[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన – సంగీతంలో పిహెచ్‌డి చేసినా, ‘ఇంకా నేర్చుకుంటూనే వున్నా’ అని చెప్పే మధుర గాయని డా. మంగళంపల్లి స్వర్ణ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]
ఎన్ని బాధలు వున్నా, ఎన్ని కష్టాలలో వున్నా, భక్తిగా ఒక్క కీర్తన పాడుకుంటే, ఆ ఆనందం ముందు ఎన్ని కోట్ల డబ్బు దిగదుడుపే. ఆ దివ్యానుభూతి అలాటిది. మాటలకందనిది. ఐతే, రియాలిటీ వేరుగా వుంటుంది కదండీ! ‘ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫెరెంట్ అండ్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్.’ ఒకటి మాత్రం అనిపిస్తూ వుంటుంది. ఆనాటి కాలపు పెద్ద వాళ్ళు మాటల్లో చెబుతుంటారు. తమకి టెంత్ క్లాస్ క్వాలిఫికేషన్‌కే ఉద్యోగాలు వచ్చాయి అని చెబుతున్నప్పుడు అనిపిస్తుంది ఆశగా.. ఆహా, నేను ఆ రోజుల్లో అయినా పుట్టాను కాదే అని. 😀😀 (హాయిగా నవ్వేస్తూ అన్నారు).
రెండో యేటనే ఆరంభించిన ఆ సంగీత గానం… మెట్టు మెట్టుగా ఎదిగి, – ఎం ఏ వరకు, ఆ పైన పిహెచ్‌డి వరకు సాధనా శోధనలతో సాగింది. ఇప్పటికీ ఆ ఆన్వేషణ ఆగలేదు. ‘ఇంకా నేర్చుకుంటూనే వున్నా’ అని అంటారు.
ఎలాటి భేషజాలు లేని ఈ నిగర్వి. నిత్య సంగీతాన్వేషి. నిరాడంబురాలు అయిన స్వర్ణ గారి మాటలకి ఆమె వైపు విస్మయంగా చూస్తూ అడిగాను. మొదటి ప్రశ్నగా..
> మీరు ‘ఇంకా నేర్చుకుంటునే వున్నా’ – అని అంటుంటే ఆశ్చర్యమేస్తోంది. సరళీ స్వరాలు పూర్తవగానే అంతా వచ్చేసింది నేర్చుకోవాల్సింది ఏమీ కనిపించడం లేదనుకుంటారు కొందరు.. (నవ్వులు)
* కొందరు అలా అనుకోవచ్చేమో కానీండీ, గాయనికి సంగీతమనేది కంటిన్యుయస్ ప్రాసెస్. అదొక ఒక పవిత్ర మహాసముద్రం. పిహెచ్‌డి అనేది ఒక చిన్న మునక మాత్రమే. సంగీత జ్ఞానం చాలా లోతైనది. తెలుసుకోవాలనే జిజ్ఞాసులు ఎప్పటికీ నేర్చుకుంటూనే వుంటారు.
>మీ రెండేళ్ళ అంటే ఊహ కూడా తెలీని వయసు. అంత అతి పిన్న వయసులోనే మీరు సంగీతం నేర్చుకోవడం అంటే ఆశ్చర్యమనిపిస్తోంది..
* అవునండి. అది అలా జరిగింది. మరో మాట కూడా చెప్పాలి. నేను 1978లో పుట్టాను. 81లో మొదటి కచేరీ చేసాను. ఈ విషయం మీకింకా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ( నవ్వులు)
> శివరాంగారు మీలో సంగీత సరస్వతిని కనుగొన్న తొలి గురువుగా చెప్పారు?
* అవునండి. పసితనానే హమ్మింగ్ చేస్తుండేదాన్నట. అది విన్నారు ఆయన. వారు స్వయాన మా నాన్న గారికి మేనమామ, మా మేనత్త గారి పెనిమిటి. నాకు సంగీతం అబ్బుతుందని ఆయన ముందే ఊహించారు. మరి ఆయన అప్పట్లో గొప్ప విద్వాంసులుగా పేరు ప్రఖ్యాతులు గాంచినవారు! వారి ఆశీస్సుల బలమే, ఈ డిగ్రీలు సాధించానని అనుకుంటాను.
> ఏ యూనివర్సిటీ నించి మీరు పిహెచ్‌డి తీసుకున్నారు.
* ఎంఏ – పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, పిహెచ్‌డీ – పద్మావతి మహిళా యూనివర్సిటీ నించి ..
> సంగీతంలో పిహెచ్‌డి అంటే ఎంతో శ్రమపడి ఉంటారేమో కదూ? ఎన్నేళ్ళు పట్టింది మీకు?
* ఎనిమిదేళ్ళు. ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించాను.
