Site icon Sanchika

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-8

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]‘ఉ[/dropcap]డ్‌కాక్’ అనే ఒక రకమైన జాతి పక్షికి వానపాములు ఆహారం. భూమి లోపల వుండే ఈ వానపాములు వర్షాలు పడితేగాని భూమి పైకి రావు.

అందుకని వాటిని పైకి రప్పించడానికి ‘ఉడ్‌కాక్’ పక్షి ఓ ఎత్తుగడ వేస్తుంది!

ఆ పక్షి భూమిపై తన రెక్కలు బాగా చాచి పడుకొని వాటిని తపతపా నేల కేసి బలంగా కొడుతుంది.

అలా కొట్టడం వలన అచ్చం వాన పడినట్లే శబ్దం వస్తుంది. వర్షం కురుస్తున్నట్లు అన్పించడంతో లోపల దాగి ఉన్న వానపాములు మెల్లగా భూమి పైకి తరలి వస్తాయి.

అలా అవి పైకి రాగానే ‘ఉడ్‌కాక్’ వెంటనే పొడవాటి తన ముక్కుతో వాటిని పట్టి తింటుంది. ఆ విధంగా తన ఆహారాన్ని తెలివిగా సంపాదించుకుంటుందా పక్షి.

అదే ‘ఉడ్‌కాక్’ జాతి పక్షుల ఎత్తుగడని అనుసరించబోతున్నాడు వేదవ్యాస్.

అండర్‌గ్రౌండ్‌లో దాగి తప్పించుకు తిరుగుతున్న నేరస్థులకి, దోపిడీ కేసు తిరగదోడబడుతోందనే వాసన తెలిస్తే చాలు, మరింత జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తుంటారు. ఆ అతి జాగ్రత్తలో తప్పిదాలు చేస్తుంటారు.

ఆ కదలికలు చాలు.

వారి ఉనికిని పసికట్టడానికి!

ఆ మాత్రం చాలు.

నేరస్థుల్ని పట్టి చట్టానికి అప్పగించడానికి!

నేరస్థులకి దర్యాప్తు విషయం తెలియాలని కావాలనే తెలివిగా… చాలా ప్లాన్డ్‌గా… ముందు చూపుతో ద్వివేది గారి చేత బలవంతంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించాడు.

మరనాడు ద్వివేది, వేదవ్యాస్‌ల ఇంటర్వ్యూ వివిధ పత్రికల్లో పతాక శీర్షికలతో ప్రచురించబడింది.

అలాగే పలు టీ.వీ చానెల్స్ ప్రత్యేకంగా ప్రసారం చేసాయి.

ఆ కార్యక్రమం టీ.వీలో టెలికాస్ట్ కాబడుతున్న సమయాన-

దానిని అత్యంత ఉద్విగ్నతతో ఆలకిస్తున్న లక్షాలాది మంది ప్రేక్షకులల్లో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కూడా వున్నారు.

ఆ ఇద్దరూ మనీ మనీ బ్యాంక్‌కు బొమ్మ బొరుసు లాంటి వారు.

ఒకరు పాజిటివ్ అయితే… మరొకరు నెగెటివ్!

వారెవరంటే…

ఒకరు-

నాటకయంగా ఒకనాడు దోపిడీకి గురై… దారుణంగా ఖాతాదార్లు విశ్వాసాన్ని కోల్పోయి… నేటికీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోలేక పోతున్న మనీ మనీ బ్యాంక్ కొత్త మేనేజర్… మిస్టర్ పాండవీయం!

ఆ వార్తలో అతనెంతగా రియాక్టయ్యాండంటే ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయాడు.

దోపిడి ఋజువులు దొరకవు, నేరస్థులు పట్టుబడరు అనుకుంటున్న తరుణంలో తిరిగి దర్యాప్తు మొదలవడం… వేదవ్యాస్ స్వయంగా ఈ మహా యజ్ఞానికి పూనుకోడం… మనీ మనీ బ్యాంక్‌కి శుభ సూచకంగా భావించాడు పాండవీయం.

మరొకరు-

సాక్ష్యాధారాలు లేకుండా అతి జాగ్రత్తగా మరింత ప్లాన్డ్‌గా వ్యవహరించి తన బలగంతో మనీ మనీ బ్యాంక్‌‌ని దోపిడీకి గురి చేసి…

ప్రజలు అపురూపంగా దాచుకున్న సొమ్ముతో తన విలాస జీవితానికి పునాదులు వేసుకొని, పెద్దమనిషిగా సమాజంలో చలామణి అవుతున్న నేర చరిత గల వ్యక్తి!

