[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]
[dropcap]“ప[/dropcap]ట్ట పగలే బ్యాంక్ దోపిడి.”
అనే వార్త ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించింది!
తెలుగు దినపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో కవర్ చేయబడ్డ ఆ న్యూస్ పలువురు బ్యాంక్ ఖాతాదార్లని, డిపాజిటర్లని భయకంపింతుల్ని చేసింది.
సుమారు అయిదు వందల కోట్ల రూపాయల టర్నోవర్ కల్గి వుందా బ్యాంక్. దాని పేరు ‘మినీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్.’
వివిధ జిల్లాలలో పది బ్రాంచీలుగా విస్తరించబడ్డ ఆ బ్యాంక్ హెడ్డాఫీస్ హైద్రాబాద్‌లో వుంది.
నగరంలోనే నెంబర్ వన్ బ్యాంక్‌గా చలామణీ అవుతోంది.
అలాంటి బ్యాంక్ దోపిడీకి గురికావడం యావన్మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది!
దినపత్రికల్లో వచ్చిన దోపిడీ తాలుకు వార్తా కథనాలు వివరాలు ఈ విధంగా వున్నాయి.
***
అందరిలానే బ్యాంకు దోపిడీ వార్త నివేదిత దృష్టిలో కూడా పడింది. పేపర్లో ఆ న్యూస్ హెడ్డింగ్‌ని చూస్తూనే ఉలిక్కిపడిందామె.
అందుకు కారణం..
ఆమె పెళ్ళి తాలూకు కట్నం డబ్బు అదే బ్యాంక్‌లో డిపాజిట్ చేయబడివుంది!
అసంకల్పితంగా ఆమెలో కంగారు మొదలయ్యుంది.
తన చేతిలో వున్న ప్రముఖ తెలుగు దినపత్రికపై పట్టు మరింత బిగిసింది.
కళ్ళతో మౌనంగా కాకుండా.. పెదవులతో లోలోపల చదువుతున్నాననుకుంటూనే అక్షరమక్షరం ఒత్తొత్తి పలుకుతూ ఒకటో తరగతి అమ్మాయిలా బిగ్గరగా చదవసాగింది.
నివేదిత నిండు గర్భిణి!
ద్వాపర యుగం నాడు-
తల్లి సుభద్ర గర్భంలో వున్నపుడే.. తన తండ్రి అర్జునుడు తల్లికి చెబుతోన్న పద్మవ్యూహం గురించి ఆకళింపు చేసుకున్న మహామేధావి అభిమన్యుడి కథనాన్ని పునరావృతం చేస్తూ-
ఓ అనూహ్య ఘటనకు ఊపిరి పోస్తూ –
కలియుగ చరిత్ర పుటలపై సరికొత్త అద్భుతాన్ని లిఖిస్తూ.. పరమాద్భుతాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరిస్తూ…
నివేదితచే బిగ్గరగా ఉచ్చరించబడుతున్న ‘మనీ మనీ బ్యాంక్’ వార్త వివరాలని ఆమె గర్భస్థ శిశువు ‘వూ’ కొడుతూ వింటోంది.
నివేదితకా విషయం తెలీదు!
తల్లి నోటి వెంట వెలువడుతోన్న అక్షర వాహినిని గర్భస్థ శిశువు యథాతథంగా తన మనోఫలకంపై ముద్రించుకుంటోందని ఆమె పసిగట్టి వుంటే కథనం మరోలా వుండేది.
కానీ అలా జరగలేదు.
జరిగే ఆస్కారమూ లేదు.
నివేదిత తన ధ్యాసలో తానుంది. బాహ్య ప్రపంచాన్ని మరచి పేపర్‌లోని న్యూస్‌ని ఆసక్తిగా చదవడంలో నిమగ్నమై వుంది.
మధ్యాహ్నం పన్నెండూ పన్నెండున్నర సమయంలో మాస్క్‌లు ధరించిన నలుగురు దుండగులు బ్యాంక్‌లోకి ప్రవేశించారు. వెంట తెచ్చిన మారణాయిధాలతో సిబ్బందిని బెదరగొట్టి… సుమారు ఇరవై ఆరు కోట్ల క్యాష్‌ని లాకర్లు తెరిపించి మరీ దోచుకుపోయారు.