> చాలా మంది పేరెంట్స్, తమ పిల్లలకు – సంగీతాన్ని ప్రధాన విద్యగా స్వీకరించనీరు. కూడు గుడ్డ ఇచ్చే విద్య కాదనే అభిప్రాయమూ మెండుగనే వుంది. అందుకు మీరేమంటారు?
* నిజమేనండి. తల్లితండ్రుల ఆలోచనలో తప్పు లేదు. అదే కరెక్ట్ అని చెప్పడానికి నేనే ఒక పెద్ద ప్రత్యక్ష సాక్షిని అని చెప్పక తప్పదు (ఆమె మాటల్లో నిరాశ తొంగిచూసింది).
> ప్లీజ్. మీ మనసులో బాధని సంచికతో నిర్భయంగా పంచుకోవచ్చు. చెప్పండి!
* నా వయసెంతో, నా సంగీత సాధనా అంతే. రెండేళ్ళ వయసు నించే సంగీతాన్ని గానిస్తూ, స్వర రాగాలే ఉఛ్ఛ్వాస నిశ్వాసలుగా జీవిస్తూ వచ్చాను. పసిప్రాయం నించే, పాడటం వలన నేను చాల ప్రత్యేక గాయనిగా గుర్తింపుని పొందాను. అయినప్పటికీ, ఆశించినంతగా వృధ్ధిలోకి రాలేకపోయానెందుకో – అనే నిరాశ నన్ను బాధిస్తుంది.
> ఎందుకని షైన్ కాలేకపోయానని అనుకుంటున్నారు? కారణం?
* అనేకం (బాధ నిండిన స్వరంతో అన్నారు).
> సంగీతం కాకుండా, అందరిలా సాధారణ విద్య నేర్వలేకపోయనే అనే అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తుందా?
* అదేం లేదు. నాకెంతో ప్రాణప్రదమైన సంగీత శాస్త్రంలో పరిపూర్ణమైన జ్ఞానార్జన చేయాలనే ఆశయంతోనే నేను పూర్తిగా సంగీతానికే ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చాను. ఆ సంకల్పంతోనే, డిగ్రీ, పీజీ, మరియు పిహెచ్‌డిలను పూర్తి చేసాను. పట్టాలు అందాయి. కానీ ఉద్యోగమే లేదు.
> మీ గురించి, మీ అర్హతల గురించి తెలియదేమో? తెలియచేసారా?
* (బరువుగా నవ్వుతూ…) అందరికీ తెలుసు. నేను చిన్నప్పట్నించీ కచేరీలు చేస్తున్న విషయం ఎవరికీ కొత్త కాదు. ఆర్గనైజర్సందరకీ నేను పరిచయమే. కానీ నన్ను ఎంకరేజ్ చేయడం లేదు. ఇది మాత్రం నిజం.
> మీకు ఈ స్థాయిలో కూడా ప్రోత్సాహ సహకారాలు అవసరమంటారా?
* (నవ్వి) – బంగారు పళ్లానికైనా, గోడ చేరువ వుండాలంటారు కదండీ! కార్యక్రమ నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి. కానీ, నాకివ్వలేదు. నేను, నా విద్వత్తు అందరకీ తెలుసు. తెలీకపోడం అనే ప్రశ్నే లేదు.
> మరి మీరింత దూరం ఎలా ప్రయాణం చేయగలిగారు?
* మా పేరెంట్స్ ఇద్దరూ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. తమ వెంట ఎన్నో పోటీలకు తీసుకెళ్ళేవారు. వారి సహకారం, సపోర్టే కనక లేకపోతే, కనీసం ఈ మాత్రమైనా నిలబడేదాన్ని కాదు. నేను పిహెచ్‌డీ చేయాలని పట్టుబట్టి, నడిపించిన వ్యక్తి – మా అమ్మ శ్రీమతి లలిత. మా నాన్నగారు వైలొనిస్ట్ శ్రీ. ఆర్.బి. శాస్త్రి గారు ఎంతగానో నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు.
> నేర్చిన విద్య సార్ధకమౌతుందన్న తృప్తి వుందా మీకు?
* లేదండి…(నిర్లిప్తంగా చూస్తూ చెప్పారు) సంగీతంలో ఇంత జ్ఞానాన్ని సంపాదించినా, ఇన్ని డిగ్రీలు పొందినా, నాకు సరైన ఉద్యోగవకాశం కలగకపోవడం నా దురదృష్టమే అని అనిపిస్తుంది… సంగీతం నేర్చుకుని పొరబాటు చేసానా అని గుండె నీరవుతుంది. అంతలోనే, నన్ను నేను సముదాయించుకుని, బాధ పెరగకుండా సర్దుకుంటాను.
> ఎంత విషాదకరం!?
* ……. (మౌనంగా వుండిపోయారు)
> మీరు సంపాదించిన డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవీ మీకు ఉపాధిని కల్పించలేక పోతున్నాయంటే… నమ్మలేకపోతున్నాను..