చాలా రోజుల తర్వాత మనీ మనీ బ్యాంక్ దోపిడీ ప్రస్తావన వినబడిడంతో ఉలిక్కిపడ్డాడా వ్యక్తి. మరుగున పడిపోయిందనుకున్న దోపిడీ కేసు వెనుతిరిగి సరి కొత్త మలుపులు తిరిగితుండడంతో హతాశయుడయ్యాడు.

టీ.వీ.లో ప్రోగ్రామ్ పూర్తవగానే…

ఆ ఇద్దరూ ఎవరి ధోరణిలో వాళ్ళు రియాక్టయ్యారు!

తమ బ్యాంక్ పరపతిని పెంచి… ప్రజల్లో విశ్వాసం కలిగించబోయే ఆశ చిగురించబోతోందని పాండవీయం ఆలోచించాడు.

తమ ఉనికికే ప్రమాదం రాబోతోందనడానికి, ఈ న్యూస్ సంకేతంగా భావించి తక్షణమే ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా అలర్టయ్యడు రెండవ వ్యక్తి.

అతని క్రిమినిల్ బుర్రలో ఓ పథకం రూపుదిద్దుకోగానే-

అప్పుడు… అప్పుడు అతని పెదాలైపై చిరునవ్వు మెరిసింది – నల్లత్రాచు పడగమీద పడి పరావర్తనం చెందిన వెలుగు కిరణంలా!

***

ఫోన్ చేసి కబురందివ్వకుండానే వసంత్ ఇంటికి వెళ్ళాడు పాండవీయం.

“అదేంటన్నయ్యగారూ! మీరొక్కరే వచ్చారా?” కాఫీ కప్పు అందిస్తూ అడిగింది నివేదిత.

వసంత్‌తో మాట్లాడ్తున్నవాడల్లా అవునన్నట్లు తలూపాడు పాండవీయం.

“మా దయ్యాన్ని కూడా తీసుకు వస్తే బాగుండేదిగా!” అంది.

“ఇక్కడికి వస్తానని నేనే ముందుగా అనుకోలేదు. సడెన్‌గా వచ్చాను. అసలు నేనిక్కడికి వస్తునట్లే మీ ఫ్రెండ్‌కి తెలీదు. నే వెళ్ళాక ఈ విషయం చెబితే, ఆమెని మీ ఇంటికి తీసుకురానందుకు నేను చీవాట్లు తినడం ఖాయం” చెప్పాడు పాండవీయం నవ్వుతూ.

“అలాంటప్పుడు ఇద్దరూ కలిసే వస్తే బావుడేది. దాని క్కూడా టైమ్ పాస్ అయ్యేదిగా!” అందామె.

“ఓ అఫీషియల్ వర్క్ మీద వచ్చాను” అన్నాడు పాండవీయం.

“మీరు బ్యాంక్ పని మీద వచ్చారంటున్నారు. అలా అయితే నేనిక్కడ అక్కర్లేదనుకుంటా. మీరు మాట్లాడ్తూ ఉండండి” అంటూ కదలబోయిందక్కడి నుండి.

“నో నో అదేం లేదు. మీకు తెలీకుండా మేం మాట్లాడుకునే సీక్రెట్స్ ఏమీ లేవు. కూర్చోవచ్చు” ఆమెని వారించాడు పాండవీయం.

“నా ఉద్దేశ్యం అది కాదు. నే వంటింట్లోకి వెళ్ళి తినడానికేమైనా రెడీ చేసుకు వస్తా” అంటూ వెళ్ళి పోయిందామె.

“ఇంట్లో పనీ పాటా లేకుండా వుంటుందిగా. మీ లాంటి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినప్పుడేగా ఆవిడకు కాస్త పని. వెళ్ళనీయండి” అన్నాడు నవ్వుతూ.

భర్త కామెంట్ నివేదితకి వినపడ్డా విన్పించుకోనట్టు కామ్‌గా కదలిపోయింది వంటింట్లోకి.

“చాల్రాజులయ్యంది మనం కలుసుకోక. ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం హపీగా వుంది” అన్నాడు వసంత్.

