ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-4

0
2

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]వి[/dropcap]శ్వవ్యాప్తమై విస్తరించిన విజ్ఞానం మానవు మస్తిష్కంలో వెలుగురేఖల్ని విరజిమ్ముతున్న దశలో..

సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ నూతన శతాబ్దంలో..

ఎందరో మూఢనమ్మకాలను విశ్వసించడం అర్థం లేని విషయమే కావచ్చు. ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోననే భ్రమలో పడి వాస్తవాల్ని విస్మరించి, అనవసరపు ఆలోచనలకి తావివ్వడం అర్థంలేని నైజమే కావచ్చు.

వీటిని సమాంతరంగా పుణికి పుచ్చుకున్న నివేదిత ప్రస్తుత మానసిక స్థితి మాత్రం డోలాయమానంగా వుంది.

అఖిల్ విచిత్ర ప్రవర్తన ఆమెని మనోదౌర్భల్యం వైపుకి నెట్టేసింది.

అది ఎవరో చేసిన చేతబడో.. శక్తిపూనడమో.. కావచ్చనే భ్రమ వైపే మొగ్గు చూపుతోంది.

అందుకే తన అనుమానాన్ని భర్త వసంత్‌కి వెల్లడించింది.

బదులుగా బిగ్గరగా నవ్వాడతను.

“పల్లెటూరి దానిలా ఏమిటా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎవరైనా వింటే మెంటల్ కేస్ అనుకుంటారు. సైన్స్ గ్రాడ్యూయేట్‌వి, నీ అభిప్రాయాలిలా ఉండొచ్చా? అయినా పిక్‌నిక్‌‌లో జరిగిందొకటి, మేడమ్స్ వచ్చి నీతో చెప్పింది మరొకటై ఉంటుంది. మనవాడసలే క్వశ్చన్ బాంబర్! వాళ్ళందర్నీ హడలు గొట్టే ప్రయత్నం చేసుంటాడు..”

పూర్తిగా వినకుండానే నివేదిత అడ్డు తగిలింది.

“అదికాదండీ!…”

ఆమెని చెప్పనివ్వకుండా తిరిగి తనే కంటిన్యూ చేశాడు.

“నువ్వు బెంబేలెత్తిపోయి భూతాలంటూ అభూతకల్పనలు చేస్తూ నన్ను అనవసరంగా కంగారు పెట్టేయకు. వాడినీ ఇబ్బంది పెట్టకు. అఖిల్ కేమీ జరగలేదు. జరగదు. జరగబోదు. నిక్షేపంగా ఉన్నాడుగా!

అంతగా నీకు అనుమానంగా ఉంటే ఏ డాక్టర్‌కో సైకియాట్రిస్ట్‌కో చూపెడదాం. ట్రీట్‌మెంట్‌తో సమస్య సెటిలైపోతుంది. అంతే గానీ నువ్వు దీన్ని జటిలం మాత్రం చేయకు. ఏమంటావ్?” ఆమెలోని భయాన్ని పారద్రోలాలన్న సంకల్పంతో కాస్త ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశాడు.

“నా అనుమానం నాది. మీ అభిప్రాయం మీది. ముందోసారి నన్ను మా అమ్మవాళ్ళ ఊరికి వెళ్ళనివ్వండి. అదో ప్రయత్నం! వాడికి నయమయ్యిందా ఫర్వాలేదు. ప్రయత్నం ఫలించలేదనుకోండి, మీరన్నట్లుగా డాక్టర్‌కి చూపెడదాం. ప్లీజ్! కాదనకండి” వేడుకోలుగా అంది.

“సరే! నీ మాటెందుకు కాదనాలి. అలాగే కానివ్వు. కానీ నిట్టూగాడికేం తెలియనీయకు. మళ్ళీ దీని మీద రీసెర్చ్ చేసినట్టు ప్రశ్నలు వేసి చంపుకుతింటాడు. అలాగే మీ అమ్మానాన్నలని కూడా అనవసరంగా భయపెట్టకు. అసలే వాళ్ళకి నువ్వన్నా, మన బాంబ్‌గాడన్నా పంచప్రాణాలు.”

