Site icon Sanchika

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-5

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]ఒ[/dropcap]కే ఘటన ఇరువర్గాలకి లాభించడం అరుదైన విషయం.

అలాంటిది గోదావరి ఖనిలో జరిగిన ఆ సంఘటన మువ్వురికి మూడు రకాలుగా లాభించింది.

ఎలాగంటే-

ఒకటి.

తన కొడుకు విషయంలో నివేదిత మరింత జాగ్రత్త పడేలా చేసింది.

రెండు.

సతీష్ అనబడే ఆ కుర్రాడి మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయి.. వాస్తవానికి కేసు క్లోజ్ చేయబడిందెప్పుడో!

కానీ ఇప్పుడు సస్పెన్స్ వీడి అసలైన హంతకుల్ని అరెస్ట్ చేయాడానికి స్థానిక పోలీసు వర్గాలకు మార్గం సుగమమయ్యింది.

తగిన సాక్ష్యాధారాల కోసం తిరిగి పోలీసుల వేట ప్రారంభమైంది.

మూడు.

ఒక ప్రదేశంలో అఖిల్ గనక అడుగిడితే..

అనూహ్యరీతిలో అక్కడ జరిగిన ఘటనల్ని చారిత్రాత్మకమైన మలుపులా కళ్ళకు కట్టినట్లు చెప్పగలగే.. అద్భుత శక్తి అతనిలో దాగుందన్న సరికొత్త విషయం… సుడిగాలిలా మరొక వ్యక్తికి చేర్చబడింది!

ఆ అదృశ్య శక్తి తనకందిన ఈ వార్తకి ఎంతగా రియాక్టయ్యాడంటే..

తాను తలపెట్టిన మహాయజ్ఞానికి రంగం సిద్ధం చేసుకున్నాడా క్షణంలోనే.

***

ట్రింగ్… ట్రింగ్…

ఫోన్ రెండు సార్లు రింగయ్యింది.

“ప్రణితా! ఫోన్ లిఫ్ట్ చేయ్” షేవింగ్ చేసుకుంటున్న పాండవీయం లోపలున్న భార్యను కేకేసి పిలిచాడు.

“వస్తున్నానండీ!” అని సమాధానమిస్తూనే, గబగబా వచ్చి ఫోనెత్తింది ప్రణిత.

“హలో!” అవతలి వైపు నుండి.

“ఆ… హలో!”

“హలో! ఎవరండీ?”

“నేను… ప్రణితా పాండవీయాన్ని మాట్లాడ్తున్నాను. ఇంతకీ మీరెవరు?” గొంతు సరిగా పొల్చుకోలేకపోతోంది.

“పిచ్చిదానా! ఎవరంటావేం? నేను! నిన్ను మనసారా ప్రేమించిన పాపానికి నీతో ఘోరంగా అవమానింపబడ్డాను. అది భరించలేక ఆసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాను. నీ మీద కోరిక చావక ఆత్మగా మారి ఇదిగో ఇలా నీ జీవాత్మ చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రేతాత్మను. హ్హ..హ్హ.. హ్హ..” అంటూ ఓ భయంకరమైన నవ్వు గుండెల్ని జలదరింప చేసేలా విన్పించిందవతల వైపు నుండి.

“కెవ్‌వ్..”మని అరిచింది ప్రణిత. ఝడుసుకుందామె.

అప్రయత్నంగా ఆమె చేతి వేళ్ళు రిసీవర్ చుట్టూ బలంగా బిగుసుకున్నాయి.

అవతలవైపు నుండి మళ్ళీ మాటలు విన్పించసాగాయి.

“చేసిన పాపం ఊరికే పోదు. అందుకే నిన్ను వెంటాడుతున్నాను. ఆసిడ్ తాగడమే కాదు. ముఖం మీద కూడా పడిందని తెలుసుగా? ఆసిడ్ పడ్డ నా ముఖం ఎలాంటి వికృతాకృతి దాల్చి ఉంటుందో నీ ఊహకే వదిలి వేస్తున్నాను” అంటూ చిన్న గ్యాప్.

తిరిగి “ప్రేతాత్మలు ఫోన్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నావా? లేక నీ మాయదారి బ్రెయిన్‌తో మంత్రగాణ్ణి పిలిచి నా పీడ ఎలా వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? అదేం కుదరదు. నేను నిన్ను అంత తొందరగా వదలడం జరగదు. హ్హ..హ్హ..హ్హ..” ఆ నవ్వలా కొనసాగుతూనే వుంది.

