[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]
[dropcap]కుం[/dropcap]టుపడే దశకు చేరుకున్న మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ చుట్టూ అల్లుకున్న విఘాతాలన్నీ తొలగిపోయే శుభతరుణం ఆసన్నమవుతోంది.
అందులో భాగంగానే-
పాండవీయం అభ్యర్ధన మేరకు సెక్యూరిటీ కొంత వరకు తగ్గించబడింది.
సిటీలో వున్న బిజినెస్ మాగ్నెట్స్ లిస్ట్ తయారు చేయించడానికి పాండవీయానికి పదిరోజుల సమయం పడితే, వాళ్ళంతా ఏయే బ్యాంకులతో ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్నారు తదితర వివరాలు సేకరించడానికి మరో వారం పట్టింది.
పాండవీయం కంప్యూటర్ ఆపరేట్ చేశాడు.
బిజినెస్ మాగ్నెట్స్‌ల పేర్లు, వారు నిర్వహిస్తున్న వ్యాపార వివరాలున్న జాబితా స్క్రీన్ మీదకి వచ్చింది.
ఆయా వ్యక్తుల ఆదాయాలు, బిజినెస్ టర్నోవర్ల పరంగా వర్సగా ఇలా వున్నారు.
- రామ్ గోపాల రావు(‘రావు’ కంప్యూటర్స్)
- సత్యనారాయణ మూర్తి(‘హెల్త్’ హాస్పిటల్స్)
- దీపక్ రాజ్ (కంట్రాక్టర్)
అలా సాగిందా లిస్ట్.
పబ్లిక్ ఫిగర్స్ అయిన సినిమాఫీల్డ్ వాళ్ళని, రాజకీయ నాయకులని, క్రీడాకారుల్ని వదలివేసి తయారు చేయబడిన మనీ మేకర్ల జాబితా అది.
పాండవీయం ఒక్కొక్కొరి గురించి నిదానంగా పరీశీలిస్తూ ముందుకు వెళుతుంటే ఎనిమిదవ నెంబర్ దగ్గర-
షణ్ముగం అని మాత్రమే వుంది.
అక్కడే ఆగిపోయాడు పాండవీయం.
ఎందుకంటే ఆ వ్యక్తి పక్కన స్పెసిఫిక్‌గా ఏ బిజినెస్ చేస్తున్నాడో పాయింటవుట్ కాకపోవడంతో అతడి దృష్టి ఆ వ్యక్తి మీద పడింది.
షణ్ముగానికి అన్ని రకాల వ్యవహారాలతో లింక్ ఉండడంతో అతడి వివరాల్ని చాలా ఇంట్రస్టింగ్‌గా పరిశీలించసాగాడు.
ఎందుకో ఆ క్షణాన పాండవీయం మనసుకి అన్పించింది, షణ్ముగంతో తన జైత్రయాత్ర ప్రారంభించాలని.
ఆ లిస్ట్ స్క్రీన్ మీద నుండి తొలగించి.. సిటీలోని ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య తదితర వివరాలున్న జాబితా ముందేసుకున్నాడు.
దానిని గమనిస్తుంటే ఎందుకో చప్పున వసంత్ జ్ఞప్తికి వచ్చాడా సమయంలో. మందుగా వసంత్‌ని కలిసి అతడి సలహా తీసుకుంటే బావుంటుందనుకున్నాడు పాండవీయం.
అతడ్ని కలవాలని నిశ్చయించుకున్న అనంతరం కంప్యూటర్‌ని ఆఫ్ చేసి కాసేపు రిలాక్సయ్యాడు.
* * *
అఖిల్‌ని తనకెదురుగా కూర్చోబెట్టుకున్నాడు నవనీతం.
ఆ కుర్రాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించడం ప్రారంభించాడు.
“బాబూ! నీ పేరేంటి?”
“అఖిల్ విహారీ రాజ్.”
“ఏం చదువుతున్నావు?”
“థర్డ్ క్లాస్.”
“నీ కెవరంటే ఇష్టం?”
అడిగి మళ్ళీ చప్పున-
“మమ్మీ, డాడీ కాకుండా…” అన్నాడు.
“బంటీ”
“బంటీ అంటే కుక్కపిల్లా?”
“కాదు. నా క్లాస్‌మేట్ శృతికీర్తి.”
“ఐసీ! మరి సుమలత ఎవరు?”
“…”
“మాట్లాడవేం?”
“సుమలతా?” అని క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టాడు.
“ఆమెవరో నాకు తెలీదు” అన్నాడు మళ్ళీ.