భార్యకి జాగ్రత్తలు చెప్పి తను ఆఫీసుకి వెళ్ళిపోయాడు.

నివేదిత తన తల్లిగారి ఊరైన గోదావరిఖని వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం అఖిల్ భవిష్యత్‌ని ఎన్ని మలుపులు త్రిప్పడానికి దారి తీసిందో.. ఆ క్షణంలో ఆమె ఊహకందని విషయం.

***

చిన్న బ్రీఫ్‌కేస్‌లో బట్టలు సర్ది అఖిల్‌ని వెంటేసుకుని బస్టాండ్‌కి వెళ్ళింది నివేదిత. బస్‌లో అఖిల్ మౌనంగా ఉండడానికి వాడికో కామిక్స్ బుక్ కొనిచ్చింది.

బస్ రడీగా వుంది. వెయిటింగ్ బాధ తప్పిందని ఎక్కి కూచుంది. ఆలస్యం చేయకుండా బస్ గోదావరిఖనికి బయల్దేరింది.

అప్పటి వరకూ జాడలేని మేఘాలు ఒక్కచోట సమావేశం అవుతున్నట్టు సూచనగా ఆకాశాన్ని అల్లకుపోసాగాయి. అయితే బలంగా వీచే గాలుల వల్ల అంతలోనే  చెల్లా చెదురవుతూ తేలికైపోతున్నాయా మేఘాలు.

మధ్యాహ్నం మూడు గంటల వేళప్పుడు బస్ గోదావరిఖని చేరింది.

రకరకాల ఆలోచనల్తో బస్ ప్రయాణం కొనసాగించిన నివేదిత బస్‌స్టాప్‌లో బస్ ఆగడంతో అఖిల్‌తో పాటు దిగింది.

తమని చుట్టుముట్టిన ఆటోవాళ్ళని, రిక్షావాళ్ళని వదుల్చుకుంటూ రామ్‌నగర్ కాలనీవైపు నెమ్మదిగా నడక సాగించింది.

బస్ స్టేషన్ నుండి కాస్త దగ్గర్లోనే ఉంటుందా కాలనీ. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో కలిసే పరిచయస్థుల్ని పలకరించుకుంటూ పోవాలని ఆమె అభిలాష.

ఆకాశంలో క్షణక్షణానికీ మార్పు చోటు చోసుకోసాగింది.

అప్పుడే సన్నగా ఎండ తెరవడం.. మరుక్షణం ఎండ మాయమై ఆకాశాన్ని మేఘాలు కమ్మేయడం.. వెంటనే చల్లని గాలులు విచడం.. అన్నీ కలిసి దోబూచులాడుకుంటున్నట్టుంది వాతావరణం.

ఏ నిమిషంలోనైనా తుంపర్లుగా గానీ.. భారీగా గాని వర్షం కురియొచ్చు అన్నట్లుగా వెనువెంటనే మార్పులకి లోనవుతోంది వాతావరణం.

ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతోంది నివేదిత.

తల్లి చేయి పట్టుకొని సరదాగా నడుస్తున్న అఖిల్ ఆకాశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు.

అదే క్షణంలో –

***

నివేదిత ఇంట్లో ఫోన్ రింగవుతోంది!

పాండవీయం భార్య ప్రణిత తన ఇంట్లో నుండి నివేదిత ఫోన్ నెంబర్‌ని డయల్ చేస్తోంది.

రెండు మూడుసార్లు రీడయిల్ చేసి, అవతలి వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది.

***

వాతావరణ మార్పులకి భీతిల్లి సహజంగానే తలో దిక్కుగా ఎగిరిపోతున్న పక్షలు గుంపులు కేసి ఆసక్తిగా చూపుని సారించాడు అఖిల్.

“అమ్మా! అమ్మా! మరే అలా ఆకాశంలో పక్షలు ఎలా ఎగురగలుగుతున్నాయి?” అంటూ తల్లిని ప్రశ్నించాడు తన ఆసక్తికి అక్షరరూపమిస్తూ.

“పక్షులకి రెక్కలుంటాయి. ఆ రెక్కల్ని గాల్లో రెపరెప లాడిస్తూ వాటి సాయంతో ఎంత దూరమైనా ఎగుర్తూ ప్రయాణించగలవు.”