శరీరంలోని అణువణువూ భయోద్వేగంతో సన్నగా ప్రకంపిస్తుంటే గజగజా వణికిపోయింది. ముచ్చెమటలు పోసాయి.

ఫోన్ కింద పెట్టాలన్న తలంపే మరచి కొయ్యలా బిర్రబిగుసుకు పోయింది. పాండవీయం ఎప్పుడో బాత్రూమ్‌లో దూరాడు. భార్య అరుపులు గానీ, ఫోన్ సంభాషణ గాని వినబడనంత దూరంలో వున్నాడు.

ప్రణిత ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయింది.

ఇంతలో అవతలివైపు నుండి సన్నగా విన్పించిందిలా.

“మమ్మీ! నేన్రడీ.” అని.

ఆ గొంతెక్కడో విన్నట్టన్పించింది.

విన్నట్టు కాదు. బాగా పరిచయమైన గొంతే! ఎవరిదబ్బా? ఆలోచించింది.

యస్. అది అఖిల్ గొంతు.

అప్పుడర్థమయ్యిందామెకు. షాక్ నుండి తేరుకుంది. వెంటనే రియాక్టవుతూ అరిచినంత పన్చేసింది.

“ఒసే నివేదితా నువ్వటే. ఎంతగా హడలి చచ్చానే మొద్దూ. ప్రొద్దున్నే నన్ను పట్టుకు పీడిస్తున్నావేంటి?”

భయం పోయి, సస్పెన్స్ వీడి, చాలా రోజుల తర్వాత ఫోన్‌లోనైనా తన చిన్ననాటి ఫ్రెండ్ కలిసినందుకు సంతోషం కల్గింది ప్రణితకు.

“హమ్మయ్య! ఇప్పటికైనా గుర్తించావన్నమాట మేమూ మానవమాత్రులేనని! అయినా ఎదుటివారిని హడలు కొట్టించడం నీకే కాదు. మాకూ చేతనవుతుందే ప్రణితా. కాలేజీ రోజుల్లో ఎందర్ని ఏడిపించలేదిలా ఫోన్ దయ్యంలా. ఎంతమంది నీ ట్రాప్‌లో పడి భయబ్రాంతులకు లోనుకాలేదు. నీ వరకొచ్చేసరికి బెంబెలెత్తి పోయావు.

అది సరే! ఆ దయ్యాల పుస్తకాలు, సీరియల్స్ చదవడం ఆపావా? ఇప్పటికీ హర్రర్ సినిమాలు, టీ.వీ సిరియల్స్ చూస్తూనే వున్నావా? లేక నువ్వే ఓ ఆత్మగా మారి నాకు బదులివ్వడం లేదు కదా!” గలగలా నవ్వుతూ అంది.

“నోర్ముయ్యవే! ఏదో కాలేజీ రోజుల్లో సరదాగా ఎంజాయ్ చేయడానికి మగాళ్ళని ఏడ్పించేవాళ్ళం. అయినా అవన్నీ వదిలేసి చాలా కాలమైంది. ఇంత క్రితమే శ్రీవారికి బాత్రూమ్‌లో నీళ్ళు పెట్టొచ్చాను. ఇంతలో తమరి ఫోన్. అయినా ఫోన్లో ఇలా ఎంత సేపని. మీ వారు ఆఫీసుకి వెళ్ళగానే మా ఇంటికి వచ్చేసేయ్. చాల్రోజులయ్యింది నిన్ను చూసి” చెప్పింది ప్రణిత.

“అదేం కుదరదు. నీతో బోల్డు విషయాలు మాట్లాడాలి. మీ ఆయన బ్యాంక్‌కి వెళ్ళగానే నువ్వే నా దగ్గరకు వచ్చేసేయ్” అంటూ ఫోన్ డిస్‌కనెక్ట్ చేసింది నివేదిత.

***

పదకొండు గంటలు దాటాక కల్సుకున్నారిద్దరు.

టీ తాగాక కుశల ప్రశ్నలయ్యాయి.

“ఏంటీ విశేషాలు. సడెన్‌గా ఫోన్ చేశావు. ఇంత కాలానికి నే గుర్తొచ్చానా తల్లీ?” ప్రశ్నించింది ప్రణిత.

“నా విషయం సరే! నీవైనా రావొచ్చుగా. ఫోను క్కూడా మొహం వాచాను.” అంది నివేదిత

“ఆ మధ్య చేశానే! ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రింగ్ మాత్రం అయ్యింది. మళ్ళీ చేద్దామనుకుంటూ మరిచపోయాను.” చెప్పింది ప్రణిత.