“మన డిపార్టమెంట్స్ వేరవడం, అపార్ట్‌మెంట్స్ కూడా దూరం దూరంగా ఉండడం. మనం తరచూ కలుసుకోక పోవడానికి కారణాలై వుంటాయి. ఎనీహౌ ఇన్నాళ్ళకి మిమ్మల్ని కలిసే అవకాశం చిక్కింది” అన్నాడు పాండవీయం.

“చెప్పండి. మీ రాకకి కారణమేంటి? ఇందాక ఏదో ఆఫీషియల్ పని మీద వచ్చానని మా ఆవిడతో అన్నారు” అడిగాడు వసంత్.

“మనీ మనీ బ్యాంక్ పేరు మీరు వినే ఉంటారు.”

పాండవీయం పూర్తిగా చెప్పనే లేదు. అది విని ఉలిక్కి పడ్డాడు వసంత్.

“ఒకనాడు నగరంలో నెంబర్ వన్ బ్యాంక్‌గా పేరు పొందిన ఈ బ్యాంక్ దారుణంగా దోపిడికి గురయ్యింది.”

మధ్యలోనే అడ్డు పడ్డాడు వసంత్.

“అవునవును, మా పెళ్ళయిన కొత్తలో ఆ సంఘటన జరిగిందనుకుంటాను. చిన్న మొత్తంలో డిపాజిట్ కూడా చేసామందులో.”

“ఐసీ! ఆ బ్యాంక్‌కి కొత్త మేనేజర్‌గా వచ్చింది నేనే!”

“ఆ బ్యాంక్‌ని మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేసారు?” ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశ్నించాడు వసంత్.

విస్తుపోవడం ఈసారి పాండవీయం వంతయ్యింది.

‘కనీసం బ్యాంక్ రన్‌లో ఉందన్న విషయం ప్రభుత్వోద్యోగులకే తెలియకుండా ఉందంటే మిగతా వాళ్ళ విషయం చెప్పనే అక్కర్లేదు. దీనిని బట్టి బ్యాంక్ ప్రచారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు’. అనుకున్నాడు పాండవీయం.

“రీ ఓపెన్ చేయడం కాదు. కంటిన్యూ అవుతోంది” అన్నాడు పాండవీయం.

“అలాగా” అన్నాడు వసంత్.

“మీరు బోర్‌గా ఫీలవను అంటే మా బ్యాంక్ గురించి కొన్ని వివరాలు చెబుతాను” వసంత్‌ని కొంచెం ప్రిపేర్ చేయడం అవసరం అని భావించాడు పాండవీయం.

“చెప్పండి” అన్నాడు వసంత్.

“మనీ మనీ బ్యంక్ నుండి 26 కోట్ల డబ్బుని దోపిడీ చేశారు. దోపిడీకి గురైంది పెద్ద మొత్తం కాబట్టి అంత డబ్బుని స్వంతదార్లకి చెల్లించడంలో విఫలమైంది. దాంతో మనీ రికవరీ గూర్చి బ్యాంక్ మీద ఎన్నో కేసులు రాష్ట్ర హై కోర్టులో దాఖలయ్యాయి…”

“మా డిపాడిట్ ఎమోంట్ రికవరీ అయ్యిందిగా” అడ్డు తగిలాడు వసంత్.

“నిజమే యాభై వేల లోపు డిపాజిట్ దార్లందరికీ డబ్బు వాపస్ ఇవ్వగలిగింది బ్యాంక్. మనీ మనీ బ్యాంక్‌లో లక్షల్లో డిపాజిట్ చేసిన వాళ్ళే ఎక్కువమంది. వాళ్ళే కేసు పెట్టింది.

బ్యాంక్ పరిస్థితి వివరిస్తూ కోర్టుకి సరెండర్ కావడంతో ఆ కేసులన్నింటినీ కొట్టివేసింది, బ్యాంక్‌కి ఒక షరతు విధిస్తూ.

ఏ నాటికైనా దోపిడీదారులు దొరికి ఎమౌంట్ కలెక్ట్ కాబడితే దాన్ని ఖాతాదార్లకి చెల్లించాల్సి వుంటుంది.

కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతోనే మనీ మనీ బ్యాంక్ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది” చెప్పాడు పాండవీయం.