‘ఇంకా మౌనంగానే వుండి పోయాడేంటబ్బా?’ అని నివేదిత అనుకుంటుండగానే క్వశ్చన్ బాంబ్‌ని విసరడంలో వాడి సందేహ నివృత్తి గావించిందామె.

“వాటికి రెక్కలున్నాయ్! అందుకే అలా ఎగురగలుగుతున్నాయన్నమాట” అంటూ అర్థమైనట్లు సాలోచనగా తలూపాడు.

“అవును. మనకి రెక్కలు లేవు కనుకే మనం గాలిలో ఎగరలేకపోతున్నాం” తర్వాత మరో ప్రశ్న వేయకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా సమాధానమిస్తూ తన దృష్టిని పరిసరాలవైపు సారించింది.

చాలా కాలం తర్వాత అమ్మానాన్నల దగ్గరకు వెళ్తుండడంతో కాస్త ఉత్సాహంగా వుందామెకు.

“మరే రెక్కలుంటేనే గాలిలో ఎగుర వచ్చన్నమాట.”

“అవును. ఎగిరే ప్రతి పక్షికీ తప్పని సరిగా రెక్కలుంటాయి. అవి లేకపోతే ఎగురలేవు.”

తాను తన ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాగా తిరిగిన ఆ పరిసరాల్ని వాటి తాలూకు అనుభూతుల పుటల్ని మరోసారి మనోగ్రంథంలో తిరగేసుకుంటూనే అఖిల్‌తో సంభాషణ కొనసాగిస్తోంది.

“మరే ఆంజనేయస్వామి గాలిలో ఎగురుతూ వెళ్ళి సంజీవనీ పర్వతాన్ని తెచ్చాడని మేడమ్ చెప్పిందిగా. మనింట్లో ఉన్న ఫోటోలో ఆంజనేయస్వామికి రెక్కలు లేవుగా! మరెలా ఎగిరాడమ్మా?” తన చిన్న బుర్రని నిలువునా ఊపూతూ సందేహంగా అడిగాడు.

కాస్త తటాయించిందా ప్రశ్నకు. ఎలా చెప్పి వాడిని సమాధానపర్చాలో క్షణకాలం బోధపడలేదు. అందుకే ఆలోచనల్లో పడింది కాసేపు. అయినా జవాబు తట్టలేదు.

వాడితో వచ్చే చిక్కే ఇది. ఎక్కడో మెలికపెట్టి ప్రశ్నలు వేస్తుంటాడు. తోచిన సమాధానం చెప్పేస్తే ఊరుకోడు. సరైన సమాధానం వచ్చేవరకు ఒక పట్టాన వదిలిపెట్టడు.

తను చెప్పే సమాధానం వాడిని సంతృప్తి పరిచినా వదలడని తెలిసీ “ఆయన దేవుడు కనుక అలా సులభంగా గాలిలో ఎగురగలిగాడు” అంది.

“దేవుడైతే మాత్రం రెక్కల్లేకుండానే ఎలా ఎగిరాడు? మనం కూడా ఆ దేవుడిలా ఎగరాలంటే ఏం చేయాలి” ప్రశ్న మీద ప్రశ్న సంధించాడు.

“దేవుడిలో మహత్తు వుంటుంది. కాబట్టి రెక్కల్లేకపోయినా ఎగురగలడు. తమ మహత్తులోనే దేవుళ్ళు ఏం చేయాలనుకున్నా చేసేస్తారు. కానీ మనం మానవులం. మనలో ఆ మహత్తు వుండదు కనుక ఎగరాలంనుకున్నా ఎగరలేం” చెప్పింది నివేదిత.

వాడి దృష్టిని సందేహాల నుండి మరల్చాలన్న ఉద్దేశంతో “అదిగో అడు చూడు. దేవుడనగానే ఆంజనేయస్వామి దేవాలయం వచ్చింది. పద అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం” అంటూ పక్కకి కదిలింది.

రామనగర్ కాలనీ ఏరియా దాటి లాల్ బాహదూర్ వీధిలోకి ఎంటరయ్యారు వాళ్ళిద్దరు.