“తెలీదా?”
అడ్డంగా తలూపాడు.
“ఇందాక నువ్వే చెప్పావుగా. హార్ట్ పేషెంట్ అని.”
“నేన్చెప్పానా?” విస్మయం ప్రకటించాడు.
“మరే, అస్సలావిడెవరో తెలీందే నేనెలా చెప్పగలను?” ఎదురు ప్రశ్నించాడు.
క్షణకాలం మౌనం వహించి నవనీతం అడిగాడు.
“సరే. ఆ విషయం వదిలెయ్. పెద్దయ్యాక ఏం చదవాలని వుంది?”
“కంప్యూటర్స్ గురించి.”
“ఎందుకని?”
“బిల్‌గేట్ అంతటి వాడినవ్వాలని.”
“ఎలా?”
“కంప్యూటర్స్ మీద ప్రయోగాలు చేసి.”
“ఎలాంటి ప్రయోగాలు?”
“మరే. కొత్త రకం రోబోట్స్‌ని తయారు చేస్తా.”
“కొత్త రకమంటే…”
“మనిషిలా స్వంతంగా ఆలోచించగలిగే రోబోట్స్‌ని.”
అదిగో అప్పుడు ఉలిక్కిపడ్డాడు డాక్టర్ నవనీతం.
ఆ కుర్రాడి సమాధానం విని ఆయన ఎంతగా ఆశ్చర్యపోయాడంటే..
పేషెంట్ నాడిని పరీక్షించే ఆ డాక్టర్ నాడీ వేగం సైతం ఉధృతమయ్యిందా క్షణాన.
అతను అంతలా కదిలిపోవడానికి కారణం-
20-1-1998 నాడు నెహ్రూ ప్లానిటోరియంలో జరిగిన సదస్సుకి హజరయ్యాడు డాక్టర్ నవనీతం.
అమెరికాలో రోబోటిక్స్ ఇనిస్టిట్యూట్ ఉంది. అందులో పని చేస్తున్న సైంటిస్ట్ లలితేష్ కె. కాట్రగడ్డ గారు ఈ సదస్సుకు ప్రత్యేకంగా పిలిపించబడ్డారు.
ఆయన ఆ సదస్సులో మాట్లాడుతూ..
“అర్థం చేసుకోవడం, ఆలోచించడం, జ్ఞాపకశక్తి, స్వంతంగా లెక్కలు చేయగలగడం… తదితర అంశాల్లో మానవ మేధస్సుతో సరిసమానమైన శక్తి కలిగిన కంప్యూటర్ చిప్ పొందుపర్చబడిన రోబో దాదాపు 2025 సంవత్సరం నాటికి తయారవుతంది, తదుపరి తరాల వారికి మనిషికీ రోబోలకీ తేడా తెలిసే అవకాశం లేకుండా పోతుంది” అని తెలిపారాయన.
ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నవనీతానికి.
స్వగతాన్ని వదలి వెంటనే అఖిల్‌ని ప్రశ్నించాడు.
“అసలు అలాంటి రోబోట్ తయారు చేయాలి నీకెందుకు అన్పించింది?”
“ఒక రోజు కలకత్తానుండి ఒక రోబోట్ తెచ్చిచ్చారు డాడీ. నేనెలా చెబితే అలా చేస్తుందది. ఎంచక్కా ఆడుతుంది. పాడుతుంది. రిమెట్ కంట్రోల్‌తో! స్వంతంగా పనిచేయడం మాత్రం రాదు దానికి. ఈ సారి ఊరెళ్ళినపుడు స్వంతంగా పన్చేసే రోబోట్ తీసుకురండని డాడీకి చెప్పాను. అలాంటివి ఉండవు అన్నారాయన. అందుకే నేనే తయారు చేయాలని నిశ్చయించుకున్నా.”
తడుముకోకుండా వాడు చెబుతుంటే ఆసక్తిగా వింటుండి పోయాడాయన.
ఆ కుర్రాడి మనసులో ఈ ఆలోచన రూపుదిద్దుకోవడానికి అదే కారణమన్న మాట. ఇంత చిన్న వయసులో ఎంత ఇంటలిజెన్స్ ప్రదర్శిస్తున్నాడు? రియల్లీ వండర్! అనుకున్నాడు నవనీతం.
అఖిల్‌నింక ప్రశ్నించకోదలుచుకోలేదాయన. తన ఆలోచన్లని కట్టిపెట్టి, కుర్రాడ్ని వెంటేసుకుని కన్సల్టింగ్ రూమ్ వైపు కదిలాడు.