సంక్షిప్తంగా అలా సాగిందా వార్త!
***
ఎనిమిది సంవత్సరముల అనంతరం.
చిన్న పిల్లల్లో కలిగే సందేహాల్ని పెద్దవాళ్ళు నివృత్తి చేయకపోతే పిల్లల్లో కలిగే ఆసక్తి క్షణక్షణానికీ పెరిగి ప్రాక్డికల్‌గా చేసైనా సరే విషయామేంటో తెల్సుకోవాలన్న జిజ్ఞాసకి దారి తీస్తుంది.
అలాంటి సంఘటనే ఓ కుర్రాడి విషయంలో పునరావృతమైంది.
ఒక రోజు.
బయట ఆడుకుంటున్న వాడల్లా సడెన్‌గా మనసు మార్చుకుని తల్లి చెంతకు పరుగు పరుగున వచ్చాడు.
ఆ కుర్రాడి చేతిలో బెలూన్ వుంది.
“మమ్మీ! మమ్మీ! ఈ బెలూన్‌ని వదిలేస్తే గాల్లో ఎగురుంది కదా! మరే దాంతో పాటుగా నేనెగరడం లేదెందుకని?” తన చిన్న బుర్రలో తళుకుమన్న సందేహాన్ని తల్లి ముందుంచాడు.
తీరిగ్గా వున్న సమయంలోనైతే వాడి ప్రశ్నకి ఓపిగ్గా సమాధన మిచ్చేదేమో కానీ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తోందామె.
అందుకే విసురుగా అందా ఇల్లాలు..
“నిట్టూ! ఊరికే నన్ను విసిగించకు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక నాకిప్పుడు లేదు. ముందు బయటకు వెళ్ళి ఆడుకో.”
వాడి ముద్దు పేరు నిట్టూ.
అందాల హరివిల్లు వర్ణరహితమైనట్లు తల్లి మాట వింటూనే పాలిపోయిందా చిన్నారి మోము.
“చెట్టుపై నుండి రాలిన పండు పైకి వెళ్ళకుండా భూమి మీదే పడ్తోంది. ఎందకని?” అనే చిన్న సందేహం న్యూటన్ మహాశయుడి మస్తిష్కంలో మెదిలి చివరికది గురుత్వాకర్షణ శక్తి ఆవిష్కరణకి దారితీసిందని ఆ క్షణంలో ఆ తల్లి మరిచిపోయి వుండుంటుంది.
లేకపోతే కొడుకుతో ఆ తల్లి ప్రవర్తన మరోక విధంగా వుండి వుండేదేమో!
తల్లి సమాధానానికి చిన్నబుచ్చుకున్నా…
మదిలో ఆలోచనలు సుడులై తిరుగుతుంటే మారుమాట్లాడకుండా రివ్వున బయటకు పరుగెత్తాడా కుర్రాడు.
వాడి పేరు అఖిల్.
ఆ పిల్లవాడి తల్లి నివేదిత!
ఆమెకి ఒక్కడే కొడుకతను.
తన మస్తిష్కంలో మెరిసిన మెరుపులాంటి ఆలోచనకి కార్యరూపం తేవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడా చాకులాంటి కుర్రాడు.
కొన్ని బెలూన్స్, ఓ రింగ్, దారాలు తదితర వస్తువుల్ని సేకరించాడు… వాటితో దాదాపు గంట సేపు కుస్తీ పట్టాడు.
వాళ్ళింటికి దగ్గర్లో కిరాణా కొట్టు వుంది. దాన్లోనే అన్ని రకాల వస్తువులు అమ్ముతారు. అక్కడ ఖాతా వుంది. ఇంట్లోకి ఏది అవసరం పడ్డా తల్లి చెపితే వెళ్ళి అఖిల్ వస్తువులు తెస్తుంటాడు. అందుకని అమ్మ తెమ్మందని షాప్ ఓనర్‌కి చెప్పి పై వస్తువులు తెచ్చుకున్నాడు.
రింగ్ చుట్టూ దాదాపు నలభై మూడు దాకా గాలి నింపిన బెలూన్స్‌ని వలయాకారంగా అమర్చాడు. ఆ రింగ్‌ని ఓ కొక్కానికి తగిలించి వుంచాడు. అంత వరకూ పూర్తయిన పనిని పరిశీలిద్దామన్న నెపంతో అనాలోచితంగా కొక్కెం నుండి ఆ రింగ్‌ని విడదీసాడు.