“అలాగా! మరి నేనెక్కడికి వెళ్ళానబ్బా?” ఒక్క క్షణం ఆలోచించింది నివేదిత.

తిరిగి తనే అడిగింది “ఏ రోజు చేశావు” అని.

చెప్పింది ప్రణిత.”

“గోదావరి ఖని వెళ్ళాను.”

“ఎలా వున్నారు అమ్మా నాన్నా.”

“వెళ్ళింది గోదావరి ఖనే! కానీ ఇంటికి వెళ్ళలేదు.”

“వ్యాట్?” ఆశ్చర్యపోయింది ప్రణిత.

“అవునే! నీకో సీరియస్ విషయం చెప్పాలి. సలహా కోసం ఫోన్ చేశాను. నాకో విషమ సమస్య ఎదురయ్యంది.”

చెబుతోంటే నివేదిత ముఖం వివర్ణమవడం గమనించింది ప్రణిత.

“ప్రతి విషయాన్ని సింపుల్‌గా కొట్టిపడేసేదానివి. నీకు సమస్యలేంటమ్మా? అందునా విషమ సమస్యనా. వెరీ ఇంట్రస్టింగ్. చెప్పు చెప్పు విందాం” ఆసక్త్తిగా అడిగింది ప్రణిత.

బెలూన్ సాహసం, పిక్‌నిక్‌లో జరిగింది, గోదావరి ఖని సంఘటన ఇలా అన్నింటిని క్లుప్తంగా వివరించి చెప్పింది నివేదిత.

“వ్యాట్! వాటే వండర్? దయ్యలూ, భూతాలు మాత్రమే అద్భుతాలు చేస్తాయని చిన్నతనంలో అనుకునే దాన్ని. ఊహ తెలిసాక సర్కస్ వాళ్ళే సాహసాలు చేస్తారని నమ్మేదన్ని. మన మనుషులు కూడా అద్భుతాలు చేస్తారని గిన్నిస్ బుక్ చదివాక విస్తుపోయాను. మీ వాడూ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడంటే రియల్లీ సూపర్బ్! నమ్మలేక పోతున్నాననుకో” హుషారుగా అంది ప్రణిత.

“పెళ్ళై ఇన్నేళ్ళయినా పిల్ల చేష్టలింకా పోలేదు. అడ్వెంచర్ నేచర్ కూడా నిన్నింకా వదలనట్లే వుంది” చిరుకోపంగా అంది.

“అది లేకపోతే లైప్‌లో థ్రిల్ ఏముంటంది చెప్పు?”

“అందుకేనా లేట్‌గా మ్యారేజ్ చేసుకున్నావు. పైగా పిల్లల్నింకా కనకుండా ఆగావు.”

“లేకపోతే అన్నింటికీ నీలా తొందరపడిపొమ్మంటావా? అప్పుడే అమ్మను, అమ్మమ్మనై పోయి లైఫ్‌ని రొటీన్‌గా గడపమంటావా?”

“అది సరే! అఖిల్ విషయంలో నన్నేం చేయమంటావో చెప్పవే. అయన్నడిగితేనేమో వాడికేం కాలేదంటూ కసురుకుంటున్నారు. వీడి వాలకం చూస్తేనేమో క్షణక్షణం దడపుచుతోంది.”

“నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు.”

“ఏం అర్థం కావడం లేదు. నిట్టూ గాడికోక తాయెత్తు కట్టింవ్వాలని నా ఆలోచన. ఇదో ప్రయత్నం. తల్లిగా వాడి ఆవేదన చూస్తూ తల్లిడిల్లి పోయేకంటే, ఆ విధంగానైనా వాడి జబ్బు కుదిరితే అంతకంటే సంతోషమేముంటుంది” అర్ధ్రత నిండిన గొంతుతో అంది నివేదిత.

“అరరే! ఇంత చిన్న విషయానికే వర్రీ అవడమెందుకే. సమస్యల్ని పంచుకుంటే బాధలు తుంచబడతాయంటారు. మనసులో ఉంచుకుంటే పెరిగిపోతుంటాయంటారు. కాబట్టి అతిగా ఊహించుకొని నీలో నీవే కుమిలిపోకు” అనునయంగా అంది ప్రణిత.

“నా కష్టం నీ కర్థం కానిది.”