వసంత్, నివేదిత వెయింట్ చేస్తున్నారక్కడ.
“మావాడికి ట్రీట్‌మెంట్ అవసరమంటారా?” అడిగాడు వసంత్.
“ఏ ట్రీట్‌మెంట్ అయినా జస్ట్ ఫర్ యువర్ శాటీస్‌ఫ్యాక్షన్ వోన్లీ. వుయ్ విల్ వెయిట్ ఫర్ సమ్‌టైమ్.” అన్నాడు.
“మానవుడి గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఒకటుంటుంది. ఈ గ్రంథి చేసే పనేంటంటే థైరాక్సిన్ అనే స్రావాన్ని ఉత్పత్తి చేయడం. ఈ థైరాక్సిన్ ఉత్పత్తి గనక తక్కువైతే వ్యక్తిలో మానసికంగా మార్పులేర్పడతాయి. ఒక రకంగా చెప్పాలంటే మానసికాభివృద్ది కుంటుబడుతుంది. అలాంటి మనో దౌర్భల్యం అఖిల్‌లో అగుపించడం లేదు. హీఈజ్ ఆల్‌రైట్. శారీరకంగా కూడా గుడ్!
బట్ మీ అబ్బాయిలో ఈ అతీంద్రియ శక్తి ఎలా ప్రేరేపింతమయ్యిందో ఖచ్చితంగా ఊహించలేకపోతున్నాను. ఇదో మిరాకిల్. దట్సాల్!” అంటూ తన అశక్తత తెలియబరిచాడాయన.
అది విని నిరుత్సాహపడ్డారిద్దారు.
“ఫైనల్‌గా మీ సజెషన్ ఏంటంటారు?” నిరుత్సాహంగా అడిగాడు వసంత్.
డాక్టర్ కూడా ఏదీ తేల్చి చెప్పకపోవండతో నివేదితలో తిరిగి గుబులు చోటుచేసుకుంది.
అయోమయంగా, ఏదీ అర్థం కాకుండా వుంది అఖిల్‌కి.
అందర్నీ మార్చి మార్చి చూస్తుండిపోయాడు.
డాక్టర్ నుండి సమాధానం లేకపోవడంతో నివేదిత అంది.
“ఏమైనా మందులు…”
“అఖ్ఖర్లేదండి. ప్రస్తుతానికి మీ వాడికి ఏ జబ్బూ లేదు. అపాయం అంతకన్నా లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో వున్నాడు. ఎలాంటి ట్రీట్మెంట్లూ వద్దు. ప్రయోగాలు అనవసరం. ఫ్రీగా వదిలేయండి. కుర్రాడ్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. కాకపోతే మీ అబ్బాయి మైండ్ తరచూ డిస్ట్రబ్ అవకుండా చూసుకోండి. అనవసరంగా కలవరపాట్లుకి లోనవకుండా జాగ్రత్తపడండి.
ఇలాంటి అద్భుత శక్తులు బాల్యదశలో ఓ మెరుపులా తళుక్కుమని మెరిసి మాయమవుతుంటాయి. అతీంద్రియ శక్తులన్నీ కోల్పోయి ఒక దశలో మామూలుగా మారే ఆస్కారం కూడా వుంది.
ఇంత చిన్న ప్రాయంలో అది చేశాడు. ఇది చేశాడు. అని అపుడపుడూ మనం కొందరు పిల్లల గురించి పేపర్లో చదువుతుంటాం. అదే పిల్లవాడు పెద్దయ్యాక మరిన్ని అద్భుతాల్ని సృష్టించాలి కదా! అలాంటి న్యూస్ ఎప్పుడూ విన్లేదు మరి. అంటే నా ఉద్దేశ్యం కంటిన్యూ అవొచ్చు. కాకపోవచ్చు అని. సో నిశ్చింతగా ఉండండి.
జస్ట్ యు హావ్ టు ప్రొవైడ్ హిమ్ ఎ లాటాఫ్ రెస్ట్, దట్సాల్. ఇంత చేసీ ఈయన చెప్పిందేమీ లేదని మీ మనసుకి అనిపిస్తే మీ అబ్బాయిని ఎవరైనా సైకియాట్రిస్ట్‌కి చూపెట్టుకోండి. దట్స్ యువర్ ఓన్ ఒపీనియన్” అంటూ ముగించాడాయన, తన వైద్యవృత్తిలోని అనుభవాల్ని మథిస్తూ.
థాంక్స్ చెప్పి బయటపడ్డారిద్దరు.