ఆదే అతను చేసిన తప్పు!
ఊర్థ్వపీడన ప్రభావ ఫలితంతో బెలూన్స్ ఆ తేలికపాటి రింగ్‌ని ఒక్కసారిగా పైకి లేపాయి. ఎగిరే రింగ్‌ని ఆపాలన్న ప్రయత్నంలో రెండు చేతుల్తో తన శక్తి కొద్దీ కిందికి లాగాడు దాన్ని.
కానీ ఊహించని విధంగా అప్పుడు జరిగిందా సంఘటన.
రింగ్ పైన కుర్రాడి బలం కించిత్ కూడా పని చేయలేదు. దాంతో పాటుగా వాడు కూడా నెమ్మదిగా పైకి లేచాడు. తానూ గాలిలోకి లేస్తున్నానన్న విషయం అర్థమైన మరుక్షణం ఊపిరి స్థంభించింది వాడిలో.
దాన్ని వదిలేయాలన్న ధ్యాసే మరిచి మరింత బలంగా ఆ రింగ్‌నే పట్టుకున్నాడు.
ఒక్కసారిగా తెలీని భయం ఆవరించి కెవ్వున కేకలు వేయసాగాడు బిగ్గరగా.
దారంట వెళ్తున్న ఓ వ్యక్తి కేకలు వినిపించిన దిశవైపు తలెత్తి చూపు సారించి అక్కడ కన్పించిన దృశ్యానికి మ్రాన్పడిపోయాడు. బెలూన్స్‌తో పాటు నెమ్మదిగా పైకి ఎగుర్తోన్న కుర్రాడ్ని అఖిల్‌గా పోల్చుకున్నాడు.
క్షణం ఆలస్యం చేయలేదు. సంధించి వదిలిన బాణంలా ఆ కుర్రాడి ఇంట్లోకి పరుగెత్తాడా వ్యక్తి.
నిటారుగా కొంత పైకి వెళ్ళాక గాలి విస్తున్న దిశగా ఆ బెలాన్స్ అఖిల్‌ని తీసుకుపోసాగాయి.
కాసేపు గడిచాక గాలి వీచడం తగ్గు ముఖం పట్టడంతో అలా గాల్లోనే ఎగుర్తూ ఒక్కచోటే వుండిపోయాడు.
మొదట భయంతో బిర్రబిగుసుకున్నా, తర్వాత తేరుకున్నాడు. అంతెత్తున అలా గాలిలో గుర్తుంటే సరదాగా, ఉత్సాహంగా అన్పించసాగింది. కాస్త తల దించి కిందికి చూసాడు. అన్నీ చిన్న చిన్నగా కన్పిస్తూ గమ్మత్తుగా అన్పిస్తుంటే థ్రిల్‌గా ఫీలయ్యాడు.
ఆ వ్యక్తి ద్వారా బయట జరుగుతోన్న సాహస చర్య ఇంట్లో వున్న నివేదితకి, ఆఫీసులో వున్న నివేదిత భర్తకి చేర్చబడింది.
అఖిల్ ఎగురుతోన్న ఆ ప్రాంతంలో క్షణంలో జనం పోగయ్యారు. తలలు పైకెత్తి విస్మయంగా అఖిల్‌నే గమనిస్తున్నారంతా.
సన్నగా కలకలం మొదలయ్యింది.
జనమంతా ఉద్విగ్నభరితులయ్యారు.
అఖిల్ తండ్రి వసంత్ కుమార్ తనకు చేరిన కబురుని పోలీస్ స్టేషన్ కందించి నేరుగా ఆ స్పాట్‌కి పరుగెత్తు కొచ్చాడు. అప్పటికి నివేదిత ఏడుస్తూ వచ్చిందక్కడికి.
తగిన పోలీస్ ఎస్కార్ట్‌తో, రక్షక దళాన్ని వెంటేసుకుని యస్సై వేదవ్యాస్ చేరుకున్నాడక్కడికి. ముందుగా, గుమిగూడిన జనాన్ని అక్కడి నుండి దూరంగా పంపించేసాడు.