“లోకంలో కష్టాలు రానిదెవరికి చెప్పు? అందరికీ వస్తుంటాయి. గుండె నిబ్బరం చేసుకోవాలి. సమస్యని సానుకూలంగా సాల్వ్ చేసుకోవాలి. అయినా ఇదొక అంతర్జాతీయ సమస్యలా బెదిరిపోకు.”

కాసేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

నివేదిత ఏదో చెప్పబోతుంటే ముందుగా ప్రణిత పెదవి విప్పింది.

“నాకు తెలిసిన వేద బ్రాహ్మణుడొకాయన ఉన్నాడు. ఆయన రామాలయానికి పూజారి. చాలా మందికి తగిలిన ‘గాలి’ వదలగొట్టాడన్న పేరుంది. ఎందరికో అతనంటే మంచి గురి. తాయెత్తులు కడతాడు. ఆయన మీ ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేయిస్తాను. ఇక నువ్వు కంగారుపడాల్సిన పనేం లేదు.”

“చాలా థాంక్స్!” చెబుతోంటే కొద్దిగా నివేదిత ముఖం వికసించింది.

“నీ మొహం! మన మధ్య కొత్తగా అదేమిటి. అన్నీ మరచిపోయి హాయిగా వుండు. శుభమే జరుగుతుంది. నీ కెలాంటి అవసరం ఉన్నా నే పరుగెత్తుకు వస్తాను” ఫ్రెండ్‌కి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది ప్రణిత.

***

“గుడ్ మార్నింగ్ సర్!”

ద్వివేదికి విష్ చేశాడు వేదవ్యాస్.

“మాణింగ్. కమాన్.” ఆహ్వానించాడతన్ని.

ద్వివేదికి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు వేద.

“ఏంటీ? ఇంత ఉదయాన్నే వచ్చేశావ్?” నవ్వుతూ ప్రశ్నించాడాయన.

తన కంటే మరీ జూనియర్ కావడంతో ఇద్దరూ ఉన్నపుడు వేదవ్యాస్‌ని చనువుగా ఏకవచనంతో సంభోదిస్తాడాయన.

“నథింగ్ సర్!” అంటూ షర్ట్ పాకెట్ లోంచి చిన్న స్లిప్ బయటకు తీశాడు.

“ఈ పేపర్ న్యూస్ చదివారా?” అంటూ ఆ పేపర్ కటింగ్ ఆయన కందించాడు.

దాన్నందుకొని, “ఊహూ.. చూళ్ళేదు.” అని అడ్డంగా తలూపాడు.

పట్ట పగలు ఆంధ్రాబ్యాంక్‌లో రూ.6.8 లక్షల దోపిడి అనే హెడ్డింగ్‌తో ఉందా వార్త.

దాన్ని కళ్ళతో చదవడం ప్రారంభించాడు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 1. ఇక్కడి రామకృష్ణా బీచ్ సమీపంలో ఆంధ్రాబ్యాంక్ ఆర్.కె మిషన్ శాఖను సాయుధులైన దండుగులు శనివారం పట్టపగలు దోచుకున్నారు. కత్తులు, పిస్తోళ్ళు, ఇనుపరాడ్లు ధరించిన దుండుగులు శనివారం ఉదయం బ్యాంక్‌లోకి ప్రవేశించి, సిబ్బందిని గాయపరిచి 6.8 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. ఈ సంఘటనలో బ్యాంకులో చెందిన నలుగురు ఉద్యోగులు గాయపడగా వారిని కె.జి హాస్పిటల్‌లో చేర్పించారు. విశాఖనగర పోలీసులు రంగంలోకి దిగి దుండుగుల కోసం గాలిస్తున్నారు.

-అని వుందా మ్యాటర్.

వార్త చదివాక “ఇదా విశాఖపట్నం న్యూస్ కదా, నాకెందుకు చూపావ్?” అనడిగాడు ద్వివేది.

“ఆ న్యూస్ ఎక్కడిదైనా జరిగింది దోపిడీ కదా! మీకు తెలియాలని కావాలనే దాన్ని మీ చేత చదివించాను” ఆ కటింగ్‌ని తిరిగి పాకెట్‌లో పెట్టుకుంటూ అన్నాడు వేదవ్యాస్.

“విశాఖనగర పోలీస్ విభాగం నుండి మీకేమైనా ఫోన్ గాని, ఇన్‌ఫర్మేషన్‌గానీ వచ్చిందా? హెల్ప్ చేయమని.”