కానీ వాళ్ళని తెలియని విషయం మరొకటుంది. రహస్యంగా జత కళ్ళు తమని గమనిస్తున్నాయని.
ఆ కళ్ళలో మెరిసి మాయమైన ఆశ రూపుదిద్దుకోనున్న ఓ బృహత్తర ప్రణాళికకు సంకేత సూచికలా వుంది.
తృప్తిగా తలాడిస్తూ అక్కడి నుండి నిష్క్రమించాడా వ్యక్తి.
ఆ మెసేజ్‌ని మరోక వ్యక్తికి పాస్ చేశాడు.
అలా ఓ నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబడిందా క్షణంలోనే!
* * *
ఒక చారిత్రాత్మకమైన మలుపులా-
గోదావరి ఖనిలో జరిగిన హత్యని అఖిల్ బయటపెట్టిన కథనాన్ని ఎప్పుడైతే తను నియమించిన సీక్రెట్ ఏజెంట్ తనకి చేరవేశాడో.. అప్పుడే వేదవ్యాస్ ఊహ నిజమైంది.
తను గెస్ చేసినట్టుగానే అఖిల్‌లో అద్భుత శక్తి ఉండడం వేదని అబ్బురపరిచింది. త్వర త్వరగా ఆలోచింపచేసింది!
అఖిల్‌ని క్షణం క్షణం కనిపెట్టుకొని అతడి చర్యల్నిగమనించేలా చేసిన ఏర్పాటు వృథా కాలేదు.
అతనుకున్న దొక్కటే-
అఖిల్ గురించి ఎక్కువగా ప్రచారం కాకుండా జాగ్రత్తపడాలని!
అందుకు తగిన చర్యలు కూడా తీసుకున్నాడు.
వాస్తవానికి ఆ థాట్ వేదవ్యాస్‌కి రాకుండా వుంటే మాత్రం అఖిల్ ఖచ్చితంగా మాస్ మీడియా దృష్టిలో పడి అత్యధిక ప్రచారాన్ని పొందేవాడు.
కానీ అత్యంత మేధావి, చురుకైనవాడు అని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకున్న వేదవ్యాస్‌కి కూడా తెలియని విషయం ఒకటుంది.
తనలాగే మరో అదృశ్య వ్యక్తి అఖిల్ లోని అతీంద్రియ శక్తిని పసిగట్టే ప్రయత్నంలో ఉన్నాడని.
అలా ఆ పసివాడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
* * *
దేవుడిపై నివేదితకి గల అచంచలమైన భక్తి అఖిల్‌లోని శక్తి దైవప్రేరణే అని నమ్మకం కలిగిస్తున్నా..
దుష్ట శక్తి ప్రభావం కాదు కదా అనే అనుమానం ఏ మూలో వ్యక్తమవుతోంది!
“మమ్మీ! నేన్రడీ.” అంటూ పరుగెత్తుకు వచ్చిన అఖిల్ తల్లిని అల్లుకు పోయాడు.
“నువ్వీ రోజు స్కూల్‌కి వెళ్ళడం లేదు నిట్టూ!” వాడ్ని దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్పింది నివేదిత.
“ఎందుకు?” తన కళ్ళని చక్రాల్లా తిప్పుతూ సందేహంగా అడిగాడు.
“ఈ రోజు ఓ స్వామీజి మనింటికి రాబోతున్నారు. ప్రణిత ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చాక పూజ చేస్తారు. పూజ అయ్యాక దేవుడికి దణ్మం పెట్టాలి. మరి నువ్వు స్కూల్‌కెళితే ఎలా? అందుకని ఈ రోజు స్కూల్ మానేయమంటున్నాను” చెప్పింది నివేదిత.
వాడి ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేకపోయేసరికి “సరేనా?” అంది.
“ఓకే.! మమ్మీ” అంటూ “మమ్మీ! బాబాలు స్వామీజీలు ఒక్కటేనా?” అనడిగాడు.
“అందరూ దైవ భక్తులేరా నాన్నా” అంది.
“మరే మహిమలు వాళ్ళకి తెలుసా?”
“తెలుసు.”
“మరలాగయితే అప్పట్లో తన నిలయంలో హత్యలు జరిగితే సత్యసాయిబాబా నోరు విప్పలేదెందుకని? హంతకుల పేర్లు చెప్పలేదేందుకని?” అంటూ ప్రశ్నించాడు.
అది విని అవాక్కయ్యిందామె. వాడి వంక విస్మయంగా చూసింది.
ఎలాంటి ప్రశ్న వేసా చూడూ? అన్నట్టుంది వాడి చూపు.