“అందరూ ఆ బ్యాంక్ గురించి దాదాపుగా మర్చిపోయారు. డబ్బు నష్టపోయిన వారు సైతం.”

“నిజమే! దోపిడీ గుట్టు రట్టు చేసి దోపిడీదార్లని చట్టానికి అప్పగించాల్సిన పోలీసులు కూడా చేతులెత్తేయడంతో మనీ మనీ బ్యాంక్‌కి కష్టాలు ప్రారంభమయ్యాయి.”

“ఒకప్పుడు బర్నింగ్ టాపిక్ ఈ బ్యాంక్ మ్యాటర్. పేపర్లో కూడా పేజీలు పేజీలు వ్యాసాలు కూడా వచ్చాయి” అన్నాడు వసంత్.

“మీ సహాయం కోరి ఆ బ్యాంక్ మేనేజర్‌గా మీ దగ్గరకు వచ్చాను. అందుకే ఆ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చంది” అన్నాడు పాండవీయం.”

వసంత్ భృకుటి ముడివడింది

“నా సహాయమా?” అంటూ ఆశ్చర్యపోయాడు.

***

వాళ్ళిద్దరూ అక్కడ బ్యాంక్ గురించి ముచ్చటించుకుంటున్న సమయాన.

ఇక్కడ-

షణ్ముగం కూడా మనీ మనీ బ్యాంక్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

బ్యాంక్ గురించి అంటే…

పాండవీయం వేయమని అభ్యర్ధించిన మనీ డిపాజిట్స్‌ని ఎలా సేకరించాలా అని!

కేవలం మనీ మనీ బ్యాంక్‌తో లావాదేవీలు జరపడం కోసమే అతనో సరికొత్త బిజినెస్ ప్రారంభించాలని యోచిస్తున్నాడు.

దటీజ్ షణ్ముగం!

జీవితంలో తను తల పెట్టిన ఏ కార్యమైనా ఇంతవరకు నిర్విఘ్నంగా కొనసాగిందని… దిగ్విజయంగా కొనసాగితుందని… అతని నమ్మకం.

వాస్తవానికి అతని మేథస్సు కూడా అలాంటదే.

కానీ షణ్ముగానికి తెలీదు.

తాను వ్యూహరచన చేస్తోన్న ఈ న్యూ బిజినెస్ మాత్రం తొలిసారిగా తన అంచనాలని తల క్రిందుల చేయబోతోందని!

***

“చెప్పండి. మీకు నేనే విధంగా సాయపడగలను?” అడిగాడు వసంత్.

చెప్పడానికి ఎందుకో పాండవీయం తటపటాయించాడు.

అది గమనించి.

“మీరు ఏ విధంగా కో-ఆపరేట్ చేయమంటే అలా చేస్తాను. ష్యూర్! అందులో సందేహం లేదు” హామీ ఇచ్చాడు.

“నాకా నమ్మకం వుంది” అంటూ ఆగి, “కొంత ఎమౌంట్‌ని మా బ్యాంక్‌లో డిపాజిట్ చేయండి” అన్నాడు పాండవీయం.

ఇబ్బందిగా ముఖం పెట్టాడు. ‘పాత డిపాజిట్లే తిరిగివ్వలేదంటాడు. మళ్ళీ డిపాజిట్స్ చేయమంటాడేంటి?’ అనుకున్నాడు వసంత్.

“శంకిస్తున్నారా?” సూటిగా ప్రశ్నించాడు పాండవీయం.

ఏం సమాధానమివ్వాలో అర్థం కాలేదు వసంత్‌కి.

“ఇట్స్ ఓకే. బలవంతమేమీ లేదు. పోనీ మీ కొలీగ్స్‌ని ఇల్‌వాల్వ్ చేయించండి. కనీసం వాళ్ళచేత సేవింగ్ ఖాతాలు ఓపెన్ చేయించినా ఫర్వాలేదు.”

డిపాజిట్ కంటే సేవింగ్ ఖాతా కొంత బెటర్ అనుకున్నాడు వసంత్.

“నా వరకు ఓకే. మా వాళ్ళందరి చేత అంటే కాస్త డౌటే!” అన్నాడు మనసు మార్చుకుంటూ.

నివేదితకి ప్రణీతకి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని దృష్టింలో పెట్టుకొని బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చెయడానికైనా ఒప్పుకున్నాడు. అంతే తప్ప మనీ మనీ బ్యాంక్ అంటే వసంత్‌కి సదభిప్రాయం లేదు.