* నాకూ అదే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే, సంగీతాన్ని నమ్ముకోవడం వల్ల, ప్రేమించి ఆరాధించడం వల్ల.. – ఆ ఫీల్డ్ లోనే నా పరిజ్ఞానాన్ని పెంచుకోడం కోసం కృషి సలిపాను. పట్టు సాధించాను. అర్హతలు పెరుగుతున్న కొద్దీ బ్రతుకు మీద భరోసా పెరుగుతూ వచ్చింది. కానీ చివరికి – పరిస్థితి ఎలా వచ్చిందంటే .. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఆత్మాభిమానం వెక్కిరిస్తున్నట్టు తోచేది. నా ఉన్నత అర్హతలకి పెద్ద జాబ్ రాకపోడం ఒకపక్కన, అవసరాలకి తలవొంచి, చిన్న జాబ్స్ చేయలేకపోవడం మరోపక్కన.. ఈ రెండూ నన్ను అమితంగా బాధించే అంశాలే. అవసరాలకి.. ఆత్మాభిమానానికీ మధ్య నేను నలుగుతున్న మాట వాస్తవం. ఇలాటి సంకట పరిస్థితి ఏ సంగీత కళాకారిణికీ కలగ కూడదని కోరుకుంటాను.
> మీ టాలెంట్‌ని అధికారులు తమ పరిశీలనలోకి తీసుకోవడం జరిగిందా?
* చాలా సార్లు జరిగింది. పాట పాడితే ఎప్పుడూ బాలేదు అని అనిపించుకున్న దాఖలాలే లేవు – ఇప్పటి దాకా నా గాన ప్రస్థానంలో! టాలెంట్‌కి కొదవలేదు అని ఒప్పుకుంటారు. కాని ఉద్యోగమే ఇవ్వరు. అదే కరువు ( బాధగా నవ్వారు).
> మీ సినీ గీతాలను విన్న ప్రతి వారు మిమ్మల్ని ప్రస్తుతిస్తుంటారు, పెర్ఫెక్ట్ నొటేషన్స్ అని..
* అవునండి నాతో ప్రత్యక్షంగా కూడా అదే చెబుతుంటారు. కారణం నేనెప్పుడూ తప్పు పాడను. నాకు కష్టమనిపించినవి, నేను టేకప్ చేయను. వచ్చిన వాటిలో తప్పు రానీయను.
> ఒకవైపు – మీ ఫీల్డ్‌లో మీరెంతో ప్రతిభావంతురాలనే పేరుంది. మరో వైపు నిరుద్యోగం మిమ్మల్ని అమితంగా వేధిస్తోంది.. మరి ఇందుకు ఎవరు బాధ్యులనుకుంటున్నారు? అంటే, ఎవరు బాధ్యత తీసుకోవాలని కూడా భావిస్తున్నారు ?
* ప్రభుత్వం! గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని గట్టిగా, ఖచ్చితంగా చెబుతాను.
> ఎలా అంటారు? కాస్త వివరించి చెబుతారా?
* అండర్‌క్వాలిఫైడ్ వారిని రిక్రూట్ చేసుకోవడం ఎంతైనా విచారకరం. దురదృష్టకరం. అలా కాకుండా, నాలాంటి క్వాలిఫైడ్ కాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి. కష్టపడి, పిహెచ్‌డిలు చేసేది ఉద్యోగావకాశాలు కోసమే కదా..
మరో మాట చెప్పాలి. పిహెచ్‌డి కోసం నేనెంతో శ్రమించాను. చెన్నై నించి తిరుపతికీ, ఇంకా చాలా లైబ్రరీస్ కాళ్ళరిగేలా తిరుగుతుండెదాన్ని. నా శ్రమని ప్రభుత్వం గుర్తించాలని ఆశించాను. కానీ అలా జరగట్లేదు.
> అంటే శోధనకి చాలా సమయాన్ని వెచ్చించాల్సి వుండేదా?
* శోధన అంటేనూ, శ్రమ.. మానసిక శారీరక టెన్షన్స్ వుండేవి. ఎంత కాలం అంటే నా పిహెచ్‌డి పూర్తయి, డిగ్రీ చేతికి వచ్చే వరకు… టెన్షన్ పడుతూనే వున్నా. దేని కోసమని అంత శ్రమించాను అని ప్రశ్నించుకుంటే – జవాబు దొరకదు.
> ఈ డిగ్రీలన్నీ పూర్తి చేస్తున్నప్పుడు – మీ కెరీర్ మీద మీకొక ధ్యేయం వుండేదా?
* అవును. వుండేది. ఒకటే ధ్యేయం.. మ్యూజిక్ లెక్చరర్‌గా జీవితంలో స్థిరపడాలని…
> అంటే, రాష్ట్రంలో లెక్చరర్ ఉద్యోగ అవకాశాలున్నా, అవి మీ వరకు రావడం లేదని అనుకుంటున్నారా?