తన మీద సన్నగా ఒక్కటిస్తూ “తప్పురా నిట్టూ. కళ్ళుపోతాయి. సత్యసాయిబాబాని అలా అనకూడదు. ఆయనకి అన్నీ తెలుసు. అయినా చెప్పలేదు. దేవుడాయన. దేవుడ్ని తప్పు పట్టొచ్చునా?” అంది మందలింపుగా.
బుద్దిమంతుడిలా తలూపాడు.
“మమ్మీ! చంద్రస్వామీజీని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో పడవేసారెందుకని?” తిరిగి ప్రశ్నించాడు.
ఆ చిన్ని బుర్రలో ఎన్ని అనుమానాలో? ఎన్ని సందేహాలో? నుదురు చరుచుకుంది నివేదిత.
వాడి ప్రశ్నలకి బ్రేక్ వేయకపోతే బావుండదని “ఇవన్నీ నీకెవరు చెప్పార్రా?” కావాలనే కాస్త తీవ్రస్వరంతో అడిగింది.
“మా మేడమ్ చెప్పింది.”
“అదా అసలు విషయం.”
వాడంత పెద్ద పెద్ద విషయాల్ని ప్రస్తావిస్తుంటే ఏమిటో అనుకుంది అప్పుడర్థమయ్యిందామెకు.
“నిట్టూ! అవన్నీ నీకెందుగ్గానీ నోరు మూసుకొని కాసేపు నిశ్శబ్దంగా ఓ చోట కుదురుగా కూర్చుంటావా? పూజ పూర్తయ్యేటంతవరకు టిఫిన్ గట్రా తినకూడదు. అందుకే పాలు తాగు. మాల్టోవా కలిపి తెస్తాను” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
చప్పున పెదాలు బిగించి సోఫాలో కూలపడ్డాడు.
కాసేపట్లోనే పాలతో వచ్చింది నివేదిత. డోర్ బెల్ శబ్దం విన్పించడంతో పాల కప్పుని అఖిల్‌కి అందించి వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా సుమారు అరవై ఏళ్ళు పై బడిన వృద్ధుడొకాయన నిలబడి ఉన్నాడక్కడ.
* * *
పై ఆచ్ఛాదన లేకుండా, కింద పంచె కట్టుతో, భుజాన కాషాయపు రంగు బ్యాగ్ వేసుకొని హుందాగా ఉన్నాడు.
శరీరమంతా విభూతి రేఖలతో, మెడలో రుద్రాక్షమాలలతో పూజ్యభావం కలిగేలా వున్నాడు. శరీరం ముడతలు పడ్డా తెల్లని వర్చస్సుతో దివ్యత్వం ఉట్టిపడే మోము ఆయనది. జత్తు వేదసాంప్రదాయానుసారం కొప్పులా ముడిచివుంది.
చూస్తూనే ఆయన్ని పొల్చుకోగలిగింది. సాదరంగా లోపలకి ఆహ్వనించింది.
ఆ ప్రశాంత మూర్తిని చూడగానే భక్తి భావం మదిలో మొదలడంతో వినయంగా పాదాలకి నమస్కరించింది.
“అవిఘ్నమస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు.” అంటూ మనసారా ఆశీర్వదిస్తూ సోఫాలో కూర్చున్నాడు.
“తమరు రామాలయం పూజారి గారేనా స్వామీ?”
“అవునమ్మా! మనీ మనీ బ్యాంక్ మేనేజరుట. పేరు.. పేరేదో గుర్తుకురావడం లేదు” కళ్ళు మూసుకొని గుర్తు చేసుకొనే ప్రయత్నం చేయోయాడు.
“పాండవీయం గారండి” చెప్పింది తను.
“ఆ.. అతనే వచ్చాడు. ఎవరో కుర్రాడికి పూజ చేసి తాయెత్తు కట్టాలని ఈ ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు?” అనడిగాడు.
పాలు తాగేసి, వచ్చిన కొత్త వ్యక్తిని ఆసక్తిగా గమనిస్తూ అక్కడే నిలబడి వున్నాడు అఖిల్.
వాడిని చూపెడుతూ “ఇదిగోండి. వీడే మా అబ్బాయి. పేరు అఖిల్” అంది.
అఖిల్‌ని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడొకసారి.
“ఇంతకీ విషయం ఏమిటి? మీ వాడికేం జరిగిందసలు. ఏదీ దాచకుండా నిజం చెప్పు” తల తిప్పి ఆ గదిని కలయచూస్తూ ప్రశ్నించాడు.