అక్కడ గుడి అంటూ లేదు గానీ, రోడ్డు ప్రక్కగా చిన్న మైదానంలో వేపచెట్టు నీడన వెలిసిన హనుమాన్ రాతి విగ్రహమది.

పూజారితో ప్రత్యేకంగా పూజాపునస్కారాలుండవు. అయినా ప్రతి మంగళ, శనివారాల్లో మాత్రం భక్తుల కోలాహలం అధికంగా వుంటుందక్కడ.

భక్తులు కోరిన కోర్కెలు వెంటనే తీర్చే దేవుడిగా ఆయనకి పేరుండడంతో మారుమూల ప్రాంతాలవారు సైతం తమ మొక్కులు తీర్చుకొని, ఆయనని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చి పోతుంటారు.

దారిలోనే స్వామి దర్శనభాగ్యం కలగడం శుభసూచకంగా భావించింది నివేదిత. దేవున్ని దర్శించుకొని పోదామని విగ్రహం వైపుకి అడుగువేసింది.

మరో సందేహం బుర్రలో గిర్రుమని సుడులు తిరుగతుంటే బయటకు కక్కలేక చప్పున నోరు మూసుకొని బుద్ధిగా తల్లి వెంట నడిచాడు అఖిల్.

అఖిల్‌ని విగ్రహం ముందుకి తీసుకెళ్ళి “దేవుడికి దండం పెట్టు” అంది.

తను కళ్లు మూసుకొని రెండు చేతులు జోడించింది.

తల్లిని అనుకరిస్తూ చెప్పులు ఓ ప్రక్కగా వదలి తన వంచి భక్తితో కళ్ళు మూసి భగవన్నామస్మరణం చేశాడు.

ఒకే ఒక్క సెకను..

అనంతరం-

అఖిల్ ముఖం వివర్ణమవసాగింది. ముక్కు పుటాలదిరాయ్. కళ్ళల్లోంచి వింత కాంతి ప్రసరిస్తోంది. శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి.

తన మెదటులోకి సంకేతాలేన్నో ఇంజక్టవుతుంటే భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్దతరంగాల హోరు.

కణతల్ని చిట్టిచేతుల్తో నొక్కుకుంటూ వేదనగా అరిచాడు ‘వొద్దొద్ద’ని.

ఆ అరుపు విని చప్పున కళ్ళు తెరిచింది నివేదిత.

వాడినా స్థితిలో చూసి భీతిల్లిన నివేదిత “ఏమైంది నాన్నా” అంటూ చేయి పట్టి కుదుపబోయింది.

కానీ ఆమె చేయి లేపలేక పోయింది. అసంకల్పితంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

“నిట్టూ” అని ఓ కేక మాత్రం వేయగలిగింది.

కన్నతల్లి పిలుపు విన్పించిందో లేదో లెలీదు.

అఖిల్ ఉలుకూ పలుకూ లేకుండా అలాగే నిలబడ్డాడు. కాకపోతే వేదన తొలగి.. ఒక పవిత్రమూర్తిలా ఉన్నాడు.

అఖిల్ అరుపుకి, నివేదిత కేకకి పరుగు పరుగున వచ్చారు జనం. తల్లీ కొడుకుల్ని మార్చి మార్చి చూడసాగారు వాళ్ళిద్దరి చుట్టూ గుమిగూడి.

నెమ్మదిగా, నెమ్మదిగా నెమ్మదిగా..

తనను మరచి పెదాలు విప్పాడా కుర్రాడు.

పోగైన జనం గురించి ధ్యాసే లేదామెకు. తన కన్నపేగుకి ఏమైందోనన్న ఆతృత తప్ప. నివేదిత కనుపాపల ఉపరితలాలపై సన్నటి నీటి పొర.

కంటి పొరల ముందు ఏవో దృశ్యాలు లీలగా కదలాడుతుంటే..

ఎప్పుడో ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడా కుర్రాడు.

***

సాయంత్రం.

సుమారు నాలుగ్గంటల వేళ.

బ్యాంక్‌లో తన కంప్యూటర్ చాంబర్‌లో ఒంటరిగా కూర్చున్నాడు పాండవీయం. కంప్యూటర్ ఆపరేట్ చేస్తూనే తన మస్తిష్కానికి పదును పెడ్తున్నాడు.