వ్యాస్ ఉద్దేశమేంటో ఆయనకి అర్థం కావడం లేదు.

“నో సర్! బ్యాంక్ దోపిడీ అవడంతో నేనే ఆ కటింగ్‌ని భద్రపరిచాను. చాలా రోజుల తర్వాత.. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల అనంతరం మళ్ళీ బ్యాంక్ దోపిడీ జరిగింది.

“అయితే? ఆ బ్యాంక్ దోపిడీకి.. విశాఖపట్నం బ్రాంచ్‌కి… మనకి లింకేటి? కన్‌ఫ్యూజ్ చేయకుండా విషయం సూటిగా చెప్పు.”

“దొంగలు దోపిడీదారులు పోలీసుల సమర్థతని సవాల్ చేస్తునట్టున్నారు సార్. నాడు అంత ధైర్యంగా మనీ మనీ బ్యాంక్‌ని పట్టపగలే దోచారు. మళ్ళీ నేడు విశాఖలో ఆంద్రాబ్యాంక్. బహుశా మనీ మనీ బ్యాంక్‌ని దోచిన నేరస్థుల్ని మనమింకా కనుక్కోలేక పోయామనే అలసత్వం కావచ్చు, మిగతా దొంగలూ పేట్రేగిపోతున్నారు.”

వేదవ్యాస్ చెబుతోంటే మౌనంగా వింటున్నాడాయన.

“మళ్ళీ ఇలాంటి దొంగతనాలు జరగకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి సార్!”

“నేరస్థులే చేతికి చిక్కనప్పుడు ఎలా శిక్షించగలం?”

“వెతికి వెతికి వెంటాడి వేటాడుదాం సార్.”

“….”

“మనీ మనీ బ్యాంక్ దోపిడీ కేసు మన స్టేషన్ పరిధిలోనే వస్తుంది కదా సార్!”

“అవును. ఇప్పుడా విషయం దేనికి?”

“కేసుని ఇన్‌వెస్టిగేషన్ చేయడానికి!”

“ఆ ఫైల్ క్లోజ్ అయ్యిందెప్పుడో!”

“లేద్సార్. మళ్ళీ తెరవబోతున్నాను.”

అది విని ఉలిక్కి పడ్డాడు ద్వివేది.

వేదవ్యాస్ ఎంతటి సమర్థుడో, పట్టుదల గల మనిషో తెలుసాయనికి. అందుకని అతని అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయలేకపోయాడు.

మరి కొన్ని విషయాలు బాస్‌తో మాట్లాడి వెళ్ళిపోయాడు వేద.

***

సాయంత్రం భర్త ఆఫీసు నుండి రాగానే ప్రశ్నించింది నివేదిత.

“నిట్టూ గురించి ఏమాలోచించారు?” అని.

“ఇంకా ఆలోచించడమేంటి? డిసైడ్ కూడా అయిపోయింది. తమరు ఆర్డర్ పాస్ చేశాక పని పూర్తికాకపోవడమా? నెవ్వర్!” అన్నాడు వసంత్.

“వాడిని డాక్టర్‌కి చూపెట్టాలని అనుకున్నాంగా. దాని గురించి ఏం చేశారు?” ప్రశ్నించింది నివేదిత.

“మంచి డాక్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. చాలామంది డాక్టర్ నవనీతం గారి పేరు సజెస్ట్ చేశారు. ఎలాంటి టిపికల్ కేసునైనా హండిల్ చేసి సక్సెస్ అయ్యాడని పేరుంది ఆయనకు.”

“ఇంకేం మన అఖిల్‌ని ఆ డాక్టర్‌కి చూపెడదాం.”

“నేననుకున్నదీ అదే! నవనీతం గారిని కన్సల్ట్ చేసి బాబుని టెస్ట్ చేయిస్తే నీ అనుమానాలన్నీ తీరుతాయ్.”

“నాది అనుమానమో బాబుది వ్యాధో తర్వాత ఎలాగూ తెలుస్తుంది. డాక్టర్ దగ్గరకు ఎప్పుడు తీసుకెళ్దామో అది చెప్పండి ముందు.”

“ఎప్పుడో కాదు. ఈ రోజే! డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకొచ్చాను. రాత్రి ఎనిమిది గంటలకు టైమ్ ఇచ్చారాయన. సో ఇంకా చాలా టైమ్ వుంది. ఈలోగా నువ్వు వంట కార్యక్రమం త్వరగా ముగించుకుంటే కరెక్ట్ సమయానికి వెళ్ళి డాక్టర్‌ని మీట్ అవ్వొచ్చు” చెప్పాడు వసంత.