* అవును. నాకు ఇవ్వటం లేదు.
> ఈ విషయంలో ఎవరిని సంప్రదించడం ద్వారా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు?
* డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, కల్చరల్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్.. ఈ ఉన్నత అధికారులు ఈ సమస్యని పరిశీలించి పరిష్కరించాలి. కానీ నాకు ఫేవర్ చేసే అవసరం వారికేమిటి? – అప్రాప్రియేట్ పోస్ట్‌లో ఉన్న వారు తలచుకుంటే రేపు నేను ప్రభుత్వ ఉద్యోగినైపోతాను. అంత పవర్ వుంటుంది వారికి. మీకు తెలియంది ఏముందమ్మా, వడ్డించే వారు మన వారైతే అనే సామెత చందానే, ఇదీను.
ఎంతో మంది గాయనీ గాయకులు యేడాదికోసారి అమెరికా ప్రోగ్రామ్స్ చేసుకుని లక్షలు తెచ్చుకుంటారు. నేను గాన సభలో పాడాలంటే – ఆర్జనైజర్స్‌కి డబ్బు చెల్లించుకోవాలి. తప్పదు.
> కానీ నేను మీ పైని గౌరవంతో నేను మీకు అవకాశాలు ఇచ్చాను కదూ?
* అవును. గుర్తుంది. అప్పుడే మీకు ఫోన్ చేసి థాంక్స్ చెబుతూ, మిమ్మల్ని మరచిపోలేనని అన్నాను కదూ?.. (నవ్వులు)
> సంగీతం తప్ప మరో లోకం తెలీని మీకు ఈ చిక్కు పరిస్థితి ఎదురవడం ఎంతైనా దురదృష్టకరమేమో?
* అవును. నా దురదృష్టమే ముమ్మాటికీ. అప్పుడప్పు అనిపిస్తుంది నా సంగీత జ్ఞాన పరిజ్ఞానాలను వినియోగించుకోలేని వారిది కూడా బాడ్ లక్ అని సరిపెట్టుకుంటాను. నేను ఎంఏ ఇంగ్లీష్ కూడా చేసానండి.
> మరి ఈ మీ సమస్య గురించి ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు?
* న్యాయమార్గంలోనే వెళుతున్నా. అధికారులకి లెటర్స్ వ్రాస్తాను. బదులుండదు. ఎవరినించీ రెస్పాన్స్ వుండదు. రాదు అని కూడా తెలుస్తోంది. అయినా, ఐ యాం స్టిల్ హోప్‌ఫుల్. కనీసం 20 యేళ్ళు సర్వ్ చేయగలను.
> ప్రభుత్వం కల్పించే అవకాశాలు శూన్యం అని అర్ధమయ్యాక, మరి బ్రతుకు తెరువు కోసం మరో దారి వెతుక్కోక తప్పదు కదూ? ప్రస్తుతం మీరేం చేస్తున్నారు ?
* ప్రైవేట్ సంస్థలలో జాబ్ చేస్తున్నా. కానీ, నాలా ఎన్నో కష్టనష్టాల కోర్చుకుని, మ్యూజిక్‌లో పిహెచ్‌డీ చేసినందుకైనా కనికరించి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఉద్యోగం అని ఎందుకింతగా కంఠ శోష పెడుతున్నానూ అంటే.. ఉద్యోగాలు ఉన్నాయి. వాట్ల నియామకాల అవసరమూ వుంది. అయినా, వాట్లని భర్తీ చేయరు. అది తప్పిదం కదా? ఇలా నేను బాధపడుతున్నానంటే కారణం అదే. మీకు ఇంకో సంగతి తెలుసా? – డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సెస్ కోసం వచ్చే ఎంక్వైరీస్‌ని వెనక్కి పంపేస్తున్నారు. – కాలేజ్‌లో లెక్చరర్స్ లేరనే కారణంగా. ఇది తెలిసాక మనసు విలవిలలాడింది.. ఎంత బాధనిపిస్తుంది కదూ, ఎవరికైనా!?
> ఊ! ఇది కేవలం మీ ఒక్కరి సమస్యే అంటారా, లేక ..?
* నాలా బోలెడు మంది ఉన్నారు.
> మరి అలాటప్పుడు, సమూహంగా చేరి, మీ సమస్యలను విశదీకరించి అధికారులకు వినిపిస్తే బావుంటుంది కదా, బలం చేకూరుతుంది కారణానికి?