“నోనో! అలా అనకండి. ఈ బాధ్యత మీ ఒక్కరి మీదే మోపడం లేదు. నేనూ మీ వెంట ఉంటాను. లేదా మీరే నా వెంట వుండండి చాలు. మిగతా వర్క్ నేను చూసుకుంటాను. నాతో పాటుగా మీరూ కాస్త రిస్క్ తీసుకుంటారన్న నమ్మకంతో వచ్చానిక్కడికి. మీరు నన్ను డిస్సప్పాయింట్ చేయకండి” అన్నాడు పాండవీయం.

“ఇందులో నేను డిస్సప్పాయింట్ చేసేదేముంది? పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అడ్రస్ లేకుండా పోయిన ఫైనాన్స్‌లు జనాల్ని ఆర్థికంగా ముంచేసాయి. ఆ సంక్షోభం నుండే ఎవరూ కోలుకోలేదింకా. మధ్య మనీ మనీ బ్యాంక్ దోపిడీ! భద్రత లేని బ్యాంకునెలా నమ్మగలరు?” మొహమాటం కొంచెం తన మనోభిప్రాయాన్ని వెల్లడించాడు.

“మీరన్నదాంట్లో కొంచెం వాస్తవం లేకపోలేదు. అంతెందుకు. మొన్నటికిమొన్న సిటీలోని ఓ పోస్టాఫీస్ బ్రాంచ్‌లో ఉద్యోగస్థులే అవకతవకలు జరిపారు. జమ చేసిన మొత్తాన్ని కష్టమర్ల పాస్‌బుక్స్‌లో రాయడం, ఆఫీసు రిజిస్టర్‌లో ఎంట్రీ చేయకపోవడం. అలా డబ్బుని స్వాహా చేశారు. ఒక్క చోట జరగిన మెసానికి రాష్ట్రంలోని దేశంలోని పోస్టాఫీసులన్నింటిని తప్పు పట్టలేం కదా.”

“మనీ మనీ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడమంటే…” గొణిగాడు వసంత్.

“బ్యాంక్ అంతర్గత విషయాన్నొకటి మీకు చెబుతాను, రహస్యంగానే ఉంచండి. దోపిడి జరిగిన నాటి నుండి పది సంవత్సరాలులోగా దోపిడీ ఎమోండ్ కలెక్ట్ కాకుంటే మనీ మనీ బ్యాంక్ ఆ డబ్బని రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు తేవాలనుకుంటోంది. అలా నష్టాన్ని స్వయంగా భరించాలనుకుంటోంది.”

గడవు ప్రకారం ఇంకా రెండేళ్ళుంది. ఈలోగా బ్యాంక్ టర్నోవర్ పెంచి దోపిడీ నష్టాన్ని పూడ్చుకోవాలని అభిప్రాయ పడుతున్నాం. అందుకే కష్టమర్లలో కదలికలు తేవాలని నా వంతు ప్రయత్నం” చెప్పాడు పాండవీయం.

వసంత్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

‘చూద్దాం. వేదవ్యాస్ లాంటి డైనమిక్ కేసు టేకప్ చేశాడు. సమర్థడైన పాండవీయం మేనేజర్‌గా వచ్చాడు’ అనుకొన్నాడు మనసులో.

“సరే. మీ ఇష్టం. మీరెలా అంటే అలాగే కానివ్వండి. బ్యాంక్ అభివృద్ధికి మీతో పాటు నేనూ పాలుపంచుకోవడానికి సంసిద్ధమే!” అన్నాడు మనస్పూర్తిగా.

“థాంక్స్” చెప్పాడు పాండవీయం.

“మిమ్మల్ని కలిసాక నాకు కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. బ్యాంక్ గురించి విస్తృతంగా ప్రచారం జరగాలని! దీకి సంబంధించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాం. ఈలోగా బ్యాంక్‌కి అనుకూలంగా అధికారుల నుండి కొన్ని ప్రకటనలు ఇప్పించాలనే యోచన కూడా వుంది. ఇవి పూర్తయ్యాక మీ కోలిగ్స్ వెంటపడదాం” తన ఆలోచననేంటో చెప్పాడు పాండవీయం.