మరింకేం మాట్లాడలేదు నివేదిత. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది.

***

సరిగ్గా 8.05 నిమిషాలకి డాక్టర్ నవనీతం కన్సల్టింగ్ రూమ్‌లోకి వసంత్ ఫ్యామిలీ ఎంటరయ్యింది.

డాక్టర్‌కి భార్యని కొడుకుని పరిచయం చేశాడు.

అఖిల్ ప్రవర్తనని, అతని చుట్టూ అల్లుకున్న ప్రత్యేక సంఘటనల్ని వివరించింది నివేదిత. వసంత్ మరికొంత సమాచారం డాక్టర్‌కి అందించాడు.

భార్యాభర్తలు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటున్నాడు.

మరో వైపు అఖిల్ అంతరంగంలో ఏదైనా సంఘర్షణ జరగి ఆ భావాలు కుర్రాడి మొహంలో ప్రతిబింబిస్తే వాటిని పసిగట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడా డాక్టర్.

నవనీతం అంచనాలని తారుమారు చేస్తూ వాళ్ళ ఉనికినే పట్టించుకొని వాడిలా చాలా కామ్‌గా ఓ కుర్చీలో ఒదిగి కూర్చున్నాడు అఖిల్.

భార్యభర్తలిద్దరూ చెప్పనవి విన్నాక డాక్టర్ క్షణకాలం ఆలోచనలో పడ్డాడు.

“మీరందించిన సమాచారాన్ని సమీక్షిస్తుంటే మీ వాడు బిన్నఒత్తిడులకి గురవుతున్నాడన్న విషయం స్పష్టమవుతోంది. మనసులో తీవ్ర అలజడులు ప్రేరేపితమైనపుడు ఏవేవో స్మృతులు లీలగా మదిలో మెదిలి మెరిసి మాయమయవుతుంటాయి.

మనిషి కనే కలలు ఆ పరిధిలోకే వస్తాయి. గతజన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటే, వాటి వివరాల్ని వెల్లడించిన వారెందరో ఉన్నారు. కొందరు భవిష్యత్‌లో జరగబోయే వాటిని ముందుగానే ప్రపంచానికి తెలిపి తమ విశిష్టతని చాటుకున్నారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల అద్భుత శక్తుల గూర్చి మనం విని ఉన్నాం. వాస్తవానికివన్నీ సైన్స్‌నే సవాల్ చేస్తున్న విడ్డూరాలు. ఇలాంటి వాటికి సరయైన కారణాలు కానరావు. దేరీజ్ నో రీజన్. శాస్త్రవేత్తలు వీటిని ప్రాక్టికల్‌గా నిరూపించలేకపోయినా కళ్ళ ముందు కదలాడే సజీవ నిదర్శనాలను మనం నమ్మల్సిందే. తప్పదు” అంటూ ఆగాడొక్క నిమిషం.

డాక్టర్ చెప్పేది దంపతులు వింటున్నారు. అఖిల్ మాత్రం పరధ్యానంగా ఉన్నాడు. అదే మంచిదయ్యింది కూడా. డాక్టర్‌కి అడ్డుపడి అడుగడుగునా ఎన్ని రకాలుగా ప్రశ్నంచి ఉండేవాడో?

“ఒక ప్రాంతానికి వెళ్ళినపుడు… అక్కడేదైనా చారిత్రాత్మక ఘటన జరిగివుంటే… దాన్ని కళ్ళకు కట్టినట్టు చెబుతాడని అంటున్నారు. నో డౌట్. నిజంగా ఇది కూడా మానవ మేథస్సుకి అందని విచిత్రం. మేధావుల్ని సైతం అబ్బురపరిచే అపురూపమైన విషయం” ఆగి తిరిగి కంటిన్యూ చేశాడిలా.

“పేపర్లో వచ్చిన వార్తొకటి వినండి. మీకు తెలిసే వుంటుదేమో.

పూర్తి ఆరోగ్యవంతంగా యాభై సంవత్సరాలు బ్రతకడమే ఈ రోజుల్లో అతికష్టమైపోతోంది. అనారోగ్యం, ఆక్సిడెంట్స్ తదితర కారణాల వలన మానవుడి ఆయుఃప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అలాంటిది మలేషియా వాస్తవ్యుడైన ఒమర్ అబాస్ 140 వసంతాలు పూర్తి చేసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

ఆ దైవలీలలకి ప్రతినిధిగా నిలుస్తూ అత్యధిక వయస్సుగల వ్యక్తిగా ప్రపంచ రికార్డ్ స్థాపించాడు.