తొలుత గాలిలో ఎగరడంలో థ్రిల్ పొందిన అఖిల్ ఎంత సేపైనా ఆ బెలూన్స్ తనని కిందికి దింపకపోవడంతో.. అదిగో అప్పుడు ఆందోళన మొదలయ్యిందా కుర్రాడిలో.
కింద కన్పించిన పోలీసుల్ని, జనాన్ని చూసి అఖిల్ బెంబేలెత్తిపోయాడు.
రెండే రెండు క్షణాల్లో అక్కడి పిరిస్థితిని అవగాహన చేసుకున్నాడు యస్సై వేదవ్యాస్.
పాదరసం కంటే చురుగ్గా కదిలాడు.
ఎడం చేత్తో మైక్ పట్టుకొని, కుడి చేయి పైకెత్తి “బాబూ! నే చెప్పేది విను. ఎంత మాత్రం నీ పట్టు విడువకు. ఇప్పుడు తుపాకీతో ఆ బెలూన్స్ పేల్చేస్తాం. నీకేం కాదు. నువ్వు మాత్రం భయపడకుండా కాసేపు కళ్ళు మూసుకో” అంటూ కుర్రాడికి ధైర్యం చెప్పి, తలతిప్పి పోలీస్ షూటర్‌కి సైగ చేసాడు.
అప్పటికే తన తుపాకీని పొజిషన్‌లోకి తీసుకొని ఆజ్ఞ కోసమే రెడీగా వున్నాడతను. యస్సై నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో తన పనికి శ్రీకారం చుట్టాడు పోలీసు షూటర్.
మధ్య మధ్యలో కాస్త సమయం తీసుకుంటూ ఆ షూటర్ అత్యంత జాగ్రత్తగా ఎనిమిది రౌండ్ల పూర్తి చేసాడు. దాదాపు పదిహేను బెలూన్స్ పేలిపోయాయి.
సౌంజ్ఞ చేశాడు వేదవ్యాస్. షూటర్ ఆపాడు.
జనమంతా ఏం జరగబోతోందనే టెన్షన్‌లో వున్నారు.
వేదవ్యాస్ అంచనా నిజమయ్యింది. రెండు నిమిషాల అనంతరం పేలిపోకుండా మిగిలి వున్న బెలున్స్ ఇరవై కిలోల అఖిల్ బరువుని గాలిలో నిశ్చలంగా నిలపలేక అతడిని నెమ్మదిగా కిందికి దింపసాగాయి.
వలతో రక్షకదళం అఖిల్‌ని కవర్ చేసాక అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అంతలోనే చక చకా జరిగిపోయిందా సంఘటన.
అప్పటి వరకూ మామూలుగానే వున్న అఖిల్‌లో నెమ్మదిగా ఏదో మార్పు చోటుచోసుకోసాగింది.
నరాలు చిట్లిపోతున్న అనుభూతి. మెదడు కణాల మధ్య రాపిడి. హృదయాంతరాల్లో ఏదో సంఘర్షణ. మనసు పొరలకి అస్పష్టంగా అందుతున్న సంకేతాల హోరు.
వాటి మధ్య నలిగిపోతూ కణతల్ని భారంగా నొక్కుకుంటూ.. తూలిపడుతూ..
అప్పుడరిచాడు ‘వొద్దొద్దంటూ’ హృదవిదారకంగా.
ఉలిక్కి పడ్డారంతా!
ఆ వేపు మెరుపులా కదిలిన వెదవ్యాస్ స్పృహ తప్పి పడబోతున్న అఖిల్‌ని ఒడుపుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.
భయంతో వాడికలా జరిగిందేమోనని అనుకున్నారంతా.. వేద కూడా!
కానీ..
భవిష్యత్‌లో ఉత్కంఠభరితమై చోటు చేసుకోబోతున్న ఓ అత్యద్భుత ఘటనకి ఆ క్షణంలో నాందీ ప్రస్తావన జరిగిందని.. అందుకు అఖిల్ సూత్రధారుడై నిలవబోతున్నడని తెలీదెవరికీ!
నివేదిత దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ కుప్పకూలిపోయింది. జరుగుతున్న తతంగాన్ని నిస్తేజంగా చూస్తూ ఆమె భర్త వసంత్ ఆమెని పొదవి పట్టుక్కూర్చున్నాడు.