“యాజ్ యూ లైక్! ఈ లోగా మా వాడి పేర త్వరలో కొంత ఎమోంట్‌ని మీ బ్యాంక్‌లో డిపాజిట్ చాస్తాను.” మాటిచ్చాడు వసంత్.

“ఓకే! ఇందాకటి నుండి మరిచేపోయాను. మీ వాడు అఖిల్ కన్పించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు.”

“ఇంట్లో ఖాళీగా వుంటే మా బుర్ర తినేస్తున్నాడు. అందుకే టీచర్ బుర్ర తినమని ట్యూషన్ పెట్టాం. రోజూ సాయంత్రం వెళ్తున్నాడు” నవ్వుతూ.

“అదేం లేదన్నయ్యగారూ! వాడి క్లాసుకి కొత్తమ్మయి వచ్చిందట. ఆమె ఫస్ట్ వస్తోందట. అందుకని ట్యూషన్ పెట్టమని తనే అడిగాడు.”

తను తెచ్చిన ప్లేట్లని వాళ్ళముందున్న టీపాయ్ మీద సర్దుతూ చెప్పింది నివేదిత.

“ఈ రోజు ఇంటికి తీసుకెళ్ళి రేపు స్కూల్ టైమ్‌కి తీసుకవద్దామనుకున్నాను. వాడ్ని చూసి చాల్రోజులయ్యింది. ప్రణిత కూడా ఖుషీ అయ్యేది.” అన్నాడు పాండవీయం.

“ఖుషీ కాదు. ఖూనీ అయ్యేది. వాడి గురించి మీకు తెలీదు లెండి. ఈ మధ్య మహా అల్లరి చేస్తున్నాడు” టిఫిన్ ప్లేట్ అందిస్తూ అంది.

“అది సరే గానీ ఇప్పుడివన్నీ ఎందుకు?” ప్లేట్ వంక చూస్తూ ఇబ్బందిగా అడిగాడు పాండవీయం.

“మీ కొరకు కాదులెండి. మా దయ్యానికి భయపడి ఇవన్నీ చేశాను. మీరు మీ ఇంటికి వచ్చారని దానికి తెలిసి మా ఆయన్ని కాఫీ టీలతో పంపిచావేంటని చీవాట్లు పెట్టుకుండా ఉండడానికి” చెప్పింది నివేదిత.

“అంటే మీ అన్నయ్యగారి మీదో, నా మీద అభిమానం కొద్దీ కాదన్నమాట” వసంత్ కల్పించుకుంటూ భార్యకి చురక అంటించాడు.

ఏమీ మాట్లాడలేదామె.

“అలా అయితే మేం టిఫిన్ నిరాకరణోద్యమం చేపడ్తున్నాం” తిరిగి వసంత్ అన్నాడు.

“దీన్ని నేను బలపరుస్తున్నాను” వంత పాడాడు పాండవీయం.

అప్పుడు రియాక్టయ్యింది నివేదిత.

“అయ్యో! నేనేదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. తినండి” అంది.

వాళ్ళు తినకపోయేసరికి “సారీ చెబుతున్నాగా! మరో మాట లేకుండా ఈ టిఫిన్స్ పూర్తి చేయండి” అంటూ రెండు చేతులూ జోడించింది.

“అయితే ఇందుకు పనిష్‌మెంట్‌గా ఈ రోజు రాత్రికి ముగ్గురికీ మీల్స్ రెడీ చేయాల్సి వుంటుంది” అన్నాడు వసంత్.

“శిరసావహిస్తాను” అందామె.

“అమ్మో! వద్దులెండి. ఎరక్కపోయి నోరుజారాను. ఇప్పటికి నన్ను వదిలేయండి” అన్నాడు పాండవీయం బిగ్గరగా నవ్వుతూ.

అతనితో పాటు మిగతా ఇద్దరూ శృతి కలిపారు.

కానీ-

వసంత్‌తో తన సమావేశం ఓ అనూహ్యమైన మలుపుకు దారి తీయబోతోందని…

తనకి తెలియకుండానే మనీ మనీ బ్యాంక్ మేనేజర్‌గా తన లక్ష్యం నెరవేరబోతోందని…

పాండవీయానికా క్షణంలో తెలీదు

అలా పాపుల పావులు కదిపే ఘడియకి అత్యంత వేగంగా శ్రీకారం చుట్టబడింది.

(సశేషం)

Exit mobile version