* నిజానికండీ, నా లేఖలలో నా గురించి మాత్రమే కాదు, మా అందరకీ న్యాయం చేయండి అంటూ అభ్యర్ధిస్తుంటాను. ఇక, కలసికట్టుగా పోరాటానికి ఎవరూ ముందుకు రారు. నేను ఒంటరిగా పోరాడి ఫలితాలు గనక తెస్తే, అవి వస్తే వాటిని పంచుకోడానికి ముందుకొస్తారు. బెడిసి కొడితే నన్నే బ్లేమ్ చేస్తారు. లోకం తీరు అంతే కదా.. మామూలే. సక్సస్ హాజ్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ యాన్ ఆర్ఫన్. (అని విషాదంగా నిట్టూర్చారు..).
> మీకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోడానికి గల కారణాలు అనేకం వున్నాయి అన్నారు. అందులో ఒకటి అధికారం ఐతే, మరొకటి కులం కార్డ్ కూడా వుందనుకోవచ్చా?
* 100%. వెనకబడిన కులం, వర్గం అనే సర్టిఫికేట్స్ నాకు లేకపోవడం అందులో ఒక ముఖ్య కారణం.. ఆ యా కుల, వర్గం, జాతి వారు పుట్టి, పెరిగి, సంగీతం నేర్చుకుని ఆ ఉద్యోగం చేపట్టకపోతే ఆ పోస్టులన్నీ అలా మిగిలిపోవాల్సిందే. తప్పదు (భారమైన స్వరంతో చెప్పారు).
> ఈ సంగీత శాఖలో కూడా ఇవన్నీ చోటు చేసుకున్నాయా?
* అవును. ఊన్నాయి. యూనివర్సిటీలలో ఆ యా వర్గాల సెల్స్ కూడా ఉన్నాయి
> మీ మనో వేదనకు మందు?
* ఊద్యోగం రావడం ఒక్కటి మాత్రమే నా మనోవేదనకు ఉపశమనం.
> సరిగ్గా ఇలాటి అధిక మానసిక ఒత్తిడి క్షణాలప్పుడు.. సంగీతం వల్ల ఓదార్పు దొరుకుతుందా?
* దొరుకుతుంది. ఎన్ని బాధలు వున్నా, ఎన్ని కష్టాలలో వున్నా, భక్తిగా ఒక్క కీర్తన పాడుకుంటే, ఆ ఆనందం ముందు ఎన్ని కోట్ల డబ్బు దిగదుడుపే. ఆ దివ్యానుభూతి అలాటిది. మాటలకందనిది. ఐతే, రియాలిటీ వేరుగా వుంటుంది కదండీ! ‘ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫెరెంట్ అండ్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్.’ ఒకటి మాత్రం అనిపిస్తూ వుంటుంది. ఆనాటి కాలపు పెద్దవాళ్ళు మాటల్లో చెబుతుంటారు. తమకి టెంత్ క్లాస్ క్వాలిఫికేషన్‌కే ఉద్యోగాలు వచ్చాయి అని చెబుతున్నప్పుడు అనిపిస్తుంది ఆశగా.. ఆహా, నేను ఆ రోజుల్లో అయినా పుట్టాను కాదే అని. 😀😀 (హాయిగా నవ్వేస్తూ అన్నారు).
> మీ ఎనిమిదేళ్ళ సంగీత శిక్షణలో ఎదురైన అనుభవాలు?
* అన్నీ ప్రశంసలే వుండేవి. ఎప్పుడూ, ఎవరూ, నన్ను విసుక్కోలేదు, తిట్టలేదు. ఒక్కసారి చెపితే చాలు ‘సంగతి’ ఇట్టే వచ్చేసేది – కంఠోపాతంగా! – నేనెప్పుడూ పుస్తకం చూసి సంగీతం పాడలేదు.
> వేదిక పై మీ తొలి కచేరి విశేషాలు, ఆ పైని జ్ఞాపకాలు?
* తొలి కచేరి గుర్తుండే అవకాశం లేదు. అప్పుడు మరి నాకు రెండేళ్ళే కదా.
> ప్రతిభ కంటేనూ, ప్రాచుర్యం వల్ల వెలుగొందుతున్న వారున్నారని అంటుంటారు? మీ కామెంట్?
* ముమ్మాటికీ నిజం. ప్రతిభ లేనివారు వెలుగొందుతున్నారు. ప్రతిభావంతులు మరుగున పడిపోతున్నారు. ముఖ్యంగా నేను, నాలా మరెందరో.
> మీ కష్టాలలో మీ వెన్నంటి నిలిచిన వ్యక్తి?
* ఎవరూ లేరు. ఉద్యోగం వుంటే నా బాధలు తీరిపోయేవి. ఇతర బాధలు ఎన్నున్నా, అవి నన్ను ఇంతగా బాధించేవి కాదు. మ్యూజిక్ కాలేజ్‌లో లెక్చరర్ జాబ్ అంటే, విచ్ హాజ్ ఎ స్కేల్ ఆఫ్ రూపీస్ 70,000+… విచ్ ఈజ్ బీయింగ్ గివెన్ టు అండర్ క్వాలిఫైడ్ ఆర్ నాన్ క్వాలిఫైడ్ పీపుల్ అంటే- ఎంత బాధగా వుంటుంది!!…
> నిజమే. ఎవరికైనా బాధగానే వుంటుంది, కానీ రాని ఉద్యోగం గురించి మీరెందుకింతగా వేదన చెందుతున్నారు?