మనీ మనీ బ్యాంక్ మేనేజర్‌గా బాధ్యతలు చెప్పట్టిన నాటి నుండి వీలు చిక్కినప్పుడల్లా కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్నాడు. అయినా అతని ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు.

దోపిడీకి ముందు బ్యాంక్ టర్నోవర్ ఎంత?

దోపిడీకి గురయిన అనంతరం టర్నోవర్ ఎంత తగ్గింది?

ప్రస్తుత టర్నోవర్ ఏ స్థాయిలో ఉంది?

ఇంకా టర్నోవర్ రేంజ్ ఏ మేరకు పెంచాల్సి వుంది?

– వంటి అంశాల్ని పాండవీయం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు.

బ్యాంక్‌కు సంబంధించిన ప్రతి బిట్‌ని పరిశీలించి దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తీవ్రంగా ఆన్వేషిస్తున్నాడు.

అలా చాలా సమయం గడిచిపోయింది.

బ్కాంక్‌లో తిరిగి డిపాజిట్లు పెరగడానికి కష్టపర్స్‌ని మునుపటిలా ఈ బ్యాంక్ వైపు మరల్చుకోవడానికి.. ఎలాగైనా ఈ రోజు ఓ ప్రణాళిక రూపొందిచుకోవాలని స్థిరంగా అనుకున్నాడతను.

అందుకే పాండవీయం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

వాస్తవానికి మనీ మనీ బ్యంక్ ఇతర బ్యాంక్‌లు చెల్లించే వడ్డీకంటే ఎక్కువే చెల్లిస్తోంది డిపాజిట్‌దార్లకు. అందులో నో డౌట్.

కానీ కష్టమర్లకి నమ్మకం కలిగించాలి. వాళ్ళలో పేరుకుపోయిన అభద్రతా భావాల్ని తొలగించాలి. అదీ అతని ముందున్న అసలు సవాల్.

దాన్ని అధిగమించాలంటే-

పాండవీయానికి ముడు మార్గాలు కన్పించాయి.

ఒకటి!

సిటీలోని మనీ మేకర్స్‌ని దశల వారీగా స్వయంగా కలిసి బ్యాంక్‌తో లావాదేవీలు జరిపేలా వాళ్ళని ఒప్పించగలగడం.

రెండు!

ఉద్యోగస్థుల్ని కూడా డిపార్ట్‌మెంట్‌ల వారిగా సంప్రదించి బ్యాంక్ పైన సదభిప్రాయం కలిగేలా నచ్చచెప్పడం. వాళ్ళ నుండి సాధ్యమైనంత వరకు డిపాజిట్లని సేకరించడం.

మూడు!

ఈ రెండింటి కంటే ముందు మనీ మనీ బ్యాంక్ గురించి విస్తృతంగా ప్రచారం జరపడం. అన్ని మీడియాల ద్వారా పబ్లిసిటీ ఇవ్వడం.

దీంతో మిగతా జనాలకి బ్యాంకంటే విశ్వాసం కుదురుతుంది.

వాళ్ళలో బ్యాంక్ వైపు కదలిక మొదలవుతుంది.

పై ఆలోచలను ఆశాజనకంగా తోచాయతనికి.

ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంతకుమించి చేయల్సిందేమీ లేదన్పించిందతని మేధస్సుకి.

***

అఖిల్ తనదైన బాణీలో చెప్పుకు పోతున్నాడు.

ప్రజలు ఆశ్చర్యంతో వింటున్నారు- తెలిసిన కథని తెలియని కొణంలో .

1989-2-22

శనివారం. ఉదయం పది గంటలు.

“సతీష్” అంటూ పిలిచాడు రవీందర్, వాళ్ళింటి గుమ్మం ముందు నిలబడి. ఆ కుర్రాడి వయసు పధ్నాలుగు ఉంటుంది.

రెండవసారి పిలిచిన పిలుపుకి బయటకు పరుగెత్తు కొచ్చాడు సతీష్. ఎనిమిదేండ్లుంటాయతనికి.

వస్తునే “బాల్ తెచ్చావా” అనడిగాడు.