మళ్ళీ గుమిగూడిన జనం అఖిల్‌ని చుట్టుముట్టకుండా తన బలగాన్ని ఎలర్ట్ చేశాడు.
ఇక ఎక్కువ సేపు అక్కడ ఉండడం మంచిది కాదని భావించి పేరెంట్స్‌తో సహా అఖిల్‌ని సురక్షితంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు.
లోపలికి ఆహ్వానించాడు వసంత్. అంగీకరించాడు వేదవ్యాస్. టీ ఆఫర్ చేస్తే కాదన్లేక పోయాడు. తొందర్లోనే అఖిల్ మామూలై పోయాడు.
అందరూ రిలాక్సయ్యాక అఖిల్‌ని చనువుగా దగ్గరకు తీసుకుని ఆ యస్సై అడిగాడు కావాలని.
“నీ పేరేంటి బాబూ?” అని.
“రాజ్.. అఖిల్ విహారీ రాజ్” ఠక్కున చెప్పాడు కుర్రాడు. సినిమా స్టయిల్‌లో ఉత్సాహంగా.
“ఐసీ! ఏం చదువుతున్నావ్ మరి?” ప్రశ్నించాడు మళ్ళీ.
“థర్డ్ స్టాడర్డ్.”
ఎలాంటి బెరుకు లేకుండా ఆ కుర్రాడు సమాధానాలిస్తుండడంతో ముగ్ధుడవుతూ అప్పుడడిగాడు.
“అసలిలాంటి పన్చేయాలన్న ఆలోచన నీకెందుక్కల్గిందీ?”
తడుముకోకుండా ఎగరడానికి ముందు జరిగింది చెప్పేసాడు.
‘జస్ట్ క్యూరియాసిటీ అన్నమాట’ మనసులో అనుకున్నాడు
వసంత్‌ని ప్రక్కకి పిల్చి“ మీ వాడినేమీ అనకండి. కోప్పడకండి. అసలేమీ జరగనట్లే వాడితో ప్రవర్తించండి.” అని చెప్పాడు వెళ్తూ వెళ్తూ.
సరేనన్నట్లు తలూపాడు వసంత్.
***
‘మనీ మనీ కోఆరపరేటివ్ బ్యాంక్’ దోపిడీ జరిగి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యయి.
దుండగుల ఆచూకీ మాత్రం దొరకలేదు. ఎలాంటి ఆధారాలు నేరస్థులకు సంబంధించి లభ్యమవలేదు.
ఆ బ్యాంక్ తాలూకు టర్నోవర్ బాగా తగ్గిపోయింది.
కస్టమర్లని ఆకర్షించడానికి, టర్నోవర్‌ని పెంచుకోవడానికి ఆ బ్యాంక్ విశ్వప్రయత్నం చేస్తూనే వుంది.
బ్యాంక్ దోపిడీ కేసుని సి.బి.సి.ఐడికి అప్పగించింది ప్రభుత్వం. ఫలితం శూన్యం. నేరాన్ని వెలికితీయలేక పోయారు.
ఒక రకంగా సి.బి.సి.ఐ.డి దర్యాప్తు నిలిచి పోయిందనే చెప్పొచ్చు.
***
“డాడీ.. డాడీ! నంది దేవుడా?” కుతూహలంగా అడిగాడు అఖిల్.
“కాదు నాన్నా!” సమాధాన మిచ్చాడు తండ్రి వసంత్.
“మరే నిన్న మనం వెళ్ళిన శివాలయంలో నంది ఉన్నాడు కదా! ఆయనక్కూడా దణ్ణం పెట్టమందిగా మమ్మీ!” ఆ చిన్నారి బుర్రలో సరికొత్త సంశయం సుడులు తిరిగింది.
“శివుడు దేవుడు. శివుడి వాహనం నంది. కనుక దేవుడి వాహహనమైన నందీశ్వరుడికి కూడా దండం పెట్టాల్సిందే మరి.” చెప్పాడు వసంత్.
“అలాగా” అంటూ అర్థమైనట్లు తలూపాడు వాడు.
మళ్ళీ వెంటనే “డాడీ! మరే వినాయకుడు కూడా దేవుడే కదూ!” అనడిగాడు చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ.