* ఇది అన్యాయం అని అని ఎలుగెత్తి ప్రశ్నించడం కోసం కాదండి, మాకు – ఐదుగురు ఆడపిల్లలు. నా పెద్ద సంసారం ఈదడానికి నేనీ ఉద్యోగం కోసం ఎందుకింతలా ప్రాకులాడుతున్నానో, ఇంక మీకు వివరించి చెప్పే అవసరం లేదనుకుంటాను.
నేను నా డిగ్రీని నమ్ముకునే ఈ పిల్లల్ని మెయింటెయిన్ చేస్తున్నాను. ఎప్పటికైనా సరే – నా ఉన్నత విద్యార్హతలు, డిగ్రీలు, – నాకు ఉద్యోగం ఇప్పిస్తుందనే అపారమైన నమ్మకం, విశ్వాసం వుంది.
> ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రైవేట్ జాబ్ ఎలావుంది?
* లెస్ పే. ఫిక్స్డ్ అండ్ నో హైక్ – ఫర్ ఇయర్స్ టుగెదర్…
> ప్రభుత్వం వారు మీకు ప్రోగ్రామ్స్ ఇస్తారా?
* నో.
> సింగర్స్‌కి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అందచేసే రెమ్యునరేషన్ ఎలా వుంటుంది?
* అధిక పారితోషికాలే ఇస్తారు. కానీ ఆ అవకాశాలూ, అవీ, నా వరకు రావు. రానివ్వరు. నాకు మాత్రం ఇవ్వరు. అడిగినా ఇవ్వరు.
> ప్రభుత్వం – సంగీత కళాకారులకు సరైన అవకాశాలు కల్పించలేకపోతోంది అని అనుకుంటారా?
* అవును. ప్రభుత్వం అవకాశాలు కల్పించలేకపోవడం కాదు. కల్పించడం లేదనే చెబుతాను ఖచ్చితంగా! తలచుకుంటే, ప్రభుత్వం చేయలేనిదంటూ ఏమీ లేదండి. చెప్పాను కదా, డైరెక్టర్ – డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, కల్చరల్ అడ్వైజర్ టు సీ ఎం – వీరిద్దరి చేతులలోనే అంతా వుంది.
> మీరింత ధైర్యంగా ముందుకొచ్చి, నిజాలను వెల్లడించడం వలా…?
* ఇలా నిజాలు వెళ్ళగక్కడం వల్ల పోయేది లేదు, చెప్పకపోతే వచ్చేదీ లేదు. రానిది ఎలానూ రాదు. రావాల్సిన అదృష్టం వుంటే ఎప్పటికైనా వస్తుంది అని నమ్ముతాను. ఆ గట్టి విశ్వాసం అయితే వుంది. అయినా, నిజాన్ని దాచడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. గవర్న్మెంట్ మ్యూజిక్ కాలేజీలలో లెక్చరర్స్ నియామకాల గురించి – నేను జరుగుతున్న వాస్తవాలనే వివరిస్తున్నాను. ఎవర్నీ నిందించడం లేదు. మా అవస్థలని అధికారులు పట్టించుకోవాలని వినతి చేసుకుంటున్నాను. ఉద్యోగం లేక పడుతున్న బాధలని, నా అవేదనని అర్ధం చేసుకోవాలని మనవి చేస్తూ, నాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నాను. అంతే.
> మీరన్నట్టు, పెద్దలని వ్యక్తిగతంగా కలిసి, మీ విన్నపాన్ని వినిపించాల్సిందేమో?
* అదీ అయింది. సిఎం, పిఎం, డైరెక్టర్ – డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, అడ్వైజర్ ఇలా అందరకీ వరసగా వ్రాస్తూనే వున్నా… పర్సనల్‌గా కూడా వెళ్ళి కలిసి వస్తుంటాను. బట్, నో రిజల్ట్. ఒక అధికారి ఐతే – ‘ఇలా వస్తూ పోతూ ఉండండి’ అని కూడా తన సలహాగా చెప్పారు (నవ్వులు).
> సరే, ఇక మీ సంగీత ప్రస్థానంలోకి వస్తే, సంగీతం ద్వారా మీరు కలుసుకున్న మహా విద్వాంసులు, పేర్లు, వారితో మీకు గల అనుబంధాలు చెబుతారా?
* నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల చిన సత్యనారాయణ గారు. మాలతీ పద్మనాభ రావుగారు, రేవతీ రత్నస్వామి గారు, శ్రీరంగం గోపాల రత్నం గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.. ఇటువంటి మహా మహా విద్వాంసులని కనులారా గాంచాను. వారి కచేరీలు ప్రత్యక్షంగా విన్నాను. 1930 ప్రాంతాలలో పుట్టి, సంగీత సేవ చేసిన ప్రతి ఒకరికి మా సుసర్ల శివరాం మావయ్య తెలుసు. నేను ఆయన మేనకోడలను అని తెలుసు, నేను ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నానని తెలుసు. బాగా పాడుతానని తెలుసు.. పైగా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి తెలియటం వలన వీరందరికీ నాపై ఆప్యాయత ఎక్కువగా ఉండేది. కాబట్టి నన్ను అందరూ బాగా చూసుకునేవారు.
> మర్చిపోయా అడగడం, మీ ఇంటి పేరు వినగానే మహా విద్వాంసులు, వాగ్గేయకారులు శ్రీ బాలమురళీ కృష్ణ గారు గుర్తుకొస్తారు. మీకు బంధువులా?
* అవునండీ. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, మా మామగారూ కజిన్స్.
> ఈ మహా గాయకున్ని చూడటం, లేదా కలవడం, లేదా వారి ముందు కచేరీ చేయడం ఒక అదృష్టంగా భావించిన విద్వాంసులెవరైనా వున్నారా?
* మోహన కృష్ణ గారు రేడియోలో ఉద్యోగం చేస్తారు. నేను రేడియోలో క్లాసికల్ & లైట్ మ్యూజిక్ గ్రెడేడ్ ఆర్టిస్ట్ కావటం వలన ఆయనతో పరిచయం ఉంది. మంచి మనిషి. బాలమురళీకృష్ణ గారి వద్ద శిక్షణ పొందుతుండే రోజులలో ఆయన ఎలా మాట్లాడేవారు.. ఎలా నేర్పేవారు… ఇవన్నీ నాతో చెప్తూ ఉంటారు. ఆయనతో మాకు దూరపు బంధుత్వం కూడా ఉంది..
ప్రముఖులందరి ముందు పాడాను. అందరు విద్వాంసులే. మా గురువుగారు హైదరాబాద్ బ్రదర్స్ దగ్గర పాడటం కన్న మించిన అదృష్టం లేదు.
> మీ వారికి కూడా సంగీతం లో ప్రవేశం వుందా?
* మా వారు – హరి మంగళంపల్లి డిపిఎస్ టీచర్ (డాన్స్) అండ్ అ ఫ్రీలాన్స్ డాన్సర్.
> శాస్త్రీయ సంగీతంలో మీరు అమితంగా ప్రేమించే రాగం?
* ప్రత్యేకించి, అటువంటిదేమీ లేదు. కాని ప్రతిమధ్యమ రాగాలు నా గొంతులో చాలా బాగుంటాయని నా సహ శిష్యులు భావిస్తారని విన్నాను.
> స్వర కల్పనలో మీకు గల ప్రవేశం?
* చేయగలను. నేను నేర్చుకున్న అన్ని రాగాల కీర్తనలకు స్వరకల్పన చేసే అలవాటు ఉంది. అన్ని రకాల సంగీత కార్యక్రమములు నిర్వహించగలను. మా వారు డాన్సర్. డాన్స్ & మ్యూజిక్ ఎన్సెంబుల్ చేయగలము. కాని ఆర్థిక చేయూత అవసరం.
>సాహిత్యాన్ని సమకూర్చగలరా?
* కూర్చగలను. కాకపోతే అటువంటి అవకాశం రాలేదు.
> సినీ గీతాల వైపు ఎలా మక్కువ కలిగింది?
* సరదాగా! (నవ్వులు)
> ఎన్ని శాస్త్రీయ సంగీత కచీరీలు ఇచ్చారు ఇప్పటి దాకా?
* కొన్ని వందలు. కచేరీలు చేయడం నా రెండో ఏటనే మొదలు పెట్టాను. అది ఇప్పటికి కొనసాగుతోంది..
> సినీ గీతాలలో మీకు ప్రియమైన శాస్త్రీయ సంగీత సమ్మేళణ పూరిత గానం?
* అటువంటి ప్రయోగాలున్న అన్నీ.. గీతాలూ ప్రియమైనవే. ఉదాహరణకి, హాయి హాయిగా ఆమని సాగే, సలలిత రాగ, హిమగిరి సొగసులు, జబ్ దీప్ జలె, కలనైనా నీ తలపె, మోహన రాగ మహా.. ఇలా ఎన్నో వున్నాయి.
> ఆనాటి- ఈనాటి పాటల నడుమ దూరమెంత అని భావిస్తున్నారు?
* చాలా తేడా వుంది. ఆ దూరాన్ని కొలిచి చెప్పాలంటే – నింగికీ నేలకీ వున్నంత.