క్రితం రోజు సాయంత్రం సతీష్‌తో రవీందర్ చెప్పాడు – మర్నాడు ఆడుకోవడానికి బాల్ తీసుకువస్తానని. అందుకని బాల్ గురించి అడిగాడలా.

“తేలేదు. మా ఇంట్లో ఆడుకుందాం. నువ్వే అటురా” అంటూ పిలిచాడు సతీష్‌ని.

‘సరే’నంటూ రవీందర్ వెంట కదిలాడు.

వాళ్ళిద్దరూ స్నేహితులు. ఒకే వీధిలో వుంటారు.

సతీష్‌ని వెంట తీసుకొని రవీందర్ ఇంటికి వెళ్ళేసరికి గుమ్మంలో ఎదురయ్యాడతని తండ్రి.

“రవీ సూపర్‌బజార్‌కు వెళ్ళి అరకిలో గోధుమపిండి తీసుకురా” అంటూ కొడుక్కి డబ్బులందిచాడు నారాయణ.

ఆడుకునే మూడ్‌లో వున్న రవీందర్ అయిష్టంగానే డబ్బులు తీసుకున్నాడు.

కొడుకు వాలకాన్ని గమనించిన నారాయణ “త్వరగా తెచ్చిచ్చి ఆడుకో. నువ్వొచ్చేదాకా సతీష్ వుంటాడ్లే” అన్నాడు.

రవి పిండి తీసుకురావడానికి కనీసం అరగంటయినా సమయం పడుతుంది.

వెంట సతీష్‌ని కూడా రమ్మంటే ఓ ప్రమాదం తప్పి ఉండేది. కానీ అలా జరగలేదు. మాట్లాడకుండా వెళ్లిపోయాడు రవి.

కొడుకు వెళ్ళిపోయాక సతీష్‌ని లోపలికి పిలిచింది కమల. మాతృత్వాన్ని మరచి అకృత్యానికి సంసిద్ధురాలైన ఆ తల్లి తినమని సతీష్‌కి ఓ లడ్డుచ్చింది.

వద్దన్నాడు మొదట. బలవంతం చేయడంతో లడ్డూ అందుకొని తినసాగాడు సతీష్.

ఇంట్లో అయితే రెండే రెండు బుక్కల్లో ఆ లడ్డూని తినేసేవాడేమో ఇక్కడ బావుండదని కొంచెం కొంచెం కొరుక్కుంటూ నెమ్మదిగా తింటున్నాడు.

అయితే అయిదు నిమిషాల అనంతరం..

ఆ కుర్రాడ్ని మత్తు కమ్మేసింది.

అత్యంత శక్తివంతమైన చెట్ల పసర్లతో తయారుచేయబడ్డ మత్తు మందు. అందులో కలపబడిందని వాడికేం తెలుసు.

మత్తు నరాల్లోకి ప్రవహిస్తుంటే తూలిపడబోయాడు.

వాడిని రహస్యంగా గమనిస్తున్న నారాయణ, కమలలు ఏమీ ఎరుగని అమాయకుల్లా పరుగెత్తుకు వచ్చి “ఏమైంది సతీష్” అంటూ కంగారుగా అడిగారు.

అప్పటికే పూర్తిగా మైకం కమ్మేసింది. పడకుండా పట్టుకొని అక్కడే కింద పడుకోబట్టాడు నారాయణ.

భార్యకు ఏదో పని చెప్పి పురమాయించాడు.

అత్యంత హేయమైన రాక్షసచర్యకి సాక్ష్యం మేముండలేమన్నట్లు ఆ వీధి వీధంతా నిర్మానుష్యంగా వుంది. ఆ దంపతులకి కావాల్సిందదే.

అనుకున్నట్టే జరుగుతుండడంతో విధి కూడా సహకరిస్తోందని భావించాడతను.

సతీష్ నుదుటన ఎర్రతిలకం దిద్దింది కమల. తులసి నీళ్ళు పెదాలు తెరచి నోట్లో పోసాడు నారాయణ. మిగిలిన నీటిని పిల్లవాడి ఒంటిపై చల్లాడు.

అర నిమిషం పాటు మనసులో ఏవో అక్షరాల్ని పఠించాడు.