“అవునమ్మా. చాలా పవర్ వుల్ గాడ్. అందుకే మనమంతా ముందుగా ఆయనకే దండం పెట్టాలి” అన్నాడు.
సరేనన్నట్లు తలూపాడు అఖిల్.
“ఏదీ ఒకసారిలా అను చూద్దాం – ‘గణేశ్ మహరాజ్‌కీ జై!’ ” తాను బిగ్గరగా అరుస్తూ కొడుక్కి చెప్పాడు.
“గణేశ్ మహారాజ్ కీ జై!” చెయెత్తి మరీ ఇల్లదిరిపోయేలా ఉత్సాహంగా అరిచాడు తండ్రి చెప్పినట్లుగానే.
“చాలా డాడీ! మరోసారి అనాలా” తండ్రినడిగాడు.
“చాల్చాల్లేరా బాబూ! ఎన్నడూ లేంది హఠాత్తుగా ఉదయం పూట ఈ అరుపులేంటంటూ మీ మమ్మీ మనకు క్లాసు పీకుతుంది” అన్నాడు వాణ్ణి వారిస్తూ.
మౌనం వహించాడు. అదీ అరక్షణం!
“డాడీ..! విఘ్నేశ్వరుడి వాహనమేంటి?” అంటూ మరో ప్రశ్న సంధించాడు.
“ఆర్.ఎ.టి.. ర్యాట్! ఎలుక.” చెప్పాడు వసంత్ ఎలిమంటరీ స్కూల్ టీచర్ స్టయిల్‌లో.
“మరలాగయితే శివుడి వాహనమైన నందికి దణ్ణం పెట్టినప్పుడు, విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకకి కూడా దణ్ణం పెట్టాలిగా” అనడిగాడు అమాయకంగా ఫేసు పెట్టి.
గతుక్కుమన్నాడు వసంత్.
“ఇప్పుడు సమాధానం చెప్పండి చూద్దాం” అనట్లున్నాయి వాడి వాడిచూపులు.
కూర్చూన్న చోటే ఇబ్బందిగా కదిలాడు వసంత్.
వెధవ ప్రశ్నలు వీడూనూ. ఎటాక్ స్టార్టయ్యిందన్నమాట. అందుకే ఆదివారాలు కూడా స్కూల్ రన్ చేస్తే బావుండేది. వీడిలా వేపుకు తినడం వుండకపోయిండేదిగా! అనుకున్నాడు మనసులో.
తండ్రి రెండు చేతుల్ని పట్టుకుని కుదుపుతూ గోముగా అడిగాడు “చెప్పండి డాడీ!” అని.
ఏదో చెప్పబోయి, చప్పున ఆగిపోయాడు వసంత్.
“దణ్ణం పెట్టకుండా బోనులో పడ్డ ఎలుకని నిన్న చంపేసింది. కాల్చింది కూడా! ఎందుకని?” అంటూ నిలదీశాడు వాడు.
వదిలేలా లేడని, “ఎందుకంటే.. ఎందుకంటే ఎలుకల్ని చంపి, కాల్చకుంటే ప్లేగు వ్యాధి చుట్టేస్తుందని” అంటూ పళ్ళు పట పట కొరికాడు.
“ప్లే..” అంటూ వాడు మళ్ళీ ఏదో అడగబోతుంటే “డోంట్ ప్లే విత్ మీ” అని మనసులో కసిగా అనుకొని తెరిచిన కొడుకు నోటిని చప్పున అరచేత్తో మూసేసాడు వసంత్.
ఇంతలో వంటింట్లో నుండి అటువైపు వచ్చింది నివేదిత. చూడగానే ఆమెకి అక్కడి సీన్ అర్థమైంది.
భార్యని చూడగానే నోటికడ్డం పెట్టిన చేతిని వదిలేసాడు వసంత్.
అఖిల్ బారి నుండి భర్తని రక్షింద్దామని “నిట్టూ! ఇలా రా నాన్నా. డాడీ నిన్న ఆఫీసు నుండి లేటుగా వచ్చారు. ఆయనకి హెడేక్‌గా వున్నట్టుంది. విసిగించకుండా నాతోరా స్నానం చేయిస్తాను” అంటూ వాడి జబ్బ దొరక బుచ్చుకుని బాతురూమ్ లోకి తీసుకెళ్ళింది.