ఆయనలా అడగడమే తరువాయి జరిగిన విషయాలన్నింటిని ఏకరవు పెట్టిందామె.
ఆమె చెప్పింది జాగ్రత్తగా విన్న ఆ పూజారి సాలోచనగా తల పంకించాడు. ఓ అయిదూ- పది నిముషాలు కళ్ళు మూసుకొని స్థిరంగా ఉండిపోయాడలాగే.
నెమ్మదిగా తేరుకొని, అన్నాడిలా.
“చూడమ్మాయ్! జబ్బు మానసికమూ కావచ్చు, శారీరకమూ కావచ్చు. వ్యాధి మానసికమైతే జీవిని చరింపచేస్తుంది, శారీరకమైతే క్షీణింప చేస్తుంది. ఒక దశలో హరింప చేస్తుది. అది రోగతీవ్రతను బట్టి వుంటుంది. కానీ ఈ కుర్రాడ్ని చూస్తుంటే నీవు చెప్పినదాని ఆధారంగా అలాంటివేమీ గోచరించడం లేదు. అనుమానమనేది భయోద్వేగాల సమాహరం. మనసులో అనుమాన బీజం పడిందంటే అది మొలకెత్తి చివరకి వటవృక్షమై మనిషిని విస్తరిస్తుంది. ఆ అనుమానమే ప్రస్తుతం నీ భీతావహ పరిస్థితికి కారణమన్పిస్తోంది” అంటూ ఆగాడొక్క క్షణం.
“కానీ, స్వామీ…” అంటూ ఆమె ఏదో చెప్పబోయేంతలో తిరిగి తనే అన్నాడా పూజారి.
“నేను చేసే పూజ మీ వాడి వ్యాధిని నయం చేస్తుందని… కట్టబోయే తాయెత్తు వాడిని మునుపటిలా మారుస్తుందని… నీవు నమ్మితే అలాగే కానీ! ఆ నమ్మకమే సకల శుభాలకూ నాంది.”
“ఇక పోతే హనుమంతునికి మంగళ, శనివారాలు ప్రీతికరమైనవి. ఈ రోజు శనివారం. శుభదినం. కాబట్టి త్వరలో పూజ ప్రారంభిస్తాను” అంటూ పూజకి ఏయే సామాగ్రి అవసరమో చెప్పాడామెకు.
ఆమె తలూపుతూ లోపలికి వెళ్ళింది.
ఆ హాల్లోనే తన ఏర్పాట్లు మొదలుపెట్టాడాయన.
* * *
“ఏమిటలా గదిని తదేకంగా గమనిస్తున్నారు?” గదిలోకి అడుగుపెడుతూ ప్రశ్నించాడు షణ్ముగం.
ఆ పలకరింపుకి గది అలంకరణని పరిశీలిస్తున్న పాండవీయం కంగారుగా లేచి నిలబడ్డాడు.
“నమస్కారమండీ!” విష్ చేశాడు కూర్చుంటూ.
“నమస్కరం” అంటూ అతని కెదురుగా కూర్చున్నాడు షణ్ముగం.
“నథింగ్ సర్! మీ కళాభిరుచికి దర్పణం పడుతున్న ఈ రూమ్ డెకొరేషన్‌కి పులకరించి పోతున్నాను. సింప్లీ సూపర్బ్! రూమ్‌ని చాలా బాగా డెకొరేట్ చేయించారు. ఎన్నో బిజినెస్‌లకి చీఫ్‌గా ఉన్న మీరు అంత బిజీలో కాస్త సమయాన్నైనా ఈ గదికి కేటాయించడం అభినందనీయం.”
షణ్ముగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాడు పాండవీయం.
ఆ పొగడ్తకి చిన్నగా నవ్వాడు.
“చేసేది చేయించేది అంతా నేనే! అనేది శ్రీకృష్ణ పరమాత్మ స్టేట్‌మెంట్. బిజినెస్‌లో ఎంత బిజీ అయితేనేం? నాకూ మనసుంది. నా భావుకతకు తగినట్లు, కళాహృదయులను అలరించేటట్లు ఈ రూమ్‌కి మేకప్ చేయించాను. అది సరే మీ రాకకు కారణం…” అనడిగాడు.
“ఐ యామ్ సారీ! మీరు నాకు కేటాయించిన ఈ కాస్త సమయాన్ని ఇతర విషయాలు మాట్లాడ్డం ద్వారా వేస్ట్ చేస్తున్నట్లున్నాను. వాస్తవానికి మిమ్మల్ని స్వయంగా కలవాలని అందుకు మీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానండి. కానీ వీలు చిక్కలేదు.”
