల నించి నేనూహించని గొప్ప స్పందన వచ్చింది. అది ఒక్కటే నిరూపణ, మేల్ పాడినా ప్రేక్షకులు ఇష్తపడతారని, ఆదరిస్తారని.

> సినీ నేపధ్య గాయకులు కావాలని ఎప్పుడైనా ప్రయత్నించారా?

* లేదండి. ప్రయత్నించలేదు.

> ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేసారా?

* ఊహు. నాకు అంత సమయం లేదు. అసలు ఆలోచనా లేదు.

> యూట్యూబ్‍లో మీ పాటలు చూడాలనుకునే వారికి లింక్ ఐడీ చెబుతారా?

* యూ ట్యూబ్‌లో – మోహన్ కళ్ళేపల్లి అని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే, నా పాటలన్నీ వచ్చేస్తాయి.

>ఎన్ని పాటలు అప్లోడ్ చేసారు?

* 1500 సాంగ్స్.

>అబ్బో!! రికార్డ్ బ్రేక్!

* (నవ్వులు) కావొచ్చు.

> మీ పాటల ప్రయాణంలో మీరు మరపు రాని క్షణాలు?

* చాలానే సంపాదించుకున్నాను. కొన్ని మరి మరి మరపురాని మధుర క్షణాలున్నాయి. పాట రసరంజకంగా వున్నప్పుడు, ప్రేక్షకులు ఈలలు వేస్తూ, వన్స్ మోర్ అంటూ కేరింతలతో చప్పట్లు వినిపిస్తుంటే…. అబ్బో, ఆ క్షణాల్లో కలిగే ఆనందానుభూతులకి … ఒహ్హో! హద్దే వుండదు. ఒక సారి జమున గారు, నారాయణ రెడ్డి గారి సమక్షంలో – ‘ పగలె వెన్నెల, జగమే ఊయలా’ అనే పాట పాడాను. నా పాట విని వారు మెచ్చుకున్నప్పుడు, ఆత్మీయ వచనాలతో ప్రశంసించినప్పటి ఆ క్షణాలు నిజంగా మధురాతి మధురమైన క్షణాలు. మరపురాని క్షణాలు అవి.

> ఇన్ని పాటలు ఎలా పాడగలుగుతున్నారు? మీకు, శాస్త్రీయ సంగీతం లో గానీ, ప్రవేశం వుందా?

* లేదండీ, నేర్చుకోలేదు.

> మరి క్లాసికల్ రాని సింగర్, సినీ గీతాలు పాడొచ్చు అంటారా?

* తప్పకుండా పాడొచ్చు. సింగర్స్ అందరూ, క్లాసికల్ నేర్చుకున్న వారు కాదు కదా! స్వరంలో శృతి లయ తాళం మీద పట్టు వుంటే చాలు. ఎవరైనా సినీ గీతాలను ఆలపించేందుకు అర్హులే అని నా అభిప్రాయం.

> అయితే ఒక చిన్న సందేహం. సంగీతం తెలీని కారణంగా ఈ పాట పాడి ప్రదర్శించలేకపోతున్నా అని మీరెప్పుడైనా నిరాశ చెందిన క్షణాలు వున్నాయా? వుంటే ఆ గీతం ఏమిటి?

 * అవును. నిజమే. అలా అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది. ‘శివశంకరి, రసిక రాజ తగు వారము’ .. లాంటి పాటలు ‘అయ్యో! పాడలేకపోతున్నానే’ – అని రవంత నిరాశగా అనిపిస్తుంది.

> అయితే, సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నారా?

* ఏమో నండి చెప్పలేను. నా ప్రొఫెషన్‌లో బిజీగా వుంటాను. సమయం వుండదు. అది అనుమతిస్తే తప్పకుండా నేర్చుకుంటాను.

> పాట పాడుతున్నప్పుడు తెర మీద హీరోలని కానీ, గాయకులని కానీ అనుసరించడం జరుగుతుందా ఏ సింగర్ కైనా?

* నేను ఏ సింగర్‌నీ అనుకరించను. నాదైన నా వాయిస్‌తోనే పాడటానికి ఇష్టపడతాను. అదే నా పాటలోని ప్రత్యేకత.

ఇక హీరో అని అంటారా? యస్. అప్పుడప్పుడు దృష్టిలోకి వచ్చేస్తారు, పాటతో బాటుగా కళ్ళల్లో మెదులుతారు. యన్.టి.ఆర్, ఎఎన్నార్‌ల పాటతో బాటు ఈ శరీరమూ అలా చిన్నగా మూవ్ అవుతుంది స్టేజ్ మీద. ఇలా అనేక సార్లు నాకనుభవైద్యకమే. ప్రేక్షకులు ఆ యా పాటలకు అనుగుణంగా నేను వేసే స్టెప్స్‌నీ ఆనందిస్తారు. తమ హర్షాన్ని కరతాళ ధ్వనుల ద్వారా వ్యక్తపరుస్తారు. అయితే ఇవి అన్నీ సరదా పాటలకు మాత్రమే పరిమితం.