“హమ్మయ్య” అని నిట్టూర్చాడు వసంత్.
దొరికిన ఛాన్స్ అన్నట్లు బెడ్ రూమ్ వదిలి హాల్లోకి వెళ్ళాడు.
ఈజీ చెయిర్‌లో కూర్చుని పేపర్ తిరగేయసాగాడు.
ఫ్రెంట్ పేజీలోని హెడ్ లైన్స్ కళ్ళతో చదివి, లోపలి మ్యాటర్ కొరకై మడత విప్పబోతుంటే రెండు పాంప్లెంట్స్ రాలి పడ్డాయి.
నగరంలో ఎక్కడ ఏది ప్రారంభమైనా పాంప్లెంట్‌గా అచ్చై పేపర్‌తో పాటే వచ్చేస్తుంటుంది. పాంప్లెట్ అనేది లో-కాస్ట్ సూపర్ ఫైన్ అడ్వర్టయిజ్‌మెంట్ అని వసంత్ అభిప్రాయం.
పాంప్లెట్ చూడ్డమంటే మహా సరదా. అందుకే వంగి కింద పడిన పాంప్లెట్స్‌ని చేతిలోకి తీసుకున్నాడు.
ఒక పాంప్లెట్ మ్యాటర్‌ని చూపుల్తోనే చక చకా చదివాడు.
“చేరండి.. చేర్పించండి!” అనే శీర్షికతో పడిందొక చిట్ ఫండ్ ప్రకటన.
ఇప్పటికీ నూట యాభైకి పైగా చిట్ ఫండ్ కంపెనీలున్నాయి. మరింకెన్ని ప్రారంభమౌతాయోనని విసుక్కుంటూ దాన్ని ముద్దలా మడచి ఓ మూలకి గిరవాటేసాడు.
రెండవ పాంప్లెట్ చూసాడు. అది డబుల్ షీట్‌తో వుంది.
“గృహిణులకు శుభవార్త! సగం ధరలకే గృహోపరకణాల కోనుగోలు!!” అనే హెడ్డింగ్‌తో ఉందా పాంప్లెట్. అక్షరం పోకుండా చదివాడు.
‘ముందుగా సగం డబ్బు కట్టండి. మీకు నచ్చిన వస్తువు తీసుకుపోండి. మిగతా సగం డబ్బు జీరో వడ్డీతో వాయిదాల మీద కట్టండి.
మొదటి బ్యాచ్ పూర్తయి పోయింది. రెండవ బ్యాచ్‌లో చేరడానికి ఈ నెలాఖరు మాత్రమే గడువుంది.
త్వరపడండి!’
అదీ ఆ ప్రకటన సారాంశం.
అనాసక్తిగా దాన్ని కూడా మడిచి మూలకి విసిరాడు.
నిట్టూరుస్తూ పేపర్లోకి తలదూర్చూడు.
***
అదే సమయంలో..
అదే పాంప్లెట్ యస్సై వేదవ్యాస్ చేతిలో రెపరెపలాడ్తోంది. పెద్దగా పట్టించుకోలేదతను.
అదే అతను అనాలోచితంగా చేసిన పొరపాటు.
ఎందుకో ఆ క్షణంలో వేద ఆ పాంప్లెట్‌ని సీరియస్‌గా తీసుకోలేకపోయాడు.
త్వరలో తను చేపట్టబోయే ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌కి అదో తిరుగులేని ఆయిధం కాబోతోందని ఆ సమయంలో తెలియదతనికి.
స్టేషన్ నుండి ఏదో రోటీన్ కాల్ రావడంతో.. వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ ఆ హడావిడిలో అప్పటికి ఆ విషయాన్ని తాత్కాలికంగా వదిలి వేసాడు.
అలా అని మరచిపోలేదు.. మరచిపోడు!
మెదడు పొరల్లో ఏ మూలో నిక్షిప్తమై వుంటుంది. తిరిగెపుడో అతని ఆలోచనల మధింపులో ఉద్భవిస్తుందా మ్యాటర్.
అదే అతడి కాన్పిడెన్స్ !!
(ఇంకా ఉంది)