“చేసేది చేయించేది అంతా నేనే! అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మనిద్దరం ఈ వేళ కల్సుకోవాలని వుంది, కలిసాం. దట్సాల్ !”
“నా పరిచయం…”
“ప్రత్యేకంగా అవసరం లేదు. మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌గా స్పెషల్‌గా బదిలీకాబడ్డ మిస్టర్ పాండవీయం గారే కదా!”
షణ్ముగం తన వివరాల్ని అలా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యచకితుడయ్యాడు పాండవీయం. అందుకే ఆయన బిజినెస్‌లో అంత షార్ప్ కాగలిగాడనుకున్నాడు.
“నాతో టచ్ వున్న ప్రతి ఒక్కరి బయోడాటాని సేకరించి పెట్టుకోవడం నా బిజినెస్‌లో ఒక అంశం. పైగా తాను నివసిస్తున్న నగరంలో జరిగే ప్రతి మూవ్‌మెంట్‌ని అబ్జర్వ్ చేయటం మంచి బిజినెస్‌మ్యాన్‌కి ఉండాల్సిన సహజ లక్షణం కూడాను. సో మీరేం కంగారుపడకండి” పాండవీయం మనోభావాల్ని పసిగట్టిన వాడిలా చెప్పుకు పోయాడు షణ్ముగం.
ఒక బిజినెస్‌మ్యాన్ ఆక్టివ్‌నెస్ ముందు గవర్నమెంట్ ఉద్యోగిగా తానెంత తేలికైపోతున్నాడో అర్థమవసాగింది పాండవీయానికి.
అయినా తన ఫీలింగ్స్‌ని పైకి కనబడనీయకుండా –
“వెరీ ఇంట్రస్టింగ్. మీ గురించి చాలా విన్నాను మాస్ మీడియాల ద్వారా. మీ గురించి ఎన్నో తెలుసుకున్నాను వివిద రకాల వ్యక్తుల నుండి. కానీ చూస్తేనే తెలుస్తోంది. అసలు మీరో వ్యక్తి కాదని. మహాశక్తిని” అన్నాడు.
“ఇందులో నా గొప్పేమీ లేదు. చేసేది చేయించేది అంతా నేనే! శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. పొగడ్తలంటే నాకు మహా ఎలర్జీ, ప్రొసీడ్” షణ్ముగం అన్నాడు కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి.
“సారీ! ఇంతకీ నేను వచ్చిన పనేమిటంటే..”
షణ్ముగం మధ్యలోనే అడ్డుపడ్డాడు.
“మీ బ్యాంక్‌తో నేను అటాచ్‌మెంట్ ఏర్పరుచుకోవాలి. ఆ సంబంధం ఎకౌంట్ తెరవడం ద్వారానో లేదా అధిక మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారానో కావచ్చు. ఆమ్ ఐ కరెక్ట్.” పాండవీయాన్నడిగాడు.
అదిరిపడ్డాడు పాండవీయం!
జీవితంలో తొలిసారిగా షాక్‌కి గురయ్యాడతను. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టడమంటే ఏంటో తెలిసొచ్చింది.
“అవునండి. గతంలో జరిగిన దోపిడీతో మనీ మనీ బ్యాంక్ పై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. బిజినెస్ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. నేను చార్జ్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు లేదు. ఒక ఉద్యోగిగా విచారించవలసిన విషయం. అయినా ప్రయత్నిస్తున్నాను.”
“ఎందుకిలా జరగుతోంది.”
“ఏం చెప్పమంటారు? ప్రతి బ్యాంకులోనూ ఎన్నో కుంభకోణాలున్నాయి. కేవలం దోపిడీ వలన మనీ మనీ బ్యాంక్‌కి గ్రహణం పట్టడం నిజంగా దురదృష్టకరం. మీకో విషయం చెబుతా వినండి.
ఇండియన్ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం వలన ఏర్పడిన నష్టం 4500 కోట్లు పైనే ఉందట. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ద్వారా ఈ విషయం బయటపడిందని.. ది టెలిగ్రాఫ్ అనే పత్రిక వెల్లడించే వరకూ.. ఎవరకీ తెలియదా బ్యాంక్ కుంభకోణం.
భోఫోర్స్, హవాలా, బీహార్ పశుగ్రాస కుంభకోణం వంటివి ప్రాచుర్యం పొందినంతగా మనదేశంలో ఈ ఇండియన్ బ్యాంక్ వెలుగు చూళ్ళేదు.