> మీరెక్కువగా ఆడియో ఫాలో అవుతారా, లేక వీడియోపై ప్రాక్టీస్ చేస్తారా?

*నాకున్న సమయాన్ని బట్టి, పాటలని ఆడియో వీడియో రెండూ ఫాలో అవుతుంటాను.

> ఒకో పాటని ఎన్ని సార్లు వింటారు, ఎన్ని సార్లు పాడతారు?

* పాడేది, తక్కువే. వీలైనన్ని సార్లు పాటని వింటుంటాను.

> మాడ్యులేషన్ చెకింగ్ కోసం ఏ పధ్ధతి పాటిస్తారు?

* ట్యూన్‌తో కలిసి పాడుతాను.

> ఆనాటి సినిమా పాటలకీ ఈనాటి పాటలకీ మధ్య గల దూరం ఎంతని భావిస్తున్నారు?

* సాహిత్యంలో చాలా దూరం పెరిగింది. పాటకి సంగీతం కూర్పు ఎంత బావున్నా, ఆనాటి సాహిత్యపు విలువల్ని మనం కోల్పోతున్నాం. ఇదెంతైనా విచారించదగినదని నా వ్యక్తిగత భావన.

> కొన్ని పాటల్లోని సాహిత్య గుభాళింపులను ఏ సింగరూ మరచిపోలేరు కదూ? సాహిత్య పరంగా మీకు అధ్బుతం అని అనిపించిన గీతం ఏమిటి?

* అలా ఒకటి కాదు, చాలానే వున్నాయి. ఉదాహరణకి, – ‘మంటలు రేపే నెల రాజా ఈ తుంటరి తనమూ నీకేలా…’ అనే ఈ పాట సాహిత్య పరంగా నాకత్యంత అద్భుతమైన పాట అని చెప్పాలి.

> ‘ఈ పాటని వేదిక మీద పాడాలని వుంటుంది కానీ, హిట్ కాదని వొద్దంటుంటారు ఆర్గనైజర్స్…’ – అని కొందరు వెలితి ఫీల్ అవుతుంటారు. అలాటి గీతం ఏదైనా మీరు పాడకుండా మిస్ అయారా?

  * ఇప్పటి దాకా, నేను సెలెక్ట్ చేసుకున్న పాటని ఏ ఆర్గనైజేషన్ ‘వొద్దు’ అని అన్లేదు. అది నా అదృష్టం!

> మీ డ్రీం ప్రాజెక్ట్ ఏమిటి?

 * ప్రాజెక్ట్ అంటూ ఏమీ లేదండీ. శ్వాస ఆగి పోయే దాకా పాడుతూ వుంటమే నా ఆశ.

 > మీకు సినిమా అవకాశం వొస్తే?

* తప్పకుండా పాడతాను. అదొక అరుదైన అదృష్టంగా భావిస్తాను. కానీ ఆ అవకాశం కోసమని పరుగులు మాత్రం తీయను.

> బాలూ గారితో కలిసి పాడే అవకాశమొస్తే…? ఒకసారి ‘ పాడుతా తీయగా..’ ప్రోగ్రాం చేస్తే ఎలా వుంటుందంటారు మన వాళ్ళందరూ కలిసి?

* అద్భుతంగా వుంటుంది. ఆ ఆనందాన్ని మనం మాటల్లో వివరించ సాధ్యమా? అయితే, బాలు గారి సమక్షంలో ఒకసారి నేను పాడటం జరిగింది. అదొక ఆనందమయ మైన సంఘటన నాకు.

> కొత్త సింగర్స్‌కి మీ సలహాలు, సూచనలు?

* నిరంతరం పాటల్ని వింటూ వుండాలి. మీరు పాడాలనుకునే పాటని మరిన్నిసార్లు పదే పదే వింటూ, పాట ప్రెజెంటేషన్ పట్ల ఒక అవగాహనని పెంచుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవడం నేర్వాలి. మీకు మీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆ గీత సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకోవాలి. పాటకి ఫీల్ అనేది ఎంత ముఖ్యం అంటే అదే ప్రాణం అని జ్ఞాపకం పెట్టుకోవాలి.

> మీకు జరిగిన ఘనమైన సన్మానం గురించి…

* నేను నాన్ స్టాప్‌గా ఘంటసాల వారి 22 పాటలు పాడిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, – ‘అర్చన కల్చరల్ అసోసియేషన్ ‘ వారు నాకు ఘంటసాల పురస్కారం అందచేస్తూ, సత్కరించిన సన్నివేశం మరపురానిదని చెప్పాలి. ఈ పురస్కారాన్ని నేను కిందటేడాది – అంటే 2018లో అందుకున్నాను.