> ఆధునీకరణ పేరుతో పాటల్లో పాశ్చాత్య ధోరణుల మిక్సింగ్‌ని ఎంత వరకు సమర్థించదగినది?
* ఏదో.. సరదాగా ఐతే ఫరవాలేదు కాని అదే అలవాటుగా మారకూడదని అనుకుంటాను.
> మార్పును కోరుకుంటారా- సినీ నేపధ్య సంగీతంలో?
* ఖచ్చితంగా. టు ద బెటెర్మెంట్..
> ఈనాటి సంగీత దర్శకులపై మీ అభిప్రాయం?
* అశాస్త్రీయం. ఇప్పుడు విని ఇప్పుడే మర్చిపోయే ట్యూన్స్.
> సంగీతానికి మీరిచ్చే నిర్వచనం?
* సంగీతం పాడటం లేకపోతే నా జీవితానికి అర్థం లేనట్లే..
> ప్రభుత్వం కానీ, కళా పోషకులు కానీ, – సంగీత కళ రాణించడానికి ఎలాటి చర్యలు చేపట్టాలి అని అభిప్రాయపడతారు?
* ఎక్కువగా కచేరీలు ఏర్పాటు చేయాలి. సందర్భానుసారంగా తమకు దొరికే ప్రతి అవకాశాన్ని కచేరీ ఏర్పాట్ల దిశగా ఆలోచించడం, మలచటం, అమలుపరచటం చేయాలి. అది ఏ కారణంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమమైనా, కనీసం ఒక అరగంట సమయమైనా, శాస్త్రీయ సంగీత కచ్చేరీతో ప్రారంభం చేయటం ముఖ్యం. అలా, సంగీత కార్యక్రమాలకు ఆర్థిక తోడ్పాటును ఇవ్వటం వల్ల మన సంగీత కళ పది కాలాల పాటు విలసిల్లుతుంది. ఇంకా చెప్పాలంటే, ఎన్నో పథకాలు, ప్రణాళికలు నా దగ్గరున్నాయి. ఏం లాభం? (నవ్వులు)
> ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఎవరైనా మీ ముందుకొచ్చి ఆర్థిక సాయాన్ని అందిస్తే, స్వీకరిస్తారా?
* ఊరికేనే ఎందుకండీ? సంగీతం నేర్పి డబ్బు తీసుకుంటాను. ఆ అవకాశం ఇస్తే చాలు. నేను నేర్చుకున్న సంగీతం, ఆ విలువలు తెలిసిన వారు నా వద్దకు వస్తే, నా జ్ఞాన సమపార్జనని పంచి, సంగీతాన్ని నేర్పి డబ్బు సంపాదించడం నాకెంతో గర్వంగా వుంటుంది. ఆత్మ తృప్తినిస్తుంది. అయినా, నాకు ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం వస్తే చాలండి. అది చాలు నాకు. ఇంకేమీ ఎవరినించీ ఆశించే అవసరం ఉండదు.
> మీరందుకున్న అవార్డ్సూ, బహుమతులు?
* చాలా అవార్డ్స్ అందుకున్నానండి. బహుమతులు కూడా లెక్కలేనన్ని. ఈ రంగంలో ప్రతిభకి సంబంధించిన జ్ఞాపికలన్నీ అందుకున్నాను. ఆనందించాను.
> స్వర్ణ గారు! మీ మనోభావాలను సంచికతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. త్వరలో మీరు కోరుకున్న ఉద్యోగం మీ చేతికందాలని, సంచికతో మీరు మీ ఆనందాన్ని పంచుకోవాలని ఆకాంక్షిస్తూ… శుభాకాంక్షలతో, సెలవ్.
* థాంక్సండి. సంచికతో నా మనసులోని మాటలని పంచుకునే అవకాశాన్ని కల్పించిన సంపాదకుల వారికి, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నాకు ఉద్యోగం రావాలని, తరువాత మిగిలిన వారికి కూడా మంచి మలుపు కావాలని కోరుకుంటున్నాను. నమస్తే.
*****
మొబైల్ నెంబరు: 9849037427.
email: gold.smp@gmail.com
* సాయి విష్ణు అపార్టుమెంటు. 204. గగన్ మహల్ రోడ్. బాదాం గల్లీ. దోమల్ గూడ. 29.
***** **************************
- Dr Mangalampalli Swarna Karnataka Musical Program Video 2
- Vinnavinchukona chinnakorika
- Dr Mangalampalli Swarna Karnataka Musical Program Video 1
- Paradevaate by Dr. Swarna Mangalampalli
- enno ratrulostayi kani
- 5 Thillana
- Dr Swarna Rayaprolu
- SWATHI MUTHYAPU JALLULALO
9 JABILITHO CHEPPANA
10 Chinni Chinni Kannayya10
- https://www.youtube.com/watch?v=h1MO0ldQWrQ
- okkasari vijayakumar n swarna
- kalaninaneevalape b swarna