తక్షణం ఆ కుర్రాడ్ని అమాంతంగా పైకి లేపి తన భజంపై వేసుకున్నాడు. బలికి సిద్ధమైన మేకపిల్లడతడు.

జాలి లేదు. కరుణ లేదు.

ఆర్తి లేదు. ఆర్ద్రత లేదు.

వాళ్ళది రాతి గుండె. మనషుల్లో రాక్షసులా ఇద్దరు.

మూఢ నమ్మకాన్ని అణువణువున జీర్ణించుకొని, మానవబలితో వరాలు సిద్ధిస్తాయనే మూర్ఖత్వంతో .. బలికి సిద్ధమయ్యారు.

ఇంటి ప్రక్కన వీధి మలుపులో వేప చెట్టు ఉంది. ఆ చెట్టు నీడన కొలువై ఉన్న ఆంజనేయుడి శిలాఫలకం ముందుకి ఆ బాలుడ్ని తీసుకువచ్చారు.

దేవుడి ముందు ఆ బాలుడ్ని పడుకోబెట్టారు.

దైవానుగ్రహం కొరకు సాస్టాంగ మనస్కారం చేసారిద్దరు.

లేచి కమల ఆ కుర్రాడ్ని ఒడిసి పట్టుకుంది కదలకుండా. పెదాల్తో కొన్ని అక్షరాల్ని జపిస్తూ వాడి పికనులిమేసాడు నారాయణ.

మత్తులోనే లిప్తకాలం ఉలిక్కిపడి విలవిల్లాడిన ఆ పసివాడు గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. అతని శ్వాస అనంతవాయువుల్లో లీనమైపోయింది.

వేపచెట్టు కొమ్మల్లో ఎక్కడో దాగున్న ఓ చిన్నారి పిట్ట సైతం ఆ ఘాతుక చర్యకి ఉలిక్కిపడి ఓ కన్నీటి బొట్టు నేల రాలుస్తూ బాధాతప్త హృదయంతో రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయిందక్కడి నుండి.

సతీష్‌లో చలనం ఆగిన మరుక్షణం తృప్తిగా తలలాడించారిద్దారు.

బలి విజయవంతమయ్యిందన్న పైశాచికానందం కదలాడింది వారి కళ్ళల్లో.

చేసిన పాపపు పని నుండి తప్పంచుకునే ప్రయత్నం మొదలయ్యింది. అందుకో పథకం కూడా సిధ్ధమైంది.

ఆ పసివాడి శవం నాటకీయంగా సతీష్ పేరెంట్స్‌కి అప్పచెప్పడు నారాయణ.

***

చెప్పడం పూర్తి చేసి ఆయాసంతో ఆగిపోయాడు అఖిల్.

కళ్ళ ముందు కదలాడిన దృశ్యాలు అదృశ్యమయ్యాయి. మెదడుకి సంకేతాలు నిలిచిపోయాయి. చెవుల్లో హోరు తగ్గింది.

నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చూపులు నిర్మలమయ్యాయి.

ముఖంలోని తేజస్సు మాయమయ్యింది.

మునుపటిలా మారిపోయాడతను.

(ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన న్యూస్ పై సంఘటనకు ఆధారం. ప్రదేశం కూడా అదే కావడంతో నిజజీవితంలోని పేర్లే.. ఆయా పాత్రలకి ఉంచడం జరిగింది.)

అంత సేపు ఆ చిన్నారి పడ్డ మానసిక క్షోభని కళ్ళరా చూసిన నివేదిత తట్టుకోలేకపోయింది. దుఃఖంతో కొంగుని నోట్లో కక్కుకొని మౌనంగా రోదించింది. కొద్ది క్షణాలే అయినా చిగురుటాకులా వణికిపోయిన అఖిల్ రూపమే కళ్ళ ముందు కదలాడుతుంటే… వాడు తిరిగి మామూలుగా మారిపోవడాన్ని గమనించలేదామె.

తమ చుట్టూ జాతరలా పోగైన జనాల్ని చూసి కంగారుపడ్డ అఖిల్ తల్లిని తడుతూ అమాయకంగా అడిగాడు.