అలాంటిది మా మనీ మనీ బ్యాంక్ దోపిడీ గ్రామీణ స్థాయిలో కూడా ప్రచారమయ్యింది.
రుణాల మంజూరులో జరిగిన అవకతవకలు, లోటుపోట్లకి రాజకీయ నాయకుల హస్తం ఇండియన్ బ్యాంక్ కుంభకోణంలో వున్నా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.”
పెదవి విరుస్తూ ఒక్క క్షణం ఆగాడు. షణ్ముగం ముకకవళికల్లో మార్పులేదు.
“పర్లేదు కంటిన్యూ చెయ్యండి” అన్నాడు షణ్ముగం.
“మనీ మనీ బ్యాంక్‌లో జరిగిన ఇరవై ఆరు కోట్ల దోపిడీకే ఈ బ్యాంక్‌ని నిందించడం, విమర్శించడం బాధాకరం. సాక్షాత్తూ ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ యం.గోపాలకష్ణ చట్టవిరుద్ధంగా కొన్ని ప్రైవేటు సంస్థలకి ప్రయోజనాలు కలుగజేసి ఈ స్కామ్‌కి పాల్పడ్డాడు. పెద్దగా పట్టించుకోలేదెవరు. ఎవరో దుండగుడి నాయకత్వంలో ఒక ముఠా చేసిన అకృత్యపు దోపిడీకి తీవ్రంగా స్పందిస్తూ మనీ మనీ బ్యాంక్ పై విముఖత ప్రకటించడం ఆశ్చర్యం కల్గిస్తోంది”.
పాండవీయం స్వరంలో మార్పు కలగడం గమనించాడు షణ్ముగం.
అతని ఆవేదనలో వాస్తవం లేకపోలేదన్పించింది.
షణ్ముగం పెదవి విప్పాడు.
“బ్యాంకుల అంతర్గత లోసుగులు కేవలం మన దేశంలోనే ఉన్నాయనుకోవడం పొరపాటు. ఆ మధ్య ఓ న్యూస్ పేపర్లో చదివినట్టు గుర్తు. ఏమిటంటే-
జపాన్‌లో సైతం.. ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులను తనీఖీ చేసే తేదీలను ముందుగానే తెలుసుకోవటం కోసం.. నాలుగు బ్యాంకులు ఇన్‌స్పెక్షన్ విబాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్స్‌కి.. లక్షల కొద్దీ యెన్‌లను లంచంగా ఇచ్చారట. ఈ ముడుపుల కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ అక్కడి ప్రస్తుత ఆర్థిక మంత్రి హిరోషి మిత్సుజుక స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసాడునుకోండి. అది వేరే విషయం.
దేశ విదేశాల్లో సైతం బ్యాంక్ లొసుగులున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మరి మన దేశంలో ఏ ఆర్థిక మంత్రైనా రాజీనామా చేసిన దాఖలాలు న్నాయంటారా? దీసీజ్ ఇండియా.
జాతీయ బ్యాంక్ కదా అని ఇండియన్ బ్యాంక్‌ని వదలి ప్రైవేట్ బ్యాంక్‌గా విస్తరించిన మీ మనీ మనీ బ్యాంక్ పై విముఖత ప్రదర్శింస్తున్నారేమో జనం” చెప్పడం పూర్తి చేశాడు.
షణ్ముగం వ్యాపార సరళే కాదు. అద్భుతమైన తెలివి తేటలు కూడా అశ్చర్యపరిచాయి పాండవీయాన్ని.
“అందుకే కందడీ దోపిడీ జరిగిన ఈ బ్యాంక్ ప్రభావం మిగతా బ్రాంచ్‌లపై పడింది. బిజినెస్ టర్నోవర్ తగ్గుముఖం పట్టి కొద్ది సంవత్సరాల్లో బ్యాంక్‌ని మూసివేసి పరిస్థితి ఏర్పడేటట్టుంది. మీ వంటి పెద్ద వారిని ఆశ్రయించే ఉద్దేశం కూడా అదే. మా బ్యాంక్ మినహా సిటీలోని అన్ని బ్యాంకులతో మీకు సంబంధాలున్నాయని తెల్సింది. మా బ్యాంక్‌తో కూడా అటాచ్‌మెంట్ ఏర్పరచుకోమని కోరుతున్నాను. ఎంతో కొంత ఎమోంట్‌ని డిపాజిట్ చేయండి చాలు” అన్నాడు అభ్యర్థనగా.
ఇదే సమయానికి అఖిల్ ఇంట్లో-
***
(సశేషం)