మీరు ఇన్ని సంవత్సరాలెలా బ్రతగ్గలిగారంటే మంచి నిద్ర, సరియైన ఆహారం అని ఆయన చెప్పాడే గానీ ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు జీవించగలగడానికి గల కారణాన్ని ఎవరూ క్లారిఫై చేయలేకపోయారు.

బికాజ్ దేరీజ్ నో ఆన్సర్” తను చెప్పడం పూర్తి చేసాడాయన.

డాక్టర్ చెప్పింది విన్నారు తప్ప పెదవి విప్పలేదు వాళ్ళు.

“ముందీ కుర్రాడ్ని హెల్త్ చెకప్ చేస్తాను” అంటూ అఖిల్‌ని చేక్ చేశాడు.

పరీక్షంచిన అనంతరం-

“ఏయ్ హీరో నిన్నో గదిలోకి తీసుకెళ్తాను. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడొక విషాదకర సంఘటన జరిగింది. జరిగిందేమిటో నువ్వు చెప్పాలి. ఆర్ యూ రెడీ” అనడిగాడు అఖిల్ కళ్ళలోకి చూస్తూ.

“మరి నాకెలా తెలుస్తుంది డాక్టర్” కుడి చేతిని ప్రశ్నార్థకంగా మలుస్తూ ఆశ్టర్యంగా అడిగాడా బాలుడు.

“నీకు తెలియదు. నిజమే కానీ తెలిస్తేనే చెప్పు. ఓ.కే, మైడియర్ బాయ్” అంటూ భుజం తట్టాడు.

పేరెంట్స్ వెంటరాగా కుర్రాడ్ని తీసుకొని హార్ట్ ఆపరేషన్స్ చేసే సెల్‌వైపు దారీదీసాడు నవనీతం.

ఆ గది ఎప్పుడో లాక్ చేయబడింది. రూమ్ ఓపెన్ చేయించి అందర్నీ లోపలికి తీసుకెళ్ళాడు.

“చూడు బాబూ ఇక్కడొక హత్య జరిగింది. ఐ మీన్ మెర్సీకిల్లింగ్. అది ఎలా జరిగిందో నీవు చెప్పాలిప్పుడు.”

బదులు పలుక లేదా కుర్రాడు.

“సర్ ఒక్క విషయం…” అంటూ డాక్టర్‌ని ఓ ప్రక్కకి రమ్మన్నాడు వసంత్.

“ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తుకు తెచ్చే ఆనవాలేదైనా ఇక్కడ కన్పిస్తే తప్ప ఏదీ చెప్పలేడు సార్” అని చెప్పాడు, గతానుభవం దృష్ట్యా భార్య తనకందించిన సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.

తక్షణం కాంపౌండర్‌ని పిలిపించి బెడ్ మీద పడుకొబెట్టాడు. ఆక్సిజన్ ట్యూబ్‌ని తగిలించాడు. నర్స్‌తో ఆపరేషన్ కిట్ తెప్పించి ఓపెన్ చేయించాడు. ఇదంతా పూర్తవడానికి పదిహేను నిముషాలు పట్టింది.

అనంతరం ఆపరేషన్ జరిపినంత హడావిడి చేసేస్తుంటే..

అదిగో అప్పుడు-

అనాలోచితంగా ఆ తతంగాన్ని గమనిస్తున్న అఖిల్ ముఖంలో రంగులు మారసాగాయి. ముక్కుపుటాలదుతున్నాయ్. ఆ చిన్ని కళ్ళల్లోంచి వింతకాంతి ప్రసరిస్తోంది.

శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి. తన మెదటులోకి సంకేతాలేవో ఇంజక్టవుతుంటే భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్దతరంగాలు హోరు.

కళ్ళు మూసి, కణతల్ని చిట్టి చేతుల్తో నొక్కుకుంటూ అరిచాడు వేదన భరితంగా – వొద్దొద్దని…

అఖిల్ అలా అరుస్తూంటే వసంత్ గుండె కలుక్కుమంది. బాధతో సుడులు తిరిగిపోయాడు. నివేదిత కళ్ళు చెమర్చాయి అప్రయత్నంగా.