“దేవుడి దగ్గరకు ఇంత మంది వచ్చారేంటి మమ్మీ.”

చప్పున వాడ్ని అక్కున చేర్చుకుని ఆర్తిగా గుండెకి హత్తుకుందా మాతృమూర్తి. గొంతు పెగల్లేదామెకు.

ఏం చెప్పాలి.

‘దేవుడి కొరకు కాదురా నాన్నా, నీ చెంతకే… నీలోని అద్భుతాన్ని తిలకించడానికిరా కన్నా’ అనుకుంటూనే..

‘ఈ మాయదారి జబ్బు నీకే తగలాలా’ అంటూ పరిపరి విధాల ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది.

అప్పుడు మొదలయ్యింది జనంలో కలకలం.

ప్రతి ఒక్కరూ చెవులు కొరుక్కున్నారు.

“ఆ బాబు సెప్పిందంతా నూటికి నూరుపాళ్ళు నిజమే. పోలీసులు గూడా ఎంక్వైరీ జేసిండ్రూ. అయినా హత్యెవలు జేసిండ్రో తెల్వలేదు. దొంగ సచ్చినోడు. కొప్పుల నారిగాడే ఆ పొలగాన్ని సంపి నాకేం దెల్వదని కేసు తప్పించుకున్నడన్న మాట” అరిచారెవరో ఆ గుంపు నుండి.

“గీ పొలగాన్ని ఆంజనేయస్వామి పూనిండు. జరిగింది అదని వివరంగా సెప్పించ్చిండు” తిరిగి అన్నారెవరో.

“ఇంకా సూత్తారేందిరా అంజన్నకు దండవెట్టుకోండ్రీ…” మరొకరు అరిచారు.

మంత్రంలా పని చేసిందా మాట.

ఆ గుంపులో కోలాహలం మొదలయ్యింది. చివరికది అఖిల్‌ని దేవుడు ఆవహించాడని జనమంతా భక్తితో చేత్తులెత్తి మొక్కే వరకూ వెళ్ళింది.

వాళ్ళ చర్యకు భీతిల్లిన నివేదిత ఎంతగా కదలిపోయిందంటే… సన్నని ప్రకంపన మొదలయ్యిందామెలో.

అఖిల్ కిదంతా అర్థమవడం లేదు. అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు.

ఏదైనా దుష్ట శక్తి అఖిల్‌ని ఆవహించిందేమోననే అనుమానంతో ఈ ఊళ్ళో ఎవరికైనా చూపిద్దానే మిషతో అంత దూరం నుండి తాను ఈ వూరు వచ్చింది. కానీ ఏం జరిగింది. తన ఆలోచనలకి అర్థం పర్థం లేకుండా పోయింది.

‘తనకంటే మూఢుల్లా వున్నట్టున్నారు. వాడిలో దైవ శక్తిని చూస్తూన్నారీ జనం. విరుద్ధ భావ ప్రకంపనలివి. ఇంకా ఇక్కడే ఉంటే బాబుని మూర్ఖత్వంతో ఏం చేస్తారో తెలీదు’ అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది నివేదిత.

జనం వలన హడలెత్తిన బాబుకి జరగరానిదేమైనా జరిగితే… ఆ ఊహే భరింపలేనట్టు..

అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలన్న ఆలోచనని సైతం క్షణంలో మార్చేసుకుని, ఆ జనంలోంచి ఎలాగోలా బయటపడి, వెళ్తోన్న ఆటో ఆపి ఎక్కి కూర్చుంది.

ఎవ్వరూ తల్లీకొడుకుల్ని వారించలేదు. అదే ఆమెకు ప్లస్సయ్యింది.

ఓ నగ్నసత్యం వెలికితీయబడి-

కొత్త కోణంలో హత్య కేసు ప్రత్యక్షంగా బయటపడడంతో ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.

విశేషమేంటంటే..

మరుగున పడిన హత్య అఖిల్ చేత వెలికి తీయబడ్డా.. అక్కడి నుండి అతడు వెళ్ళిపోగానే అఖిల్ గురించి మరచిపోయారంతా. హత్య గురించి హంతకుడి గురించి ప్రధానంగా చర్చించడం మొదలు పెట్టారు.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here