> మీరు వినూత్నమైన ప్రయోగాలు కూడా చేస్తుంటారు. యుగళ గీతాల విభావరిలో ఒక కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టారు?

* అవును. అది ప్రయోగమే. ‘ఒకే స్వరం మరో గళం’ ఒకే పాటని మేల్ ఫిమేల్ వెర్షన్స్ వి ఎంచుకుని పాడాం. ఉదాహరణకి ‘ ఏ దివిలో విరిసిన పారిజాతమో, మోగింది వీణ.. ‘ సేం సాంగ్ బై బోత్ మేల్ అండ్ మేల్. అలా 20 పాటలు ఒకే ప్రోగ్రామ్‌లో పాడాను.

> నవరత్నాలు గురించి?

* 9 మంది యువ గాయనులతో కలిసి పాడాను. అలానే 18 మంది ఫిమేల్ సింగర్స్ తో కలిసి 36 పాటలు పాడాను.  అదొక అందమైన ప్రయోగం. నా ప్రయోగాలన్నీ సూపెర్ సక్సస్ అయ్యాయని నిస్సందేహంగా చెబుతా.

> మీకింత గుర్తింపు నిచ్చిన వేదిక శ్రీ త్యాగ రాయ గాన సభ గురించి మీ మాటల్లో..?

* త్యాగరాయ గాన సభ వేదిక నాకు చాలా మంది అభిమానుల్ని ఆత్మీయుల్ని ఇచ్చింది. ఆ ప్రాంగణంలో అలా అడుగు పెడితే చాలు, నా అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరిస్తారు. ఒక గాయకునిగా నాకొక ప్రపంచాన్ని సృష్టించింది. నా కో-సింగర్స్ అందరు కూడా నేనంటే చాలా అభిమానం చూపుతారు. ఇంత కంటే ఏం కావాలి జీవితానికి? ఈ తృప్తి చాలు గుండె నిండిపోడానికి. ఇంత గొప్ప అనుభూతినిచ్చిన త్యాగరాయ గాన సభ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను సదా సదా కృతజ్ఞుడిని.

> మన ట్విన్ సిటీస్ సింగర్స్ కోసం ప్రభుత్వం ఎలాటి సాయం అందిస్తే బావుంటుందని భావిస్తున్నారు?

* బానర్స్‌కి, ప్రోగ్రాంకి ఆర్ధిక సాయం చేస్తే బావుంటుందనుకుంటున్నాను. గ్రాంట్ ఇస్తే, నిర్వాహకులు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. తద్వారా, సింగర్స్ కూడా ఎక్కువ పాటలు పాడుకునే అవకాశం దొరుకుతుంది. ప్రతిభ రాణిస్తుంది. అలానే, గవర్నమెంట్ – ఒక లెర్నింగ్ స్కూల్ ప్రారంభించి ట్రాక్స్ మీద పాటలని సాధన చేయించే ఒక ఫాకల్టీతో స్కూల్ వుంటే బావుంటుంది. పాడాలనుకునే వారందరకీ ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తే చాలా బావుణ్ణు కదాని నా ఆశ!

> సంచలన ఆన్ లైన్ మాగజైన్ గా పాఠకులచే అధిక మన్ననలను పొందుతున్నమా ‘సంచిక మాసపత్రిక పై మీ అభిప్రాయం?

* మీరు పరిచయం చేసాక, సంచికని చూసాను, చదువుతున్నాను. చాలా వినూత్నంగా వుంది. బావుంది. కొత్త కొత్త ఫీచర్స్, ఎన్నో కథలతో పాఠకులని ఆకట్టుకునేలా తీర్చి దిద్దుతున్నారు పత్రికని. ఎన్నో విషయాలను నేర్చుకునే వీలుని కల్పిస్తోంది – సంచిక. ముఖ్యంగా ట్విన్ సిటీస్ సింగర్స్ ద్వారా, ఎందరో గాయనీ గాయకులు తమ తమ మనోభావాలని పంచుకునే చక్కటి వీలునీ, వేదికని ఏర్పాటు చేస్తున్నందుకు సంపాదకులకు నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను. అదే విధంగా, నా వ్యూస్ అన్నిట్నీ ఈ ఇంటర్వ్యూ ద్వారా పంచుకునే అవకాశాన్ని కలగచేస్తున్నందుకు నా ధన్యవాదాలు.

> మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించినందుకు మీకు కూడా మా ధన్యవాదాలండి మోహన్ గారూ! మీకు మా అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.

* నా ఆనందం కూడానండి!… పాఠకాభిమానులందరకీ నా అభివందనాలు. నమస్తే!

***

kmohan87@yahoo.com

cell: 90000 14049

https://www.youtube.com/channel/UC4-mEuX2s3j76Y3cFVRnJSA

సాంగ్స్:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here