క్షణకాలమనంతరం బాబు వదనంలో ప్రశాంతత. తేజోవంతమైన ప్రశాంతత.

ఒక యోగిలా పవిత్రమూర్తిలా గోచరిస్తూన్నాడిప్పుడు.

ఆపరేషన్ చేస్తున్నట్లు నటించడాన్ని ఆపి క్షణక్షణానికి పిల్లవాడిలో కలుగుతున్న అనూహ్యమైన మార్పులని డాక్టర్ రెప్పార్పకుండా గమనిస్తున్నాడు. తన ప్రయత్నం ఫలిస్తున్నందుకు వాడి వైపు నిశితంగా దృష్టి సారించాడు.

నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా ..

తనను మరచి, కళ్ళు తెరచి, పెదవులు విప్పాడా కుర్రాడు.

కంటి పొరల ముందు ఏవో దృశ్యాలు లీలగా కదలాడుతుంటే గంభీరంగా మారిపోయాడు. అప్పటికీ పూర్తిగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడు.

భార్యని పొదవి పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు వసంత్.

గతంలో జరిగిన మెర్సీకిల్లింగ్‌ని అఖిల్ సంక్షిప్తంగా చెప్పుకు పోయాడిలా.

1972వ సంవత్సరం.

ఆమె పేరు సుమలత. వయసు ఇరవై రెండు.

ఈ మహిళకి మొదటిసారి, రెండవసారి, ఇలా వరుసగా ముడు సార్లు హార్ట్ఎటాక్ వచ్చింది.

ఇంత చిన్న వయసులో ఇలా గుండెనొప్పి రావడం అరుదైన విషయం.

మూడవసారి చిన్న ఆపరేషన్ చేయబోతే ఆమె మెదడు తీవ్రంగా దెబ్బతింది. ఊపించని రీతిలో కోమాలోకి వెళ్ళిపోయింది. సుమలతకి అలా జరగడంతో ఆ పేషెంట్ బంధువుల కంటే ముందుగా తాను హర్టయ్యాడు ఆ కేసు డీల్ చేస్తున్న డాక్టర్ మూర్తి.

అలా ఇరవై మూడు సంవత్సరాలూ కోమాలోనే గడచిపోయాయి.

కోమాలో ఉన్నన్నాళ్ళూ పేషెంట్‌కి గొట్టం ద్వారా ఆహారం లోపలికి అందిచబడేది. జీవితమే అతి దుర్భరమై.. నిజంగా ఆమెకి అదో ప్రత్యక్ష నరకయాతన.

ఆ యాతన చూడలేక ఆమె బంధువులు కోర్టుకి ఒక పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్‌కి స్పందిస్తూ, హైకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ ఆమెని మెర్సీకిల్లింగ్ చేయడానికి సుప్రీంకోర్టు సైతం అనుమతి ఇచ్చింది.

ఆ పేషెంటలా తన నలభైమూడవ ఏట బలవంతంగా చంపబడింది.

(ఐర్లాండ్‌లో జరిగిందీ సంఘటన)

చెప్పడం పూర్తి చేసి ఆయాసంతో ఆగిపోయాడు అఖిల్.

అప్పటి వరకు కళ్ళముందు కదలాడిన దృశ్యాలు అదృశ్యమయ్యాయి. సంకేతాలు మెదడుకి అందడం ఆగిపోయాయి. చెవుల్లో హోరు తగ్గింది.

అంతర్గత అలజడి లేదు. ముఖంలో తేజస్సు మటుమాయమైంది.

క్షణంలో సాధారణ బాలుడిలా మారిపోయాడతను.

నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చూపులు నిర్మలంగా వున్నాయి.

బాధతో కుమిలిపోతూ జరుగుతున్నది నిస్తేజంగా గమనిస్తున్న దంపతులిద్దర్నీ బయటకు వెళ్ళమని సైగ చేశాడు నవనీతం.

కాంపౌండర్‌ని నర్స్‌ని బయటకు పంపించేశాడు.

క్షణం ఆలస్యం చేయకుండా అక్కడే అఖిల్ ప్రస్తుత మానసికస్థితి అంచనా వేయడానికి ఉద్యుక్తుడయ్యాడు డాక్టర్.

అఖిల్ అమాయకంగా నిలబడ్డాడు.

ఆ సమయాన్ని సద్వినియోగ పర్చుకోవడానికి తక్షణం అఖిల్‌ని నవనీతం ప్రశ్నించసాగాడిలా.

***

(సశేషం)

Exit mobile version